25-03-1995 అవ్యక్త మురళి

       25-03-1995         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బ్రాహ్మణ జీవితంలో అన్నింటికంటే శ్రేష్టమైన ఖజానా - సంకల్ప ఖజానా.

ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల యొక్క ఖజానాల ఖాతాను చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డకి చాలా ఖజానాలు లభించాయి, మరియు అవినాశిగా, లెక్కలేనన్ని ఖజానాలు లభించాయి. కేవలం ఈ జన్మకే కాదు అనేక జన్మలకి గ్యారంటి. ఇప్పుడు కూడా వెంట ఉంటాయి మరియు ఇక ముందు కూడా వెంట ఉంటాయి. ఈ రోజు విశేషంగా అన్నింటికంటే శ్రేష్ట ఖజానా, స్వరఖజానాలకి విశేష ఆధారం అయిన దానిని చూస్తున్నారు, ఆ ఖజానా అందరి ఖాతాలో ఎంతవరకు జమ అయ్యింది? అని. లెక్కలేనన్ని ఖజానాలైతే లభించాయి కానీ ఎంత జమ అయ్యింది? అనేది చూస్తున్నారు. అన్నింటికంటే శ్రేష్టఖజానా - సంకల్పఖజానా. మీ అందరి శ్రేష్ట సంకల్పమే బ్రాహ్మణ జీవితానికి ఆధారం. సంకల్ప ఖజానా అనేది చాలా శక్తివంతమైనది. సంకల్పం ద్వారా సెకను కంటే తక్కువ సమయంలో పరంధామం వరకు చేరుకుంటున్నారు. సంకల్పశక్తి అనేది ఆటోమేటిక్ రాకెట్ కంటే తీవ్ర వేగం గల రాకెట్. దీని ద్వారా ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకుంటున్నారు. కూర్చుని ఉన్నా లేదా ఏ పని చేస్తున్నా కానీ సంకల్ప ఖజానాతో లేదా శక్తితో ఏ ఆత్మ దగ్గరికి చేరుకోవాలంటే వారికి సమీపంగా మిమ్మల్ని మీరు అనుభవం చేసుకుంటున్నారు. ఏ స్థానానికి చేరుకోవాలో ఆ స్థానానికి చేరుకుంటున్నారు. ఏ స్థితి కావాలంటే అది అంటే శ్రేష్టస్థితి అయినా, సంతోషం యొక్క స్థితి అయినా, వ్యర్ధం యొక్క స్థితి అయినా, బలహీనస్థితి అయినా ఏదైనా కానీ ఒక సెకను యొక్క సంకల్పంతో మీదిగా చేసుకుంటున్నారు. ఒక్క సెకనులో నేను శ్రేష్ట బ్రాహ్మణాత్మను అని సంకల్పం చేయగానే ఒక సెకనులో శ్రేష్టస్థితి మరియు శ్రేష్ట అనుభూతి అవుతుంది మరలా ఒక సెకను నేను బలహీన ఆత్మను, నాలో ఏ శక్తి లేదు అనుకుంటే సెకనులో సంతోషం మాయం అయిపోతుంది. స్థితిలో అలజడి యొక్క గుర్తులు అనుభవం అవుతాయి. కానీ రెండు స్థితులకు కూడా ఆధారం సంకల్పం. స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా సంకల్పం ఆధారంగానే స్థితిని తయారుచేసుకుంటారు. నేను బిందువుని, నేను ఫరిస్తాను అనే స్థితి కూడా సంకల్పం ద్వారానే తయారవుతుంది, అంటే సంకల్పం ఎంత శక్తిశాలి!

జ్ఞానానికి కూడా ఆధారం - సంకల్పం. నేను ఆత్మను, శరీరాన్ని కాదు అనే సంకల్పం చేస్తున్నారు. రోజంతటిలో మనస్సు, బుద్ధికి శుద్ద సంకల్పాలు ఇస్తున్నారు లేదా మననంలో శుద్ధ సంకల్పాలు చేస్తారు అంటే మనన శక్తికి కూడా ఆధారం ఏమిటి? దానికి కూడా ఆధారం సంకల్పశక్తి, ధారణ చేస్తున్నారు అంటే మనస్సు, బుద్ధికి సంకల్పం ఇస్తున్నారు, ఈ రోజు నేను సహనశక్తిని ధారణ చేయాలి అని అంటే ధారణకి కూడా ఆధారం సంకల్పం. సేవ చేస్తున్నారు, ప్లాన్ తయారుచేసుకుంటున్నారు ప్లాన్ ఎలా తయారవుతుంది? అనుభవమే కదా! శుద్ధసంకల్పాలే నడుస్తాయి కదా, శుద్ధసంకల్పాల ద్వారానే ప్లాన్ తయారవుతుంది. అందువలన బ్రాహ్మణజీవితం యొక్క విశేష శ్రేష్టఖజానా - సంకల్ప ఖజానా. ఒకవేళ మీరు మీ సంకల్ప ఖజానాను సఫలం చేసుకుంటే మీ స్థితి, కర్మ రోజంతా చాలా మంచిగా ఉంటుంది మరియు సంకల్ప ఖజానాను వ్యర్ధంగా పోగొడితే ఫలితం ఏమి ఉంటుంది? ఏ స్థితి కోరుకుంటున్నారో ఆ స్థితి రాదు. మీ అందరికీ తెలుసు, వ్యర్థ సంకల్పాలు బుద్దిని బలహీనం చేసేస్తాయి మరియు స్థితిని కూడా బలహీనం చేసేస్తాయి. ఎవరికి వ్యర్ధం ఉంటుందో వారి బుద్ధి బలహీనంగా ఉంటుంది, అలజడి అయిపోతుంది. నిర్ణయం మంచిగా ఉండదు, సదా అయోమయం అయిపోతారు. ఏం చేయను, ఏం చేయవద్దు అనే నిర్ణయం యదార్ధంగా ఉండదు మరియు వ్యర్థ సంకల్పాల వేగం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అనుభవమే కదా! వ్యర్దసంకల్పాలు అందరికీ అనుభవమే. వికల్పాలు లేవు కానీ వ్యర్ధం యొక్క అనుభవం అందరికి ఉంది. వాటి వేగం చాలా తీవ్రంగా ఉంటుంది కనుక అదుపు చేసుకోలేకపోతున్నారు. అదుపు తప్పిపోతుంది. అలజడి, సంతోషం మాయం అయిపోవటం, మనస్సు ఉదాశీనంగా ఉండటం, జీవితంలో మజా లేకపోవటం ఇవన్నీ వ్యర్థ సంకల్పాలకు గుర్తులు. నా స్థితి ఇలా ఎందుకు అయిపోయింది? అనేది కొందరికి తెలియనే తెలియటం లేదు. పెద్ద, పెద్ద విషయాలను చూసుకుంటున్నారు, ఏ వికర్మ చేయలేదు కదా, ఏ పొరపాటు చేయలేదు కానీ సంతోషం ఎందుకు తక్కువ అవుతుంది, ఉదాశీనత ఎందుకు వస్తుంది, జీవితం మజాగా ఎందుకు ఉండటం లేదు! జీవించాలని అనిపించటం లేదు. వీటన్నింటికి కారణం ఏమిటి? వికర్మలను, వికల్పాలను, పెద్ద, పెద్ద పొరపాట్లను పరిశీలించుకుంటున్నారు కానీ కానీ ఈ సూక్ష్మ పొరపాట్లు ఖజానాను వ్యర్ధంగా పోగొడుతున్నాయి. అంటే వ్యర్ధం యొక్క ఖాతా పెరిగిపోతుంది. ఎలా అయితే శారీరక రోగం కూడా మొదట పెద్దగా రాదు, చిన్నగా వస్తుంది కానీ ఆ చిన్నది పెరుగుతూ, పెరుగుతూ పెద్దదిగా అయిపోతుంది. ఆ పెద్దది పైకి కనిపిస్తుంది కానీ చిన్నరూపం కనిపించదు. అలాగే వ్యర్ధఖాతా, పోగొట్టుకునే ఖాతా పెరిగిపోతూ ఉంటుంది. పాపఖాతా వేరు కానీ ఇది ఖజానాను వ్యర్ధంగా పొగొట్టుకునే ఖాతా. పాపం అయితే స్పష్టంగా కనిపిస్తుంది, ఈ రోజు ఈ పాపం చేసాను కదా అందువలనే సంతోషం లేదు అని అనుభవం అయిపోతుంది. కానీ ఖజానాను వ్యర్ధంగా పోగొట్టుకునే ఖాతా యొక్క పరిశీలన తక్కువగా ఉంటుంది మరియు మీరు అనుకుంటారు, ఈ రోజు అయిపోయింది, మంచిగానే ఉంది, ఏ పొరపాటు చేయలేదు అని కానీ మీ సంకల్పం యొక్క శ్రేష్ట ఖజానాను జమ చేసుకున్నానా లేదా వ్యర్ధంగా పోగొట్టుకున్నానా? అనేది పరిశీలించుకోండి. జమ చేసుకోలేదు అంటే పోగొట్టుకున్నట్లే కదా! చాలా చేసేస్తున్నాం అని లోపల అనుకుంటున్నారు కానీ ఖాతాని పరిశీలించుకోండి - ఈరోజు ఏయే ఖజానాలను జమ చేసుకున్నాను? అని. పరిశీలించుకోవటం వస్తుంది. మీకు మీరు పరిశీలకులుగా అవుతున్నారా లేదా ఇతరులను పరిశీలించేవారిగా అవుతున్నారా? ఎందుకంటే మీకు మీరు లోపల చూసుకుంటున్నారు మరియు ఇతరులను అయితే బయటకి చూస్తున్నారు, ఇది సహజంగా ఉంటుంది. బాప్ దాదా చూస్తున్నారు, విశేష ఖజానా అయిన శ్రేష్ట సంకల్పాల ఖజానా చాలా వ్యర్ధం అయిపోతుంది. వ్యర్ధం అయ్యిందా లేదా సమర్ధంగా ఉందా? అనేది కూడా తెలియటంలేదు. 

బ్రహ్మాబాబాని పొదుపు యొక్క అవతారం అని అంటారు. మీరందరు ఎవరు? మీరు కూడా మాస్టర్ కదా! పొదుపు చేయటం రావటం లేదా? ఖర్చు చేయటం వస్తుంది. డబల్ విదేశీయులకు లౌకిక జీవితంలో కూడా జమాఖాతా తయారు చేసుకోవటం తక్కువగా వస్తుంది. తినేస్తారు మరియు ఖర్చు చేసేస్తారు అంటే అయిపోతుంది. అలా ఉంటారు కదా? బ్యాంక్ బేలన్స్ తక్కువగా ఉంచుకుంటారు కానీ దీనిలో పొదుపు యొక్క అవతారం అవ్వాలి. ఎవరు? వెనుక వారు చెప్పండి. ఎవరు? పొదుపు యొక్క అవతారాలేనా? అవునా లేక కాదా? పొదుపు చేయటం వస్తుందా లేక ఖర్చు చేయటం వస్తుందా? బావాదా చూస్తున్నారు ఎంత శ్రేష్ట సంకల్పాల ఖాతా జమా అవ్వాలో అంత జమ అవ్వటంలేదు, దానిలో వ్యర్థ ఖాతా ఎక్కువగా చూసారు. సంకల్పం వ్యర్ధం అయితే మిగిలిన ఖజానాలు స్వతహాగానే వ్యర్ధం అయిపోతాయి. సంకల్పం వ్యర్ధం అయితే కర్మ ఏమౌతుంది? మాట ఏమౌతుంది? వ్యర్ధమే అవుతాయి కదా! పునాది, సంకల్పం అందువలన సంకల్పాన్ని పరిశీలించుకోండి. తేలికగా వదిలి వేయకండి. మంచిగానే ఉంది, రెండు నిమషాలు వ్యర్ధం అయ్యాయి అంతే, ఎక్కువ వ్యర్ధం అవ్వలేదు... అని కాదు ఎందుకంటే ఆ రెండు నిమిషాలలో ఎన్ని సంకల్పాలు నడుస్తాయి? వ్యర్దసంకల్పాలు చాలా వేగంగా ఉంటాయి కదా! ఒక్క సెకనులో ఆబూ నుండి అమెరికా చేరిపోతాయి. స్థూలంగా వెళ్ళటానికి ఎన్ని గంటలు పడతాయి? సంకల్పం చాలా తీవ్రవేగంతో ఉంటుంది, ఆ వేగం అనుసరించి పరిశీలించుకోండి, మరియు రక్షించుకోండి. మీ సంకల్పశక్తి యొక్క పొదుపు చేయండి, మరలా రాత్రి పరిశీలించుకోండి. ధ్యాస పెట్టి దేనినైనా పొదుపు చేస్తే చేసింది కొంచెం అయినా కానీ ఆ పొదుపు ద్వారా చాలా సంతోషం అనుభవం అవుతుంది. 10 పౌండ్లు లేదా డాలర్ ఖర్చు అవ్వాల్సిందే దానిలో మీరు ఒక పౌండ్ లేదా డాలర్ మిగిల్చినా ఒక పౌండ్ మిగిల్చాము అని చాలా సంతోషంగా ఉంటుంది. మీ సంకల్పాలపై మీరు అదుపు ఉంచుకోండి. అనుకోవటం లేదు, అర్ధం చేసుకుంటున్నాము కానీ అయిపోతుంది ఏమి చేయము అని అనకండి. అయిపోతుంది అని ఎవరు అంటారు? యజమానియా లేక నౌకరా? యజమానికి అదుపులో ఉంటారు కదా. యజమానినే ఎవరైనా మోసం చేస్తే అతను యజమానియా? అందువలన పరిశీలించుకోండి - నియంత్రణా శక్తి ఉందా? అని. 1. పొదుపు చేయండి, వ్యర్థాన్ని సమర్థఖాతాలో జమ చేయండి 2. పొదుపు చేయలేకపోతే వ్యర్థాన్ని సమర్ధ సంకల్పాలలోకి పరివర్తన చేయండి. అదుపు చేసుకోలేకపోతే పరివర్తన అయితే చేసుకోగలరు కదా? దాని వేగాన్ని తొందరగా పరివర్తన చేయాలి. లేకపోతే అలవాటు అయిపోతుంది. ఒక గంటలో 5,10 నిమిషాలు అయినా వ్యర్ధంగా వెళ్తున్నప్పుడు ఆ 5 నిమిషాలు కూడా వ్యర్ధం నుండి శ్రేష్టంలోకి పరివర్తన అయిపోతే 12 గంటలలో 5,5 నిమిషాలు కలుపుకుంటే ఎన్ని అవుతాయి? మరియు ఎంత సంతోషంగా ఉంటుంది? ఎంతగా శ్రేష్ట సంకల్పాల ఖాతా జమ అయ్యి ఉంటుందో అంతగా అది సమయానికి కార్యంలో ఉపయోగపడుతుంది. లేకపోతే స్థూల ధరలు కూడా జమ అయ్యి లేకపోతే సమయానికి మోసపోతారు. అలాగే ఇక్కడ కూడా ఏదైనా పరీక్ష వస్తే మనస్సు, బుద్ది ఖాళీగా అనిపిస్తాయి, శక్తి ఉండదు. అప్పుడేమి చేయాలి? జమ చేసుకోవటం నేర్చుకోండి. తర్వాత సంవత్సరం చూస్తే అందరి శ్రేష్ట సంకల్పాల ఖాతా నిండుగా ఉండాలి. ఖాళీ ఖాళీగా ఉండకూడదు. ఈ శ్రేష్టసంకల్పాల ఖజానాయే శ్రేష్ట ప్రాలబ్దానికి ఆధారం అవుతుంది. జమ చేసుకోవటం వస్తుందా? లేదా ఎవరికైనా రావటం లేదా? రాజయోగులు అంటే పరిశీలించుకోవటం మరియు జమ చేసుకోవటం కూడా వస్తుంది. ఎవరికి ఖాతా జమ అయ్యి ఉంటుందో వారి నడవడిక, ముఖం సదా నిండుగా కనిపిస్తాయి. ఒకసారి ఒకలా, ఇంకొకసారి ఇంకొకలా, ఈ రోజు చూస్తే ముఖం చాలా మెరిసిపోతూ ఉంటుంది, రేపు చూస్తే ఉదాశీనంగా అయిపోతారు. ఇలా ఉండరు. రోజంతటిలో పరిశీలించుకోండి, మీరు ఎన్ని ఫోజులు మారుస్తున్నారు! ఎప్పుడైనా పరిశీలించుకున్నారా? చాలా ఫోజులు మారతాయి. బాప్ దాదా అయితే అందరి ఫోజులు చూస్తారు కదా! చూసి ఏం చేస్తారు? ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు కర్మ చేయటంలో ఎక్కువ సమయం ఉపయోగించటంలేదు కానీ కర్మ చేసేసిన తర్వాత పశ్చాత్తాపంలో ఎక్కువ సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. మరలా మూడురోజులు అయిపోయింది. సంతోషం లేదు అని అంటున్నారు. ఎందుకు సంతోషం లేదు? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఖజానా అయితే మీదే కానీ ఎవరు తీసుకెళ్ళిపోయారు? పశ్చాత్తాపం పడటం మంచిదే ఎందుకంటే పశ్చాత్తాపం పరివర్తన చేయిస్తుంది కానీ ఎక్కువ సమయం దానిలో ఉపయోగించకండి. పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటే వారం అంతా ఏడుస్తూనే ఉంటారు. పశ్చాత్తాప పడ్డారు, చాలా మంచిది కానీ పశ్చాత్తాపపడాలి మరియు ప్రాప్తి యొక్క సంతోషంలోకి రావాలి. ఇక ముందు కోసం సెకనులో ఇది చేయాలి, లేదా ఇది చేయకూడదు అని నిర్ణయించుకోవాలి. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా - నాట్ మరియు డాట్ ఈ రెండు మాటలను జ్ఞాపకం ఉంచుకోండి. ఆలోచించకండి మరియు బిందువు పెట్టేయండి. నాలుగు గంటలు ఏడ్చారు, కంటి నుండి నీళ్లు రాకపోయినా కానీ మనస్సులో ఏడుస్తూ ఉన్నారు. అరగంట కంటి నుండి నీళ్ళు వచ్చాయి మరియు నాలుగు గంటలు మనస్సులో ఏడ్చారు అంటే ఇది చాలా ఎక్కువ కనుక అంతగా పశ్చాత్తాపపడకండి. పశ్చాత్తాపానికి కూడా హద్దు ఉంచుకోండి. 

బాప్ దాదాకి డబల్ విదేశీయుల యొక్క ఒక విశేషత మంచిగా అనిపిస్తుంది వారికి ఏడవటం ఇష్టమనిపించదు కానీ ఒక విశేషత మంచిగా అనిపిస్తుంది అది ఏమిటి? సత్యమైన మనస్సుకి యజమాని రాజీ అవుతారు. సత్యం చెప్పటంలో భయపడరు, దాచుకోరు. సత్యమైన మనస్సు ఉంటుంది. అందువలనే బాబా యొక్క డబల్ ప్రేమకి కూడా పాత్రులు అయ్యారు. సత్యమైన మనస్సు ఉంది కనుక యజమానిని కూడా రాజీ చేసుకున్నారు. కానీ పరివర్తన కూడా అంత త్వరగా అవ్వాలి. ఇది అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది.... అని మాటిమాటికి వర్ణన చేయకండి. అయిపోయింది అంతే. ఇక ముందు ధ్యాసతో ఉండాలి. కానీ ఒక్కొక్కసారి ధ్యాస పెట్టుకోవడానికి బదులు అలజడి చేసేస్తున్నారు. అలా చేయకూడదు. ఉన్నతోన్నత న్యాయమూర్తిగా అవ్వండి. మామూలుగా కూడా ముఖ్య న్యాయమూర్తి ఉంటారు కదా! కానీ మీరు వారి కంటే ముఖ్య న్యాయమూర్తులు, కనుక ఇది తప్పా, ఒప్పా అని మీ గురించి మీరు త్వరగా నిర్ణయించుకోండి. తప్పు అయితే చేయకండి (నాట్) మరియు బిందువు (డాట్) పెట్టేయండి. ఇలా జరగకపోతే అలా అవుతుంది, ఇలా చేయకపోతే అలా అవుతుంది.... అంటే: పోగొట్టుకునే ఖాతాను జమ చేసుకుంటున్నారు. సంపాదన మరియు జమ ఖాతా కూడా సమాప్తి అయిపోతుంది. ఆలోచించండి కానీ వ్యర్థం కాదు. ఒక గంటలో ఇంత జమ చేసుకున్నాము అనే ఫలితం చూపించండి. వ్యర్ధం నడిచింది. కానీ మేము వ్యర్థాన్ని పరివర్తన చేసుకున్నాము మరియు జమ చేసుకున్నాము అనే ఫలితం చూపించండి. వ్యర్ధం నుండి రక్షణగా ఉండండి. ఈ పొదుపు యొక్క ఖాతా చాలా సంతోషాన్ని ఇస్తుంది.  

ఈ సంవత్సరం బాప్ దాదా పొదుపు యొక్క ఖాతాను నిండుగా చూడాలనుకుంటున్నారు. చేయగలరు కదా? చేయటం వస్తుందా? ఇప్పుడు తీవ్రవేగంతో చేయాలి. ఎందుకంటే సమయం కూడా వేగంగా వెళ్ళిపోతుంది కదా! దీనిలో నెంబర్ వన్ ఎవరు వస్తారో చూస్తాను. పొదుపు యొక్క ఖాతా ఎవరిది ఎక్కువగా ఉంటుందో చూస్తాను. రోజంతటిలో కేవలం ఒక గంట సాధారణంగా వెళ్ళినా మిగిలిన 11 గంటలు జమ అయ్యాయి కదా అంటే అద్భుతం కదా! నెంబర్ వన్ ఎవరు వస్తారో చూస్తాను? పొదుపు యొక్క ఖాతాలో ఎవరెవరు నెంబర్ వన్ వచ్చారో జాబితా తీస్తాను. సంకల్పాన్ని నియంత్రించుకుంటే మిగలిన వాటిని నియంత్రణ చేసే శ్రమ చేయనక్కర్లేదు. కొందరు అంటున్నారు. మాట్లాడాలనుకోలేదు, కానీ నోటి నుండి వచ్చేసింది అని కానీ ఏదైనా మొదట సంకల్పంలోనే వస్తుంది. ఆ తర్వాత మాట వస్తుంది. ఆ తర్వాత కర్మలోకి కూడా వస్తుంది. సంకల్పం వచ్చిన తర్వాతనే కర్మ జరుగుతుంది. ఒకవేళ ఎవరిపైనైనా కోప్పడాలి అంటే ముందుగానే సంకల్పంలో ప్లాన్ తయారుచేసుకుంటారు, ఇలా చేస్తాను, ఇలా మాట్లాడతాను, వారేమనుకుంటున్నారో... ఇలా ప్లాన్ తయారవుతుంది. మరలా దానిలో సమయాన్ని కూడా ఉపయోగిస్తారు. ఎప్పుడు వస్తారు, ఎవరు వస్తారు .... అని సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అంటే సంకల్ప ఖజానాతో పాటూ సమయం యొక్క ఖజానా కూడా వ్యర్థం అయిపోతుంది. రెండింటికి సంబంధం ఉంది. అందువలన సంకల్పాలను పొదుపు చేస్తే స్వతహాగానే సమయాన్ని రక్షించుకున్నట్లు. ఇప్పుడు డైమండ్ జూబ్లీ జరుపుకునేటందుకు ప్లాన్ తయారు చేస్తున్నారు కదా? డైమండ్ జూబ్లీలో బాప్ దాదా పిల్లల యొక్క ఒక దృశ్యం చూడాలనుకుంటున్నారు. దీపావళి జరుగుతుంది కదా లేదా ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు ప్రతీ చోట లైట్స్ వెలుగుతూ కనిపిస్తాయి కదా! చూసారు కదా? మీ దేశాలలో (విదేశాలు) అయితే క్రిస్మస్ జరుపుకుంటారు కదా. అప్పుడు ఎన్ని బల్బులు వెలుగుతూ ఉంటాయి. అన్నీ వెలుగుతూనే ఉంటాయి. ఇక్కడ చూసినా, అక్కడ చూసినా అంతా వెలుగుతూనే ఉంటుంది. అలాగే డైమండ్ జూబ్లీలో నిజమైన ఆత్మిక వజ్రం ప్రతి చోట వెలుగుతున్నట్లు కనిపించాలి. ఈ మెరుపు ఏమిటి? అని అందరు అనుభవం చేసుకోవాలి. వజ్రం మెరుస్తూ ఉంటుంది కదా! మట్టిలో దాచేసినా తన మెరుపుని పోగొట్టుకోదు. అలాగే మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా అందరు మిమ్మల్ని ప్రకాశిస్తున్న వజ్రంలా అనుభవం చేసుకోవాలి. వారికి తరంగాలు వ్యాపించాలి. ఎక్కడైనా లైట్స్ వెలుగుతూ అందంగా అలంకరించబడి ఉంటే మీరు చూడాలనుకున్నా, వద్దనుకున్నా కానీ దృష్టి ఆకర్షితం అయిపోతుంది కదా! అలాగే మొత్తం విశ్వంలో ఎన్ని వజ్రాలు వ్యాపించి ఉన్నాయి. మొత్తం విశ్వంలో ప్రకాశిస్తున్న వజ్రాలు తమ మెరుపుని చూపించినప్పుడు ఆ దృశ్యం ఎలా ఉంటుంది? చాలా బావుంటుంది కదా! ఆ దృశ్యాన్ని బాప్ దాదా ఫోటో తీస్తారు. ఎందుకంటే మీరు అయితే అన్ని చోట్లకు వెళ్ళలేరు. బాప్ దాదా అయితే వెళ్ళగలరు. ఈ స్థూల కెమెరా తీసుకుని ఎక్కడికి వెళ్తారు! ఇలా ప్రకాశిస్తున్న వజ్రాల యొక్క దృశ్యం విశ్వంలో కనిపించాలి. దీనిలో ఏదో అద్భుతం ఉంది అని ప్రారంభం అవ్వాలి. మొదట దీనిలో ఏదో ఉంది అంటారు. చివరికి అంతా దీనిలోనే ఉంది అంటారు. అయితే దానికి ఆధారం సంకల్ప ఖజానా యొక్క ఖాతాను జమ చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలలో పురుషార్ధం చేసి అలసిపోకండి. ఈర్య ఇంకా పోలేదు, కొంచెం కోపం వచ్చేస్తుంది, మాట అలా వచ్చేస్తుంది .... ఇలా ఒక్కొక్క విషయంలో శ్రమ చేయకండి. బీజాన్ని సరిచేస్తే వృక్షం స్వతహాగానే సరి అయిపోతుంది. అంటే వీటన్నింటికి బీజం సంకల్పం కదా! అందువలన సంకల్పం శ్రేష్టంగా అయితే అన్నీ శ్రేష్టంగా అయినట్లే. శ్రమ చేయవలసిన అవసరం లేదు లేకపోతే శ్రమ అనిపిస్తుంది, ఇప్పుడు ఇంకా ఇంత చేయాలి అని. 10 సంవత్సరాలు అయ్యింది, 20 సంవత్సరాలు అయ్యింది, 40 సంవత్సరాలు అయ్యింది, 50 సంవత్సరాలు అయ్యింది ఇంకా ఈ బలహీనత పోలేదు అని. పునాదిని కనుక పరిశీలన చేసుకుంటే నాలుగు సెకనులు కూడా పట్టదు. మీ యొక్క మనసా సేవ ఎంత వేగంగా జరుగుతుంది! ఇప్పుడు మనసా శక్తి వ్యర్థంగా వెళ్తుంది, కార్యంలోకి రావటం లేదు కానీ దానిని పొదుపు చేస్తే కార్యంలో ఉపయోగపడుతుంది కదా! అప్పుడిక శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. నడుస్తూ, తిరుగుతూ లైట్ హౌస్ గా, మైట్ హౌస్ గా అనుభవం అవుతారు. లైట్ హౌస్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మార్గం చెప్పదు. దూరం నుండే సైగ చేస్తుంది - ఇదీ మార్గం అని. మీరందరు కూడా మెరిసే డైమండ్, లైట్‌హౌస్, మైట్ హౌస్ గా అయిపోతే విశ్వంలో ఏమి ఉంటుంది? అంధకారం ఉంటుందా? ఇష్టమా? లేదా కేవలం డైమండ్ జూబ్లీ కార్యక్రమం చేసేస్తే డైమండ్ జూబ్లీ అయిపోతుందా? అలా చేయరు కదా! మొదట స్వయం, ఆ తర్వాత విశ్వం. చూడండి, మీరు ఉపన్యాసం చెప్తారు. అలాగే మహా మండలేశ్వరులు కూడా చెప్తారు కానీ మీరు చెప్పిన దానికి ప్రభావం పడుతుంది, మనస్సుకి హత్తుకుంటుంది ఎందుకంటే మీరు చేసిన తర్వాత చెప్తారు. కానీ వారు కేవలం చెప్తారంతే కానీ చేయరు. అందువలన అందరికీ తేడా తెలుస్తుంది కదా! ఎవరైతే స్వయం చేసి చెప్తారో దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఇక్కడ కూడా అంటారు కదా, ఫలానా అక్కయ్య లేదా అన్నయ్య చెప్పినవి మనస్సులో ఉండిపోయాయి అని అలాగే కొంతమంది యొక్క ఉపన్యాసం వింటారు, బావుంది అంటారు అంతే అయితే తేడా ఏమిటి? కేవలం చెప్పటం మరియు చేసి చెప్పటంలో తేడా ఉంటుంది. చేసి చెప్పేవారి మాటకి స్వతహాగానే ప్రభావితం అవుతారు. అందరు వజ్రాలే కదా లేదా కొంతమంది బంగారం, కొంతమంది వెండి, కొంతమంది వజ్రంగా ఉన్నారా? అందరూ వజ్రాలే కదా! వజ్రాలే కానీ కొంచెం మెరుపు చూపించాలి. బాప్ దాదాకి చాలా సంతోషం ఉంది ఎందుకంటే బాబా ఖజానాలో చాలా వజ్రాలు ఉన్నాయి మరియు ఒక్కొక్క వజ్రం ఎంత విలువైనది? అని. ఇన్ని ఆత్మిక వజ్రాలు ఎక్కడైనా దొరుకుతాయా? ఎవరి దగ్గరైనా దొరుకుతాయా? అమెరికా, ఆఫ్రికా అంతా తిరిగి రండి వెతికి రండి. దొరుకుతాయా? కానీ ఇక్కడ చూడండి - ఎన్ని నిజమైన వజ్రాలు బాబాకి లభించాయో, కానీ ఆ తరంగాల యొక్క మెరుపు వెదజల్లే విధంగా తయారవ్వాలి. నేను వజ్రాన్ని అని మీలో మీరు సంతోషపడిపోవటం కాదు. వజ్రం యొక్క మెరుపు దాగదు. సత్యమైన వజ్రం యొక్క మెరుపు ఎప్పుడైనా దాగుతుందా! ఎంతగా మార్చి మార్చి చూపించినా కానీ మెరుపు కనిపిస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో బయటవారు సత్యమైన వజ్రాలు అనుకునేవి సత్యమైనవి కాదు. మీ స్వర్గం యొక్క వజ్రాలు సత్యమైనవి. వాటి ముందు అవి ఏమీ కాదు. సత్యమైన వజ్రం యొక్క గుర్తు ఏమిటంటే దాని మెరుపు నలువైపులకి వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాగైతే లైట్ వెలిగితే నలువైపుల ప్రకాశం వెదజల్లుతుంది కదా, ఎంత శక్తివంతంగా ఉంటే అంత ప్రకాశం వ్యాపిస్తుంది. అలాగే మీరు కూడా తరంగాల ద్వారా సత్యమైన వజ్రం అయిన మీ మెరుపు వ్యాపింపచేయాలి. మధువనంలో చూడండి, బాబా గదిలోకి వెళ్ళగానే విశేష అనుభవం అవుతుంది కదా, తరంగాలు వస్తాయి కదా. తెలిసినా, తెలియకపోయినా, నిశ్చయం ఉన్నా, లేకపోయినా శాంతి యొక్క తరంగాలు అనుభవం అవుతాయి కదా! అలాగే మీతో ఉన్నవారికి కూడా మీ మెరుపు యొక్క తరంగాలు అనుభవం అవ్వాలి. వీరు ఎలా ఉండేవారో అలాగే ఉన్నారు అని అనకూడదు. మొదట మనతో ఉండేవారికి అనుభవం అయితే ఆ తర్వాత దూరం వరకు కూడా వెళ్తుంది. 

పరివర్తనా శక్తి బావుంది కదా? లేదా తక్కువగా ఉందా? పరివర్తనా శక్తి మంచిగా ఉంది కదా? దేనినైనా పరివర్తన చేసుకోవాలంటే సమయం పట్టడం లేదు కదా లేదా చూస్తాం, చేస్తాం ఇలా ఆలోచిస్తున్నారా! చేయాల్సిందే, ఎవరు చేసినా చేయకపోయినా నేను చేయాల్సిందే అనుకోవాలి. సాకులు చెప్పటం అయితే అందరికి మంచిగా వస్తుంది. సాకులు చెప్పటం రానివారు ఎవరూ ఉండరు, తెలివైనవారు. ఏమేమి సాకులు తయారుచేస్తున్నారంటే - ఇలా అయ్యింది కనుక అలా అయ్యింది, వారు చేశారు కనుకే అలా అయ్యింది, నేనైతే బాగానే ఉన్నాను. వీరు నడుస్తూ ఉంటే చెంపదెబ్బ కొట్టారు అందువలన పడిపోయాను, వారు దెబ్బకొట్టకపోతే పడిపోను కానీ వారు దెబ్బకొట్టారు అని అంటారు. కానీ మిమ్మల్ని మీరు ఎందుకు రక్షించుకోలేకపోయారు! దెబ్బతీసేవారి పని దెబ్బతీయటం కానీ మీ పని మిమ్మల్ని మీరు రక్షించుకోవటమా లేదా వారు దెబ్బతీశారు కనుకే పడిపోయాను అని సాకులు చెప్పటమా? రక్షించుకోవటం మీ పనా లేక అది కూడా ఇతరులు చేస్తారా? అలా అయితే ఇది కూడా ఒక సాకు. ఇది సరిపోయింది, చూడండి ..... ఇలా చాలా మధురాతి మధురమైన విషయాలు వినిపిస్తారు. రేపటి నుండి ఇది అయిపోతుంది కదా! అప్పుడు తీవ్రపురుషార్ధి అయిపోతాం అంటారు. మరలా రేపు ఇంకొక విషయం వస్తుంది అప్పుడు ఎల్లుండి అయిపోతాం అని అంటారు. ఇలా సాకులు చెప్పకండి. ఎగిరేకళ యొక్క ఆటలో నెంబర్ పొందండి. సాకులు చెప్పటంలో కాదు. మీ సహయోగులందరు అంధకారంలో ఉన్నారు, నలువైపుల అంధకారం ఉంది కనుక మేము వెలుగు ఇవ్వకలేకపోతున్నాము అని అనటంలేదు కదా! అంధకారంలో ఉన్నవారికే మీరు వెలుగు కదా! అంధకారంగా ఉంది అందువలనే మోసపోయాము అని అంటున్నారు అంటే లైట్ హౌస్ ఎక్కడికి వెళ్ళిపోయింది! మీకు మీరు కూడా ప్రకాశం ఇచ్చుకోలేకపోతున్నారా! సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడు సంకల్పాలలో సాధారణ సంకల్పాలు చేయకండి, ప్రతిజ్ఞ చేయండి. శరీరం వదిలేసినా కానీ ప్రతిజ్ఞను మాత్రం వదలకూడదు. ఎంత సహించవలసి వచ్చినా, పరివర్తన చేసుకోవలసి వచ్చినా కానీ ప్రతిజ్ఞను వదలకండి. దీనినే ధృడ సంకల్పం అంటారు. ఆలోచించడం చాలా బాగా ఆలోచిస్తున్నారు, దానికి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. ఇది చేస్తాము, ఇది చేస్తాము, ఇది చేయము ఇలా సంతోషపెట్టేస్తున్నారు. దీనిలో ధృఢత ద్వారా సదా అనే శబ్దాన్ని కలపండి. కొద్ది సమయం అయితే ప్రభావం చూపిస్తున్నారు, దీని కొరకు ముందే చెప్పాను కదా స్వయాన్ని సదా పొదుపు యొక్క అవతారంగా భావించండి. పొదుపు (ఎకానమీ), ఒక పేరు (ఎకనామి) మరియు ఏకాంతవాసిగా అవ్వండి. మాటలలోకి ఎక్కువగా రాకండి. ఏకాంతవాసిగా అవ్వండి. ఎవరైతే రోజంతా మాట్లాడుతూ ఉంటారో వారి సంకల్పం, సమయం అన్ని ఖజానాలు ఎక్కువగా వ్యర్ధం అవుతాయి. ఏకాంతవాసి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కేవలం బయటికి ఏకాంతంగా ఉండటం కాదు కానీ ఒకరి అంతంలో లీనం అవ్వాలి, ఇదే ఏకాంతం. అలా కాకుండా బయటికి ఏకాంతంగా ఉంటే బోర్ అనిపిస్తుంది. రోజులు ఎలా గడుస్తాయో తెలియటం లేదు అంటారు. ఒకే బాబా యొక్క అంతంలో లీనం అయిపోండి. ఎలా అయితే సాగరం యొక్క లోతులోకి వెళ్తే ఎన్ని ఖజానాలు దొరుకుతాయి! అలాగే అంతంలోకి వెళ్ళండి అంటే బాబా ద్వారా ఏవైతే ప్రాప్తులు లభిస్తున్నాయో ఆ ప్రాప్తులలో లీనం అవ్వండి. కేవలం పైపై అలలలో తేలియాడకండి. అంతంలోకి వెళ్ళిపోండి. లీనం అయిపోండి. అప్పుడు ఎంత మజా వస్తుందో చూడండి. అన్ని ఖజానాలను పొదుపు చేయండి. మరియు ఏకనామిగా అవ్వండి, ఏకనామి అంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు. దానినే ఏకనామి అంటారు. అటువంటి స్థితిలో స్థితులయ్యేవారే తమ యొక్క సర్వఖజానాలను జమ చేసుకోగలరు. లేకపోతే జమ అవ్వదు. అయితే పొదుపు చేయటం గురించి తెలుసు కదా? అందరికీ తెలుసు కదా! ఎవరితో అయితే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకు గుర్తు వారిని తమకంటే ముందుకు తీసుకువెళ్తారు. ఇదే ప్రేమకి గుర్తు. అలాగే బాప్ దాదా కూడా ప్రతి ఒక్క బిడ్డ నాకంటే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇదే ప్రేమకు గుర్తు. ఎవరిలో ఏ లోపం ఉండకూడదు, అందరు సంపూర్ణంగా,సంపన్నంగా అవ్వాలి అనుకుంటారు. సంపన్నంగా అయితే సంపూర్ణంగా అవుతారు. డబల్ విదేశీయులంటే డబల్ ప్రేమ ఉంది కదా! ఎందుకంటే స్థాపనా పాత్రలో డబల్ విదేశీయులు విశేషమైన శోభ. స్థాపనా పాత్ర యొక్క విశేష శృంగారం. జమాఖాతాలో విదేశీయులు నెంబర్ వన్ తీసుకుంటారో, భారతవాసీయులు నెంబర్ వన్ తీసుకుంటారో చూస్తాను. ఎందుకంటే డబల్ విదేశీయులలో ఉన్న స్వతహా సంస్కారం ఏమిటంటే ఏ లైన్లోకి వెళ్ళినా చాలా వేగంగా వెళ్తారు. పడిపోయినా వేగంగా పడిపోతారు, ఎక్కినా వేగంగా ఎక్కేస్తారు. ఇప్పుడు ఈ సంస్కారాన్ని జమాఖాతాలో తీవ్రంగా ఉపయోగించండి. చిన్న చిన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ముందు నెంబర్ తీసుకోవాలి. 

నలువైపుల ఉన్నటువంటి ఆత్మిక, సత్యమైన వజ్రాలైన ఆత్మలకు, సదా పొదుపు యొక్క అవతారాలైన విశేషాత్మలకు, సదా ఏక్ నామి అంటే ఒకే పేరు మరియు ఏకాంతప్రియులుగా ఉండే విశేషాత్మలకు, తమ తరంగాల వృత్తి యొక్క మెరుపు ద్వారా విశ్వంలో ప్రకాశాన్ని వ్యాపింపచేసే మెరిసే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments