24-02-1998 అవ్యక్త మురళి

           24-02-1998         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బాబాతో, సేవతో, పరివారంతో ప్రేమ పెట్టుకోండి, అప్పుడు శ్రమ నుండి విడిపించబడతారు.

ఈరోజు నలువైపుల ఉన్న పిల్లలందరు తమ తండ్రి యొక్క జయంతిని జరుపుకోవడానికి వచ్చారు. సన్ముఖంగా కూర్చున్నా, ఆకారీ రూపంలో బాబా ఎదురుగా ఉన్నా కానీ బాబా పిల్లలందరినీ చూస్తున్నారు - ఒకవైపు బాబా మిలనం యొక్క సంతోషం, రెండవవైపు త్వరత్వరగా బాబాని ప్రత్యక్షం చేయాలనే ఉత్సాహ, ఉల్లాసాలు ఉన్నాయి. బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలను చూస్తూ కోటానుకోట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎలా అయితే పిల్లలు బాబా యొక్క జయంతి జరుపుకోవడానికి మూలమూలల నుండి, దూరదూరాల నుండి వచ్చారో అదేవిధంగా బాబా కూడా పిల్లల యొక్క జన్మదినం జరుపుకోవడానికి వచ్చారు. అందరికంటే దూరదేశం వారు ఎవరు? బాబాయా లేక మీరా? మీరు అంటారు - మేము చాలా దూరదేశం నుండి వచ్చాము అని, కానీ నేను మీ కంటే దూరదేశం నుండి వచ్చాను అని బాబా అంటారు. మీకు సమయం పడుతుంది కానీ బాబాకి సమయం పట్టదు. మిమ్మలందరినీ రైలు లేదా విమానం తీసుకురావాలి కానీ బాబా కేవలం రథం ఆధారం తీసుకోవలసి ఉంటుంది. కేవలం మీరే బాబా యొక్క పుట్టినరోజు జరుపుకోవడానికి రాలేదు, బాబా కూడా ఆది సహయోగి బ్రాహ్మణ ఆత్మల యొక్క వెంటే జన్మ తీసుకున్న పిల్లల యొక్క పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చారు. ఎందుకంటే బాబా ఒంటరిగా అవతరించరు, బ్రహ్మ మరియు బ్రాహ్మణపిల్లలతో కలిసి దివ్యజన్మ తీసుకుంటారు అంటే అవతరిస్తారు. బ్రాహ్మణులు లేకుండా బాబా ఒక్కరే యజ్ఞాన్ని రచించలేరు. యజ్ఞం రచించి, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు, అప్పుడే మీరందరు జన్మించారు. కనుక రెండు సంవత్సరాల వారైనా, రెండు నెలలు వారైనా మీ అందరికీ కూడా దివ్య బ్రాహ్మణజన్మ యొక్క శుభాకాంక్షలు. ఈ దివ్యజన్మ ఎంతో శ్రేష్టమైనది! ప్రతి ఒక్క దివ్య బ్రాహ్మణ ఆత్మ యొక్క మెరిసే భాగ్యరేఖను చూసి బాబా కూడా సంతోషిస్తున్నారు. ఓహో! వజ్రతుల్య జీవితం కలిగిన బ్రాహ్మణ ఆత్మలు ఓహో!! అని పాడుతున్నారు. ఓహో! ఓహో!! కదా. ఓహో పిల్లలుగా బాబా తయారుచేసారు. ఈ అలౌకిక జన్మ బాబాకి కూడా అతీతమైనది మరియు పిల్లలైన మీకు కూడా అతీతం మరియు ప్రియమైనది కదా! బాబా ఒక్కరికే ఈ విధమైన జన్మ మరియు జయంతి ఉంటుంది, మరెవ్వరికీ ఈ విధమైన జన్మదినం లేదు మరియు ఉండదు. నిరాకారుడు మరియు తీసుకునేది దివ్యజన్మ. మిగిలిన ఆత్మలందరు తమ తమ సాకార శరీరాలతో జన్మ తీసుకుంటారు. కానీ నిరాకారి తండ్రి యొక్క జన్మ పరకాయ ప్రవేశం ద్వారా జరుగుతుంది. కల్పమంతటిలో ఇటువంటి విధితో ఎవరి జన్మ అయినా ఉందా? బాబా ఒక్కరికే ఇటువంటి అతీత జన్మ ఉంటుంది. దీనిని శివజయంతి రూపంలో భక్తాత్మలు కూడా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ దివ్య జన్మ యొక్క గొప్పతనం మీకే తెలుసు, భక్తులకు కూడా తెలియదు. కానీ వారు విన్న దానిని అనుసరించి ఉన్నతోన్నతంగా భావించి జరుపుకుంటూ వస్తున్నారు. పిల్లలైన మీరు కేవలం జరుపుకోవడమే కాదు, జరుపుకోవటంతో పాటు స్వయాన్ని బాబా సమానంగా కూడా తయారు చేసుకుంటున్నారు. అలౌకిక దివ్యజన్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు! మరెవ్వరికీ కూడా తండ్రితో పాటు పిల్లల యొక్క జన్మ జరగదు కానీ శివజయంతి అంటే బాబా యొక్క దివ్యజన్మతో పాటు పిల్లల యొక్క జన్మ కూడా! అందువలనే వజ్రోత్సవం జరుపుకున్నారు కదా! అంటే తండ్రితో పాటూ పిల్లల యొక్క దివ్యజన్మ కూడా. కేవలం ఈ జయంతినే వజ్రతుల్య జయంతి అంటారు కానీ వజ్రతుల్య జయంతి జరుపుకుంటూ స్వయం కూడా వజ్రతుల్య జీవితంలోకి వస్తున్నారు. ఈ రహస్యం పిల్లలందరికీ బాగా తెలుసు మరియు ఇతరులకు కూడా చెప్తూ ఉంటారు. బాబా యొక్క దివ్యజన్మ యొక్క గొప్పతనాన్ని ఎంత ఉత్సాహ ఉల్లాసాలతో జరుపుకుంటూ ఉన్నారో బాప్ దాదా వార్తలు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు కూడా. నలువైపుల ఉన్న సేవాధారి పిల్లల యొక్క ధైర్యానికి ఫలితంగా బాప్ దాదా సహాయం చేస్తూ ఉంటారు. పిల్లల యొక్క ధైర్యం మరియు బాబా యొక్క సహాయం.. 

ఈ రోజుల్లో బాప్ దాదా దగ్గరికి పిల్లలందరి యొక్క ఒక స్నేహ సంకల్పం ఎక్కువగా చేరుకుంటుంది అది ఏమిటంటే ఇప్పుడు త్వరత్వరగా బాబా సమానంగా తయారు అవ్వాల్సిందే అని. బాబా కూడా చెప్తున్నారు - మధురమైన పిల్లలూ! తయారవ్వవలసిందే. ప్రతి ఒక్కరికి ఈ దృడ నిశ్చయం ఉంది కానీ మేము తయారవ్వకపోతే ఇంకెవ్వరు అవుతారు అని దానిపై మరింత ధ్యాస పెట్టండి. మేమే అయ్యాము, మేమే అవుతాము మరియు ప్రతి కల్పం మేమే తయారవుతాం అని పక్కా నిశ్చయం ఉంది కదా? 

డబల్ విదేశీయులు కూడా శివజయంతి జరుపుకోవడానికి వచ్చారా? మంచిది, డబల్ విదేశీయులు చేతులు ఎత్తండి! బాప్ దాదా చూస్తున్నారు - విశ్వంలో ఏ మూల మిగిలిపోకూడదు అని. డబల్ విదేశీయులకు ఇదే ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయి. భారతదేశం వారికి అయితే సేవ కొరకు చాలా సమయం లభించింది మరియు భారతవాసీయులు గ్రామగ్రామానికి సందేశం ఇచ్చారు. కానీ డబల్ విదేశీయులకు సేవా సమయం భారతవాసీయుల కంటే తక్కువ లభించింది. అయినా కానీ ఉత్సాహ ఉల్లాసాల కారణంగా బాప్ దాదా ఎదురుగా సేవ యొక్క మంచి రుజువుని చూపించారు మరియు చూపిస్తారు. భారతదేశంలో వర్తమాన సమయంలో వర్గీకరణ సేవలు ప్రారంభమయ్యాయి. దాని కారణంగా కూడా అన్ని వర్గాల వారికి సందేశం లభించటం సహజం అయిపోయింది. ఎందుకంటే ప్రతి వర్గం తమ వర్గంలో ముందుకి వెళ్ళాలని అనుకుంటున్నారు. కనుక ఈ వర్గీకరణ సేవ యొక్క విధానం బావుంది. దీని ద్వారా భారతదేశం యొక్క సేవలో కూడా విశేషాత్మలు రావటం ద్వారా మంచి మెరుపు వచ్చింది. మంచిగా అనిపిస్తుంది కదా! వర్గీకరణ సేవ మంచిగా అనిపిస్తుందా? విదేశీయులు కూడా తమ యొక్క మంచి, మంచి గ్రూపులను తీసుకువస్తున్నారు, మంచి పద్ధతి పెట్టారు. ఎలా అయితే భారతదేశంలో వర్గీకరణ ద్వారా సేవలో అవకాశం లభించిందో, అదేవిధంగా వీరి యొక్క ఈ పద్దతి కూడా బావుంది. బాప్ దాదాకి రెండు రకాల సేవ ఇష్టమే. మంచిది. జగదీష్ పిల్లవాడు మంచి పద్ధతి ప్రారంభించారు. విదేశాలలో రీట్రీట్ అనే మాట ఎవరు ప్రారంభించారు? (అందరు కలిసి చేసారు) భారతదేశంలో కూడా కలిసే చేసారు కానీ నిమిత్తంగా అయ్యారు.మంచిది. రెండువైపుల సేవ ద్వారా అనేక ఆత్మలను సమీపంగా తీసుకువచ్చే అవకాశం లభిస్తుంది. ఫలితం మంచిగా అనిపిస్తుంది కదా? రీట్రీట్ యొక్క ఫలితం బావుందా? వర్గీకరణ యొక్క ఫలితం కూడా బావుంది. దేశ విదేశాలలో ఏదొక క్రొత్త ఆవిష్కరణ చేస్తూ ఉంటారు మరియు ఇక ముందు కూడా చేస్తూ ఉంటారు. విదేశాలలో అయినా, భారతదేశంలో అయినా సేవ యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు బాగా ఉన్నాయి. బాప్ దాదా చూస్తున్నారు - ఎవరైతే సత్యమైన మనస్సుతో, నిస్వార్ధంగా సేవలో ముందుకు వెళ్తున్నారో వారి ఖాతాలో పుణ్యఖాతా చాలా బాగా జమ అవుతూ ఉంది. కొంతమంది పిల్లలకు 1.తమ పురుషార్థం ద్వారా ప్రాలబ్దం యొక్క ఖాతా 2. సంతుష్టంగా ఉంటూ, ఇతరులను సంతుష్టం చేయటం ద్వారా ఆశీర్వాదాల యొక్క ఖాతా, 3. యథార్థ, యోగయుక్త, యుక్తియుక్త సేవకి ఫలితంగా పుణ్యఖాతా జమ అవుతుంది. ప్రతి ఒక్కరి ఈ మూడు ఖాతాలను బాప్ దాదా చూస్తూ ఉంటారు. ఈ మూడు ఖాతాలు జమ అయినవారి గుర్తు - వారు సదా స్వయాన్ని సహజపురుషార్ధిగా అనుభవం చేసుకుంటారు మరియు ఇతరులకు కూడా ఆ ఆత్మ ద్వారా స్వతహాగానే సహజపురుషార్ధిగా అయ్యే ప్రేరణ లభిస్తుంది. అటువంటి వారు సహజపురుషార్థానికి ఒక గుర్తు. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. బాబాతో, సేవతో, పరివారం అందరితో ప్రేమ ఉంటే ఈ మూడు రకాల ప్రేమ అనేది శ్రమ నుండి విడిపిస్తుంది. 

బాప్ దాదా పిల్లలందరిపై ఇదే శ్రేష్ట ఆశ పెట్టుకుంటున్నారు - పిల్లలందరూ సహజంగా పురుషార్ధిగా సదా ఉండాలి అని. 63 జన్మలు భక్తిలో, అలజడులలో భ్రమించే శ్రమ చేసారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ శ్రమ నుండి విడిపించుకోవాలి. ఒకవేళ చాలాకాలం నుండి శ్రమ చేస్తూ ఉంటే ప్రేమ ద్వారా సహజపురుషార్ధం అనే సంగమయుగి వరదానాన్ని ఎప్పుడు తీసుకుంటారు? యుగం సమాప్తి అయిపోతే వరదానం కూడా సమాప్తి అయిపోతుంది. కనుక ఈ వరదానాన్ని త్వరత్వరగా తీసుకోండి. ఎంత పెద్ద కార్యం అయినా, ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఆ కార్యాన్ని, సమస్యను ఎలా దాటాలంటే, మీరు అంటారు కదా - వెన్నలో వెంట్రుక తీసినంత సహజంగా దాటేయాలి. కొంతమంది పిల్లల యొక్క ఆట బాబా చూస్తున్నారు, సంతోషిస్తున్నారు కూడా మరియు పిల్లలను చూసి దయ కూడా వస్తుంది. ఏదైనా పెద్ద కార్యం లేదా ఏదైనా పెద్ద సమస్య ఎదురుగా వస్తే పిల్లల ముఖంలో అప్పుడప్పుడు కొద్దిగా ఆ సమస్య యొక్క లేదా ఆ కార్యం యొక్క అల కనిపిస్తుంది. కొద్దిగా ముఖం మారిపోతుంది. ఎవరైనా కానీ ఏమైంది అని అడిగితే, చాలా పని ఉంది కదా అని చెప్తున్నారు. విఘ్నవినాశకుల ముందు విఘ్నాలు రాకపోతే విఘ్నవినాశకులు అనే బిరుదు యొక్క మహిమను ఎలా పొందగలరు? కొద్దిగా కూడా ముఖంలో అలసట, లేదా కొద్దిగా మూడ్ మారిన గుర్తులు కనిపించకూడదు. ఎందుకు? మీ జడచిత్రాలు అర్ధకల్పం నుండి పూజింపబడుతున్నాయి, వాటిలో ఎప్పుడైనా కొద్దిగా అలసట లేక మూడ్ మారిన గుర్తులు కనిపిస్తాయా? మీ జడచిత్రాలు సదా నవ్వుతూ ఉంటాయి, మరి అయితే ఆ చిత్రాలు ఎవరివి? మీవే కదా? చైతన్యానికే స్మృతిచిహ్నమే చిత్రాలు. అందువలన కొద్దిగా కూడా అలసట లేదా మీరు చిటపటలు అంటారు కదా, ఆ గుర్తులు కనిపించకూడదు. సదా నవ్వుతూ ఉండే ముఖం బాప్ దాదాకి మరియు అందరికీ ఇష్టమనిపిస్తుంది. ఎవరైనా చిటపటలతో ఉంటే వారి ముందుకు ఎవరైనా వెళ్తారా? ఇప్పుడు చెప్తామా, వద్దా అని ఆలోచిస్తారు. మీ జడచిత్రాల దగ్గరకి అయితే భక్తులు చాలా ఉత్సాహ ఉల్లాసాలతో వస్తారు కానీ చైతన్యంలో మీరు బరువుగా ఉంటే బావుంటుందా? ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరి ముఖంలో సదా ఫరిస్తా రూపం, వరదానీ రూపం, దాత రూపంగా, దయాహృదయులుగా, అలసిపోని, సహజయోగి లేదా సహజ పురుషార్ధి రూపాన్ని చూడాలనుకుంటున్నారు. విషయమే అలాంటిది కదా అని చెప్పకండి. ఎలాంటి విషయం అయినా కానీ రూపం నవ్వుతూ ఉండాలి. శీతలంగా, గంభీరంగా మరియు రమణీయత రెండింటి సమానత ఉండాలి. ఎవరైనా అకస్మాత్తుగా వచ్చారనుకోండి, మీరు ఏలాంటి సమస్య కారణంగా లేదా పని కారణంగా సహజపురుషార్ధి రూపంలో లేకపోతే వారు ఏమి చూస్తారు? మీరు ఎలా ఉన్నారో ఆ చిత్రాన్నే వారు తీసుకుంటారు. కనుక ఏ సమయంలో అయినా, ఒక నెల అయినా, రెండు నెలలు అయినా, అకస్మాత్తుగా మీ ముఖాన్ని చిత్రం తీస్తే నేను చెప్పిన విధంగా మీ చిత్రం ఉండాలి. దాత అవ్వండి, తీసుకునేవారిగా కాదు, దాత అవ్వాలి. ఎవరు ఏమి ఇచ్చినా కానీ అంటే మంచి ఇచ్చినా, చెడు ఇచ్చినా కానీ మీరు ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క పిల్లలు, విశాలహృదయులు కనుక ఒకవేళ వారు చెడు ఇచ్చినా కానీ విశాల హృదయంతో ఆ చెడుని స్వయం స్వీకరించకుండా, దాత అయ్యి మీరు వారికి సహయోగం ఇవ్వండి, స్నేహం ఇవ్వండి, శక్తి ఇవ్వండి. ఏదోక గుణాన్ని మీ స్థితి ద్వారా వారికి బహుమతిగా ఇవ్వండి. ఇంత విశాలహృదయం కలిగిన ఉన్నతోన్నత తండ్రి యొక్క పిల్లలు మీరు. దయ చూపండి. హృదయంలో ఆ ఆత్మ పట్ల మరింత స్నేహాన్ని పెట్టుకోండి. ఆ స్నేహశక్తి ద్వారా వారు స్వయం పరివర్తన అయిపోవాలి. ఇలా విశాలహృదయం కలిగినవారా లేక చిన్న హృదయం కలిగినవారా? ఇముడ్చుకునే శక్తి ఉందా? ఇముడ్చుకోండి. సాగరంలో ఎంతో చెత్త వేస్తారు కానీ ఆ చెత్త వేసినవారికి తిరిగి చెత్త ఇవ్వదు. మీరు అయితే జ్ఞానసాగరుడు, శక్తిసాగరుని పిల్లలు, మాస్టర్లు మీరు. కనుక బాప్ దాదా ఏమి చూడాలి అనుకుంటున్నారో విన్నారా? ఎక్కువమంది పిల్లలు ఇదే లక్ష్యం పెట్టుకున్నారు - ఈ సంవత్సరంలో పరివర్తన అవ్వవలసిందే అని. చేస్తాము, ఆలోచిస్తాము అని కాదు చేయవలసిందే. చేయవలసిందేనా లేక అక్కడికి వెళ్ళి ఆలోచిస్తారా? ఎవరైతే చేయవలసిందే అని భావిస్తున్నారో వారు ఒక చేతితో చప్పట్లు కొట్టండి. (అందరు చేతులు ఊపారు) చాలా మంచిది. కేవలం ఈ చేతులు ఎత్తడం కాదు, మనస్సు ద్వారా ధృఢసంకల్పం అనే చేయి ఎత్తాలి. ఈ చేయి ఎత్తడం అయితే సహజం కదా! మనస్సుతో ధృఢసంకల్పం అనే చేయి సదా సఫలతా స్వరూపంగా తయారుచేస్తుంది. ఆలోచించినది జరగాల్సిందే. ఆలోచన అయితే శుభంగానే ఆలోచిస్తారు కదా! అశుభంగా ఆలోచించరు కదా! అశుభం ఆలోచించే మార్గం సదాకాలికంగా బంద్ అయిపోయింది. బంద్ చేయటం వస్తుందా లేక తెరుచుకుంటుందా? ఇప్పుడు తుఫాను వచ్చింది కదా! అప్పుడు తలుపు దానంతటదే తెరుచుకుంటుంది, అలా అవ్వటం లేదు కదా? తలుపు మూసి వచ్చాం అని మీరు అనుకుంటారు. కానీ తుఫాను తెరిచే విధంగా డీలాగా వేయకూడదు. 

అందరిలో రూలింగ్ పవర్ ఉందా? కర్మేంద్రియాలపై ఎప్పుడు కావాలంటే అప్పుడు రూల్ చేయగలుగుతున్నారా? స్వరాజ్యాధికారియే విశ్వరాజ్యాధికారి అవుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, వాతావరణం ఎలా ఉన్నా కానీ మనస్సు, బుద్ధికి స్టాప్ అని ఆర్డర్ ఇవ్వగానే స్టాప్ అవుతున్నాయా లేక సమయం పడుతుందా? ప్రతి ఒక్కరు రోజంతటిలో మధ్యమధ్యలో ఈ అభ్యాసం చేయటం చాలా అవసరం. ఏ సమయంలో మనస్సు, బుద్ది బిజీగా ఉన్నాయో అటువంటి సమయంలో కూడా స్టాప్ అనగానే ఒక సెకనులో స్టాప్ అవుతున్నాయా? ఈ అభ్యాసం అంతిమంలో చాలా పనికొస్తుంది. స్టాప్ అనుకోగానే స్టాప్ అవ్వటంలో 3 లేక 5 నిమిషాలు పడుతుందా! ఈ అభ్యాసం ఆధారంగానే పాస్ విత్ ఆనర్ కాగలరు. 

సదా మనస్సు యొక్క ఉత్సాహ, ఉల్లాసాల ఉత్సవాన్ని జరుపుకునే స్నేహి ఆత్మలకు, సదా వజ్రతుల్య జీవితాన్ని అనుభవం చేసుకునేవారికి, అనుభవం యొక్క అథారిటీ గల విశేష ఆత్మలకు, సదా తమ ముఖం ద్వారా బాబా పరిచయాన్నిచ్చి బాబాని ప్రత్యక్షం చేసే సేవాధారి పిల్లలకు, సదా గంభీరత, రమణీయత రెండింటి సమానత ఉంచుకుని సర్వుల ఆశీర్వాదాలకు అధికారి అయ్యే ఆత్మలకు, ఇలా నలువైపుల ఉన్న దేశ, విదేశ పిల్లలకు శివరాత్రి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు! వెనువెంట బాప్ దాదా యొక్క, మనోభిరాముని యొక్క, మనస్పూర్వక, ప్రాణసహిత దయ, ప్రేమతో ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments