17-03-2007 అవ్యక్త మురళి

 17-03-2007         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

శ్రేష్ట వృత్తి ద్వారా శక్తిశాలి తరంగాలు మరియు వాయుమండలాన్ని తయారుచేసే తీవ్ర పురుషార్థం చేయండి, ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీస్కోండి.

ఈరోజు ప్రేమ మరియు శక్తిసాగరుడు అయిన బాప్ దాదా తన యొక్క స్నేహి, ప్రియమైన మరియు గారాభ పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. పిల్లలందరు కూడా దూరదూరాల నుండి స్నేహం యొక్క ఆకర్షణతో కలయిక జరుపుకునేటందుకు చేరుకున్నారు. సన్ముఖంలో కూర్చున్నా లేదా దేశ విదేశాలలో ఉన్నా కానీ స్నేహ మిలనాన్ని జరుపుకుంటున్నారు. ఇలా నలువైపుల ఉన్న సర్వ స్నేహి, సహయోగి పిల్లలను చూసి బాబా హర్షిస్తున్నారు. ఇప్పుడు త్వరత్వరగా బాబాని ప్రత్యక్షం చేయాలి అనే సంకల్పం ఎక్కువ మంది పిల్లల మనస్సులో ఉన్నట్లుగా బాబా చూశారు. పిల్లలందరి ఉత్సాహం చాలా బావుంది, కానీ బాబాని ఎప్పుడు ప్రత్యక్షం చేయగలరు అంటే మొదట స్వయం బాబా సమానంగా సంపన్నంగా, సంపూర్ణంగా ప్రత్యక్షం చేసుకున్నప్పుడు అని బాబా చెప్తున్నారు. కానీ ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అని పిల్లలే బాబాని అడుగుతున్నారు. మరలా బాబా పిల్లలని అడుగుతున్నారు - మీరు ఎప్పుడు స్వయాన్ని బాబా సమానంగా ప్రత్యక్షం చేసుకుంటారు అని. మీరు సంపన్నంగా తయారయ్యే తారీఖుని నిర్ణయించుకున్నారా? విదేశీయులు అయితే ఏ కార్యక్రమానికి అయినా సంవత్సరం ముందు తారీఖు నిర్ణయించుకుంటారు. అదేవిధంగా పరస్పరం మీటింగ్ పెట్టుకుని స్వయం సంపన్నంగా అయ్యే తారీఖు నిర్ణయించారా? నిర్ణయించారా? 

ప్రతీ వర్గానికి సంబంధించిన మీటింగ్స్ చాలా పెట్టుకోవటం బాప్ దాదా చూశారు. డబల్ విదేశీయుల మీటింగ్ గురించి కూడా బాబా విన్నారు. చాలా మంచిగా అనిపించింది. మీటింగ్స్ అన్నీ బాప్ దాదా వరకు చేరుకుంటాయి. కనుక ఈ విషయం యొక్క తారీఖు ఎప్పుడు నిర్ణయించారు అని బాప్ దాదా అడుగుతున్నారు. ఈ తారీఖుని డ్రామా నిర్ణయింస్తుందా లేక మీరు నిర్ణయించాలా? ఎవరు నిర్ణయిస్తారు? లక్ష్యం అయితే మీరే పెట్టుకోవాలి కదా! ఆ లక్ష్యం అయితే చాలా మంచిది, చాలా పెద్దది పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు ఎటువంటి శ్రేష్ట లక్ష్యం పెట్టుకున్నారో దాని ప్రమాణంగా లక్షణాలు ఉండాలి. లక్ష్యం మరియు లక్షణాలలో ఇప్పుడు తేడా కనిపిస్తుంది. లక్ష్యం మరియు లక్షణాలు సమానం అయిపోయినప్పుడు లక్ష్యానికి ప్రత్యక్షంగా చేరుకోగలరు. పిల్లలందరు అమృతవేళ బాబాని కలుసుకునే సమయంలో చాలా మంచి సంకల్పాలు చేస్తున్నారు. బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలందరి యొక్క ఆత్మిక సంభాషణను వింటారు. చాలా సుందర విషయాలు చెప్తారు. పురుషార్థం కూడా చాలా బాగా చేస్తున్నారు కానీ పురుషార్థంలో ఒక విషయం యొక్క తీవ్రత కావాలి. పురుషార్థం ఉంది కానీ తీవ్ర పురుషార్థం కావాలి. తీవ్రత యొక్క దృడత ఇప్పుడు అదనంగా చేరాలి. పిల్లలందరు నెంబరు వారీగా ఉంటారు, అది బాబాకి తెలుసు, నెంబరువారీ అయినా కానీ ప్రతి ఒక్కరు సమయానుసారంగా ఇప్పుడు తీవ్ర పురుషార్థం సదా ఉండాలి. సమయం సంపన్నంగా అయ్యేటందుకు తీవ్రంగా వెళ్తుంది, ఇప్పుడు పిల్లలు బాబా సమానంగా అవ్వాలి. అలా సమానంగా అవ్వవలసిందే అది కూడా నిశ్చితం అయి ఉంది ఇప్పుడు కేవలం తీవ్రత కావాలి అంతే. సదా నేను తీవ్ర పురుషార్థ నేనా? అని ప్రతి ఒక్కరు పరిశీలన చేస్కోండి. ఎందుకంటే పురుషార్థంలో పరీక్షలు చాలా వస్తాయి మరియు రావలసిందే కూడా, తీవ్ర పురుషార్థులు ఆ పరీక్షలలో పాస్ అయిపోయినట్లే పాస్ అవ్వటం అనేది నిశ్చితం అయిపోయి ఉంది. పాస్ అవ్వాలి అని కాదు, పాస్ అయిపోవటం నిశ్చితం. సేవ కూడా అందరు చాలా ఆసక్తిగా చేస్తున్నారు కానీ బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - 1. ఇప్పుడు సమయప్రమాణంగా ఒకే సమయంలో మనసా - వాచా - కర్మణా అంటే నడవడిక మరియు ముఖం ద్వారా మూడు రకాలుగా కూడా సేవ జరగాలి. మనస్సు ద్వారా అనుభవం చేయించాలి, వాచా ద్వారా జ్ఞాన ఖజానా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి మరియు నడవడిక లేదా ముఖం ద్వారా సంపూర్ణ యోగి జీవితం యొక్క ప్రత్యక్ష రూపాన్ని అనుభవం చేయించాలి. ఇలా మూడు సేవలు ఒకే సమయంలో చేయాలి. వేర్వేరుగా కాదు. ఎందుకంటే సమయం తక్కువ మరియు చేయవలసిన సేవ ఎక్కువగా ఉంది. బాప్ దాదా చూశారు, సేవకి అన్నింటికంటే సహజ సాధనం - వృత్తి ద్వారా తరంగాలను వ్యాపింపచేయటం మరియు తరంగాల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయటం. ఎందుకంటే వృత్తి అనేది అన్నింటికంటే వేగవంతమైన సాధనం. విజ్ఞాన సాధనమైన రాకెట్ ఎంత వేగంగా వెళ్తుందో అదేవిధంగా మీ యొక్క ఆత్మిక శుభ భావన లేదా శుభ కామన కలిగిన వృత్తి అనేది దృష్టిని మరియు సృష్టిని మార్చేస్తుంది. ఒకే స్థానంలో ఉంటూ కూడా వృత్తి ద్వారా సేవ చేయవచ్చు. వినినటువంటి విషయాన్ని మర్చిపోవచ్చు కానీ వాయుమండలం ద్వారా అనుభవం అయిన అనుభూతిని మర్చిపోలేరు. మధువనం అనగా బ్రహ్మాబాబా యొక్క కర్మభూమి, యోగభూమి, చరిత్ర భూమి కనుక ఆ వాయుమండలాన్ని ఇప్పటి వరకు అనుభవం చేసుకుంటున్నారు కదా, ఆ అనుభవాన్ని మర్చిపోలేరు కదా! వాయుమండలం యొక్క అనుభవం మనస్సులో ముద్ర పడిపోతుంది. వాచా ద్వారా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ప్రతీ ఒక్కరికీ మీ శ్రేష్ఠ ఆత్మిక వృత్తి ద్వారా, తరంగాల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయాలి. కానీ వృత్తి ఆత్మికంగా లేదా శక్తిశాలిగా ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడైతే మీ మనస్సులో ఎవరి పట్ల కూడా వ్యతిరేక వృత్తి యొక్క తరంగాలు ఉండకూడదు. మీ మనస్సు యొక్క వృత్తి సదా స్వచ్చంగా ఉండాలి ఎందుకంటే ఏ ఆత్మ పట్ల అయినా ఏ రకమైన వ్యర్థ వృత్తి లేదా జ్ఞానానికి విరుద్ధమైన అశుద్ద వృత్తి అంటే మనస్సులో చెత్త ఉంటే శుభ వృత్తి ద్వారాసేవ చేయలేరు. కనుక నా మనోవృత్తి శుభంగా, ఆత్మికంగా ఉందా? అని స్వయాన్ని పరిశీలన చేస్కోండి. అశుభ వృత్తి (నెగిటివ్)ని కూడా మీ శుభభావన, శుభకామన ద్వారా అశుద్దాన్ని కూడా శుద్ధంలోకి పరివర్తన చేసుకోగలుగుతున్నారా? ఎందుకంటే అశుభ వృత్తి ద్వారా మీ మనసే అలజడి అవుతుంది కదా! వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి కదా! కనుక నా మనస్సులో ఏ అలజడి లేదు కదా? అని మొదట మిమ్మల్ని మీరు పరిశీలన చేస్కోండి. నెంబరు వారీగా ఉంటారు. మంచివారు ఉన్నారు వారితో పాటు అలజడి వారు కూడా ఉన్నారు. వీరు ఇలాంటి వారు అని అర్థం చేసుకోవటం మంచిదే. తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా అర్థం చేసుకోవాలి కానీ దానిని మనస్సులో ఉంచుకోకూడదు. జ్ఞానవంతులు అవ్వటం, అర్థం చేసుకోవటం మంచిదే. తప్పుని తప్పు అనే అంటారు కదా! కొంతమంది పిల్లలు అంటున్నారు - వీరు ఎలాంటి వారో బాబా నీకు తెలియదు, నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది అంటున్నారు. దానికి బాబా ఒప్పుకుంటున్నారు. వారు అలాంటి వారు అని మీరు చెప్పని క్రితమే బాబాకి తెలుసు కానీ ఇటువంటి విషయాలలో మీ మనస్సులో లేదా వృత్తిలో పెట్టుకోవటం ద్వారా స్వయం అలజడి అవుతారు మరియు చెడు విషయాలు మనస్సులో ఉంటే, వ్యర్థ సంకల్పాలు మనస్సులో ఉంటే విశ్వకళ్యాణకారిగా కాగలరా? మీ అందరి కర్తవ్యం ఏమిటి? మేము లండన్ కళ్యాణకారులం, డిల్లీ కళ్యాణకారులం, ఉత్తరప్రదేశ్ కళ్యాణకారులం అని ఎవరైనా అంటారా? పోనీ దేశానికి కాకపోతే ఎక్కడ ఉంటున్నారో ఆ సెంటర్ యొక్క కళ్యాణకారులా? మేము విశ్వకళ్యాణకారులం అని అందరూ అంటారు కదా! మీరందరు ఎవరు? విశ్వకళ్యాణకారులేనా? అవును అనేవారు చేతులెత్తండి. విశ్వ కళ్యాణకారులు, విశ్వ కళ్యాణకారులే కదా! మంచిది. అయితే మీ మనస్సులో ఏ చెడు విషయాలు లేవు కదా? అర్థం చేసుకోవటం అనేది వేరే విషయం. ఇది తప్పు, ఇది ఒప్పు అని అర్థం చేస్కోండి కానీ మనస్సులో మాత్రం ఉంచుకోకండి. మనస్సులో అదే వృత్తిని ఉంచుకోవటం ద్వారా దృష్టి మరియు సృష్టి కూడా మారిపోతాయి. 

బాప్ దాదా మీకు హోమ్ వర్క్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు? అన్నింటికంటే సహజ పురుషార్థం, అది అందరు చేయగలరు, మాతలు కూడా చేయగలరు, వృద్ధులు కూడా చేయగలరు, యువకులు కూడా చేయగలరు, పిల్లలు కూడా చేయగలరు. ఆ విధి ఏమిటంటే కేవలం ఒకే పని చేయండి ఎవరి సంస్కారంలోకి వచ్చినా ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీస్కోండి. వారు శాపం ఇచ్చినా కానీ మీరు ఆశీర్వాదాలనే ఇవ్వండి. మీరు కోర్సులో ఇతరులకు ఏమి చెప్తారు? అశుభాన్ని శుభంలోకి మార్చుకోమని చెప్తారు కదా! అదేవిధంగా ఆ సమయంలో మీరు కూడా అదే కోర్స్ చేయండి. మీ ప్రతిజ్ఞ ఏమిటి? ప్రకృతిని కూడా తమో నుండి సతోగుణీగా చేసి తీరతాం అని ప్రతిజ్ఞ కదా! ప్రకృతిని కూడా సతో ప్రదానంగా చేస్తాం అనే ప్రతిజ్ఞ మీరందరు కూడా చేశారా? తయారుచేయాలా? చేతులూపండి! ఇతరులను చూసి ఊపకండి, మనస్సుతో ఊపండి. ఎందుకంటే "ఇప్పుడు సమయ ప్రమాణంగా వృత్తి ద్వారా వాయుమండలం తయారుచేసే తీవ్ర పురుషార్థం చేయాలి. వృత్తిలో ఒకవేళ కొద్దిగా అయినా చెత్త ఉంటే వృత్తి ద్వారా వాయుమండలాన్ని ఏవిధంగా తయారుచేయగలరు? ప్రకృతి వరకు వెళ్ళగలిగేవి మీ తరంగాలు కానీ మాటలు కాదు. మాట వెళ్ళదు, తరంగాలు వెళ్తాయి. వృత్తి ద్వారా తరంగాలు తయారవుతాయి మరియు తరంగాల ద్వారా వాయుమండలం తయారవుతుంది. మధువనంలో కూడా అందరూ ఒకేవిధంగా ఉండరు కదా! కానీ బ్రహ్మాబాబా మరియు అనన్య (సాటిలేని) పిల్లల యొక్క వృత్తి ద్వారా, వారి తీవ్ర పురుషార్థం ద్వారా వాయుమండలం తయారయ్యింది. 

ఈ రోజు మీకు దాదీ స్మృతి వస్తున్నారు, దాదీలో ఏ విశేషత చూశారు? ఎలా అదుపు చేసేవారు? ఎప్పుడూ కూడా ఎటువంటి వృత్తి కలిగిన వారి లోపాన్ని దాదీ తన మనస్సులో ఉంచుకున్నారా? అందరికీ ఉల్లాసాన్ని ఇచ్చేవారు. జగదాంబ (మమ్మా) వాయుమండలాన్ని తయారుచేశారు. అన్నీ తెలిసి ఉండి కూడా తన వృత్తిని శుభంగా ఉంచుకునేవారు, ఆ వాయు మండలం యొక్క అనుభవం మీరందరు చేసుకుంటున్నారు. తండ్రిని అనుసరించాలి అనేది సరే కానీ బాప్ దాదా ఎప్పుడూ చెప్తూంటారు - ప్రతీ ఒక్కరి విశేషతను గుర్తించి ఆ విశేషతను స్వయంలో నింపుకోండి అని. ప్రతి ఒక్కరిలోని విశేషతను గమనించాలి, ఎవరైతే బాప్ దాదాకి పిల్లలుగా అయ్యారో వారందరిలో అనగా మూడవ నెంబరు వారు అయినా కానీ వారిలో కూడా డ్రామానుసారం ఏదొక విశేషత లేదా బాప్ దాదా యొక్క వరదానం ఉంటుంది. 99 పొరపాట్లు ఉన్నా కానీ ఒక్క విశేషత తప్పక ఉంటుంది. ఆ విశేషతతోనే నా బాబా అనడానికి హక్కుదారులు అయ్యారు. వారు పరవశులు అయినా కానీ బాప్ దాదాతో తెగిపోనీ ప్రేమ ఉంది. అందువలన ఇప్పుడు సమయం యొక్క సమీపతను అనుసరించి ప్రతి ఒక్క స్థానంలో అనగా గ్రామాల్లోనైనా, పెద్ద జోన్లలో అయినా, సెంటరినైనా కానీ ప్రతీ స్థానంలో, సహయోగులలో శ్రేష్ట వృత్తి యొక్క వాయుమండలం అవసరం. ఎవరైనా మీకు శాపం ఇచ్చినా కానీ తీసుకునేవారు ఎవరు? ఇచ్చేవారు మరియు తీసుకునేవారు ఇద్దరు ఉంటారా లేక ఒకరే ఉంటారా? ఎవరైనా మీకు ఏదైనా చెడు వస్తువు ఇస్తే మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ఉంచుకుంటారా? తిరిగి ఇచ్చేస్తారు లేదంటే పడేస్తారు కదా లేక అల్మారాలో దాచుకుని ఉంచుకుంటారా? మీ హృదయం బాప్ దాదాకి సింహాసనం. కనుక ఒక్క విషయాన్ని మనస్సులో జ్ఞాపకం ఉంచుకోండి, నోట్లో ఉంచుకోవటం కాదు, మనస్సులో ఉంచుకోండి ఆ మాట ఏమిటంటే ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఏ అశుద్ధ విషయాన్ని మనస్సులో ఉంచుకోకండి. ఒక చెవితో విన్నారు మరియు రెండవ చెవితో వదిలేయాలి ఇది మీ పనా లేక ఇతరులదా? అలా వదిలినప్పుడే వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారుచేసే సేవ, విశ్వాత్మలకు తీవ్ర గతితో సేవ చేయగలరు. విశ్వపరివర్తన చేస్తున్నారు కదా! కనుక ఏమి గుర్తు పెట్టుకుంటారా? మనస్సుతో గుర్తు పెట్టుకుంటారా? ఆశీర్వాదం అనే మాటను జ్ఞాపకం ఉంచుకోండి అంతే. ఎందుకంటే మీ జడచిత్రాలు ఏమి ఇస్తాయి? ఆశీర్వాదాలు ఇస్తాయి కదా! మందిరానికి వెళ్ళిన వారు ఏమి అడుగుతారు? ఆశీర్వాదం అడుగుతారు కదా. ఆశీర్వాదాలు లభిస్తేనే కదా ఆశీర్వాదాలు అడుగుతారు. మీ జడచిత్రాలు అంతిమ జన్మలో కూడా ఆశీర్వాదాలను ఇస్తున్నాయి, వృత్తి ద్వారా వారి కోరికలను పూర్తి చేస్తున్నాయి అంటే మీరు ఇలా మాటిమాటికి ఆశీర్వాదాలను ఇచ్చేవారిగా అయ్యారు కనుకనే మీ చిత్రాలు ఇప్పటి వరకు ఆశీర్వాదాలు ఇస్తున్నాయి. క్షమా సాగరుని సంతానం అయిన మీరు పరవశ ఆత్మలను క్షమిస్తే మంచిదే కదా! మీరందరు మాస్టర్ క్షమా సాగరులు కదా! అవునా, కాదా? అవును కదా! మొదట నేను అనండి. దీనిలో అర్జున్ అవ్వండి. ఎవరు మీ ఎదురుగా వచ్చినా కానీ వారు ఎంతో కొంత స్నేహాన్ని లేదా సహయోగాన్ని లేదా క్షమని లేదా ధైర్యాన్ని లేదా ఉత్సాహ ఉల్లాసాలను అనుభవం చేసుకుని వెళ్ళాలి. అలా చేయగలరా? చేయగలరా? మొదటి వరుసలోని వారు చెప్పండి, అలా జరుగుతుందా? చేతులెత్తండి. చేయవలసి ఉంటుంది మరి. మొదటి వరుసలోని వారు, టీచర్స్ అందరూ చేస్తారా? 

మంచిది, ఇప్పుడు ఇక చివరి మిలనానికి 15 రోజులు గడువు ఉంది. మధువనంలో అయితే బాబా సహాయం ఉంటుంది. మీరందరు ఎంతమంది ఉన్నా, ఎక్కడి వారైనా కానీ ఈ 15 రోజులు ఆశీర్వాదాలను ఇచ్చే మరియు తీసుకునే అభ్యాసం చేయండి. సరేనా? ఇది హోమ్ వర్క్ సరేనా? చేస్తారా? మధువనం వారు చేస్తారా, మంచిది. మధువనంలోని వారికి సీట్ మంచిగా లభిస్తుంది. మంచి నీట్ అయితే తీసుకున్నారు, మధువనం వారు తెలివైనవారు. మంచి నీట్ సంపాదించారు. ఇప్పుడు నెంబర్ వన్ సీటు కూడా సంపాదించాలి. ఎందుకంటే మధువన నివాసీగా అవ్వటం భాగ్యానికి గుర్తు. మిగిలిన మీరందరు ఎక్కడి వారు? లండన్, అమెరికా వారా? ఎవరైనా కానీ ఇప్పుడు అందరు మధువననివాసులు కదా! ఈ సమయంలో అయితే మధువనంలోనే ఉన్నారు కదా! ఎంత మంచిది. ఇప్పుడు అందరూ మధువన నివాసీయులే. 15 రోజుల తర్వాత బాప్ దాదా ఫలితం చూస్తారు. సరేనా? వెనుక ఉన్నావారు చెప్పండి, సరేనా? పైన గ్యాలరీలో కూడా కూర్చున్నారు. గ్యాలరీలో కూర్చున్నవారు చెప్పండి, సరేనా? మంచిది. బావుంది, ఇప్పుడు మీరు విశ్వానికి చాలా అవసరం. మీరు నివారణ మూర్తులుగా అయిపోండి. మీరు నివారణ మూర్తులు అవ్వటం ద్వారా ఆత్మలు నిర్వాణంలోకి వెళ్ళగలరు. మీరు నివారణ మూర్తులు కాకపోతే ఆత్మలు నిర్వాణంలోకి వెళ్ళలేవు. నిర్వాణధామం యొక్క ద్వారాన్ని తెరవాల్సింది మీరే. బాబాతో పాటుగా ద్వారాన్ని తెరుస్తారు కదా? ద్వారం తెరిచే మహోత్సవాన్ని జరుపుకుంటారు కదా? ఇప్పుడు పరస్పరం ఆలోచించుకుని తారీఖు నిర్ణయించాలి. బాప్ దాదా మీ మీటింగ్స్ అన్నింటి గురించి వింటారు, స్విచ్ ఆన్ చేయగానే బాబా వినగలరు. అన్ని జోన్ల, అన్ని దేశాల విషయాలను వినాలనుకుంటే ఒకే సమయంలో వినగలరు. ఇప్పుడు బేహద్ లోకి రండి. కొంతమంది పిల్లలు బాగా ఎక్కువ గంభీరంగా ఉంటున్నారు, గంభీరత మంచిదే కానీ ఎక్కువ గంభీరంగా ఉంటే సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తారు. సీరియస్ గా ఉంటే ఎవరికీ ఇష్టం ఉండదు కదా! కనుక గంభీరంగా అవ్వండి కానీ లోపల గంభీరత, పైకి మాత్రం నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉండే ముఖాన్ని అందరూ ఇష్టపడతారు, ఎక్కువగా గంభీరంగా ఉండే వారిని చూసి అందరు భయపడతారు, దూరంగా వెళ్ళిపోతారు, సహయోగులుగా అవ్వరు. బ్రహ్మాబాబా యొక్క చిరునవ్వు, జగదాంబ యొక్క చిరునవ్వు, మీ దాదీ యొక్క చిరునవ్వు మీకు గుర్తు ఉంది కదా! నవ్వుతూ ఉండే దాదీ యొక్క ముఖం డబల్ విదేశీయులకి కూడా ఇష్టం కదా! చేతులూపుతున్నారు. గట్టిగా నవ్వకండి, చిరునవ్వుతో ఉండండి.ఎందుకంటే బాప్ దాదాకి కూడా ఇప్పుడు తీవ్ర పురుషార్ధం కావాలి. ఎందుకు? ఎందుకంటే చాలాకాలం యొక్క సంస్కారం అవసరం. ఒకవేళ అంతిమంలో తీవ్ర పురుషార్థం చేస్తే చాలాకాలంగా జమ అవ్వదు మరియు చాలాకాలం యొక్క జమ అవ్వకపోతే 21 జన్మల చాలాకాలం యొక్క అధికారం కూడా తక్కువ అయిపోతుంది. నా బాబా అనే ఏ ఒక్క బిడ్డకీ కూడా అధికారం తక్కువ కావాలని బాబా అనుకోరు. ఎందుకంటే చివరి బిడ్డ అయినా కానీ, వారు చివరి వారు అని బాప్ దాదాకి తెలిసినా కానీ ఇష్టమే. కఠిన పిల్లలకి కాకుండా మధురాతి మధుర పిల్లలకు ప్రియస్మృతులు అని ఎప్పుడైనా మురళీలో బాబా అన్నారా? మరి బాబా సమానంగా అవ్వాలి కదా! మీ లక్ష్యం ఏమిటి అని అడిగితే చివరి నెంబర్ బిడ్డ కూడా బాబా సమానంగా అవ్వాలి అని అంటారు. దీని గురించి బాబాకి సంతోషంగా ఉంది. లక్ష్యం ఉన్నతంగా పెట్టుకున్నారు కనుక లక్షణాలు కూడా వచ్చేస్తాయి అనుకుంటారు. కనుక చాలాకాలం యొక్క జమను తయారుచేసుకోవాలి, మరలా అంతిమంలో చాలాకాలం గురించి నాకు గుర్తు లేదు అని నిందించకండి. 63 జన్మల చాలాకాలం యొక్క ప్రభావాన్ని ఇప్పటికీ చూస్తున్నారు. అనుకోకపోయినప్పటికీ అయిపోతుంది, ఎందుకు? చాలాకాలం యొక్క ప్రభావం వలన. అందువలన బాప్దాదా ప్రతి ఒక్క ప్రియాతి ప్రియమైన బిడ్డకి తీవ్ర పురుషార్థి భవ! అని చెప్తున్నారు. హోమ్ వర్క్ గుర్తు ఉంచుకోండి, 15 రోజుల తర్వాత ఫలితం అడుగుతాను. 15 రోజులలో సంస్కారం అయిపోతుంది కదా! మరియు ఇక ముందు కూడా ఉంటుంది. ఇక్కడ అయితే వాయుమండలం యొక్క సహయోగం ఉంటుంది కదా! మధువనంలోని వారు తమ తమ విధులలో ఉంటారు, మిగిలిన వారు ఖాళీగా ఉంటారు. అయితే ఏం చేస్తారు? ఏం చేస్తారో దాదీ చెప్పండి. చేసి చూపిస్తారా? చేసి చూపించాలి. మొదట స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోండి అప్పుడు బాబా ప్రత్యక్షం అవుతారు. ఎందుకంటే మీ ద్వారానే జరగాలి కదా! కనుక బాబా అడుగుతున్నారు - మీరు ఎప్పుడు మిమ్మల్ని ప్రత్యక్షం చేసుకుంటారు? మీ ద్వారా బాబా ప్రత్యక్షత జరగనే జరుగుతుంది. ఉల్లాసం ఉందా? ఉల్లాసం ఉంది? ఉల్లాసం ఉందా? ఎవరెవరికి ఎంతెంత ఎక్కువ ఉల్లాసం ఉందో అంతంత పదమా, పదమాపదరెట్లు ముందుగానే శుభాకాంక్షలు బాప్ దాదా ఇస్తున్నారు. మంచిది. అనేక చోట్ల నుండి పిల్లల ఇ-మెయిల్స్ మరియు ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. ఉత్తరం వ్రాయని వారు సంకల్పం చేశారు. వారి యొక్క ప్రియస్మృతులు కూడా బాప్ దాదా దగ్గరకి చేరుకున్నాయి. ఉత్తరాలు చాలా మధురాతి మధురంగా వ్రాస్తారు. ఉత్సాహ ఉల్లాసాలతో ఎగిరిపోతున్నట్లు ఉత్తరాలు వ్రాస్తారు. అయినా కానీ మంచిదే, ఎందుకంటే అలా ఉత్తరం వ్రాయటం ద్వారా స్వయాన్ని బంధించుకుంటున్నారు. ఉత్తరంలో ప్రతిజ్ఞ చేస్తారు కదా! ఇలా నలువైపుల ఎవరు ఎక్కడి నుండి చూస్తున్నా లేదా వింటున్నా కానీ వారందరికీ కూడా ఎదురుగా కూర్చున్నవారికంటే ముందుగా ప్రియస్మృతులు ఇస్తున్నారు. ఎందుకంటే బాప్ దాదాకి తెలుసు, ఒక్కోచోట ఒక్కోటైమ్ అవుతుంది అయినా కానీ అందరు చాలా ఉత్సాహంతో కూర్చున్నారు, స్మృతిలో వింటున్నారు కూడా. మంచిది. అందరు తీవ్ర పురుషార్థం చేసి నెంబర్ వన్ గా అవ్వాల్సిందే అని ప్రతిజ్ఞ చేశారా? చేశారా? చేతులెత్తండి! మంచిది, చేశారా? ఇప్పుడు టీచర్స్ ఎత్తుతున్నారు. మొదటి వరుసలో వారు అయితే సరే. మంచిది.  బాప్ దాదా ఇచ్చే మరో ఆజ్ఞ ఏమిటంటే రోజంతటిలో మధ్యమధ్యలో అయిదు నిమిషాలు లభించినా కానీ మనస్సు యొక్క వ్యాయామం చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరు వ్యాయామం చేస్తున్నారు. కనుక అయిదు నిమిషాలు మనస్సు యొక్క వ్యాయామం చేయండి. పరంధామం నుండి రండి, సూక్ష్మ వతనంలో ఫరిస్తాగా జ్ఞాపకం చేస్కోండి, తిరిగి మరలా పూజ్య రూపాన్ని గుర్తు చేస్కోండి, మరలా బ్రాహ్మణ రూపం మరలా దేవతా రూపం ఇలా గుర్తు చేస్కోండి. మొత్తం ఎన్ని అయ్యాయి? అయిదు. అయిదు నిమిషాలలో ఈ అయిదింటి వ్యాయామం చేయండి. రోజంతటిలో నడుస్తూ తిరుగుతూ కూడా ఈ వ్యాయామం చేయగలరు. దీని కొరకు మైదానం అక్కర్లేదు, పరుగు పెట్టాల్సిన పనిలేదు. కుర్చీ, ఆసనం లేదా యంత్రం అవసరం లేదు. శరీరం యొక్క వ్యాయామం ఎలా అయితే అవసరమో అది చేయండి, దానికి అభ్యంతరం లేదు కానీ మనస్సు యొక్క వ్యాయామం మనస్సుని సదా సంతోషంగా ఉంచుతుంది. ఉత్సాహ ఉల్లాసాలలో ఉంచుతుంది. ఎగిరే కళను అనుభవం చేయిస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ వ్యాయామాన్ని అందరు ప్రారంభించండి. పరంధామం నుండి దేవతారూపం వరకు. మంచిది. 

తమ వృత్తి ద్వారా ఆత్మిక శక్తిశాలి వాయుమండలాన్ని తయారుచేసే నలువైపుల ఉన్న తీవ్ర పురుషార్ధి ఆత్మలకు, సదా తమ స్థానాన్ని మరియు స్థితిని శక్తిశాలి తరంగాలలో అనుభవం చేయించే ధృడ సంకల్పం గల శ్రేష్టాత్మలకు, సదా ఆశీర్వాదాలను ఇచ్చే మరియు తీసుకునే దయాహృదయ ఆత్మలకు, సదా స్వయం ఎగిరేకళను అనుభవం చేసుకునే డబల్ లైట్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments