18-01-1998 అవ్యక్త మురళి

          18-01-1998         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

శక్తి ఇచ్చే సేవ చేసేటందుకు తగుల్పాటు నుండి ముక్తులై బేహద్ వైరాగి అవ్వండి.

ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు. నలువైపుల ఉన్న పిల్లలందరు అమృతవేళ నుండి తమ మనస్సు యొక్క స్నేహాన్ని బాప్ దాదా ముందు అర్పిస్తున్నారు. పిల్లలందరి స్నేహం యొక్క ముత్యాల మాలలు బాప్ దాదా మెడలో పడుతున్నాయి. ఈ రోజు ఒకవైపు స్నేహం యొక్క ముత్యాల మాలలు, రెండవవైపు నిందల మాలలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం నిందలలో తేడా చూసారు. మమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్తానన్నావు, మేము సాకార పాలన పొందలేదు.... ఇలాంటి నిందలు వేసేవారు మొదట్లో. కానీ ఈ సంవత్సరం ఎక్కువ మంది నింద ఏమిటంటే - ఇప్పుడు బాబా సమానంగా అయ్యి నీ దగ్గరకి చేరుకోవాలి అని. సమానంగా అయ్యే ఉత్సాహ ఉల్లాసాలు చాలా మందిలో బావున్నాయి. సమానంగా అవ్వాలనే కోరిక చాలా తీవ్రంగా ఉంది. తయారైపోవాలి మరియు వచ్చేయాలి అనే సంకల్పం చాలా మందికి ఉంది. బాప్ దాదా కూడా పిల్లలకు చెప్తున్నారు - సమాన భవ! సంపన్న భవ! సంపూర్ణ భవ! దీనికి సాధనం చాలా సహజం, అన్నింటికంటే సహజమైన సాధనం - సదా స్నేహం యొక్క సాగరంలో లీనమైపోండి. ఎలాగైతే ఈ రోజు స్నేహంలో ఇమిడి ఉన్నారు కదా! ఈరోజు ఇంకేదైనా జ్ఞాపకం వచ్చిందా? బాప్ దాదా తప్ప మరే స్మృతి అయినా ఉందా? నడుస్తూ, తిరుగుతూ కూడా స్నేహంలో లీనమై ఉన్నారు. నడుస్తూ తిరుగుతూ కూడా ఏ స్మృతి ఉంది? బ్రహ్మాబాబా యొక్క చరిత్ర మరియు చిత్రం స్మృతిలో ఉన్నాయి. చిత్రం ఎదురుగా ఉంది మరియు చరిత్ర కూడా స్మృతిలో ఉంది. ఈ రోజు విశేషంగా స్నేహం యొక్క అనుభవం చేసుకున్నారు కదా? శ్రమ అనిపించిందా? సహజం అయిపోయింది కదా! స్నేహం ఎలాంటి శక్తి అంటే అన్నింటినీ మరిపింపచేస్తుంది. దేహ స్మృతి రాదు, దేహ ప్రపంచం స్మృతి రాదు. స్నేహం, శ్రమ నుండి విడిపిస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. స్నేహం అనేది బాప్ దాదా యొక్క చేయి సదా మనపై ఉన్నట్లు అనుభవం చేయిస్తుంది. స్నేహం ఛత్రఛాయగా అయ్యి మాయాజీతులుగా చేస్తుంది. ఎంత పెద్ద సమస్యరూపీ పర్వతమైనా స్నేహం పర్వతాన్ని కూడా నీటి వలె తేలికగా చేస్తుంది. స్నేహంలో ఉండటం వస్తుంది కదా? ఈరోజు స్నేహంలో ఉండి చూసారు కదా? మరేదైనా జ్ఞాపకం ఉందా? లేదు కదా? బాబా, బాబా, బాబా....... ఒకే స్మృతిలో లవలీనమై ఉన్నారు. బాప్ దాదా చెప్తున్నారు - ఇక ఏ పురుషార్ధం చేయకపోయినా కానీ కేవలం స్నేహం యొక్క సాగరంలో లీనమై ఉండండి. లీనమవ్వటం వస్తుందా? అప్పుడప్పుడు పిల్లలు స్నేహ సాగరంలో లీనం అవుతున్నారు, మరలా బయటికి వచ్చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా అంటున్నారు. మరలా ఇతర విషయాలలో నిమగ్నం అయిపోతారు. కొద్దిగా మునక వేసి వచ్చేసినట్లుగా స్నేహ సాగరంలో మునిగి మరలా బయటికి వచ్చేస్తున్నారు. కానీ లీనం అయిపోండి. స్నేహశక్తి అన్నింటికంటే సహజంగా ముక్తి చేస్తుంది. 

పిల్లలందరి బ్రాహ్మణ జన్మ యొక్క ఆది అనుభవం - స్నేహమే బ్రాహ్మణులుగా తయారుచేసింది. స్నేహమే పరివర్తన చేసింది. మీ జన్మ యొక్క ఆది సమయం యొక్క అనుభవం స్మృతి ఉందా? జ్ఞానం మరియు యోగం అయితే లభించాయి కానీ స్నేహమే ఆకర్షితం చేసి బాబా వారిగా చేసింది. ఒకవేళ సదా స్నేహంలో ఉంటే సదాకాలికంగా శ్రమ నుండి విడిపించబడతారు. ముక్తి సంవత్సరం జరుపుకుంటున్నారు కదా! శ్రమ నుండి కూడా ముక్తి అవ్వాలి, దీనికి సహజసాధనం - స్నేహంలో లీనమై ఉండండి. స్నేహం యొక్క అనుభవం అందరికీ ఉంది కదా? లేక లేదా? ఒకవేళ ఎవరినైనా బాప్ దాదాపై ఎవరికి ఎక్కువ స్నేహం ఉంది? అని అడిగితే నాకు ఉంది అని అందరు చేతులు ఎత్తుతారు కదా! (అందరూ చేతులు ఊపారు) శాంతిగా చేతులు ఎత్తండి, ధ్వనితో కాదు. బాప్ దాదా ఈరోజు ఇదే చెప్తున్నారు - స్నేహశక్తిని సదా కార్యంలో ఉపయోగించండి అని. సహజమే కదా! దేహాన్ని మర్చిపోవాలి, దేహ ప్రపంచాన్ని మర్చిపోవాలి, మాయాజీత్ అవ్వాలి అని యోగం జోడిస్తున్నారు. ఎప్పుడైతే స్నేహం యొక్క ఛత్రఛాయలో ఉంటారో ఆ ఛత్రఛాయలోకి మాయ రాలేదు. స్నేహ సాగరం నుండి బయటికి వచ్చేస్తున్నారు. అప్పుడు మాయ చూసేసి తనవారిగా చేసుకుంటుంది. అందువలన అసలు బయటికే రాకండి, లీనమై ఉండండి. స్నేహి అయిన వారు ఏ పని చేస్తున్నా తమ స్నేహితుడిని మర్చిపోరు. స్నేహంలో లీనమై ప్రతి కార్యం చేస్తారు. ఈ రోజు ఎలా అయితే స్నేహంలో లీనమై ఉన్నారో అదేవిధంగా సదా స్నేహంలో లీనమై ఉండలేరా? స్నేహం సహజంగానే సమానంగా తయారుచేస్తుంది. ఎందుకంటే ఎవరితో స్నేహం ఉంటుందో వారి వలె అవ్వటం కష్టం అనిపించదు. 

బ్రహ్మాబాబా అంటే మనస్ఫూర్వక ప్రేమ ఉంది, బ్రహ్మాబాబాకి కూడా పిల్లలపై చాలా ప్రేమ ఉంది. సదా ఒకొక్క బిడ్డను ఎదురుగా ప్రత్యక్షం చేసుకుని సమానంగా అయ్యే శక్తి ఇస్తూ ఉంటారు. బ్రహ్మబాబా తన గత జీవితంలో ఒకొక్క రత్నాన్ని చూసి, వాటి విలువ తెలుసుకుంటూ విశేష కార్యంలో ఉపయోగించేవారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకొక్క రత్నాన్ని విశేషరూపంతో విశేష కార్యంలో ఉపయోగించాలని సంకల్పిస్తున్నారు మరియు ప్రతి ఒక్కరి విశేషత గురించి ఓహో! ఓహో!! అని పాడుతున్నారు. ఓహో నా యొక్క అమూల్యరత్నాలు! అని పాడుకుంటున్నారు. కొంతమంది పిల్లలు ఆలోచిస్తున్నారు - బ్రహ్మాబాబా వతనంలో ఏమి చేస్తారు? అని. బాబా చెప్తున్నారు - సాకారంలో సదా పిల్లలతో ఎలా అయితే ఉండేవారో అదేవిధంగా వతనంలో కూడా ఉంటున్నారు. పిల్లల వెంటే ఉంటారు, ఒంటరిగా ఉండరు. పిల్లలు లేకపోతే బాబాకి కూడా ఆనందంగా ఉండదు. ఎలా అయితే పిల్లలకు బాబా లేకుండా ఏమీ తోచదో అదేవిధంగా బాబాకి కూడా పిల్లలు లేకుండా ఏమి తోచదు. ఒంటరిగా ఉండటం లేదు వెంట ఉంటున్నారు. సాకారంగా ఉన్నప్పుడు సాకార రూపంగా బాబా తోడు యొక్క అనుభవం కొద్దిమంది పిల్లలే చేసుకునేవారు. ఇప్పుడైతే అవ్యక్తరూపంలో ప్రతి బిడ్డతో పాటు ఏ సమయంలో కావాలంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు తోడు నిలుపుకుంటున్నారు. చిత్రాలలో ఒకొక్క గోపికతో కృష్ణుడిని చూపించారు కదా! ఆ మహిమ ఈ సమయానిదే. ఇప్పుడు అవ్యక్తరూపంలో ప్రతి ఒక్క బిడ్డతో ఎప్పుడు కావాలంటే అప్పుడు రాత్రి రెండు గంటలైనా, రెండున్నర అయినా కానీ ఏ సమయంలోనైనా తోడును నిలుపుకుంటున్నారు. సాకారంలో అయితే అప్పుడప్పుడు మాత్రమే సేవాకేంద్రాలకు తిరిగేవారు కానీ ఇప్పుడు అవ్యక్తరూపంలో పవిత్ర ప్రవృత్తిని కూడా చూస్తున్నారు. బాబాకి ఇంకేమి పని ఉంటుంది! పిల్లలను తన సమానంగా తయారుచేసి వెంట తీసుకువెళ్ళటం. ఇదే పని కదా! ఇంకేదైనా ఉంటుందా? కనుక దీనిలోనే బిజీగా ఉంటారు. బాప్ దాదా ఈరోజు విశేషంగా పిల్లలకు శ్రమముక్తులు అవ్వండి అనే వరదానం ఇస్తున్నారు. ఏ పని అయినా చేయండి కానీ డబల్ లైట్ అయ్యి చేయండి, అప్పుడు శ్రమ మనోరంజనంగా అనిపిస్తుంది. ఎందుకంటే బాప్ దాదాకి పిల్లలు శ్రమ చేయటం, యుద్ధం చేయటం, ఓటమి, గెలుపుల ఆట ఆడటం ఇవన్నీ మంచిగా అనిపించటం లేదు. ముక్తి సంవత్సరం జరుపుకుంటున్నారు కదా? జరుపుకుంటున్నారా లేక శ్రమలోనే ఉన్నారా? ఈరోజు విశేషంగా ఈ వరదానం స్మృతిలో ఉంచుకోండి - శ్రమ నుండి ముక్తి భవ! ఈ సంగమయుగం శ్రమ నుండి ముక్తి అయ్యే యుగం. ఆనందంలో ఉండే యుగం. ఒకవేళ శ్రమ ఉంటే ఆనందం ఉండదు. పరమాత్మ మరియు ఆత్మ ఆనందం పొందే యుగం ఇది ఒక్కటే. ఆత్మ పరమాత్మల స్నేహ యుగం, కలయిక యుగం, కనుక ఈరోజు నుండి శ్రమ నుండి ముక్తులవుతాం అని దృఢ సంకల్పం చేయండి. అవుతారు కదా? ఇక్కడ చేతులు ఎత్తి మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి చేయము, ఎలా చేయము అని అనరు కదా! ఎందుకంటే బాప్ దాదా దగ్గర అందరి దృఢ సంకల్పం యొక్క ఫైల్ అంతా ఉంది. బాప్ దాదా అప్పుడప్పుడు పిల్లల ఫైల్ చూస్తుంటారు. చాలాసార్లు దృఢ సంకల్పం చేశారు కదా! జన్మ తీసుకున్న దగ్గర నుండి అది చేస్తాము, ఇది చేస్తాము అని ఎన్నిసార్లు సంకల్పం చేసారు కానీ పూర్తి చేయలేదు. ఆత్మికసంభాషణ బాగా చేస్తారు, బాప్ దాదాని కూడా సంతోషపరుస్తారు. జిజ్ఞాసువులను ఎలా అయితే ప్రభావితం చేస్తారో అదేవిధంగా బాప్ దాదాను కూడా ప్రభావితం చేసేస్తున్నారు. కానీ ఆ దృఢ సంకల్పం యొక్క ప్రభావం కొద్ది సమయమే ఉంటుంది, సదా ఉండటం లేదు. బాప్ దాదా దగ్గర ఫైల్ పెరిగిపోతూ ఉంటుంది. ఏదైనా కార్యక్రమం జరిగితే బాప్ దాదా దగ్గర ఫైల్ లో ఒక ప్రతిజ్ఞ పత్రం జమ అయిపోతుంది. అందువలన బాప్ దాదా వ్రాయించటం లేదు. 


ఈరోజు కూడా అందరు సంకల్పం అయితే చేస్తున్నారు, ఇప్పుడు ఎంత వరకు నడుస్తారో, ఫైల్ లో కాగితం ఎంతవరకు ఉంటుందో బాబా కూడా చూస్తూ ఉంటారు. పిల్లలు బాబా సమానంగా అయితే ఫైల్ సమాప్తి అయిపోయి సంపూర్ణం అయిపోతారు, ఇప్పుడు చాలా, చాలా ఫైల్స్ ఉన్నాయి. కేవలం స్నేహంలో లీనమై ఉండండి, స్నేహ సాగరం నుండి బయటికి రాకండి. బ్రహ్మాబాబాపై మనస్పూర్వక స్నేహం ఉంది కదా? స్నేహిని అనుసరించటం కష్టం కాదు. స్నేహం గురించి చెప్తారు - ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ ప్రాణాన్ని కూడా అర్పిస్తారు అని. బాప్ దాదా అయితే ప్రాణాన్ని అర్పించమని చెప్పటం లేదు, పాత ప్రపంచాన్ని అర్పణ చేయండి. దీని యొక్క అంతిమ తారీఖు నిర్ణయించండి. ఇతర కార్యక్రమాల తారీఖులు నిర్ణయించుకుంటారు కదా! 20వ తారీఖు ఈ కార్యక్రమం, 24వ తారీఖు ఈ కార్యక్రమం అని నిర్ణయించుకుంటారు, అయితే దీని తారీఖు ఎప్పుడు నిర్ణయిస్తారు? (దీని తారీఖు బాప్ దాదా నిర్ణయించాలి) బాప్ దాదా అయితే ఎప్పుడో అనే మాట అనరు, ఇప్పుడే అని అంటారు. బాప్ దాదా ఎప్పుడో అని అంటారా? ఇప్పుడే అంటారు. చేయాలనుకున్నదేదో ఇప్పుడే చేయండి. ఎందుకంటే బాప్ దాదా సమర్థులు కనుక ఆ సమర్థతతో ఇప్పుడే అంటారు. కానీ పిల్లలు ఎప్పుడో, ఎప్పుడో అనే అలవాటులో ఉన్నారు. కనుక బాప్ దాదా పిల్లలను ఈ తారీఖు ఎప్పుడు నిర్ణయిస్తారు అని అడుగుతున్నారు. మీరు ఎప్పుడో, ఎప్పుడో అంటే బాబా కూడా ఎప్పుడు అంటారు. 

ఇప్పుడు సమయప్రమాణంగా అందరు బేహద్ వైరాగ్య వృత్తిలోకి వెళ్ళవలసిందే. కానీ పిల్లలకు సమయం శిక్షకుడు కాకూడదు అని బాప్ దాదా అనుకుంటున్నారు. బాబా శిక్షకుడు అయినప్పుడు సమయానికి తయారు అవ్వటం అంటే సమయాన్ని శిక్షకునిగా చేసుకున్నట్లు. దీనిలో మార్కులు తక్కువ అయిపోతాయి. ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు అంటున్నారు - సమయం నేర్పిస్తుంది, సమయం మారుస్తుంది అని. సమయాన్ని అనుసరించి అయితే విశ్వంలో ఆత్మలందరు మారతారు కానీ పిల్లలైన మీరు సమయం కోసం ఎదురు చూడకండి. సమయాన్ని శిక్షకునిగా చేసుకోకండి. విశ్వ శిక్షకుని యొక్క మాస్టర్ విశ్వశిక్షకులు మీరు. మీరు రచయితలు, సమయం మీ యొక్క రచన కనుక ఓ రచయిత ఆత్మలూ! రచనని శిక్షకునిగా చేసుకోకండి. బ్రహ్మాబాబా సమయాన్ని శిక్షకునిగా చేసుకోలేదు, ఆది నుండి అంతిమం వరకు బేహద్ వైరాగ్యం ఉండేది. ఆదిలో చూడండి - తనువు, మనస్సు, ధనాలను అంతగా ఉపయోగించినా కానీ తగుల్పాటు అనేది లేదు. తనువు గురించి ఎప్పుడు ఇదే మాట అనేవారు - ఇది బాబా యొక్క రథం, నా శరీరం కాదు, బాబా రథం. బాబా రథానికి తినిపిస్తున్నాను, నేను తినటం లేదు. ఇలా తనువుతో కూడా బేహద్ వైరాగ్యం ఉండేది. మనస్సు అయితే మన్మనాభవగానే ఉండేది, ధనం కూడా ఉపయోగించారు కానీ ఎప్పుడూ కూడా నా ధనం ఉపయోగించాను అనే సంకల్పం ఉండేది కాదు. నా ధనాన్ని ఉపయోగిస్తున్నాను లేదా నేను ధనం ఉపయోగించాను అని వర్ణన చేయలేదు. బాబా భండారా, భోజానాథుని భండారా అనేవారు. ధనాన్ని నాది అని భావించి వ్యక్తిగతంగా తన కోసం ఒక రూపాయి యొక్క వస్తువుని కూడా ఉపయోగించుకోలేదు. కన్యలు, మాతల భాధ్యత అని కన్యలు, మాతలకు అర్పించారు, నాది అనేది లేదు. సమయం, శ్వాస కూడా తన పట్ల ఉపయోగించలేదు. వాటి ద్వారా కూడా బేహద్ వైరాగిగా ఉన్నారు. అన్ని రకాలుగా ప్రకృతి దాసి అయినా కానీ అదనంగా ఏ సాధనాన్ని ఉపయోగించుకోలేదు. సదా సాధారణ జీవితంలో ఉన్నారు. ఏ విశేష వస్తువుని తన కార్యంలో ఉపయోగించుకోలేదు. వస్త్రాలు కూడా అంతిమం వరకు ఒకే విధమైనవి ధరించారు. మార్పు చేయలేదు. పిల్లల కోసం ఇల్లు కట్టించారు కానీ స్వయం ఉపయోగించుకోలేదు. పిల్లలు చెప్తున్నా కానీ వింటూ కూడా అతీతంగా ఉండేవారు. సదా పిల్లల యొక్క స్నేహం చూస్తూ కూడా అన్నీ పిల్లల కోసమే అనేవారు. ప్రత్యక్ష జీవితంలో బేహద్ వైరాగ్యవృత్తి కలిగి ఉండటం అని దీనినే అంటారు. అంతిమంలో చూడండి - పిల్లలు ఎదురుగా ఉన్నారు, చేయి పట్టుకుని ఉన్నారు కానీ తగుల్పాటు ఉందా? బేహద్ వైరాగ్యవృత్తిలో ఉన్నారు. స్నేహి పిల్లలు, విశేష పిల్లలు ఎదురుగా ఉన్నా కానీ బేహద్ వైరాగ్యంలో ఉన్నారు. సెకనులో అతీతవృత్తి, బేహద్ వైరాగ్యం యొక్క ఉదాహరణ చూసారు. సేవ, సేవ, సేవ.... ఇలా ఒకటే సంలగ్నత. మిగిలిన అన్ని విషయాలతో అతీతం, దీనినే బేహద్ వైరాగ్యం అని అంటారు. ఇప్పుడు సమయప్రమాణంగా బేహద్ వైరాగ్యవృత్తిని ప్రత్యక్షం చేయండి. బేహద్ వైరాగ్యవృత్తి లేకుండా శక్తినిచ్చే సేవ చేయలేరు, కనుక తండ్రిని అనుసరించండి. నిరాకార బాబా విషయం వదిలేయండి, సాకారంలో బ్రహ్మాబాబా ఉన్నారు కదా! సాకారంలో సాధనాలు అన్నీ ఉన్నా, పిల్లలందరి యొక్క భాధ్యత ఉన్నా, పరిస్థితులు, సమస్యలు వచ్చినా అన్నింటిలో పాస్ అయిపోయారు కదా! పాస్ విత్ ఆనర్ అనే సర్టిఫికెట్ తీసుకున్నారు. దీనికి విశేష కారణం - బేహద్ వైరాగ్యవృత్తి. ఇప్పుడు సూక్ష్మ తగుల్ఫాటు యొక్క బంగారు సంకెళ్ళు, చాలా లోతైన సూక్ష్మ తగుల్పాటు చాలా ఉన్నాయి. కొంతమంది పిల్లలు ఇది తగుల్పాటు అని కూడా అనుకోవటం లేదు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఇవన్నీ ఇలా నడుస్తూనే ఉంటయి అని అనుకుంటున్నారు. ముక్తి అవ్వాలి అనుకోవటం లేదు. కానీ అలా నడుస్తూనే ఉంటుంది అంటున్నారు. ఇలా అనేకరకాలైన తగుల్ఫాటులు బేహద్ వైరాగిగా అవ్వనివ్వటం లేదు. అవ్వాలనుకుంటున్నారు. తయారవ్వాల్సిందే అని సంకల్పం కూడా చేస్తున్నారు. కానీ అనుకోవటం మరియు చేయటం రెండింటి సమానత లేదు. అనుకోవటం ఎక్కువ, చేయటం తక్కువ. చేయాల్సిందే అనే బేహద్ వైరాగ్యవృత్తి ఇప్పుడు ప్రత్యక్షంగా లేదు. మధ్యమధ్యలో ప్రత్యక్షం అవుతుంది మరలా మాయం అయిపోతుంది. సమయం అయితే చేయిస్తుంది కానీ పాస్ విత్ ఆనర్ కాలేరు. పాస్ అవుతారు కానీ పాస్ విత్ ఆనర్ కాలేరు. సమయం యొక్క వేగం తీవ్రం మరియు పురుషార్ధం యొక్క వేగం తక్కువగా ఉంది. పెద్ద, పెద్ద పురుషార్థాలు అయితే చేస్తున్నారు, కానీ సూక్ష్మతగుల్పాటులో బంధించబడిపోతున్నారు. ఎగురుకుంటూ వచ్చాము, ఎగురుకుంటూ వచ్చాము అని పిల్లలు పాడే పాటను బాప్ దాదా వింటున్నారు. ఎగిరింపచేయాలి అని అనుకుంటున్నారు. కానీ తగుల్పాటు అనేది ఎగరనిస్తుందా? ఇక్కడా ఉండలేక అక్కడా ఉండలేకుండా ఉన్నారా? ఇప్పుడు సమయప్రమాణంగా తగుల్పాటు నుండి ముక్తులుగా, బేహద్ వైరాగి అవ్వండి. మనస్సుతో వైరాగ్యం రావాలి. ప్రోగ్రామ్ ప్రకారం వచ్చే వైరాగ్యం అల్పకాలికంగా ఉంటుంది. కనుక మీ సూక్ష్మ తగుల్పాటుని పరిశీలించుకోండి. పెద్ద, పెద్ద విషయాలు ఇప్పుడు సమాప్తి అయిపోయాయి. పెద్ద, పెద్ద తగుల్పాటు నుండి ఇప్పుడు ముక్తి అయిపోయారు, కానీ సూక్ష్మ తగుల్పాటు చాలా సూక్ష్మం. దీనిని మీరు పరిశీలించుకోలేరు కూడా. (తెలియటం లేదు) కనుక మంచిగా పరిశీలించుకోండి. సంపూర్ణత అనే దర్పణంతో తగుల్పాటుని పరిశీలించుకోండి. బ్రహ్మాబాబా యొక్క స్మృతిదినోత్సవం రోజున ఈ బహుమతిని బ్రహ్మాబాబాకి ఇవ్వండి. ప్రేమ ఉంది కదా! ప్రేమలో ఏమి చేస్తారు? బహుమతి ఇస్తారు కదా? కనుక ఈ బహుమతి ఇవ్వండి. అన్ని హద్దులు వదిలేయండి, ముక్తి అయిపోండి. బాప్ దాదాకి ఆనందం అనిపిస్తుంది - పిల్లలలో చాలా ఉత్సాహ, ఉల్లాసాలు చాలా ఉన్నాయి, చాలా మంచిగా స్వ ఉన్నతి యొక్క సంకల్పం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ సంకల్పాలను చేసి చూపించండి. 

నలువైపుల దేశ, విదేశాలలో స్నేహంలో లీనమై ఉన్న స్నేహి పిల్లలకు, సదా బాబా యొక్క స్నేహంలో ఇమిడి ఉండే అతి సమీప ఆత్మలకు, సదా బ్రహ్మాబాబా యొక్క విశేషతలు స్వయంలో ధారణ చేసే శ్రేష్ట ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తి అయ్యి, ఆనందంలో పరమాత్మ ప్రేమలో ఎగిరే ఆత్మలకు, బాబా సమానంగా అయ్యే సంకల్పాన్ని సాకారంలోకి తీసుకువచ్చేవారికి, ఇలా మనోభిరాముడు బాబా యొక్క హృదయంలో ఇమిడి ఉండే పిల్లలకు, విశేషంగా ఈ రోజు బ్రహ్మాబాబా యొక్క కోటానుకోట్ల ప్రియస్మృతులు స్వీకరించండి. బాప్ దాదా సదా పిల్లల యొక్క మనస్సులో ఉంటారు. వతనంలో ఉంటూ కూడా పిల్లల మనస్సులో ఉంటారు, ఇలా మనస్సులో ఇమిడి ఉన్న పిల్లలకు బాప్ దాదా యొక్క స్నేహం యొక్క ముత్యాలను పళ్ళాలలో నింపి ప్రియస్మృతులు ఇస్తున్నారు మరియు నమస్తే. 

Comments