28-03-2006 అవ్యక్త మురళి

  28-03-2006         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విశ్వంలోని ఆత్మలను దుఃఖం నుండి విడిపించేటందుకు మనసాసేవను పెంచండి, సంవన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి.

ఈరోజు సర్వఖజానాలకు యజమాని అయిన బాప్ దాదా తన యొక్క నలువైపుల ఉన్న సర్వఖజానాలతో సంపన్న పిల్లలను చూస్తున్నారు. బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డను సర్వఖజానాలకు యజమానిగా తయారుచేసారు. ఇచ్చేవారు ఒకరే మరియు సర్వులకు ఒకే విధంగా సర్వఖజానాలను ఇచ్చారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వలేదు. ఎందువలన? ఎందుకంటే తండ్రి తరగని ఖజానాకి యజమాని. బేహద్ ఖజానా అందువలన ప్రతి ఒక్క బిడ్డ తరగని ఖజానాకి యజమాని. బాప్ దాదా పిల్లలందరికీ ఒకేవిధంగా మరియు ఒకేలా సమానంగా ఇచ్చారు. కానీ ధారణ చేసేవారిలో కొందరు సర్వ ఖజానాలను ధారణ చేసేవారు మరికొందరు శక్తిననుసరించి ధారణ చేసేవారు. కొందరు నెంబర్ వన్ మరికొందరు నెంబర్ వారీ. ఎవరు ఎంత ధారణ చేసారో అంతగా వారి ముఖం ద్వారా నయనాల ద్వారా ఆ ఖజానాల యొక్క నషా స్పష్టంగా కనిపిస్తుంది. ఖజానాలతో నిండిన ఆత్మ ముఖం ద్వారా, నయనాల ద్వారా నిండుగా కనిపిస్తుంది. స్థూల ఖజానా పొందిన ఆత్మ యొక్క నడవడిక ద్వారా, ముఖం ద్వారా తెలుస్తుంది కదా! అదేవిధంగా ఈ అవినాశి ఖజానాల యొక్క నషా మరియు సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. సంపన్నత యొక్క నషా నిశ్చింతాచక్రవర్తిగా తయారుచేస్తుంది. ఎక్కడైతే ఈశ్వరీయ నషా ఉంటుందో అక్కడ చింత ఉండదు. నిశ్చింతా చక్రవర్తులుగా అవుతారు. మీరందరు కూడా ఈశ్వరీయ ఖజానాలతో సంపన్నమైన నిశ్చింతా చక్రవర్తులే కదా? ఏదైనా చింత ఉందా? ఉందా చింత? ఏమౌతుందో, ఎలా అవుతుందో అనే చింత కూడా లేదు కదా! త్రికాలదర్శి స్థితిలో స్థితులైన వారికి తెలుసు - ఏది జరుగుతుందో అదంతా మంచిది మరియు ఏది జరగబోతుందో అది ఇంకా మంచిది అని. ఎందుకు సర్వశక్తివంతుడైన బాబా తోడుగా ఉండేవారు. ప్రతి ఒక్కరికీ నషా మరియు గర్వంగా ఉంది కదా! బాప్ దాదా సదా మా హృదయంలో ఉంటారు మరియు మేము సదా బాబా హృదయసింహాసనంపై ఉంటాము అని. ఇలా నషా ఉంది కదా? ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారికి సంకల్పంలోనే కాదు, స్వప్నంలో కూడా దు:ఖం యొక్క అల రాలేదు. ఎందువలన? సర్వఖజానాలతో సంపన్నులు. నిండుగా ఉన్న వస్తువు చలించదు కదా! | 

బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల యొక్క సంపన్నతను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి జమాఖాతాను పరిశీలించారు. ఖజానాలైతే తరగని ఖజానాలు లభించాయి కానీ లభించిన ఖజానాలను కార్యంలో ఉపయోగిస్తూ సమాప్తి చేసుకున్నారా? లేక కార్యంలో ఉపయోగిస్తూ కూడా మరియు పెంచుకున్నారా? ప్రతి ఒక్కరి ఖాతా ఎంత శాతంలో జమ అయ్యింది? ఎందుకంటే ఈ ఖజానాలు కేవలం ఈ సమయం వరకే కాదు. ఈ ఖజానాలు భవిష్యత్తులో కూడా వెంట వస్తాయి. జమ అయినదే వెంట వస్తుంది, కనుక ఎంత శాతం జమ అయ్యింది? అని చూసారు. ఏమి చూసి ఉంటారు? సేవ అయితే పిల్లలందరు యోగం మరియు శక్తిననుసరించి చేస్తున్నారు కానీ సేవ ద్వారా లభించే ఫలం యొక్క జమలో తేడా ఉంది. కొంతమంది పిల్లల యొక్క జమా ఖాతా చూసారు, చాలా సేవ చేస్తున్నారు కానీ సేవ చేసినదానికి ఫలం జమ అయ్యిందా లేదా అనేదాని యొక్క గుర్తు ఏమిటి? మనస్సు ద్వారా, వాచా ద్వారా, కర్మణా ద్వారా మూడింటికీ 100 శాతం మార్కులు ఉంటాయి. మూడింటిలో 100 మార్కులు ఉంటాయి. సేవ చేసారు కానీ సేవ చేసే సమయంలో లేదా సేవ తర్వాత స్వయం యొక్క మనస్సులో సంతుష్టత మరియు వెనువెంట ఎవరికి సేవ చేసారో వారు మరియు సేవలో సహయోగులైన వారికి లేదా సేవ చేసేవారిని చూసిన వారికి, విన్నవారికి కూడా సంతుష్టత ఉంటే జమ అయినట్లు, అనగా స్వయం యొక్క సంతుష్టత, సర్వుల యొక్క సంతుష్టత లేకపోతే తక్కువ శాతం జమ అవుతుంది. యదార్ధసేవ యొక్క విధి గురించి ఇంతకు ముందు కూడా చెప్పాను, మూడు విషయాలు విధిపూర్వకంగా ఉంటే జమ అవుతుంది. చెప్పాను కదా - అవి 1. నిమిత్త భావం 2. నిర్మాణ భావన 3. నిర్మల స్వభావము, నిర్మల మాట. భావము, భావన మరియు స్వభావము, మాట. ఈ మూడింటిలో ఏ ఒకటి లోపంగా ఉన్నా ఒకటి ఉండి రెండు లేకపోయినా లేక రెండు ఉండి ఒకటి లేకపోయినా కానీ ఆ బలహీనత జమా శాతాన్ని తగ్గించేస్తుంది. కనుక నాలుగు సబ్జక్టులలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - నాలుగు సబ్జక్టులలో మా జమా ఖాతా ఎలా ఉంది అని. ఎందుకు? బాప్ దాదా చూసారు - కొందరికి నాలుగు విషయాలు అనగా భావము, భావన ..... దాన్ని అనుసరించి చూస్తే కొంతమంది పిల్లల యొక్క సేవా సమాచారం చాలా ఉంది కానీ జమాఖాతా తక్కువ ఉంది. ప్రతి ఖజానా గురించి పరిశీలించుకోండి - జ్ఞాన ఖజానా అనగా ఏ సంకల్పం మరియు కర్మ చేసినా కానీ అది జ్ఞానయుక్తంగా అయ్యి చేసానా? సాధారణత లేదు కదా? అదేవిధంగా యోగం అనగా సర్వశక్తుల ఖజానా నిండుగా ఉందా? ప్రతి రోజు యొక్క దినచర్యలో సమయప్రమాణంగా ఏ శక్తి అవసరమో ఆ సమయంలో ఆ శక్తి మీ అదుపులో ఉందా? మాస్టర్ సర్వశక్తివంతులు అంటేనే యజమానులు. సమయం గడిచిపోయిన తర్వాత శక్తి గురించి ఆలోచిస్తూ ఉండే విధంగా ఉండకూడదు. ఒకవేళ సమయాను సారంగా, ఆజ్ఞానుసారంగా శక్తి ప్రత్యక్షం కావటం లేదు అంటే ఒక శక్తిని అయినా ఆజ్ఞానుసారం నడిపించలేకపోతే నిర్విఘ్నరాజ్యాధికారిగా ఏవిధంగా అవుతారు? శక్తుల ఖజానా ఎంత జమ అయ్యింది? ఎవరైతే సమయానుసారంగా కార్యంలో ఉపయోగిస్తారో వారికి జమ అవుతుంది. పరిశీలించు కుంటూ వెళ్తున్నారా నా ఖాతా ఏవిధంగా ఉంది? అని. ఎందుకంటే బాప్ దాదాకి పిల్లలందరి పట్ల అతి ప్రేమ ఉంది. అందువలన పిల్లలందరి యొక్క జమా ఖాతా నిండుగా ఉండాలని బాప్ దాదా కోరుకుంటున్నారు. అదేవిధంగా ధారణకి గుర్తు ఏమిటంటే ప్రతి కర్మ గుణసంపన్నంగా ఉంటుంది. ఏ సమయంలో ఏ గుణం అవసరం ఉంటుందో ఆ గుణం నడవడిక మరియు ముఖంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఒకవేళ ఒక గుణం అయినా లోటుగా ఉంటే అంటే కర్మ చేసే సమయంలో సరళత, మధురత అవసరం అయితే మాట మరియు కర్మలో సరళత మరియు మధురతకి బదులు కొంచెం ఆవేశము లేదా అలసట కారణంగా మాటలో మధురత, ముఖంలో మధురత లేకుండా సీరియస్ గా ఉంటే గుణసంపన్నము అని అనరు కదా! ఎటువంటి పరిస్థితి అయినా కానీ మన గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు క్లుప్తంగా వినిపిస్తున్నాను. అదేవిధంగా సేవ - సేవలో సేవాధారి యొక్క అన్నింటికంటే మంచి గుర్తు ఏమిటంటే - స్వయం కూడా సదా తేలికగా, ప్రకాశంగా మరియు సంతోషంగా కనిపించాలి. సేవకి ఫలం- సంతోషం. ఒకవేళ సేవ చేస్తూ సంతోషం మాయం అయిపోతుంది అంటే సేవాఖాతా జమ అవ్వదు. సేవ చేసారు, సమయం ఉపయోగించారు, శ్రమ చేసారు కనుక కొంచెం శాతం జమ అవుతుంది. వ్యర్థమైతే అవ్వదు కానీ ఎంత శాతంలో జమ అవ్వాలో అంత శాతంలో జమ అవ్వదు. అదేవిధంగా సంబంధ, సంపర్కాలకు గుర్తు - ఆశీర్వాదాల యొక్క ప్రాప్తి లభించాలి. ఎవరి యొక్క సంబంధ, సంపర్కాలలోకి వచ్చినా కానీ వారి మనస్సు నుండి మీకు ఆశీర్వాదాలు లభించాలి - చాలా మంచివారు అని. పైపైకి కాదు. మనస్సుతో ఆశీర్వాదాలు రావాలి. ఆశీర్వాదాలు సహజ పురుషార్థానికి సాధనం. ఉపన్యాసం చెప్పలేరు, మనసాసేవ కూడా శక్తివంతంగా చేయలేరు, క్రొత్త క్రొత్త ప్లాన్స్ కూడా వేయలేరు, అయినా ఫర్వాలేదు. అన్నింటికంటే సహజపురుషార్థం యొక్క సాధనం - ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. కొంతమంది పిల్లల యొక్క సంకల్పాలు బాప్ దాదా గ్రహిస్తున్నారు - కొంతమంది పిల్లలు సమయాను సారంగా, పరిస్థితులు అనుసరించి అంటున్నారు - ఒకవేళ ఎవరైనా చెడుపనులు చేస్తే వారికి ఆశీర్వాదాలు ఎలా ఇస్తాము? వారిపై కోపం వస్తుంది కదా! ఆశీర్వాదాలు ఎలా ఇస్తాం అని అనుకుంటున్నారు. క్రోధం యొక్క పిల్లలు చాలా మంది ఉన్నారు. వారు చెడు పని చేసారు, వారు చెడ్డవారు, అది చెడు అని మీరు సరిగ్గానే అర్ధం చేసుకున్నారు, మంచిదే, మంచి నిర్ణయం చేసారు, బాగా అర్థం చేసుకున్నారు కానీ అర్ధం చేసుకోవటం ఒక విషయం, ఆ చెడుపనిని, ఆ విషయాలను మీ మనస్సులో నింపుకోవటం మరొక విషయం. అర్థం చేసుకోవటం మరియు నింపుకోవటం రెండింటిలో తేడా ఉంది. ఒకవేళ మీరు తెలివైనవారైతే ఆ చెడు విషయాలను మీ దగ్గర ఉంచుకుంటారా? వారు చెడ్డవారు, వాటిని మీ మనస్సులో నింపుకున్నారు అంటే మీరు చెడువస్తువుని మీ దగ్గర పెట్టుకున్నట్లు. అర్థంచేసుకోవటం వేరే విషయం, స్వయంలో నింపుకోవటం వేరే విషయం. తెలివైన వారిగా అవ్వటం మంచిదే అవ్వండి, కానీ మీలో నింపుకోకండి. వీరు ఇలాంటివారు అనుకున్నారు అంటే నింపుకున్నట్లే. అలా భావించి వ్యవహారంలోకి రావటం తెలివి కాదు. కనుక బాప్ దాదా పరిశీలించారు.

ఇప్పుడు సమయం సమీపంగా రావటం కాదు, మీరు తీసుకురావాలి. కొంతమంది అడుగుతున్నారు - కొంచెం సైగ ఇవ్వండి 10 సంవత్సరాలు పడుతుందా? 20 సంవత్సరాలు పడుతుందా? ఎంత సమయం పడుతుంది అని. అయితే బాప్ దాదా పిల్లలని ప్రశ్నిస్తున్నారు - బాబానైతే చాలా ప్రశ్నలు అడుగుతారు. ఈ రోజు బాబా మిమ్మల్ని అడుగుతున్నారు. సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేవారు ఎవరు? డ్రామాయే కానీ నిమిత్తులు ఎవరు? ఎవరి కొరకు ఆగి ఉంది ఉదయం ...... అనే పాట ఉంది కదా! ఉంది కదా పాట! ఉదయాన్ని తీసుకువచ్చేవారు ఎవరు? వినాశనకారులు వినాశనం చేయాలి, చేయాలి అని తపిస్తున్నారు కానీ నవనిర్మాణం చేసేవారు అంత రెడీగా ఉన్నారా? పాతది సమాప్తి అయిపోయిన తర్వాత నవనిర్మాణం జరగకపోతే ఏమౌతుంది? అందువలన బాప్ దాదా ఇప్పుడు తండ్రి రూపానికి బదులు టీచర్ రూపాన్ని ధరించారు. హోమ్ వర్క్ ఇచ్చారు కదా! హోమ్ వర్క్స్ ఎవరిస్తారు? టీచర్ ఇస్తారు. ఇక చివరిది సద్గురువు పాత్ర. కనుక మిమ్మల్ని మీరు అడగండి - సంపన్న మరియు సంపూర్ణస్థితి ఎంతవరకు తయారయ్యింది? అని. ధ్వనికి అతీతం అవ్వటం మరియు ధ్వనిలోకి రావటం రెండు సమానంగా ఉన్నాయా? ధ్వనిలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత సహజంగా రాగలుగుతున్నారో అదేవిధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ధ్వనికి అతీతము కాగలుగుతున్నాం. సేకనులో  ధ్వనిలోకి రావాలి, సెకనులో ధ్వనికి అతీతం అయిపోవాలి, అంత అభ్యాసం ఉందా? శరీరం ద్వారా ఎప్పుడు కావాలంటే, ఎక్కడికి కావాలంటే అక్కడికి వచ్చి వెళ్ళగలుగుతున్నారు కదా? అదేవిధంగా మనస్సు, బుద్ధి ద్వారా ఎప్పుడు కావాలంటే, ఎక్కడికి కావాలంటే అక్కడికి వచ్చి వెళ్ళగలుగుతున్నారా? ఎందుకంటే అంతిమంలో పాస్ మార్కులు ఎవరికి లభిస్తాయి అంటే ఎవరైతే సెకనులో ఏవిధంగా కావాలంటే ఎలా కావాలంటే, ఏ ఆజ్ఞ ఇస్తే అలా సెకనులో స్థితులవ్వటంలో సఫలీకృతులు అవ్వాలి. సహజంగా ఉండాలి, సమయం తక్కువ పట్టాలి అని విజ్ఞానం వారు కూడా ప్రయత్నిస్తున్నారు. అటువంటి స్థితి ఉందా? నిమిషాల వరకు వచ్చారా? సెకనుల వరకు వచ్చారా? ఎక్కడి వరకు వచ్చారు? లైట్ హౌస్, మైట్‌హౌస్ స్విచ్ ఆన్ చేసిన సెకనులోనే ప్రకాశాన్ని వ్యాపిస్తుంది. అదేవిధంగా మీరు కూడా సెకనులో లైట్ హౌస్ గా అయ్యి నలువైపుల ప్రకాశాన్ని వ్యాపింపచేయగలుగుతున్నారా? స్టూలమైన కన్ను ఒక స్థానంలో ఉంటూ దూరం వరకు చూడగలుగుతుంది కదా! తన దృష్టిని వ్యాపింపచేస్తుంది కదా? అదేవిధంగా మీరు మూడవనేత్రం ద్వారా ఒకే స్థానంలో కూర్చుని వరదాత, విధాత అయ్యి దృష్టి ద్వారా అద్భుతం చేయగలుగుతున్నారా? అన్ని విషయాలలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలుగుతున్నారా? మూడవనేత్రం అంత శుభ్రంగా మరియు స్పష్టంగా ఉందా? అన్ని విషయాలకు కారణమనేది ఇంతకుముందు కూడా చెప్పాను. హద్దులోని నేను, నాది అనే తగుల్పాటు. నేను అనే విషయం గురించి స్పష్టంగా చేసాను కదా! హోమ్ వర్క్ కూడా ఇచ్చాను. నేను అనే రెండు భావాలను సమాప్తి చేసి ఒక నేను అనే భావనను ఉంచుకోవాలి అని. అందరు ఈ హోమ్ వర్క్ చేసారా? ఈ హోమ్ వర్క్ చేయటంలో సఫలులు అయినవారు చేతులెత్తండి? సఫలులు అయ్యారు, బాప్ దాదా అందరినీ చూసారు. ఇలా ధైర్యం పెట్టుకోండి, భయపడకండి. మంచిది. శుభాకాంక్షలు లభిస్తాయి. చాలా కొద్దిమంది ఉన్నారు. చేస్తే చేతులెత్తండి. టి.వీలో చేతులు చూపించండి. వెనుకకి కూడా చూపించండి. చాలా కొద్దిమంది చేతులు ఎత్తారు. ఇప్పుడేమి చేయాలి? అందరికీ తమ గురించి తమకే నవ్వు వస్తుంది. 

మంచిది. రెండవ హోమ్ వర్క్ ఏమిటంటే - క్రోధాన్ని వదలటం, ఇదైతే సహజమే కదా! క్రోధం ఎవరు వదిలారు? ఇన్ని రోజుల్లో క్రోధంలోకి రానివారు ఎవరు? (దీనిలో చాలా మంది చేతులెత్తారు) ఈ విషయంలో ఎక్కువమంది ఉన్నారు. 

మీరందరు కోపంలోకి రాలేదా? మీ చుట్టుప్రక్కల ఉన్నవారిని అడుగుతాను. చాలా మంది ఉన్నారు. క్రోధంలోకి రాలేదా? సంకల్పంలో, మనస్సులో కూడా క్రోధం రాలేదా? అయినా కానీ శుభాకాంక్షలు. మనస్సులో వచ్చి, నోటి ద్వారా రాకపోయినా కానీ శుభాకాంక్షలు చాలా మంచిది. ఈ ఫలితం యొక్క లెక్కతో మీరే చూడండి, స్థాపనాకార్యం సంపన్నం అయ్యిందా? స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి మరియు సర్వాత్మలకు ముక్తి యొక్క వారసత్వం ఇవ్వాలి. ఈ కార్యం సంపన్నం అయ్యిందా? స్వయాన్ని జీవన్ముక్తి స్వరూపులుగా తయారుచేసుకోవాలి మరియు సర్వాత్మలకు ముక్తి యొక్క వారసత్వాన్ని ఇవ్వాలి. స్థాపనాకారి ఆత్మల యొక్క శ్రేష్టకర్మ ఇదే. అందువలనే బాప్ దాదా అడుగుతున్నారు - సర్వబంధనముక్తులుగా, జీవన్ముక్తి స్థితికి ఈ సంగమయుగంలోనే చేరుకోవాలా? లేక సత్యయుగంలో చేరుకోవాలా? సంగమయుగంలో సంపన్నం అవ్వాలా? లేక అక్కడ కూడా రాజయోగం చేసి 'నేర్చుకోవాలా? సంపన్నం అయితే ఇక్కడే తయారవ్వాలి కదా? సంపూర్ణంగా కూడా ఇక్కడే తయారవ్వాలి. సంగమయుగం యొక్క సమయం కూడా అన్నింటికంటే పెద్ద ఖజానా. ఎవరి కొరకు ఉదయం ఆగి ఉంది, చెప్పండి. 

బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? ఎందుకంటే పిల్లలే బాబా యొక్క ఆశాదీపాలు. మీ ఖాతాను బాగా పరిశీలించుకోండి. కొంతమంది పిల్లలు మజారామ్ గా ఉండటం బాప్ దాదా చూసారు. మజాలో నడుస్తున్నారు. ఏది జరిగితే అది మంచిది అనుకుంటున్నారు. ఇప్పుడు మజాగా ఉండండి, సత్యయుగంలో ఎవరు చూస్తారు, ఎవరికి తెలుసు అనుకుంటున్నారు. జమాఖాతాలో కూడా మజాలాల్ గా, మజారామ్ గా ఉంటున్నారు. ఇటువంటి పిల్లలను కూడా చూసారు. మజాగా ఉండండి అని ఇతరులకు కూడా చెప్తారు. తినండి, త్రాగండి, మజాగా ఉండండి అని అంటారు. కొంచెంలోనే రాజీ అయిపోయేవారైతే అలాగే రాజీ అయిపోండి అని బాబా కూడా అంటారు. వినాశీ సాధనాల యొక్క మజా అల్పకాలికంగా ఉంటుంది. సదాకాలిక మజాను వదిలి అల్పకాలిక మజాలో ఉండాలనుకుంటుంటే బాప్ దాదా ఏమంటారు? సైగ చేస్తారు, ఇంకా ఏమి చేస్తారు? వజ్రాల గని దగ్గరికి వెళ్ళి రెండు వజ్రాలు తీసుకుని సంతోషం అయిపోతే వారిని ఏమంటారు? కనుక ఆవిధంగా అవ్వకండి. అతీంద్రియ సుఖం యొక్క మజా ఊయలలో ఊగండి. డ్రామాలో చూడండి! మాయ యొక్క పాత్ర కూడా విచిత్రమైనది. ఈ సమయంలోనే ఎటువంటి సాధనాలు వచ్చేసాయి అంటే అని ఆదిలో లేనేలేవు. సాధనాలు లేకుండా ఎవరైతే సేవ చేసారో వారు కూడా ఉదాహరణగా ఎదురుగా ఉన్నారు. అప్పుడు ఈ సాధనాలు ఉన్నాయా? కానీ సేవ ఎంతగా జరిగింది? క్వాలిటీ ఆత్మలు వచ్చారు కదా! ఆదిరత్నాలు తయారైపోయారు కదా? సాధనాలను ఉపయోగించుకోవటం తప్పు అనటం లేదు కానీ సాధనని మర్చిపోయి సాధనాలలో నిమగ్నం అయిపోవటం తప్పు అని బాప్ దాదా అంటారు. సాధనాలు జీవితం యొక్క వృద్ధికళకు సాధనం కాదు. ఆధారం కాదు. ఆధారం సాధన. సాధనకు బదులు సాధనాలను ఆధారం చేసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది? సాధనాలు వినాశి. వాటి ద్వారా ఫలితం ఎలా ఉంటుంది? సాధన అవినాశి దాని ద్వారా ఫలితం ఎలా ఉంటుంది? బాప్ దాదా పిల్లలను ప్రశ్నిస్తున్నారు - ఎప్పటికి ప్రతి ఒక్కరు స్వయాన్ని సంపన్నంగా, సంపూర్ణంగా తయారు చేసుకుంటారు? ఇతరులను చూడకండి. ఇతరులను చూస్తే సోమరితనం వచ్చేస్తుంది. ఇతరులు కూడా చేస్తున్నారు, నేను చేస్తే ఏంటి? అనుకుంటారు. ఇది సోమరితనం. స్వయాన్ని సంపన్నంగా తయారుచేసుకోవాలి. దీని కొరకు ఇప్పుడు ఎంత సమయం కావాలి? దీనికి కూడా లెక్క పెట్టుకుంటారా లేదా? సంఘటన కదా! ఆ సంఘటనలో కొన్ని విషయాలు వినవలసి ఉంటుంది, కొన్ని చూడవలసి ఉంటుంది. ఇది బాబాకి కూడా తెలుసు, నడవడంలో కూడా కొన్ని విషయాలు ఎదురుగా వస్తాయి, ఈ విషయాలైతే వస్తాయి, విషయాలు సమాప్తి అయితే సంపన్నంగా అవుతాం అనుకుంటారు కానీ అలా జరగదు. ఎంత ముందుకి వెళ్తూ ఉంటారో అంత విషయాలు వస్తాయి కానీ రూపం మారుతుంది. అంతిమ సేవలో కూడా చూడండి చాలా విషయాలు వస్తాయి. ఆ విషయాలు కనిపించకూడదు, బాబా కనిపించాలి. బాబా ఏమి చెప్పారు అనేది చూస్కోవాలి కానీ విషయాలు ఏమి చెప్తున్నాయి, ఏమి చేస్తున్నాయి అని చూడకూడదు. బాబా ఏమి చెప్పారు? అని బాబాని అనుసరించాలి. విషయాలను అనుసరించాలా లేక తండ్రిని అనుసరించాలా? బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే వతనంలో స్విచ్ ఆన్ చేస్తే దేశంలో ఉన్న వారైనా, విదేశంలో ఉన్నవారైనా, (మలలో ఉన్న కాలైన, పెద్ద పట్టణాలలో ఉన్న వారైనా అందరూ సంపన్న రూపంలో రాజా పిల్లలుగా కనిపించాలి. ఇప్పుడు బాబాకి ప్రతి ఒక్క బిడ్డపై ఇదే శ్రేష్ట ఆశ ఉంది. మీరందరు బాబా యొక్క ఆశాదీపాలుగా అవుతారా? అవుతారా? చేతులెత్తండి. అలాగే అన్నారు అని ఫైల్ లో కాగితం పెట్టే విధంగా కాదు, ఫైనల్ గా చెప్పాలి. అందరూ ఆశను పూర్తి చేస్తారా? మంచిది, శుభాకాంక్షలు. ఎవరైతే చేతులు ఎత్తలేదో వారు చేతులెత్తండి. ఎవరైనా ఉన్నారా? మంచిది, వీరికి సమయం కావాలా? ఒక సంవత్సరం కావాలా? తీవ్ర పురుషార్థం చేయండి. చేయవలసిందే, తయారవ్వలసిందే. చాలా మంది చేతులెత్తారు. బాబాకి అయితే సంతోషంగా ఉంది మరియు మనస్ఫూర్వక ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చేసి చూపించాలి. తర్వాత బాప్ దాదా వస్తారు. ఇప్పుడు టీచర్ అయ్యారు, తర్వాత ఇలా రారు. మధ్యలో కొంచెం సమయం ఉంది, మరలా బాబా మొదటిసారిగా వచ్చేటప్పటికి, మొదట విదేశీయులు కలుసుకుంటారు, కనుక విదేశీయులు తయారైపోవాలి. తయారేనా? విదేశీయులు తయారైపోతారా? ఒకవేళ విదేశీయులు తయారవ్వకపోతే మొదటిసారి భారతవాసీయులు కలుసుకుంటారు. మొదట మధువనం వారు తయారవ్వాలి. ఎందుకంటే బాప్ దాదా మధువనంలోనే రావాలి కదా! మరెక్కడికీ వెళ్ళరు. బాబాకి అయితే విదేశీయులపై నమ్మకం ఉంది, అలాగని భారతీయులపై లేదని కాదు, కానీ మొదటి అవకాశం విదేశీయులది. కనుక విదేశీయులు తయారయ్యి చూపిస్తారు. సరేనా? (జానకీ దాదీతో) ఇప్పుడు చెప్పండి, సాకారంలో మీరు నిమిత్తంగా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా 5,6 నెలల సమయం ఉంది. సత్యమైన మనస్సుతో మేము తయారయ్యాం అని ఎవరైతే వ్రాస్తారో వారినే బాబా కలుసుకుంటారు. బాప్ దాదా చూస్తారు, బాప్ దాదాకి కూడా కనిపిస్తుంది, కొంచెం కల్తి చేస్తారా? కనుక ఎవరైతే ఎవరెడి అని వ్రాస్తారో వారినే కలుసుకుంటారు, ఇతరులను కలుసుకోరు. మధువనంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ. సరేనా? మధువనం వారు సరేనా? డబల్ విదేశీయులు ఎవరెడీ అవుతారు కదా! బాప్ దాదా అందరి సంపన్న స్వరూపం చూస్తారు. ఎవరెడీ అవుతారా? సరేనా? చాలామంది చేతులెత్తారు. శుభాకాంక్షలు. అందరికీ ముందుగానే శుభాకాంక్షలు ఇస్తున్నారు. తర్వాత అందరికీ పరస్పరం శుభాకాంక్షలు ఇచ్చుకుంటారు - ఓహో సంపూర్ణులు ఓహో! ఓహో సంపన్నులు ఓహో!! ఎందుకంటే దు:ఖం బాగా పెరిగిపోతుంది, మీరు ఆ ధ్వని వినటం లేదు కదా! కానీ బాప్ దాదా వింటున్నారు. బాగా ధైర్యహీనులుగా, బలహీనులుగా అయిపోయారు. ఎలా అయితే విజ్ఞానం వారు తమ స్థానంలో ఉంటూ ఎక్కడికి తమ యంత్రాన్ని పంపాలంటే అక్కడికి పంపగలుగుతున్నారు. అలాగే మీరు కూడా మనసా సేవను పెంచుకోండి. వాచా సేవ అయితే చేయాలి కానీ మొత్తం విశ్వాత్మలకు వారసత్వం ఇవ్వాలి, దు:ఖాల నుండి విడిపించాలి. దీని కొరకు మీరు సంపన్నంగా అవ్వాలి. మరియు నలువైపుల మనసాసేవను వ్యాపింపచేయండి.. అప్పుడు విశ్వ కళ్యాణం జరుగుతుంది. మనసా సేవ చేస్తారా? ఎవరైతే మనసా సేవ చేస్తున్నాము, కొంచెం అయినా, చాలా అయినా చేస్తున్నాము మరియు చేయగలం అనేవారు చేతులెత్తండి. దీనిలో అయితే అందరూ ప్లాస్ అయిపోయారు. ఇంతమంది ఆత్మలు మనసాసేవ ద్వారా వాయుమండలాన్ని వ్యాపింపచేయగలిగితే గొప్ప విషయం ఏదీ కాదు. ఎంతగా మనసాసేవలో బిజీగా ఉంటారో అంతగా సమస్యల నుండి ముక్తులవుతారు. ఎందుకంటే మీ మనస్సు, బుద్ధి బిజీగా ఉంటాయి. ఫ్రీగా లేకపోతే మాయ ఎలా వస్తుంది? వెళ్ళిపోతుంది. సమస్యకి వచ్చే ధైర్యం ఉండదు. కనుక మనసా సేవను పెంచండి. అర్థమైందా! మంచిది, ఇప్పుడు ఒక్క నిమిషం అందరూ లైట్, మైట్ హౌస్ అయ్యి విశ్వంలో మీ యొక్క లైట్, మైట్ ను వ్యాపింపచేయండి. మంచిది, ఇలాంటి అభ్యాసం సమయానుసారంగా కార్యం చేస్తూ కూడా చేయండి. 

బాబా విన్నారు - లండన్లోని కార్యక్రమం గురించి టాఫిక్ మంచిగా పెట్టుకున్నారు. అందరికీ చెప్పండి (ఒక్క నిమిషం - ఒక్క నిమిషంలో శాంతి యొక్క అనుభవం, స్వ పరివర్తన యొక్క అనుభవం మరియు విశ్వం కొరకు) మంచి టాపిక్ పెట్టుకున్నారు మరియు ఈవిధమైన అభ్యాసం ఆ సమయంలో విదేశంలో ఉండే బ్రాహ్మణాత్మలు, భారతదేశంలో బ్రాహ్మణులు కూడా చేస్తారు కదా! (అన్ని చోట్ల విశ్వవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగాలని ఆలోచన) మంచిది, ఈ అభ్యాసం తప్పనిసరి. ఒక నిమిషం అయినా కానీ నలువైపుల ఈ వాయుమండలం తయారైతే అందరికీ తెలుస్తుంది - బ్రహ్మాకుమారీలు ఏమి కోరుకుంటున్నారు, ఏమి చేస్తున్నారో! ఇది కూడా మంచిగా వ్యాపిస్తుంది. నలువైపుల వెనువెంట జరిగితే ఇది మంచి సేవాసాధనం. మంచిది. ఈ రోజు సేవా అవకాశం ఎవరిది? 

మహారాష్ట్ర, బొంబాయి మరియు ఆంధ్రప్రదేశ్ వారి అవకాశం - సేవా ఆవకాశం ఎవరిదో వారి కోసమే సగం క్లాస్ ఉంటుంది. మంచిది, మహారాష్ట్ర వారు సదా మహాన్ స్థితిలో ఉండేవారు మరియు విశ్వంలో జీవితం యొక్క మహానతను ప్రత్యక్షం చేసేవారు. మంచిది. సంఖ్య కూడా ఎక్కువే కానీ ఇంత వరకు కూడా 9 లక్షల మంది పూర్తి అవ్వలేదు కదా! 9 లక్షలు పూర్తి అయ్యారా? అవ్వలేదా? మహారాష్ట్ర నుండి ఎంతమంది వచ్చారు? (5500 మంది వచ్చారు) మహారాష్ట్ర వారు ఎదురుగా కూర్చున్నారు, కనుక కార్యం కూడా చేస్తారు కదా! ఇప్పుడు ఎంతమంది వచ్చారో అంతమంది మరలా సీజన్ కి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తయారుచేసి తీసుకురావాలి. మంచిగా తయారుచేయాలి. ఎందుకంటే 6 నెలలు సమయం ఉంది. మీ నియమం ఒక సంవత్సరం ఉండాలి. కనుక ఒక సంవత్సరం సమానంగా 6 నెలలలో తయారుచేయాలి. 9 లక్షలు పూర్తి చేయాలి కదా! ప్రస్తుతం మొత్తం సంఖ్య ఎంతమంది? (8 లక్షల 12 వేలమంది) ఇక కొంతమందే కావాలి కనుక ఇలా చేయండి. ఇప్పుడు మీటింగ్ ఉంది కదా! ప్రతి జోన్ తమ, తమ జోన్ యొక్క లెక్కతో సంఖ్యను పంచుకోవాలి. మరలా బాప్ దాదా వచ్చే సమయానికి బాప్ దాదా సమక్షంలోకి రాకపోయినా కానీ తయారుచేసి జాబితా తీసుకురావాలి. ఇది హోమ్ వర్క్ సరేనా? జోన్ వారు చెప్పండి. చేస్తారా? మంచిది, 9 లక్షలేనా పూర్తి చేయండి. కష్టవిషయమేమి కాదు. డబల్ విదేశీయులు లేదా భారతవాసీయులు 9 లక్షలు ఈసారికి పూర్తి చేసేయాలి. పూర్తి అయిపోవాలా? లేక తర్వాత అవ్వాలా? మధువనం వారు కూడా చేస్తారు. ఇరుగు పొరుగున సేవ చేస్తున్నారు కదా! అన్ని జోన్ల వారు తయారుచేయాలి. అందరు ఇక్కడ లేకపోయినా వింటారు కదా! మీటింగ్ లో ఫైనల్ చేసుకోవాలి. బాప్ దాదాకి ఇంతమంది సంఖ్యను చూసి సంతోషంగా ఉంది. (9 లక్షల మంది బ్రాహ్మణులు అవుతారు, కోట్ల మందికి సందేశం ఇవ్వాలి కదా) ఆ కార్యక్రమం అయితే చేస్తున్నారు కదా! అది కూడా చేయాల్సిందే. ముందు స్వయాన్ని సంపన్నంగా తయారుచేసుకోవాలి. వెనువెంట ఈ సేవ చేయాలి. చేతులెత్తారు కదా! తయారుచేస్తారు కదా? నెమ్మది నెమ్మదిగా నడిచే సమయం సమాప్తి అయిపోయింది. ఇప్పుడు ఎగరండి. ఎప్పుడు కావాలంటే, ఎక్కడ కావాలంటే అక్కడ సేవకి హాజరైపోండి. మంచిది. ఇప్పుడందరు తయారు చేసి వస్తారు కదా! ఎక్కువ మందిని కాదు, ఒక్కొక్కరిని తయారు చేయండి, ఎక్కువ మందిని తయారుచేసినా శుభాకాంక్షలు. మంచిది. మహారాష్ట్ర వారు స్వయాన్ని సంపూర్ణంగా తయారుచేసుకునే స్వర్ణిమ అవకాశం తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ వాయుమండలం సహజంగానే అశరీరీగా అవ్వటంలో సహాయం చేస్తుంది. ఏ జోన్ అవకాశం తీసుకుంటే వారికి స్వర్ణిమప్రాప్తి లభిస్తుంది. కర్మణా యొక్క ఫలం మరియు వాయుమండలంలో స్థితి యొక్క ఫలం మంచిగా లభిస్తుంది. డబల్ ఫలం యొక్క ప్రాప్తి లభిస్తుంది. 

మంచిది. బాప్ దాదాకి ప్రతి పిల్లవాడు ఒకరికంటే ఒకరు ప్రియమనిపిస్తారు. ఎటువంటి పిల్లలైనా కానీ పరమాత్మ ప్రేమకు పాత్రులౌతారు. ఈ పరమాత్మ యొక్క ప్రేమ కేవలం ఇప్పుడే లభిస్తుంది. అందరికీ బాప్ దాదాపై 100 శాతం ప్రేమ ఉందా లేక తక్కువ ఉందా? 100 శాతం ప్రేమ ఉన్నవారు చేతులెత్తండి? 100 శాతం ప్రేమ ఉందా? ప్రేమలో బలిహారం అవ్వటం సహజం. శుభాకాంక్షలు. ప్రేమకు ఋజువు బలిహారం అవ్వటం. సుపుత్రులు కదా! ప్రత్యక్ష ఋజువుచూపించినవారే సుపుత్రులు. బాప్ దాదాకి పిల్లల యొక్క ప్రేమ అయితే చేరుకుంటుంది కానీ శక్తిశాలిస్థితి తక్కువ చేరుకుంటుంది. ప్రేమలో బాప్ దాదా కూడా మంచి శాతం చూసారు, కానీ ఇప్పుడు శక్తి స్వరూపం, సంపన్న స్వరూపంలో అన్నింటికంటే ఎక్కువ మార్కులు తీసుకోవాలి. మహారాష్ట్ర నెంబర్ వన్ అవుతుందా? అవుతుందా? మంచిది. చేసేవారే అర్జునులు అంటే నెంబర్ వన్. 

నలువైపుల ఉన్న పిల్లల యొక్క పురుషార్ధం మరియు ప్రేమ యొక్క సమాచార ఉత్తరాలు బాప్ దాదాకి అందాయి. బాప్ దాదా పిల్లల యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు చూసి ఇది చేస్తాము, అది చేస్తాము అనే సమాచారం విని సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ధైర్యం ఉత్సాహ, ఉల్లాసాలు పెట్టుకున్నారో వాటిపై మాటిమాటికి ధ్యాస పెట్టి ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. పిల్లలందరి పట్ల ఇవే బాప్ దాదా మనస్సు యొక్క ఆశీర్వాదాలు. మరియు నలువైపుల ఉన్న సంకల్పం, మాట మరియు కర్మలో, సంబంధ, సంపర్కంలో సంపన్నంగా అయ్యే శ్రేష్ట ఆత్మలకు, సదా స్వదర్శనం చేసే స్వదర్శనచక్రధారి పిల్లలకు, సదా దృడ సంకల్పం ద్వారా మాయాజీతులుగా అయ్యి బాబా ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేసుకునేవారికి మరియు విశ్వం ముందు బాబాని ప్రత్యక్షం చేసే పిల్లలకు, సర్వీసబుల్, నాలెడ్జ్ ఫుల్, సక్సెస్ ఫుల్ అయిన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు మనస్పూర్వక కోటానుకోట్ల ఆశీర్వాదాలు నమస్తే, నమస్తే. 

దాదీలతో - మీ అందరి లక్ష్యం ఇదే కదా - త్వరత్వరగా ప్రత్యక్షత జరగాలి అని. అందువలన బాప్ దాదా హోమ్ వర్క్ ఇస్తున్నారు. సద్గురువు యొక్క పాత్ర నడిస్తే సమాప్తి అయిపోతుంది. దీని కొరకు అందరినీ తయారు చేస్తున్నారు. (మా ఎదురుగా ముగ్గురు ఉన్నారు) బాప్ దాదా అఫీషియల్ స్వరూపాన్ని ధరించవలసి ఉంటుంది. ఉండటం అయితే సదా మూడు రూపాలలో ఉంటారు. ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు విజయీ అయ్యాం అని చెప్పాలి. అవ్వాలి, అవుతున్నాము అనకూడదు. అందరి మస్తకంలో మెరిసే సితార స్పష్టంగా అనుభవం అవ్వాలి. ఈ అనుభవం యొక్క నేత్రం ఇతరులకి కూడా అనుభవం చేయిస్తుంది. ఇప్పుడు అందరి అనుభవం కోరుకుంటున్నారు. స్వయం ప్రతి శక్తి మరియు గుణం యొక్క అనుభవీగా అయినప్పుడు అనుభవం చేయించగలరు. మీ అనుభవాన్ని పెంచుకుంటే ఇతరులకి అనుభవం అయిపోతుంది. మంచిది. మీ అందరి మనోకామనలు పూర్తి కానున్నవి. సరేనా! 

ఎంత మంచిగా ఉన్నారు. మీరు బ్రాహ్మణ కులానికి శోభ. అందరికీ దాదీలను చూసి సంతోషం అనిపిస్తుంది కదా! వీరి యొక్క అద్భుతం ఏమిటంటే సాధనాలు లేకుండా సఫతలను పొందారు. (చాలా దూరం నడిచే వెళ్ళేవారు, ఏ వాహనాలూ లేవు) తపస్సే ఇంత విస్తారం చేసింది. ఇప్పుడు కొద్దిగా సాధనాలు లభించాయి కదా! కనుక కొంచెం ఆకర్షణ ఉంటుంది. మంచిది. 

Comments