23-02-1997 అవ్యక్త మురళి

         23-02-1997         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సహచరిని(సాతీ) వెంట ఉంచుకుని సాక్షి మరియు భాగ్యశాలి సింహాసనాధికారిగా అవ్వండి.

ఈ రోజు విశ్వకళ్యాణకారి బాబా విశ్వంలో నలువైపుల ఉన్న తన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలందరి స్నేహం మరియు సహయోగం యొక్క రేఖలు ముఖం ద్వారా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి మనస్సు నుండి “ నా బాబా ” అనే పాట బాప్ దాదా వింటున్నారు. బాప్ దాదా కూడా జవాబుగా చెప్తున్నారు - "ఓ నా యొక్క అతి ప్రియ, అతి స్నేహి గారాభమైన పిల్లలూ!” అని. ప్రతి ఒక బిడ్డ ప్రియమైనవారు మరియు గారాభమైనవారు కూడా ఎందుకు? కోట్లలో కొద్దిమంది మరియు కొద్దిమందిలో కొద్దిమంది, కనుక గారాభమైనవారు అయ్యారు కదా! కనుక బాప్ దాదా కూడా గారాభమైన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు సదా సంతోషంగా నాట్యం చేయటం చూస్తున్నారు మరియు సదా చూడాలనుకుంటున్నారు. సంతోషంలో ఉంటున్నారు కానీ సదా ఉండాలని బాబా అనుకుంటున్నారు. సదా సంతోషంలో ఉంటున్నారా లేదా సంతోషంలో తేడా వస్తుందా? అప్పుడప్పుడు చాలా సంతోషంగా, అప్పుడప్పుడు కొంచెం తక్కువగా మరియు అప్పుడప్పుడు చాలా తక్కువగా ఉంటున్నారా? 

బాబా ఇంతకు ముందు కూడా చెప్పారు - వర్తమాన సమయంలో విశ్వంలో ఆత్మలకు పిల్లలైన మీ యొక్క ఈ సేవ అవసరం ఉంది - మీ ముఖం ద్వారా, నయనాల ద్వారా, రెండు మాటల ద్వారా ప్రతి ఆత్మని దు:ఖం నుండి దూరం చేసి సంతోషం ఇవ్వాలి, మిమ్మల్ని చూస్తూనే సంతోషం అయిపోవాలి. అందువలన సంతోషవంతమైన ముఖం లేదా సంతోషకర చిత్రం సదా ఉండాలి. ఎందుకంటే మనస్సు యొక్క సంతోషం ముఖం ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎంత భ్రమిస్తున్నా, అలజడి, దు:ఖంలోకి వచ్చినా, సంతోషంలో ఉండటం అసంభవం అనుకున్నా కానీ మీ ఎదురుగా వస్తూనే మీ యొక్క మూర్తి, వృత్తి, దృష్టి ఆత్మని పరివర్తన చేయాలి. ఈరోజుల్లో మానసిక సంతోషం కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు. మనోరంజకమైన సాధనాలు ఎన్ని తయారుచేస్తున్నారు! అవి అల్పకాలిక సాధనాలు కానీ మీది సత్యమైన సాధన. కనుక సాధన ఆ ఆత్మలను పరివర్తన చేయాలి. అయ్యో, అయ్యో అంటూ వచ్చినవారు, ఓహో, ఓహో అంటూ వెళ్ళాలి. పరమాత్మ యొక్క అద్భుతం ఓహో అనాలి. ఈ సేవ చేయండి. సమయం అనుసరించి అల్పకాలిక సాధనాలతో అలజడి అయిన సమయంలో మీ యొక్క సంతోషం వారికి తోడు అవుతుంది. ఎందుకంటే మీరు అదృష్టవంతులు. అదృష్టవంతులా, కాదా? సగంలో అయితే లేరు కదా? అదృష్టవంతులే. మీ వంటి అదృష్టవంతులు మొత్తం కల్పంలో ఎవరూ ఉండరు. ఇంత సంతోషాన్ని ముఖం మరియు నడవడిక ద్వారా అనుభవం చేయించండి. చేయిస్తారా లేదా చేయిస్తున్నారు కూడానా? ఒకవేళ బ్రాహ్మణజీవితంలో సంతోషం లేకపోతే బ్రాహ్మణులుగా అయ్యి ఏమి చేసినట్లు! బ్రాహ్మణ జీవితం అంటేనే సంతోష జీవితం. బాప్ దాదా చూస్తున్నారు - అప్పుడప్పుడు కొంతమంది ముఖం ఏమౌతుంది అంటే కొద్దిగా..... ఏమౌతుంది? అనేది మీకు బాగా తెలుసు, అందుకే నవ్వుతున్నారు. బాప్ దాదాకి అటువంటి ముఖం చూసి దయ కూడా వస్తుంది మరియు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. నా పిల్లలు ఉదాశీనంగా ఉండటం ఏంటి! అని. అలా జరుగుతుందా? జరగదు కదా! ఉదాశీనంగా అవ్వటం అంటే మాయకు దాసి అవ్వటం, కానీ మీరు మాస్టర్ మాయాపతులు. మాయ మీ ముందు ఏమిటి? చీమ కూడా కాదు, చనిపోయిన చీమ. దూరం నుండి జీవించిన్నట్లు ఉంటుంది కానీ చనిపోయి ఉంది. కేవలం దూరం నుండే పరిశీలించే శక్తి ఉండాలి. ఎలా అయితే బాబా యొక్క జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకుంటున్నారో అదేవిధంగా మాయ యొక్క బహురూపాలను కూడా గ్రహించే జ్ఞానాన్ని కూడా బాగా తెలుసుకోండి. అది కేవలం భయపెడుతుంది. చిన్న పిల్లలను నిర్భయంగా చేయడానికి తల్లితండ్రులు సరదాగా భయపెడుతూ ఉంటారు కదా! వారిని ఏమీ చేయరు కానీ సరదాకి భయపడుతూ ఉంటారు. అదేవిధంగా మాయ కూడా తనవారిగా చేసుకోవడానికి బహురూపాలను దరిస్తుంది. అది ఎప్పుడైతే బహురూపాలు ధారణ చేస్తుందో మీరు కూడా బహురూపి అయ్యి పరిశీలించండి. పరిశీలించలేక పోతున్నారు కదా! ఏమి ఆట ఆడుతున్నారు? అయ్యో మాయ వచ్చేసింది అని యుద్ధం చేయటం ప్రారంభిస్తున్నారు, అలా యుద్ధం చేయటం ద్వారా మనస్సు, బుద్ది అలసిపోతున్నాయి. మరలా అలసటతో ఏమి అంటున్నారు? మాయ చాలా ప్రబలమైనది, మాయ చాలా తీవ్రమైనది అని అంటున్నారు. మీ యొక్క బలహీనత రకరకాల మాయా రూపంగా అవుతుంది. 

బాప్ దాదా సదా ప్రతి ఒక బిడ్డని అదృష్టం యొక్క నషాలో, సంతోషవంతమైన ముఖంతో మరియు సంతోషం అనే ఆహారం తీసుకుని ఆరోగ్యంగా మరియు సదా సంతోషాల ఖజనాతో సంపన్నంగా చూడాలనుకుంటున్నారు. జీవితంలో కావలసినది ఏమిటి? ఆహారం మరియు ఖజానా "ఇంకేమి కావాలి? కనుక మీ దగ్గర సంతోషం అనే ఆహారం ఉందా లేక అప్పుడప్పుడు ఆ స్టాక్ సమాప్తి అయిపోతుందా? తరుగని సంతోష ఖజానా ఉంది. లెక్కలేనంత ఉంది కదా? మరియు ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఏమీ పురుషార్ధం చేయలేకపోయినా కానీ కేవలం ఒక లక్ష్యం పెట్టుకోండి - ఏది ఏమైనా, మీ మనస్సు యొక్క స్థితి ద్వారా అయినా, ఇతర ఆత్మల ద్వారా అయినా, ప్రకృతి ద్వారా అయినా, వాయుమండలం ద్వారా అయినా ఏమైనా కానీ నేను మాత్రం సంతోషం వదలను - ఇది సహజ పురుషార్థం కదా! లేదా సంతోషం మాయం అయిపోతుందా? సహజమా లేదా అప్పుడప్పుడు కష్టమనిపిస్తుందా? ధృఢసంకల్పం పెట్టుకోండి మరియు ఇతర విషయాలు మర్చిపోండి. ఒక విషయం గట్టిగా ఉంచుకోండి - నేను సంతోషంగా ఉండాలి. అప్పుడు విషయాలు ఏమి అనిపిస్తాయి? ఆట. మరియు ఆట చూడడానికి సాక్షి స్థితి అనే ఆసనంపై ఆసీనులు అయ్యి ఉండండి. ఎవరు మిమ్మల్ని అవమానపరిచినా, మిమ్మల్ని అలజడి చేసి మీ సాక్షిస్థితి యొక్క గౌరవం నుండి కిందకి దింపేసినా కానీ మీరు సాక్షిస్థితి అసనం నుండి క్రిందకి దిగకండి. క్రిందకి వచ్చినప్పుడే సంతోషం తక్కువ అయిపోతుంది. 

బాప్ దాదా మొదట కూడా రెండు మాటలు చెప్పారు - సాతీ (సహచరి ) మరియు సాక్షి. బాప్ దాదా ఎప్పుడైతే వెంట ఉంటారో సాక్షిస్థితి యొక్క సీట్ గట్టిగా ఉంటుంది. అందరూ అంటారు - బాప్ దాదా తోడు ఉన్నారు. బాప్ దాదా తోడు ఉన్నారు అని, కానీ మాయ యొక్క ప్రభావం కూడా పడుతూ ఉంటుంది. మరలా అనడానికి బాప్ దాదా తోడు ఉన్నారు, బాప్ దాదా తోడు ఉన్నారు అంటారు. తోడు ఉన్నారు. కానీ తోడును ఆ సమయంలో ఉపయోగించుకోవటం లేదు, తొలగించేస్తున్నారు. ఎలా అయితే ఎవరైనా వెంట ఉన్నా కానీ ఒకోసారి ఏదైనా పనిలో కానీ లేక ఏదైనా విషయంలో ఉన్నప్పుడు ఆ సహయోగి యొక్క ఆలోచన కూడా ఉండదు, విషయాలలో పడిపోతారు, అలాగే బాబా వెంట ఉన్నారు అని అంగీకరిస్తున్నారు అనుభవం కూడా చేసుకుంటున్నారు. ఎవరైనా మాకు తోడు లేరు అని చెప్తారా? ఎవరూ చెప్పరు. ప్రతి ఒక్కరు నా తోడు ఉన్నారు అంటారు. నీ తోడు ఉన్నారు అని అనరు, ప్రతి ఒక్కరు నా తోడు ఉన్నారు అని చెప్తారు. మనస్సుతో చెప్తున్నారా లేదా నోటితో చెప్తున్నారా? మనస్సుతో చెప్తున్నారా? 

బాప్ దాదా ఆట చూస్తున్నారు, బాబా మీ వెంట కూర్చున్నారు. కానీ మీరు పరిస్థితులలో లేదా వాటిని ఎదుర్కోవటంలో ఎంత లీనం అయిపోతున్నారంటే వెంట ఎవరు ఉన్నారో కూడా మర్చిపోతున్నారు. కనుక బాబా కూడా ఏమి చేస్తున్నారు? బాబా కూడా సాతీ నుండి సాక్షి అయ్యి ఆట చూస్తున్నారు. ఇలా అయితే చేయరు కదా! ఎప్పుడైతే సాతీ అంటున్నారో తోడు నిలుపుకోండి. ఎందుకు తొలగించేస్తున్నారు? బాబాకి ఇష్టం అనిపించటం లేదు. బాబా ఇంకొక శుభ ఆశ ఇదే పెట్టుకుంటున్నారు - ఒక్కొక్క పిల్లవాడు స్వరాజ్యాధికారి నుండి విశ్వరాజ్యాధికారి అవ్వాలి అని. మీరు ప్రజలా? ప్రజలుగా అయితే కాకూడదు కదా? రాజులు, మహారాజులు, విశ్వరాజులు కదా! ప్రజలు తయారు చేసుకునేవారు, ప్రజలుగా అయ్యేవారు కాదు కదా! రాజుగా అయ్యేవారా, ప్రజలుగా అయ్యేవారా! రాజు ఎక్కడ కూర్చుంటారు? సింహాసనంపై కూర్చుంటారు కదా! ప్రత్యక్షంలో రాజు యొక్క సంతోషంలో ఉంటే సింహాసనంపై కూర్చుంటారు కదా! సాక్షి స్థితి యొక్క సింహాసనాన్ని వదలకండి. వేరువేరుగా పురుషార్ధం చేసి అలసిపోతున్నారు. ఈ రోజు మనస్సు గురించి చేసాము, రేపు వాచా గురించి చేస్తాము, సంబంధ, సంపర్కాల గురించి చేస్తాము ఇలా అలసిపోతున్నారు. ఒకే పురుషార్ధం చేయండి - సాక్షి మరియు సంతోషవంతమైన సింహాసనాధికారిగా ఉండాలి. ఈ సింహాసనం ఎప్పుడూ వదలకూడదు. ఎవరైనా రాజు సీరియస్ గా సింహాసనంపై కూర్చుంటే బావుంటుందా? కూర్చున్నది సింహాసనంపైనే కానీ చాలా క్రోధంతో, గంభీరంగా ఉంటే బావుంటుందా? వీరు రాజు కానే కాదు అంటారు. మీరు సదా సింహాసనాధికారులు కదా! ప్రాపంచిక రాజు అయితే అప్పుడప్పుడు సింహాసనంపై కూర్చుంటారు, అప్పుడప్పుడు కూర్చోరు. కానీ సాక్షిస్థితి యొక్క సింహాసనం ఎలాంటిదంటే ప్రతి కార్యం చేస్తు సింహాసనాధికారిగా ఉండవచ్చు, క్రిందికి దిగవలసిన అవసరం ఉండదు. నడుస్తూ, తిరుగుతూ, సంబంధ, సంపర్కంలోకి వస్తూ, నిద్రపోతూ కూడా సింహాసనాధికారిగా ఉండవచ్చు. సింహాసనంపై కూర్చోవటం వస్తుందా లేదా కూర్చోవటం రాక దిగిపోతున్నారా? సాక్షి స్థితి యొక్క సింహాసనాధికారిగా ఉన్న ఆత్మ ఎప్పుడు ఏ సమస్యలలో అలజడి అవ్వదు. సమస్య సింహాసనం క్రింద ఉండిపోతుంది మరియు మీరు సింహాసనాధికారిగా పైన ఉంటారు. సమస్య మీ దగ్గర తల ఎత్తలేదు, క్రిందే అణిగి ఉంటుంది, మిమ్మల్ని అలజడి చేయదు. ఎవరినైనా అణిచివేస్తే లోలోపలే సమాప్తి అయిపోతారు కదా! బాప్ దాదాకి అలాంటి సమయంలో ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మీ గురించి మీరు ఆశ్చర్యపడండి, ఇతరుల గురించి ఆశ్చర్యపడకండి. ఆశ్చర్యం అనిపిస్తుంది - నా పిల్లలు ఏమి చేస్తున్నారు అని! సింహాసనం నుండి దిగిపోతున్నారు. ఎప్పుడైతే ఇప్పటి నుండి సింహాసనాధికారి అయ్యే సంస్కారం ఉంటుందో అప్పుడే విశ్వ సింహాసనంపై కూర్చోగలరు. ఇక్కడ సదాకాలిక సింహాసనాధికారి అవ్వకపోతే కనుక అక్కడ కూడా సదా అంటే ఎంత సమయం పూర్తిగా ఉండరో అంత సమయం కూర్చోలేరు. అన్ని సంస్కారాలు ఇప్పుడే నింపుకోవాలి. మరలా ఇక్కడ నింపుకున్న సంస్కారాలే సత్యయుగంలో పని చేస్తాయి. రాయల్టీ యొక్క సంస్కారం ఇప్పటినుండే నింపుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం సమయం ఉంది. ఇంతలో ఇంకా వినాశనం అవ్వదు అని ఆలోచించకండి. వినాశనం అకస్మాత్తుగా అయిపోతుంది. తయారయిపోయారా అని అడిగి ఏమీ రాదు, అన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి. మీరు కూడా బ్రాహ్మణులుగా ఎలా అయ్యారు? అకస్మాత్తుగానే సందేశం లభించింది, ప్రదర్శని చూసారు. సంబంధ, సంపర్కంలోకి వచ్చారు మారిపోయారు. ఈ తారీఖుకు బ్రాహ్మణులు అవుతాము అని ఆలోచించారా? అకస్మాత్తుగా అయిపోయారు కదా? కనుక పరివర్తన కూడా అకస్మాత్తుగా జరుగుతుంది. మిమ్మల్ని మొదట మాయ ఇంకా సోమరితనంగా తయారుచేస్తుంది. మేము 2000 సం||లు అని ఆలోచించాము అది కూడా పూర్తయిపోయింది ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకుందాము ఇలా ఆలోచించకండి. మొదట మాయ తన యొక్క గారడీ వ్యాపింపచేసి సోమరితనంగా తయారుచేస్తుంది. ఏవిషయంలో అయినా, సేవలో అయినా, యోగంలో అయినా, ధారణలో అయినా, సంబంధ, సంపర్కంలో అయినా ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది జరుగుతూనే ఉంటుంది..... ఇలా మొదట మాయ సోమరిగా చేసే ప్రయత్నం చేస్తుంది. తర్వాత అకస్మాత్తుగా వినాశనం అయిపోతుంది. మరలా బాప్ దాదా ఇది చెప్పలేదు, ఇలా కూడా జరుగుతుందా అని అనకండి. అందువలన ముందే చెప్తున్నాను - ఎప్పుడు, ఏ విషయంలో సోమరిగా కాకూడదు. 4 సబ్జక్టులలో అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు కూడా ఏది జరిగినా అలర్ట్ గా ఉండాలి. ఆ సమయంలో బాప్ దాదాని ఇప్పుడు రండి. తోడు నిలబెట్టండి, ఇప్పుడు శక్తి ఇవ్వండి అని అడిగినా ఆ సమయంలో ఇవ్వరు. ఇప్పుడు ఎంత శక్తి కావాలంటే ఎలా కావాలంటే అలా అంత జమ చేసుకోండి. అందరికీ పూర్తి అవకాశం ఉంది. తెరిచి ఉన్న ఖజానా, ఎంత శక్తి, ఏ శక్తి కావాలంటే ఆ శక్తి తీసుకోండి. పరీక్ష సమయంలో టీచర్ లేదా ప్రిన్సిపాల్ ఎవరూ సహాయం చేయరు. 

డబల్ విదేశీ పిల్లలను చూసి బాబా కూడా డబల్ సంతోషంతో ఉంటారు. ఎందుకు? ఎందుకంటే డబల్ విదేశీయులకు స్వయాన్ని పరివర్తన చేసుకోవటంలో డబల్ శ్రమ చేయవలసి వస్తుంది. అందువలన బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలను చూసి డబల్ సంతోషం వస్తుంది. ఓహో! నా యొక్క డబల్ విదేశీ పిల్లలు ఓహో!! అని. డబల్ విదేశీయులు చేతులు ఎత్తండి! (ప్రపంచంలోని అనేక దేశాల నుండి అన్నయ్యలు, అక్కయ్యలు ఒక వేయి మంది సభలో ఉపస్థితులై ఉన్నారు) ఓహో చాలా బావుంది. డబల్ చప్పట్లు మ్రోగించండి. బాప్ దాదా విదేశీ సేవా సమాచారం వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు కూడా, ఫలితంలో సేవ యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు చాలా బావున్నాయి. కేవలం అప్పుడప్పుడు తమపై కొద్దిగా సేవ యొక్క బరువు పెట్టుకుంటున్నారు, బరువు పెట్టుకోకండి, బరువు బాబాకి ఇచ్చేయండి. బాబాకి అయితే ఆ బరువు ఏమీ అనిపించదు. కానీ మీరు సేవ యొక్క బరువు ఎత్తుకుని అలసిపోతున్నారు. సేవ చాలా బాగా చేస్తున్నారు. సేవ చేసే సమయంలో అలసిపోవటం లేదు. ఆ సమయంలో చాలా మంచి ముఖాలతో ఫోటో తీసేవిధంగా ఉంటున్నారు. కానీ కొంతమంది (అందరూ కాదు) సేవ చేసిన తర్వాత కొద్దిగా అలిసిన ముఖంతో కనిపిస్తున్నారు. బాబా చెప్తున్నారు - బరువు ఎందుకు ఎత్తుతున్నారు? బరువు ఎత్తటం ఇష్టమనిపిస్తుందా లేదా అలవాటు అయిపోయిందా? బరువు ఎత్తకండి. బాబా వెంట లేనప్పుడు బరువు అనిపిస్తుంది. నేను చేసాను, నేను చేస్తున్నాను, నేను చేస్తాను, ఇలా అనుకుంటే బరువు అనిపిస్తుంది. బాబా తోడు ఉన్నారు, బాబా యొక్క కార్యం, బాబా చేయిస్తున్నారు అనుకుంటే బరువు అనిపించదు, తేలికగా నాట్యం చేస్తారు. నాట్యం బాగా చేస్తారు కదా! డబల్ విదేశీయుల నాట్యం చూడండి, చాలా బావుంటుంది. స్వయం అలసిపోరు, ఫరిస్తాల వలె చేస్తారు. భారతవాసీయులు చేసే నాట్యంతో పాదాలు, చేతులు కూడా అలసిపోతాయి. కానీ విదేశీయులు నాట్యం కూడా తేలికగా చేస్తారు, అలాగే సేవ కూడా ఒక నాట్యంలా, ఆటగా భావించండి, అలసిపోకండి. బాప్ దాదాకి ఆ ఫోటో మంచిగా అనిపించటం లేదు. సేవ యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు మంచిగా ఉన్నాయి. చిన్న విషయానికే అలజడిలోకి తక్కువ శాతంగా వస్తున్నారు. ఎక్కువమంది బావున్నారు, కొద్దిమంది మాత్రం అప్పుడప్పుడు కొద్దిపాటి అలజడిలో కనిపిస్తున్నారు. ఆదిలో ఫలితం మరియు ప్రస్తుత ఫలితంలో చాలా తేడా ఉంది. తేడా వచ్చినట్లు కనిపిస్తుంది కదా? నాజూకు స్థితిని ఇప్పుడు వదిలేస్తూ ఉన్నారు. ఈ ఫలితం చూసి బాప్ దాదాకి సంతోషంగా ఉంది. 

ఇప్పుడు చిన్న చిన్న మైకు కూడా తయారుచేస్తున్నారు. ఇలా చిన్నవారి నుండి పెద్దవారిని తయారుచేసే వరకు కూడా వస్తారు. బాప్ దాదాకి జ్ఞాపకం ఉంది, ఆదిలో విదేశీ టీచర్స్ చెప్పేవారు, వి.ఐ.పిలను కలుసుకోవటమే కష్టం అని రావటం విషయం వదిలేయండి, కలుసుకోవడమే కష్టం అని. ఇప్పుడది సహజం అయిపోయింది. ఎందుకంటే మీరు కూడా వి.వి.వి.ఐ.పి లు అయిపోయారు. కనుక మీ ముందు వి.ఐ.పిలు ఏమిటి! మొత్తం విదేశం యొక్క ఫలితం బావుంది. వృద్ధిని పొందుతూ వెళ్తున్నారు. సెంటర్స్ కూడా మంచిగా ఉన్నాయి. భారతదేశంలో హేండ్స్ (సహయోగులు) లేరు. లేకపోతే భారతదేశంలో కూడా సేవాకేంద్రాలు తయారయ్యేవి. ఒక్కొక్క జోన్ వారు హేండ్స్ (సహయోగులు) లేరు అని చెప్తున్నారు. కనుక ఈ సంవత్సరం హేండ్స్ ను తయారుచేసే సేవ చేయండి. హేండ్స్ ను అడగటం కాదు, తయారు చేయండి. ఇంకా దాన, పుణ్యాలు చేయండి.  

విదేశంలో ఇది చాలా మంచి పద్దతి - ఎక్కడ సెంటర్ తెరుస్తారో అక్కడే లౌకిక కార్యం (ఉద్యోగం) కూడా చేస్తారు. సెంటర్ కూడా నడిపిస్తారు. దీని ద్వారా సేవా కేంద్రం ఎలా నడుస్తుంది, ఎవరు నడిపిస్తారు అనే సమస్య తక్కువగా ఉంటుంది. మీరు మేము లౌకిక పని ఎందుకు చేయాలి అని ఆలోచించకండి. ఇది మీ యొక్క సేవా సాధనం. లౌకికపని చేయటం లేదు. కానీ అలౌకిక కార్యానికి నిమిత్తంగా అవ్వడానికి లౌకికకార్యం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నా సెంటర్ తెరవాలనే ఉత్సాహం ఉంటుంది కదా! కనుక లౌకిక కార్యం ఎంతవరకు చేస్తాము అని ఆలోచించకండి. లౌకిక కార్యం కూడా అలౌకిక కార్య నిమిత్తం చేస్తే సమర్పణ అయినట్లే. లౌకికస్థితి ఉండకూడదు. లౌకిక కార్యంలో కూడా అలౌకికత ఉంటే సమర్పణ అయినట్లే. లౌకిక కార్యం వదిలేసి సమర్పణ సమారోహం జరుపుకోవాలని ఏమీ లేదు. అలా చేయటం ద్వారా వృద్ధి ఎలా అవుతుంది! అందువలనే లౌకిక కార్యం చేస్తూ అలౌకిక కార్యానికి నిమిత్తం అవుతున్నారు. లౌకికంలో నిమిత్తంగా భావించి అలౌకికతలో ఉంటున్నారు. ఇలాంటి ఆత్మలకు డబల్ ఏమిటి కోటానుకోట్ల శుభాకాంక్షలు. అర్ధమైందా! అందువలన దాదీ! మమ్మల్ని ఈ లౌకికం నుండి విడిపించండి, విడిపించండి అని అనకండి. ఇలా కాదు. ఇంకా డబల్ ప్రాప్తి తయారుచేసుకుంటున్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే వారే విడిపిస్తారు. మీకేంటి! దాదీలకు బాధ్యత ఉంది. మీరు మీ యొక్క లౌకికంలో అలౌకికత తీసుకురండి, అలసిపోకండి. లౌకిక పని చేస్తూ ఏమి చేయము అలసిపోతున్నాము అంటున్నారు. సంతోషంతో రెండూ నిలుపుకోండి. ఎందుకంటే డబల్ విదేశీయులకు రెండు వైపుల కార్యం చేసే శక్తి బాబాకి కనిపిస్తుంది. కనుక మీ యొక్క శక్తిని కార్యంలో ఉపయోగించుకోండి. ఎప్పుడు వదిలి పెట్టేస్తాము, ఏమౌతుంది.... అని ఆలోచించకండి. ఇక్కడ బాబా మరియు దాదీలు ఎవరైతే నిమిత్తం అయ్యారో వారిపై వదిలి పెట్టేయండి, మీరు ఆలోచించకండి. లౌకిక కార్యం చేస్తూ సెంటర్ సంభాళించేవారు ఎవరెవరో చేతులు ఎత్తండి. చాలా బావుంది, నిశ్చింతగా ఉండండి. రోజంతా సేవ చేసేవారికి ఏ నెంబరు లభిస్తుందో మీకు కూడా ఆ నెంబరే లభిస్తుంది, కనుక కేవలం నిమిత్తమాత్రంగా చేయండి, నేను అనే భావంలోకి రాకండి. నేను ఇంత పని చేస్తున్నాను ఇలా నేను అనేది ఉండకూడదు. చేయించేవారు చేయిస్తున్నారు, నేను పరికరాన్ని, పవర్ (బాబా శక్తి) ఆధారంగా నడుస్తున్నాను అని స్మృతి ఉండాలి. 

మంచిది - ఒక సెకనులో పూర్తిగా బాబా సమానంగా అశరీరిగా కాగలరా? ఒక సెకనులో ఫుల్ స్టాప్ పెట్టేయండి మరియు అశరీరి స్థితిలో స్థితులవ్వండి. (బాప్ దాదా 3 నిమిషాలు డ్రిల్ చేయించారు). మంచిది - రోజంతటిలో మాటిమాటికి ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. 

నలువైపుల ఉన్న సర్వ మాయాజీతులకు, ప్రకృతి జీతులకు, సాక్షి స్థితి యొక్క సింహాసనాధికారులకు, సహయోగి యొక్క తోడు సదా అనుభవం చేసుకునే వారికి, సదా ధృడత ద్వారా సఫలతను కంఠహారంగా చేసుకునేవారికి, సదా బాబా సమానంగా తేలికగా ఉండేవారికి, సదా మీ యొక్క శక్తి ద్వారా విశ్వాన్ని దు:ఖం, అశాంతి యొక్క బలహీనత నుండి విడిపించే మాస్టర్ సుఖసాగరులకు, ఆనందసాగరుడు, ప్రేమసాగరుడు, జ్ఞానసాగరుడు అయిన తండ్రి సమాన పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments