17-11-1994 అవ్యక్త మురళి

     17-11-1994         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ప్రతీ గుణం, శక్తి యొక్క అనుభవంలో లీనం అవ్వటం అంటే అదృష్టవంతులుగా అవ్వటం.

ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్ దాదా తన యొక్క ప్రేమ స్వరూప పిల్లలను కలుసుకుంటున్నారు. బాబాకి పిల్లల కంటే ఎక్కువ ప్రేమ ఉంది మరియు పిల్లలకు బాబా కంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఈ ప్రేమ యొక్క బంధన పిల్లలని కూడా ఆకర్షించి తీసుకువస్తుంది మరియు బాబాని కూడా ఆకర్షించి తీసుకువస్తుంది. ఈ పరమాత్మ ప్రేమ ఎంత సుఖదాయకమైనదో పిల్లలకి తెలుసు. ఒక్క సెకను అయినా ఈ ప్రేమలో లీనమైతే అనేక దుఃఖాలను మరచిపోతారు. సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. ఇలాంటి అనుభవం ఉంది కదా? బాప్ దాదా చూస్తున్నారు - ప్రాపంచిక లెక్కతో ఎంత సాధారణ ఆత్మలు కానీ భాగ్యం ఎంత శ్రేష్టమైనది! అని. కల్పమంతటిలో ఎటువంటి ధర్మాత్మ అయినా, మహాన్ ఆత్మ అయినా కానీ ఈ విధమైన శ్రేష్టభాగ్యం ఎవరికి లభించలేదు మరియు లభించదు. అతి సాధారణమైన వారు కానీ అతి శ్రేష్టభాగ్యవాన్ ఆత్మలు. బాప్ దాదాకి సాధారణ ఆత్మలే ఇష్టం, ఎందుకు? స్వయం బాబా కూడా సాధారణ తనువులోకి వస్తారు. ఏ రాజా తనువులో లేక రాణీ తనువులోకి రావటం లేదు. ఏ ధర్మాత్మ, మహాన్ ఆత్మ తనువులోకి రావటం లేదు. స్వయం కూడా సాధారణ తనువులోనే వస్తున్నారు మరియు పిల్లలు కూడా సాధారణమైన వారే వస్తున్నారు. ఈనాటి కోటీశ్వరులు కూడా సాధారణమైనవారు. సాధారణ పిల్లలలో భావన ఉంటుంది మరియు బాబాకి కూడా భావన కలిగినవారే కావాలి, దేహాభిమానం గల వారు కాదు. ఎంత గొప్ప వారిగా ఉంటారో అంతగా వారిలో భావన ఉండదు, అభిమానం ఉంటుంది. బాబా భావనకి ఫలం ఇవ్వాలి. భావన ఎవరిలో ఉంటుంది? సాధారణ ఆత్మలలో ఉంటుంది, ప్రసిద్ధమైన వారికి భావన ఉండదు, సమయం ఉండదు. కనుక ఎంత సాధారణమైన వారు మరియు భావనతో ఎంత శ్రేష్ఠ ఫలాన్ని పొందుతున్నారు అని బాబా చూస్తున్నారు. అందువలన డ్రామానుసారం సంగమయుగంలో సాధారణమైన వారిగా అవ్వటం కూడా భాగ్యానికి గుర్తు. ఎందుకంటే సంగమయుగంలోనే భాగ్య విధాత భాగ్యరేఖను గీస్తున్నారు మరియు భాగ్యరేఖను గీసుకునే కలాన్ని కూడా పిల్లలకి ఇచ్చేశారు. కలం లభించింది కదా? అయితే భాగ్యరేఖ గీసుకోవటం వస్తుందా? ఎంత పెద్ద రేఖ గీసుకున్నారు? చిన్నది గీసుకోలేదు కదా! ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. పూర్తి అనుమతి ఉంది, అందరికీ అనుమతి ఉన్నది. క్రొత్త వారు అయినా, పాత వారు అయినా, 7 రోజుల కోర్సు తీసుకున్నారు, బాబాని గుర్తించారు. అంటే బాబా భాగ్యం యొక్క కలాన్ని ఇచ్చేస్తారు. అందరికీ లభించిందా? ఎవరు మిగిలిపోలేదు కదా? వెనుక ఉన్న వారికి లభించిందా? మాతలకి లభించిందా? ఇదే పరమాత్మ యొక్క ప్రేమ, ప్రేమకు గుర్తు ఏమిటి? జీవితంలో ఏది అయితే కావాలో, దానిని ఎవరైనా ఎవరికైనా ఇస్తే అదే ప్రేమకు గుర్తు. అలాగే బాబా యొక్క ప్రేమకు గుర్తు - జీవితంలో ఏవైతే కావాలో ఆ అన్ని కోరికలనూ పూర్తి చేస్తున్నారు. సుఖం, శాంతి అయితే కావాలి కదా! ఏ వస్తువునైనా పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నప్పుడు దాని ద్వారా సుఖం లభిస్తుంది కదా? కానీ బాబా నుఖాన్ని ఇవ్వటమే కాదు, సుఖం యొక్క భండారాగా మిమ్మల్ని తయారు చేసేస్తున్నారు. సుఖం యొక్క భండారా (ఖజానా) ఉంది కదా? స్టాకు అంతా ఉందా? లేక ఒకటి, రెండు గదులు ఉన్నాయా? భండారా ఉన్నదా? ఎలా అయితే బాబా సుఖ సాగరుడు, నది లేదా కాలువ కాదు. కనుక పిల్లలను కూడా సుఖం యొక్క భండారాకి యజమానిగా తయారు చేస్తున్నారు. ఏ సుఖం అయినా లోటుగా ఉన్నదా? ఏదైనా అప్రాప్తి ఉన్నదా? లేదా? కొంచెం శక్తి ఇవ్వు బాబా... అని మరలా అనకూడదు. అన్నీ ఇచ్చేశారు, కనుక ఇవ్వు అని అడగనవసరం లేదు. బాబా అయితే ఇచ్చేశారు. కానీ కేవలం వాటిని కార్యంలో ఉపయోగించే విధి కావాలి. ఆ విధులు కూడా బాబా ద్వారా అనేక రకాలైనవి లభించాయి. కానీ వాటిని సమయానుసారం కార్యంలో వినియోగించడం లేదు. అందువలన అవి ఉన్నా కూడా వాటి ద్వారా లాభం పొందలేకపోతున్నారు. ఎంత గొప్ప భాగ్యం మరియు ఎంత సహజంగా లభించింది! ఏదైనా శ్రమ చేశారా? ఒంటి కాలిపై నిల్చోవలసిన అవసరం లేదు కదా? ఒక్క సెకను దర్శనం కోసం క్యూలో నిల్చోలేదు కదా? విశ్రాంతిగా కూర్చున్నారు కదా? క్రింద అయినా కానీ పరుపుపై కూర్చున్నారు. హాయిగా విశ్రాంతిగా సహజంగా శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఈ నషా ఉన్నది కదా? అందరూ నషాతో అంటారు కదా - భాగ్య విధాత మా వారు అని. భాగ్యవిధాతే మీ వారిగా అయినప్పుడు భాగ్యం ఎవరికి ఇస్తారు? 

భాగ్య విధాతను మీ వారిగా చేసుకున్నారు అంటే భాగ్యం యొక్క అధికారాన్ని పొందినట్లే. ఎవరికి అయితే నషా ఉంటుందో వారు సదా ఏమి అసుభవం చేసుకుంటారంటే నాకు కాకపోతే భాగ్యం ఇంకెవరికి ఉంటుంది అని. ఎందుకంటే భాగ్య విధాతయే నావారు. ఇంత నషా ఉన్నదా? లేక నషా ఒకసారి ఎక్కుతూ, ఒక్కొక్కసారి దిగుతూ ఉందా? సంగమయుగ సమయమే ఎంత తక్కువ? ఇంకా ఎక్కువ సమయం ఉన్నదా? ఎక్కువమంది క్రొత్తవాళ్ళు. ఎంత కొంచెం సమయం లభించింది. కానీ డ్రామాలో ఈ సంగమయుగం యొక్క విశేషత ఏమిటంటే ఎవరైనా క్రొత్తవాళ్ళు అయినా, పాతవాళ్ళు అయినా, క్రొత్తవారు కూడా ముందు నెంబరు తీసుకోవడానికి స్వర్ణిమ అవకాశం ఉన్నది. అంత ఉల్లాసం క్రొత్త వాళ్ళలో ఉన్నదా? లేక మాకంటే ముందు చాలా మంది ఉన్నారు, మేము వచ్చినదే ఇప్పుడు అని ఆలోచిస్తున్నారా? అలా ఏమీ లేదు. ఎంత ముందుకి వెళ్ళాలంటే అంత ముందుకి వెళ్ళవచ్చు, అందరికీ అవకాశం ఉన్నది. కానీ అభ్యాసంపై ధ్యాస ఉండాలి. కొంతమంది పాతవాళ్ళు సోమరిగా అయిపోతున్నారు. మీరు సోమరిగా కాకపోతే ముందుకి వెళ్ళిపోతారు. నెంబర్ తీసుకుంటారు. తీసుకోవాలి కదా? ఫస్ట్ నెంబర్ కాదు, ఫస్ట్ డివిజన్. మొదటి నెంబర్ అయితే బ్రహ్మాబాబాకి నిర్ణయం అయిపోయింది. కానీ మొదటి తరగతిలోకి ఎంతమంది కావాలంటే అంతమంది రావచ్చు. అందరూ ఏ తరగతిలోకి వస్తారు? మొదటి తరగతియేనా? అందరూ మొదటి తరగతిలోకి వచ్చేస్తే రెండవ తరగతిలోకి ఎవరు వస్తారు? ఎవరూ లేరా? మాతలు దేనిలో వస్తారు? మొదటి తరగతిలోకి వస్తారా? చాలా మంచిది. తప్పకుండా రావలసినదే అనే ఈ దృఢనిశ్చయం భాగ్యాన్ని నిశ్చితం చేస్తుంది. వస్తానో, రానో తెలియదు. కొంచెం ముందుకి వెళ్ళేసరికి మాయ వస్తుందేమో, మాయ చాలా చతురమైనది కదా!...ఇటువంటి వ్యర్థ సంకల్పాలు ఎప్పుడూ చేయకూడదు. సర్వశక్తివంతుడు తోడుగా ఉన్నప్పుడు, ఆ తోడు ముందు మాయ కాగితం పులి వంటిది. అందువలన భయపడవద్దు. వస్తానో, రానో తెలీదు అనే సంకల్పాలు ఎప్పుడూ చేయరాదు. మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అయ్యి ప్రతీ కర్మ చేసుకుంటూ వెళ్ళండి. నాలెడ్జ్ ఫుల్ యే కదా? ఇప్పుడు అయితే అందరూ అవును అంటున్నారు, కానీ ఇలాగే అవినాశిగా ఉండాలి. 

బాబా తోడు యొక్క అనుభవం సదా సహజంగా మరియు రక్షణగా ఉంచుతుంది. తోడుని మరచిపోతున్నారు. అందువలనే కష్టం అవుతుంది. వెంటే ఉంటాము, వెంటే వెళ్తాం అని అందరు ప్రతిజ్ఞ చేసారు కదా? లేక ఒంటరిగా ఉంటారా, ఒంటరిగా వెళ్తారా? కనుక బాబా తోడు యొక్క అనుభవాన్ని పెంచుకోండి. బాబా తోడు అని తెలుసు మరియు అంగీకరిస్తున్నారు కూడా, కానీ తేడా ఏమి వస్తుంది? తెలుసుకున్నారు మరియు అంగీకరిస్తున్నారు కూడా కానీ సమయానుసారంగా నడవటం లేదు. మాయ యొక్క ఫోర్స్ ఈ కోర్సుని మరపింపచేస్తుంది. కానీ మాయ చాలా బలమైనదా ఏమిటి? మాయ బలమైనదా లేక మీరు బలమైనవారా? లేక ఒక్కొక్కసారి మాయ బలమైనదిగా, ఒక్కొక్కసారి మీరు బలమైనవారిగా ఉంటున్నారా? మీ బలహీనతయే మాయ, మరేమీ కాదు. మీ బలహీనతయే మాయగా మీ ఎదురుగా వస్తుంది. ఎలా అయితే శరీరం యొక్క బలహీనత రోగంగా వస్తుందో అలాగే ఆత్మ యొక్క బలహీనతయే మాయ రూపంలో ఎదుర్కుంటుంది. కనుక బలహీనంగా అవ్వకండి, అప్పుడు మాయ రాదు. మీ లక్ష్యమే మాయాజీత్, జగత్ జీత్ గా అవ్వడం. ఈ లక్ష్యం ఉంది కదా? ఎన్నిసార్లు విజయీ అయ్యారు? లెక్కలేనన్నిసార్లు అయ్యారు, అయినా కానీ భయపడిపోతున్నారు. ఏదైనా క్రొత్త విషయం అయితే ఇది క్రొత్త విషయం కనుక నాకు తెలియదు. అందువలనే భయపడ్డాను అని అనుకోవచ్చు. కానీ, ఒకవైపు మేము అనేక సార్లు విజయీ అయ్యాము అని అంటున్నారు మరలా ఎందుకు భయపడుతున్నారు? బాబాకి ఎంత ప్రేమ ఉంటుంది అంటే ప్రతీ ఒక్క బిడ్డ శ్రేష్ట ఆత్మగా అయ్యి రాజ్యాధికారిగా అవ్వాలి అని అనుకుంటారు. రాజ్యా ధికారిగా అవ్వాలి కదా? ప్రజాధికారిగా కాకూడదు కదా? రాజ్యాధికారి అంటే ప్రతీ కర్మేంద్రియాన్ని జయించినవారు. ఒకవేళ మీ కర్మేంద్రియాలపై మనస్సు, బుద్ధి, సంస్కారాలపై విజయీగా కాకపోతే ఇక ప్రజలపై రాజ్యం ఏమి చేస్తారు? తమపై తాము విజయం సాధించలేని వారు రాజుగా అయిపోతే సత్యయుగం కూడా కలియుగం అయిపోతుంది. అందువలన మనస్సు, బుద్ధి, సంస్కారాలు అదుపులో ఉన్నాయా అని పరిశీలించుకోండి. మనస్సు మిమ్మల్ని నడిపిస్తుందా లేక మీరు మనస్సుని నడిపించేవారా? ఈరోజు నా మనస్సు ఏకాగ్రం కావటం లేదు, భ్రమిస్తూ ఉంది అని ఫిర్యాదు చేసినట్లయితే అది మనస్సును జయించినట్లు అయ్యిందా? ఈ రోజు మనస్సు ఉదాసీనంగా ఉంది, ఈరోజు మనస్సు ఇతర ఆకర్షణలోకి వెళ్ళిపోతుంది... ఇవి విజయీల సంకల్పాలేనా? స్వయంపై విజయం పొందలేనివారు విశ్వంపై విజయం ఎలా పొందుతారు? అందువలన కర్మేంద్రియాలను, మనస్సును ఎంతవరకూ జయించాను అని పరిశీలించుకోండి. ఒకవేళ మొదటి తరగతిలోకి రావాలంటే ఈ లక్షణాలతో లక్ష్యాన్ని పొందగలరు. 

బాప్ దాదా చూసారు - పిల్లలు ఉత్సాహ ఉల్లాసాలలో కూడా ఉంటున్నారు. జ్ఞాని జీవితం మంచిగా అనిపిస్తుంది. జ్ఞానం వినటం మరియు వినిపించటంలో కూడా మంచిగా ముందుకు వెళ్తున్నారు. కానీ నడుస్తూ, నడుస్తూ బలహీనత వచ్చేస్తుంది. దానికి కారణం ఏమిటి? విశేష కారణం ఏమిటంటే - ఏదైతే చెప్తున్నారో లేక వింటున్నారో, ఆ ఒక్కొక్క గుణం లేక శక్తి యొక్క జ్ఞానం యొక్క పాయింట్స్ యొక్క అనుభవం తక్కువగా ఉంది. మొత్తం రోజంతటిలో స్వయానికి లేదా ఇతరులకి ఎన్నిసార్లు చెప్తున్నారు - నేను ఆత్మను, మీరు ఆత్మ, శాంతి స్వరూపులు, సుఖ స్వరూపులు... ఇలా ఎన్నోసార్లు స్వయం అనుకుంటున్నారు మరియు ఇతరులకు చెప్తున్నారు. కానీ నడుస్తూ, తిరుగుతూ ఆత్మిక అనుభూతి, జ్ఞాన స్వరూపం, ప్రేమ స్వరూపం, శాంతి స్వరూపం యొక్క అనుభూతి తక్కువగా అవుతుంది. వినటం మరియు చెప్పటం ఎక్కువగా ఉంది. అనుభూతి తక్కువగా ఉంది. అన్నింటికంటే గొప్ప అధికారం - అనుభవం, అనుభవంలో లీనం అయిపోండి. శాంతి స్వరూపులు అని చెప్తున్నప్పుడు, ఆ స్వరూపంలో స్వయం మరియు ఇతరులు కూడా శాంతిని అనుభవం చేసుకోవాలి. ఇలా అనుభవం యొక్క అధికారం తక్కువగా ఉంది. ఒక్కొక్క గుణం గురించి వర్ణిస్తున్నారు, శక్తుల గురించి వర్ణన చేస్తున్నారు. కానీ ఆ శక్తి లేదా గుణం సమయానికి అనుభవంలోకి రావాలి.సహనశక్తిని ధారణ చేయాలి, సహనశీలత మంచిది అని కొంతమంది అంటూంటారు కూడా కానీ అనుభూతి ఉండదు. అనుభూతి లోపంగా ఉన్న కారణంగా ఎంత కావాలనుకుంటున్నారో అంత పొందలేకపోతున్నారు. ఎంత పురుషార్థం ఉండాలో అంత ఉందా? అంటే అందరినీ అడిగితే కొద్దిమందే ఉంది అని అంటారు. ఎంత లభిస్తుందో అంత జీవితంలో లేదా కర్మలో అనుభవం అవ్వాలి. కేవలం ఆలోచనలో మాత్రమే అనుభవం అవ్వటం కాదు కానీ నడవడికలో, కర్మలో, శక్తులు మరియు గుణాలు స్వయానికి మరియు ఇతరులకు కూడా అనుభవం అవ్వాలి. జ్ఞాన స్వరూపం అని అంటూ ఉంటారు కదా? స్వరూపులే కదా? అయితే ఆ స్వరూపం కనిపించాలి కదా? స్వరూపం అనేది సదా ఉంటుంది. అప్పుడప్పుడు ఉండదు. అజ్ఞాన కాలం యొక్క జీవితంలో కూడా చూడండి. ఎవరికైనా క్రోధం అనేది స్వరూపంగా ఉంటే ఏ విషయం జరిగినా ఆ స్వరూపం కనిపించేస్తుంది, దాగదు. అది చిన్న విషయం అయినా, పెద్ద విషయం అయినా కానీ ఎవరికి ఏ స్వరూపం ఉంటుందో అది కనిపించేస్తుంది. స్వయానికి కూడా అనుభవం అవుతుంది మరియు ఇతరులకూ అనుభవం అవుతుంది. వీళ్ళు ఎప్పుడూ కోపంగానే ఉంటారు. వీళ్ళ సంస్కారమే కోపం అని అంటారు కదా! అంటే సంస్కారం అనేది కనిపిస్తుంది కదా! అలాగే ఈ జ్ఞాన స్వరూపం, సుఖస్వరూపం, శాంతి స్వరూపం అనుభవం అవ్వాలి. అనుభవీ మూర్తులుగా అవ్వటమే శ్రేష్ట పురుషార్థానికి గుర్తు. అందువలన అనుభవాన్ని పెంచుకోండి. ఏది అన్నారో అది అనుభవం చేసుకోవాలి. ఒకవేళ అనుభవం అవటం లేదు అంటే దానికి కారణం ఏమిటంటే సమయానుసారంగా ఏదైతే విధి లభిస్తుందో ఆ విధిపై ధ్యాస తక్కువగా ఉంటుంది. వాటిని రివైజ్ చేయడంలేదు. ఎంతెంత జ్ఞానాన్ని, గుణాలను, శక్తులను రివైజ్ చేస్తూ ఉంటారో, అంతంత సహజంగా అనుభవం అవుతుంది. రివైజ్ చేయడం లేదు. అందువలన అనుభవం కూడా తక్కువగా ఉంటుంది. వినటం అయితే చాలా మంచిగా విన్నారు. కానీ నడుస్తూ, తిరుగుతూ వాటిని రివైజ్ చేసుకోవాలి. బయట ప్రపంచం వాళ్ళు అంటారు కదా కర్మయే యోగం అని. కర్మ మరియు యోగం వేరు అని అంగీకరించరు. కర్మయే యోగం అని భావిస్తున్నారు. కర్మతో యోగం జోడించడాన్నే కర్మయోగం అని భావిస్తారు. కానీ కర్మ మరియు యోగం రెండింటి సమానత ఉండాలి. కర్మలో బిజీగా ఉండటం యోగం కాదు. కర్మ చేస్తూ యోగాన్ని అనుభవం చేసుకోవాలి. కర్మలో బిజీ అయిపోతే కర్మయే శ్రేష్టం అవుతుంది కానీ యోగం వేరు అయిపోతుంది. నడుస్తూ నడుస్తూ ఈ సోమరితనమే వచ్చేస్తుంది. కనుక కర్మలో యోగం యొక్క అనుభవం అవ్వాలి. వారినే కర్మయోగి అంటారు. ముఖ్య విషయం - అనుభవీ స్వరూపంగా అవ్వండి. ఒక్కొక్కగుణం యొక్క అనుభవంలో లీనం అవ్వండి, శక్తి స్వరూపంగా అవ్వండి. మీ స్వరూపం ద్వారా శక్తులు కనిపించాలి. ఇప్పుడు కూడా చూడండి. ఒకవేళ ఎవరిలోనైనా ఏ శక్తి అయినా విశేషంగా ఉంటే దాని గురించి ఏమి అంటారు? వీరు చాలా సహనశీల స్వరూపులు, వీరిలో ఇముడ్చుకునే శక్తి చాలా కనిపిస్తుంది. కొందరిలో కనిపిస్తుంది, కొందరిలో కనిపించదు. ఒకొక్కసారి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కనిపించడం లేదు అంటే ధ్యాస తక్కువగా ఉన్నట్లే కదా? అందువలన ప్రతీ శక్తి, ప్రతీ గుణం, ప్రతీ జ్ఞానం యొక్క పాయింట్ ని మీ స్వరూపంలో అనుభవం అవ్వాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ముందు స్వయానికి అనుభవం అయినప్పుడు. స్వయం అనుభవీగా అయితే దాని ద్వారా స్వతహాగా ఇతరులకు అనుభవం అవుతుంది. అలా ఉన్నారా? స్వరూపంలో కనిపిస్తుందా? ఒక్కొక్కసారి కనిపిస్తుందా లేక సదా కనిపిస్తుందా? అనుభవం చేసుకుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. ఒక్క సెకను అయినా గానీ ఏదైనా గుణం లేక శక్తి అనుభవం అయితే ఎంతగానో సంతోషం పెరుగుతుంది కదా? అయితే సదా అనుభవీ స్వరూపం అయిపోతే ఎలా కనిపిస్తారు? సదా అదృష్టవంతులుగా కనిపిస్తారు. సదా ముఖంలో సంతోషం యొక్క మెరుపు, అదృష్టం యొక్క మెరుపు అనుభవం అవుతుంది. అందువలన అనుభవాన్ని పెంచండి. విధి అయితే స్పష్టంగా ఉంది కదా? మంచిది. అందరూ అదృష్టవంతులే విశేషమైన సంతోషాన్ని జరుపుకోవటానికి వచ్చారు, అందరికీ సంతోషం లభించిందా? అందరూ విశ్రాంతిగా ఉన్నారు కదా? మనస్సు విశ్రాంతిగా ఉంటే తనువుకు కూడా విశ్రాంతి లభిస్తుంది. స్థానాన్ని ఎంత పెంచినా గానీ అది తక్కువ అవ్వాల్సిందే. ఇది నిర్ణయించబడి ఉన్నది దానిని ఏమి చేస్తారు. మంచిది, రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఎక్కడ ఎలా కూర్చోబెడితే అలా కూర్చుంటాం, ఎక్కడ పడుకోబెడితే అక్కడ పడుకుంటాం అనే ప్రతిజ్ఞ యొక్క రిహార్సల్ ( ప్రయత్నం) జరుగుతున్నాయి. పట్టాపై పడుకోవడం బావుందా? పట్టారాజుగా అయిపోయారు కదా? శాస్త్రాలలో కూడా పట్టపురాణీ, పట్టపురాజుగా మహిమ చాలా గొప్పగా ఉన్నది. మీరు అయితే చాలా సహజంగా అయిపోయారు. ఏదైనా కష్టం ఉన్నదా? బాప్ దాదా మరియు నిమిత్త ఆత్మలు ఇదే ఆలోచిస్తున్నారు - అందరూ విశ్రాంతిగా ఉండాలి అని. కానీ ఇంత ఎక్కువ సంఖ్యలో కూడా విశ్రాంతిగా ఉంటున్నారంటే సంతోషకరమైన విషయం. ఎక్కడ ఉన్నా కానీ అక్కడ సంతోషంగా ఉన్నారు కదా? ఏ కష్టం లేదా? మరికొంతమందిని పిలువమంటారా? ఎవరు రావాలి అనుకుంటున్నారో వాళ్ళంతా వచ్చేయండి అని సూచన వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఏమి చేయాల్సి వస్తుంది? అఖండ తపస్సు చేయాల్సివస్తుంది. సంతోషం యొక్క భోజనం తినాలి మరియు అఖండ యోగం చేయాలి. అప్పుడు అందరూ రావచ్చు కదా! చేస్తారా? అలసిపోరు కదా? ఆకలి అనిపించదా? ఏడు రోజులు తినకుండా ఉంటారా? ఏడురోజులు భోజనం ఉండదు. బాప్ దాదా ఇలాగే హఠంగా ఉంచాలి అని అనుకోవడం లేదు. సహజయోగులు కదా! 

పరమాత్మ మిలనం యొక్క భాగ్యం తక్కువైనది కాదు. పరమాత్మ కలయిక యొక్క శ్రేష్టభాగ్యం కోట్లలో కొద్దిమంది ఆత్మలకే లభిస్తుంది. మంచిది. మీకు అయితే లభించింది కదా? భక్తులు జడ చిత్రాలతో కలుసుకుంటారు. కానీ ఇక్కడ చైతన్యంలో తండ్రి పిల్లలతో కలుసుకుంటున్నారు మరియు ఆత్మిక సంభాషణ కూడా చేస్తున్నారు. అయితే ఈ భాగ్యం తక్కువైనదా? అయినా కానీ మీరందరూ అదృష్టవంతులు, సమయం యొక్క వేగం మారిపోతూ ఉంది. ఇప్పుడు అయితే విశ్రాంతిగా కూర్చుని వింటున్నారు. ఇంకా ముందుకు వెళ్ళేకొలదీ వృద్ధి అవుతుంది. అప్పుడు ఇది కూడా మారిపోతుంది కదా? అందువలన మీరందరూ కూడా అదృష్టవంతులు. బాగా ఆలస్యం యొక్క సమయంలో రాలేదు. కొంచెం ఆలస్యం యొక్క సమయానికి వచ్చేసారు. అందరూ సంతోషమే కదా? అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంది?మంచిది, ఎవరికి అయినా తక్కువ సంతోషం ఉందా? తక్కువ సంతోషం ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 

నలువైపులా ఉన్న సర్వశ్రేష్ట భాగ్య విధాత యొక్క భాగ్యవాన్ ఆత్మలకు సదా మాయాజీత్, జగత్ జీత్ యొక్క నిశ్చయం మరియు నషాలో ఉండేవారికి సదా ప్రతి గుణం మరియు శక్తి, జ్ఞానం యొక్క అనుభవీ ఆత్మలకు, సదా బాబాని తోడు ఉంచుకునే కంబైండ్ స్వరూప ఆత్మలకు, సదా శ్రేష్ట భాగ్య రేఖని సహజంగా శ్రేష్టంగా తయారు చేసుకునే ఆత్మలకి, అతి సమీప మరియు శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు సమస్తే.

Comments