25-11-1995 అవ్యక్త మురళి

         25-11-1995         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 పరమతం, పరచింతన మరియు పరదర్శనం నుండి ముక్తులుగా అవ్వండి మరియు పరోపకారిగా అవ్వండి.

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న బాబా పిల్లల్లోని విశేషమైనవారు ఎవరైతే ఉన్నారో ఆ విశేషాత్మలను చూస్తున్నారు. భారతవాసీయులు అయినా, విదేశంలో ఏ మూల ఉన్నా కానీ బాప్ దాదా విశేష పిల్లలందరినీ సమీపంగా చూస్తున్నారు. బాప్ దాదా తన విశేష పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఎలాగైతే పిల్లలు అయిన మీరు బాబాని చూసి సంతోషపడతారు కదా! సంతోషంగా ఉంటుంది కనుకనే పరిగెత్తుకుని వచ్చారు కదా! అలాగే నా యొక్క ఒక్కొక్క పిల్లవాడు విశేషాత్మ అని బాబాకి కూడా సంతోషంగా ఉంటుంది. వృద్ధులు అయినా, చదువురాని వారు అయినా, చిన్నపిల్లలు అయినా, యువకులు అయినా, కుటుంబంలోని వారు అయినా కానీ మొత్తం విశ్వం ముందు విశేష ఆత్మలు. వైజ్ఞానిక అద్భుతాలు చూపించే పెద్ద పెద్ద వారు ఉన్నారు, చంద్రుని వరకు వెళ్ళిన వారు ఉన్నారు కానీ బాబా యొక్క విశేష పిల్లల ముందు వారు కూడా అజ్ఞానులే. ఎందుకంటే పంచతత్వాల గురించి తెలుసుకున్నారు, వాటిపై విజయం కూడా సాధించారు కానీ చిన్న బిందువు అయిన ఆత్మని తెలుసుకోలేదు. కానీ ఇక్కడ నీవెవరు? అని చిన్న పిల్లవాడిని అడిగితే ఏం చెప్తాడు? నేను ఆత్మను అని చెప్తాడు కదా! ఆత్మ ఎక్కడ ఉంటుందో కూడా చెప్తాడు. ఆత్మ అంటే ఏమిటి అని వైజ్ఞానికులని అడిగితే ఏమంటారు? ఆత్మ జ్ఞానాన్ని ఇప్పటికి తెలుకోలేదు. చరిత్రపరంగా లేదా ఈ ప్రపంచం వారి దృష్టిలో ఎంత విశేషం అయిన వారు అయినా కానీ స్వయాన్ని తెలుసుకోలేదు అంటే వారి కంటే ఇక్కడ ఉన్న 5 సంవత్సరాల పిల్లవాడు విశేషం. ఆదిలో మీరందరు మంచి నషాగా ఒక పాట పెట్టుకునేవారు, ఆ పాట ఏమిటో గుర్తుందా? ఒక పాట ఉండేది - ఎంత పెద్ద షేర్ అయినా, స్వామి అయినా కానీ ఈశ్వరుని గురించి తెలుసుకోలేదు...... అని. అలాగే ఎంత పెద్దవారు అయినా, నేతలైనా, అభినేతలైనా కానీ స్వయం గురించి తెలుసుకోలేదు అంటే వారికి ఇంకేమి తెలిసినట్లు? మీరు అటువంటి విశేషాత్మలు. ఇక్కడ చదువురాని వృద్ద మాతని ఒకవైపు, రెండవవైపు ఒక మంచి మహాత్మని ఉంచితే - మేము పరమాత్మని పొందాం అని వృద్ద మాత మంచి నషాతో చెప్తుంది. పరమాత్మను పొందటం చాలా కష్టం అని మహాత్మ అంటారు. కానీ ఇక్కడ 100 సంవత్సరాల ఆయుష్షు కలిగిన వారు అయినా కానీ నిశ్చయబుద్దితో ఏమి చెప్తారు? మీరు వెతుకుతున్నారు, మేము పొందాము అని అంటారు. అంటే మహాత్మ కూడా మీ ముందు ఎవరు? ప్రవృత్తిలో ఉండేవారు కూడా గట్టిగా చెప్తారు, మేము రెండు పడకలపై పడుకుంటున్నాం, కలిసి ఉండి కూడా పవిత్రంగా ఉంటున్నాం, ఎందుకంటే మా మధ్యలో బాబా ఉన్నారు అని. కానీ మహాత్మలు ఏమంటారు? నిప్పు మరియు దూది కలిసి ఉండటం అసంభవం అంటారు. కానీ మీకు అయితే ఏమిటి? ప్రవృత్తి వారు చెప్పండి. పవిత్రంగా ఉండటం సహజమా లేక కష్టమా? సహజమేనా లేదా అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుందా? పక్కా అయిన వారు పెద్ద సభలో అయినా కానీ పవిత్రత మా స్వధర్మం అని నషాగా చెప్తారు. పవిత్రత అనేది పరధర్మం కాదు, స్వధర్మం. స్వయానిది సహజం అనిపిస్తుంది, ఇతరులది కష్టం అవుతుంది. అపవిత్రత పరధర్మం కానీ పవిత్రత స్వధర్మం, ఇలా మీ విశేషత గురించి తెలుసుకుంటున్నారు కదా? ఎందుకంటే కొత్త కొత్త వారు చాలా మంది వచ్చారు కదా! కానీ ఎంత క్రొత్తవారు అయినా పవిత్రతా పాఠం పక్కాయే కదా! సంవత్సరం కూడా పూర్తి కాకుండానే బాబాని కలుసుకోవడానికి వచ్చేస్తున్నారు కొంతమంది పిల్లలు ఇలా కూడా చేస్తున్నారు. ఈ నియమం పక్కా అని అందరికీ తెలుసు కానీ మధువనం వచ్చేవరకు బాగానే ఉంటున్నారు కానీ ఆ తర్వాత బాబాని చూసేసాము, బాబా దగ్గరకి వెళ్ళి వచ్చేసాము అని తిరిగి వచ్చేసిన తర్వాత సోమరిగా కూడా అయిపోతున్నారు కానీ పవిత్రత యొక్క ప్రతిజ్ఞ ఎవరితో చేసారు? బాబాతో చేశారు కదా? బాబా ఆజ్ఞ కదా. బాబాతో ప్రతిజ్ఞ చేసి మరలా సోమరిగా అయిపోతే ఎవరికి నష్టం? బ్రాహ్మణ పరివారంలో అయితే ఒకరు వెళ్ళిపోతే 10 మంది వస్తారు. వారికే నష్టం కలుగుతుంది. అందువలన క్రొత్తగా మొదటిసారి వచ్చినవారు బాబా ఇంటికి చేరుకున్నారు. ఇది భాగ్యమే కానీ ఈ భాగ్యరేఖను ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు. అదృష్టాన్ని పెంచుకోవాలి. 

ఎంతమంది వచ్చారో అందరి పేరు రిజిష్టర్ లో అయితే ఉంది. రిజిష్టర్ లో మీ పేరు పక్కాగా వ్రాయించుకున్నారా లేదా కొద్దికొద్దిగా పచ్చిగా ఉన్నారా? ఎక్కడి నుండి వచ్చిన క్రొత్తవారు ఎవరైతే ఉన్నారో వారందరి జాబితా టీచర్స్ దగ్గర అయితే ఉంటుంది కదా. ప్రెజెంట్ మార్క్ వేస్తున్నారా? లేదా? టీచర్స్ నిజం చెప్పండి. ఒక్కొక్కసారి నిద్ర వస్తుంది, ఒక్కొక్కసారి అనారోగ్యం వస్తుంది, అప్పుడు క్లాస్ కి రాకపోతే ప్రెజెంట్ మార్క్ వేసుకుంటున్నారా? రోజూ రిజిష్టర్‌లో ప్రెజెంట్ మార్క్ ఉన్న టీచర్స్ చేతులు ఎత్తండి! మంచిది, రెగ్యులర్ గా ఉన్నారా లేదా అప్పుడప్పుడు తేడా వస్తుందా? రెండు, మూడు రోజులు మిస్ అయిపోతున్నారా? టీచర్స్ అందరూ పాస్ అయితే అందరు చప్పట్లు కొట్టండి. అయితే ఇప్పుడేమి చేయాలి? మీరు తీసుకువచ్చిన క్రొత్త వారిని వారు అక్కయ్య అయినా, అన్నయ్య అయినా వారిని మూడు,నాలుగు నెలల తర్వాత చూడండి ఎందుకంటే మొదట్లో చాలా నషా ఉంటుంది, తర్వాత నెమ్మది నెమ్మదిగా తక్కువ అయిపోతుంది. కనుక నాలుగు నెలల తర్వాత వారందరూ నిలకడగా ఉన్నారా లేక ఎక్కడికైనా చుట్టు తిరగడానికి వెళ్ళిపోయారా? అనే ఫలితం వ్రాయండి. ఎందుకంటే కొందరు అలా తిరుగుతూ కూడా ఉంటారు. ఒకటి రెండు సం||లు మాయ యొక్క యాత్ర చేసి మరలా వస్తారు. అందువలన కేవలం ఫలితం వ్రాయండి, 60 మంది వచ్చారంటే 60 మంది ఉన్నారా లేదా 60 మంది వచ్చారు, కానీ 40 మంది మిగిలారు. ఇలా కేవలం ఈ రెండు అక్షరాలే రతన్ మోహిని దాదీ పేరుకి ఉత్తరం వ్రాయండి. బయట అంటే పోస్ట్ కవర్ బ్రహ్మాకుమారీస్ అని వ్రాస్తారు కానీ ఈ కవర్‌పై పెద్ద అక్షరాలలో రతన్ మోహిని దాదీ పేరు వ్రాయండి. అప్పుడది దాదీకి వ్రాసారు అని అర్ధం అవుతుంది. లేకపోతే సాధారణ ఉత్తరాలు అయితే ఈషు బెహన్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎంత మంది విశేషాత్మలు తమ విశేషతను చూపిస్తారో చూస్తాను. లౌకికంలో కూడా బిడ్డ పుడితే ఏమంటారు? సదా దీర్ఘాషువుతో జీవించాలి అంటారు కదా! అలాగే బాప్ దాదా కూడా విశేషాత్మల యొక్క విశేషతను అవినాశిగా చూడాలనుకుంటున్నారు. కొంచెం సమయం కాదు. ఒకటి, రెండు సంవత్సరాలు నడవటం కాదు. అవినాశిగా ఉండేవారికే అవినాశి ప్రాలబ్దం లభిస్తుంది. అయితే మాతలు కూడా పక్కాయేనా? మీరు ఒక సంవత్సరం వారు అయినా, రెండు లేదా నాలుగు సంవత్సరాల వారు అయినా కానీ పరిసమాప్తి అనేది ఒకే సమయంలో అవుతుంది కదా! వినాశనం అయితే ఒకేసారి జరుగుతుంది కదా! లేక మేం వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది, మాకు సిల్వర్‌ జూబ్లీ అయిపోయిన తర్వాత వినాశనం అవ్వాలి అంటారా? ఇలా జరుగదు. అందువలన వెనుక వచ్చేవారు ఇంకా ముందుకి వెళ్ళిపోవాలి. కొంచెం సమయంలో చాలా సంపాదన చేసుకోగలరు. అయినా కానీ మీకు అయితే పురుషార్థానికి సమయం లభించింది. ఇక ముందు ఈ మాత్రం సమయం కూడా లభించదు. ఇప్పుడు ఆలస్యం అయ్యింది అనే బోర్డ్ పెట్టారు. కానీ ఇంకా బాగా ఆలశ్యం అయ్యింది అనే బోర్డ్ పెట్టలేదు. కేవలం మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుని ముందుకి వెళ్తూ ఉండాలి. ఇక ఏ విషయాలలోకి వెళ్ళకండి. 

ఈరోజు బాప్ దాదా చూస్తున్నారు పిల్లల పురుషార్థం యొక్క సమయం ఎందుకు వ్యర్ధంగా వెళ్ళిపోతుంది? అని. ఎవరు వ్యర్థంగా పోగొట్టుకోవాలి అనుకోవటంలేదు, మా సమయం సఫలం అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ మధ్యమధ్యలో అరగంట, పావుగంట లేదా అయిదు నిమిషాలు వ్యర్థంగా వెళ్ళిపోతున్నాయి దానికి కారణం ఏమిటి? ఈరోజు బాప్ దాదా చూశారు, చాలా మంది యొక్క పురుషార్ధం తక్కువగా, బలహీనంగా అయిపోవడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా చెప్పాను, కొత్తవేమీ కాదు కానీ డైమండ్ జూబ్లీలో విశేషంగా ఏ ధ్యాస ఉండాలో మొదటి నుండి చెప్తున్నారు, అయితే ఆ మూడు కారణాలు ఏమిటంటే - 

మొదటిది - నడుస్తూ, నడుస్తూ శ్రీమతంలో ఆత్మల యొక్క పరమతం కూడా కలిపేస్తున్నారు. ఎవరో ఒకరు ఏదొక విషయం చెప్పారు, మీరు అనుకుంటున్నారు వారు చాలా మంచివారు, సత్యమైన మహారథి అని మరియు మీకు వారిపై నమ్మకం కూడా ఉంటుంది కనుక ఆ ఆత్మ అటువంటి విషయాలు వినిపిస్తుంటే అవి వినాలనే అభిరుచి వస్తుంది, సమాచారం బావుంటుంది....... బయట ప్రపంచం వారికి వార్తలు ఎలాగైతే ఇష్టమో అలాగే బ్రాహ్మణ పరివారంలో కూడా వార్తలు వినటం ఇష్టం అనిపిస్తుంది. మీరు మహారథి అని వారిపై నమ్మకం పెట్టుకుని వారి విషయాలు విన్నారు అంటే, మీరు నింపుకున్నారు అంటే దానిని త్రెంచలేదు. అంటే నిజానికి ఆ విషయాలు సత్యమైనవే, అన్నీ అసత్యాలు ఉండవు, సత్యమైనవే అయినా కానీ బాబా ఆజ్ఞ ఏమిటి? అటువంటి సమాచారం వినండి అని బాబా ఆజ్ఞ ఇచ్చారా? ఇవ్వలేదు కదా! వాటితో మీకు ఏమీ సంబంధం లేదు, కేవలం వినడానికి మనస్సు ఇష్టపడుతుంది కానీ అవి విని మీరేమీ చేయలేరు కేవలం విన్నారు అంటే బుద్దిలోకి వెళ్ళాయి. దాని వలన సమయం వ్యర్ధం అయ్యిందా, లేదా? ఇంకా చెప్పాలంటే బాబా శ్రీమతంలో పరమతం కలిపేసారు. ఎందుకంటే బాబా ఆజ్ఞ ఏమిటంటే - అటువంటి విషయాలు వింటూ కూడా వినకండి. అయితే మరి మీరెందుకు విన్నారు? వారికి అలవాటు చేశారు అంతే. ఒకసారి వారు మీకు చెప్పారు, మీకు కూడా చాలా మంచిగా అనిపించింది, కొత్త విషయాలు తెలిశాయి, ఇలా కూడా జరుగుతున్నాయా అనేది తెలిసింది, అయితే ఒకసారి మీరు వారి విషయాలు విన్నారు అంటే రెండవసారి వారు ఎక్కడికి వెళ్తారు? మీ దగ్గరికే వస్తారు. అంటే మీరు వారికి ఒక చెత్త కుండి అయ్యారు. ఏదైనా అటువంటి సమాచారం తెలిస్తే ఇక మీ దగ్గరికే వచ్చి చెప్తారు. ఎందుకంటే మీరు విన్నారు కనుక మీ దగ్గరే చెప్తారు. అందువలన వారికి కూడా చెప్పి అటువంటి విషయాల నుండి వారిని కూడా ముక్తులు చేయండి. వాటిని మీరు విని వారి అభిరుచి పెంచకండి. ఒకవేళ మీరు విన్నారు అంటే వాటికి సదాకాలికంగా బిందువు పెట్టగల శక్తి ఉండాలి. స్వయంలో కూడా బిందువు పెట్టాలి. ఏ వ్యక్తి గురించి మీరు సమాచారం విన్నారో ఆ వ్యక్తి పట్ల దృష్టిలో కానీ, సంకల్పంలో కానీ అసహ్యభావన ఉండకూడదు. ఇంత శక్తి మీలో ఉంటే అది వినినట్లు అవ్వదు, కళ్యాణం చేయటం అవుతుంది. కానీ ఫలితం చూస్తే ఎక్కువ మందికి కొంచెం, కొంచెం చెత్త ప్రోగవటం వలన అసహ్యభావన వస్తుంది లేదా నడవడికలో కూడా తేడా వచ్చేస్తుంది. ఇక ఏమీ అవ్వదు కానీ ఆ ఆత్మ పట్ల సేవ చేయాలనే భావన ఉండదు, భారంగా అనిపిస్తుంది. దీనినే శ్రీమతంలో పరమతం కలపటం అంటారు. 

సమాచారాలు అయితే బాప్ దాదా కూడా వింటూంటారు కానీ ఈ విషయంలో జరుగుతున్నది ఏమిటి? ఎక్కువ విషయాలలో భావమే మారిపోతుంది. చెప్పటంలో కూడా భావం మారిపోతుంది. ఒకరు వచ్చి అంటారు - వీరిద్దరు మాట్లాడుకుంటున్నట్లు నేను చూశాను అని అంటారు. అది విన్న రెండవవారు అంటారు - అవును, వారిద్దరు నిల్చున్నారు, మంచి పద్దతిలో కూడా నిల్చోలేదు అంటారు. అంటే ఇక్కడ మరో విషయం కలిసిపోయింది, ఆ తర్వాత మూడవ వారు అంటారు - వారు అలా చేస్తూనే ఉంటారు అంటారు. చివరికి చూడండి భావం ఎంతగా మారిపోయిందో! అసలు వారి భావన ఏమిటి మరియు ఇలా చెప్పుకోవటంలో భావం ఎంతగా మారిపోయిందో! ఈ పరమతం వాయుమండలాన్ని పాడు చేస్తుంది. సమయం వ్యర్ధంగా పోవడానికి మొదటి కారణం - పరమతం మరియు రెండవ కారణం - పరచింతన. ఒక విషయం విని అది ఎనిమిది, పదిమందికి చెప్పకుండా ఉండలేరు. ఒకవేళ ఎవరైనా దూరదేశంలో ఉన్నా వారికి కూడా ఉత్తరం వ్రాస్తారు, ఇక్కడ చాలా క్రొత్త విషయం జరిగింది. మీరు వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అని వ్రాస్తారు. అంటే ఇది ఏమయ్యింది? పరచింతన అయ్యింది కదా ఉదాహరణకి మీరు ఒక నలుగురుకి చెప్పారు అనుకోండి అంటే ఆ నలుగురికి ఆ ఆత్మ పట్ల ఉన్న భావనని పాడు చేసారు మరియు పరచింతన ప్రారంభమయ్యింది అంటే దీని యొక్క వేగం చాలా తీవ్రంగా మరియు పెద్దగా ఉంటుంది. పరచింతన అనేది ఒకటి రెండు సెకనులలో పూర్తి అవ్వదు. బాప్ దాదా చెప్తూ ఉంటారు కదా, ఎవరికైనా జ్ఞానం చెప్పేటప్పుడు వారికి అభిరుచి పెంచటానికి కథ రూపంలో చెప్పండి అని. మొదట ఇలా జరిగింది, తర్వాత ఏమయ్యింది, తర్వాత ఏమయ్యింది అంటే అభిరుచి పెరుగుతుంది కదా! అలాగే పరచింతన అనేది కూడా ఒకటి వారు చాలా అభిరుచితో ఉంటారు మరియు రెండవది వారు తప్పకుండా ఆలోచిస్తూ ఉంటారు, తర్వాత ఏమయ్యింది, తర్వాత ఇలా అయ్యింది, అవును నిజమే ఇలా అయ్యింది.... ఇలా ఈ కథలు కూడా చాలా పెద్దవి. బాప్ దాదా పిల్లలందరి మనస్సు యొక్క మాటలు వింటున్నారు మరియు చూస్తున్నారు కూడా ఎంత దాచడానికి ప్రయత్నించినా కానీ అక్కడక్కడ బాప్ దాదా లోక సంగ్రహణార్థం పైకి చెప్పరు. కానీ అన్నీ తెలుసు, అన్నీ చూస్తారు. ఇది నేను ఎప్పుడు చేయలేదు అని చెప్పనా కానీ ఎన్నిసార్లు చేసారు, ఏమి  చేసారు, ఏ సమయంలో చేసారు, ఎంతమందితో చేసారు అనే రిజిష్టర్ అంతా బాప్ దాదా దగ్గర ఉంటుంది. అయినా కానీ అక్కడక్కడ నిశ్శబ్దంగా ఉండవలసి ఉంటుంది. రెండవ విషయం - పరచింతన. వారికి ఎప్పుడూ స్వచింతన నడవదు. పరచింతన చేసేవారు ఏ విషయం జరిగినా తమ పొరపాటు కూడా ఇతరులపై పెట్టేస్తారు. మరియు పరచింతన చేసేవారు విషయాలు తయారు చేయటంలో నెంబర్ వన్ గా ఉంటారు. వారి యొక్క పొరపాటు అంతా ఇతరులపై పెట్టేసి, వినే పెద్దవారు కూడా నిశ్శబ్దంగా అయిపోయే విధంగా రుజువు చేస్తారు. 

కేవలం జ్ఞానం యొక్క పాయింట్స్ రిపీట్ చేయటం, లేదా కేవలం జ్ఞానం యొక్క పాయింట్స్ వినటం మరియు వినపించటమే స్వచింతన కాదు. కానీ స్వచింతన అంటే మీలో ఉన్న సూక్ష్మ బలహీనతలను, చిన్న చిన్న పొరపాట్లను చింతన చేసి తొలగించుకోవాలి. పరివర్తన చేసుకోవాలి. ఇదే స్వచింతన. జ్ఞానం వినటం మరియు వినిపించడంలో అందరు తెలివైనవారే. జ్ఞానాన్ని చింతన చేస్తున్నారు, మననం చేస్తున్నారు. కానీ స్వచింతన యొక్క లోతైన అర్ధాన్ని స్వయం పట్ల ఉపయోగించాలి. ఎందుకంటే ఫలితంలో వీరు జ్ఞానాన్ని మంచిగా మననం చేస్తారు లేదా సేవలో మంచిగా జ్ఞానం ఉపయోగించారు అని చూడరు, ఈ ఫలితం కంటే ముందు స్వచింతన మరియు పరివర్తన అవ్వడం. అంతిమ ఫలితంలో ప్రత్యక్ష ధారణా స్వరూపానికే మొదట మార్కులు లభిస్తాయి. ధారణా స్వరూపంగా ఉండేవారు. స్వతహాగానే యోగిగా ఉంటారు. స్వచింతన యొక్క అర్ధమే పరివర్తన చేసుకోవటం. ఒకవేళ ఎక్కువ మార్కులు పొందాలంటే ఈనాటి విలువల గురించి ఇతరులకు ఏవిధంగా అయితే ఉపన్యాసం చెప్తున్నారో దానిని మొదట స్వయంలో పరిశీలించుకోండి. ఎందుకంటే సేవకి 1 మార్కు వస్తే ధారణకి 10 మార్కులు వస్తాయి. ఒకవేళ మీరు జ్ఞానం చెప్పలేరు కానీ మీ ధారణతో ప్రభావం వేస్తే అది కూడా మీ యొక్క సేవా ఖాతాలో మార్కులు జమ అవుతాయి. ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు, మాకు సేవ యొక్క అవకాశం తక్కువగా లభిస్తుంది, వేరేవారికి ఎక్కువ లభిస్తుంది, మాకు కూడా కావాలి, నాకెందుకు అవకాశం ఇవ్వటం లేదు అంటున్నారు. సేవ చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఒకవేళ బుద్ధి ఖాళీగా ఉంటే చాలా వ్యర్ధం వచ్చేస్తుంది. అందువలన బుద్ధిని సేవలో బిజీగా ఉంచటం అనేది మంచి సాధనం. సేవ యొక్క ఉత్సాహం మంచిగానే ఉంది. కానీ డ్రామానుసారంగా లేదా పరిస్థితులు అనుసారంగా మీకు అవకాశం లభించలేదు అనుకోండి మీ స్థితి ఇతరుల యొక్క సేవకి బదులు మీకు మీరే పడిపోతే లేదా ఆ సేవ మిమ్మల్ని అలజడిలోకి తీసుకువస్తే ఆ సేవ ఏమయ్యింది? ఆ సేవకి ఏ ప్రత్యక్షఫలం లభిస్తుంది? సత్యమైన సేవకి, ప్రేమతో చేసే సేవకి, అందరి ఆశీర్వాదాలతో చేసే సేవకి ప్రత్యక్షఫలంగా సంతోషం లభిస్తుంది. అలా కాకుండా సేవలో ఫీలింగ్ వచ్చింది అంటే బ్రాహ్మణాత్మలు ఆ ఫీలింగ్ ని ఏమంటారు? ఫ్లూ అంటారు. ఫ్లూ వచ్చినవారు ఏం చేస్తారు? నిద్రపోతూ ఉంటారు. తిండి తినకుండా నిద్రపోతారు. అలాగే ఇక్కడ కూడా ఫీలింగ్ వస్తే తినడం మానేస్తారు లేదా అలిగిపోతారు. అంటే ఇది కూడా ఫ్లూ జ్వరం అయ్యింది కదా! మీరు ధారణాస్వరూపంగా ఉన్నారు, సత్యమైన సేవాధారులే, స్వార్ధ సేవాధారులు కాదు. 1. కళ్యాణం యొక్క భావన ద్వారా చేసే సేవ, 2. స్వార్థం యొక్క సేవ. నాకు పేరు వస్తుంది, పత్రికలలో నా ఫోటో వేస్తారు, నా ఫోటో టి.వి.లో వస్తుంది, బ్రాహ్మణ పరివారంలో పేరు వస్తుంది, అక్కయ్య నన్ను ముందు పెడతారు, అడుగుతారు....ఈ భావాలన్ని స్వార్థ పేరు యొక్క భావాలు. సమయ ప్రమాణంగా, ప్రత్యక్షత అనుసరించి ఇప్పుడు సేవ మీ దగ్గరికి వస్తుంది. ఆదిలో స్థాపనా విషయం వేరు కానీ ఇప్పుడు మీరు సేవ వెనుక వెళ్ళవలసిన అవసరం లేదు, మీ దగ్గరికే స్వయంగా సేవ నడిచి వస్తుంది. అందువలన మీరు సత్యమైన సేవాధారులు. మీకు ఏ సేవా లభించలేదు అనుకోండి బాప్ దాదా చెప్తున్నారు, మీ ముఖం ద్వారా, నడవడిక ద్వారా సేవ చేయండి. మీ ముఖం బాప్ దాదా యొక్క సాక్షాత్కారం చేయించాలి. మీ నడవడిక, మీ ముఖం బాబా యొక్క స్మృతిని ఇప్పించాలి. ఈ సేవ నెంబర్ వన్ సేవ. అటువంటి సేవాధారులలో స్వార్ధ భావం ఉండదు. నాకే అవకాశం లభించాలి అని అనుకోకూడదు. ఎందుకు లభించదు, లభించవలసిందే అనే ఇటువంటి సంకల్పాలని కూడా స్వార్థం అంటారు. బ్రాహ్మణ పరివారంలో మీకు పేరు లేకపోయినా, మీరు మంచి సేవాధారులే కానీ మీకు పేరు లేదు కానీ బాబా దగ్గర అయితే ఉంది కదా! బాబా హృదయంలో పేరు ఉంటే ఇంకేమి కావాలి? కేవలం బాబా హృదయంలోనే కాదు అంతిమంలో నెంబర్ లభించేటప్పుడు కూడా మీ నెంబర్ ముందు ఉంటుంది. ఎందుకంటే బాప్ దాదా లెక్క చూస్తారు - మీకు అవకాశం లభించలేదు, మీరు సత్యమే అయినా కానీ అవకాశం లభించలేదంటే అది కూడా నోట్ అయిపోతుంది. మీరు అడిగి అవకాశం తీసుకున్నారు మరియు చేశారు మంచిదే కానీ దానికి కూడా మార్కులు కట్ అయిపోతాయి. ధర్మరాజు యొక్క ఖాతా తక్కువేమీ కాదు. చాలా సూక్ష్మ లెక్కల ఖాతా. అందువలన నిస్వార్థ సేవాధారిగా అవ్వండి, మీ స్వార్థం ఉండకూడదు. కళ్యాణం యొక్క స్వార్థం ఉండాలి. ఒకవేళ మీకు అవకాశం లభించింది కానీ ఇంకొకరు కూడా యోగ్యమైనవారే వారు కూడా అవకాశం కావాలనుకుంటారు కానీ దొరకలేదు. ఆ సమయంలో మీ అవకాశం వారికి ఇస్తే దానిలో వాటా మీకు జమ అయిపోతుంది. మీరు ఆ పని చేయలేదు, కానీ వారికి అవకాశం ఇచ్చారు. అంటే దానిలో వాటా మీకు జమ అయిపోతుంది. ఎందుకంటే సత్యమైన వజ్రంగా అవ్వాలి కదా! అందువలన లెక్కలు గురించి కూడా తెలుసుకోండి. బాగానే ఉన్నాము, అయిపోయింది..... అని సోమరిగా అవ్వవద్దు. చాలా సూక్ష్మమైన లెక్కల ఖాతా ఉంటుంది. బాబా కూడా ఏమీ చేయలేరు, స్వతహాగా నడుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బాప్ దాదా కూడా పిల్లల యొక్క ఖాతా చూస్తూ ఉంటారు. మొదటి విషయం పరమతం మరియు రెండవ విషయం పరచింతన. 

మూడవ విషయం - పరదర్శనం. ఇతరులను చూడటంలో చాలామంది తెలివిగా ఉన్నారు. పరదర్శనం అంటే ఏదైనా చూసినప్పుడు చూసిన తర్వాత ఆ విషయం ఎక్కడికి వెళ్తుంది? బుద్ధిలోకే వెళ్తుంది కదా! ఇతరులని చూడటంలో సమయం ఉపయోగించేవారికి స్వయాన్ని చూసుకోవటానికి సమయం ఎక్కడ ఉంటుంది? చాలా విషయాలు ఉంటాయి కదా! ఆ విషయాలు వినిపిస్తాయి మరియు కనిపిస్తాయి. ఎందుకంటే ఎంత పెద్ద సంఘటన ఉంటే అన్ని విషయాలు ఉంటాయి. ఈ విషయాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ విషయాలు ఇలా జరగకూడదు అని కొందరు అనుకుంటున్నారు. జరగకూడదు అని అనుకోవటం మంచిదే కానీ ఇలా జరగకూడదు అన్న విషయంలో మీరు ఎందుకు సమయాన్ని ఉపయోగిస్తున్నారు? ఈ విషయాలే పరీక్ష. ఎంత పెద్ద చదువు ఉంటే అంత పెద్ద పేపర్ కూడా ఉంటుంది. ఇటువంటి వాయుమండలాన్ని తయారుచేయటం అనేది అందరికి పరీక్ష పరమతం, పరచింతన మరియు పరదర్శనం నుండి ఎంత వరకు మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారు అని.  

బాధ్యత ఉంటుంది కనుక దాని కారణంగా వినవలసి ఉంటుంది. చూడవల్సి ఉంటుంది. దానిలో కళ్యాణకారి భావనతో వినాలి మరియు చూడాలి. బాధ్యత కనుక కళ్యాణకారి భావనతో వినటం సరైనదే. కానీ స్వస్థితిని అలజడిలోకి తీసుకువచ్చేసి చూడటం, వినటం లేదా ఆలోచించటం అనేది తప్పు. ఒకవేళ అది మీ బాధ్యతగా భావిస్తే ఆ బాధ్యత ముందు మీ బ్రేక్ శక్తివంతంగా చేస్కోండి. పర్వతం ఎక్కేటప్పుడు మొదటే సూచన ఇస్తారు, మీ బ్రేక్ ని మంచిగా పరిశీలించుకోండి అని అలాగే బాధ్యత అనేది కూడా ఉన్నత స్థితి. బాధ్యత నిర్వర్తించండి కానీ ఒక్క సెకనులో బిందువు పెట్టగల్గుతామా? అనేది పరిశీలించుకోండి. లేదా బిందువు పెట్టాలనుకుని ప్రశ్నార్థకం పెడుతున్నారా? అది తప్పు. దానిలో సమయం మరియు శక్తి వ్యర్థం అయిపోతాయి. అందువలన మొదట మీ బ్రేక్ ని శక్తివంతంగా చేసుకోండి. చూసారు లేదా విన్నారు. ఎంతవరకు కళ్యాణం చేయాలో చేశారు అంతే బిందువు పెట్టేయాలి. ఇటువంటి స్థితి ఉంటే బాధ్యత తీసుకోండి. లేకపోతే చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి, స్వచింతనలో ఉండండి. దీనిలోనే లాభం ఉంది. 

ఈరోజు పాఠం ఏమిటి? పరమతం, పరచింతన మరియు పరదర్శనం నుండి ముక్తులు అవ్వండి మరియు ఒక్క విషయం ధారణ చేయండి. పరోపకారిగా అవ్వండి. మూడు రకాలైన “పర” అనే వాటిని సమాప్తి చేసి ఒకే “పర” అంటే పరోపకారి అవ్వండి. అవ్వటం వస్తుందా? ఏ విషయాలతో ముక్తులు అవుతారు? మాతలు ఏం చేస్తారు? పిల్లల ఉపకారియా లేక పర-ఉపకారియా? సర్వులకు ఉపకారిగా అవ్వాలి. సహజమేనా లేదా కష్టమా? క్రొత్తవారు ఏమనుకుంటున్నారు? ఇది సహజమా లేదా కష్టమా? టీచర్స్ చెప్పండి సహజమేనా? (సహజమే) కాదు బాప్ దాదా కష్టమని అనుకుంటున్నారు. చాలా విషయాలు ఉంటాయి కదా! చాలా కష్టం కదా! ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు. కనుక సహజం, సహజం అంటున్నారు. రైలు నుండి దిగగానే ఏదైనా చిన్న విషయం వచ్చినా కష్టమంటారు. ఇంటికి లేదా సెంటర్ కి వెళ్ళిపోయిన తర్వాత ఏదోక విషయం తప్పకుండా పరీక్షగా వస్తుంది. డబల్ విదేశీయులకి సహజంగా అనిపిస్తుందా, కష్టంగా అనిపిస్తుందా? సహజం అని అనుకునే వారు చేతులెత్తండి. టీచర్స్ మొదటి నెంబర్ తీసుకుంటారు కదా? మరలా ఆ సమయంలో మాకు తెలియనే తెలియదు, మాకు ఆ జ్ఞానం లేదు అని అనకూడదు. అందువలన బాప్ దాదా మొదటే దేనిలో మార్కులు జమ అవుతాయి మరియు దేనిలో మార్కులు కట్ అవుతాయి అనేది చెప్తున్నారు. ఒకవేళ మొదటి నెంబర్ తీసుకోవాలంటే అలంకరించుకోండి. ఇప్పుడింకా ఎవరైనా చేయవచ్చు. ఇంకా ఏ సీట్స్ నిర్ణయించబడలేదు. బ్రహ్మాబాబా, మరియు జగదంబ సరస్వతి యొక్క సీట్లు తప్ప మిగిలిన అన్ని సీట్లు ఖాళీయే. ఎవరైనా తీసుకోవచ్చు. ఒక సంవత్సరం వారైనా తీసుకోవచ్చు. 

అయితే సదా ఏమి స్మృతి ఉంచుకుంటారు? మీ విశేషతలను జ్ఞాపకం ఉంచుకోండి. విశేషంగా భావిస్తే ఈ ఆటలు ఉండవు. ఇప్పుడు మరియు మొత్తం కల్పంలో కూడా విశేషంగా అవుతారు. ఇక ఏ ధర్మనేతకు లేదా మహాత్మలకి కూడా ఇటువంటి విధిపూర్వక పూజ జరుగదు. దేవతలకి జరిగినంతగా ఇంకెవరికి పూజ జరుగదు. నేతల విగ్రహాలనైతే ఎండలో పెట్టేస్తారు. మంచిది. 

నలువైపుల ఉన్న విశ్వం యొక్క విశేషాత్మలకు, సదా స్వచింతన, జ్ఞానచింతన చేసే శ్రేష్టాత్మలకు, సదా బాబా యొక్క శ్రేష్టమతానుసారంగా సంకల్పం, మాట మరియు కర్మ చేసే సమీప ఆత్మలకు, నలువైపుల డైమండ్ జూబ్లీలో స్వయాన్ని మరియు సేవని ముందుకు తీసుకువెళ్ళే విశేషాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments