18-01-2006 అవ్యక్త మురళి

 18-01-2006         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంకల్పం, సమయం మరియు మాట యొక్క పొదుపు స్కీమ్ ద్వారా సఫలతా మహోత్సవాన్ని జరుపుకోండి, నిరాశా ఆత్మలలో ఆశాదీపాన్ని వెలిగించండి.

ఈరోజు స్నేహం యొక్క రోజు. నలువైపుల ఉన్న పిల్లలందరు స్నేహసాగరంలో లీనమై ఉన్నారు. ఈ స్నేహం సహజయోగిగా తయారుచేసేది. స్నేహం సర్వ అన్య ఆకర్షణల నుండి అతీతంగా చేసేది. స్నేహం, పిల్లలైన మీ అందరికీ జన్మతోనే లభించిన వరదానం. స్నేహానికి పరివర్తన చేసే శక్తి ఉంది. ఈరోజు నలువైపుల రెండు రకాలైన పిల్లలను చూసారు. అందరు ప్రియమైన పిల్లలే. ఒకరు ప్రియమైనవారు, రెండవవారు లవలీన పిల్లలు. లవలీన పిల్లలు ప్రతి సంకల్పం, ప్రతి శ్వాస, ప్రతి మాట, ప్రతి కర్మలో స్వతహాగానే బాబా సమానంగా సహజంగా ఉంటారు. ఎందువలన? పిల్లలకు బాబా సమర్ధభవ! అనే వరదానాన్ని ఇచ్చారు. ఈ రోజు స్మృతిరోజు నుండి సమర్థరోజు ఎందువలన? బాబా ఈ రోజు స్వయం వెన్నెముక అయి లవలీన పిల్లలను విశ్వవేదికపై ప్రత్యక్షం చేసారు. వ్యక్తంలో పిల్లలను ప్రత్యక్షం చేసారు మరియు స్వయం అవ్యక్త రూపంలో సాథి అయ్యారు.  

ఈరోజు స్మృతిరోజు సమర్థరోజు. పిల్లలను బాలకుల నుండి మాలికులుగా తయారుచేసి, మాస్టర్ సర్వశక్తివంతులై సర్వశక్తివంతుడైన బాబాని ప్రత్యక్షం చేసే కార్యాన్ని ఇచ్చిన రోజు. యథా యోగము తథాశక్తితో పిల్లలు బాబాని ప్రత్యక్షం చేయటంలో అనగా విశ్వకళ్యాణం చేసి విశ్వపరివర్తన చేసే కార్యంలో నిమగ్నం అవ్వటం చూసి బాబా సంతోషిస్తున్నారు. బాబా ద్వారా లభించిన సర్వశక్తుల యొక్క వారసత్వాన్ని స్వయం పట్ల మరియు విశ్వాత్మల పట్ల కార్యంలో ఉపయోగిస్తున్నారు. బాప్ దాదా కూడా ఇటువంటి మాస్టర్ సర్వశక్తివంతులకి, బాబా సమానంగా ఉత్సాహ, ఉల్లాసాలలో ఉండే ఆల్ రౌండ్ సేవాధారి, నిస్వార్థ సేవాధారి, బేహద్ సేవాధారి పిల్లలకు కోటానుకోట్ల శుభాకాంక్షలు మనస్సుతో ఇస్తున్నారు, శుభాకాంక్షలు మరియు శుభాకాంక్షలు. భారతవాసీ పిల్లలు తక్కువ కాదు, విదేశీ పిల్లలు తక్కువ కాదు. బాప్ దాదా ఇటువంటి పిల్లల యొక్క మహిమ మనస్సులో లోలోపలే పాడుకుంటూ ఉంటారు. ఓహో పిల్లలు ఓహో! మీరందరు కూడా ఓహో పిల్లలే కదా! చేతులు ఊపుతున్నారు. చాలా మంచిది. పిల్లల గురించి బాప్ దాదాకి గర్వంగా ఉంది. తన యొక్క ప్రతీ పిల్లవాడు స్వరాజ్యాధికారి రాజుగా ఉండే తండ్రి మొత్తం కల్పంలో ఎవరు ఉండరు, మీరందరు కూడా స్వరాజ్యాధికారి రాజులు కదా! ప్రజలు కాదు కదా! కొంతమంది పిల్లలు ఆత్మికసంభాషణ చేస్తూ చెప్తున్నారు - భవిష్యత్తులో మేము ఎలా అవుతామో ఆ చిత్రం మాకు చూపించండి అని. బాప్ దాదా ఏమంటారు? పాత పిల్లలు చెప్తారు - జగదాంబ ప్రతి ఒక్కరికీ చిత్రాలు ఇచ్చేవారు అని. కనుక మాకు కూడా చిత్రం ఇవ్వండి అని అడుగుతున్నారు. బాప్ దాదా ఏమంటారు? బాబా ప్రతి ఒక బిడ్డకి విచిత్ర దర్పణాన్ని ఇచ్చారు. ఆ దర్పణంలో నేనెవరు? అని మీ భవిష్య చిత్రాన్ని మీరు చూసుకోవచ్చు. ఆ దర్పణం ఏమిటో తెలుసా? మీ దగ్గర ఉందా? దర్పణం ఏమిటో తెలుసా? మొదటి వరసలోని వారికి తెలిసే ఉంటుంది. తెలుసా? ఆ దర్పణం ఏమిటంటే - వర్తమాన సమయం యొక్క స్వరాజ్య స్థితి. వర్తమాన సమయంలో ఎంత స్వరాజ్యాధికారిగా అవుతారో దాని అనుసారంగానే విశ్వరాజ్యాధికారి అవుతారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు దర్పణంలో చూసుకోండి - సదా స్వరాజ్యాధికారినేనా? లేక ఒక్కొక్కసారి ఆధీనులు, ఒక్కొక్కసారి అధికారులా? ఒక్కొక్కసారి ఆధీనులు, ఒక్కొక్కసారి అధికారులు అయితే అప్పుడప్పుడు కళ్ళు మోసం చేస్తున్నాయి, అప్పుడప్పుడు మనస్సు మోసం చేస్తుంది, అప్పుడప్పుడు నోరు మోసం చేస్తుంది, అప్పుడప్పుడు చెవులు మోసం చేస్తున్నాయి అంటే వ్యర్థ విషయాలు వినే అభిరుచి ఉంటుంది. ఇలా ఏ కర్మేంద్రియం అయినా మోసం చేస్తుంది అంటే పరవశం చేస్తుంది అంటే బాబా ద్వారా వరదానంగా మరియు వారసత్వంగా లభించిన సర్వశక్తులు అనగా కంట్రోలింగు పవర్, రూలింగ్ పవర్ లేదు అని అర్ధం. కనుక ఆలోచించండి స్వయం పైనే అధికారం పొందని వారు విశ్వంపై అధికారం ఎలా చేస్తారు? కనుక మీ వర్తమాన స్వరాజ్యాధికారి అనే దర్పణంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దర్పణమైతే అందరికీ లభించింది కదా? దర్పణం లభిస్తే చేతులెత్తండి? దర్పణంపై ఏ మచ్చ పడలేదు కదా? దర్పణం స్పష్టంగా ఉందా? 

బాప్ దాదా ప్రతి ఒక్కరికీ స్వరాజ్యాధికారి అనే స్వమానాన్ని ఇచ్చారు. మాస్టర్ సర్వశక్తివాన్ అనే టైటిల్ పిల్లలందరికీ బాబా ద్వారా లభించింది. మాస్టర్ సర్వశక్తివంతులు కాదు, సర్వశక్తివంతులు. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో ఇది కూడా చెప్తున్నారు - బాబా మీరైతే సర్వశక్తులు ఇచ్చారు కానీ అప్పుడప్పుడు ఈ శక్తులు సమయానుసారంగా పని చేయటం లేదు. రిపోర్ట్ చేస్తున్నారు - సమయానికి శక్తులు ప్రత్యక్షం అవ్వటం లేదు, సమయం అయిపోయిన తర్వాత వస్తున్నాయి అని. దీనికి కారణం ఏమిటి? ఏ సమయంలో ఏ శక్తిని ఆహ్వానం చేస్తున్నారో ఆ సమయంలో నేను యజమాని ఆసనంపై ఆసీనమై ఉన్నానా? అని పరిశీలించుకోండి. ఆసనంపై ఆసీనం కాకుండా ఇచ్చిన ఆజ్ఞను శక్తులు పాటించవు. నేను స్వరాజ్యాధికారిని, మాస్టర్ సర్వశక్తివాన్ని. బాబా ద్వారా లభించిన వారసత్వానికి, వరదానానికి అధికారిని అనే ఆసనంపై ఆసీనమై ఆజ్ఞ ఇవ్వండి. ఏమి చేయను, ఎలా చేయను, అవ్వటం లేదు అనకండి. ఆసనం నుండి దిగిపోయి, క్రింద ఉండి ఆజ్ఞాపిస్తే ఆజ్ఞను ఎలా పాటిస్తాయి? ఈరోజుల్లో ప్రపంచంలో కూడా ప్రధానమంత్రి తన ఆసనం నుండి దిగిపోయి ఆజ్ఞాపిస్తే ఎవరైనా అంగీకరిస్తారా? కనుక ఆసనంపై ఆసీనమై ఉన్నానా? అధికారి అయ్యి ఆజ్ఞాపిస్తున్నానా? అని పరిశీలించుకోండి. బాబా ప్రతి ఒక్కరికీ అధికారాన్ని ఇచ్చారు. ఇది పరమాత్మ యొక్క అధికారం. ఏ ఆత్మ యొక్క అధికారం కాదు. మహాత్మ యొక్క అధికారం కాదు, పరమాత్మ అధికారం. ఆ అధికారి స్థితిలో స్థితులై ఏ శక్తిని ఆజ్ఞాపించినా ఆ శక్తి చిత్తం ప్రభూ! చిత్తం ప్రభూ! అంటుంది. సర్వశక్తుల ముందు మాయ, ప్రకృతి, సంస్కారము, స్వభావము అన్నీ దాసి అయిపోతాయి. ఏదైనా ఆజ్ఞాపించండి అని యజమాని కొరకు ఎదురుచూస్తాయి. ఈరోజు సమర్ధరోజు కదా! కనుక బాప్ దాదా పిల్లలలో ఏయే సమర్థతలు ఉన్నాయి అని రివైజ్ చేయిస్తున్నారు, అండర్‌లైన్ చేయిస్తున్నారు. సమయానికి శక్తిహీనంగా ఎందుకు అయిపోతున్నారు? బాప్ దాదా చూసారు - ఎక్కువమంది పిల్లలకు లీకేజ్ ఉంది. లీకేజ్ కారణంగా శక్తుల తక్కువ అయిపోతున్నాయి. విశేషంగా రెండు విషయాల యొక్క లీకేజ్ ఉంది. ఆ రెండు విషయాలు ఏమిటంటే - సంకల్పం మరియు సమయం వ్యర్థంగా వెళ్తున్నాయి. చెడు వెళ్ళటంలేదు కానీ వ్యర్థంగా వెళ్తున్నాయి, చెడు పనులు చేయటం లేదు కానీ జమ కూడా చేసుకోవటంలేదు. కేవలం ఈరోజు చెడు జరగలేదు కదా అని చూసుకుంటున్నారు కానీ మంచి ఏమి జమ చేసుకున్నారు? పోగొట్టుకోలేదు కానీ ఏమి సంపాదించుకున్నారు? దు:ఖం ఇవ్వలేదు కానీ సుఖం ఎంతమందికి ఇచ్చారు? ఎవరినీ అశాంతి చేయలేదు కానీ శాంతి తరంగాలను ఎంత వరకు వ్యాపింపచేసారు? శాంతిదూతలై వాయమండలం ద్వారా, నోటి మాట ద్వారా, తరంగాల ద్వారా శాంతి ఎందరికి ఇచ్చారు? ఎందుకంటే మీకు తెలుసు - పురుషోత్తమ కళ్యాణకారి సమయం ఈ కొద్ది సమయమే. ఈ కొద్ది సమయమే జమ చేసుకునే సమయం. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. ప్రతి ఘడియ ఇది జ్ఞాపకం ఉంచుకోండి. అయిపోతుంది, చేసేస్తాము .... అనకండి. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. బ్రహ్మాబాబా యొక్క పురుషార్థం ఇంత తీవ్రగతిలో ఉండేది అందువలనే నెంబర్ వన్ అయ్యి గమ్యాన్ని చేరుకున్నారు. 

కనుక బాబా ఏవైతే సమర్థతలు ఇచ్చారో అవి ఈ సమర్ధరోజున జ్ఞాపకం వచ్చాయి కదా! పొదుపు స్కీమ్ తయారు చేసుకోండి. సంకల్పం యొక్క పొదుపు, సమయం యొక్క పొదుపు, మాట యొక్క పొదుపు అంటే యదార్ధం కాని అయదార్ధము, వ్యర్థ మాటల యొక్క పొదుపు చేయండి. బాప్ దాదా పిల్లలందరిని సదా అధికారం యొక్క ఆసనంపై ఆసీనులై ఉన్న స్వరాజ్యాధికారి రాజా రూపంలో చూడాలనుకుంటారు. ఇష్టమేనా? ఈ రూపం ఇష్టమే కదా? ఎప్పుడైనా బాబా ఏ బిడ్డను టి.విలో చూసినా ఇదే రూపంలో చూడాలనుకుంటున్నారు. బాప్ దాదా దగ్గర సహజ సిద్ధమైన టి.వి ఉంది, స్విచ్ వేయవలసిన అవసరం ఉండదు. ఒకే సమయంలో నలువైపులా చూడగలరు. ప్రతి ఒక్క బిడ్డను చూడగలరు, మూలమూలల్లోని వారిని కూడా చూడగలరు. అలా కనిపిస్తారా? రేపటి నుండి టి.విలో ఎలా కనిపిస్తారు? ఫరిస్తా దుస్తులలో కనిపిస్తారా? ఫరిస్తా దుస్తులు మెరిసే దస్తులు. మెరిసే ప్రకాశ దుస్తులు. దేహాభిమానం యొక్క మురికి దుస్తులు ధరించటం కాదు, మెరిసే దుస్తులు ధరించాలి. సఫలతా సితారలుగా బాప్ దాదా ప్రతి ఒక్కరిని చూడాలనుకుంటున్నారు. ఇష్టమేనా? మురికి దుస్తులు ధరిస్తే మట్టితో మురికిగా అయిపోతారు. శివబాబా అశరీరీ మరియు బ్రహ్మాబాబా మెరిసే వస్త్రధారి అనగా ఫరిస్తా, ఫాలో ఫాదర్. స్థూలంగా కూడా మీ దుస్తులకి మట్టి అయిపోయి, మచ్చ పడితే ఏం చేస్తారు? దుస్తులు మార్చేసుకుంటారు కదా? అదేవిధంగా పరిశీలించుకోండి - సదా మెరిసే ఫరిస్తా దుస్తులను ధరించి ఉన్నానా? బాబాకి గర్వంగా ఉంది నా ప్రతి బిడ్డ రాజా బిడ్డ అని ఆ స్వరూపంలో ఉండండి. రాజుగా ఉండండి. అప్పుడు మాయ మీకు దాసీ అయిపోతుంది, మీ నుండి వీడ్కోలు తీసుకునేటందుకు వస్తుంది. అర్ధకల్పం వరకు వీడ్కోలు తీసుకునేటందుకు వస్తుంది, యుద్ధం చేయదు. బాప్ దాదాసదా చెప్తారు - బాబాకి బలిహారం అయ్యేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఓడిపోతున్నారు అంటే బలిహారం కానట్లే. ఇప్పుడు మీ అందరికీ మీటింగ్ జరుగుతుంది కదా! మీటింగ్ తారీఖు నిర్ణయించుకుంటారు కదా! కానీ ఈసారి కేవలం సేవా ప్లాన్స్ తయారుచేసుకునే మీటింగ్ బాప్ దాదా చూడాలనుకోవటం లేదు, సేవా ప్లాన్స్ తయారు చేస్కోండి కానీ మీటింగ్ లో సఫలతా మహోత్సవానికి ప్లాన్ తయారుచేస్కోండి. చాలా మహోత్సవాలు చేశారు. ఇప్పుడు సఫలతా మహోత్సవానికి తారీఖు నిర్ణయించుకోండి. ఎలా జరగుతుందో అని అందరూ ఆలోచిస్తున్నారు. బాప్ దాదా చెప్తున్నారు - తక్కువలో తక్కువ 108 రత్నాలు సఫలతా మహోత్సవాన్ని జరుపుకోవాలి. ఉదాహరణగా అవ్వాలి. ఇది జరగుతుందా? చెప్పండి. మొదటి వరుసలోని వారు చెప్పండి, జరుగుతుందా? జవాబు చెప్పే ధైర్యం లేదు. చేస్తామో, లేదో అని ఆలోచిస్తున్నారు. ధైర్యతతో అన్నీ జరుగుతాయి. దాదీ చెప్పండి. 108 సఫలతామూర్తులు తయారు కాగలరా? (తప్పక కాగలరు, సఫలతామహోత్సవం జరుగుతుంది) చూడండి, దాదీకి ధైర్యం ఉంది. మీ అందరి వైపు నుండి ధైర్యం పెట్టుకుంటున్నారు. కనుక మీరు సహయోగి అవ్వాలి. మీటింగ్ జరుగుతుంది కదా! దానిలో బాప్ దాదా రిపోర్ట్ తీసుకుంటారు. పాండవులు చెప్పండి, మౌనంగా ఉన్నారెందుకు? ఎందుకు మౌనం? ధైర్యం ఎందుకు పెట్టుకోవటం లేదు? చేసి చూపిస్తారా? సరేనా? మంచిది, ధైర్యం అయితే పెట్టుకోగలరా? ధైర్యం పెట్టుకుని మేము చేసి చూపిస్తాం అనేవారు చేతులెత్తండి. చేస్తారా? ఏ సంస్కారం మిగిలి ఉండదా? ఏ బలహీనత మిగలదా? మంచిది. మధువనం వారు కూడా చేతులెత్తుతున్నారు. ఓహో. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మంచిది, 108 మంది సహజంగా అయిపోతారు. ఇంతమంది చేతులెత్తారంటే 108 మంది తయారవ్వటం పెద్ద విషయం కాదు. డబల్ విదేశీయులు ఏమి చేస్తారు? జానకీ దాదీ వింటున్నారు, నేను చెప్పాలి అని దాదీకి ఉల్లాసం వస్తుంది. విదేశాల మాల కూడా చూస్తారు. సరేనా? చేతులెత్తండి, సరేనా? ఈ రోజు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు (200 మంది) వీరిలో 108 మంది తయారైపోతారు. సరేనా? ఈ విషయంలో మొదట నేను చేయాలి అనుకోవాలి. ఈ విషయంలో ఇతరులను చూడకూడదు, మొదట నేను అనుకోవాలి. ఇతర విషయాలలో నేను, నేను అనకూడదు, ఈ విషయంలో నేను తప్పక చేయాలి అనుకోవాలి. బాప్ దాదా మరింత పని ఇస్తారు. 

ఈరోజు సమర్థరోజు కదా! కనుక సమర్ధులేనా? బాప్ దాదా విచిత్ర దీపావళి జరుపుకోవాలని కోరుకుంటున్నారు. మీరయితే దీపావళి చాలాసార్లు జరుపుకున్నారు. కానీ బాప్ దాదా విచిత్ర దీపావళి జరుపుకోవాలని అనుకుంటున్నారు. చెప్పనా? చెప్పనా? చెప్పమంటారా? మంచిది. వర్తమాన సమయాన్ని అయితే చూస్తున్నారు కదా, రోజు రోజుకి మనుష్యాత్మలలో నిరాశ చాలా పెరిగిపోతుంది. మనసా సేవ చేయండి లేదా వాచా సేవ చేయండి లేదా సంబంధ సంపర్కాల ద్వారా సేవ చేయండి ఎలా చేసినా కానీ నిరాశతో ఉన్న మనుష్యాత్మలలో ఆశా దీపం వెలగాలని బాప్ దాదా కోరుకుంటున్నారు. నలువైపుల ఉన్న మనుష్యాత్మల మనస్సులో ఆశాదీపం వెలగాలి. ఆశాదీపాలు వెలిగించే దీపావళి బాప్ దాదా కోరుకుంటున్నారు. జరుగుతుందా? తక్కువలో తక్కువ వాయుమండలంలో అయినా ఈ ఆశాదీపాలు వెలిగితే విశ్వపరివర్తన అయినట్లే. స్వర్ణిమ ఉదయం వచ్చినట్లే. నిరాశ సమాప్తి అవ్వాలి, ఆశాదీపం వెలగాలి. చేయగలరు కదా! ఇది అయితే సహజమే కదా లేక కష్టమా? సహజమేనా? చేస్తాం అనేవారు చేతులెత్తండి. ఇంతమంది దీపాలు వెలిగిస్తే దీపమాల అయిపోతుంది. మీ తరంగాలను ఎంత శక్తివంతంగా చేసుకోవాలంటే వారి ఎదురుగా వెళ్ళలేకపోయినా కానీ లైట్ హౌస్, మైట్ హౌస్ అయ్యి దూరం వరకు తరంగాలు వ్యాపించాలి. విజ్ఞానం, లైట్ హౌస్ ద్వారా దూరం వరకు వెలుగుని పంపగలుగుతుంది. మరి మీరు తరంగాలను వ్యాపింపచేయలేరా? చేయాల్సిందే అనే ధృడ సంకల్పం చేయండి అంతే. బిజీ అయిపోండి. మనస్సుని బిజీగా ఉంచితే స్వయానికి లాభం మరియు ఇతరాత్మలకీ లాభమే. విశ్వ కళ్యాణం చేయవలసిందే అని నడుస్తూ, తిరుగుతూ ఇదే వృత్తి పెట్టుకోండి. ఈ వృత్తి ద్వారా వాయుమండలం వ్యాపిస్తుంది ఎందుకంటే సమయం అకస్మాత్తుగా సమాప్తి అయిపోతుంది. మీరు మాకు ఎందుకు చెప్పలేదు అని మీ సోదరీ సోదరులు మిమ్మల్ని నిందించకూడదు. కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు అంతిమంలో చేసేస్తాం అని కానీ అంతిమంలో చేసినా కాసే మమ్మల్ని నిండిస్తారు. మాకు కొంచెం సమయం ముందుగా చెప్తే కొంచెం తయారు చేసుకునేవాళ్ళం కదా అని నిందిస్తారు. అందువలన ప్రతి సంకల్పంలో బాప్ దాదా యొక్క స్మృతి ద్వారా లైట్ తీసుకుంటూ ఉండండి మరియు లైట్ హౌస్ అయి ఇస్తూ ఉండండి. సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. చాలా యుద్ధం చేస్తున్నట్లు బాప్ దాదాకి కనిపించింది. యుద్ధం చేయటం బాప్ దాదాకి ఇష్టమనిపించదు. మాస్టర్ సర్వశక్తివంతులు కానీ చేసేది యుద్ధం. కనుక రాజుగా అవ్వండి, సఫలతామూర్తి అవ్వండి, నిరాశను సమాప్తి చేసి ఆశాదీపాన్ని వెలిగించండి. మంచిది. అన్ని వైపుల పిల్లల స్నేహపూర్వక స్మృతి మాలలు చాలా చేరుకున్నాయి. అలా స్మృతిని పంపిన పిల్లలందరి బాప్ దాదా ఎదురుగా చూస్తూ స్మృతికి జవాబుగా మనస్సు యొక్క ఆశీర్వాదాలను, మనస్సు యొక్క ప్రేమను ఇస్తున్నారు. మంచిది. మొదటిసారిగా వచ్చినవారు నిల్చోండి. మంచిది, ప్రతిసారి క్రొత్తవారు ఎక్కువగా వస్తున్నారు. సేవను వృద్ధి చేశారు కదా, ఇంతమందికి సందేశం ఇచ్చారు. ఎలా అయితే మీకు సందేశం లభించిందో అలాగే మీరు కూడా దానికి మరో రెండు రెట్లు అంటే రెట్టింపు సందేశం ఇవ్వండి. యోగ్యులుగా చేయండి. మంచిది. ప్రతి సబ్జక్టులో మరింత ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకి వెళ్ళండి. మంచిది. ఇప్పుడు లక్ష్యం పెట్టుకోండి - నడుస్తూ, తిరుగుతూ మనస్సు ద్వారా లేదా వాచా ద్వారా లేదా కర్మణా ద్వారా ఏదొక సేవ లేకుండా ఉండకూడదు. మరియు స్మ్మతి లేకుండా కూడా ఉండకూడదు. స్మృతి మరియు సేవ సదా వెనువెంట ఉండాలి. ఇంతగా మిమ్మల్ని మీరు స్మృతిలో కూడా మరియు సేవలో కూడా బిజీగా ఉంచుకోండి. ఖాళీగా ఉంటే మాయ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత బిజీగా ఉండాలంటే దూరం నుండే మాయ వెళ్ళిపోవాలి. వచ్చేటందుకు సాహసించకూడదు. అప్పుడు బాబా సమానంగా అవ్వాలి అని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో అది సహజం అయిపోతుంది. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు, స్నేహి స్వరూపంగా ఉంటారు. మంచిది. ఈ రోజు మిమ్మల్ని స్నేహం అనేది ఎగిరింపచేసి తీసుకువచ్చింది కదా! స్నేహం అనే విమానం ఎంత వేగవంతమైనది? స్నేహంతో ఎగురుతూ వచ్చారు. ఇలా స్నేహంలో ఎగురుతూ ఉండాలి మరియు ఎగిరింప చేస్తూ ఉండాలి. బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలందరినీ చూస్తున్నారు. అందరి మనస్సులో ఈ సమయంలో 100% చేసి చూపిస్తాం అనే ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయి. పెద్ద విషయం ఏమీ కాదు, అవ్వవలసిందే. కానీ ఈ సమయం యొక్క ఉత్సాహ ఉల్లాసాలను మరియు ధృడ సంకల్పాన్ని సదా వెంట ఉంచుకోవాలి. 

బాప్ దాదా యొక్క నయనాలలో ఇమిడి ఉన్న నయనరత్నాలకు, బాబా యొక్క సర్వ సంపదకు అధికారులైన శ్రేష్ట ఆత్మలైన పిల్లలకు, సదా ఉత్సాహ ఉల్లాసాలనే రెక్కలతో ఎగరుతూ మరియు ఎగిరింప చేస్తూ ఉండే మహావీర్, మహావీరిణులు అయిన పిల్లలకు, బాబాయే నా ప్రపంచం అనే సంలగ్నతలో లవలీనం అయి ఉండే పిల్లలకు, లవలీనం అవ్వటం అంటే సహజంగా బాబా సమానంగా అవ్వటం. ఇటువంటి ప్రియమైన మరియు లవలీన పిల్లలకు చాలా చాలా కోటానుకోట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే.  

Comments