18-01-2005 అవ్యక్త మురళి

    18-01-2005         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సెకనులో దేహాభిమానం నుండి ముక్తులై జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్కోండి మరియు మాస్టర్ ముక్తి -జీవన్ముక్తి దాతలు కండి.

ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న అదృష్టవంతమైన మరియు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరు స్నేహంలో లీనమై ఉన్నారు. పరమాత్మ యొక్క స్నేహం అలౌకిక స్నేహం. ఈ స్నేహమే పిల్లలను బాబా వారిగా తయారు చేసింది. స్నేహమే సహజంగా విజయీలుగా చేసింది. ఈరోజు అమృతవేళ నుండి నలువైపుల ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు తమ స్నేహ మాలను బాబాకి వేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లవానికి తెలుసు పరమాత్మ స్నేహం అనేది మనల్ని ఎలా ఉండేవారిని ఎలా తయారుచేసిందో! స్నేహం యొక్క అనుభూతి పరమాత్ముని అనేక ఖజానాలకు యజమానిగా తయారు చేస్తుంది. మరియు సర్వ ఖజానాల య్కొ స్వర్ణిమ తాళంచెవిని బాబా పిల్లలందరికీ ఇచ్చారు. తెలుసు కదా! ఆ స్వర్ణిమ తాళంచెవి ఏమిటి? ఆ స్వర్ణిమ తాళం చెవి - నా బాబా. నా బాబా అని అన్నారు అంటే సర్వ ఖజానాలకి అధికారిగా అయిపోయినట్లే. సర్వ ప్రాప్తులతో సంపన్నం అయిపోయినట్లే. సర్వ శక్తులతో సమర్థంగా అయిపోయారు మరియు మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిపోయారు. ఇలా సంపన్నమైన ఆత్మల మనస్సు నుండి ఏ పాట వస్తుంది? బ్రాహ్మణులైన మా ఖజానాలో అప్రాప్తి (లోటు) వస్తువు ఏదీ లేదు. 

ఈ రోజు స్మృతి దినోత్సవం అని అంటారు కదా! ఈ రోజు పిల్లలందరికీ విశేషంగా ఆదిదేవ బ్రహ్మాబాబా ఎక్కువగా స్మృతిలోకి వస్తున్నారు. బ్రహ్మాబాబా బ్రాహ్మణ పిల్లలైన మిమ్మల్ని చూసి హర్షిస్తున్నారు, ఎందువలన? ప్రతి బ్రాహ్మణాత్మ కోట్లలో కొద్దిమంది భాగ్యశాలులలో ఒకరు. మీ భాగ్యం గురించి మీకు తెలుసు కదా! బాప్ దాదా ప్రతీ ఒక్క పిల్లవాని మస్తకంలో మెరిసే భాగ్య సితారను చూసి హర్షిస్తున్నారు. ఈ స్మృతిదినోత్సవమున విశేషంగా బాప్ దాదా విశ్వ సేవ అనే భాధ్యతా కిరీటాన్ని పిల్లలకు అర్పణ చేసిన రోజు. కనుక ఈ స్మృతి దినోత్సవం పిల్లలైన మీ రాజ్యతిలక ధారణ రోజు. పిల్లలకు సాకార స్వరూపంలో ఆత్మిక శక్తులను అర్పణ చేసిన రోజు. తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అనే సూక్తిని సాకారం చేసే రోజు. నిమిత్తంగా అయ్యి పిల్లలు చేసే నిస్వార్థ విశ్వసేవను చూసి సంతోషిస్తున్నారు. బాప్ దాదా చేయించేవారు, చేసేవారు పిల్లలు, కనుక పిల్లలు వేసే ప్రతీ అడుగుని చూసి బాప్ దాదా చాలా హరిస్తున్నారు. ఎందుకంటే “సేవ యొక్క సఫలతకి విశేష ఆధారం - చేయించే బాబా, చేసే ఆత్మనైనా నా ద్వారా చేయిస్తున్నారు అనే స్మృతి ఉండాలి.” ఆత్మనైనా నేను కేవలం నిమిత్తం అని భావించటం ద్వారా నిర్మాణ స్థితి స్వతహాగానే ఉంటుంది. మరియు నిర్మాణ భావం ద్వారా నేను అనే దేహాభిమానం ఏదైతే ఉంటుందో అది సమాప్తి అయిపోతుంది. ఈ బ్రాహ్మణ జీవితంలో అన్నింటికంటే ఎక్కువగా విఘ్నరూపంగా అయ్యేది ఏమిటంటే దేహాభిమానంతో కూడిన నేను అనే భావం. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా చేసేవాడిగా అయ్యిచేస్తున్నాను అని భావిస్తే సహజంగా దేహాభిమానం నుండి ముక్తి అయిపోతారు. మరియు జీవన్ముక్తి స్థితి యొక్క మజాను పొందగలరు. భవిష్యత్తులో జీవన్ముక్తి అయితే లభించవలసిందే కానీ ఈ సంగమయుగంలో జీవన్ముక్త స్థితి యొక్క అలౌకిక ఆనందం ఇంకా అలౌకికమైనది. బ్రహ్మాబాబాని చూసారు కదా - కర్మ చేస్తూ కూడా కర్మ బంధనకి అతీతంగా ఉండేవారు. జీవితంలో ఉంటూ కమలపుష్ప సమానంగా అతీతం మరియు అతి ప్రియం. ఎంతో పెద్ద పరివారం యొక్క బాధ్యత, వారి జీవితం యొక్క భాధ్యత, యోగిగా తయారుచేసే బాధ్యత, ఫరిస్తా నుండి దేవతగా తయారు చేసే బాధ్యత ఉన్నప్పటికీ నిశ్చింత చక్రవర్తిగా ఉండేవారు. ఈ స్థితినే జీవన్ముక్తస్థితి అని అంటారు. అందువలనే భక్తి మార్గంలో బ్రహ్మకి కమలపుష్ప ఆసనం చూపిస్తారు. కమలాసనధారిగా చూపిస్తారు. పిల్లలైన మీరందరూ కూడా ఈ సంగమయుగంలోనే జీవన్ముక్తిని అనుభవం చేసుకోవాలి. బాప్ దాదా నుండి ముక్తి - జీవన్ముక్తి యొక్క వారసత్వం ఈ సమయంలోనే ప్రాప్తిస్తాయి. ఈ సమయంలోనే మాస్టర్ ముక్తి - జీవన్ముక్తి దాతలుగా అవ్వాలి. తయారయ్యారు మరియు తయారవ్వాలి కూడా. ముక్తి - జీవన్ముక్తి యొక్క మాస్టర్ దాతలుగా అయ్యేటందుకు విధి - సెకనులో దేహాభిమానం నుండి ముక్తులైపోవాలి. ఈ అభ్యాసమే ఇప్పుడు అవసరం. మనస్సుపై అదుపు ఉండాలి. ఏవిధంగా అయితే స్థూల కర్మేంద్రియాలైన చేతులు, కాళ్ళను ఎప్పుడు కావాలంటే అప్పుడు మరియు ఎలా కావాలంటే అలా అదుపు చేయగలుగుతున్నారు కదా! అదేవిధంగా మనస్సుని కూడా అదుపు చేయాలి. స్థూల కర్మేంద్రియాలను అదుపు చేయడానికి సమయం పడుతుందా? చేయి పైకి ఎత్తాలి అంటే సమయం పడుతుందా? వెంటనే ఎత్తగలుగుతున్నారు కదా! బాప్ దాదా చేయి ఎత్తమని చెప్తే ఎత్తుతారు కదా. ఇప్పుడు ఎత్తమని కాదు అసలు ఎత్తగలరు కదా! అదేవిధంగా మనస్సుపై కూడా ఇంత అదుపు ఉండాలి. ఎక్కడ ఏకాగ్రం చేయాలంటే అక్కడ ఏకాగ్రం అయిపోవాలి. మనస్సు అనేది కాళ్ళు, చేతుల వలె స్థూలమైనది కాదు, సూక్ష్మం కానీ మనస్సు కూడా మీదే కదా! నా మనస్సు అని అంటారు కదా, నీ మనస్సు అని అనరు కదా! కనుక స్థూల కర్మేంద్రియాలు ఎలాగైతే అదుపులో ఉంటున్నాయో అలాగే మనస్సు - బుద్ధి - సంస్కారాలు కూడా అదుపులో ఉండాలి, అప్పుడే నెంబర్ వన్ విజయీలు అని అంటారు. విజ్ఞానవేత్తలు రాకెట్ ద్వారా లేదా తమ సాధనాల ద్వారా ఈ లోకం వరకే తిరగగలరు, ఎక్కువలో ఎక్కువ గ్రహాల వరకు చేరుకోగలరు. కానీ బ్రాహ్మణాత్మలైన మీరు మూడు లోకాల వరకు చేరుకోగలుగుతున్నారు. సెకనులో సూక్ష్మలోకానికి, నిరాకారి లోకానికి మరియు స్థూలంలో మధువనానికి కూడా చేరుకోగలరు. మనస్సుకి మధువనం వెళ్ళమని ఆజ్ఞాపిస్తే సెకనులో వెళ్ళగలుగుతుందా? తనువుతో కాదు, మనస్సుతో, సూక్ష్మవతనానికి వెళ్ళమని లేదా నిరాకారి వతనానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తే మూడు లోకాలకి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనస్సు వెళ్ళగలుగుతుందా? అభ్యాసం ఉందా? ఇప్పుడు ఈ అభ్యాసం ఎక్కువ అవసరం. బాప్ దాదా చూశారు అభ్యాసం అయితే చేస్తున్నారు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏకాగ్రం అవ్వాలి, అచంచలంగా ఉండాలి, అలజడిలోకి రాకూడదు. ఈ విషయంపై మరింత ధ్యాస పెట్టాలి. మనస్సుని జయించినవారు జగుత్తునే జయించగలరు అనే మహిమ ఉంది కదా! ఇప్పుడు అప్పుడప్పుడు మనస్సు మోసం కూడా చేస్తుంది. 

కనుక ఈ రోజు ఈ సమర్థ దినోత్సవమున బాప్ దాదా ఇదే సమర్థ విశేష ధ్యాసను ఇప్పిస్తున్నారు - ఓ స్వరాజ్యాధికారి పిల్లలూ! ఇప్పుడు ఈ విశేష అభ్యాసాన్ని నడుస్తూ, తిరుగుతూ పరిశీలన చేస్కోండి. ఎందుకంటే సమయ ప్రమాణంగా ఇప్పుడు అకస్మాత్తుగా జరిగే ఆటలు చాలా చూస్తారు. దీని కొరకు ఏకాగ్రతాశక్తి చాలా అవసరం. ఏకాగ్రతాశక్తి ద్వారా ధృడతా శక్తి స్వతహాగానే వస్తుంది. ధృడత స్వతహాగా సఫలతను తీసుకు వస్తుంది. కనుక విశేషంగా సమర్థ దినోత్సవమున ఈ సమర్థ అభ్యాసంపై విశేష ధ్యాస పెట్టండి. అందువలనే భక్తి మార్గంలో కూడా అంటారు - మనస్సుతో ఓడిపోయినవారు ఓడినట్లు, మనస్సుని గెలిచినవారే గెలిచినట్లు. నా మనస్సు అంటున్నారు కదా! కనుక మీ మనస్సుకి మీరు యజమానులై శక్తులనే కళ్ళెంతో మనస్సుపై విజయాన్ని పొందండి. ఈ క్రొత్త సంవత్సరంలో ఈ హోమ్ వర్క్ పై విశేష ధ్యాస పెట్టండి. యోగులే కానీ ప్రయోగులు కండి అని దీనినే అంటారు. ఈ రోజు స్నేహ సంపన్న ఆత్మిక సంభాషణ, నిందలు మరియు బాబా సమానంగా అవ్వాలనే ఉత్సాహ ఉల్లాసాలు మూడు రకాలైన ఆత్మిక సంభాషణలు బాప్ దాదా దగ్గరకి చేరుకున్నాయి. నలువైపుల ఉన్న పిల్లల యొక్క స్నేహ సంపన్న స్మృతి, స్నేహ సంపన్న ప్రేమ బాప్ దాదా దగ్గరకి చేరుకున్నాయి. ఉత్తరాలు చేరుకున్నవి మరియు ఆత్మిక సంభాషణ కూడా చేరుకున్నాయి, సందేశాలు కూడా చేరుకున్నాయి. బాప్ దాదా పిల్లల స్నేహాన్ని స్వీకరించారు. ఆ స్నేహానికి బదులుగా మనస్సుతో ప్రియస్మృతులను ఇచ్చారు. మరియు మనస్సు యొక్క ఆశీర్వాదాలను కూడా ఇచ్చారు. ఒకొక్కరి పేరు అయితే చెప్పటం కుదరదు కదా! చాలామంది ఉన్నారు మూల మూలల్లో, గ్రామ గ్రామాల్లో నగరాల్లో అన్ని వైపుల ఉన్న పిల్లల యొక్క బంధనాలలో ఉన్న వారి యొక్క విలపించేవారి యొక్క అందరి యొక్క ప్రియస్మృతులు చేరుకున్నాయి. ఇప్పుడు బాప్ దాదా చెప్తున్నారు. స్నేహానికి ఫలితంగా మిమ్మల్ని మీరు పరివర్తన చేస్కోండి. ఇప్పుడు వేదికపై మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. మీ సంపన్నత ద్వారా దు:ఖం మరియు అశాంతి సమాప్తి అవ్వాలి. ఇప్పుడు మీ సోదరీసోదరులను దు:ఖాన్ని ఎక్కువ చూడనివ్వకండి. దు:ఖం, అశాంతి నుండి ముక్తినివ్వండి. వారు చాలా భయభీతులుగా ఉన్నారు. ఏమి చేయము, ఏమౌతుందో...... ఈ అంధకారంలో భ్రమిస్తున్నారు. ఇప్పుడు ఆత్మలకి ప్రకాశానికి మార్గం చూపించండి. ఉల్లాసం వస్తుందా? దయ వస్తుందా? ఇప్పుడు బేహద్ ని చూడండి. బేహద్ పై దృష్టి పెట్టండి. మంచిది. హోమ్ వర్క్ జ్ఞాపకం ఉంటుంది కదా? మర్చిపోకండి. బహుమతి ఇస్తాను. ఎవరైతే ఒక నెల మొత్తం మనస్సుని పూర్తిగా అదుపులో ఉంచుతారో అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఏకాగ్రం చేయగలరో వారికి బహుమతి ఇస్తాను. ఈ చార్ట్ లో మంచి ఫలితం చూపించిన వారికి బహుమతి ఇస్తాను. సరేనా? ఎవరు బహుమతి తీసుకుంటారు? పాండవులు తీసుకుంటారా? పాండవులు ముందు వస్తారా? పాండవులకు శుభాకాంక్షలు. మరి శక్తులు? ఎ వన్. పాండవులు నెంబర్ వన్, శక్తులు ఎ వన్. శక్తులు ఎ వన్ గా కాకపోతే పాండవులు ఎ వన్ అయిపోతారు. ఇప్పుడు వేగాన్ని కొంచెం పెంచండి. విశ్రాంతిగా నడవటం కాదు. తీవ్రగతి ద్వారానే ఆత్మల దు:ఖం, అశాంతి సమాప్తి అవుతాయి. దయ అనే చత్రచాయని ఆత్మలపై వేయండి. మంచిది. ఇప్పుడు ఏమి చేయాలి? ఇప్పుడు ఒక్క సెకనులో మనస్సుని ఏకాగ్రం చేయగలరా? ఒక్క సెకనులో బిందు రూప స్థితిలో స్థితులైపోండి. (బాబా ఇలా ఆత్మిక వ్యాయామం చేయించారు) మంచిది. ఇటువంటి అభ్యాసాన్ని నడుస్తూ, తిరుగుతూ కూడా చేయండి. 

నలువైపుల ఉన్న స్నేహి, లవలీన ఆత్మలకు, సదా దయాహృదయులుగా అయ్యి ప్రతి ఆత్మని దు:ఖం, అశాంతి నుండి ముక్తి చేసే శ్రేష్ట ఆత్మలకు, సదా మీ మనస్సు, బుద్ధి, సంస్కారాలను కంట్రోలింగ్ పవర్ ద్వారా కంట్రోల్ చేసే మహావీర్ ఆత్మలకు, సదా సంగమయుగం యొక్క జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకునే బాప్ సమాన ఆత్మలకు బాప్ దాదా యొక్క పదమా పదమాల ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments