31-12-1994 అవ్యక్త మురళి

    31-12-1994         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

క్రొత్త సంవత్సరాన్ని శుభభావనా, గుణ స్వరూప సంవత్సరంగా జరుపుకోండి.
 
ఈ రోజు నవయుగ రచయిత బాప్ దాదా తమ నవయుగ రాజ్యాధికారి పిల్లలను చూస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని చూసి మీ నవయుగము గుర్తుకు వస్తోందా? నవయుగానికి ముందు ఈ క్రొత్త సంవత్సరమేమీ పెద్ద విషయం కాదు. నవయుగములో ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి - ప్రకృతి అన్నీ క్రొత్తవే. కొత్త సంవత్సరము ఎప్పుడయితే ప్రారంభమవుతుందో అప్పుడు పురాతన వస్తువు మరియు వ్యక్తి యొక్క పురాతన స్వభావము, సంస్కారము, నడవడిక కొన్ని కొత్తగా ఉంటాయి. కొన్ని పాతవే ఉంటాయి. కానీ మీ నవయుగములో పురాతనము యొక్క నామరూపాలే లేవు. వ్యక్తులు కూడా క్రొత్తవారే అనగా సతో ప్రధానులు. ప్రకృతి కూడా సతో ప్రధానంగా అనగా కొత్తదే. ప్రకృతి కూడా ఇది వరకులా లేదు. కాబట్టి క్రొత్త యుగము యొక్క శుభాకాంక్షలతో పాటు క్రొత్త సంవత్సరము యొక్క శుభాకాంక్షలు. 

ఈరోజు విశేషంగా కొత్త సంవత్సరమును జరుపుకొనే ఉల్లాసముతో, ఉత్సాహముతో సంతోషంగా అందరూ వచ్చి చేరుకున్నారు. కావున బాప్ దాదా కూడా హృదయపూర్వకముగా, దీవెనలతో నవయుగము, నవ సంవత్సరము యొక్క డబల్ శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీ అందరికీ డబల్ స్మృతి ఉందా లేక ఒక్కటే స్మృతి ఉందా? మీ నవయుగం నయనాల ముందు బుద్దిలో స్పష్టంగా ఉంది కదా. ఏ విధంగా రేపటి నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అని అంటారో అలాగే నవయుగము కూడా ఇక వచ్చేసినట్లే ఇంత స్పష్టంగా ఉంది కదా. నషా ఉందా? అందరూ నవయుగ రాజ్యాధికారులేనా? అందరూ రాజులుగా అవుతారా? మరి ప్రజలను తయారుచేసుకొన్నారా? మీరందరూ రాజులే మరి రాజ్యం ఎవరిపై చేస్తారు, మీపైననా! కావున బాప్ దాదా నవయుగము నవ సంవత్సరము రెండింటినీ  చూస్తున్నారు. నిన్నటి విషయమే కదా. అదీ నిన్నటి విషయమే, ఇదీ నిన్నటి విషయమే. మళ్ళీ నవయుగమవుతుంది కదా? నిన్నటి అన్నదానికి అర్ధము ఇంతకు సమీపము అని. మీ నవయుగపు వస్త్రాలు (శరీరము) మీ ముందు కనపిస్తున్నాయా? ఇక, పురాతన వస్త్రాలను వదిలి క్రొత్త వస్త్రాలను ధారణ చేస్తాము. కావున ఆ వస్త్రాలు చాలా మంచిగా, మెరుస్తూ సుందరముగా ఉన్నాయి కదా! ఇప్పుడు కూడా చూడండి. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపముంటుంది. కొందరి ముక్కు వంకరగా, కొందరి కళ్ళు వంకరగా, ఉంటాయి. కొందరి పెదవులు ఎలాగో ఉంటాయి. కానీ నవయుగములో అన్నీ నెంబర్ వన్. ప్రతి కర్మేంద్రియము ఏక్యురేట్ కాబట్టి ఇటువంటి వస్త్రములు మీ ముందు బీరువాలో తగిలించి ఉన్నాయి కదా! ఇక వేసుకోవడమే తరువాయి, తమ వస్త్రాలు బాగున్నాయా, నచ్చాయా? వస్తున్నారు కదా? 

బాప్ దాదా సదా ఎప్పుడయితే ప్రతి పిల్లవాడిని చూస్తారో అప్పుడు వారిలో ఏమి చూస్తారు. ఒకటి ప్రతి ఒక్కరి మస్తకములో మెరుస్తున్న మణిని శ్రేష్ట ఆత్మను చూస్తారు. దానికి తోడు ప్రతి పిల్లవాడి యొక్క శ్రేష్ట భాగ్య రేఖను చూస్తారు. ప్రతి ఒక్కరి భాగ్యము ఎంతో శ్రేష్టంగా ఉంది. అందరి యొక్క భాగ్యము శ్రేష్టంగానే ఉంది కదా! లేక ఎవరి భాగ్యమన్నా మధ్యమంగా కూడా ఉందా? అందరూ నెం.1 లేనా? మరి సెకెండ్, థర్డ్ వాళ్ళు, వేరే రావలసి ఉందా? అచ్చా, ప్రపంచంలో మనుషులు మీ నోటిలో గులాబ్ జామున్ అని అంటారు. బాప్ దాదా అంటారు - మీ నోట్లో గులాబ్ జామూన్, గులాబ్ జామ్ అందరికీ నచ్చుతుంది కదా? గులాబ్ జామ్ లేక మిఠాయి తినేందుకే బాప్ దాదా ప్రతి గురువారము భోగ్ అని పెట్టారు. భోగ్ ను మీరు తింటారు, బాప్ దాదాలకూ స్వీకరింపజేస్తారు. ఇంట్లో చేసినా చేయకపోయినా గురువారమయితే మిఠాయి లభిస్తుంది కదా. ఎప్పుడన్నా ఏదన్నా ఉత్సవము జరుగుతే, నోటిని తీపి చేస్తారు. తీయని నోరు అంటే మధురమైన మొహము, నోటినైతే అందరూ తియ్యగా చేస్తారు కానీ, మీ నోరు తియ్యనిదే, మీ ముఖము తియ్యనిదే. లేక, కొద్దికొద్దిగా చేదుగా కూడా ఉందా? ఏదన్నా ఒక చేదు గీత మిగిలి ఉంటే ఈ రోజు పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడంతో పాటు ఈ కొద్ది చేదుతనానికి కూడా వీడ్కోలు ఇచ్చేయండి. వీడ్కోలు ఇవ్వడం వస్తుందా లేక తోడుగా ఉంచుకోవడం బాగా అనిపిస్తుందా, లేక వీడ్కోలు ఇచ్చి మళ్ళీ పిలుచుకొంటారా? మళ్ళీ మేమయితే వదలాలనుకొంటాము కానీ మాయ వదలదు అని అంటారు. మేము వదిలేసాము కానీ మాయ వచ్చేసింది, అనయితే అనరు కదా? అక్కడకు వెళ్ళి మళ్ళీ ఇలాంటి పత్రాలు వ్రాస్తారా? వీడ్కోలు అంటే సదా కాలానికి వీడ్కోలు, వీడ్కోలు ఇవ్వడమంటేనే మళ్ళీ రానివ్వకూడదని. లేక అప్పుడప్పుడు వస్తే ఏమీ పరవాలేదా? ఎందుకంటే పురాతన సంస్కారాలు చాలామందికి చాలామంచిగా అనిపిస్తాయి. ఈ రోజు, రేపటి నుండి జరుగదు అని అంటారు. మళ్ళీ ఎల్లుండి పరవశులు అయిపోతారు. మరి దానిని వీడ్కోలు అని అనరు కదా. కాబట్టి వీడ్కోలు ఇవ్వడం కూడా నేర్చుకోండి. సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడము సామాన్య విషయమే కానీ మీ అందరూ అంశము, వంశము  సహితంగా మాయకు వీడ్కోలు ఇవ్వాలి. అంశమాత్రము కూడా ఉండకూడదు. కొందరు పిల్లలు 75 శాతం వచ్చింది. ఇలా ఇంకా మార్పు వచ్చేస్తుంది అని అంటారు. కానీ మాయ అంశము నుండి వంశమును చాలా త్వరగా చేస్తుంది. 25 శాతం అంతమాత్రము ఉన్నా 25 నుండి 50 శాతము వరకూ చాలా త్వరగా చేరుకొంటుంది. ఆ అంశ సహితంగా సమాప్తం చెయ్యాలి. కావున క్రొత్త సంవత్సరములో ఏం చేస్తారు? పురాతన సంవత్సరమునకు వీడ్కోలు చెప్పడంతో పాటు మాయ యొక్క అంశమునకు కూడా వీడ్కోలు ఇచ్చేయాలి. వీడ్కోలుతో పాటూ, శుభాకాంక్షలు ఇస్తారు కదా? రేపు అందరూ ఒకరినొకరు కలుసుకొంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు, అని అంటారు. ఈ వీడ్కోలు ఇవ్వండి. వీడ్కోలుతో పాటు, స్వయానికీ, మరియు ఇతరులకు సదా ఫరిస్తా స్వరూప శుభాకాంక్షలను ఇవ్వగాలగాలి. నిజానికి మీరు ఫరిస్తాలే, పైనుండి క్రిందికి వచ్చి, తమ కార్యాన్ని చేసుకొని మళ్ళీ ఎగిరిపోతారు. ఫరిస్తాలు ఇదే చేస్తారు కదా! విహరించే కళకు, గుర్తుగా రెక్కలను చూపించారు. అవేమీ స్థూలమైన రెక్కలు కావు. ఫరిస్తాలకు ఏవయితే రెక్కలు చూపిస్తారో దాని అర్ధము ఫరిస్తా అంటే విహరించే కళ వారు అని. కావున ఫరిస్తా స్వరూపము యొక్క శుభాకాంక్షలు స్వయానికి మరియు ఇతరులకు కూడా ఇవ్వండి. సదా ఫరిస్తా స్వరూప స్థితిలో ఉండండి. మరియు ఇతరులను కూడా అదే స్వరూపంలో చూడండి. ఫలానా వారు, ఫలానా వారు అని కాదు. వీరు ఫరిస్తాలు. ఈ ఫరిస్తాలు సందేశమిచ్చేందుకు నిమిత్తులు అర్ధమయ్యిందా? కావున అందరికీ ఫరిస్తా స్వరూప శుభాకాంక్షలను ఇవ్వండి. ఎవరు ఎలాంటి వారయినా సరే, కానీ, దృష్టితో సృష్టి మారిపోతుంది. దృష్టితో సృష్టి మారగలిగినప్పుడు మరి బ్రాహ్మణులు మారలేరా? మీ దృష్టి, స్మృతి ప్రతీ ఆత్మను మార్చేస్తుంది. 

బాప్ దాదాలకు అప్పుడప్పుడు పిల్లలపై నవ్వు వస్తుంది. మీకు కూడా మీపై మీకే నవ్వు వస్తుందా? ఒకవైపు మేము విశ్వ పరివర్తకులము, విశ్వకళ్యాణకారులము అని అంటారు మళ్ళీ, విశ్వ పరివర్తకులు వచ్చి ఇది నావల్ల మారేది కాదు అని అంటారు. ఇది చేయకూడదు అని అనుకుంటాను, అయినా కానీ చేసేస్తున్నాను అని తమని గూర్చి తాము ఆత్మిక సంభాషణ చేస్తుంటారు. విశ్వ పరివర్తకులు మరి స్వయం గూర్చే చేయాలి అని అనుకొంటాను కానీ చేయలేకపోతున్నాను అని అంటే వారికి ఏ టైటిల్ ఇవ్వాలి. వారిని విశ్వ పరివర్తకులు అని అనాలా? లేక బలహీనులు అనాలా? ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు అవుతుందో తెలీదు ఇలా గీతాలు వినిపిస్తూ ఉంటారు కదా? ఈ గీతాలు బాప్ దాదా వింటారు కదా! ఎప్పుడైతే మీరు విశ్వ పరిపర్తకులు మరియు విశ్వకళ్యాణకారులో, మరి మీరు ఏ ఆత్మనైన మార్చలేరా, స్వయాన్ని మార్చుకోలేరా? స్వపరివర్తకులే కాకపోతే విశ్వ పరివర్తకులుగా ఎలా అవుతారు?

బాప్ దా దా అంటారు, ఈ సంవత్సరం విశేషమైన ధృడ ప్రతిజ్ఞను స్వయంలో చేయండి. ప్రతిజ్ఞ యొక్క అర్ధము శరీరము పోయినా కానీ ఏ ప్రతిజ్ఞ చేసారో ఆ ప్రతిజ్ఞ వీడకూడదు. దీనినే ప్రతిజ్ఞ అని అంటారు. కాబట్టి ప్రతిజ్ఞ చేసేందుకు ధైర్యముందా? చేస్తారా? భయపడరు కదా? కాబట్టి ఇదే ప్రతిజ్ఞను స్వయంలో చేయండి. "ఎప్పుడూ ఎవరి బలహీనతను కానీ, లోపాన్ని కానీ చూడను, ఎవ్వరి యొక్క బలహీనత మరియు లోపాన్ని ఎప్పుడూ వినను, వర్ణించను, చూడను". కాబట్టి ఈ సంవత్సరము మరి ఏమైపోతుంది. ఈ సంవత్సరము " శుభభావన గుణ స్వరూప సంవత్సరము" గా అయిపోతుంది. ప్రతీ సంవత్సరానికి మీరు ఒక్కో పేరు పెడతారు కదా. కాబట్టి ఈ సంవత్సరము శుభభావనా, గుణస్వరూప సంవత్సరము. సరేనా? మళ్ళీ అక్కడకు వెళ్ళి మారిపోరు కదా? మారిపోకూడదు. మధువనంలో వాయుమండలం బాగుండేది. ఇక్కడ సాంగత్యము యొక్క ప్రభావం ఉంది కదా అని అనకూడదు. పరివర్తకుడు ఎవరి యొక్క సాంగత్యములోకి రాడు. ఎవ్వరి ప్రభావంలోకి రాడు. పరివర్తకుడే ప్రభావంలోకి వచ్చేస్తే ఇక పరివర్తన ఏం చేస్తాడు. అందుకని ఈ సంవత్సరాన్ని గుణమూర్తి, శుభభావనా సంవత్సరముగా జరుపుకోండి. ఎవ్వరి యొక్క అశుభ విషయాన్నైనా మీరు దానిని శుభంగా తీసుకోండి. అశుభాన్ని చూస్తూ కూడా మీరు శుభదృష్టితోనే చూడండి. మీరు ప్రకృతినే మార్చేస్తారు. మరి అప్పుడు మనుష్య ఆత్మలను మార్చలేరా? అందులోనూ బ్రాహ్మణ ఆత్మలను మార్చలేరా? ఎప్పుడైతే అందరిపై శుభభావన ఉంటుందో అప్పుడు “కారణము" అన్న శబ్దము సమాప్తమై నివారణ అన్న శబ్దమే కనిపిస్తుంది. ఈ కారణం వలన అయ్యింది అని అనకండి. కారణాన్ని నివారణగా మార్చేయండి, ధైర్యముందా? అచ్ఛా! బాప్ దాదా ఎప్పుడైతే టీ. వీ. చూస్తారో అప్పుడు మజా వస్తాది. ఈ కలియుగపు టీ.వి. చూడరు. బ్రాహ్మణుల టీ.వి. చూస్తారు. అలాగని మీరు ఆ టీ. వీని తెరవకండి. అలా చేయకండి. ఎప్పుడైతే బాబా పిల్లల ఆటను చూస్తారో అప్పుడు చాలా మజా అనిపిస్తుంది. మిక్కీమౌస్ యొక్క ఆట ఆడతారు కదా! కాసేపు ఒకరు పులి అవుతారు, ఒకరు కుక్క అయిపోతారు. ఏ సమయంలో క్రోధం చేస్తారో, ఆ సమయంలో ఏమౌతారు? ఏ సమయంలోనైనా ఎవరితోనయినా వాదనకు దిగితే వారిపై యుద్ధం చేసేస్తూ ఉంటారు. నిరూపిస్తూ పోతూ ఉంటే ఆ సమయంలో మీరు ఏమవుతారు? మిక్కీ మౌస్ అయిపోరు కదా? కాబట్టి ఈ సంవత్సరం మిక్కీ మౌస్ గా అవ్వకూడదు. ఫరిస్తా అవ్వండి. మిక్కీ మౌస్ యొక్క ఆటను చాలా చేశారు. కాబట్టి ఈ సంవత్సరము ఇలా శక్తిశాలి సంవత్సరముగా జరుపుకోవాలి. ఎందుకంటే సమయం సమీపం అవ్వవలసిందే, సమీపంగా రావలసిందే. డ్రామా అనుసారంగా సమీపం అవ్వవలసిందే. కానీ సమీపంగా తీసుకొచ్చేది ఎవరు మీరే కదా! 

ఈ సంవత్సరం ఇంకొక విషయం ఏం చేస్తారు? క్రొత్త సంవత్సరంలో ఒకటి శుభాకాంక్షలు తెలియజేస్తారు. రెండు కానుకలు ఇస్తారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో సదా ప్రతీ ఒక్కరికీ ఎవ్వరు ఎప్పుడు సంబంధ సంపర్కంలోకి వచ్చినా బ్రాహ్మణ పరివారానికైనా లేక ఇతర ఆత్మలకైనా, అందరికీ, ఒకటి మధురవాక్కుల యొక్క కానుకలు ఇవ్వండి. స్నేహపు శక్తి యొక్క కానుకను ఇవ్వండి. ఈ కానుకను ఒక క్షణంలో ఇవ్వవచ్చు. సమయమే దొరకలేదు అని అనలేరు. తీసుకొనే వారికి సమయం లేదు, ఇచ్చేవాళ్ళకూ సమయం లేదు కానీ స్వయం యొక్క శ్రేష్ట భావన, కామన యొక్క వృత్తి ఉంటే సెకండు యొక్క సంకల్పంలో, దృష్టితో మీ హృదయపూర్వకమైన చిరునవ్వు ద్వారా క్షణంలోనైనా, ఎవరికైనా ఎంతగానో ఇవ్వవచ్చు. ఎవరు వచ్చినా వారికి కానుక ఇవ్వాలి. ఒట్టి చేతులతో వారు వెళ్ళకూడదు. కావున ఇన్ని కానుకలు మీ దగ్గర ఉన్నాయా లేక రెండు రోజులు ఇవ్వగానే పూర్తయిపోతాయా అంటే స్టాకు నిండుగా ఉందా లేక ఎవరి స్టాకయినా కాస్త తక్కువ అయ్యిందా? ఎవరివద్దనైనా తక్కువయితే వారు చెయ్యి ఎత్తండి, నింపేస్తాము. ఎవరి వద్దనయినా తక్కువగా ఉంటే వారు చిట్టి వ్రాసి జనకుడికి (జానకీ దాదీకి) ఇవ్వండి. లోటు అయితే ఉండదు కదా? దాత యొక్క పిల్లల వద్దనే లోటుంటే బాగుండదు కదా. కావున నింపుకొని నిండుగా అయి వెళ్ళండి. లోపాన్ని తీసుకొని వెళ్ళకండి. సంవత్సరంతో పాటు లోపాలకు కూడా వీడ్కోలు ఇచ్చి వెళ్ళండి. కేవలం రేపు కానుకలు ఇవ్వడం కాదు. సంవత్సరమంతా కానుకలను పంచుతూ వెళ్ళండి. కానుక లేకుండా ఎవ్వరూ వెళ్ళకూడదు. అప్పుడు ఎంత బాగుంటుంది. ఎవరన్నా వస్తే వారికి చిన్న కానుకను ప్రేమతో ఇవ్వండి. ఎంత సంతోషపడతారు. వస్తువును చూడరు. కానీ కానుక అనగా స్నేహము యొక్క స్వరూపాన్ని చూపించారు. కానుకతో ఎవ్వరూ ధనవంతులయిపోరు. కానీ స్నేహంలో సుసంపన్నమవుతారు. కావున స్నేహము ఇవ్వడం స్నేహము తీసుకోవడం ఎవరన్నా మీకు స్నేహము ఇవ్వకపోయినా మీరు వారి నుండి తీసుకోండి. తీసుకోవడం వస్తుందా లేక ఎలా తీసుకోవాలా అని సిగ్గుపడతాం. ఇలా తీసుకోవడంలో నష్టమేమీ లేదు. వారు మీపై క్రోధం చేస్తే మీరు స్నేహ రూపములో తీసుకోండి. మీరు విశ్వ పరివర్తకులు కదా! మీరు విశ్వ పరివర్తకులు. ఎవరి నెగిటివ్ అయినా దానిని పాజిటివ్ గా మార్చలేరా? కాబట్టి ఈ సంవత్సరమంతా సదా స్నేహము తీసుకోండి, స్నేహము ఇవ్వండి. ఎవరూ ఇవ్వకపోతే నేనేమి చెయ్యాలి అని అనకండి. వారు ఇచ్చినా, ఇవ్వకపోయినా మీరు తీసుకోండి. ఏదో ఒకటి ఇస్తారు కదా, పరివర్తకులారా, మీరు నెగిటివ్ ను పాజిటివ్ గా మార్చేసుకోండి. అర్ధమయ్యిందా, ఈ సంవత్సరములో ఏం చెయ్యాలో, అచ్చా. డబల్ విదేశీయులు ఏం చేస్తారు? గిఫ్ట్ ఇస్తారు. దాతగా అయిపోయారా! దాతలయినందుకు శుభాకాంక్షలు. 

బాప్ దాదా రోజూ పిల్లలలో ఒక్క విషయాన్ని చూస్తూ ఉంటారు. అది ఏమిటి? "నేను" మరియు "నాది" అనేది వచ్చేస్తుంది. అది మధ్యమధ్యలో వ్యాకులత పరుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మారుతున్నప్పుడు ఈ నేను నాది అనేవి కూడా పరివర్తన చెయ్యండి. "నేను" అనే శబ్దాన్ని పలకండి. కానీ, నేను ఎవరిని? యదార్ధంగా నేను అని ఎవరిని అంటారు? శరీరాన్నా లేక ఆత్మనా? నేను ఆత్మను. కాబట్టి ఎప్పుడయితే నేను అనే శబ్దాన్ని వాడతారో యదార్ధ అర్ధాన్ని ఎందుకు స్మృతిలో ఉంచుకోరు? రోజంతటిలో ఎన్నిసార్లు నేను అనే శబ్దాన్ని వాడతారు. తప్పక వాడవలసి వస్తుంది కదా. నాది అనేది కూడా ఎన్నోసార్లు వాడతారు మరియు నేను అని కూడా ఎన్నో సార్లు వాడతారు. కావున ఎన్నిసార్లు నేను అనే శబ్దాన్ని వాడతారో అన్నిసార్లు నేను అన్న పదము యొక్క వాస్తవిక అర్ధముతో స్మృతిలోకి తెస్తే నేను అనేది మోసం చేస్తుందా లేక ఎగురవేస్తుందా? కావున ఎప్పుడైతే నేను అనే శబ్దాన్ని వాడతారో, అప్పుడు నేను ఆత్మను అని గుర్తుంచుకోండి . ఎందుకంటే నేను, నాది అనే శబ్దాలు లేకుండా ఉండటం కుదరదు. అలవాటయిపోయింది. తప్పక వాడవలసి వస్తుంది. నేను నాది ఇది పక్కా సంస్కారంగా అయిపోయింది. కావున ఏ సమయంలో నేను అనే పదాన్ని వాడతారో ఆ సమయములో నేను ఎవరు అన్నది ఆలోచించండి. నేను శరీరమునే కాదు కదా. దేహాభిమానము నేను దేహమయినప్పుడు వస్తుంది. శరీరాన్ని నాది అని అంటారు కదా? లేక నేను శరీరాన్ని అని అంటారా? ఎప్పుడన్నా పొరపాటున నేను శరీరాన్ని అంటారా? పొరపాటున కూడా నేను శరీరము అని అనరు కదా. కావున నేను అను శబ్దము ఇంకా ఎక్కువగా స్మృతిని సమర్ధతను తెచ్చే శబ్దమే కానీ పడవేసే శబ్దము కాదు. కావున పరివర్తన చెయ్యండి. పక్కా విశ్వపరివర్తకులే కదా? చూసుకోండి కచ్చాగా అవ్వకూడదు. కావున నేను అనే శబ్దమును కూడా అర్ధముతో పరివర్తన చెయ్యండి. ఎప్పుడైతే నాది అనే శబ్దాన్ని వాడతారో అప్పుడు ఆ స్వరూపంలో స్థితులవ్వండి. మరియు ఎప్పుడయితే నేను అనే శబ్దాన్ని వాడతారో అప్పుడు అన్నింటి కన్నా ముందు నావారు ఎవరు. రోజంతటిలో నాది నాది అనే శబ్దాన్ని ఎన్నింటినో అంటారు. నా స్వభావం, నా సంస్కారం, ఇవి నా వస్తువులు, నా పరివారము, నా సెంటర్, నా జిజ్ఞాసువులు, నా సేవ, నా సేవను ఇతను ఎందుకు చేసాడు ఇలా అంటారు కదా. ఆట ఆడుతుంటారు కదా, నాది అని ఎప్పుడయితే అంటారో అప్పుడు నా వారు ఎవరు అన్నది స్మృతి చెయ్యండి. మొట్టమొదట నాది అని స్మృతి చెయ్యండి. ఆ తరువాత మిగిలినవి స్మృతి చెయ్యండి. ఎక్కడయితే బాబా ఉంటారో అక్కడ దేహాభిమానము మరియు పడిపోవడము ఉండదు. కావున నేను, నాది అనే రెండు శబ్దాలను ఆ వృత్తిలో, ఆ దృష్టితో, ఆ అర్ధముతో చూడండి మరియు అనండి. నాది అనే శబ్దము నోటి  నుండి బయటకు రాగానే ముందు బాబా స్మృతి రావాలి. అప్పుడూ నిరంతరయోగులుగా అయిపోతారు కదా! ఎందుకంటే నాది మరియు నేను అనే శబ్దాలను ప్రతీ గంటలోనూ ఉపయోగిస్తారు. వ్యవహారంలో కూడా వాడవలసి వస్తుంది కదా! కావున ఎన్నిసార్లు దీనిని తిరిగి వాడతారో నోటి ద్వారా అన్నా లేక మనస్సులో ఆలోచించినా, నేను మరియు నాది దీని అర్ధాన్ని పరివర్తన చెయ్యండి. హద్దులలో నుండి బేహద్ లోకి వెళ్ళాలి కదా. మీరు బేహద్ సృష్టి యొక్క పరివర్తక ఆత్మలు, మరి హద్దులలోకి ఎందుకు వెళతారు? కేవలం భారతదేశ పరివర్తకులు కాదు కదా. లేక డబల్ విదేశీయులు కేవలం విదేశాల పరివర్తకులు కారు కదా? మీరు విశ్వపరివర్తకులు. విశ్వం అనగా బేహద్. విశ్వపరివర్తకులము ఇది పక్కాగా స్మృతి ఉంది కదా? కావున తమకు తామే నిరంతరయోగులుగా సహజంగా తయారయిపోతారు. కష్టపడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే భావము మరియు భావన, మోసమూ చేస్తుంది, సుఖమునూ ఇస్తుంది. దీనిని పరివర్తన చేస్తారు కదా, కావున ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అనే ప్రశ్నలు వేయకండి. ఓ. కే. అనే పత్రము వస్తుందా లేక ఇది అయ్యింది, అది అయ్యింది, అన్న పత్రాలు రావు కదా? బాప్ దాదా వద్ద అందరి పత్రాల ఫైల్ ఉంది. 

అప్పుడప్పుడు మొదటి నుండి ఏయే పత్రాలు ఉన్నాయి అని చూస్తారు. ఏదయితే మనస్సులో ఆలోచిస్తారో అది కూడా అందరి టేప్ రికార్డ్ ఉంది. కావున క్రొత్త సంవత్సరమంటే క్రొత్త దనాన్ని తేవాలి. క్రొత్త దనం అందరికీ ప్రియమనిపిస్తుంది. కదా. పురాతన వస్తువును ప్రదర్శించేందుకు ఇష్టపడతారే కానీ వాడేందుకు కాదు. వాడేందుకు క్రొత్తదే కావాలనుకుంటారు. కావున ప్రతీ విషయంలో నవీనత ఉండాలి. సంకల్పములు కూడా క్రొత్తవే మరియు రమణీయముగా పురుషార్ధం చెయ్యండి. అప్పుడప్పుడు కొందరు పిల్లలు ఎంత హఠముగా పురుషార్ధం చేస్తారంటే, బాప్ దాదాలకు వారిని చూసి జాలి కలుగుతుంది. చాలా యుద్ధం చేస్తారు. అవసరం లేదు కానీ చేస్తారు. ఎందుకు? తమ బలహీనత యొక్క కారణంగా. కావున, కష్టముగా పురుషార్ధం చెయ్యకండి. పురుషార్ధం కూడా ఆనందము, ఉత్సాహముతో చెయ్యండి. చేసేది కూడా ఏముంది. ఎవరో ఒకరి స్మృతిలో ఉంటారు. క్రొత్త విషయమేమీ కాదు. ఒక్క ఘడియ అయినా ఏదీ గుర్తు లేకుండా ఉంటారా? ఎవరో ఒకరు గుర్తుండనే ఉంటారు. ఏదయినా విషయం గుర్తున్నా లేక ఏదయినా వ్యక్తి గుర్తున్నా లేక ఏ వస్తువు గుర్తున్నా, గుర్తయితే తప్పక ఉంటుంది కదా. ఏదీ గుర్తు లేకుండా ఉంటుందా? ఎవరినో ఒకరిని స్మృతి చెయ్యవలసిందే. కావున ఏదయితే ఉపయోగపడే వస్తువో దానిని స్మృతి చెయ్యండి. స్మృతి చెయ్యడం ఎవరికి రాదు? స్మృతి చెయ్యడం రానటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? చిన్న కుమారీలకు స్మృతి చెయ్యడం వస్తుందా? అచ్చా ఎప్పుడయితే తప్పక స్మృతి చెయ్యవలసి వస్తుందో అప్పుడు ఎందులోనయితే ఉపయోగం ఉందో, ప్రాప్తి ఉందో దానినే ఎందుకు స్మృతి చేయకూడదు? ఎందులోనయితే నష్టము ఉందో దానిని ఎందుకు స్మృతి చెయ్యాలి. గుర్తు చేసుకొంటారు. మళ్ళీ ఇబ్బంది కూడా పడతారు. ఎందుకు గుర్తొచ్చింది, గుర్తురాకూడదే. ఇలా మిమ్మల్ని మీరు ఎందుకు ఇబ్బంది పెట్టుకొంటారు? నా బాబా అనండి, చాలు "నాది" అనే అనేక హద్దులలోని భావనలను ఒక్క " నా బాబా" అనే పదంలో ఇమిడ్చి వేయండి. ఒకదానిలో ఒకటి, దానిలో ఇంకొకటి, దానిలో ఇంకొకటి, ఇలాంటి బొమ్మలు ఉంటాయి కదా. ఒకటి తెరిస్తే ఇంకొకటి ఉంటుంది. ఇంకొకటి తెరిస్తే మరొకటి ఉంటుంది. కావున ఒక్క నా బాబాలో అన్నింటిని ' ఇముడ్చుకొండి. లోపల మూసివెయ్యండి. కానీ, ఒకటి కేవలం నోటి ద్వారా నా బాబా అని అనడం రెండవది హృదయాంతరాళములో నా బాబా అని ఉండటం. ఎవరయితే హృదయపూర్వకముగా, తమ వారిగా అంగీకరిస్తారో వారు ఎప్పుడూ మరచిపోరు, ఎవరన్నా సమీప సంబంధీకులు మరణిస్తే జ్ఞానము లేకపోతే చూడండి. ఎంతగా నా వాళ్ళు, నా వాళ్ళు అని అంటారో, చనిపోయిన వారి వస్తువుని చూసినా, వారి చిత్రాన్ని చూసినా, మళ్ళీ అయ్యో, నా వాళ్ళు నా వాళ్ళు అని అంటూ ఎంతగా అలజడి చెందుతారు. పోయిన వారిని కూడా తలుచుకొంటూ ఉంటారు. పోయిన వారు మళ్ళీ రాడని కూడా తెలుసు. అయినా నాది అనేది ఉంది కాబట్టి గుర్తుకు వస్తుంది. కాబట్టి ఏవయితే సాధారణ శబ్దాలు పలుకుతారో, వాటినే విహరించే కళ యొక్క సాధనాలుగా తయారుచేసుకోండి. నేను మరియు నాది, మరియూ పురుషార్ధం కూడా రమణీయంగా చెయ్యండి. కొందరు స్మృతిలో కూర్చుంటారు. నేను జ్యోతిర్బిందువును , నేను జ్యోతిర్బిందువును అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ, ఎటువంటి జ్యోతిర్సిందువును? రోజూ సర్వప్రాపులలో ఏదో ఒక ప్రాప్తిని గుర్తచేసుకోండి. ప్రాప్తుల లిస్ట్ బుద్దిలో ఉంది కదా? లేకపోతే గుర్తురాకపోతే మీ టీచర్ నుండి లిస్ట్ తీసుకోండి. టీచర్ వద్ద కూడా లేకపోతే మధువనం నుండి తీసుకోండి. కావున రోజు ఒక క్రొత్త టైటిల్ ను పరివర్తన చెయ్యండి. ఈ రోజు ప్రకాశించే రత్నమయితే, రేపు మస్తక మణి. ఎంత చక్కగా అనిపిస్తుంది మరియు ప్రతీ రోజూ వేరు వేరు రకాల ప్రాప్తులను ముందు ఉంచుకోండి. బాబా ఏమి ఇచ్చారు, ఏమి దొరికాయి! కావున అవినాశీ ప్రాప్తులు ముందు ఉంటే, ప్రాఫుల వలన సంతోషం కలుగుతుంది కదా? ఉదాహరణకు ఎవరి కన్నా చాలా బాధగా ఉందనుకోండి. ఆ సమయంలో ఎవరన్నా మీకు కోటి రూపాయలు లాటరీలో వచ్చాయి అని ప్రాప్తి యొక్క సూచనను ఇస్తే అప్పుడు తన బాధ గుర్తు ఉంటుందా లేక లాటరీ గుర్తు ఉంటుందా? కావున ప్రాప్తి దుఃఖాన్ని, ఇబ్బందులను మరపింపజేస్తుంది. కావున ప్రతీరోజు కొత్త ప్రాప్తుల యొక్క పాయింట్లను గుర్తుంచుకోండి. మీ టైటిల్ యొక్క సీటులో సెట్ అయి కూర్చొండి. చిన్న పిల్లలలా ఘడియ ఘడియ క్రిందకు దిగి రాకండి. చిన్న పిల్లలను కుర్చి పైన కూర్చోపెడితే మళ్ళీ క్రిందికి వచ్చేస్తారు. అల్లరి పిల్లలయితే క్రిందికి జారుతూ ఉంటారు. మనస్సు కూడా చంచలమైనదైతే, ఎంత సీటు పైన కూర్చోపెట్టినా క్రిందకు వచ్చేస్తూ ఉంటుంది. కావున మీ టైటిల్ యొక్క నషా, అనే సీటుపై చక్కగా సెట్ అవ్వడము వస్తుంది కదా? విమానములో కూడా చూడండి. ఎవరూ కిందికి జారకుండా బెల్టులు కడతారు, మరి దృడ సంకల్పము అనే బెల్టు అందరి వద్ద ఉన్నదా! ఎప్పుడన్నా కొద్దిగా అలజడిలోకి వస్తున్నామని అనిపిస్తే వెంటనే బెల్టు కట్టేసుకోండి. 

కాబట్టి ఈ సంవత్సరపు నవీనత ఏమిటంటే ఎవ్వరి యొక్క నెగెటివ్ సమాచారము రాదు. సరేనా? అవునా కాదా? ఇప్పుడు మీ ఈ శబ్దము కూడా టేప్ లో నిండుతోంది. మీరంతా ఇప్పటికిప్పుడే ఫరిస్తాలుగా అయిపోవాలి అని, కేవలం బాబా కోరుకోవడం కాదు, మీరందరూ కోరుకుంటారు. కోరుకుంటారు కదా? (అందరు అవును అన్నారు) అవును అని చాలా చక్కగా అంటారు. అవును అని విని బాబా కూడా సంతోషిస్తారు. కానీ, ఎటువంటి ఉత్తరాలు వస్తాయంటే చెత్త బుట్టలో వేసేలాగ ఉంటాయి. చదవడానికి కూడా మనస్సు ఒప్పుకోనటువంటి ఉత్తరాలు కూడా వస్తాయి. కవరు చూస్తూనే ఇది ఏదో అలాంటి సమాచారమేనని అర్ధమైపోయే ఉత్తరాలు వస్తాయి, ఉత్సాహపూర్వకమైనవి, సంతోషమయమైనవి కూడా వస్తాయి. కానీ, పనికిరానివి కూడా వస్తాయి. డబ్బులు, సమయము తమవీ వ్యర్ధము ఇతరులవీ వ్యర్ధము. మీ సేవా కేంద్రాలలో ఇటువంటి ఉత్తరాలు వ్రాసేవారు ఉంటే వారిని కూడా పరివర్తన చెయ్యండి.
 
అప్పుడు ఈ సంవత్సరము ఎటువంటి సంవత్సరమవుతుంది? ఆనందోత్సాహాల సంవత్సరం. ఫరిస్తా స్వరూపముతో, ఫరిస్తాల ప్రపంచంలో ఉండేవారు. ఎక్కడ చూసినా ఫరిస్తాలే ఫరిస్తాలు. కొందరు ఫరిస్తాలు ఎగురుతున్నారు, కొందరు సందేశమునిస్తున్నారు. కొందరు క్రిందకు ధరణి పైకి వచ్చి తమ కర్మేంద్రియాల ద్వారా కర్మను చేయిస్తున్నారు. అంతా ఇలాగే కనిపించాలి. సృష్టి మారిపోవాలి. ఎక్కడ చూసినా ఫరిస్తాల ప్రపంచము. సృష్టి యొక్క పరివర్తన, వృత్తి యొక్క పరివర్తన. అచ్చా.
 
సేవ ఏం చేస్తారు? ఈ సంవత్సరం ఏదన్నా విశేష సేవ కూడా చేస్తారా? ఏం చేస్తారు? మేళా చేస్తారా, ప్రదర్శిని పెడతారా? కాన్ఫరెన్స్ చేస్తారా? ఇవయితే చేస్తూనే ఉంటారు. నవీనత ఏం తెస్తారు? బాప్ దాదాల ఒక సంకల్పాన్ని పిల్లలు ఇంకా పూర్తి చెయ్యలేదు. బాప్ దాదా మళ్ళీ మళ్ళీ సంజ్ఞ చేస్తున్నారు. వర్తమాన సమయంలో సంఖ్యను పెంచుతూ పోతున్నారు. కానీ క్వాలిటీ అనగా వారసులను పెంచాలి. లిస్ట్ లో ఇంతమంది పెరిగారు అనైతే వచ్చేస్తుంది. బహుమతి కూడా తీసుకొన్నారు కదా. వెండి గ్లాసుని బహుమతిగా తీసేసుకున్నారని బాప్ దాదా విన్నారు. అది కూడా మంచి విషయమే. ఎందుకంటే రాజధానిలో అన్ని రకాల వారూ కావాలి. కానీ ఇప్పుడు చాలా కాలం నుండి వారిస్ క్వాలిటీ చాలా తక్కువగా తయారవుతుంది. సంపర్కములోని వారు పెరుగుతున్నారు, సంఖ్య పెరుగుతోంది. అది కూడా. డ్రామా అనుసారముగా అవ్వవలసిందే. అవసరం కూడా. కానీ ఇది తగ్గిపోతోంది. ఇప్పుడు వారి క్వాలిటీని ప్రత్యక్షం చెయ్యండి. సంఖ్యను చూసి బాప్ దాదాలు కూడా చాలా సంతోషిస్తారు. కానీ దానికి తోడుగా దీని పైన కూడా అండర్‌లైన్ చెయ్యండి. మరి ఇంకొక విషయము ఇప్పుడు జ్ఞాన సరోవరము కూడా తయారవ్వనుంది. దీనిని విశేషంగా సంపర్కములో ఉన్నవారిని వారసులుగా చేసేందుకు తయారుచేసారు. కాబట్టి ఎప్పుడైతే సేవా స్థానము తయారవుతోందో, అయ్యే ఉన్నప్పుడు మరి సేవ కూడా చేస్తారు కదా? లేక కేవలం చాలా బావుంది అని చూస్తూ సంతోషిస్తారా? కావున ఒక విశాలమైన కార్యక్రమాన్ని జరపండి. ఎలాగయితే విశేష స్థానమును తయారు చేసినప్పుడు విశేష స్థానము యొక్క ప్రారంభోత్సవములో వేరు వేరు దేశాల వారందరూ, నీరు పోస్తారు లేక మట్టి పోస్తారు. మీరు నీరు లేక మట్టిని పొయ్యరు. కానీ, మొత్తం విశ్వమంతటిలో ఒక్క రాష్ట్రం కూడా ఖాళీగా ఉండకూడదు. అన్ని వైపుల నుండి రావాలి. విదేశాల నుండి మరియు, దేశములో ఏయే భిన్న భిన్న రాష్ట్రాలు ఉన్నాయో అక్కడి నుండి కనీసం ఒక్కొక్కరైనా రావాలి. విదేశాల నుండి కూడా ప్రతీ స్థానము వారూ రావాలి. మరియు దేశము నుండి కూడా అన్ని స్థానాల నుండి రావాలి. అప్పుడు అంతర్రాష్ట్రీయ కార్యక్రమము అని దీనిని అంటారు. లేక ఇద్దరు, నలుగురు లండన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు వస్తే అంతరాష్ట్రీయమైపోతుందా ఏంటి? కావున అంతరాష్ట్రీయ, కార్యక్రమాన్ని చెయ్యండి. ఇప్పుడు రెండు స్థానాలు అయిపోయాయి కదా. లేకపోతే స్థానం కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కావున ఇప్పుడు జ్ఞాన సరోవర స్థానం కూడా దొరికింది. అందుకనే ఈ సంవత్సరము దేశము - విదేశము, ఇద్దరి సలహాలతో, ప్లాన్ ఇద్దరి అంగీకారముతో, ఇద్దరి సమర్ధతతో ఎటువంటి కార్యక్రమం తయారుచేయాలంటే విదేశీయులు ఇది మాకు యోగ్యంగా ఉందని, దేశీయులు కూడా ఇది మాకు యోగ్యంగా ఉందని అనాలి. విదేశీయుల పద్ధతి, మరియు దేశీయుల పద్ధతి. ఇద్దరి పద్ధతులను సమ్మిళితం చేసి ఒకరినొకరు ముందు ఉంచాలి. దేశము విదేశమును ముందుంచాలి. విదేశము దేశమును ముందుంచాలి. ఎటువంటి కార్యక్రమము తయారుచెయ్యాలంటే ఏ దేశమూ వంచితం కాకూడదు. విదేశీయులు చెప్పండి. ఇలా అవుతుందా? అవ్వవలసిందే కదా! దేశమువారు చెప్పండి ఇలా చెయ్యాలా? అచ్చా, వీరికి (దాదీలకు) ఈ సంకల్పము ఉంది. దాదీకి సంకల్పాలు చాలా వస్తాయి. సేవ యొక్క మంచి సంకల్పాలు, నిద్ర కూడా పోనివ్వవు. శుద్ధ సంకల్పాల ద్వారా నిద్రలేమి యొక్క ప్రభావము పడదు. సాదారణంగా నిద్ర విడిపోతే బలహీనత కానీ లోటు కానీ అనుభవమవుతాయి. కావున మంచిది, అందరి మట్టిని లేపండి కానీ అందరి యొక్క అభిప్రాయాలు అనే మట్టిని తీసుకొని రండి. ప్రపంచములోని వారు మొత్తం మట్టి, మట్టిగా చేసేస్తారు కదా. మట్టి మట్టిలో కలిసిపోతుంది. మరి అందరి అభిప్రాయాలు, అన్ని వైపులా విశ్వములో శబ్దాన్ని వ్యాపింపజేస్తాయి. ఏ దేశమయినా వంచితమెందుకవ్వాలి. ఎవరన్నా ఒకరు వస్తే వారి దేశములో, తమ వార్తా పత్రికలలోనయితే వేస్తారు కదా. కావున విశ్వములో నలువైపుల యొక్క సేవ కూడా అయిపోతుంది. కానీ, బాప్ దాదా ఈ సంవత్సరము దేశ విదేశాల పద్ధతులతో కలిసిన కార్యక్రమాన్ని కోరుతున్నారు. విదేశీయులు వెనక్కు వెళ్ళకూడదు. దేశీయులూ వెనక్కు వెళ్ళకూడదు. అభిప్రాయాలు కూడా కలవాలి కదా. ఒకరినొకరు ముందు మీరు అని అనాలి. అచ్ఛా, అలా జరుగుతుంది కదా?
 
కావున జ్ఞాన సరోవరము యొక్క కార్యక్రమాన్ని ఎలా తయారు చెయ్యాలంటే విశ్వము మొత్తంలో ఇటువంటి సేవా సమాచారము ఏ స్థానంలోనూ ఉండకూడదు. ఐక్య రాజ్యసమితి అవ్వనివ్వండి లేక దాని కన్నా పెద్ద స్థానమవ్వనివ్వండి. దాని కన్నా పెద్దదయిపోవాలి. ఇందులో అందరి యొక్క తనువు కలిసింది, మనస్సు కలిసింది, మరియు చిన్న పిల్లల నుండి ముసలివారి వరకూ అందరి యొక్క ధనమూ కలిసినది. కావున ఎలాగయితే అందరి సహయోగము యొక్క వ్రేలు ఇందులో కలిసిందో అలాగే మరి సేవలో కూడా అందరి సహయోగమనే వేలు కలవవలసిందే. ప్లాన్లు ఇస్తూ ఉండండి. కానీ ప్లాన్ తయారు చేసే సమయంలో ఇచ్చే సమయంలో, యజమానులుగా ఇవ్వండి. మరియూ చివరిలో మెజారిటీ చేసేటప్పుడు పిల్లలుగా అయిపొండి. పిల్లలు ఏం చేస్తారు? హాజీ ( అలాగే అనండి) అని అంటారు. మరి యజమానులు ఏమంటారు, అలా కాదు, ఇలా చెయ్యండి అని అంటారు. కావున పిల్లలు మరియు యజమానులు, ప్లాన్ ఇవ్వడం మంచిదే కానీ ప్లాన్ జరిగి తీరవలసిందే, ఇలా ఆలోచించి ఇవ్వకండి. ఏదయితే జరుగుతుందో అది మంచిది. దూరం కాకండి, ప్లాన్ ఇవ్వండి కానీ పిల్లలుగానూ అవ్వండి, యజమానులుగానూ అవ్వండి. తయారుచేసేటప్పుడు యజమానులుగా చివరి సమయంలో పిల్లలుగా. పిల్లలుగా, యజమానులుగా అవ్వడం వస్తుందా? లేక కేవలం యజమానులవ్వడం వస్తుందా? ఎందుకంటే అందరూ తెలివైన వారు అయిపోతున్నారు కదా. యజమానులుగా త్వరగా అయిపోతారు. ఇప్పుడు అర్ధమయ్యిందా. కొత్త సంవత్సరంలో ఏం చెయ్యాలో? సేవ కూడా చెయ్యాలి, సేవ కన్నా ముందు స్వపరివర్తకులు, రెండూ కావాలి కదా!
 
ఈ కొత్త సంవత్సరం జరిపేసుకొన్నారు, జరుపుకోవడమంటే అవ్వడం మరియు తయారుచెయ్యడం. అంతేకానీ డ్యాన్స్ చేస్తే జరుపుకొన్నట్లు కాదు. డ్యాన్స్ కూడా చెయ్యండి. బాప్ దాదాకు డ్యాన్స్ కూడా ఇష్టమే. కానీ మనస్సులో కూడా నాట్యం చెయ్యండి. బాప్ దాదా అన్ని పాటలు వింటారు, నాట్యం కూడా చూస్తారు, ఏ కార్యక్రమాన్ని మిస్ కారు. ఎందుకు? చూడండి, ఏ కార్యక్రమాన్ని మీరు చేసినా ముందు పాటలో బాబాను స్మృతి చేస్తారు కదా? ఎప్పుడయితే బాబాను స్మృతి చేస్తారో అప్పుడు తప్పక రావలసి వస్తుంది. చూడవలసి వస్తుంది. ఎప్పుడయితే ఇలా కార్య క్రమాన్ని జరుపుతారో అప్పుడు బాప్ దాదాలకు కూడా నచ్చుతుంది! అచ్ఛా 

Comments