31-12-1995 అవ్యక్త మురళి

        31-12-1995         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

వజ్రతుల్య సంవత్సరంలో ఫరిస్తాగా అయ్యి బాప్ దాదా యొక్క ఛత్రఛాయ మరియు ప్రేమ యొక్క అనుభూతి చేస్కోండి.

ఈ రోజు విశ్వాన్ని సత్యమైన వజ్రంగా మెరిపింపచేసే, ప్రకృతిని కూడా వజ్రం సమానంగా మెరిపింపచేసే, విశ్వంలోని ఆత్మలలో తనకి డైరెక్ట్ పిల్లలైన వారిని వజ్రంగా తయారు చేసే మరియు క్రొత్త సంవత్సరంతో పాటూ క్రొత్త యుగం మరియు క్రొత్త విశ్వాన్ని స్థాపన చేసే బాబా వజ్రంగా తయారయ్యే పిల్లలను చూస్తున్నారు. సాకార స్వరూపంలో కూడా బాప్ దాదా ఎదురుగా ఎన్ని వజ్రాలు మెరుస్తున్నాయి మరియు విశ్వం యొక్క మూలమూలల్లో నలువైపుల మెరుస్తున్న వజ్రాలను చూస్తున్నారు. అందరి మస్తకంలో మెరిసే వజ్రం అయిన ఆత్మ ఎంత మంచిగా అనిపిస్తుంది! ఎదురుగా మెరుస్తున్న ఆత్మ వజ్రం మరియు ఇంత సంఘటిత రూపంలో నలువైపుల వజ్రాలే చూడటంలో దృశ్యం ఎంత బాగా అనిపిస్తుంది! ఇది ఎవరి యొక్క సంఘటన? వజ్రాల సంఘటన కదా! నెంబర్ వారీ అయినా కానీ అందరు మెరుస్తున్నారు. మెరిసే వజ్రాల సభ బాబా ఎదురుగా ఉంది. మీరు కూడా ఏమి చూస్తున్నారు. వజ్రాన్నే చూస్తున్నారు కదా! లేక శరీరం చూస్తున్నారా? 63 జన్మలు శరీరాన్నే చూసారు కానీ ఇప్పుడు శరీరంలో మెరుస్తున్న వజ్రం కనిపిస్తుందా? లేక దాగి ఉంది కనుక ఒక్కొక్కసారి కనిపించి ఒక్కొక్కసారి కనిపించటం లేదా? 

వజ్రోత్సవం కదా! అయితే ఏం చేస్తారు? ఏమి అలంకరిస్తారు? ఈరోజుల్లో రకరకాలైన లైట్లతో చాలా అలంకరిస్తున్నారు. మీరు కూడా చెట్టుకి (క్రిస్మస్) అక్కడక్కడ లైట్స్ పెడతారు కదా! వారైతే ఒక రోజే ఉత్సవం జరుపుకుంటారు లేదా ఒక రోజుకే జూబ్లీ జరుపుకుంటారు లేదా ఒక రోజుకే క్రిస్మస్ జరుపుకుంటారు లేదా ఏ ఉత్సవం అయిన జరుపుకుంటారు. కానీ మీరు ఏమి జరుపుకుంటున్నారు? వజ్రతుల్య సంవత్సరం అంటున్నారా లేదా వజ్రతుల్య రోజు అంటున్నారా? అయితే వజ్రతుల్య సంవత్సరాన్ని పక్కాగా జరుపుకుంటున్నారా? వజ్రతుల్య సంవత్సరం జరుపుకుంటున్నాం అనే ధృడ సంకల్పం మీ అందరిలో ఉన్నందుకు మీ నోట్లో గులాబ్ జామ్. జరుపుకోవటం అంటే తయారవ్వటం. మొత్తం సంవత్సరం అంతా వజ్రంగా అవుతారా లేదా కొంచెం కొంచెం మచ్చ ఉంచుకుంటారా? బాప్ దాదా పిల్లల యొక్క ఉత్సాహ, ఉల్లాసాలను చూసి కోటానుకోట్ల డబల్ శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈరోజు డబల్ కదా! 1. క్రొత్త సంవత్సరం 2. వజ్రోత్సవం. రెండింటి సంఘటన. వజ్రతుల్య సంవత్సరంలో బాప్ దాదా ఇదే విశేషత చూడాలనుకుంటున్నారు, ప్రతి బిడ్డని ఎప్పుడు చూసినా, ఎవరు చూసినా మెరిసే వజ్రంగా కనిపించాలి. మట్టిలో ఉండే వజ్రంగా కాదు, మెరిసే వజ్రంలా కనిపించాలి. మొత్తం సంవత్సరానికి ఇలా వజ్రంగా అయిపోయారా? ఎందుకంటే వజ్రంగా అవుతాము మరియు వజ్రాన్నే చూస్తాము అనే సంకల్పం అయితే ఇప్పుడే చేయాలి కదా! ఎదుటి ఆత్మ నల్లని బొగ్గు అయినా అనగా ఎంత తమోగుణి ఆత్మ అయినా కానీ మీరు ఏం చూస్తారు? మీరు ఆ బొగ్గుని చూస్తారా లేదా వజ్రాన్ని చూస్తారా? వజ్రాన్నే చూస్తారు కదా! మంచిది. మీ దృష్టి పడటం ద్వారా వారి నలుపుదనం కూడా తక్కువ అయిపోతూ ఉంటుంది. డైమండ్ జూబ్లీలో ఇదే సేవ చేయాలి కదా? అమృతవేళ నుండి రాత్రి వరకు ఎంతమంది సంబంధ సంపర్కాలలోకి వచ్చినా వజ్రంగా అయ్యి వజ్రాన్నే చూడాలి. ఇది పక్కా చేసుకున్నారా? లేదా ప్రతి స్థానంలో రెండు, మూడు కార్యక్రమాలు చేసేస్తే వజ్రోత్సవం అయిపోతుందా? కార్యక్రమాలు చేయండి, ఆహ్వానించండి, మేల్కొల్పండి ఇది అయితే చేయవలసిందే మరియు చేస్తున్నారు కూడా. కానీ కేవలం కార్యక్రమం చేయటం కాదు, ఈ వజ్రోత్సవంలో వజ్రంగా తయారయ్యి, వజ్రాన్నే చూడాలి, వజ్రంగా తయారు చేయాలి. ఇదే రోజూ మీరు చేసుకునే ఉత్సవం. రోజూ ఉత్సవం చేసుకుంటారా లేదా రెండురోజులు, నాలుగురోజులు, వారం రోజులు చేసుకుంటారా? ఈ సంవత్సరంలో పిల్లల పట్ల బాప్ దాదాకి ఉన్న శుభ ఆశ లేదా శ్రేష్ఠ శ్రీమతం ఏమిటంటే వజ్రంగా తప్ప ఇంకేవిధంగా అవ్వకూడదు. ఏది ఏవైనా కానీ వజ్రంలో మచ్చ పడకూడదు. ఒకవేళ ఏదైనా విఘ్నానికి లేదా స్వభావ సంస్కారాలకి వశం అయిపోయారు అంటే మచ్చ పడిపోయినట్లే. విఘ్నాలు అయితే రావలసిందే కదా? విఘ్నాలు వచ్చినప్పుడే విఘ్న వినాశకులు అనే బిరుదు లభిస్తుంది కదా! శత్రువు రాకుండా నేను విజయీని అని అంటే ఎవరైనా అంగీకరిస్తారా? అంగీకరించరు. అందువలన ప్రకృతి ద్వారా, ఆత్మల ద్వారా అయినా, అనేక రకాల పరిస్థితులు విఘ్నాలుగా వస్తాయి కానీ మచ్చ యొక్క ప్రభావం మనపై పడకుండా ఉండేటంత శక్తిశాలి వజ్రంగా ఉండాలి. ఉండగలరా? 

ఈ వజ్రోత్సవ సంవత్సరం మహాన్ సంవత్సరం. విశేషమాసాలు జరుపుకుంటారు కదా! అదేవిధంగా వజ్రోత్సవ సంవత్సరం విశేష సంవత్సరం. ఈ సంవత్సరంలో బాప్ దాదా అందరినీ నడుస్తూ, తిరుగుతూ ఫరిస్తాగా చూడాలని అనుకుంటున్నారు. కొందరు అంటున్నారు. ఆత్మని చూసే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆత్మ చిన్న బిందువు కదా! అందువలన శరీరం కనిపిస్తుంది. చిన్న బిందువు అందువలన ఆత్మ కనిపించటం లేదు. అయితే ఫరిస్తారూపాన్ని చూడండి. ఫరిస్తారూపం అయితే పెద్ద శరీరం ఉంటుంది కదా! బరువు కాదు కదా! ఫరిస్తా అంటే ప్రకాశరూపం. ఫరిస్తా స్వరూపంలో స్థితులై ప్రతికర్మ చేయండి. ఫరిస్తా రూపంలో పనిచేయలేము అనుకోకండి. చేయగలరా లేక సాకార శరీరం కావాలా! ఎందుకంటే సాకార శరీరంతో అనేక జన్మలు ప్రేమ ఉంది. మరచిపోవాలి అనుకుంటున్నారు కానీ మరచిపోలేకపోతున్నారు. అందువలన బాప్ దాదా అంటున్నారు మీకు శరీరాన్ని చూడటం అలవాటు అయిపోతే ఏమి పర్వాలేదు, ఇప్పుడు ప్రకాశ శరీరాన్ని చూడండి. శరీరమే కావాలనుకుంటే ఫరిస్తా కూడా ఒక శరీరం లాంటిదే. శివబాబా మరియు బ్రహ్మాబాబా అంటే మాకు చాలా ప్రేమ అంటారు కదా! ప్రేమ అంటే అర్థం సమానంగా అవ్వటం. బ్రహ్మాబాబా ఏవిధంగా అయితే ఫరిస్తా రూపమో అదేవిధంగా బ్రహ్మాబాబా సమానంగా ఫరిస్తా స్వరూపంలో స్థితులై ప్రతి కర్మ చేయండి. ఎందుకంటే వజ్రోత్సవం జరుపుకుంటున్నారు, స్థాపన అయ్యి 60 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి విశేషంగా స్థాపనకి నిమిత్తం శివబాబాయే కానీ నిమిత్తంగా బ్రహ్మాబాబా అయ్యారు కదా! అలాగే మీరు కూడా స్వయాన్ని శివకుమారీ, కుమారులు అని పిలుచుకోరు కదా! బ్రహ్మాకుమారీ, కుమారులు అని అంటారు. అంటే బ్రహ్మాబాబా యొక్క స్థాపనాకార్యం యొక్క వజ్రోత్సవం జరుపుకుంటున్నారు. ఎవరి ఉత్సవం జరుపుకుంటున్నారో వారికి ఏమి ఇస్తారు? (బహుమతి) మీరందరూ కూడా బహుమతి ఇస్తారా? లేదా గులాబి పుష్పం తీసుకువచ్చి ఇచ్చేసి బహుమతి ఇచ్చేశాం అంటారా? కొంతమంది ఏనుగు బొమ్మ, కొంతమంది గుఱ్ఱంబొమ్మ తీసుకుని వస్తారు. అవి అన్నీ మనోరంజనం కోసం. ఇది కూడా మంచిదే వాటిని చూసి అందరు సంతోషపడతారు. గుఱ్ఱం నాట్యం చేస్తుంది లేదా మనిషి బొమ్మ నాట్యం చేస్తుంది అని ఆ బొమ్మలను చూసి సంతోషపడతారు, అవి తీసుకురండి. కానీ బ్రహ్మాబాబా మనస్సుకి ఇష్టమైన బహుమతి ఏమి ఇస్తారు? ఎవరైనా బహుమతి ఇచ్చేటప్పుడు వీరికి ఏది ఇష్టం అని చూస్తారు కదా! ఇది ఇష్టపడతారా? లేదా? అనేది చూసుకుంటారు కదా! అలాగే బ్రహ్మాబాబాకి ఏది ఇష్టం? ఏ బహుమతి బాబాకి ఇష్టం అనిపిస్తుంది? నడుస్తూ, తిరుగుతూ ఫరిస్తా స్వరూపంగా ఉండటమే బాబాకి ఇష్టమైన బహుమతి. అందువలన ఫరిస్తాగా అవ్వండి. ఫరిస్తా రూపంలో ఏ విఘ్నం కూడా మీపై ప్రభావం వేయలేదు. మీ సంకల్పం, వృత్తి, దృష్టి అన్నీ డబల్ లైట్‌గా అయిపోతాయి. అయితే బహుమతి ఇవ్వడానికి తయారేనా? (తయారే) మీ అందరి మాట రికార్డ్ అయిపోతుంది. స్వర్ణిమ ప్రపంచం తీసుకురావడానికి ఫరిస్తా అవుతారు కదా! మంచిది. వజ్రం ఏవిధంగా అయితే మెరుస్తూ ఉంటుందో అదేవిధంగా ఫరిస్తా రూపం కూడా మెరుస్తూ ఉంటుంది. ఈ అభ్యాసం బాగా చేస్తూ ఉండండి. 

అమృతవేళ లేస్తూనే నేనెవరు? అనేది స్మృతిలోకి తెచ్చుకోండి. నేను ఫరిస్తాను అని సంకల్పం చేస్తున్నారు మరియు అలా ఉండాలని అనుకుంటున్నారు. అయినా కానీ ఫలితం చూస్తే లేదా ఫలితం వ్రాసి కూడా ఇస్తున్నారు. దానిలో చాలామంది అంటున్నారు, ఎంత కావాలనుకుంటున్నామో అంత కాలేదు. 50 శాతం లేదా 60 శాతమే ఉంది అంటున్నారు. వజ్రోత్సవంలో కూడా ఈ శాతంలోనే ఉంటారా లేక పూర్తి శాతంలో ఉంటారా? ఎలా ఉంటారు? విదేశీయులు చెప్పండి, ఇంకా శాతం ఉంటుందా? ఉంటుందా, ఉండదా? కొద్దిగా అవకాశం ఇమ్మంటారా! శక్తులలో శాతం ఉంటుందా? ఉండదు, అని ఉల్లాసంతో అనటం లేదు ఆలోచించి అంటున్నారు. డబల్ విదేశీయులు లేదా భారతవాసీయులు శాతం లేకుండా పూర్తిగా పాస్ అయిపోతే బ్రహ్మాబాబా ఏం చేస్తారో తెలుసా? (శభాష్ అంటారు) కేవలం శభాష్ అని అంటారా? ఇంకా ఏం చేస్తారు. రోజూ అమృతవేళ మిమ్మల్ని తన బాహువులలోకి తీసుకుంటారు. బ్రహ్మాబాబా బాహువులలో, అతీంద్రియ సుఖంలో ఊగుతున్నట్లు మీకు కూడా అనుభవం అవుతుంది. చిత్రాలలో చూపిస్తారు కదా తుఫాను వచ్చేసింది, నీళ్ళు పెరిగిపోయాయి అప్పుడు సర్పం ఛత్రచ్చాయగా అయ్యింది అని వారు శ్రీకృష్ణుని గురించి స్థూల విషయం చూపించారు. కానీ వాస్తవానికి ఇది ఆత్మిక విషయం. ఎవరైతే ఫరిస్తాగా అవుతారో వారి ఎదురుగా ఏ పరిస్థితి వచ్చినా లేదా ఏ విఘ్నం వచ్చినా కానీ బాబా మీ ఛత్రఛాయగా అయిపోతారు. చేసి చూడండి. ఎందుకంటే మామూలుగా బాప్ దాదా చెప్పరు. 

వజ్రోత్సవం జరుపుకుంటున్న పిల్లలు చేతులెత్తండి. బాప్ దాదా వారితో మాట్లాడుచున్నారు. మీరందరు 14 సంవత్సరాలు యోగం అంటే తపస్సు చేసారు కదా! ఎన్ని విఘ్నాలు వచ్చాయి, కానీ మీకు ఏమైనా అయ్యిందా? బాప్ దాదా ఛత్రఛాయగా అయ్యారు కదా! ఎన్ని పెద్ద పెద్ద విషయాలు జరిగాయి. మొత్తం ప్రపంచం, ముఖ్యమైన వారు, నేతలు, గురువులు అందరు వ్యతిరేకం అయిపోయారు కానీ బ్రహ్మాకుమారీలు ఒక్కరే అచంచలంగా ఉన్నారు. బికారీ జీవితం కూడా ప్రత్యక్షంగా చూశారు. తపస్యా సమయంలో రకరకాల విఘ్నాలు కూడా చూసారు. తుపాకులు, కత్తులు అన్నీ మీదకు వచ్చాయి కానీ బాబా ఛత్రఛాయగా ఉన్నారు కదా! ఏదైనా నష్టం జరిగిందా? పాకిస్తాన్లో ఉన్నప్పుడు అలజడులకు భయపడి జనం అందరు అన్నీ వదిలి పారిపోయారు. కానీ మీ సామాన్లతో టెన్నీస్ కోర్టు నిండిపోయింది. ఎందుకంటే మంచి వస్తువులని ఎలా వదులుతారు, వాటితో ప్రేమ ఉంటుంది కదా! అప్పట్లో సింధ్ నివాసీయులు వ్యతిరేకంగా ఉండేవారు, నిందించేవారు కానీ మరలా వారే సామానులు కూడా ఇచ్చారు. నమస్కారం పెట్టి పెద్ద పెద్ద వస్తువులని మీరు ఉపయోగించుకోండి అని ఇచ్చి వెళ్ళిపోయారు. ప్రపంచం వారికి అలజడిగా ఉంటే బ్రహ్మాకుమారీలకు అయిదు రూపాయలకే కూరగాయల బండి ఇచ్చేసేవారు. అయిదు రూపాయలకే కూరగాయలన్నీ వచ్చేసేవి. మీరు ఎంత ఆనందంగా కూరలు వండుకుని తినేవారు! ప్రపంచం వారు భయపడుతూ ఉండేవారు మరియు మీరు నాట్యం చేసేవారు. ఇలా ప్రత్యక్షంగా చూసారు కదా! బ్రహ్మాబాబా, శివబాబా ఇద్దరూ చత్రఛాయగా అయ్యి ఎంత రక్షణగా స్థాపనా కార్యం చేశారు! వీరికి అనుభవం అయినప్పుడు మీరు అనుభవం చేసుకోలేరా? ముందు మీరు. ఎవరు ఎంత కావాలంటే అంత ఈ వజ్రోత్సవ సంవత్సరం బాప్ దాదా యొక్క చత్రఛాయ మరియు బ్రహ్మాబాబా యొక్క ప్రేమను ప్రత్యక్షంగా అనుభవం చేసుకోగలరు. ఇది ఈ సంవత్సరం యొక్క వరదానం అంటే సహజ ప్రాప్తి. ఎక్కువ పురుషార్ధం చేయవలసిన పని లేదు. పురుషార్ధంతో అలసిపోతున్నారు కదా! ఎప్పుడైనా ఎవరైనా పురుషార్ధంతో అలసిపోతే ఆ సమయంలో వారి ముఖం చూస్తే బాప్ దాదాకి చాలా దయ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఏవిధంగా అవుతారు? ఫరిస్తా అవ్వాలి. ఫరిస్తా రూపంలో నడవటం మరియు తిరగటం ఇదే వజ్రంగా అవ్వటం. చాలా విలువైన, ఖరీదైన, మచ్చలేని వజ్రం యొక్క గుర్తు ఏమిటి? దానిని లైట్ ఎదురుగా పెడితే మెరుస్తుంది మరియు దాని నుండి కిరణాలు వస్తాయి, దానిలో రంగురంగులు కనిపిస్తాయి. అలాగే మీరు కూడా సత్యమైన వజ్రంగా, ఫరిస్తాగా అయినప్పుడు మీ యొక్క ఫరిస్తా స్వరూపంలో అష్టశక్తులు కనిపిస్తాయి. ఎలాగైతే ఆ వజ్రంలో కిరణాలు రూపంలో రంగులుగా కనిపిస్తాయో అలాగే మీరు కూడా వజ్రం అంటే ఫరిస్తా రూపంగా అయితే మీ నుండి అష్టశక్తుల యొక్క కిరణాలు అనుభవం అవుతాయి. కొందరికి మీ నుండి సహనశక్తి యొక్క అనుభవం అవుతుంది మరియు కొందరికి మీ ద్వారా నిర్ణయశక్తి యొక్క అనుభవం అవుతుంది, కొందరికి ఒక శక్తి, కొందరికి ఇంకొక శక్తి యొక్క అనుభవం అవుతుంది. రేపటి నుండి క్రొత్త సంవత్సరం లేదా వజ్రోత్సవ సంవత్సరం ప్రారంభమవుతుంది. కనుక మీరు మొదటి నెలలో ఫరిస్తా రూపం యొక్క అభ్యాసం చేస్తే రెండవ నెలలో ఆ అభ్యాసం ఇంకా పెరుగుతుంది. మూడవ నెలలో ఇంకా పెరుగుతుంది. ఎంతెంతగా ఇలా పెరుగుతూ ఉంటుందో అంతంతగా మీ ద్వారా ఇతరులకి అనుభవం అవుతుంది. అర్థమైందా? ఇదే బ్రహ్మాబాబాకి ఇచ్చే బహుమతి. అందరూ ఇస్తారా లేక కొందరే ఇస్తారా? 

మంచిది. మధువనం వారు కూడా బహుమతి ఇస్తారు కదా! అలాగే అనటంలో మధువనం వారు తెలివైన వారు.( జ్ఞాన సరోవరంలో కూడా మురళి వింటున్నారు) జ్ఞానసరోవరం వారు ఫరిస్తా అయిపోతారా? అనువాదం చేసేవారు, కరెంట్ ఏర్పాటు చేసినవారు, మైక్ ఏర్పాటు చేసినవారు అందరు డబల్ లైట్ గా, ఫరిస్తాగా అవ్వాలి. కష్టం అనిపించటం లేదు కదా? 63 జన్మల నుండి ఈ శరీరంతో ప్రేమ ఉంది అయితే కష్టం అనిపించదా? ధృడ నిశ్చయం పెట్టుకుంటే నిశ్చయానికి విజయం అనేది చలించదు. పంచతత్వాలు లేదా ఆత్మలు ఎంతగా ఎదుర్కున్నా కానీ వారు ఎదుర్కుంటారు. మీరు ఇముడ్చుకునే శక్తి ద్వారా వారిని కూడా ఇముడ్చుకోవాలి. ఎందుకంటే స్థిరమైన నిశ్చయం ఉంది కదా. స్థాపన యొక్క ఈ 60 సంవత్సరాలలో బ్రహ్మాబాబా మరియు అనన్య (సాటిలేని) పిల్లలదే అద్భుతం. ఎప్పుడు నిశ్చయంలో అలజడి అవ్వలేదు. విజయం తప్పక రానే వస్తుంది, అనే మాట బ్రహ్మాబాబా ఎప్పుడు అనేవారు. 

ఈరోజు విశేషంగా బ్రహ్మాబాబా పిల్లలందరికి విశేష శుభాకాంక్షలు మరియు చాలా చాలా ప్రేమ ఇచ్చారు. ఎంతమంది ఉన్నా కానీ 4 లక్షలు అయినా, 14 లక్షలు అయినా కానీ అందరూ భుజాలే బ్రహ్మాబాబా యొక్క భుజాలు ఎంత విశాలమైనవి అంటే 14 లక్షల మందిని కూడా ఒక్కసారిగా భుజాలలో ఇముడ్చుకోగలరు. అందువలనే భక్తిమార్గంలో పరమాత్మ యొక్క విరాఠ రూపం చూపించారు, దానిలో అందరు ఇమిడి ఉంటారు. అందరు బ్రహ్మాబాబా యొక్క భుజాలలో ఇమిడి ఉన్నారు. చిన్న పిల్లలని ఎవరైనా ఏమైనా అనినా లేదా చేసినా తల్లితండ్రుల బాహువులలోకి వెళ్ళిపోతారు కదా! అలాగే మీరు కూడా చేయండి పిల్లలే కదా లేక ఇప్పుడు పెద్దవారు అయిపోయారా? 100 సంవత్సరాల వారు కూడా బాబా ముందు అయితే చిన్నపిల్లలే. మీకు కూడా ఏమైనా జరిగితే బ్రహ్మాబాబా యొక్క బాహువులలో లీనం అయిపోండి. ఇదైతే సహజమే కదా ? 

మంచిది. ఇవి వజ్రోత్సవం యొక్క విషయాలు. ఇప్పుడు దీనితో పాటు క్రొత్త సంవత్సరం కూడా జరుపుకుంటారు కదా! 12 గంటలతో ఈ సంవత్సరం పూర్తి అయిపోతుంది. ఇప్పుడు కొంచెం సమయం ఉంది. ఇంకా ఇప్పుడు పాత సంవత్సరంలోనే ఉన్నారు కానీ క్రొత్త సంవత్సరం జరుపుకుంటున్నారు. దాని కోసమే వచ్చారు కదా? డబల్ విదేశీయులు దేనికోసం వచ్చారు? భారతీయులు అయితే వారి అవకాశం వచ్చింది కనుక వచ్చారు. అయితే డబల్ విదేశీయులు ఎందుకు వచ్చారు? క్రొత్త సంవత్సరం జరుపుకోవటానికి, క్రిస్మస్ జరుపుకోవటానికి వచ్చారు. డబల్ విదేశీయులతో మాట్లాడటం కూడా బాప్ దాదాకి ఇష్టం అనిపిస్తుంది. క్రొత్త సంవత్సరం జరుపుకోవాలంటే పాత సంవత్సరాన్ని ఏం చేస్తారు. వీడ్కోలు ఇచ్చేస్తారు. వీడ్కోలు అని కేవలం నోటితో చెప్పేస్తారు లేదా పాతది వెళ్ళిపోతుంది, క్రొత్తది వస్తుంది అని చిత్రం తయారు చేస్తారు. కానీ పాత సంవత్సరానికి ఏవిధంగా వీడ్కోలు ఇస్తారు? కేవలం పాటలు పాడుకుని, నాట్యం చేసి ఎగురుతారు అంతేనా! ఏం పని చేస్తారు? ఈ సంవత్సరం సమాప్తి అయిపోతుంది, వీడ్కోలు తీసుకుంటుంది. మరలా ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుంది? (5000 సంవత్సరాల తర్వాత, అంటే 5000 సం||ల వరకు మీ నుండి వీడ్కోలు తీసుకుంటుంది. మీరు కూడా ఎవరైనా వెళ్ళిపోతున్నప్పుడు బహుమతి ఇస్తారు కదా! అయితే మీరు ఈ పాత సంవత్సరానికి ఏమి ఇస్తారు? ఏమైనా ఇస్తారా లేక ఖాళీగా పంపించేస్తారా? వెళ్ళిపో, వెళ్ళిపో అని పంపించేస్తారా? ఏమి ఇస్తారు? పాత సంవత్సరానికి ఏది ఇష్టం? పాత వస్తువులు అంటే ఇష్టం (బలహీనత ఇచ్చేస్తాం) బాప్ దాదా చూస్తున్నారు, బలహీనతను ఇచ్చేస్తున్నారు, మరలా తిరిగి తీసేసుకుంటున్నారు. సంవత్సరం తెలివైనది అది 5000 సంవత్సరాల వరకు తిరిగి రాదు. కానీ మీరు మీ పాత వస్తువులని తిరిగి ఎందుకు తీసుకుంటున్నారు? చీటి వ్రాసి ఇచ్చేస్తారు. బాబా ఇంకేముంది, క్రోధముక్తులుగా అయిపోతాం... అని చాలా బాగా వ్రాస్తారు, ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. చాలా మంచిగా భుజాలు ఊపుతారు, అలాగే, అలాగే అంటారు. అయినా కానీ తిరిగి మరలా ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. పాత వస్తువులతో ప్రీతి పెట్టుకుంటున్నారు. మరలా మేమైతే వదిలేశాం కానీ అవి మమ్మల్ని వదలటం లేదు అంటారు. అయితే బాబా అంటున్నారు మీరు నడిచేటప్పుడు ఏదైనా ముళ్ళు కానీ, ఇంకా ఏదైనా గ్రుచ్చుకుంటే మీరు ఏం చేస్తారు? అది నన్ను వదులుతుందా లేదా నేను దానిని వదలాలా అని ఆలోచిస్తారా? ఎవరు వదులుతారు? మరలా వదిలేసినా అవి గాలిలో ఎగురుకుంటూ వస్తే మీరు ఏం చేస్తారు? ఉంచుకుంటారా లేక పాడేస్తారా? పాడేస్తారు కదా! అయితే ఈ పాత వస్తువులు ఎందుకు పడేయటం లేదు? మీకు ఇష్టం లేని వస్తువులు పొరపాటుగా మీ దగ్గరికి వస్తే వాటిని దాచి ఉంచుకుంటారా? పొరపాటున ఎవరైనా మీకు చెడు వస్తువులు ఇస్తే వాటిని అలమారాలో అలంకరించి ఉంచుతారా? పాడేస్తారు కదా! మరలా వాటి ముఖం కూడా కనిపించకుండా దూరంగా పారేస్తారు. అయితే వీటిని మరలా ఎందుకు తీసుకుంటున్నారు? మరలా తిరిగి తీసుకోండి అనేది బాప్ దాదా యొక్క శ్రీమతమా? అవి అయితే తిరిగి వస్తాయి. ఎందుకంటే వాటికి మీరంటే ప్రేమ కానీ మీకు ప్రేమ లేదు. వాటికి మీరంటే ఇష్టం కానీ మీకు అవంటే ఇష్టం కాదు. అయితే ఏమి చేయాలి? బాప్ దాదా పిల్లలందరికి చెప్తున్నారు, పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటం అంటే మనస్సులో ఆలోచించిన విషయాలు ఎన్ని ఉన్నాయి? ఎక్కువగా ఉన్నాయా? (8 విషయాలు) పాత సంవత్సరం యొక్క వీడ్కోలుతో పాటూ ఈ 8 విషయాలను కూడా మంచిగా అలంకరించి వీడ్కోలు ఇచ్చేయండి. అర్థమైందా? ఇవ్వగలరా? ఇచ్చే ధైర్యం ఉందా? (ఉంది) ఉంది అని తొందరగా అనేస్తారు. ఇదే బాప్ దాదాకి కూడా ఇష్టం అనిపిస్తుంది. 

ఇప్పుడు ఈ సంవత్సరం అనేది అయిదువేల సంవత్సరాల వరకు వీడ్కోలు ఇచ్చేస్తుంది కనుక మీరు తక్కువలో తక్కువ ఈ చిన్న బ్రాహ్మణ జన్మ ఎక్కువ కాదు ఒకే జన్మ దీనిలో కూడా రేపటి నమ్మకం లేదు. ఆ పాత సంవత్సరమే 5000 సం||లకి వీడ్కోలు ఇస్తుంటే మీరు తక్కువలో తక్కువ ఒక జన్మకి అయినా వీడ్కోలు ఇవ్వండి. ఇవ్వగలరా? అలాగే అని అయితే అంటున్నారు. మరలా అవి తిరిగి వచ్చేసినప్పుడు చాలా కష్టం, అస్సలు వదలటం లేదు. ఏం చేయము అని అనుకుంటున్నారు. కానీ వదిలేస్తే వదిలిపోతాయి. అవైతే వదలవు కానీ మీరు వదిలేస్తే వదిలిపోతాయి. ఎందుకంటే వాటిని మీరు బాగా ప్రేమించారు. అందువలన అవి వదలవు, మీరే వదలవలసి ఉంటుంది. ధృడసంకల్పం మరియు సంపూర్ణ నిశ్చయం అనే ఈ ట్రేలో 8 విషయాలను అలకరించి పాత సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చేయండి, ఇక మరలా అవి రావు. నిశ్చయాన్ని కదపుకోకండి. ఏమయ్యింది, అయిపోతుంది, ఇప్పుడింకా రెండువేల సంవత్సరాలు పూర్తి అవ్వలేదు, రెండువేల సంవత్సరాలకు అంతా సరైపోతుంది, ఇలా నిశ్చయంలో సోమరితనం వచ్చేస్తుంది. బాప్ దాదాకి కూడా చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు, బాబా మీరు చింతించకండి, రెండువేల సంవత్సరాలకి పూర్తి అయిపోతుంది అని. ఇప్పుడింకా కొంచెం, కొంచెం ... అని అంటున్నారు. కానీ రెండు వేల సంవత్సరాలు అనే తారీఖు బాబా ఇవ్వలేదు, మీరు అలా రెండువేల సంవత్సరాల వరకు ఎదురుచూస్తూ ఉండండి, క్రొత్త ప్రపంచం ముందుగానే తయారైపోతుంది. అందువలన సోమరిగా అవ్వవద్దు. మాటిమాటికి రివైజ్ చేసుకోండి. ఎందుకు మర్చిపోతున్నారు? ఏదైనా పని ప్రారంభించేటప్పుడు చాలా బాగా ఆలోచిస్తున్నారు, నేను ఆత్మను, నేను ఆత్మను, వీరు కూడా ఆత్మ, ఆత్మ శరీరంతో ఈ పని చేయిస్తుంది అని మొదలు పెడుతున్నారు. కానీ పని చేస్తూ చేస్తూ ఆత్మ గుప్తం అయిపోతుంది. మీరు ఏ పని చేస్తున్నా దానిలో చేతిలో పాటు మనస్సు, బుద్ధి సహితంగా దానిలో బిజీ అయిపోతున్నారు. ఆత్మాభిమానిగా కొద్దిగా అవుతున్నారు. కానీ కర్మాభిమానిగా ఎక్కువ అయిపోతున్నారు! మరలా చెప్తున్నారు. బాబా నా ద్వారా ఏ పొరపాటు జరగలేదు. నేను ఎవరికి ఏమి చెప్పలేదు అని కానీ బాప్ దాదా చెప్తున్నారు. మీరు ఆత్మాభిమాని కాకుండా కర్మాభిమాని అయితే ఆ సమయంలో ఫలితం ఏమి ఉంటుంది? ఆత్మాభిమాని స్థితి ఎంత ఉండాలో అంత ఉండదు. దీనికి విధి - మాటిమాటికి రివైజ్ చేసుకోండి. మాటిమాటికి పరిశీలించుకోండి. పని పూర్తయిపోయిన తర్వాత మరలా మీరు ఆలోచిస్తున్నారు కానీ అలా కాదు. ఎప్పటివరకు నిరంతరం ఆత్మాభిమాని అవ్వరో అప్పటివరకు ఈ సహజవిధి మాటిమాటికి రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకుంటే ఉంటే మరలా తర్వాత ఆలోచించవలసిన అవసరం ఉండదు. రివైజ్ చేసుకోవడానికి సమయం ఉంటుందా లేక చాలా బిజీగా ఉంటున్నారా? ఎప్పుడైనా మీ చార్ట్ పరిశీలించుకునేటప్పుడు రెండు విషయాలు పరిశీలించుకోండి. ఒక విషయం కాదు. నేను చెడు చేయలేదు అంటే ఏమి పోగొట్టుకోలేదు అది అయితే మంచిదే కానీ ఎంత జమ చేసుకున్నారు? పోగొట్టుకోలేదు. దీనికి అయితే శుభాకాంక్షలు కానీ పోగొట్టుకోలేదు మరియు సంపాదించుకోలేదు కూడా. అటువంటి వారు ఏ లిస్టులోకి వెళ్తారు? కనుక పరిశీలించుకోండి, నేను ఎంత జమ చేసుకున్నాను ? అని. జమాఖాతా పరిశీలించుకోండి. ఎందుకంటే మొత్తం కల్పంలో రాజ్యం చేసినా, పూజింపబడినా కానీ ఇప్పుడు జమ చేసుకోవాలా లేదా ద్వాపరయుగంలో లేదా సత్యయుగంలో చేసుకుంటారా? నేను ఎంత జమ చేసుకున్నాను? అని పరిశీలించుకోండి. తక్కువలో తక్కువ ఇంత జమ చేసుకోండి, 21 జన్మలు ఉన్నత కుటుంబంలో ప్రాప్తి అనుభవిస్తూ ఉండండి. ఒకవేళ తక్కువగా జమ చేసుకుంటే త్రేతాయుగంలోకి వస్తారు, సత్యయుగం మిస్ అయిపోతారు. త్రేతాలోకి రావటం ఇష్టమేనా? మొత్తం మొట్టమొదటి సుఖం అయితే సూర్యవంశీయులే తీసుకుంటారు, చంద్రవంశీయులకి తర్వాత మిగిలినది లభిస్తుంది. కనుక జమాఖాతా పరిశీలించుకోండి. మొత్తం రోజంతటిలో ఎక్కువలో ఎక్కువ జమ చేసుకుంటే సహజంగానే మీరు నిర్విఘ్నంగా అవుతారు మరియు ఫరిస్తారూపంలో స్థితులవుతారు. కనుక విధి ఏమి అయ్యింది? ప్రతి గంట రివైజ్ చేసుకోండి. ఏ అభిమానంలో ఉంటారు? ఆత్మాభిమాని అవుతారా? 

బాప్ దాదా అందరి చార్ట్ పరిశీలిస్తే మొత్తం 50 శాతం పిల్లలు ఇతరులని చూసి స్వయం సోమరిగా ఉంటున్నారు. అక్కడక్కడ మంచి, మంచి పిల్లలు కూడా చాలా సోమరితనంలోకి వచ్చేస్తున్నారు. ఇదైతే అవుతూనే ఉంటుంది.... ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది... నడవనివ్వండి..... అందరు అలాగే నడుస్తున్నారు..... బాప్ దాదాకు నవ్వు వస్తుంది, ఒకవేళ ఒకరు మోసపోతే వారిని చూసి మీరు సోమరితనంలోకి వచ్చి మోసపోతున్నారు అంటే మీరు తెలివైనవారా? ఈ సోమరితనం యొక్క పశ్చాత్తాపం చాలా చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు పెద్దగా అనిపించడం లేదు, అలాగే నడవండి.... కానీ బాప్ దాదా అన్నీ చూస్తున్నారు, ఎంత సోమరిగా ఉంటున్నారు. ఎలా ఇతరులని క్రిందికి వెళ్ళిపోవటంలో అనుసరిస్తున్నారు? అని. బాప్ దాదాకి అయితే చాలా దయ వస్తుంది, పశ్చాత్తాపం ఘడియలు ఎంతో కఠినంగా ఉంటాయి అని. అందువలన సోమరితనం యొక్క అలకి, ఇతరులని చూసేటటువంటి అలకి ఈ పాత సం||లో మనస్సు నుండి వీడ్కోలు ఇవ్వండి. కొద్ది సమయం ఉత్సాహ, ఉల్లాసాలు ఉన్నప్పుడు కొద్ది సమయం కోసం వైరాగ్యం వస్తుంది కానీ అది అల్పకాలిక వైరాగ్యం అవుతుంది. అందువలన బాప్ దాదా ఏవైతే ముక్తి అయ్యే విషయాలు వినిపించారో వాటిపై చాలా ధ్యాస ఉండాలి. ఎంత పాత వారు అవుతున్నారో అంత చూస్తే పాతవారిలో సోమరితనం ఎక్కువగా వస్తుంది. మొట్టమొదటి ఉత్సాహం, ఆవేశం ఉండటం లేదు, చదువు యొక్క సోమరితనం కూడా వచ్చేస్తుంది, అన్నీ వినేశాము, అన్నీ తెలుసుకున్నాము అనుకుంటున్నారు. ఆలోచించండి, ఒకవేళ అన్నీ అర్ధం చేసుకుంటే బాప్ దాదా చదువు కూడా పూర్తి చేసేస్తారు. విద్యార్థికి చదువు అయిపోతే ఇక ఎందుకు చదువుకుంటారు? సమాప్తి చేసేస్తారు కదా! కానీ ఈ సోమరితనానికి వీడ్కోలు ఇచ్చేయండి. ఇతరులని చూడకండి, బాబాని చూడండి, బ్రహ్మాబాబాని చూడండి. ఒకవేళ ఎవరైనా మోసపోతుంటే మహారథీల పని మోసం నుంచి రక్షించటం అంతే కానీ స్వయం అనుసరించడం కాదు. పాత సంవత్సరానికి మంచిగా వీడ్కోలు ఇస్తారు కదా? ఇప్పుడు ఎంత సమయం అయ్యింది? పావు తక్కువ పది (9.45). ఇప్పుడిక రెండు గంటలు ఉంది. రెండు గంటలలో వీడ్కోలు యొక్క సామానులు తయారు చేయండి. బాప్ దాదా చూస్తారు, బాబాకి బహుమతి ఇవ్వటంలో ఎక్కువ నెంబర్ డబల్ విదేశీయులు తీసుకుంటారా లేక భారతవాసీయులు తీసుకుంటారా? అని. ఇద్దరూ తీసుకుంటారు కదా? అవునా లేక కాదా చెప్పండి! 

నలువైపుల మెరుస్తూ ఉండే సత్యమైన వజ్రాలకి, సదా నిశ్చయం మరియు ధృడ సంకల్పం ద్వారా స్వయాన్ని సత్యమైన వజ్రంగా చేసుకుని, ఇతరులని కూడా తయారు చేసేవారికి, సదా బాప్ దాదా సమానంగా డబల్ లైట్ స్వరూపంలో స్థితులయ్యే శ్రేష్టాత్మలకు, సదా బాబా మరియు సేవ రెండింటిలో బిజీగా ఉండే మాయాజీత్ నుండి విశ్వరాజ్యభాగ్యజీత్ ఆత్మలకు, ఇలా సంగమయుగీ వజ్రాలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments