30-11-2004 అవ్యక్త మురళి

    30-11-2004         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఇప్పుడు మీ నడవడిక మరియు ముఖం ద్వారా బ్రహ్మాబాబా సమానంగా అవ్యక్త రూపాన్ని చూపించండి, సాక్షాత్కా రమూర్తిగా అవ్వండి.

ఈరోజు భాగ్య విధాత బాబా నలువైపుల ఉన్నటువంటి తన యొక్క శ్రేష్టభాగ్యవంతులైన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. కల్పం మొత్తంలో ఇటువంటి శ్రేష్టభాగ్యం ఎవరికీ ఉండదు. కల్పకల్పం పిల్లలైన మీరే ఈ భాగ్యం యొక్క అధికారాన్ని పొందుతారు. కల్పకల్పం పొందిన భాగ్యం యొక్క అధికారం స్మృతి ఉందా? ఈ భాగ్యం సర్వ శ్రేష్టభాగ్యం ఎందువలన? ఎందుకంటే స్వయం భాగ్య విధాత ఈ శ్రేష్ట భాగ్యవంతమైన దివ్యజన్మ పిల్లలైన మీకు ఇచ్చారు. జన్మయే భాగ్యవిధాత ద్వారా లభించింది అంటే దాని కంటే శ్రేష్ట భాగ్యం మరేదీ ఉండదు. మీ భాగ్యం యొక్క నషా స్మృతిలో ఉంటుందా? మీ భాగ్యం యొక్క లిస్ట్ తీస్తే ఎంత పెద్దది ఉంటుంది? భాగ్యవంతమైన మీ బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి వస్తువనేది ఏదీ లేదు. భాగ్యం యొక్క లిస్ట్ మీ అందరి మనస్సులో స్మృతిలోకి వచ్చింది కదా! స్మృతిలోకి తెచ్చుకోండి, వచ్చిందా స్మృతి? మనస్సులో ఏ పాట పాడుతున్నారు? ఓహో భాగ్య విధాత! మరియు ఓహో నాభాగ్యం!! అని. ఈ శ్రేష్ఠభాగ్యం యొక్క విశేషత ఏమిటంటే - ఒకే భగవంతుని ద్వారా మూడు సంబంధాలు ప్రాప్తిస్తున్నాయి. ఒకని ద్వారా ఒకనిలో మూడు సంబంధాలు, జీవితంలో ఏవైతే విశేష సంబంధాల యొక్క మహిమ ఉందో - తండ్రి, శిక్షకుడు, సద్గురువు ఇలా ఎవరికీ ఒకని ద్వారా విశేష సంబంధాలు మరియు ప్రాప్తి ఉండదు. మీరు నిశ్చయంతో చెప్తున్నారు - మాకు బాబా తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అని. బాబా ద్వారా సర్వఖజానాల యొక్క భండారా లభించింది. ఖజానాల యొక్క లిస్ట్ కూడా స్మృతిలోకి వచ్చింది కదా! బాబా ద్వారా ఏమేమి ఖజానాలు లభించాయో స్మృతిలోకి తెచ్చుకోండి. లభించినవా లేక లభించాలా? ఏమంటారు? పిల్లల నుండి యజమానులు కదా! శిక్షకుని ద్వారా లభించిన శిక్షణ ద్వారా శ్రేష్ఠ పదవి యొక్క ప్రాప్తి లభించింది. ప్రపంచంలో కూడా రాజ్యపదవిని అన్నింటికంటే ఉన్నతమైన పదవి అనే మహిమ ఉంది. మీరైతే డబల్ రాజులుగా అయిపోయారు. వర్తమానంలో స్వరాజ్యాధికారి మరియు భవిష్యత్తులో అనేక జన్మల రాజ్యపదవికి అధికారిగా అయ్యారు. చదువు ఒక జన్మయే, అది కూడా చిన్న జన్మ కానీ పదవి యొక్క ప్రాప్తి అనేక జన్మలు మరియు రాజ్యం కూడా అఖండంగా, నిశ్చలంగా, నిర్విఘ్న రాజ్యం ఉంటుంది. ఇప్పుడు కూడా స్వరాజ్యాధికారి నిశ్చింతాచక్రవర్తులు కదా? అవునా? నిశ్చింతా చక్రవర్తులుగా అయ్యారా? ఎవరు నిశ్చింతగా ఉన్నారో వారు చేతులు ఎత్తండి? నిశ్చింతగా ఉన్నారా, కొద్దిగా కూడా చింత లేదా? మాయ యొక్క బొమ్మలాట ఎదురుగా వస్తే చింత వస్తుందా? మాయ యొక్క బొమ్మలాట ఎదురుగా వస్తుందా లేక లేదా? కొద్దికొద్దిగా చింత ఉంటుందా? కొద్దిగా చింత, చింతన నడుస్తుందా లేక నడవటం లేదా? శ్రేష్ట భాగ్యం ఇప్పటి నుండి నిశ్చింత చక్రవర్తిగా తయారుచేస్తుంది. ఇప్పుడు వచ్చే చిన్న చిన్న విషయాలు ఇక ముందు కొరకు అనుభవిగా, పరిపక్వంగా తయారుచేస్తాయి. 

ఇప్పుడైతే ఈ రకరకాల విషయాల యొక్క అనుభవీగా అయిపోయారు కదా! భయపడటం లేదు కదా? సాక్షిస్థితి అనే సింహాసనంపై విశ్రాంతిగా కూర్చుని పపెట్ షో, కార్టూన్ షో (బొమ్మలాట) చూడండి. అవేమీ కావు, బొమ్మలు అంతే. ఇప్పుడైతే గట్టిగా అయిపోయారు కదా? గట్టిగా అయ్యారు లేక అప్పుడప్పుడు భయపడుతున్నారా? మాయ కాగితపుపులి వలె వస్తుంది. పులిలా వస్తుంది కానీ కాగితం పులి. ఇప్పుడు సమయప్రమాణంగా అనుభవీ మూర్తిగా అయ్యి సమయానికి, ప్రకృతికి, మాయకి ప్రతిజ్ఞ చేయండి రండి! మేము విజయీలం అని స్వాగతం చెప్పండి. విజయం యొక్క ప్రతిజ్ఞ చేయండి. (మధ్య మధ్యలో దాదీకి దగ్గు వస్తుంది) ఈరోజు వాయిద్య పరికరం కొద్దిగా బాలేదు. (దాదీ ఆరోగ్యం సరిగా లేదు) కానీ కలుసుకోవాలి కదా! 

బాప్ దాదా దగ్గరికి రెండు గ్రూపుల వారు ఎక్కువగా వస్తున్నారు. ఎందువలన? మేము తయారుగా ఉన్నాం అని రెండు గ్రూప్లు బాప్ దాదాకి చెప్తున్నాయి. 1.సమయం, ప్రకృతి మరియు మాయ. మాయకి కూడా ఇప్పుడు నా రాజ్యం సమాప్తి అయిపోతుంది అని అర్థమైపోయింది. మరియు రెండవ గ్రూప్ - ఎడ్వాన్స్ పార్టీ. రెండు గ్రూపుల వారు డేట్ అడుగుతున్నారు. విదేశాలలో అయితే ఒక సంవత్సరం ముందుగానే డేట్ ఫిక్స్ చేసుకుంటారు కదా? ఇక్కడ 6 నెలలు ముందా? భారతదేశంలో వేగంగా ఉంటారు, 15 రోజులలో ఏ ప్రోగ్రామ్ కి అయినా డేట్ నిర్ణయం అయిపోతుంది. అలాగే సమాప్తి, సంపన్నత మరియు బాబా సమానత యొక్క డేట్ ఏమిటి? అని వారు బాప్ దాదాని అడుగుతున్నారు. ఈ డేట్ బ్రాహ్మణులైన మీరే పిల్లలైన నిర్ణయించాలి. చేయగలరా? తారీఖు నిర్ణయించగలరా? పాండువులు చెప్పండి, ముగ్గురు చెప్పండి. (నిర్వైర్ భాయ్, రమేష్ భాయ్, భృజమోహన్ భాయ్ ని అడుగుతున్నారు) తారీఖు నిర్ణయించగలరా? చెప్పండి? లేక అకస్మాత్తుగా జరుగుతుందా? డ్రామాలో నిర్ణయం అయి ఉంది కానీ దానిని ప్రత్యక్షంలోకి తీసుకురావాలా లేక వద్దా? అది ఏమిటి? చెప్పండి. నిర్ణయం అవుతుందా, అకస్మాత్తుగా జరుగుతుందా? డేట్ ఫిక్స్ అవ్వదా? అవుతుందా? మొదటి లైన్ లో ఉన్నవారు చెప్పండి? డ్రామాని ప్రత్యక్షంలోకి తీసుకురావాలంటే మనస్సులో తారీఖు యొక్క సంకల్పం చేయాలి అని అనేవారు చేతులు ఎత్తండి! చేయాలా? వీరు చేతులెత్తటం లేదు. అకస్మాత్తుగా జరుగుతుంది నిజమే కానీ మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడానికి లక్ష్యం తప్పకుండా పెట్టుకోవాలి. లక్ష్యం లేకపోతే నంపన్నంగా అవ్వటంలో సోమరితనం వచ్చేస్తుంది. మీరు కూడా చూడండి డేట్ నిర్ణయించుకున్నప్పుడే సఫలత లభిస్తుంది కదా! ఏ ప్రోగ్రామ్ కైనా డేట్ నిర్ణయిస్తారు కదా? తయారవ్వాల్సిందే అనే సంకల్పం అయితే చేయాలి కదా! లేక డ్రామానుసారం స్వతహాగానే అయిపోతుందా? ఏమనుకుంటున్నారు? మొదటి లైనులో వారు చెప్పండి. చేయాల్సి ఉంటుంది, చేయాల్సి ఉంటుంది. జయంతి (అక్కయ్య) చెప్పండి. చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు అవుతుంది? సమయం వచ్చినప్పుడు అంతిమంలో జరిగిపోతుందా? సమయం మిమ్మల్ని సంపన్నంగా చేస్తుందా లేక మీరు సమయాన్ని సమీపంగా తీసుకువస్తారా? 

బాప్ దాదా చూసారు స్మృతిలో జ్ఞానం కూడా ఉంటుంది, నషా కూడా ఉంటుంది, నిశ్చయం కూడా ఉంటుంది కానీ ఇప్పుడు నడవడిక మరియు ముఖం ద్వారా కనిపించాలి. ఇది కలవాలి. బుద్దిలో అన్నీ జ్ఞాపకం ఉంటున్నాయి, స్మృతిలోకి కూడా వస్తున్నాయి కానీ ఇప్పుడు స్వరూపంలో రావాలి. సాధారణ ప్రజలలో కూడా ఒకవేళ ఎవరైనా గొప్పవృత్తిలో ఉన్నవారు లేదా ధనవంతుల పిల్లలు, చదువుకున్నవారు ఉంటే వారి నడవడిక ద్వారా మీరు ఎవరో గొప్పవారు అని తెలుస్తుంది కదా! వారిలో ఏదో అతీత స్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మీ వారసత్వం, చదువు మరియు పదవి కూడా ఉన్నతమైనవి. స్వరాజ్యం అయితే ఇప్పుడు కూడా ఉంది కదా! సర్వప్రాప్తులు ఉన్నాయి. కానీ మీ నడవడిక మరియు ముఖం ద్వారా భాగ్యసితార మస్తకంలో మెరుస్తూ కనిపించాలి. ఇప్పుడు ఇది కలవాలి. ఇప్పుడు ప్రజలకు శ్రేష్టభాగ్యవాన్ మీ ద్వారా వీరు మా యొక్క ఇష్టదేవీ, ఇష్ట దేవతలు అని, వీరు మా వారు అని అనుభవం అవ్వాలి. అవ్వాలి కూడా కాదు, అవుతుంది. బ్రహ్మాబాబాని చూసారు కదా - సాధారణ తనువులో ఉంటూ కూడా అది సమయంలో బ్రహ్మాబాబాలో ఏ రూపం కనిపించేది? కృష్ణుడు కనిపించేవారు కదా! కనిపించేవారు కదా! ఆదిలో బ్రహ్మాబాబా ద్వారా ఆదిలో ఉన్నవారికి అనుభవం అయ్యింది కదా! అనుభవం అయ్యేది. ఇక అంతిమంలో ఏమి కనిపించేది? అవ్యక్తరూపం కనిపించేది కదా! నడవడికలో, ముఖంలో అవ్యక్తరూపం కనిపించేది కదా! కనిపించిందా? ఇప్పుడు బాప్ దాదా విశేషంగా నిమిత్తమైన పిల్లలకు ఇదే హోమ్ వర్క్ ఇస్తున్నారు - ఇప్పుడు బ్రహ్మాబాబా సమానంగా మీ అవ్యక్తరూపం కనిపించాలి. నడవడిక మరియు ముఖం ద్వారా తక్కువలో తక్కువ 108 మాలలో పూస వలె కనిపించాలి. 

బాప్ దాదా 108 మాలలోని వారు ఎవరెవరు అని పేర్లు కావాలనుకోవటం లేదు, పేర్లు చెప్పటం లేదు, కానీ వారి నడవడిక మరియు ముఖం స్వతహాగానే ప్రత్యక్షం అవుతుంది. విశేషంగా నిమిత్తమైన పిల్లలకు బాప్ దాదా ఈ హోమ్ వర్క్ ఇస్తున్నారు. విన్నారా, మొదటి లైన్ కూర్చున్నవారు అందరు విన్నారా? చేయగలరా? ఎంత సమయం కావాలి? మేము వెనుక వచ్చాము, అని అనుకోకండి. ఇది సమయం యొక్క విషయం కాదు. మేము వచ్చి కొన్ని సంవత్సరాలే అయ్యింది అని అనుకుంటున్నారు. ఎవరైనా చివరలో వచ్చినా కానీ తీవ్రంగా వెళ్ళి మొదటికి రావచ్చు. (లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్) ఇది బాప్ దాదా యొక్క ప్రతిజ్ఞ. చేయగలరా? ఎవరైనా చేయవచ్చు. చివరలో వచ్చినవారు కూడా చేయవచ్చు, చేయాల్సిందే మరియు తయారవ్వాల్సిందే అని లక్ష్యాన్ని పక్కాగా ఉంచుకోండి. 

డబల్ విదేశీయులు చేతులు ఎత్తండి! డబల్ విదేశీయులు ఏమి చేస్తారు? డబల్ ఛాన్స్ తీసుకుంటారు కదా! బాప్ దాదా పేరు ప్రకటించరు కానీ వారి ముఖం చెప్తుంది. ధైర్యం ఉందా? మొదటి లైన్ వారిని బాప్ దాదా చూస్తున్నారు. ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే చేతులు ఎత్తండి! వెనుక ఉన్న వారు కూడా ఎత్తవచ్చు. ఎవరు చేస్తే వారే అర్జునులు. ఎవరెవరు ఏమేమి పురుషార్థం చేస్తున్నారు అనేది బాప్ దాదా చూస్తారు. దీని కొరకు బాప్ దాదా 6 నెలలు సమయం ఇస్తున్నారు. 6 నెలల ఫలితం చూస్తాను, అప్పుడు ఫైనల్ చేస్తాను, సరేనా? ఎందుకంటే ఇప్పుడు సమయం యొక్క వేగం తీవ్రంగా వెళ్ళిపోతుంది, రచన వేగంగా వెళ్ళకూడదు. రచయిత వేగంగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా వేగాన్ని తీవ్రం చేయండి, ఇప్పుడు అందరూ ఎగరండి. నడుస్తున్నాము కాదు, ఎగురుతున్నాము అనాలి. జవాబులు అయితే చాలా మంచిగా చెప్తారు - తయారయ్యేది మేమే కదా అంటారు. మేము కాకపోతే ఇంకెవరు అవుతారు అంటారు. బాప్దాదా కూడా సంతోషిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు (ఆత్మలు) చూడాలనుకుంటున్నారు. బాప్ దాదాకి జ్ఞాపకం ఉంది - ఆదిలో పిల్లలైన మీరు సేవకి వెళ్ళినప్పుడు పిల్లల ద్వారా కూడా సాక్షాత్కారాలు అయ్యేవి. కనుక ఇప్పుడు సేవ మరియు స్వరూపం రెండింటి యొక్క ధ్యాస ఉండాలి. ఏమి విన్నారు! ఇప్పుడు సాక్షాత్కారమూర్తిగా అవ్వండి. సాక్షాత్ బ్రహ్మాబాబా వలె అవ్వండి. ఈ రోజు క్రొత్త క్రొత్త పిల్లలు కూడా చాలామంది వచ్చారు. మీ స్నేహశక్తితో అందరు చేరుకున్నారు అందువలనే బాప్ దాదా విశేషంగా ఎవరైతే క్రొత్త క్రొత్త పిల్లలు వచ్చారో వారికి ప్రతి ఒక్కరికీ పేరు పేరున కోటానుకోట్లరెట్లు ప్రియస్మృతులు ఇస్తున్నారు, వెనువెంట వరదాతగా వరదానం ఇస్తున్నారు - సదా బ్రాహ్మణ జీవితంలో జీవిస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. మంచిది. 

బాప్ దాదా నలువైపుల సాకారంగా ఎదురుగా కూర్చున్న పిల్లలకు మరియు తమతమ స్థానాలలో, దేశాలలో బాబాని కలుసుకునే నలువైపుల ఉన్న పిల్లలకు చాలా చాలా సేవ యొక్క స్నేహం యొక్క పురుషార్ధం యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు కానీ పురుషార్థంలో తీవ్ర పురుషార్ధిగా అయ్యి ఇప్పుడు ఆత్మలను దు:ఖం, అశాంతి నుండి విడిపించే తీవ్రపురుషార్థం చేయండి. దుఖం, అశాంతి, భ్రష్టాచారం అతిలోకి వెళ్తున్నాయి. కనుక ఇప్పుడు అతిని అంతిమం చేసి అందరికీ బాబా ద్వారా ముక్తిధామం యొక్క వారసత్వాన్ని ఇప్పించండి. ఇలా ధృఢ సంకల్పం కలిగిన పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments