19-01-1995 అవ్యక్త మురళి

       19-01-1995         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బ్రహ్మాబాబా అడుగుపై అడుగు వేసి ఆజ్ఞాకారి మరియు సర్వస్వత్యాగిగా అవ్వండి.

ఈరోజు బేహద్ బాప్ దాదా తన యొక్క బేహద్ సేవా సహయోగులను చూస్తున్నారు. రెండు రకాలైన సహయోగులు ఉన్నారు - 1. స్నేహ సంబంధం యొక్క తోడు నిలుపుకునేవారు 2. స్నేహం, సంబంధం మరియు సేవ యొక్క తోడుని నిలుపుకునేవారు. రెండురకాలైన సహయోగులను చూస్తున్నారు. విశ్వంలోని చివరి మూలలో ఉన్నా కానీ బాప్ దాదా ఎదురుగా ఉన్నారు. బాప్ దాదా మరియు పిల్లల యొక్క ప్రతిజ్ఞ ఎక్కడైనా ఉంటాం, ఎక్కడ ఉన్నా కానీ సదా తోడుగానే ఉంటాం అని. ఈ బ్రాహ్మణ జీవితం ఆది నుండి అంతిమం వరకు బాబా మరియు పిల్లలు అవినాశిగా తోడుగా ఉంటారు. పిల్లలు సాకారంలో, బాప్ దాదా ఆకారంలో మరియు నిరాకారంలో ఉన్నా కానీ వేరుగా ఉన్నారా? లేరు కదా! దూరంగా ఉన్నారా లేక సమీపంగా ఉన్నారా? మంచిది (ఈరోజు 4 వేల మంది అన్నయ్యలు, అక్కయ్యలు కంటే ఎక్కువ మంది హాలులో కూర్చున్నారు) వెనుక ఉన్నవారు కూడా సమీపమేనా? మూల కూర్చున్నవారు కూడా సమీపమేనా? పాండవ భవనంలో కూర్చున్న వారు కూడా సమీపమేనా? లేక దూరంగా ఉన్నారా? మనస్సు యొక్క సమీపత సాకారంలో కూడా సమీపతను అనుభవం చేయిస్తుంది. ఏ దేశంలో ఉన్నా కానీ మనస్సు యొక్క సమీపత, తోడుగా ఉన్నట్లు అనుభవం చేయిస్తుంది. డబల్ విదేశీయులు చెప్పండి. దూరంగా ఉంటూ కూడా ఎక్కడ ఉంటున్నారు? సదా సమీపంగా కదా? ఈ రోజే కాదు సదా. వేరు కాలేరు. అసంభవం. అసంభవం కదా! లేక సంభవం అవుతుందా? అవ్వదు. పరమాత్మ ప్రతిజ్ఞ ఎప్పుడు కదలదు. అందువలన సదా సమీపంగా ఉన్నారు, సదా తోడుగా ఉన్నారు మరియు తోడుగా అయ్యి చేతిలో చేయి తీసుకుని ఎంత మజాగా నడుస్తున్నారు. మజాగా ఉంది కదా? లేక శ్రమగా ఉందా? మజా ఉందా? కొంచెం కొంచెం శ్రమగా ఉందా? ఏదైనా విషయం వచ్చేసరికి బాబా వేరు అయిపోతున్నారు. ఏ విషయం తీసుకురాకండి అప్పుడు బాబా కూడా వెళ్ళరు. విషయం బాబాని వేరు చేసేస్తుంది. ఎవరి మధ్యలో అయినా పరదా వచ్చేసిందనుకోండి పరదా వచ్చేస్తే ఏమి అవుతుంది? వేరుగా అయిపోతారు కదా! అలాగే విషయం అనే పరదా మధ్యమధ్యలో వచ్చేస్తుంది. కానీ తీసుకువచ్చేవారు ఎవరు? పరదా పని రావటం కానీ మీ పని ఏమిటి? తొలగించటమా లేక కొంచెం కొంచెం దాని నుండి మజా పొందాలా? బాప్ దాదా చూస్తున్నారు,పిల్లలు అప్పుడప్పుడు విషయాలలో చాలా మజా పొందుతున్నారు. 

ఎవరితో ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకి గుర్తు - తోడుగా ఉండటం. తోడుగా ఉండటం అంటే ఆబూలో ఉండటం అని కాదు. ఆబూలో చూడండి, కొంచెం సంఖ్య ఎక్కువయ్యే సరికి నీళ్ళ ఇబ్బంది వచ్చేసింది కదా! అందువలన సాకారంలో తోడుగా ఉండటం కాదు కానీ మనస్సుతో తోడుని నిలుపుకోవాలి. ఒకవేళ మనస్సుతో తోడు నిలుపుకోకపోతే మధువనంలో ఉన్నా దూరంగా ఉన్నట్లే మరియు దేశం యొక్క చివరి దేశంలో ఉంటూ కూడా మనస్సుతో సమీపంగా ఉంటే వారు వెంట ఉన్నట్లే. అందువలనే బాప్ దాదాని మనోభిరాముడు అని అంటారు కానీ శరీరరాముడు అని అనరు కదా! మనోభిరాముడు అంటారు. మనస్సు ఎక్కడ ఉంది? బాబాలో ఉంది కదా? బాబా మనస్సులో మీ మనస్సు, మీ మనస్సులో మనస్సు ఉంది. కనుక ఈ ఆత్మక తోడు గురించి మనస్సే తెలుసుకుంటుంది. అనుభవం ఉంది కదా? ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత దూరం అయిపోయాము అంటారా? కాదు. సదా తోడు నిలుపుకోవాలి - ఇటువంటి తోడు ఏ ఆత్మ ఏ ఆత్మతో నిలుపుకోలేదు. పరమాత్మ ఒక్కరే ఆత్మలతో తోడు నిలుపుతారు. పరమాత్మ తోడు నిలిపే భాగ్యం ఎవరికైనా లభిస్తుందా? మీరందరు ఏమంటారు? మాకు ఉంది అంటారు. ప్రతి ఒక్కరు మాకు ఉంది అంటారు కదా? కొద్దిమందికే మీకు కాదు అంటారా? అందరికీ ఉందా? వెనుక ఉన్నవారు కూడా చేతులు ఊపుతున్నారు. మంచిది. 

(ఈరోజు మొత్తం హాల్ లో అన్నయ్యలు, అక్కయ్యలు అందరు పట్టాపై కూర్చున్నారు) చాలా మంచి దృశ్యం. బాప్ దాదాకి ఈరోజు సభ యొక్క దృశ్యం చూసి స్మృతిచిహ్నం జ్ఞాపకం వస్తుంది. రుద్రమాలను స్మృతిచిహ్న రూపంలో చూపిస్తారు కదా! దీనిలో కేవలం ముఖాలను మాత్రమే చూపిస్తారు. శరీరాన్ని చూపించరు. అలాగే ఇక్కడి నుండి కూడా చూస్తూ ఉంటే కేవలం మీ అందరి ముఖాలే కనిపిస్తున్నాయి. ఇంకేమీ కనిపించడం లేదు. (ఈరోజు అక్కయ్యలు, అన్నయ్యలు అందరు పట్టాపై కూర్చుని ఉన్నారు) ఒకరి వెనుక ఒకరు కూర్చున్నారు కదా! అందువలన శరీరం కనిపించటం లేదు, ముఖాలే కనిపిస్తున్నాయి. బావుంది కదా! ఇది కూడా ఒక మాల కదా! 

ఇది స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం - బ్రహ్మాబాబాపై అందరికీ స్నేహం ఉంది. అందువలనే ఇక్కడికి వచ్చారు కదా! మరియు బ్రహ్మాకుమారి, కుమారులు అని పిలుచుకుంటారు కదా! శివకుమారి, కుమార్ అని అనటం లేదు. అంటే బ్రహ్మాబాబాతో ఎక్కువ ప్రేమ ఉంది కదా! బ్రహ్మాబాబాకు కూడా సదా పిల్లలపై ప్రేమ ఉంటుంది. అందువలనే అవ్యక్తం అయిపోయినా కానీ అవ్యక్త పాలన చేస్తున్నారు. అవ్యక్త పాలన లభిస్తుంది కదా? లేదా మేము బ్రహ్మాబాబా యొక్క పాలనను అనుభవం చేసుకోలేదు అని అంటారా? అంటున్నారా? అనుభవం చేసుకోలేదా? అయితే బ్రహ్మాకుమారి, కుమారులు అని ఎందుకు పిలుచుకుంటున్నారు? తండ్రి పాలన లేకుండానే జన్మించేసారా? పాలన యొక్క అనుభవం చేసుకుంటున్నారా? కొంచెం కొంచెం చేసుకుంటున్నారా? బ్రహ్మాబాబా యొక్క పాలన లేకుండా కేవలం నిరాకారి బాబా యొక్క పాలన ద్వారా యజ్ఞం యొక్క రచన, యజ్ఞం యొక్క వృద్ధి జరుగదు. డబల్ విదేశీయులకు బ్రహ్మాబాబా యొక్క పాలన లభిస్తుంది కదా? (లభిస్తుంది) అంటే బాబా విదేశాలకి వెళ్తున్నారు, కానీ భారతదేశంలో పాలన చేయటం లేదు? చేస్తున్నారా? పాలన లభిస్తుందా? (లభిస్తుంది) బాబాని మేము చూడలేదు అని నిందించరు కదా? సదా చూస్తున్నారు, సదా లభిస్తుంది, సదా తోడు ఉంటున్నారు. సాకార శరీరంతో సాకార రూపంలో సదా తోడుగా ఉండలేరు కానీ అవ్యక్త రూపంలో అందరికీ తోడు ఇవ్వగలరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మిలనం యొక్క తలుపులు తెరుచుకునే ఉంటాయి. అవ్యక్తవతనంలో స్థలం లేదు, సమయం లేదు అని అనరు. దేహంలో దేహం యొక్క బంధన ఉంటుంది. కానీ అవ్యక్తంలో దేహం యొక్క బంధన ఉండదు, దైహిక ప్రపంచం యొక్క నియమాల బంధన ఉండదు. ఇక్కడైతే నియమం పెట్టవలసివస్తుంది కదా - ముందు కూర్చోండి లేదా వెనుక కూర్చోండి అని. ఇప్పుడు సమయాన్ని అనుసరించి మీరు చాలా చాలా చాలా భాగ్యవంతులు. ఏదైనా కానీ కూర్చోవటానికి అయితే స్థలం లభించింది కదా! ఇక ముందు ముందు నిల్చోవటానికి కూడా స్థలం దొరకటం కష్టం అవుతుంది. ఎందుకంటే మీరందరు ఇతరులకి అవకాశం ఇవ్వవలసి వస్తుంది. ఇప్పుడైతే మీకు అవకాశం లభించింది కదా. ఎలగైతే ఇప్పుడు మధువున నివాసీయులు మీకు అవకాశం ఇవ్వవలసి వచ్చింది కదా! (మధుబన్ నివాసీయులు మరియు ఆబూ నివాసీయులు పాండవభవనంలో మురళి వింటున్నారు) ఇది కూడా పరివారిక ప్రేమ. 

బ్రహ్మాబాబాతో ప్రేమ ఉంది అంటే బాబా సమానంగా అవ్వాలి. నిరాకారుని సమానంగా అవ్వటం అనేది కొంచెం సమయమే అనుభవం చేసుకుంటున్నారు. కానీ బ్రాహ్మణులు అంటే సదా బ్రహ్మాబాబా సమానంగా బ్రహ్మాచారి. బ్రహ్మాబాబా యొక్క ఆచరణయే సర్వ బ్రాహ్మణుల యొక్క ఆచరణ అంటే కర్మ, ఉచ్చారణ కూడా బ్రహ్మాబాబా సమానంగా ఉండాలి మరియు ఆచరణ కూడా బ్రహ్మాబాబా సమానంగా ఉండాలి. దీనినే తండ్రిని అనుసరించడం అంటారు. బ్రహ్మాబాబా యొక్క ప్రతి అడుగుపై అడుగు వేయటమే ఫాలోఫాదర్ అంటారు. అయితే బ్రహ్మాబాబా శివబాబా యొక్క శ్రీమతానుసారంగా మొదట ఏమి అడుగువేశారు? 

మొదటి అడుగు-ఆజ్ఞాకారిగా అయ్యారు. ఏ ఆజ్ఞ లబించిందో ఆ ఆజ్ఞను ప్రత్యక్ష స్వరూపంలోకి తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు పరిశీలన చేసుకోండి - ఆజ్ఞాకారి అనే మొదటి అడుగులో ఫాలో ఫాదర్ (తండ్రిని అనుసరించటం) చేశానా? అమృతవేళ నుండి రాత్రి వరకు మనసా, వాచా, కర్మణా, సంబంధ, సంపర్కాలలో ఏదైతే ఆజ్ఞ లభించిందో ఆ ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నానా లేదా కొన్నింటిని పాలన చేసి, కొన్నింటిని పాలన చేయడం లేదా? సంకల్పం కూడా ఆజ్ఞ ప్రకారం ఉన్నదా? లేక కల్తీ ఏదైనా ఉన్నదా? అని పరిశీలించుకోవాలి. ఏదైనా కల్తీ ఉంటే పూర్తి ఆజ్ఞాకారిగా అయినట్లా లేదా సగమే ఆజ్ఞాకారీలుగా అయినట్లా? ప్రతి సమయం ప్రతి సంకల్పం కొరకు ఆజ్ఞ స్పష్టంగా లభించింది. లభించింది కదా? అమృతవేళ ఏమి సంకల్పం చేయాలి? ఇది కూడా స్పష్టంగా ఉంది కదా? లేదా? అయితే దానిని అనుసరిస్తున్నారా? లేదా ఒక్కొక్కసారి పరంధామంలోకి ఒక్కొక్కసారి నిద్రాలోకంలోకి వెళ్ళిపోతున్నారా? ప్రతి కర్మలో, ప్రతి సమయం అడుగులో అడుగు వేస్తున్నారా? బాబా అడుగు ఒకటి, పిల్లల అడుగు మరొకటి అయితే వారిని ఆజ్ఞాకారి అని అనరు కదా! పరమార్థంలో అయినా, వ్యవహారంలో అయినా రెండింటిలో దేనికి ఏవిధంగా ఆజ్ఞ లభించిందో ఆ ఆజ్ఞను పాలన చేయాలి కనుక దీని యొక్క శాతాన్ని పరిశీలించుకోండి. పరిశీలించటం వస్తుందా? మొదటి అడుగు-ఆజ్ఞాకారిగా అయ్యారు. అందువలన ఆజ్ఞాకారికి సదా బాబా యొక్క ఆశీర్వాదాలు స్వతహాగానే లభిస్తాయి మరియు వెనువెంట బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. కనుక పరిశీలించుకోండి - స్వయం గురించి అయినా, సేవ గురించి అయినా, స్థూలకర్మ గురించి అయినా, ఇతరాత్మల గురించి అయినా ఏదైతే సంకల్పం చేసామో దానిలో అందరి ఆశీర్వాదాలు లభించాయా? ఎందుకంటే ఆజ్ఞాకారి అవ్వటం ద్వారా సర్వుల ఆశీర్వాదాలు లభిస్తాయి. మరియు ఆశీర్వాదాలు లభించిన దానికి గుర్తు - ఆశీర్వాదాల ప్రభావం ద్వారా వారి హృదయం సదా సంతుష్టంగా ఉంటుంది, మనస్సు సంతుష్టంగా ఉంటుంది.బయటికి సంతుష్టంగా ఉండటం కాదు, మనస్సు యొక్క సంతుష్టత ఉండాలి. ఆ మనస్సు యొక్క సంతుష్టత కూడా యదార్ధమైనదా లేక పైపై గొప్ప కోసమా? అనే దానికి గుర్తు ఏమిటంటే ఒకవేళ యదార్ధరీతిలో యదార్ధ ఆజ్ఞాకారిగా అయ్యి ఆశీర్వాదాలు పొందితే సదా స్వయం మరియు ఇతరులు కూడా డబల్ లైట్ గా ఉంటారు. ఒకవేళ డబల్ లైట్ గా లేరు అంటే మనస్సు యొక్క సంతుష్టత లేదా ఆశీర్వాదాలు పొందనట్లే. బాబా యొక్క ఆశీర్వాదాలు మరియు పరివారం యొక్క ఆశీర్వాదాలు పొందనట్లే. పరివారం యొక్క ఆశీర్వాదాలు కూడా అవసరం. మాకు బాబాతో సంబంధం ఉంది కనుక బాబా యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక పరివారం యొక్క ఆశీర్వాదాలు లేకపోయినా పర్వాలేదు అని అనుకోకండి. ఇంతకు ముందు కూడా వినిపించాను కదా, మీరు మాలలోని మణులేనా లేక కాదా! మాల అంటే కేవలం దంపత పూసతో మాల అయిపోతుందా! కనుక మాలలోకి రావాలి అందువలన పూర్తి లక్ష్యం పెట్టుకోండి - ప్రతి ఒక ఆత్మ నన్ను చూసి సంతోషంగా ఉండాలి, నన్ను చూసి తేలిక అవ్వాలి, భారం సమాప్తి అయిపోవాలి అని. మనస్సు యొక్క సంతుష్టత లేదా ఆజ్ఞాకారి యొక్క ఆశీర్వాదాలు స్వయాన్ని మరియు ఇతరులను కూడా తేలికగా చేస్తాయి. దీని ద్వారా ఎంతవరకు ఆజ్ఞాకారిగా అయ్యాము? అని అర్థంచేసుకోండి. ఎలా అయితే బ్రహ్మాబాబాని చూసి చిన్నవారు, పెద్దవారు కూడా సంతుష్టం అయ్యి సంతోషంతో నాట్యం చేసేవారు. నాట్యం చేసే సమయంలో తేలికగా ఉంటారు కదా! తేలికగా ఉంటేనే నాట్యం చేయగలరు. స్థూలంగా లావుగా ఉన్నా కానీ తేలికగా ఉంటే నాట్యం చేయగలరు. మాట ఎలా ఉండాలంటే దాని ద్వారా స్వయంతో స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులు కూడా సంతుష్ఠత అవ్వాలి. అలా ఉన్నారా? ఇది మా భావం కాదు, లేదా ఇది మా భావన కాదు అని అనకూడదు,కానీ ఆ భావం మరియు భావన ఎందుకు చేరుకోవటం లేదు? భావం మరియు భావన మంచిగా ఉంటే ఆ వైబ్రేషన్స్ (తరంగాలు) ఇతరులకు ఎందుకు చేరుకోవటం లేదు, కారణం ఏమిటి? ఏదోక కారణం ఉంటుంది కదా? అందువలన పరిశీలించుకోండి ఆశీర్వాదాలకు పాత్రునిగా ఎంత వరకు అయ్యాను? అని. ఎంతగా ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మల మరియు బాబా యొక్క ఆశీర్వాదాలకు పాత్రులు అవుతారో అంతగానే రాజ్యానికి కూడా పాత్రులుగా అవుతారు. ఒకవేళ ఇప్పుడు బ్రాహ్మణ పరివారాన్ని సంతుష్టం చేయలేకపోతే ఇక రాజ్యం ఏమి నడిపిస్తారు! ఏమి సంతుష్టం చేస్తారు! ఎందుకంటే బ్రాహ్మణాత్మలు మీ యొక్క ఉన్నత కుటుంబీకులుగా అవుతారు ఆ కుటుంబీకులనే సంతుష్టం చేయలేకపోతే ఇక ప్రజలను ఏమి సంతుష్టం చేస్తారు? చేయగలరా? ఆ సంస్కారాన్ని ఇక్కడే నింపుకోవాలి కదా! లేక అక్కడ యోగం చేసి నింపుకుంటారా? ఇక్కడే నింపుకోవాలి. ఒకవేళ వర్తమానంలో బ్రాహ్మణ పరివారంలో కారణాన్ని నివారణ చేయలేకపోతున్నారు, కారణాలే కారణాలు చెప్తున్నారు అంటే ఎక్కడ కారణాలు ఉంటాయో అంటే అక్కడ నివారణా శక్తి లేనట్లే. ఒకవేళ పరివారంలోనే నివారణ శక్తి లేదు అంటే విశ్వం యొక్క రాజ్యాన్ని ఏమి నివారణ చేస్తారు! ఎందుకంటే మీ రాజ్యంలో ప్రతీ ఆత్మ సదా నివారణాస్వరూపంగా ఉంటుంది. అక్కడ కారణాలు ఉంటాయా? ఎలా అయితే ఇక్కడ రాజ్యసభలో కారణాలు చెపుతూ ఉంటారు కదా, ఈ కారణం, ఈ కారణం, ఈ కారణం... అని. కానీ అక్కడ రాజ్యసభలో కూడా కారణాలు ఉంటాయా? అక్కడ కేవలం సంతోషం యొక్క యోగక్షేమాలు అడుగుతారు. కేవలం అది సభగా కాదు కానీ చాలా మంచి కలయికగా ఉంటుంది. అందువలన కారణాలు చెప్పి మిమ్మల్ని మీరు ఆశీర్వాదాల నుండి వంచితం చేసుకోకండి. బ్రహ్మాబాబా కారణాలను నివారణ చేసారు. అందువలనే నెంబర్ వన్ అయ్యారు. బాప్ దాదా దగ్గర అందరి కారణాల యొక్క ఫైల్స్ అన్నీ ఉన్నాయి. అందరి ఫైల్స్ ఉన్నాయి, కొంతమందివి పెద్దగా, కొంతమందివి చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ ఫైల్స్ పెట్టుకుంటూ, పెంచుకుంటూ ఉండాలా, లేక రిఫైన్ (పరిశుద్ధంగా) అవ్వాలా? అయితే ఈ రోజు నుండి అన్ని ఫైల్స్ ను సమాప్తి చేసేస్తారా? మరలా ఇక కొత్త ఫైల్ పెట్టవలసిన అవసరం లేదు, కొత్త ఫైల్ పెట్టారు. అంటే ఫైన్ (శిక్ష) పడుతుంది. ఆలోచించుకోండి, ఏమి ఆలోచించారు? సమాప్తి చేసేస్తారా? చెప్పండి. సమాప్తి చేసేస్తారా? లేక కొన్ని రోజులు ఉంచుకుంటారా? శివరాత్రి వరకు ఉంచుతారా? ఎవరైతే మాకు శివరాత్రి వరకు అవకాశం కావాలి, అప్పటికి పురుషార్ధం చేసి రిఫైన్ అయిపోతాం అనేవారు చేతులు ఎత్తండి! కొద్దిమంది ఎత్తుతున్నారు. ఇక మిగిలిన వాళ్ళు అందరు సమాప్తి చేసేస్తారు. చూసుకోండి మరలా ఏ కారణాలు చెప్పకూడదు. బావుంది, ధైర్యం పెట్టుకోవటం కూడా మంచి విషయం కానీ, కేవలం ఇప్పుడు ధైర్యం పెట్టుకోవటమే కాదు. బాప్ దాదా ఎదురుగా ఉన్నారు కనుక ధైర్యం ఉంది, క్రిందికి దిగేసరికి కొంచెం తగ్గిపోయింది, ఇంక ఎవరి దేశం వారు వెళ్ళేసరికి ఇంకా తగ్గిపోయింది ఇలా ఉండకూడదు. ఇలా చేయరు కదా? ఏదైనా విషయం వచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది ఇలా ఉండకూడదు. అలా చేయరు కదా! ఏదైనా కారణం ఎదురుగా వస్తే ఆ కారణం కారణంగా ధైర్యం తక్కువ అయిపోతుంది, బలహీనత వచ్చేస్తుంది, మరలా ఆ విషయం సమాప్తి అయిపోయినప్పుడు, మీ పై మీకు ఏమని అనిపిస్తుంది! సిగ్గు అనిపిస్తుంది కదా! మీ పై మీకే సంకోచం వస్తుంది. ఇది మంచిగా చేయలేదు, ఇది మంచిగా జరగలేదు అని. ఈ విధంగా అవుతుంది కదా! చేసిన తర్వాత పశ్చాత్తాపం పడటం అనేది మీ ప్రజల యొక్క పనా లేక మీ పనా? పశ్చాత్తాపం పడేవారు రాజుగా అవుతారా? కనుక సాక్షిస్థితి అనే సింహాసనంపై కూర్చోండి మరియు మీకు మీరే నిర్ణయం తీసుకోండి. మీకు మీరు న్యాయమూర్తిగా అవ్వాలి, కానీ ఇతరులకు కాదు, ఇతరులకు న్యాయమూర్తిగా అవ్వటం అందరికీ వస్తుంది. ఇతరులకు న్యాయమూర్తిగా చాలా తొందరగా అవుతున్నారు కానీ స్వయానికి న్యాయవాదిగా అవుతున్నారు. న్యాయవాదిగా అవుతున్నారు అని కూడా తెలుసు. సాక్షిస్థితి సింహాసనంపై కూర్చుంటే మీకు మీరు చాలా మంచి నిర్ణయం తీసుకుంటారు. సింహాసనం క్రింద ఉండి నిర్ణయిస్తున్నారు అందువలన మంచిగా ఉండటం లేదు. సెకనులో సింహాసనాధికారిగా అయిపోండి. ఈ స్థితి మీ సింహాసనం. సాక్షి స్థితి యొక్క సింహాసనమే యదార్థ సహజ నిర్ణయాన్ని ఇస్తుంది. సాక్షిగా ఉండటం లేదు, ఇతరుల విషయాలు, ఇతరుల నడవడిక ఎక్కువగా ఎదురుగా వస్తుంది, స్వయం గురించి రావడం లేదు. సాక్షిగా అయ్యి చూస్తే మీ విషయాలు దృష్టిలోకి వస్తాయి, ఇతరుల విషయాలు కూడా దృష్టిలోకి వస్తాయి. అప్పుడు నిర్ణయం యదార్ధంగా ఉంటుంది. లేకుంటే యదార్ధంగా ఉండదు. బాబా దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, డ్రామాలో ఏ విషయాలు అయితే వస్తున్నాయో ఆ విషయాలలో చాలా మంచి తెలివి ఉంటుంది కానీ అప్పుడప్పుడు బ్రాహ్మణ పిల్లలలో కొంచెం తెలివి తక్కువ అయిపోతుంది. ఏదైనా విషయం వస్తే ఆగిపోతున్నారా? లేక వెళ్ళిపోతున్నారా? బ్రాహ్మణులు ఏమి చేస్తున్నారు? విషయాన్ని పట్టుకుని కూర్చుంటున్నారు. ఆ విషయం ఆగటంలేదు, అది వెళ్ళిపోతుంది కానీ స్వయం విషయం వదలటం లేదు అంటే అప్పుడు ఆ విషయంలో తెలివి ఎక్కువగా ఉన్నట్లా? లేక బ్రాహ్మణులలో ఉన్నట్లా? ఆ విషయాలే తెలివిగా అయ్యాయి కదా? కొంతమంది పిల్లలు ఈ విషయం రెండు రోజుల నుండి ఉంటుంది లేదా రెండు గంటల నుండి ఉంటుంది అని కానీ రెండు గంటల్లో పోగొట్టుకున్నది ఎంత? రెండు రోజులలో పోగొట్టుకున్నది ఎంత? అందువలన తెలివైనవారిగా అవ్వండి. ఏమి విన్నారు! మొదటి అడుగు అజ్ఞాకారి, నేను ఎంత ఆజ్ఞాకారిగా ఉన్నాను అని చూసుకోండి. ఆజ్ఞాకారి గుర్తులు వినిపించాను కదా! ఈ గుర్తులు ఆధారంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇది కారణం , ఇది కారణం అనే దానిని సమాప్తం చేయండి. మొదటి అడుగు - ఆజ్ఞాకారి మరియు రెండవ అడుగు - సర్వస్వత్యాగి. మొదట ఆజ్ఞాకారిగా అయిన కారణంగా ఆశీర్వాదాలు లభించాయి, ఆ ఆశీర్వాదాల ఆధారంతో సర్వస్వత్యాగిగా అయ్యారు. బ్రహ్మాబాబా త్యాగంలో కూడా నెంబర్ వన్ ఉదాహరణగా అయ్యారు. దేహ సంబంధీకుల యొక్క త్యాగం అనేది గొప్ప విషయం కాదు. కానీ దేహం యొక్క పాత స్వభావ, సంస్కారాల యొక్క త్యాగం కూడా తప్పనిసరి. సంబంధీకుల యొక్క త్యాగం అయితే ఇతర ధర్మాల వారు కూడా చేస్తారు. కానీ స్వభావ సంస్కారాలను సర్వ వంశ సహితంగా త్యాగం చేయాలి, కేవలం త్యాగం కాదు సర్వవంశం, అంశం కూడా ఉండకూడదు. వారినే సర్వస్వత్యాగి అంటారు. ఒకవేళ అంశమాత్రంగా అయినా కానీ, దేహం యొక్క స్వభావ సంస్కారాలు ఉండిపోతే అది సమయానుసారంగా వంశంగా పెరిగిపోతుంది. ఆ వంశం చాలా తేజంగా ఉంటుంది. ఎలా అయితే లౌకిక పరివారంలో చూసారు కదా? పెద్దవాళ్ళు, వృద్ధులు చాలా శీతలంగా ఉంటారు, కానీ మనవలు చాలా తేజంగా ఉంటారు. ఒకవేళ ఏదైనా పాత వంశం ఉండిపోతే అది కూడా విరుద్ధమైన అద్భుతం చేసి చూపిస్తుంది. బాప్ దాదా చూస్తున్నారు,ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఎవరైనా దివాలా తీస్తే సెకనులో లక్షాధికారుల నుండి భిక్షాధికారులుగా అయిపోతారు కదా! అలాగే ఇక్కడ కూడా ఒక్క సెకనులో సర్వఖజానాలు సమాప్తి అయిపోతున్నాయి. తర్వాత శ్రమ చేయవలసి వస్తుంది కదా! అందువలన సర్వస్వత్యాగి అంటే దేహం యొక్క సంబంధీకులు, దేహం యొక్క పాత స్వభావ సంస్కారాలతో త్యాగిగా అవ్వాలి. ఎప్పుడైనా గానీ మీ స్థితిని పరిశీలించుకోండి. మోసపోతున్నారు అంటే ఏది మోసం చేస్తుంది? స్వభావ సంస్కారాలే కదా! ఈ స్వభావ సంస్కారాలే త్యాగం యొక్క భాగ్యాన్ని కూడా సమాప్తి చేసేస్తాయి. అందువలన బాప్ దాదా బ్రాహ్మణులకి ఇంకా అండర్లైన్ చేయిస్తున్నారు - త్యాగాన్ని కూడా త్యాగం చేయండి. నేను త్యాగిని అనే అభిమానాన్ని కూడా త్యాగం చేయండి. దీనినే త్యాగాన్ని కూడా త్యాగం చేయడం అంటారు. నేను చేసాను, సహించాను, ఇది చేసాను, అది చేసాను అని కథలు చెప్పకండి. ఒకవేళ ఎవరైనా సహించారు. అంటే సహనం అని అనిన తర్వాత ఏమంటారు! శక్తి అంటారు కదా! కనుక సహనం అంటే కేవలం సహించటం కాదు, సహించటం అంటే శక్తిని ధారణ చేయటం. అందువలన సహనశక్తి అంటారు. సహించటం అంటే శక్తి రూపం యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూపించడం. మంచిగానే జరిగింది కదా! ఏమి సహించారు. ఇంకా లాభం పొందారు కదా! మరియు ఎవరికోసం సహించారు? బాబా యొక్క ఆజ్ఞాకారిగా అయ్యేటందుకు సహించారు, ఇతరుల కోసం సహించలేదు. బాబా యొక్క ఆజ్ఞను పాటించారు, అప్పుడు ఆశీర్వాదాలు లభిస్తాయి కదా! అందువలన ఏమి సహించారు? ఆశీర్వాదాలు తీసుకున్నారు కదా! విషయాన్ని ఎదురుగా ఉంచుకుని ఆలోచిస్తున్నారు, చాలా చాలా సహించాము, ఎంతవరకు సహిస్తాము, సహించటానికి కూడా ఏదైనా హద్దు ఉండాలి కానీ ఎంత బేహద్ గా సహిస్తారో అంతగా బేహద్ ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎందుకంటే బాబా యొక్క ఆజ్ఞాకారిగా అవుతున్నారు. బాబా చెప్పారు సహంచండి అని. ఇంకెవరైనా చెప్పారా? అయితే ఆజ్ఞను పాటించడం సంతోషకరమైన విషయమా? లేక కష్టమైన విషయమా? కష్టంతో సహించకండి. కొంతమంది సహిస్తున్నాం అంటున్నారు. సహిస్తున్నారు కూడా. మరలా నేను సహించినంతగా ఇంకెవరు సహించరు అంటున్నారు. మరలా దాదీల దగ్గరకు వచ్చి చెప్తున్నారు, మేము ఎంతగా సహించాము మీకు తెలియదు అని. కానీ సహించటం వలన నష్టం ఏముంది, లాభమే పొందారు కదా! త్యాగం యొక్క పరిభాష అర్ధమైందా? భక్తి మార్గంలో కూడా బలి ఇచ్చేటప్పుడు బలి ఇచ్చే మేక అరిస్తే అది ప్రసాదంగా భావించరు. అరవకుండా ఒక దెబ్బతో స్వాహా అయిపోతే అది ప్రసాదంగా భావిస్తారు. బలి ఇచ్చే మేక కూడా అరవకూడదు అని చెప్తారు. అలాగే మీరు కూడా సహించాం, సహించాం అని అంటున్నారు. అది ఏమి అయినట్లు, అరిచినట్లు కదా? మనస్సు ద్వారా అయినా, నోటి ద్వారా అయినా కొంచెంగా అయినా అరుస్తున్నారు అంటే అది ప్రసాదం అవ్వదు. అది స్వీకరించరు కదా! అలాగే ఇక్కడ బాబా కూడా స్వీకరించరు. బాబా స్వీకరించకపోతే ఆశీర్వాదాలు ఎలా ఇస్తారు? ఇప్పుడు ఏమి చేస్తారు, కొద్ది కొద్దిగా బయటికి కాకుండా లోపల అరుస్తారా? అలా అరుస్తారా? ఎదురుగా టీచర్స్ ఉన్నారు, ఏ మూల అయినా కొంచెం ఒకటి, రెండు కన్నీళ్ళు ఉన్నాయా? బాత్ రూమ్ లో కొన్ని కన్నీళ్ళు దాచుకున్నారా? లేదు కదా! మాతలు పిల్లలు విసిగిస్తే ఏం చేస్తారు? కొద్దిగా మనస్సులో ఏడుస్తారా? మాతలు మనస్సులో ఏడుస్తున్నారా? కొద్ది కొద్దిగా ఏడుస్తున్నారా? అన్నయ్యలు ఏం చేస్తున్నారు? అన్నయ్యలు కళ్ళతో ఏడవటం లేదు. కానీ క్రోధంతో లోపల ఏడుస్తున్నారు. ఆవేశం రావటం కూడా ఏడవటమే. పాండవసేన ఏమని భావిస్తున్నారు? ఏడవడానికి కొద్దిగా అవకాశం కావాలా? ఎవరికైతే కొద్దిగా అవకాశం కావాలో వారు చేతులెత్తండి! అవసరం లేదా? అయితే ఈ రోజు నుండి ఏడిచేటువంటి ఫైల్ కూడా సమాప్తి అయిపోయింది కదా లేదా చప్పట్లు కొట్టి సంతోషం చేసేస్తున్నారా? ఈరోజు నుండి పోస్ట్ కూడా తక్కువ అయిపోయింది. ఈ పోస్టు చేసే వ్యర్ధఖర్చు కూడా జ్ఞానసరోవరం కోసం జమ అవుతుంది. ఇలాంటి విషయాలు ఏవైనా వచ్చినప్పుడు ఆ పోస్టు అయ్యే ఖర్చులు బండారీలో వేసేయండి. జ్ఞాన సరోవరం కోసం ఇప్పుడు కూడా ధనం వినియోగించాలి కదా! 

జ్ఞాన సరోవరంతో అందరికీ చాలా బాగా ప్రేమ ఉంది. జ్ఞాన సరోవరంతో ప్రేమ అంటే సేవతో ప్రేమ, స్థానంతో ప్రేమ కాదు, కానీ సేవకు నిమిత్తమైన స్థానం కనుక సేవతో ప్రేమ ఉన్నట్లు. ఇక్కడ కూర్చున్న వారిలో జ్ఞానసరోవరం కోసం నయా పైసా కూడా వేయనివారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఎవరు లేరు. ఎవరైతే వేసారో వారు చేతులు ఎత్తండి! అందరు వేసారు. మధువనం నివాసీయులు వేసారా? బండారీ నుండి తీసి వేసారా? హాస్పటల్ వారు వేసారా? చేతులు ఎత్తండి, క్రింద కూర్చున్న వారు కూడా వేసారు, సేవాధారులు కూడా వేసారు. వారు కూడా క్రిందే కూర్చున్నారు. అందరి సహయోగంతో ఎంత మంచి సేవా స్థానం తయారయ్యిందో చూడండి. అందరికి బావుందా? అందరూ చూసారా కదా? ఇష్టమనిపించిందా? ఇక్కడ ఉండటానికి అయితే కొంచెం కష్టపడాల్సి వచ్చింది అది కూడా సరి అయిపోతుంది. మరలా వచ్చేసరికి మజాగా ఉంటారు, ఇప్పుడయితే అప్పుడప్పుడు వేడినీళ్ళు లేవు, అప్పుడప్పుడు చన్నీళ్ళు లేవు క్రొత్త ఇంట్లో ఉన్నారు. అందరికి సంతోషమే కదా! జ్ఞాన సరోవరంలో ఉండేవారు అందరు సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారో చేతులు ఎత్తండి. పాండవులు ఎక్కువ మంది ఉన్నారు. శక్తులు కూడా ఉన్నారు. చెప్పాను కదా! ఏది ఏమైనా కానీ ఇప్పుడు మీరు చాలా చాలా చాలా భాగ్యవంతులు, భక్తి మార్గంలో మేళాలో అయితే మట్టిపై పడుకుంటారు. మీకైతే ఇక్కడ పరుపు, రజాయి లభించింది కదా! అయినా కానీ చలి చాలా ఎక్కువగా ఉన్నది కదా! ముడుచుకుని పడుకోకూడదు. కలిసి పడుకుంటే ఇంకా వేడి వస్తుంది. బాబా అంతా తిరిగారు. మంచిగా అనిపించింది, అందరు మంచిగా పడుకున్నారు. క్రొత్త పడకలు, క్రొత్త ఇల్లు, అయినా కానీ చూడండి. ఇంతమందికి వచ్చేటువంటి అవకాశం లభించింది కదా. మంచిది, దాదీలకు జ్ఞాన సరోవరం ఇష్టమే కదా! 

జ్ఞాన సరోవరంలో రెండు లక్ష్యాలు ఉన్నాయి 1. విశేష సేవ, 2.బ్రాహ్మణుల యొక్క సౌకర్యార్ధం ఈ రెండు లక్ష్యాలతో ఈవిధంగా తయారుచేయబడింది. పాండవ భవనంలోకి అయితే బ్రాహ్మణాత్మలని తప్ప మరెవ్వరినీ రానివ్వరు కదా! కానీ అక్కడ అనేకమంది సంపర్కంలోని వారు సమీప సంబంధంలోకి వస్తారు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని ఏదైతే పేరు ఉందో ఆ విద్యాలయం యొక్క పేరుని కూడా ప్రత్యక్షం చేస్తారు. అంటే డబల్ సేవ కదా? పాండవభవనం బ్రాహ్మణుల కోసం తయారు చేశారు కానీ జ్ఞానసరోవరం విశ్వంలోని సర్వాత్మల కోసం తయారుచేసారు. అందువలన తేడా ఉంది కదా! లక్ష్యంలో కూడా తేడా ఉంది కదా! మంచిది. 

ఇక మిగిలిన అడుగుల గురించి తర్వాత చెప్తాను. కానీ ఈ రెండు అడుగులని మంచిగా పరిశీలించుకోవాలి మరియు మొత్తం ఫైల్స్ అన్నీ సమాప్తి చేయాలి. మర్చిపోకూడదు. ఏ ఫైల్స్? కారణాల యొక్క ఫైల్ మరియు ఏడుపు యొక్క ఫైల్. ఆవేశంలోకి రావటం కూడా ఏడవటమే. ఆవేశంలోకి రావటమనేది మనస్సు యొక్క ఏడుపు. మేము ఎక్కువ ఏడవలేదు కదా అని అనుకుంటారు కానీ మనస్సుతో చాలా ఏడ్చారు. అయితే ఈ రెండు ఫైల్స్ సమాప్తి చేయాలి. సమాప్తి అయిపోయాయా? డబల్ విదేశీయులు చెప్పండి సమాప్తియేనా? మీపై మీరు ఫైన్ (శిక్ష) వేసుకోకూడదు. రిఫైన్ గా అవ్వాలి. 

బ్రహ్మాబాబా తన యొక్క ఆది సహయోగులను చూసి సంతోషిస్తున్నారు. సహయోగులే కదా? టీచర్స్ అందరు సహయోగులే కదా? పాండవులు కూడా ఆది సహయోగులు మరియు శక్తులు కూడా సహయోగులు. కుడిభుజం వంటివారు అందువలనే బ్రహ్మాబాబాకి చాలా భుజాలను చూపించారు. భుజాలు అంటే సహయోగులు, తోడుగా ఉండేవారు. అందరు కుడిభుజాలే కదా? ఎడమ భుజాలు కాదు కదా? ఇక్కడ ఎడమ కూడా కుడిగా అయిపోతుంది. ఎడమభుజాలను కూడా ఎడమ అని అనరు అందరు సహయోగులే. నలువైపుల నుండి వచ్చారు. పేర్లు అయితే చాలా ఉంటాయి. అందువలన డబల్ అవకాశం లభించింది. ఈ గ్రూప్ కి డబల్ ఛాన్స్ లభించింది 
కదా! 

ఒకటి భారతదేశం యొక్క సేవకు నిమిత్తమైన అన్ని జోన్స్ వారు వచ్చారు. భారతదేశం యొక్క సేవాధారి పిల్లలకు బాప్ దాదా సేవ యొక్క శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు మరియు సదా సుపుత్రులైన వారికి, రుజువు చూపించే పిల్లలకు విశేషంగా దివ్యగుణాల యొక్క నగల సెట్ బహుమతిగా ఇస్తున్నారు. సుపుత్రుల యొక్క గుర్తు , రుజువు చూపించాలి మరియు ప్రతక్షరుజువు చూపించాలి. సుపుత్రులైన వారు తమ రుజువు సేవ యొక్క ఫలం ప్రమాణంగా చూపిస్తున్నారు మరియు ఇక ముందు కూడా చూపిస్తూ ఉంటారు. అందువలన సుపుత్రులైన పిల్లలకు బాప్ దాదా, తల్లి సదా గొప్పగా సింగారిస్తున్నారు, అలంకరిస్తున్నారు. మంచి పిల్లలకు సదా గొప్ప వస్తువులను ఇస్తారు. ఇక్కడైతే అందరు ఒకరి కంటే ఒకరు గొప్పవారు. అందువలన బాప్ దాదా ఈ విధమైన సుపుత్రులకు మరియు రుజువు చూపించేవారికి విశేషంగా దివ్యగుణాల నగల సెట్ ను బహుమతిగా ఇస్తున్నారు. ఈ బహుమతిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. చెవులకు కూడా పెట్టుకోవాలి మరియు మస్తకంలో కూడా పెట్టుకోవాలి, తలపై కిరీటం కూడా పెట్టుకోవాలి, తీయకూడదు, మాయ దొంగలించకూడదు. వీరికి బహుమతి లభిస్తుంది అని మాయకు కూడా తెలుస్తుంది. కనుక డబల్ తాళం వేసారా? స్మృతి మరియు సేవ రెండింటి సమానతలో సదా ఉండాలి మరియు డబల్ తాళం వేయాలి. అందరి దగ్గర డబల్ తాళం ఉందా లేదా ఒక తాళం మంచిగా, ఒక తాళం బలహీనంగా ఉందా? తాళం పోలేదు కదా అని చూసుకోవాలి. మీరు తాళం చాలా జాగ్రత్తగా ఉంది అని అనుకుంటున్నారు కానీ అవసరానికి కనిపించటం లేదు, ఇలా లేదు కదా? మంచిది. 

నలువైపుల ఉన్న బాప్ దాదా యొక్క స్నేహాన్ని ప్రత్యక్షం చేసే వారికి, ఫాలో ఫాదర్ చేసే శ్రేష్టాత్మలకు, సదా బాప్ దాదా యొక్క అడుగుపై అడుగు వేసే ఆజ్ఞాకారి శ్రేష్టాత్మలకు, సదా ధృడ సంకల్పం ద్వారా బ్రహ్మాబాబా సమానంగా సర్వస్వత్యాగి విశేషాత్మలకు, సదా సుపుత్రులుగా అయ్యి ఋజువు చూపించే సుపుత్రులైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments