31-03-2007 అవ్యక్త మురళి

 31-03-2007         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సుపుత్రులై మీ ముఖం ద్వారా బాబాని చూపించాలి, నిర్మాణం (సేవ)తో పాటు నిర్మల మాట, నిర్మాణస్థితి యొక్క సమానతను ఉంచుకోండి.

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల యొక్క భాగ్యరేఖలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలందరి మస్తకంలో కాంతిరేఖ మెరుస్తూ ఉంది. నయనాలలో ఆత్మీయత యొక్క భాగ్యరేఖ కనిపిస్తూ ఉంది. నోటిపై శ్రేష్ట మాట యొక్క భాగ్యరేఖ కనిపిస్తూ ఉంది. పెదవులపై ఆత్మిక చిరునవ్వును చూస్తున్నారు. చేతులలో పరమాత్ముని సర్వ ఖజానాల రేఖ కనిపిస్తూ ఉంది. స్మృతితో వేసే ప్రతి అడుగులో పదమాల రేఖ కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి యొక్క ప్రేమలో లవలీనం అయ్యే రేఖ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ భాగ్యరేఖలను స్వయంగా తండ్రి ప్రతి ఒక్కరికీ శ్రేష్ట కర్మ అనే కలంతో గీశారు. ఎంత శ్రేష్ట భాగ్యం అంటే అవినాశి భాగ్యం, కేవలం ఈ జన్మకే కాదు కానీ అనేక జన్మల కొరకు అవినాశి భాగ్యరేఖలు ఇవి. తండ్రి అవినాశి మరియు భాగ్యరేఖలు కూడా అవినాశి. ఈ సమయంలో చేసే శ్రేష్ట కర్మల ఆధారంగా ఈ రేఖలన్నీ ప్రాప్తిస్తాయి. ఈ సమయంలోని పురుషార్థం అనేక జన్మల ప్రాలబ్దాన్నితయారు చేస్తుంది. . 

బాప్ దాదా పిల్లలందరి యొక్క అనేక జన్మలకు లభించే ఈ సమయంలోని పురుషార్థం యొక్క ప్రాలబ్దాన్నిఇప్పుడే చూడాలనుకుంటు న్నారు. కేవలం భవిష్యత్తు కొరకే కాదు, ఇప్పుడు కూడా ఈ భాగ్యరేఖలన్నీ సదా అనుభవం కావాలి. ఎందుకంటే ఇప్పటి ఈ దివ్య సంస్కారమే మీ యొక్క కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తుంది. కనుక పరిశీలించుకోండి, పరిశీలించుకోవటం వస్తుంది కదా! స్వయానికి స్వయమే పరిశీలకులుగా అవ్వండి. సర్వ భాగ్యరేఖలు ఇప్పుడు కూడా అనుభవం అవుతున్నాయా? ఈ ప్రాలబ్దం అంతిమంలో కనిపిస్తుంది అని అనుకోవటం లేదు కదా? ప్రాప్తించేది ఇప్పుడే అయినప్పుడు అనుభవం కూడా ఇప్పుడే చేసుకోవాలి. భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాలు ఇప్పుడు ప్రత్యక్ష జీవితంలో అనుభవం అవ్వాలి. అయితే ఏమి పరిశీలించుకోవాలి? భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాల గురించి మహిమ చేస్తారు కదా - భవిష్య ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది, ఆ ప్రపంచం గుర్తు ఉంది కదా! కానీ అవే సంస్కారాలు ఇప్పటి జీవితంలో ప్రత్యక్ష రూపంలో ఉన్నాయా? కనుక పరిశీలించుకోండి - ఇప్పుడు కూడా మనస్సులో, బుద్ధిలో, సంబంధ, సంపర్కాలలో జీవితంలో ఒకే రాజ్యం ఉందా? లేక అప్పుడప్పుడు ఆత్మ రాజ్యంతో పాటు మాయారాజ్యం నడవటం లేదు కదా? భవిష్య ప్రాలబ్దంలో ఒకే రాజ్యం ఉంటుంది, రెండు రాజ్యాలు ఉండవు. అదేవిధంగా ఇప్పుడు కూడా రెండు రాజ్యాలు లేవు కదా? భవిష్య రాజ్యంలో ఒకే రాజ్యంతో పాటు ఒకే ధర్మం ఉంటుంది, మరి ఇప్పటి ఆ ఒకే ధర్మం ఏమిటి? సంపూర్ణ పవిత్రత యొక్క ధారణయే మీ ధర్మం. కనుక ఇప్పుడు పరిశీలించుకోండి - పవిత్రత సంపూర్ణంగా ఉందా? స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. పవిత్రత అనగా సంకల్పం, మాట, కర్మ మరియు సంబంధ, సంపర్కాలలో సంపూర్ణ పవిత్రత యొక్క ఒకే ధారణ ఉండాలి. బ్రహ్మాచారులేనా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోవటం వస్తుందా? పరిశీలించుకోవటం వచ్చు అనేవారు చేతులెత్తండి! వస్తుంది మరియు చేసుకుంటున్నారు కూడా. చేస్తున్నారు, చేస్తున్నారా? టీచర్స్ కి వచ్చా? డబల్ విదేశీయులకు వచ్చా? ఎందుకు? ఇప్పటి పవిత్రత కారణంగానే మీ జడ చిత్రాల నుండి కూడా పవిత్రతను అడుగుతారు. పవిత్రత అనే ఒకే ధర్మం ఇప్పుడు స్థాపన అయితేనే భవిష్యత్తులో కూడా ఒకే ధర్మం నడుస్తుంది.. 

భవిష్యత్తు గురించి ఇంకా ఏమి మహిమ చేస్తారు? ఒకే రాజ్యం, ఒకే ధర్మం మరియు సదా సుఖం, శాంతి, సంపద అన్నీ అఖండంగా ఉంటాయి అంటే అఖండ సుఖం, అఖండ శాంతి, అఖండ సంపద. ఇప్పటి మీ స్వరాజ్యంలో ఇవన్నీ ఏవిధంగా ఉంటాయి? ఏదొక సాధనం లేదా సౌకర్యం ఆధారంగా సుఖం అనుభవం అవ్వటం లేదు కదా? ఎప్పుడూ కూడా, ఏ కారణంగానైనా కానీ దు:ఖం యొక్క అల రాకూడదు. పేరు, గౌరవం, ప్రతిష్ఠ ఆధారంగా సుఖం అనుభవం అవ్వటం లేదు కదా? ఎందుకు? ఈ పేరుప్రతిష్టలు, గౌరవమర్యాదలు, సాధనాలు, సౌకర్యాలు వినాశి మరియు అల్పకాలికమైనవి. వినాశి ఆధారం ద్వారా అవినాశి సుఖం లభించదు. కనుక పరిశీలించుకుంటూ నడవండి. ఇప్పుడు కూడా వింటూ మరియు పరిశీలించుకుంటూ ఉండండి. అప్పుడు ఇప్పటి సంస్కారాలలో మరియు భవిష్య సంస్కారాలలో ఎంత తేడా ఉందో మీకే తెలిసిపోతుంది. మీరందరు కూడా జన్మిస్తూనే బాప్ దాదాతో ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ జ్ఞాపకం ఉందా? గుర్తు ఉందా లేక ప్రతిజ్ఞను మర్చిపోయారా? ఉందా గుర్తు? చేతులెత్తండి. వెనుక ఉన్నవారు కూడా ఎత్తుతున్నారు. ఇక్కడ కూడా ఎత్తుతున్నారు. ప్రతిజ్ఞ పక్కాయేనా లేక కొంచెం కదలుతుందా? ఇప్పటి పరమాత్మ సంస్కారాల ఆధారంగానే కొత్త ప్రపంచం తయారవుతుంది. కనుక ఇప్పుడు కేవలం పురుషార్థం చేయటమే కాదు, ఆ పురుషార్థానికి ప్రాలబ్దాన్ని కూడా ఇప్పుడు అనుభవం చేసుకోవాలి. ఇదేవిధంగా సుఖంతో పాటు శాంతిని కూడా పరిశీలించుకోండి - అశాంతి పరిస్థితులు, అశాంతి వాయుమండలంలో శాంతిసాగరుని పిల్లలైన మీరు సదా కమలపుష్ప సమానంగా అశాంతిని శాంతి వాయుమండలంగా పరివర్తన చేయగలుగుతున్నారా? శాంతి వాయుమండలంలో మీరు శాంతిని అనుభవం చేసుకోవటం గొప్ప విషయం కాదు. మీ ప్రతిజ్ఞ ఏమిటంటే అశాంతిని శాంతిలోకి పరివర్తన చేసేవాళ్ళం. కనుక పరిశీలించుకోండి, పరిశీలించుకుంటున్నారు కదా! పరివర్తకులేనా? పరవశులు కాదు కదా? పరివర్తకులు. పరివర్తకులు ఎప్పుడూ పరవశం అవ్వరు. ఇదేవిధంగా సంపద అనగా అఖండ సంపద. స్వరాజ్యాధికారి యొక్క అఖండ సంపద ఏది? జ్ఞానం, గుణాలు మరియు శక్తులు స్వరాజ్యాధికారికి సంపదలు. కనుక పరిశీలించుకోండి - జ్ఞానం యొక్క విస్తారమంతటి సారాన్ని స్పష్టంగా తెలుసుకున్నారు కదా! జ్ఞానం అంటే అర్థం - కేవలం ఉపన్యాసం చెప్పటం, కోర్సు చెప్పటం అని కాదు, జ్ఞానం అనగా తెలివి. ప్రతి సంకల్పం, కర్మ, మాట అన్నీ తెలివిగా అనగా జ్ఞాన స్వరూపులై చేస్తున్నారా? సర్వ గుణాలు ప్రత్యక్ష జీవితంలో కనిపిస్తున్నాయా? అన్నీ ఉన్నాయా లేక శక్తిననుసరించి ఉన్నాయా? అదేవిధంగా సర్వశక్తులు. మీ టైటిల్ - మాస్టర్ సర్వశక్తివాన్, శక్తివాన్ కాదు, సర్వశక్తివాన్ అయితే మరి సర్వశక్తులతో సంపన్నంగా ఉన్నారా? మరో విషయం ఏమిటంటే సర్వ శక్తులు సమయానికి పని చేస్తున్నాయా? సమయానికి హాజరు అవుతున్నాయా లేక సమయం గడిచిపోయిన తర్వాత జ్ఞాపకం వస్తుందా? కనుక మూడు విషయాలు అనగా ఒకే రాజ్యం, ఒకే ధర్మం మరియు అవినాశి సుఖశాంతులు మరియు సంపద. ఎందుకంటే ఇప్పటి స్వరాజ్య సమయంలో ఈ విషయాలను అనుభవం చేసుకోకపోతే భవిష్యత్తులో చేసుకోలేరు. ఇప్పటి నుండే ఈ సంస్కారాలు ప్రత్యక్షంగా ఉంటేనే అనేక జన్మలు ప్రాలబ్ద రూపంలో వస్తాయి. ధారణ చేస్తున్నాం, అయిపోతాం, అంతిమానికి తయారైపోతాం.... అని అనుకోవటం లేదు కదా! బాప్ దాదా ఇంతకుముందే సైగ చేసారు - ఇప్పటి చాలా కాలం యొక్క అభ్యాసమే చాలా కాలం యొక్క ప్రాప్తికి ఆధారం అని. అంతిమంలో తయారైపోతాం అని అనుకోకండి. అయిపోతాం కాదు, అవ్వాల్సిందే. ఎందుకు? స్వరాజ్యాధికారం యొక్క అభ్యాసం చాలా కాలం నుండి కావాలి. కేవలం ఒక జన్మలోనే అధికారి కాలేకపోతున్నారు, ఆధీనం అయిపోతుంటే అనేక జన్మలు అధికారిగా ఏవిధంగా కాగలరు? అందువలన బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలందరికీ మాటి,మాటికి సైగ చేస్తున్నారు - ఇప్పుడు సమయం తీవ్ర వేగంతో ముందుకు వెళ్తుంది. అందువలన పిల్లలందరు ఇప్పుడు కేవలం పురుషార్ధిగా అవ్వటం కాదు, తీవ్రపురుషార్థి అయ్యి పురుషార్థం యొక్క ప్రాలబాన్ని చాలా కాలం నుండి అనుభవం చేసుకోవాలి. తీవ్రపురుషార్థం యొక్క గుర్తులు బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు. తీవ్రపురుషార్థులు సదా మాష్టర్ దాతగా ఉంటారు, తీసుకునే వారిగా ఉండరు. ఇచ్చేటువంటి దేవతగా ఉంటారు. ఇది ఉంటే నా పురుషార్థం ఉంటుంది, వీరు చేస్తే నేను కూడా చేస్తాను, వీరు మారితే నేను కూడా మారతాను, ఇలా వీరు మారాలి, వీరు చేయాలి అనుకోవటం దాత స్థితి యొక్క గుర్తులు కాదు. ఎవరు చేసినా, చేయకపోయినా బాప్ దాదా సమానంగా నేను చేస్తాను అనుకోవాలి. సాకారంలో బ్రహ్మాబాబాను కూడా చూసారు కదా! పిల్లలు చేస్తే నేను చేస్తాను అని ఎప్పుడూ అనలేదు, నేను చేసి పిల్లలచే చేయించాలి అనుకొనేవారు. తీవ్రపురుషార్థుల రెండవ గుర్తు ఏమిటంటే - సదా కర్మ చేస్తూ కూడా నిర్మానంగా ఉంటారు. నిర్మానము మరియు నిర్మాణం రెండింటి సమానత కావాలి. ఎందుకు? నిర్మానం అయ్యి కార్యం చేయిస్తే సర్వుల నుండి మనస్పూర్వక స్నేహం మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి.  

బాప్ దాదా చూసారు - నిర్మాణం అంటే సేవాక్షేత్రంలో అందరు మంచి ఉత్సాహ ఉల్లాసాలతో క్రొత్త, క్రొత్త ప్లాన్స్ తయారుచేస్తున్నారు. దీని కొరకు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాప్ దాదా దగ్గరికి నిర్మాణం యొక్క అనగా సేవ యొక్క చాలా మంచి, మంచి ప్లాన్స్ వచ్చాయి. కానీ బాప్ దాదా ఏమి చూసారంటే నిర్మాణకార్యంలో అయితే చాలా మంచిగా ఉన్నారు కానీ సేవాకార్యంలో ఉత్సాహ, ఉల్లాసాలు ఎంతగా ఉంటాయో అంతగానే నిర్మానస్థితి యొక్క సమానత ఉండాలి, అప్పుడు నిర్మాణం అంటే సేవాకార్యంలో మరింత ఎక్కువ సఫలత ప్రత్యక్ష రూపంలో లభిస్తుంది. బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - నిర్మానస్వభావము, నిర్మానమాట మరియు నిర్మానస్థితితో సంబంధ, సంపర్కాలలోకి రావాలి. దేవతల గురించి మహిమ చేస్తారు. వారి నోటి నుండి వచ్చే మాటలు వజ్రాలు, ముత్యాలు వంటి అమూల్యమైనవి అని కానీ ఇది బ్రాహ్మణుల మహిమ. నిర్మలమాట, నిర్మలస్వభావం ఉండాలి. ఇది ఈ సీజన్ యొక్క అంతిమ మిలనం. కనుక ఫలితం వినిపించాలి కదా! కనుక బాప్ దాదా చూసిందేమిటంటే - నిర్మల మాట, నిర్మాన స్థితిపై ఇప్పుడు ధ్యాస పెట్టాలి. 

బాప్ దాదా మూడు ఖజానాల యొక్క ఖాతాను జమ చేసుకోమని గతంలో చెప్పారు. మరయితే ఫలితంలో ఏమి చూసారు? అసలు ఆ మూడు ఖాతాలు ఏవి? గుర్తుండి ఉంటాయి కదా? అయినా కానీ మరలా రివైజ్ చేస్తున్నారు-1. మీ పురుషార్థం యొక్క జమాఖాతా. 2.సదా స్వయం సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులను కూడా సంతుష్టం చేయాలి. రకరకాల సంస్కారాల గురించి తెలిసినా కానీ సంతుష్టంగా ఉంటారు మరియు సంతుష్టం చేయాలి, దీని ద్వారా ఆశీర్వాదాల యొక్క ఖాతా జమ అవుతుంది. ఒకవేళ ఏ కారణంగా అయినా సంతుష్టం చేయటంలో లోటు ఉండిపోతే పుణ్యఖాతా జమ అవ్వదు. పుణ్యానికి తాళంచెవి - సంతుష్టత. సంతుష్ఠంగా ఉండటమైనా మరియు చేయటమైనా. సేవలో కూడా సదా నిస్వార్థంగా ఉండాలి, నేను అనే భావన ఉండకూడదు. నేను చేసాను, లేదా నాదిగా ఉండాలి, ఇలా నేను మరియు నాది అనేవి సేవలో వస్తే పుణ్యఖాతా జమ అవ్వదు. నాది అనే భావనలో చాలా సూక్ష్మరూపం ఉంటుంది అనుభవీలే కదా? సూక్ష్మరూపంలో నాది అనే భావన యొక్క జాబితా, సాధారణ నాది అనే భావన యొక్క జాబితా కంటే పెద్దది. కనుక ఎక్కడైనా కానీ నేను మరియు నాది అనే స్వార్థం ఉంటే నిస్వార్ధంగా లేకపోతే అక్కడ పుణ్యఖాతా తక్కువ జమ అవుతుంది. నాది అనే భావం యొక్క జాబితా మరలా ఎప్పుడైనా చెప్తాను. ఆ జాబితా చాలా పెద్దది మరియు చాలా సూక్ష్మమైనది. బాప్ దాదా చూసారు - అందరు తమ, తమ శక్తిననుసరించి పురుషార్థం ద్వారా ఖాతాను జమ చేసుకుంటున్నారు కానీ ఆశీర్వాదాల ఖాతా మరియు పుణ్యఖాతాను ఇప్పుడు నింపుకోవలసిన అవసరం ఉంది. అందువలన మూడు ఖాతాలు జమ చేసుకోవటంలో ధ్యాస పెట్టాలి. రకరకాల సంస్కారాలు ఇప్పుడు కూడా కనిపిస్తాయి, ఎందుకంటే ఇప్పుడింకా అందరి సంస్కారాలు సంపన్నం కాలేదు కనుక. కానీ ఇతరుల బలహీన స్వభావము, బలహీన సంస్కారాల యొక్క ప్రభావం మనపై పడకూడదు. ఈ బలహీన సంస్కారాలు శక్తివంతమైనవి కావు, నేను మాష్టర్ సర్వశక్తివాన్ని, మాష్టర్ సర్వశక్తివాన్ అయిన నా పై ఈ బలహీన సంస్కారాల యొక్క ప్రభావం పడకూడదు అని అనుకోవాలి. రక్షణకి సాధనం - బాప్ దాదా యొక్క ఛత్రఛాయలో ఉండటం, బాప్ దాదాతో కంబైండ్ గా ఉండటం. శ్రీమతమే ఛత్రఛాయ. 

ఇప్పుడు ఈ సీజన్ యొక్క అంతిమ మిలనం. సమయానుసారంగా మరలా సీజన్ ప్రారంభం అవుతంది కానీ మిలనం యొక్క క్రొత్త సీజన్ ఏవిధంగా అయితే ప్రారంభం అవుతందో దానిలో ఏమి నవీనత చూపిస్తారు? మీ కోసం ఏదైనా క్రొత్త ప్లాన్ తయారుచేసుకున్నారా? సేవ కోసం క్రొత్త, క్రొత్త ప్లాన్స్ అలోచిస్తారు కదా! అదేవిధంగా స్వయం గురించి పాత వాటి కంటే నవీనంగా ఏమి ఆలోచించారు? ఒకవేళ ప్లాన్ ఏమీ ఆలోచించకపోతే బాప్ దాదా మీకు సైగ చేస్తున్నారు - ప్రతి ఒక్కరు స్వయం కొరకు సంకల్పం, మాట, సంబంధ, సంపర్కాలు, కర్మలో నవీనత తీసుకువచ్చే ప్లాన్ తయారు చేసుకోవలసిందే. ఏమి నవీనత తీసుకువచ్చారో బాప్ దాదా ముందుగా ఫలితం చూస్తారు. ధృడ సంకల్పంతో పాత సంస్కారాలను పరివర్తన చేసుకున్నారా? అనే ఫలితాన్ని బాప్ దాదా ముందుగా చూస్తారు. ఏమి ఆలోచిస్తున్నారు? అలా చేస్తారా? చేస్తారా? చేస్తాము అనేవారు చేతులు ఎత్తండి? చేస్తారా? మంచిది. చేస్తారా లేక ఇతరులను చూస్తారా? ఏం చేస్తారు? ఇతరులను చూడకండి, బాప్ దాదాని చూడండి. మీ పెద్ద దాదీని చూడండి. ఎంత అతీత మరియు ప్రియమైనస్థితియో చూడండి. ఒకవేళ ఎవరినైనా నేను మరియు హద్దులోని నాది అనే భావం నుండి అతీతంగా చూడాలనుకుంటే బాప్ దాదా యొక్క హృదయసింహాసనాధికారి దాదీని చూడండి. జీవితమంతటిలో హద్దులోని నాది, నేను అనే భావన నుండి అతీతంగా ఉన్నారు. దానికి ఫలితంగా ఎంత పెద్ద వ్యాధి అయినా కానీ దు:ఖము మరియు బాధ నుండి అతీతంగా ఉన్నారు. దాదీ ఏమైనా బాధగా ఉందా? ఏమైనా అనిపిస్తుందా? అని ఎవరు ఎంతగా అడిగినా కానీ ఏమి సమాధానం లభించింది? ఏమీ లేదు అనేవారు. ఎందుకంటే నిస్వార్ధక మరియు విశాలహృదయం సర్వులను ఇముడ్చుకునేవారు. సర్వులకి ప్రియమైనవారు కనుక ప్రత్యక్ష గుర్తులు చూస్తున్నారు. బ్రహ్మాబాబా గురించి చెప్తే ఆయనలో బాబా ఉండేవారు కదా అంటారు కానీ దాదీ మీతో పాటే ప్రభు పాలనలో ఉన్నారు, చదువుకున్నారు, సేవలో మీ వెంటే ఉన్నారు. ఇలా ఒకరు నిస్వార్థంగా కాగలిగినప్పుడు మీరందరు కాలేరా? కాగలరు కదా? అయ్యేవారు మీరే అని బాప్ దాదాకి నిశ్చయం ఉంది ఎన్ని సార్లు అయ్యారు? గుర్తుందా? అనేక కల్పాలు బాబా సమానంగా అయ్యారు మరియు ఇప్పుడు కూడా మీరే అవుతారు. ఇదే ఉల్లాసంలో, ఉత్సాహంలో ఎగురుతూ ఉండండి. బాబాకి మీపై నిశ్చయం ఉన్నప్పుడు మీరు కూడా మీపై సదా నిశ్చయబుద్దిగా ఉండాలి. తయారవ్వాల్సిందే అనే నిశ్చయబుద్దిగా అయ్యి ఎగురుతూ వెళ్ళండి. బాబాపై ప్రేమ 100% కంటే ఎక్కువ ఉంది అంటారు కదా! అది నిజమేనా? ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో లేదా తమతమ స్థానాలలో ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో వారందరు కూడా మీకు బాబాపై 100% ప్రేమ ఉంది అని భావిస్తున్నారా? ఉన్నవారు చేతులు ఎత్తండి? 100% ఉందా? (అందరు ఎత్తారు) మంచిది. వెనుక ఉన్నవారు చేతులు బాగా ఎత్తండి. చేతులు ఊపండి. దీనిలో అందరు చేతులు ఎత్తారు. అయితే ప్రేమకు గుర్తు - సమానంగా అవ్వటం. ఎవరితో ప్రేమ ఉంటుందో వారి వలె మాట్లాడటం, నడవటం, సంబంధ, సంపర్కాలు నిలుపుకోవటమే ప్రేమకు గుర్తు. తర్వాత సీజన్లో అందరి ముఖాలలో బాప్ దాదా యొక్క ముఖం కనిపించాలి. ప్రతి ఒక్కరి సంబంధ, సంపర్కాలలో బాబా సమాన సంస్కారాలు కనిపించాలి. స్వయాన్ని పరివర్తన చేసుకోవటమే స్నేహానికి బదులు ఇవ్వటం. మీ అందరి ఒకే సంకల్పం యొక్క వృత్తి, యోగశక్తి దాదీ ఆరోగ్యాన్ని పరివర్తన చేసింది కదా! శాంతిశక్తి ద్వారా ఏకమతంగా ఒకే వృత్తి అనే విధి ప్రత్యక్ష ఫలాన్ని చూపించింది. దీని కొరకు అందరికీ శుభాకాంక్షలు. చప్పట్లు కొట్లండి ఫర్వాలేదు. ధృడసంకల్పం, సంఘటనాశక్తి, స్మృతి శక్తి ద్వారా ఒక విషయాన్ని ప్రత్యక్ష రుజువుగా చూసారు. అదేవిధంగా ఇక ముందు స్వ పరివర్తన కొరకు మిమ్మల్ని మీరు చూసుకోవాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఒకవేళ వంగవలసివస్తే వంగాలే కానీ పరివర్తన నుండి స్వయం తొలగిపోకూడదు. ఇలా ధృడ సంకల్పం చేసి ప్రతి ఒక్కరికీ ఉదాహరణ అవ్వాలి. ఎందుకంటే అందరు సుపుత్రులు కదా! ప్రత్యక్ష ఉదాహరణ ఇవ్వటమే సుపుత్రుల పని. 

15 రోజుల కొరకు బాప్ దాదా హోమ్ వర్క్ ఇచ్చారు, ఒక విషయం గురించి హోమ్ వర్క్ ఇచ్చారు గుర్తుందా? సంకల్పంలో లేదా స్వప్నంలో కూడా దు:ఖం తీసుకోకుండా, దు:ఖం ఇవ్వకుండా ఉన్నవారు చేతులు ఎత్తండి? లేచి నిల్చోండి. కొందరు పాస్ మార్కులు పొందారు. కొన్ని మార్కులు కాదు, పాస్ మార్కులు తీసుకున్నవారు నిల్చోండి! మొదటి వరసలో వారు తీసుకోలేదా? మొదటి లైన్ లో వారు ఎందుకు నిల్చోవటంలేదు? చేస్తే నిల్చోండి. దు:ఖం ఇవ్వకపోతే నిల్చోండి. స్వప్నంలో, సంకల్పంలో కూడా ఇవ్వకూడదు. వీరి కోసం చప్పట్లు కొట్టండి. డబల్ విదేశీయులు కూడా చేతులు ఎత్తారు. మంచిది. మంచిది. ఇదేవిధంగా అమరంగా ఉంటారు కదా! అమరభవ! అనే వరదానాన్ని గుర్తుంచుకోండి. 

ఇప్పుడు బాప్ దాదా చెప్పిన వ్యాయామం గుర్తు ఉంది కదా? రోజంతటిలో 5-5 నిమిషాలు అనేకసార్లు వ్యాయామం చేయాలి. చేశారా? వ్యాయామం చేసిన వారు చేతులెత్తండి. కొద్దిమందే చేతులెత్తారు. ఎందుకు? కొద్ది సమయమే చేశారు. ఎక్కువ సమయం చేయలేదా? అయితే ఇప్పుడేమి చేస్తారు? తక్కువలో తక్కువగా చెప్పనా, తక్కువలో తక్కువ కనీసం 8 సార్లు అయినా రోజంతటిలో చేయగలరా? చేయగలరా? చేతులెత్తండి. చేస్తారా? చేస్తారా? మరలా సీజన్ మొదలైనప్పుడు బాప్ దాదా ఫలితాన్ని అడుగుతారు. ఆ తర్వాత ఒక విషయం చెప్తాను, ఇప్పుడు చెప్పను. తర్వాత చెప్తాను. మధువనం వారు చేస్తారు కదా? మొదటి నెంబరు. ఈ సంవత్సరం లేదా ఈ సీజన్ నుండి మరలా సీజన్ వరకు చేయవలసిన హోమ్ వర్క్ ఏమిటంటే తక్కువలో తక్కువ 8 సార్లు అయినా ఈ వ్యాయామాన్ని తప్పక చేయాలి. తప్పక చేయాలి, చూస్తాం అనకండి, చేయాల్సిందే. ఒకసారి మిస్ అయినా కానీ తర్వాత గంటలో అనేకసార్లు చేసి దానిని పూర్తి చేయాలి, ఆ తర్వాత నిద్రపోవాలి. నిద్రపోవాల్సింది తర్వాత. 8 సార్లు పూర్తి చేసి ఆ తర్వాత నిద్రపోవాలి. సరేనా టీచర్స్? విసనకర్రలు పట్టుకున్నారు, వేడిగా ఉందా? చాలామంచిది, టీచర్స్ యొక్క వాయుమండలం అంతటా స్వతహాగానే వ్యాపిస్తుంది. ఈరోజు బాప్ దాదా అందరినీ చూడాలనుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే చూడాలనుకుంటున్నారు, కనుక ఇప్పుడు ఒక్క సెకనులో కంట్రోలింగ్ పవర్ మరియు రూలింగ్ పవర్ యొక్క సంస్కారాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చి స్వరాజ్య సింహాసనంపై కూర్చోండి. రెండు మూడు నిముషాల కొరకు ఒక్క సెకనులో రాజ్యాధికారి స్థితిలో స్థితులైపోకండి. మంచిది. 

నలువైపుల ఉన్న పిల్లల యొక్క ప్రియస్మృతుల ఉత్తరాలు మరియు వెనువెంట విజ్ఞాన సాధనాల ద్వారా పంపిన ప్రియస్మృతులు బాప్ దాదాకి చేరుకున్నాయి. చాలామంది పిల్లలు తమ మనస్సు యొక్క సమాచారాన్ని కూడా వ్రాస్తున్నారు మరియు ఆత్మిక సంభాషణలో కూడా చెప్తున్నారు. బాప్ దాదా అటువంటి పిల్లలందరికీ బదులు ఇస్తున్నారు - సత్యమైన మనస్సుకి యజమాని రాజీ. మనస్సుకి బాగా ప్రియమైన అటువంటి విశేష ఆత్మల కొరకు మనస్ఫూర్వక ఆశీర్వాదాలు. నలువైపుల ఉన్న వారు సమాచారం అంతా ఇస్తున్నారు, వారందరికీ, అందరు చాలా మంచి ఉత్సాహ ఉల్లాసాలతో ప్లాన్స్ ఎవరైతే తయారుచేశారో వారందరికి బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉండండి అని వరదానం ఇస్తున్నారు. 

నలువైపుల ఉన్న బాప్ దాదా యొక్క కోట్లలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కొద్దిమంది అయిన శ్రేష్ట భాగ్యవాన్ పిల్లలకు బాప్ దాదా యొక్క విశేష ప్రియస్మృతులు. పిల్లలందరి ధైర్యం మరియు ఉత్సాహ ఉల్లాసాలకు శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఇక ముందు తీవ్ర పురుషార్ధిగా అయ్యే, సమానత ఉంచుకునేటందుకు కోటానుకోట్ల, కోటానుకోట్ల రెట్లు ఆశీర్వాదాలను కూడా ఇస్తున్నారు. అందరి భాగ్యసితార సదా మెరుస్తూ ఉండాలి మరియు ఇతరుల భాగ్యాన్ని తయారుచేస్తూ ఉండాలి అని ఆశీర్వదిస్తున్నారు. నలువైపుల ఉన్న పిల్లలు తమ తమ స్థానాలలో వింటున్నారు మరియు చూస్తున్నారు కూడా. ఆవిధంగా దూరంగా కూర్చున్న పిల్లలందరిని బాప్ దాదా చూసి సంతోషిస్తు న్నారు. చూస్తూ ఉండండి మరియు మధువనం యొక్క శోభను సదా పెంచండి. పిల్లలందరికీ మనస్పూర్వక ఆశీర్వాదాలతో పాటు నమస్తే. 

Comments