22-03-1996 అవ్యక్త మురళి

         22-03-1996         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బ్రాహ్మణ జీవితం యొక్క వ్యక్తిత్వం - అన్ని ప్రశ్నల నుండి అతీతంగా సదా ప్రసన్నచిత్తంగా ఉండటం.

ఈరోజు సర్వప్రాప్తుల దాత అయిన బాప్ దాదా తన సర్వప్రాప్తి స్వరూప పిల్లలను చూస్తున్నారు. బాప్ దాదా ద్వారా చాలా ప్రాప్తులు లభించాయి వాటిని వర్ణన చేస్తే చాలా ఉంటాయి. అంత పెద్ద జాబితా చెప్పడానికి బదులు ఒక మాటలో అంటారు. "బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువు లేదు”, అయితే బాప్ దాదా చూస్తున్నారు ప్రాప్తులు చాలా ఉన్నాయి. పెద్ద జాబితా ఉంది కదా! ఎవరికైతే సర్వప్రాప్తులు లభించాయో వారి జీవితంలో ఏమి గుర్తు కనిపిస్తుంది? అది మీకు తెలుసు కదా? సర్వ ప్రాప్తులు లభించిన దానికి గుర్తు - సదా వారి ముఖంలో మరియు నడవడికలో ప్రసన్నత యొక్క వ్యక్తిత్వం కనిపిస్తుంది. వ్యక్తిత్వం అనేది ఎవరినైనా ఆకర్షితం చేస్తుంది. సర్వప్రాప్తులకు గుర్తు - ప్రసన్నత యొక్క వ్యక్తిత్వం, దీనిని సంతుష్ఠత అని కూడా అంటారు. కానీ ఈరోజుల్లో ముఖంలో ఏదైతే ప్రసన్నత యొక్క మెరుపు కనిపించాలో అది కనిపించటం లేదు. ఒక్కొక్కసారి ప్రసన్నచిత్తులుగా, ఒక్కొక్కసారి ప్రశ్నచిత్తులుగా ఉంటున్నారు. రెండు రకాలుగా ఉంటున్నారు. 1. కొంచెం పరిస్థితి రాగానే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు..... ఇలా ప్రశ్నచిత్తులుగా అయిపోతున్నారు. ప్రాప్తి స్వరూపులు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. వారికి ఎప్పుడూ ఏ విషయంలో ప్రశ్నలు రావు ఎందుకంటే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారు. ఈ ఏమిటి, ఎందుకు అనేవి అలజడి చేస్తాయి కానీ సంపన్నంగా ఉండేవారిలో అలజడి ఉండదు. మిమ్మల్ని మీరు అడగండి నేను సదా ప్రసన్నచిత్ గా ఉన్నానా లేదా ఉంటున్నానా? అని. అప్పుడప్పుడు కాదు సదా ఉండాలి 10 సంవత్సరాల వారు సదా ఉంటున్నారా లేదా అవును అనటం లేదు, ఆలోచిస్తున్నారు. ప్రసన్నత తక్కువగా ఉంది అంటే దానికి కారణం ప్రాప్తి తక్కువగా ఉంది. మరియు ప్రాప్తి తక్కువగా ఉండటానికి కారణం ఏదోక కోరిక. కోరికకి పునాది ఈర్ష్య మరియు అప్రాప్తి. చాలా సూక్ష్మకోరికలు అప్రాప్తి వైపు ఆకర్షితం చేసేస్తాయి. మరలా రాయల్ గా అంటారు - నాకు కోరిక లేదు కానీ అలా అయితే బావుంటుంది అంటారు. కానీ ఎక్కడ అల్పకాలిక కోరిక ఉంటుందో అక్కడ మంచిగా అవ్వలేరు. పరిశీలించుకోండి - జ్ఞాని జీవితంలో జ్ఞానం యొక్క రాయల్ కోరికలు, పెద్ద పెద్ద కోరికలు అయినా కానీ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కోరికలైతే సమాప్తి అయిపోయినవి కానీ రాయల్ కోరికలు జ్ఞానంలోకి వచ్చిన తరువాత కూడా సూక్ష్మరూపంలో ఉంటాయి, వాటిని పరిశీలించుకోండి. ఎందుకంటే బాప్ దాదా ఇప్పుడు పిల్లలందరిని బాబా సమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా తయారు చేయాలనుకుంటున్నారు. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారి సమానంగా అవ్వటం కష్టమేమి కాదు. 

బాప్ దాదాపై అందరికీ చాలా ప్రేమ ఉందా? లేక ప్రేమ ఉందా? (చాలా ప్రేమ ఉంది) పక్కాయేనా? ప్రేమలో త్యాగం చేయటం లేదా పరివర్తన అవ్వటం గొప్ప విషయమా? (కాదు) అయితే పూర్తిగా త్యాగం చేశారా? బాబా ఏదైతే చెప్తారో, ఏదైతే కావాలనుకుంటారో అది చేసారా? సదా చేసారా? అప్పుడప్పుడు చేస్తే పని జరగదు. రాజ్యభాగ్యం యొక్క ప్రాప్తి సదా కావాలా లేక అప్పుడప్పుడు కావాలా? సదా కావాలి కదా? అయితే సదా ప్రసన్నత కనిపించాలి. ఇక ఏ భావము ముఖంలో లేదా నడవడికలో కనిపించకూడదు. ఒక్కొక్కసారి అంటారు కదా ఈరోజు అక్కయ్యగారి లేదా అన్నయ్యగారి మూడ్ వేరుగా ఉంది. మీరు కూడా అంటారు కదా ఈ రోజు నా మూడ్ వేరుగా ఉంది. దీనిని ఏమంటారు? సదా ప్రసన్నంగా ఉన్నట్లా? కొంతమంది పిల్లలు పొగడ్త ఆధారంగా ప్రసన్నంగా ఉంటున్నారు. కానీ ఆ ప్రసన్నత అల్పకాలికం. ఈ రోజు ఉంటుంది, కొంచెం సమయం తరువాత సమాప్తి అయిపోతుంది. ఇది కూడా పరిశీలించుకోండి - నా ప్రసన్నత పొగడ్త ఆధారంగా లేదు కదా? ఈ రోజుల్లో ఇల్లు కట్టడానికి సిమెంట్ తో పాటూ ఇసుక శాతం ఎక్కువ కలిపేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా పునాదిలో కల్తీ అయిపోతుంది, యదార్థంగా ఉండటం లేదు. కొంచెంగా పరిస్థితి అనే తుఫాను వచ్చినా లేదా ఏ రకమైన అలజడి వచ్చినా ప్రసన్నతను సమాప్తి చేసేస్తుంది. ఇటువంటి పునాది లేదు కదా?  

బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు మరియు ఇప్పుడు మరలా అండర్‌లైన్ చేయిస్తున్నారు. రాయల్ కోరికల యొక్క స్వరూపం పేరు, గౌరవం మరియు మర్యాద. సేవని ఆధారంగా చేసుకుని పేరు కోసం సేవ చేస్తున్నారు. కానీ పేరు కోసం సేవ చేసే వారికి అల్పకాలికంగా పేరు వస్తుంది, చాలా మంచి సేవాధారులు, చాలా మంచిగా ఆకర్షించేవారు అని అంటారు. కానీ పేరు ఆధారంగా సేవ చేసే వారి యొక్క పేరు ఉన్నత పదవిలో వెనుక ఉంటుంది. ఎందుకంటే పచ్చి కాయ తినేసారు, పండిన ఫలం కాదు కనుక ఇక పండిన ఫలం ఎలా తింటారు? ఇప్పుడిప్పుడే సేవ చేశారు, ఇప్పుడిప్పుడే పేరు పొందారు ఇదే పచ్చికాయ. నేను చాలా సేవ చేసాను, అందరికంటే ఎక్కువ సేవకి నేను నిమిత్తం అయ్యాను ఇలా అనుకోవటం అంటే పేరు ఆధారంగా సేవ చేయటం, వీరినే పచ్చికాయ తినేవారు అని అంటారు. పచ్చికాయలో శక్తి ఉంటుందా? సేవ చేశారు. సేవా ఫలితంలో నాకు గౌరవం కావాలని అనుకోవటం అంటే ఇది గౌరవం కాదు అభిమానం. ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నంగా ఉండలేరు. అన్నింటికంటే పెద్ద గౌరవం - బాబా యొక్క హృదయంలో గౌరవం పొందండి. ఆత్మల హృదయంలో ఉండే గౌరవం పొందితే ఆ ఆత్మ కూడా బాబా నుండి తీసుకోవల్సిందే. మాస్టర్ దాత కానీ దాత కాదు. అందువలన గౌరవ, మర్యాదలు కావాలంటే బాబా హృదయంలో గౌరవాన్ని పొందండి. ఈ రాయల్ కోరికలు అన్నీ ప్రాప్తి స్వరూపులుగా అవ్వనివ్వవు. అందువలన ప్రసన్నత యొక్క వ్యక్తిత్వం సదా ముఖంలో లేదా నడవడికలో కనిపించడం లేదు. ఎటువంటి పరిస్థితులలో అయినా ప్రసన్నత యొక్క మూడ్ పరివర్తన అయ్యింది. అంటే దానిని సదాకాలిక ప్రసన్నత అనరు. బ్రాహ్మణ జీవితంలో మూడ్ సదా హర్షితంగా మరియు జాగ్రత్తగా ఉండాలి. (చీర్ పుల్ మరియు కేరఫుల్) మూడ్ మారిపోకూడదు. మరలా రాయల్ గా అంటున్నారు - ఈ రోజు నాకు చాలా ఏకాంతం కావాలి అని. ఎందుకు కావాలి? ఎందుకంటే సేవ మరియు పరివారం నుండి వేరుగా ఉండాలి అని అనుకుంటున్నారు. శాంతి కావాలి, ఏకాంతం కావాలి అంటారు. ఈ రోజు నా మూడ్ ఇలా ఉంది అంటున్నారు. ఇలా మూడ్ ని మార్చుకోకండి. కారణం ఏదైనా కానీ మీరు కారణాన్ని నివారణ చేసేవారా లేక కారణంలోకి వచ్చేవారా? నివారించేవారు. మీరు కాంట్రాక్టర్ కదా? ఏమి కాంట్రాక్టు తీసుకున్నారు? ప్రకృతి యొక్క మూడ్ ని కూడా పరివర్తన చేస్తాం అని. ప్రకృతిని కూడా మార్చాలి కదా? ప్రకృతి పరివర్తన చేసేవారు మీ మూడ్ ని పరివర్తన చేసుకోలేరా? మూడ్ మారిపోతుందా? లేదా? అప్పుడప్పుడు మారిపోతుందా? సాగరం ఒడ్డుకి వెళ్ళి కూర్చుందాం అనుకుంటారు, జ్ఞాన సాగరం దగ్గర కాదు, స్థూల సాగరం దగ్గర కూర్చుందాము అనుకుంటారు. విదేశీయులు ఇలా చేస్తారు కదా? లేదా ఈ రోజు చాలా ఒంటరితనం అనిపిస్తుంది అని అంటారు. అయితే బాబా యొక్క కంబైండ్ రూపం ఎక్కడికి వెళ్ళిపోయింది? వేరు చేసేశారా? కంబైండ్ గా ఉండేవారిని వేరు చేసేసారు. దానిని ప్రేమ అంటారా? మూడ్ ఆఫ్ అయిపోవటం చాలా పెద్ద విషయం కానీ మూడ్ మారిపోవటం అనేది కూడా ఉండకూడదు. మూడ్ ఆఫ్ అయిపోయిన వారు చాలా రకరకాల ఆటలు ఆడతారు. బాప్ దాదా చూస్తున్నారు, పెద్దవారికి చాలా ఆటలు చూపిస్తున్నారు లేదా తమ సహయోగులకు చూపిస్తున్నారు, అటువంటి ఆటలు ఆడకండి. ఎందుకంటే బాప్ దాదాకి పిల్లందరిపై ప్రేమ ఉంది. విశేషంగా నిమిత్తమైన వారు బాబా సమానంగా అవ్వాలి. మిగిలిన వాళ్ళు అయినా అవ్వకపోయినా పర్వాలేదు అని బాప్ దాదా అనుకోరు. అందరినీ సమానంగా చేయాలి అనుకుంటారు. ఇదే బాప్ దాదా యొక్క ప్రేమ. ప్రేమకి బదులు ఇవ్వటం వస్తుందా? లేక ఒయ్యారంగా బదులు ఇస్తున్నారా? ఒక్కొక్కసారి ఒయ్యారాలు చూపిస్తున్నారు. ఒక్కొక్కసారి సమానంగా అయ్యి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇక ఆ సమయం సమాప్తి అయిపోయింది. 

ఇప్పుడు వజ్రోత్సవం జరుపుకుంటున్నారు కదా! 60 సంవత్సరాల తరువాత వాసప్రస్థం ప్రారంభం అవుతుంది. ఇప్పుడిక చిన్న పిల్లలు కాదు, వానప్రస్థిలు అంటే అన్నీ తెలిసిన వారు, అనుభవీ ఆత్మలు, జ్ఞానవంతులు, శక్తివంతులు, విజయవంతులు. ఎలాగైతే సదా జ్ఞానవంతంగా ఉంటున్నారో అలాగే శక్తివంతంగా మరియు విజయవంతంగా కూడా ఉంటున్నారా? ఒక్కొక్కసారి విజయవంతంగా ఎందుకు అవ్వటం లేదు? దానికి కారణం ఏమిటి? సఫలత మా అందరి జన్మ సిద్ద అధికారం అని అంటారు కదా! కేవలం అంటున్నారా లేక అంగీకరిస్తున్నారా? సఫలత ఎందుకు లభించటం లేదు? కారణం ఏమిటి? మీ జన్మ సిద్ద అధికారం పొందటంలో, అనుభవం అవ్వటంలో లోపం ఎందుకు ఉంది? కారణం ఏమిటి? ఎలా చూస్తున్నారు. చాలా మంది ముందుగానే అవుతుందో అవ్వదో తెలియదు అనే బలహీన సంకల్పాలు ప్రత్యక్షం చేస్తున్నారు. ఈ బలహీన సంకల్పాలు ప్రసన్నచిత్ గా కాదు కానీ ప్రశ్నచిత్ గా తయారుచేస్తాయి. అవుతుందో, అవ్వదో ఏమవుతుందో తెలియదు... ఇటువంటి సంకల్పాలు ఒక గోడగా అయిపోతున్నాయి మరియు సఫలత ఆ గోడ లోపల దాగిపోతుంది. దాని కారణంగా సఫలత ఆగిపోతుంది. "నిశ్చయబుద్ది విజయంతి” ఇది మీ స్లోగన్ కదా! ఈ స్లోగన్ ఇప్పటిదే, భవిష్యత్తుది కాదు. అయితే సదా ప్రసన్నచిత్తంగా ఉండాలా? లేక ప్రశ్నచిత్తంగా ఉండాలా? మాయ మీ ద్వారానే బలహీన సంకల్పాలు అనే జాలాన్ని పరిపిస్తుంది, మిమ్మల్నే జాలంలో ఇరికిస్తుంది. మేమే విజయీలం ఈ స్మృతిలో బలహీన సంకల్పాల యొక్క జాలాన్ని సమాప్తి చేయండి, దానిలో చిక్కుకోకండి, సమాప్తి చేయండి. సమాప్తి చేసే శక్తి ఉందా? నెమ్మది నెమ్మదిగా చేయకండి. ఒకేసారి ఒక్క సెకనులో ఈ జాలాన్ని పెంచకుండా చేసేయండి. ఒక్కసారైనా ఈ జాలంలో చిక్కుకున్నారంటే బయటకు రావటం చాలా కష్టం. విజయం లేదా సఫలత నా జన్మ సిద్ద అధికారం అనుకోండి. మీ జన్మ సిద్ధ అధికారం, పరమాత్మ జన్మ సిద్ధ అధికారం కనుక ఎవరూ దొంగలించలేరు. ఇలా నిశ్చయబుద్ధిగా ఉన్నవారు సదా సహజంగా స్వతహాగానే మరియు ప్రసన్నచిత్తంగా ఉంటారు, శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. 

అసఫలతకి రెండవ కారణం ఏమిటి? సమయం, సంకల్పం, ధనం అన్నీ సఫలం చేసుకోండి అని మీరు ఇతరులకు చెప్తారు కదా! సఫలం చేసుకోవటం అంటే సఫలత పొందటం. సఫలం చేసుకోవటమే సఫలతకి ఆధారం. ఒకవేళ సఫలత లభించలేదు అంటే తప్పకుండా ఏదొక ఖజానాని సఫలం చేయలేనట్లే. ఖజానాల యొక్క జాబితా తెలుసు కదా! అయితే పరిశీలించుకోండి. ఏ ఖజానాను సఫలం చేసుకోలేదు మరియు ఏ ఖజానాను వ్యర్ధంగా పోగొట్టాను? అని అప్పుడు స్వతహాగానే సఫలత లభిస్తుంది. "సఫలం చేసుకోండి మరియు సఫలత పొందండి” అనేది వారసత్వం మరియు వరదానం కూడా! సఫలం చేయడం వస్తుందా? లేదా? అయితే సఫలత లభిస్తుందా? సఫలం చేసుకోవటం అనేది బీజం మరియు సఫలత అనేది ఫలం. బీజం మంచిగా ఉంటే ఫలం రాకుండా ఉండదు. సఫలం చేసుకోవటం అనే బీజంలో ఏదో లోపం ఉంది. అప్పుడే సఫలత ఫలం కూడా లభించదు. అయితే ఇప్పుడు ఏమి చేయాలి? సదా ప్రసన్నత యొక్క వ్యక్తిత్వంలో ఉండండి. ప్రసన్నచిత్ గా ఉంటే చాలా మంచి అనుభవం చేసుకుంటారు. ఎవరైనా ప్రసన్నచిత్ గా కనిపిస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. వారితో ఉండటం, వారితో మాట్లాడటం, వారితో కూర్చోవటం ఎంత బాగా అనిపిస్తుంది. ఎవరైనా ప్రశ్నచిత్ గా ఉన్న వారు వస్తే విసిగిపోతాం. అందువలన ఈ లక్ష్యం పెట్టుకోండి. ఏవిధంగా తయారవ్వాలి? ప్రశ్నచిత్తంగా కాదు, ప్రసన్నచిత్తంగా అవ్వా లి. 

ఈ రోజు సీజన్ యొక్క చివరి రోజు. చివరిలో ఏం చేస్తారు? ఏదైనా యజ్ఞం రచించినప్పుడు అంతిమంలో ఏం చేస్తారు? స్వాహా చేస్తారు. అయితే మీరేం చేస్తారు? ప్రశ్నచిత్తాన్ని స్వాహా చేయండి. ఇది ఎందుకు జరుగుతుంది? ఏం జరుగుతుంది? అని అనకూడదు. జ్ఞానవంతులు కదా! ఎందుకు, ఏమిటి అనకూడదు. ఈరోజు నుండి ఈ వ్యర్థ ప్రశ్నలని స్వాహా చేసేయండి. అప్పుడు మీ సమయం మరియు ఇతరుల సమయం కూడా రక్షింపబడుతుంది. ఇది ఎందుకు? ఇది ఎలా? కూడా సమయం అయిపోతుంది. అందువలన స్వయం మరియు ఇతరుల యొక్క సమయాన్ని పొదుపు చేయండి. పొదుపు ఖాతాను జమ చేసుకోండి, అప్పుడు 21 జన్మలు విశ్రాంతిగా తినండి, త్రాగండి, మజాగా ఉండండి. అక్కడ జమ చేసుకోవలసిన అవసరం లేదు. అయితే స్వాహా చేసారా? లేదా ఆలోచిస్తారా? ఆలోచించాలి అనుకుంటే ఆలోచించుకోండి. ఇది ఎలా అవుతుంది? చేయగలనా లేక లేదా? అని ఒక్క సెకనులో ఆలోచించుకోండి. పని పక్కాగా చేయండి. మీతో మీరు ఎన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటే అన్ని ప్రశ్నలు ఒక్క సెకనులో అడగండి. అడిగేసారా? స్వాహా కూడా చేసేసారా? లేక కేవలం ప్రశ్నలే అడిగారా? ఇక ముందు ప్రశ్నలు ఉండకూడదు. (ఒక నిమిషం మౌనం తరువాత) సమాప్తి చేసేసారా? (చేసేసాం) మామూలుగా అలాగే అనటం కాదు. చాలా కాలం యొక్క అనుభవం ఉంది కదా! ప్రశ్నచిత్ గా ఉండటం అంటే అలజడి అవ్వటం, అలజడి చేయడం. ఇది బాగా అనుభవం కదా! మీ యొక్క నిశ్చయం, జన్మ సిద్ద అధికారం యొక్క గౌరవంలో ఉండండి. అప్పుడు అలజడి అవ్వరు. దీని నుండి వేరు అయినప్పుడు అలజడి అవుతారు. అర్థమైందా? బాగా అర్థమైందా? లేదా ఇప్పుడు అలాగే అర్ధమైంది అని మరలా విదేశానికి వెళ్ళిన తరువాత కష్టమంటారా? అలా అనరు కదా! 

నలువైపుల ఉన్నటువంటి ప్రశ్నచిత్తం నుండి పరివర్తన అయ్యేవారికి, సదా ప్రసన్నచిత్ యొక్క వ్యక్తిత్వంలో ఉండే శ్రేష్ట ఆత్మలకు, సదా స్వయం యొక్క విజయం మరియు జన్మ సిద్ధ అధికారం యొక్క స్మృతిలో ఉండేవారికి స్మృతి స్వరూప విశేష ఆత్మలకు సదా సఫలం చేసుకోవటం ద్వారా సఫలతను అనుభవం చేసుకునేవారికి, బాబాకి సమీపంగా ఉండే సమీప ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. నలువైపుల ఉన్న డబల్ విదేశీయులలో 10 సంవత్సరాలు నిండిన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు విశేష శుభాకాంక్షలు. 

Comments