27-12-1987 అవ్యక్త మురళి

   27-12-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘నిశ్చయ బుద్ధి విజయీ రత్నాల గుర్తులు’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ నిశ్చయబుద్ధి విజయీ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలోనూ నిశ్చయం యొక్క గుర్తులను చూస్తున్నారు. నిశ్చయం యొక్క విశేషమైన గుర్తులు - 1. ఎంతటి నిశ్చయముంటుందో, అంతగా కర్మలో, వాచాలో, ప్రతి సమయము ముఖంపై ఆత్మిక నషా కనిపిస్తుంది. 2. ప్రతి కర్మలో, సంకల్పంలో విజయమనేది సహజమైన ప్రత్యక్ష ఫలం రూపంలో అనుభవమవుతుంది. విజయమనేది శ్రమ రూపంలో కాకుండా, ప్రత్యక్ష ఫలం రూపంలో మరియు అధికారం రూపంలో అనుభవమవుతుంది. 3. తమ శ్రేష్ఠమైన భాగ్యము, శ్రేష్ఠమైన జీవితము, తండ్రి మరియు పరివార సంబంధ-సంపర్కం - ఈ విషయాలలో సంశయమనేది ఒక్క శాతం కూడా, సంకల్పమాత్రంగా కూడా ఉండదు. 4. క్వశ్చన్ మార్క్ లు సమాప్తమై, ప్రతి విషయంలోనూ బిందువుగా అయి బిందువు పెట్టేవారిగా ఉంటారు. 5. నిశ్చయబుద్ధి కలవారు ప్రతి సమయము స్వయాన్ని నిశ్చింత చక్రవర్తిగా సహజంగా మరియు స్వతహాగా అనుభవం చేస్తారు అనగా పదే-పదే స్మృతి తెచ్చుకోవాల్సిన శ్రమ చేయాల్సి ఉండదు. నేను చక్రవర్తిని అని చెప్పవలసిన శ్రమ చేయాల్సి ఉండదు, కానీ సదా స్థితి అనే శ్రేష్ఠ ఆసనం లేదా సింహాసనంపై స్థితులయ్యే ఉంటారు. ఉదాహరణకు లౌకిక జీవితంలో పరిస్థితి అనుసారంగా స్థితి తయారవుతుంది. దుఃఖమైనా లేక సుఖమైనా, ఆ స్థితి యొక్క అనుభూతిలో స్వతహాగానే ఉంటారు, నేను దుఃఖంగా ఉన్నాను లేదా నేను సుఖంగా ఉన్నాను అని పదే-పదే శ్రమించరు. నిశ్చింత చక్రవర్తి స్థితి యొక్క అనుభవం స్వతహాగా, సహజంగా ఉంటుంది. అజ్ఞాన జీవితంలో పరిస్థితుల అనుసారంగా స్థితి తయారవుతుంది కానీ శక్తిశాలి అలౌకిక బ్రాహ్మణ జీవితంలో పరిస్థితి అనుసారంగా స్థితి తయారవ్వదు, కానీ నిశ్చింత చక్రవర్తి స్థితి లేదా శ్రేష్ఠమైన స్థితి అనేది బాప్ దాదా ద్వారా ప్రాప్తించిన జ్ఞానమనే లైట్-మైట్ ద్వారా, స్మృతి శక్తి ద్వారా ప్రాప్తిస్తుంది, దీనినే జ్ఞానం మరియు యోగం అనే శక్తుల వారసత్వం తండ్రి ద్వారా లభించడం అని అంటారు. కావున బ్రాహ్మణ జీవితంలో తండ్రి వారసత్వం ద్వారా, సద్గురువు వరదానాల ద్వారా మరియు భాగ్యవిధాత ద్వారా ప్రాప్తించిన శ్రేష్ఠ భాగ్యం ద్వారా స్థితి ప్రాప్తిస్తుంది. ఒకవేళ స్థితి అనేది పరిస్థితి ఆధారంగా ఉన్నట్లయితే, ఎవరు శక్తిశాలిగా ఉన్నట్లు? పరిస్థితి శక్తిశాలిగా అయినట్లు కదా. మరియు పరిస్థితి ఆధారంగా స్థితిని తయారు చేసుకునేవారు ఎప్పుడూ అచల్-అడోల్ (చలించకుండా-స్థిరంగా) గా ఉండలేరు. అజ్ఞాని జీవితంలో చూస్తే ఇప్పుడిప్పుడే చాలా సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు మరియు ఇప్పుడిప్పుడే బోర్లా పడుకుని నిద్రిస్తూ ఉంటారు. కావున అలౌకిక జీవితంలో ఇటువంటి అలజడి యొక్క స్థితి ఉండదు. స్వయం పరిస్థితి ఆధారంగా ఉండరు, కానీ తమ వారసత్వం మరియు వరదానాల ఆధారంగా మరియు తమ శ్రేష్ఠ స్థితి ఆధారంగా పరిస్థితిని మార్చేవారిగా ఉంటారు. కావున ఈ కారణం వలన నిశ్చయబుద్ధి కలవారు సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు, ఎందుకంటే ఏదైనా అప్రాప్తి లేక లోటు ఉన్నప్పుడు చింత ఉంటుంది. ఒకవేళ సర్వ ప్రాప్తి స్వరూపులుగా, మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉంటే, ఇక ఏ విషయంలో చింత ఉంటుంది?

6. నిశ్చయబుద్ధి కలవారు అనగా సదా తండ్రిపై బలిహారమయ్యేవారు. బలిహారమవ్వడం అనగా సర్వంశ సమర్పితము. సర్వ వంశ సహితంగా సమర్పితము. దేహ భానంలోకి తీసుకొచ్చే వికారాల వంశం అయినా, దేహ సంబంధాల వంశం అయినా, దేహపు వినాశీ పదార్థాల కోరికల వంశం అయినా - సర్వ వంశంలో ఇవన్నీ వస్తాయి. సర్వంశ సమర్పితులు అన్నా లేదా సర్వంశ త్యాగులు అన్నా ఒకటే. సమర్పితమవ్వడం అనగా మధువనంలో కూర్చోవడం లేదా సేవాకేంద్రాలలో కూర్చోవడం అని కాదు. స్వయాన్ని సేవార్థం అర్పణ చేసుకోవడమనేది కూడా ఒక మెట్టు, కానీ ‘సర్వంశ అర్పితం’ అనేది ఆ మెట్ల యొక్క గమ్యము. ఒక మెట్టు ఎక్కారు కానీ గమ్యానికి చేరుకునే నిశ్చయబుద్ధి కలవారి గుర్తు ఏమిటంటే - మూడింటినీ వంశ సహితంగా అర్పితం చేయడము. మూడు విషయాలను స్పష్టంగా తెలుసుకున్నారు కదా. స్వప్నం లేదా సంకల్పంలో అంశమాత్రం కూడా లేనప్పుడే వంశం సమాప్తమవుతుంది. ఒకవేళ అంశమున్నట్లయితే వంశం తప్పకుండా ఉత్పన్నమవుతుంది, కావుననే సర్వంశ త్యాగి యొక్క నిర్వచనము చాలా గుహ్యమైనది. ఇది కూడా తర్వాత ఎప్పుడైనా వినిపిస్తాము.

7. నిశ్చయబుద్ధి కలవారు సదా చింత లేని వారిగా, నిశ్చింతగా ఉంటారు. ప్రతి విషయములోనూ విజయం నిశ్చితంగా ప్రాప్తిస్తుందనే నషాను అనుభవం చేస్తారు. కావున నిశ్చయమనేది, నిశ్చింతతను మరియు నిశ్చితము అన్నదానిని ప్రతి సమయము అనుభవం చేయిస్తుంది.

8. వారు సదా స్వయం కూడా నషాలో ఉంటారు మరియు వారి నషాను చూసి ఇతరులకు కూడా ఈ ఆత్మిక నషా అనుభవమవుతుంది. తండ్రి సహయోగం ద్వారా, స్వస్థితి ద్వారా ఇతరులకు కూడా ఆత్మిక నషాను అనుభవం చేయిస్తారు.

నిశ్చయబుద్ధి కలవారు మరియు ఆత్మిక నషాలో ఉండేవారి జీవితం యొక్క విశేషతలు ఏమిటి? మొదటి విషయము - ఎంతటి శ్రేష్ఠమైన నషా ఉంటుందో, అంతటి నిమిత్త భావం వారి జీవితంలోని ప్రతి కర్మలో ఉంటుంది. నిమిత్త భావమనే విశేషత కారణంగా నిర్మాణ బుద్ధి ఉంటుంది. బుద్ధి పట్ల శ్రద్ధ ఉంచాలి - ఎంతటి నిర్మాన బుద్ధి ఉంటుందో, అంతగా నిర్మాణం చేస్తూ ఉంటారు, నవ నిర్మాణమని అంటారు కదా. కావున నవ నిర్మాణం చేసే బుద్ధి ఉంటుంది. అందుకే నిర్మానంగా (నమ్రత) కూడా ఉంటారు, నవ నిర్మాణాన్ని కూడా చేస్తారు. ఈ విశేషతలు ఉన్నవారినే నిశ్చయబుద్ధి విజయులు అని అంటారు. నిమిత్తము, నిర్మానము (నమ్రత) మరియు నిర్మాణము. నిశ్చయబుద్ధి కలవారి భాష ఏమి ఉంటుంది? నిశ్చయబుద్ధి కలవారి భాషలో సదా మధురత ఉండడం అనేది కామన్ విషయము, అంతేకాక ఉదారత కూడా ఉంటుంది. ఉదారత అనగా సర్వాత్మలను ముందుకు తీసుకువెళ్ళాలనే ఉదారత ఉంటుంది. ‘ముందు మీరు’, ‘నేను-నేను’ కాదు. ఉదారత అనగా ఇతరులను ముందుంచడము. ఉదాహరణకు బ్రహ్మా బాబా సదా జగదంబను మరియు పిల్లలను ముందుంచారు - నా కన్నా జగదంబ చురుకైనవారు, నా కన్నా ఈ పిల్లలు చురుకైనవారని అనేవారు. ఇది ఉదారత యొక్క భాష. ఎక్కడైతే ఉదారత ఉంటుందో, ఎక్కడైతే స్వయం ముందు ఉండాలనే కోరిక ఉండదో, అక్కడ డ్రామానుసారంగా స్వతహాగానే మనసుకు ఇష్టమైన ఫలం తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఎంతైతే స్వయం ఇచ్ఛా మాత్రం అవిద్య (కోరిక అంటే ఏమిటో తెలియని) స్థితిలో ఉంటారో, అంతగా తండ్రి మరియు పరివారం, మిమ్మల్ని మంచివారిగా, యోగ్యులుగా భావించి ముందుంచుతారు. కావున మనసుతో ‘ముందు మీరు’ అని అనేవారు వెనుక ఉండలేరు. వారు మనసుతో ‘ముందు మీరు’ అని అనడంతో, సర్వుల ద్వారా వారు ముందు ఉంచబడతారు. కానీ కోరిక కలవారు ముందు ఉండరు. కావున నిశ్చయబుద్ధి కలవారి భాష సదా ఉదారత కల భాష, సంతుష్టత కల భాష మరియు సర్వుల కళ్యాణం చేసే భాషగా ఉంటుంది. ఇటువంటి భాష కలవారిని నిశ్చయబుద్ధి విజయులు అని అంటారు. అందరూ నిశ్చయబుద్ధి కలవారే కదా? ఎందుకంటే నిశ్చయమే పునాది.

కానీ ఎప్పుడైతే పరిస్థితులు, మాయ, సంస్కారాలు, రకరకాల స్వభావాల తుఫానులు వస్తాయో, అప్పుడు నిశ్చయము యొక్క పునాది ఎంత దృఢంగా ఉంది అనేది తెలుస్తుంది. ఎలాగైతే ఈ పాత ప్రపంచంలో రకరకాల తుఫాన్లు వస్తాయి కదా, ఒక్కోసారి గాలి తుఫాన్లు, ఒక్కోసారి సముద్ర తుఫాన్లు..... అలాగే ఇక్కడ కూడా రకరకాల తుఫాన్లు వస్తాయి. తుఫాను ఏమి చేస్తుంది? ముందు పైకి ఎగరేస్తుంది, తర్వాత విసిరేస్తుంది. అలా ఈ తుఫాను కూడా ముందు తన వైపుకు ఆనందంలో పైకి ఎగరేస్తుంది. అల్పకాలిక నషాలో పైకి తీసుకువెళ్తుంది, ఎందుకంటే ఏ ప్రాప్తి లేకుండా వీరు నా వైపు ఉండరు అని మాయకు కూడా తెలుసు. కావున ముందు కృత్రిమమైన ప్రాప్తిలో పైకి ఎగిరేలా చేస్తుంది. తర్వాత కిందికి దిగే కళలోకి తీసుకొస్తుంది. మాయ తెలివైనది. కావున నిశ్చయబుద్ధి కలవారి దృష్టి త్రినేత్రిగా ఉంటుంది, మూడవ నేత్రంతో మూడు కాలాలను చూస్తారు, అందుకే ఎప్పుడూ మోసపోలేరు. కావున తుఫానుల సమయంలోనే నిశ్చయం యొక్క పరీక్ష జరుగుతుంది. ఎలాగైతే తుఫాన్లు అనేవి పెద్ద-పెద్ద పాత వృక్షాల పునాదులను కూడా పెకిలించి వేస్తాయో, అలా ఈ మాయ తుఫాన్లు కూడా నిశ్చయమనే పునాదిని పెకిలించే ప్రయత్నం చేస్తాయి. కానీ రిజల్టులో పెకిలించబడేవారు తక్కువగా ఉంటారు, కదిలేవారు ఎక్కువగా ఉంటారు. కదలడంతోనే పునాది కచ్చాగా (అపరిపక్వంగా) అయిపోతుంది. కావున ఇటువంటి సమయంలో తమ నిశ్చయమనే పునాదిని చెక్ చేసుకోండి. నిశ్చయం పక్కాగా ఉందా అని ఎవరినైనా అడిగితే ఏమంటారు? చాలా బాగా భాషణ చేస్తారు. నిశ్చయంలో ఉండడం మంచిదే, కానీ సమయానికి ఒకవేళ నిశ్చయం కదిలినట్లయితే, ఈ నిశ్చయం కదలడం అనగా జన్మ-జన్మల ప్రారబ్ధం నుండి కదిలిపోవడము, కావున తుఫాన్ల సమయంలో చెక్ చేసుకోండి - ఎవరైనా హద్దు గౌరవ-మర్యాదలను ఇవ్వకపోయినా లేదా వ్యర్థ సంకల్పాల రూపంలో మాయ తుఫాన్లు వచ్చినా, ఏదైనా కోరిక పెట్టుకున్నప్పుడు ఆ కోరిక అనగా ఇచ్ఛ పూర్తి కాకపోయినా, అలాంటి సమయంలో - నేను సమర్థుడైన తండ్రి యొక్క సమర్థమైన ఆత్మను అన్నది స్మృతి ఉంటుందా లేదా వ్యర్థమనేది సమర్థంపై విజయం పొందుతుందా. ఒకవేళ వ్యర్థము విజయం పొందితే, నిశ్చయము యొక్క పునాది కదులుతుంది కదా. సమర్థ ఆత్మగా అనుభవం చేయడానికి బదులుగా స్వయాన్ని బలహీన ఆత్మగా అనుభవం చేస్తారు. నిరాశ పడతారు, అందుకే తుఫాన్ల సమయంలో చెక్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. హద్దు గౌరవ-మర్యాదలు మరియు నేను-నాది అనేవి ఆత్మిక గౌరవం నుండి కిందకు తీసుకొస్తాయి. హద్దుకు సంబంధించిన ఏ కోరికైనా సరే, ఇచ్ఛా మాత్రం అవిద్య అనే నిశ్చయం నుండి కిందకు తీసుకొస్తుంది. కావున నిశ్చయం అంటే అర్థము - నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అని భావించడం మాత్రమే కాదు, కానీ నేను ఎటువంటి ఆత్మను! ఆ నషా, ఆ స్వమానము సమయానికి అనుభవమవ్వడాన్నే - నిశ్చయబుద్ధి విజయీ అని అంటారు. ఏ పరీక్ష లేకుండానే నేను పాస్ విత్ ఆనర్ అయ్యాను అని అంటే వారిని ఎవరైనా నమ్ముతారా? సర్టిఫికెట్ కావాలి కదా. ఎవరెంతగా పాస్ అయినా, డిగ్రీ తీసుకున్నా కానీ సర్టిఫికెట్ లభించనంత వరకు విలువ ఉండదు. పరీక్ష సమయంలో పరీక్ష వ్రాసి, పాస్ అయి తండ్రి నుండి మరియు పరివారం నుండి సర్టిఫికెట్ తీసుకోవాలి. అప్పుడు వారిని నిశ్చయబుద్ధి విజయులని అంటారు. అర్థమయిందా? కనుక పునాదిని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. నిశ్చయబుద్ధి కలవారి విశేషతలను విన్నారు కదా. ఎలాంటి సమయమో, అలాంటి ఆత్మిక నషా జీవితంలో కనిపించాలి. కేవలం మీ మనసు మాత్రమే సంతోషించడం కాదు, కానీ ఇతరులు కూడా సంతోషించాలి. అవును, వీరు నషాలో ఉండే ఆత్మ అని అందరూ అనుభవం చేయాలి. కేవలం మనసుకు పసందైన వారిగానే కాదు, కానీ లోకానికి పసందైన వారిగా, బాబాకు పసందైన వారిగా అవ్వాలి. ఇటువంటి వారినే విజయులని అంటారు. అచ్ఛా.

సర్వ నిశ్చయబుద్ధి విజయీ రత్నాలకు, నిశ్చింతగా ఉండే సర్వ నిశ్చింత పిల్లలకు, నిశ్చిత విజయులమనే నషాలో ఉండే సర్వ ఆత్మిక ఆత్మలకు, సర్వ తుఫాన్లను దాటి వాటిని కానుకగా అనుభవం చేసే విశేష ఆత్మలకు, సదా చలించకుండా, స్థిరంగా, ఏకరస స్థితిలో స్థితులై ఉండే నిశ్చయబుద్ధి పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

విదేశీ సోదరీ-సోదరులతో బాప్ దాదా కలయిక - స్వయాన్ని సమీప రత్నాలుగా అనుభవం చేస్తున్నారా? సమీప రత్నాల గుర్తు ఏమిటి? వారు సదా సహజంగా మరియు స్వతహాగా జ్ఞానయుక్త ఆత్మలుగా, యోగయుక్త ఆత్మలుగా, గుణమూర్తులుగా, సేవాధారులుగా ఉన్నట్లుగా అనుభవం చేస్తారు. సమీప రత్నాల ప్రతి అడుగులోనూ ఈ నాలుగు విశేషతలు సహజంగా అనుభవమవుతాయి, ఒక్కటి కూడా తక్కువ కాదు. జ్ఞానంలో తక్కువగా ఉంటూ యోగంలో చురుకుగా ఉండడం లేదా దివ్య గుణాల ధారణలో బలహీనంగా ఉండడం అనేది జరగదు. వారు అన్నింటినీ సదా సహజంగా అనుభవం చేస్తారు. సమీప రత్నాలు ఏ విషయంలోనూ శ్రమను అనుభవం చేయరు, కానీ సహజ సఫలతను అనుభవం చేస్తారు, ఎందుకంటే సంగమయుగంలో బాప్ దాదా పిల్లలను శ్రమ నుండి విడిపిస్తారు. శారీరిక శ్రమ అయినా, మానసిక శ్రమ అయినా, 63 జన్మలు శ్రమించారు కదా. తండ్రిని పొందేందుకు రకరకాల సాధనాల ద్వారా ప్రయత్నించి మానసిక శ్రమ చేశారు. అంతేకాక, ధనం విషయంలో కూడా చూడండి, ఏదైతే సర్వీస్ చేస్తున్నారో, దేనినైతే బాప్ దాదా ఉద్యోగమని అంటారో, అందులో కూడా ఎంత శ్రమ చేస్తారు. అందులో కూడా శ్రమించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడింక అర్ధకల్పము ఈ ఉద్యోగాలు చెయ్యరు, వీటి నుండి కూడా విముక్తులైపోతారు. లౌకిక ఉద్యోగము చెయ్యరు, భక్తి కూడా చెయ్యరు - రెండింటి నుండి ముక్తి లభిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, లౌకిక కార్యము చేస్తున్నా కానీ బ్రాహ్మణ జీవితంలోకి రావడంతో లౌకిక కార్యము చేస్తున్నా కానీ తేడా ఉంటుంది కదా. ఇప్పుడు లౌకిక కార్యము చేస్తున్నా కానీ డబల్ లైట్ గా ఉంటారు, ఎందుకు? ఎందుకంటే లౌకిక కార్యము చేస్తూ కూడా, ఈ కార్యము అలౌకిక సేవార్థము నిమిత్తంగా చేస్తున్నామనే సంతోషం ఉంటుంది. మీ మనసులో కోరికలైతే లేవు కదా. ఎక్కడైతే కోరిక ఉంటుందో, అక్కడ శ్రమ అనిపిస్తుంది. ఇప్పుడు నిమిత్తమాత్రంగా చేస్తారు, ఎందుకంటే తనువు, మనసు, ధనము - మూడింటినీ ఉపయోగించడం ద్వారా ఒకటికి పదమాల రెట్లు అవినాశీ బ్యాంకులో జమ అవుతోందని మీకు తెలుసు. తర్వాత జమ చేసుకున్నది తింటూ ఉండండి. యోగం జోడించడం, జ్ఞానాన్ని వినడం, వినిపించడం యొక్క పురుషార్థం నుండి, ఈ శ్రమ నుండి విముక్తులైపోతారు. అప్పుడప్పుడు క్లాసులు విని అలసిపోతారు కదా. అక్కడ (సత్యయుగంలో) ఏదైతే లౌకిక రాజనీతి యొక్క చదువు ఉంటుందో, అది ఆడుతూ పాడుతూ చదువుకుంటారు, ఇన్ని పుస్తకాలు చదవాల్సి ఉండదు. అన్ని రకాల శ్రమల నుండి విముక్తులైపోతారు. చాలామందికి చదువు కూడా భారముగా అనిపిస్తుంది. సంగమయుగంలో శ్రమ నుండి విముక్తులయ్యే సంస్కారాన్ని నింపుకుంటారు. మాయా తుఫాన్లు వస్తాయి కానీ మాయపై విజయం పొందడాన్ని కూడా ఒక ఆటగా భావిస్తారు, శ్రమగా కాదు. ఆటలో కూడా ఏం ఉంటుంది? విజయాన్ని పొందవలసి ఉంటుంది కదా. కనుక మాయపై కూడా విజయాన్ని పొందే ఆటను ఆడుతారు. ఆటగా అనిపిస్తుందా లేక పెద్ద విషయం అనిపిస్తుందా? మాస్టర్ సర్వశక్తివంతుడను అనే స్థితిలో స్థితులైనప్పుడు ఆటగా అనిపిస్తుంది. అంతేకాక, అర్ధకల్పానికి వీడ్కోలు తీసుకొని వెళ్ళిపో అని ఛాలెంజ్ చేస్తారు. కనుక వీడ్కోలు సమారోహాన్ని జరుపుకునేందుకు వస్తుంది, యుద్ధం చేసేందుకు రాదు. విజయీ రత్నాలు ప్రతి సమయము, ప్రతి కార్యములో విజయులుగా ఉంటారు. విజయులే కదా? (హా జీ). అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ‘హా జీ’ అని అనాలి. ఎంతైనా మీరు మంచి ధైర్యవంతులుగా అయ్యారు. ఇదివరకు కొంచెం త్వరగా భయపడిపోయేవారు, ఇప్పుడు ధైర్యవంతులుగా అయ్యారు. ఇప్పుడు అనుభవజ్ఞులుగా అయ్యారు. కావున అనుభవం యొక్క అథారిటీ కలవారిగా అయ్యారు, పరిశీలించే శక్తి కూడా వచ్చింది, అందుకే భయపడరు. అనేక సార్లు విజయులుగా అయ్యారు, అవుతున్నారు, మరియు అవుతూ ఉంటారు - ఇదే స్మృతిని సదా ఉంచుకోండి. అచ్ఛా.

వీడ్కోలు సమయంలో దాదీలతో (జానకి దాది 3-4 రోజులు బొంబాయి తిరిగి వచ్చారు) - ఇప్పటి నుండే చక్రవర్తిగా అయ్యారు. మంచిది, ఇక్కడ కూడా సేవ ఉంది, అక్కడ కూడా సేవ చేసారు. ఇక్కడ ఉన్నా సేవ చేస్తారు మరియు ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా సేవ జరుగుతుంది. చాలా పెద్ద సేవా కాంట్రాక్టు తీసుకున్నారు. మీరు చాలా పెద్ద కాంట్రాక్టరు కదా. చిన్న-చిన్న కాంట్రాక్టర్లు చాలామంది ఉన్నారు కానీ పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద పనులు చేయాల్సి ఉంటుంది. (బాబా, ఈ రోజు మురళి వింటూ చాలా మజా కలిగింది). అది అంటేనే మజా. మంచిది, మీరు క్యాచ్ చేసి (గ్రహించి) ఇతరులకు క్లియర్ (స్పష్టం) చేస్తారు. అందరు ఒకే విధంగా క్యాచ్ చెయ్యలేరు. ఎలాగైతే జగదంబ మురళి విని, స్పష్టం చేసి, సహజం చేసి, అందరికీ ధారణ చేయిస్తూ ఉండేవారో, అలా ఇప్పుడు మీరు నిమిత్తులుగా ఉన్నారు. చాలామంది కొత్తవారు అర్థము చేసుకోలేరు. కానీ బాప్ దాదా కేవలం ఎదురుగా ఉన్నవారినే చూడరు. కేవలం సభలో కూర్చొన్న వారినే చూడరు, అందరినీ ఎదురుగా ఉంచుకుంటారు. కానీ ఎంతైనా ఎదురుగా అనన్యులైన పిల్లలు ఉన్నప్పుడు, వారి పట్ల వెలువడుతాయి. మీరైతే చదివి కూడా క్యాచ్ చెయ్యగలరు. అచ్ఛా.

Comments