23-12-1994 అవ్యక్త మురళి

      23-12-1994         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మీ యొక్క మూడు స్వరూపాలను స్మృతిలో ఉంచుకోండి - 1. సంగమయుగి బ్రాహ్మణులు 2. బ్రాహ్మణుల నుండి ఫరిస్తా 3. ఫరిస్తా నుండి దేవత.

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల యొక్క మూడు రూపాలను చూస్తున్నారు. అన్నింటికంటే శ్రేష్టస్వరూపం బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణుల నుండి ఫరిస్తా మరియు ఫరిస్తా నుండి దేవత. బ్రాహ్మణ స్వరూపం, ఫరిస్తా స్వరూపం మరియు దేవతా స్వరూపం. బ్రాహ్మణ స్వరూపం యొక్క విశేషత - సర్వశక్తుల సంపన్న స్వరూపం. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే మాయాజీత్. సర్వశక్తి సంపన్నంగా అవ్వటమే మాయజీత్ గా అవ్వటం. మొదటి స్వరూపం - బ్రాహ్మణ స్వరూపం. స్వయాన్ని చూసుకోండి - బ్రాహ్మణ స్వరూపం యొక్క విశేషత ఏదైతే వినిపించారో ఆ శక్తులన్నీ ధారణ అయ్యాయా? సర్వశక్తులూ ఉన్నాయా? లేక కొన్ని కొన్ని శక్తులే ఉన్నాయా? ఒకవేళ ఒక శక్తి బలహీనంగా లేదా తక్కువగా ఉన్నా కానీ మాటిమాటికి బ్రాహ్మణ స్వరూపానికి బదులు క్షత్రియులుగా అంటే యుద్ధం చేసేవారిగా అయిపోతారు. క్షత్రియుల కర్తవ్యం - యుద్ధం చేయటం. బ్రాహ్మణుల కర్తవ్యం - సదా మరియు సహజంగా మాయాజీత్గా అవ్వటం. బ్రాహ్మణులు అంటే విజయీలు. సదా సర్వశక్తులు అనే సర్వ శస్తాలతో సంపన్నులు. మరియు క్షత్రియులు అంటే ఒకసారి విజయీ మరియు ఒకసారి ఓడిపోయేవారు. ఎందుకంటే శక్తులు లభిస్తున్నా కానీ వాటిని ధారణ చేయటం లేదు అందువలనే సమయం మరియు పరిస్థితి ప్రమాణంగా విజయీగా కాలేకపోతున్నారు. బ్రాహ్మణస్వరూపం అంటే సదా కిరీటధారులు, తిలకధారులు మరియు సింహాసనాధికారులు. విశ్వకళ్యాణం యొక్క బాధ్యతా కిరీటధారులు, సదా మరియు స్వతహా తిలకధారులు మరియు సదా బాబా యొక్క హృదయసింహాసనాధికారులు. క్షత్రియులు ఏకరసంగా, అచంచలంగా, ఆడోల్ గా ఉండరు. కనుక అప్పుడప్పుడు అచంచలంగా, అప్పుడప్పుడు అలజడితో మరియు అప్పుడప్పుడు బాబా నుండి శక్తిని అడిగే రాయల్ బికారిగా ఉంటారు. బ్రాహ్మణులు అంటే సదా అలౌకిక మజా యొక్క జీవితంలో ఉండేవారు. సదా ఆత్మిక ముఖం మరియు చిత్రం కలిగి ఉంటారు. క్షత్రియులు అంటే అప్పుడప్పుడు ఒకవిధంగా, అప్పుడప్పుడు ఒకవిధంగా ఉంటారు. నేనెవరు? అని మిమ్మల్ని మీరు అడగండి. ఒక్కొక్కసారి బ్రాహ్మణులు, ఒక్కొక్కసారి క్షత్రియులా? లేక సదా బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతలతో సంపన్నంగా ఉన్నారా? లక్ష్యం బ్రాహ్మణ జీవితం కానీ ఒకసారి బ్రాహ్మణులు, ఒక్కొక్కసారి క్షత్రియులు - అలాంటి లక్షణాలు లేవు కదా! లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా ఉన్నాయా లేక తేడా ఉందా? మాట మరియు కర్మ సమానంగా ఉన్నాయా లేక తేడా ఉందా? అందరూ బ్రహ్మకుమారీ, కుమారులుగా పిలవబడుతున్నారు కదా! లేక క్షత్రియులు అని పిలుచుకుంటున్నారా? లేదు కదా! చంద్రవంశీయులు అని అనిపించుకోవటానికే ఇష్టం ఉండదు. ఎవరైనా మిమ్మల్ని చంద్రవంశీయులు అంటే ఇష్టమేనా? కాదా? మరి అయితే కర్మ విషయంలో? ఏ సమయంలో యుద్ధంలో ఉంటున్నారో అప్పుడు మీ ఫోటో తీస్కోండి. ఫోటో తీయించుకోవాలి అనే అభిరుచి బాగా ఉంటుంది కదా? నడుస్తూ, తిరుగుతూ ఫోటో తీసుకోవటం వస్తుందా? ఇతరులకి తీయటం వస్తుంటాయి, నేనెవరు? అని మీ ఫోటో మీరు తీసుకోండి. ఒకవేళ ఎవరి ఫోటో అయినా బాగా రాకపోతే ఏం చేస్తారు? దాచుకుంటారా? ఇష్టపడరు కదా? రోజంతటిలో ఎన్నిసార్లు సమయం అనుసరించి బ్రాహ్మణులకి బదులు క్షత్రియులుగా అవుతున్నారో పరిశీలించుకోండి మరియు పరివర్తన చేయండి. కేవలం పరిశీలించుకోవటమే కాదు. పరివర్తన కోసం పరిశీలిస్తారు. అయితే అందరి దగ్గర పరివర్తనాశక్తి ఉందా? లేక కొంతమంది దగ్గర లేదా? అందరి దగ్గర ఉంది కదా చాలా మంచిది. లేదు అనేవారు లేరు కదా? దీనిలో అందరూ ఉంది అన్నారు కదా! సంతోషం, ఇప్పుడు సమయానికి కార్యంలో ఉపయోగించటం వస్తుందా లేక ఒక్కొక్కసారి రావటం లేదా? ఎందుకంటే శక్తి ఉంటే సమయానికి ఉపయోగపడాలి. శస్త్రాలు నా దగ్గర చాలా ఉన్నాయి కానీ శత్రువు వచ్చినప్పుడు పనికి రాకపోతే వారిని శక్తిశాలి అంటారా? నా దగ్గర శక్తి ఉంది అని కేవలం ఇలా పరిశీలించుకోకండి. కానీ కర్మలో సమయం అనుసరించి ఏ శక్తి కావాలో ఆ శక్తి కార్యంలో ఉపయోగించడం వస్తుందా? అని పరిశీలించుకోండి. శత్రువు యుద్ధం చేసేసిన తర్వాత శక్తి జ్ఞాపకం వస్తుందా? బ్రాహ్మణజీవితం యొక్క విశేషతలు పరిశీలించుకోండి. ఎందుకంటే బ్రాహ్మణుల నుండి ఫరిస్తా అవుతారే కానీ క్షత్రియుల నుండి ఫరిస్తా కాదు. బ్రాహ్మణుల నుండే ఫరిస్తాగా అవుతారు.  

రెండవ స్వరూపం - ఫరిస్తా, అందరూ ఫరిస్తాగా అవ్వాలి కదా? లేక ఫరిస్తాగా అవ్వటం కష్టమా? ఫరిస్తా అవ్వటం కష్టమా లేక సహజమా? లేక అప్పుడప్పుడు కష్టంగా, అప్పుడప్పుడు సహజంగా ఉంటుందా? ఫరిస్తా స్వరూపం యొక్క విశేషత అందరికీ తెలుసు, ఫరిస్తా అంటే డబల్ లైట్. తెలుసు కదా? డబల్ లైట్ గా ఉన్నారా? అప్పుడప్పుడు బరువు ఎత్తాలనిపించినప్పుడు ఎత్తుతున్నారా? ఎత్తాలి అని అనుకోకపోయినా మాయ తలపై బరువు పెడుతుందా? మాయ తన కృత్రిమ, అల్పకాలిక శక్తిని ఈ విధంగా చూపిస్తుంది. బరువు ఎత్తాలనుకోకపోయినా ఎత్తేస్తాము. ఎందుకంటే బలహీనంగా ఉన్న కారణంగా, బలహీనులు పరాధీనం అవుతారు. అదేవిధంగా మాయ కూడా ఆధీనం చేసుకుంటుంది. అధికారి స్థితి మర్చిపోతారు, ఆధీనం అయిపోతారు. మరియు ఆ సమయంలో ఏ భాష ఉంటుంది? అనుకోవటం లేదు కానీ అయిపోతుంది. తెలియటం లేదు...... ప్రతి విషయంలో తెలియదు, తెలియదు అంటారు. అధికారి అంటే సదా స్వతంత్రం మరియు ఆధీనం అంటే పరవశం, పరవశం అయినవారు ఎప్పుడూ ఆనంద జీవితంలో ఉండలేరు. బ్రాహ్మణులు అంటే ఆనంద జీవితం. ఒకొక్క సమయంలో మజాకి బదులు అయోమయం అయిపోతున్నారు ఇది ఏమిటి, ఇది ఎలాగ, ఇది ఎందుకు, ఇలాగే అవ్వాలా, అవుతుంది... ఇవన్నీ మజా కాదు, అయోమయ జీవితం. ఒకవేళ ఏ సమయంలో అయినా మజా తక్కువ అనుభవం అవుతుంది అంటే నేనెవరు? అనే మొదటి పాఠాన్ని జ్ఞాపకం చేస్కోండి. కేవలం నేను ఆత్మను అని కాదు, నేను ఎలాంటి ఆత్మను అని? ఎటువంటి ఆత్మను? అనే దానికి ఎన్ని జవాబులు వస్తాయి? పెద్ద జాబితా అవుతుంది కదా! నేనెవరు? అనే దానికి పెద్ద జాబితా ఉందా? రోజూ మురళీలో నేనెవరు అనే దానికి భిన్న భిన్న పాఠాలు చదువుకుంటారు, వింటూంటారు. 

ఫరిస్తా అంటే డబల్ లైట్. లైట్ అంటే తేలికతనం. తేలికతనం అంటే కేవలం పరిస్థితుల సమయంలో తేలికగా ఉండటం కాదు. కానీ రోజంతటిలో స్వభావ, సంస్కారాలలో, సంబంధ సంపర్కాలలో తేలికగా ఉంటున్నారా? అంతా బాగానే ఉంది కానీ స్వభావ సంస్కారాలలో తేలికతనం లేకపోతే ఫరిస్తా అంటారా? తేలికతనానికి గుర్తు తేలికైన వస్తువు అందరికీ ప్రియం అనిపిస్తుంది. ఏదైనా భారీగా ఉన్న వస్తువు ఇస్తే ఇష్టపడతారా? తేలికైన వస్తువు అయితే ఇష్టపడతారు కదా? ఎవరైతే స్వభావ సంస్కారాలలో, సంబంధ సంపర్కాలలో తేలికగా ఉంటారో వారు సర్వులకి ప్రియంగా మరియు అతీతంగా ఉంటారు. ఎందుకంటే బ్రాహ్మణ స్వభావం ఉండాలి, వేరే స్వభావం కాదు. బ్రాహ్మణులు అంటే అందరి మనస్సుకి ఇష్టమైన వారు స్వభావ సంస్కారాలు, సంబంధ సంపర్కాలలో ఉండేవారు. ఇంతకు ముందు కూడా చెప్పాను - ఎక్కువలో ఎక్కువ 95% మనసుకి ప్రియంగా ఉండాలి. ఈ ఫలితం తప్పకుండా ఉండాలి. 5% ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాను. అంతిమం వరకు కాదు ఇప్పుడు ఇస్తున్నాను. కానీ 95% అందరి మనసుకి ఇష్టమైన వారిగా అంటే అందరితో తేలికగా ఉండాలి. ఆ తేలికతనం మాటలో, కర్మలో మరియు వృత్తిలో అనుభవం అవ్వాలి. నేను అయితే తేలికగానే ఉన్నాను కానీ ఇతరులు నన్ను అర్ధం చేసుకోవటం లేదు అని భావించకండి. ఇతరులు మమ్మల్ని గ్రహించటం లేదు అని చాలామంది ఇదే మాట అంటున్నారు. ఒకవేళ వాళ్ళు గుర్తించకపోతే మీరు మీ ఆత్మికశక్తితో వారికి గుర్తింపు ఇవ్వండి. మీ కర్మ, వృత్తి వారిని పరివర్తన చేయాలి. దీనిలో కేవలం పరివర్తన చేయటంలో సహనశక్తి అవసరం. మరియు ఫరిస్తాల గుర్తు ఏమిటి? ఫరిస్తా అటే పాత దేహం మరియు పాత ప్రపంచం యొక్క బంధన ఉండదు అని అంటారు కదా! ఇది అందరికీ జ్ఞాపకం ఉంది కదా? ఫరిస్తా అంటే ఏమిటి అని అడిగితే అందరూ గట్టిగా చెప్తారు. బంధన ఉండదు అని. పాత దేహం, దేహసంబంధీకులు, దైహిక ప్రపంచం, పాత ప్రపంచం నుండి అతీతం అయిపోయారా? ఇంకా వారు ఉన్నారా? పాత దేహంతో తగుల్పాటు ఉందా? దేహసంబంధీకులతో అతీతం అయిపోయారు కదా లేక లేదా? చిన్నాన్న, పెదనాన్న, మేనమామ వీరందరితో అతీతం అయిపోయారా లేక వారు ఇంకా ఉన్నారా? అతీతంగా మరియు అతిప్రియంగా అయ్యారా? ప్రియంగా ఉంటున్నారు కానీ అతీతంగా అయ్యి ప్రియంగా అవుతున్నారా? కేవలం ప్రియంగా అవుతున్నారు కానీ అతీతం అయ్యి ప్రియంగా అవ్వటం లేదు. ఇదే పొరపాటు జరుగుతుంది. అయితే అతీతంగా లేక ప్రియంగా అవ్వటం సహజంగా అనిపిస్తుంది. కానీ ఈ దేహసంబంధీకుల నుండి అంటే పెదనాన్న, చిన్నాన్న, మావయ్యలతో అతీతం అవ్వటం సహజం. సహజమేనా లేక కొద్దికొద్దిగా స్వప్నంలో, సంకల్పంలో వస్తున్నారా? బ్రాహ్మణ పరివారంలో ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు చిన్నాన్న, పెదనాన్న, మావయ్య జ్ఞాపకం వస్తున్నారా? బాప్ దాదా చూస్తున్నారు - కొందరికి పరిస్థితుల సమయంలో బ్రాహ్మణ పరివారానికి బదులు లౌకిక సంబంధాలు త్వరగా స్మృతిలోకి వస్తున్నాయి. వేరు చేసిన వాటిని పరిస్థితి మరలా తోడుగా అనుభవం చేయిస్తుంది. మరజీవగా అయిపోయారు. గత జన్మ యొక్క సంబంధీకులు అంటే చిన్నాన్న, పెదనాన్న, తల్లి, తండ్రి స్మృతి ఉంటుందా? మీకు వారితో ఏమైనా సంబంధం ఉందా? కలలో అయినా కానీ వస్తున్నారా? సంబంధం మారిపోయింది, జన్మ మారిపోయింది. ఫరిస్తా అంటే పాత వాటితో బంధన ఉండదు. ఇదే పరిభాష చెప్తారు. అయితే మరలా సమయానికి ఎక్కడి నుండి వస్తున్నారు? తెగిపోయిన సంబంధం మరలా కలిసిపోతుందా? చనిపోయినవారు మరలా బ్రతుకుతున్నారా? ఫరిస్తా అంటే పాత బంధనాలు ఉండవు, అన్నీ క్రొత్తవి ఉంటాయి. బాప్ దాదా చూశారు - ఫరిస్తాగా అవ్వటంలో ఏదైతే విఘ్నం వస్తుందో దానికి కారణం, మొదటి మెట్టు దేహ బ్రాంతి వదలాలి మరియు రెండవ మెట్టు సూక్ష్మ దేహాభిమానాన్ని వదలాలి. దేహబ్రాంతి మరియు దేహ అభిమానం. దేహబ్రాంతి సాధారణమైనది కాని ఎంతగా జ్ఞానీ ఆత్మలుగా, యోగీ ఆత్మలుగా అవుతుంటారో అంతగా దేహాభిమానం విఘ్నం వేస్తుంది. అభిమానం అనేది అనేక రకాలుగా వస్తుంది, తమ బుద్ది యొక్క అభిమానం, తమ శ్రేష్ట సంస్కారాల అభిమానం, తమ మంచి స్వభావం యొక్క అభిమానం. తమ విశేషతల అభిమానం, తమలో ఉన్న ఏదో ఒక విశేష కళ యొక్క అభిమానం, తమ సేవా సఫలత అభిమానం. ఈ సూక్ష్మ అభిమానం దేహబ్రాంతి కంటే చాలా లోతైనది. అభిమానానికి ద్వారం ఏమిటో మీకు తెలుసు కదా? నేను మరియు నాది అనే భావం. ఇవే అభిమానానికి ద్వారాలు. అందువలన ఫరిస్తా అంటే కేవలం దేహ భ్రాంతికి, దేహ ఆకర్షణకి, స్థూల సంబంధాలకి అతీతం అని కాదు కానీ ఫరిస్తా అంటే దేహం యొక్క సూక్ష్మ అభిమానం యొక్క బంధనతో కూడా అతీతం. అభిమానం ఉన్న వారి గుర్తు - ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ అవమానం కూడా త్వరగా అనుభవం చేసుకుంటారు ఎందుకంటే నేను మరియు నాది అనే ద్వారాలు తెరిచి ఉంటాయి. ఫరిస్తా యొక్క యదార్థ స్వరూపం - దేహ భ్రాంతి మరియు దేహసంబంధాలు, దేహ అభిమానంతో అతీతం. ఒకవేళ మీలో ఏదొక గుణం ఉంది లేదా శక్తి ఉంది కానీ అది ఇచ్చిన దాతను ఎందుకు మర్చిపోతున్నారు? రెండవ విషయం దీని నుండి సహజంగా అతీతం అయ్యే మార్గం లేదా విధి చాలా సహజం మరియు ఒకే మాట. ఆ ఒక్క మాటలో ఎంత శక్తి ఉందంటే దేహాభిమానం మరియు దేహబ్రాంతి సదాకాలికంగా సమాప్తి అయిపోతాయి. ఆ ఒక్క మాట ఏమిటి? చేసి చేయించే బాబా చేయిస్తున్నారు. చేసి చేయించేవారు బాబా అనే మాట దేహబ్రాంతిని మరియు అభిమానాన్ని కూడా తొలగిస్తుంది. అయితే ఈ ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోవటం సహజమా లేక కష్టమా? అన్ని పాయింట్స్ మర్చిపోండి, అలాగని కావాలని మరిచిపోవటం కాదు; ఒకవేళ మర్చిపోయినా కానీ ఒక మాట అయితే జ్ఞాపకం ఉంచుకోగలరు కదా? ఇది సహజమే కదా? చేసిచేయించేవారు బాబా అనుకోండి, అప్పుడు చూడండి - ఫరిస్తా జీవితం యొక్క అనుభవం ఎంత సహజంగా అవుతుందో! బ్రహ్మాబాబా ఫరిస్తాగా అయ్యారు. ఏ ఆధారంగా? సదా చేసి చేయించే బాబా స్మృతిలో సమర్థంగా అయ్యి ఫరిస్తాగా అయ్యారు. తండ్రిని అనుసరించాలి కదా? లేక మాయని అనుసరిస్తున్నారా? తండ్రిని అనుసరించాలి. ఒకొక్కసారి మాయ కూడా తల్లిగా తండ్రిగా అవుతుంది. చాలా మంచి పాలన మరియు ప్రాప్తి చేయిస్తుంది. కానీ అదంతా మోసపు ప్రాప్తి, మొదట ప్రాప్తి తర్వాత మోసం. పరిశీలనాశక్తి అయితే ఉంది కదా? మాయా లేక బాబాయా అని సమయం అనుసరించి పరిశీలించాలి. మోసపోయిన తర్వాత పరిశీలించటం తెలివైనవారి పని కాదు. మోసపోయి అయితే అందరూ అర్ధం చేసుకుంటారు కానీ జ్ఞానీ ఆత్మలు ముందే పరిశీలించి స్వయాన్ని రక్షించుకుంటారు. ఫరిస్తా అని ఎవరిని అంటారో అర్థమైందా? 

మూడవ స్వరూపం - ఫరిస్తా నుండి దేవత. దేవతగా ఇప్పుడు అవ్వాలా లేక భవిష్యత్తులో అవుతారా? ఇప్పుడే అవ్వాలి. మంచిది దేవత అంటే సర్వగుణాలతో అలంకరింపబడినవారు. ఈ దివ్యగుణాలు సంగమయుగం యొక్క దేవతాజీవితానికి శృంగారం. ఈ సమయంలో దివ్యగుణాలతో అలంకరించబడి ఉంటే భవిష్యత్తులో స్థూల అలంకరణతో అలంకరించబడి ఉంటారు. దేవత అంటే దివ్యగుణాలతో అలంకరించబడి ఉండేవారు, దేవత అంటే ఇచ్చేవారు, తీసుకునేవారు కాదు. అయితే మాస్టర్ దాతలుగా ఉన్నారా? లేక ఒక్కొక్కసారి తీసుకునేవారిగా, ఒక్కొక్కసారి ఇచ్చేవారిగా ఉంటున్నారా? అందువలన పరిశీలించుకోండి, దివ్య గుణాల యొక్క ఆలంకరణ సదా ఉంటుందా లేక ఒకసారి ఒక అలంకరణ ఇంకొకసారి ఇంకొక అలంకరణ మర్చిపోతున్నారా? సంపూర్ణ సర్వగుణ సంపన్నులు - ఇదే దేవతా జీవితానికి గుర్తు. ఈ గుణాలే నగలు. చూస్కోండి, బ్రాహ్మణ స్వరూపం యొక్క సర్వశక్తులు, ఫరిస్తా స్వరూపం యొక్క డబల్ లైట్ స్థితి మరియు దేవతా స్వరూపం యొక్క దాత స్థితి మరియు దివ్య గుణాల సంపన్నంగా అయ్యారా? మూడు స్వరూపాలు అనుభవం చేసుకుంటున్నారా? ఎలాగయితే బాబాతో మూడు సంబంధాలూ ఉంటాయి - తండ్రి, టీచర్ మరియు సద్గురువు సదా జ్ఞాపకం ఉంటాయి కదా! అలాగే మీ యొక్క ఈ మూడు స్వరూపాలను సదా స్మృతిలో ఉంచుకోండి. ఏమి చేయాలో అర్థమయ్యిందా. దేవతగా అయ్యేది మీరే కదా! ఇంకా వచ్చే వాళ్ళు ఎవరైనానా? మీరే అవ్వాలి కదా? ఈ రోజు బ్రాహ్మణులు, రేపు ఫరిస్తా, ఎల్లుండి దేవత. మీ యొక్క ఫరిస్తా స్వరూపాన్ని జ్ఞానమనే దర్పణంతో చూసుకోండి. ఫరిస్తా సదా ఎగురుతూ ఉంటుంది మరియు సందేశం ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి - ఫరిస్తా వస్తుంది, సందేశం ఇస్తుంది మరియు ఎగిరిపోతుంది. అయితే ఆ పరిస్తా ఎవరు? మీరే కదా? మంచిది. మీరేనని పక్కాయేనా. ఇతరులు కాదు కదా! నషాతో చెప్పండి - మేమే అయ్యాము. మేమే అవుతాము. మరియు మేమే ఉంటాము పక్కాయేనా అటువంటి వారినే నిశ్చయబుద్ది విజయీ అంటారు. విజయీలేనా లేక క్షత్రియులా? విజయీలు, క్షత్రియులు కాదు. క్షత్రియులుగా ఎవరొకరు అవుతారు కదా? క్షత్రియులుగా వేరేవారు అవుతారు. కానీ మీరు బ్రాహ్మణులు. నడుస్తూ, నడుస్తూ ఎప్పుడు క్షత్రియులుగా కాకూడదు. ఒకవేళ మాటిమాటికి క్షత్రియులుగా అవుతూ ఉంటే, యుద్ధం చేస్తుంటే యుద్ధ సంస్కారాన్ని కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళతారు? చంద్రవంశంలోనికా లేక సూర్యవంశంలోనికా? చంద్రవంశం ఇష్టం కాదు కదా! లేక ఒక్కొక్కసారి అయినా కానీ పర్వాలేదా! అందరూ ఎవరు? బ్రాహ్మణులేనా? పక్కా బ్రాహ్మణులేనా లేక కొంచెం కొంచెం పచ్చిగా ఉన్నారా? శక్తులు పక్కాయేనా? పాండవులు పక్కాయేనా? మంచిది. ఇక ఇప్పుడు మీ దగ్గర్నుండి ఎలాంటి ఉత్తరాలు రాకూడదు. పక్కా అయితే సదా సంతోషకరమైన వార్తలతో కూడిన ఉత్తరం రావాలి. మాయ వచ్చేసింది, ఇది అయిపోయింది. ఏం అయిపోయింది, ఎలా అయిపోయింది, అసలు ఇవి సంకల్పంలో కూడా ఉండకూడదు. బాబా అయితే అంటున్నారు స్వప్నంలో కూడా రాకూడదు. స్వప్నంలో కూడా ఏమిటి? ఎందుకు అనేవి ఉండకూడదు. అలా పక్కాయేనా? మొదట అయితే అవును అనేశారు. శక్తులు మహాపక్కాయేనా? లేక కొంచెం కొంచెం పచ్చిగా ఉన్నారా? పాండవులు పక్కా అయితే మేం మహా పక్కా అని చెప్పండి. ఎందుకంటే శక్తులను నిమిత్తంగా చేశారు. మరి నిమిత్తం అయినవారే పచ్చిగా ఉంటే ఇతరుల పరిస్థితి ఏమిటి? పాండవులు వెన్నెముకలాంటివారు. వెన్నెముకగా అవ్వటం మంచిగా అనిపిస్తుందా? లేక ఎదుర్కోవటం మంచిగా అనిపిస్తుందా? - 

నలువైపుల ఉన్న బ్రాహ్మణుల నుండి ఫరిస్తాగా, ఫరిస్తా నుండి దేవతగా ఇలా మూడు స్వరూపాలను స్మృతిలో ఉంచుకునే స్మృతి స్వరూప ఆత్మలకు, సదా చేసి చేయించేవారు బాబా అనే విధితో స్వయాన్ని డబల్ లైట్ గా చేసుకునే శ్రేష్టాత్మలకు, సదా దేవత అనగా దాతగా అయ్యి ఇచ్చే వారికి, సర్వ ఖజానాలతో సంపన్న ఆత్మలకు, సదా వరదానాన్ని కర్మలోకి తీసుకువచ్చే కర్మయోగి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నమస్తే. 

Comments