14-12-1994 అవ్యక్త మురళి

      14-12-1994         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సమయం - సంకల్పం - మాట ద్వారా సంపాదనను జమ చేసుకునేటందుకు ఆధారం మూడు బిందువులు పెట్టడం.

ఈరోజు బాప్ దాదా ఏ సభలోకి వచ్చారు? ఈ సభ అంతా ఏ ఆత్మలది? బాప్ దాదా చూస్తున్నారు - ప్రతీ ఒక్కరూ ఉన్నతోన్నతులు, ధనవంతులు. ప్రపంచం వాళ్ళు అంటారు - ఈ ప్రపంచంలోని ధనవంతులు అని, కానీ మీరందరు అయితే కల్పమంతటిలోనే ధనవంతులు. ఈ సమయంలో జమ చేసుకున్న ఖజానాయే మొత్తం కల్పం అంతా మన వెంట వస్తుంది. ఈ జన్మలో నేను ధనవంతంగా ఉన్నాను, ఇక ముందు అనేక జన్మలలో కూడా అందరి కంటే ధనవంతంగా ఉంటాను అని ఆలోచించే వారు మొత్తం కల్పంలో ఎవరూ ఉండరు. వచ్చే ఇంకొక జన్మకు కూడా గ్యారంటీ ఉండదు. కానీ మీరు నిశ్చయం మరియు నషాతో అంటున్నారు - మా యొక్క ఈ ఖజానా అనేక జన్మలకి వస్తుంది. గ్యారంటీ ఉంది కదా! లేక కేవలం ఒక జన్మయే ఉంటుందా! ఇటువంటి ధనవంతులని కల్పమంతటిలో ఎవరినైనా చూసారా లేక విన్నారా? కాబట్టి ఈ రోజు బాప్ దాదా తన యొక్క చక్రవర్తులకు చక్రవర్తి, రాజులకు రాజా అయినటువంటి పిల్లలను చూస్తున్నారు. ఒక్కొక్క రోజులో ఎంత సంపాదన జమ చేసుకుంటున్నారు లెక్క తీయండి. జమాఖాతా ఎంత తీవ్రవేగంతో పెరుగుతుంది. పెరుగుతుంది కదా? మరియు పెంచుకునే సాధనం కూడా ఎంత సహజమైనది! ఏదైనా శ్రమ ఉన్నాదా? లేదు. మీ సంపాదన లేదా జమాఖాతా పెంచుకునేటందుకు అన్నింటికంటే సహజ సాధనం - బిందువు పెట్టుకుంటూ వెళ్ళండి మరియు పెంచుకుంటూ వెళ్ళండి. మీరు కూడా బిందువు, బాబా కూడా బిందువు, డ్రామాలో జరిగిపోయిన విషయాలను బిందువు పెట్టాలి. కనుక సంపాదనకి ఆధారం - బిందువు పెట్టడం, అంతే మరేమీ లేదు. కేవలం బిందువు పెట్టడమే. ఏమిటి? ఎందుకు? ఎలా? ఈ ప్రశ్నార్థాకాలు, ఆశ్చర్యార్థకాల అవసరం లేదు. ఎందుకంటే మాస్టర్ నాలెడ్జ్ పుల్ అయిపోయారు. ఎలా అనే మాట ఇలా అనే దానిలోకి మారిపోయింది. ఎలా? అని కాదు, ఇలా అని అనాలి. మారిపోయిందా? లేక ఇప్పుడు కూడా ఎలా? ఎలా? అని అంటున్నారా? “ఏమో తెలియదు” అనే మాట సంకల్పంలో కూడా మారిపోయింది. త్రికాలదర్శి అయినవారు ఏమో తెలియదు అనేది స్వప్నంలో కూడా ఆలోచించరు. కనుక ఇక నోటితో మాట్లాడవలసిన అవసరమే ఉండదు. సంగమయుగంలో మొత్తం ఆట అంతా మూడు బిందువుల పైనే ఉన్నది. అన్నింటికంటే సహజమైనది ఏమిటి? బిందువు కదా? లేక ప్రశ్నార్థకం సహజమా? బిందువు సహజం కదా? బిందువు పెట్టడంలో ఎంత సమయం పడుతుంది? సెకను కంటే తక్కువ సమయం పడుతుంది, మరి బిందువు పెట్టడం వస్తుందా? లేక కలం జారిపోతుందా? ఒక్కొక్కసారి కలం జారిపోయి బిందువు బదులు పెద్ద రేఖ గీసేస్తుంది. బిందువు పెట్టడం ద్వారా ఒక్క సెకనులో మీకు ఎన్ని ఖజానాలు జమ అవుతాయి. ఖజానాల జాబితా అయితే తెలుసు కదా? ఖజానాల యొక్క జాబితా తెలుసు కదా? లేక మరచిపోతున్నారా? ఒకవేళ బిందువుకి బదులు ఏ గుర్తు అయినా పెడితే లేదా పడిపోతే, పెట్టాలి అని అనుకోవడం లేదు కానీ పడుతున్నాయి అంటే ఆలోచించండి - జ్ఞాన ఖజానా పోయింది, శక్తుల ఖజానా పోయింది, గుణాల ఖజానా పోయింది. సంకల్ప ఖజానా పోయింది, శారీరకశక్తి ఖజానా పోయింది. శ్వాస సఫలం అవటానికి బదులు అసఫలం అయిపోయింది, సంకల్పం పోయింది, సమయం పోయింది. ఎన్ని పోయాయి! పెద్ద జాబితా అయ్యింది కదా? అందువలన ఒకటి రెండు సెకనులే కదా పోయాయి అని ఆలోచించకండి. కానీ ఆ ఒక్క సెకనులో పోగొట్టుకున్నది ఎంత? ఆ ఒక్క సెకనులో ఎంత బరువుగా అయిపోయారు? ప్రతీ సమయం మీ జమాఖాతాను పెంచుకుంటూ వెళ్ళండి. సంపాదించుకున్నది ఎంత? మరియు పోగొట్టుకున్నది ఎంత? ఈ అన్ని ఖజానాలలో ఎన్ని ఖజానాలు పోగొట్టుకున్నారు? బాప్ దాదా కూడా పిల్లల యొక్క జమాఖాతాను పరిశీలిస్తూ ఉంటారు - చూసి నవ్వుకుంటూ ఉంటారు. నవ్వుకుంటున్నారు అంటే ఏమి చూసి ఉంటారు? నవ్వుకుంటున్నారు. అంటే ఏ విషయం చూసి ఉంటారు? తెలిసినదే. అమృతవేళ కలయిక కూడా జరుపుకుంటున్నారు, ఆత్మిక సంభాషణ కూడా చేస్తున్నారు. ప్రతిజ్ఞలు కూడా చాలా పెద్దవి చేస్తున్నారు. ఇది చేస్తాం, అది చేస్తాం అంటూ చాలా మంచి మంచి విషయాలు చెపుతున్నారు. కానీ నడుస్తూ నడుస్తూ మొత్తం రోజంతటిలో ఏదో ఒక ఖజానాని పోగొట్టుకొంటున్నారు. మరలా ఏమి ఆధారం తయారు చేసుకుంటున్నారు? బాప్ దాదాకి కూడా మంచి మంచి విషయాలను విన్పించటం ప్రారంభిస్తున్నారు. ఒకవేళ వ్యర్థ సంకల్పాలు వచ్చాయి అంటే జమా అయినట్లా లేక పోగొట్టుకున్నట్లా? మరలా ఏ మాటలు మాట్లాడుతున్నారు? కేవలం సంకల్పంలోకి వచ్చింది అంటే అది అయితే సరేపోతుంది. బాబాకి కూడా ధైర్యం ఇస్తున్నారు, పురుషార్థులం కదా! సంపూర్ణం కాలేదు కదా! అయిపోతుంది! అయితే బాప్ దాదా కూడా అంటున్నారు - అయిపోతుంది, అయిపోతుంది అనే పాట రోజంతటిలో ఎక్కువగా వింటున్నారు. కానీ ఇది కూడా ఎంతవరకు? అంతిమంలో సంపూర్ణం అవ్వాలా లేక చాలా కాలం యొక్క అభ్యాసంతో చాలాకాలం యొక్క వారసత్వం పొందాలా? వారసత్వం అవినాశిగా, సంపూర్ణంగా పొందాలి అనుకుంటున్నారా? లేక సగం అయినా పర్వాలేదా? సగం వద్దు కదా? పోనీ పురుషార్ధం సగం చేస్తారా? పురుషార్ధం చేసే సమయంలో చేస్తాం, చూస్తాం, అవుతాం, చేసేస్తాం, అదే అయిపోతుంది ... అని ఆలోచిస్తున్నారు. కానీ ప్రాప్తి సమయంలో ఇలా అంటారా? అనరు కదా? దానిలో అయితే సంపూర్ణ ప్రాప్తి కావాలి, సంపూర్ణ వారసత్వం కావాలి. అందరూ లక్ష్మీ నారాయణులు అంటేనే చేతులు ఎత్తుతారు. లక్ష్మీనారాయణులు కూడా ఎనిమిది మందే సింహాసనాధికారులు అని తెలిసినా కానీ దేనికి చేయి ఎత్తుతారు? లక్ష్మీనారాయణుల్లోనే కదా? లక్ష్మీనారాయణులు అంటే నంబర్ వన్ పాస్ విత్ ఆనర్ అవటం. బాప్ దాదా పిల్లల యొక్క ధైర్యాన్ని చూసి కూడా సంతోషిస్తున్నారు. సీతారాములు అంటే ఎవరూ చేతులు ఎత్తటం లేదు. ధైర్యం చాలా బావుంది. ధైర్యం ఉన్న వాళ్ళకి సహాయం కూడా లభిస్తుంది. పురుషార్ధం యొక్క సమయంలో కూడా ఎలాంటి సంకల్పం బాబా ముందు చేస్తున్నారో వాటిని మాట మరియు కర్మలోకి తీసుకురండి. బాప్ దాదా చూసారు - కొంతమంది పిల్లలు సమయం యొక్క ఖజానాకి ఎంత గొప్పతనం ఇవ్వాలో అంత ఇవ్వటం లేదు. ఒకరోజు యొక్క చార్ట్ పరిశీలించినా గానీ ఎక్కువమంది యొక్క సమయం వ్యర్ధ ఖాతాలో కనిపిస్తుంది. దీనికి కారణం ద్వాపరయుగం నుండి వ్యర్ధం వినేటటువంటి, చూసేటటువంటి మరియు ఆలోచించేటటువంటి అలవాటు అయిపోయింది. కనుక అది వద్దు అని అనుకున్నా గానీ ఆకర్షితం చేసేస్తుంది. ఈ కారణంగా సమయం యొక్క ఖజానా వ్యర్ధ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఒక్క సెకండుకు కూడా ఎంత గొప్పతనం ఉందో ఇంతకు ముందు కూడా చెప్పాను కదా! రెండవ విషయం - ఎక్కువమంది వ్యర్ధమాటల్లో కూడా సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. 

ఒక గంట యొక్క చార్ట్ పరిశీలించండి - ఏ మాటలు అయితే మాట్లాడేమో ఆ ప్రతీ ఒక్క మాటలో ఆత్మిక భావం మరియు శుభభావన ఉన్నదా? ఎందుకంటే మాట ద్వారా భావం మరియు భావన రెండూ అనుభవం అవుతాయి. ఒకవేళ ప్రతీ మాటలో శుభభావన, శ్రేష్టభావన లేకపోతే వాటిలో తప్పక మాయా భావనలు ఉన్నట్లే. అవి చాలా అనేకం ఉంటాయి. తెలుసు కదా? ఈర్ష్య, అసహ్యం, ద్వేషం... ఈ భావనలు ఏదొక శాతంలో నిండి ఉంటున్నాయి. బాప్ దాదా ఒక్కొక్కసారి మాటల యొక్క టేపు రికార్డరు వింటున్నారు. ప్రతీ ఒక్కరి టేపు స్వతహాగానే నిండిపోతుంది. మరియు ఏ ఘడియలోనైనా ఎవరిది వినాలనుకున్నా వినగలరు. ఒక్కొక్కసారి బాబా ఏమి వింటున్నారు? ప్రతీ మాటలో సారం ఉండటం లేదు. ఒక్కొక్కసారి అంటున్నారు నా భావన, నా భావం చెడుగా లేదు కానీ అలా వచ్చేసింది లేదా అలా మాట్లాడేశాను అని కానీ ఏ మాటలో ఆత్మిక భావం మరియు శుభభావన ఉండదో అది ఏ ఖాతాలో జమా అవుతుంది? వ్యర్ధంలోనా లేక సమర్థంలోనా? వ్యర్ధంలోకే వెళ్తుంది కదా! అప్పుడు సంపాదన యొక్క ఖాతా ఎక్కువగా ఉంటుందా లేక పోగొట్టుకునే ఖాతా ఎక్కువగా ఉంటుందా? అలా అయితే పోగొట్టుకున్నట్లే కదా? అందువలన మాటలలో కూడా పోగొట్టుకునే ఖాతా ఎక్కువగా ఉంటుంది. మాటని కూడా పరిశీలించండి. అలా మాట్లాడేశాను - ఆ భాషని మార్చండి. సమర్ధ మాటలు అంటే - ఆ మాటలలో ఏ ఆత్మకి అయినా ప్రాప్తి యొక్క భావం లేదా సారం ఉండాలి. ఒకవేళ సారం లేదు అంటే జమాఖాతా లేనట్లే కదా? బాప్ దాదా చూశారు - ఒక్క రోజులో ఎంత జమా చేసుకోగలరో అంత జమ చేసుకోవటం లేదు. అయితే ఏం చేయాలి? లక్ష్మీ నారాయణులుగా అవ్వవల్సిందే కదా, పక్కాయే కదా? లేక అలా అవ్వకపోయినా పర్వాలేదా? మొదటి జన్మ నుండి శ్రేష్ఠ ప్రాలబ్దం పొందాలా లేక రెండు, మూడు జన్మల నుండి ప్రారంభిస్తారా? కాదు కదా! మొదటి జన్మలోకి రాకుండా రెండవ, మూడవ జన్మలోకి రావటం ఇష్టమేనా? ఇష్టం కాదు కదా? మరి అంతగా జమా ఖాతా ఉందా? జమా ఖాతా ఉందా? జమా ఖాతా తక్కువగా ఉంటే ఏ ప్రాలబ్దం పొందుతారు? ఎంత జమ చేసుకున్నారో అంతే తింటారు కదా! ఈ రోజు బాప్ దాదా అందరి యొక్క జమా ఖాతాని చూశారు. ఇతరులకి సమయం యొక్క గొప్పతనం గురించి చాలా మంచిగా చెప్తున్నారు, సంగమయుగం యొక్క మహిమ ఎంత బాగా చేస్తారు? చేస్తారు కదా! అయితే స్వయం కూడా సదా సమయం యొక్క గొప్పతనాన్ని ఎదురుగా ఉంచుకోండి. సమయానికి ముందు మీ శ్రేష్ట భాగ్యం ఆధారంగా ప్రాప్తుల యొక్క ఖాతాని పూర్తిగా జమా చేసుకోండి. సంగమయుగం యొక్క సమయం యొక్క విశేషత మూడు రూపాల యొక్క ప్రాప్తి - 1. వారసత్వ రూపంలో 2. చదువుని సంపాదనకి ఆధారం అని అంటారు. చదువు యొక్క ప్రాప్తి ఆధారంగా 3. వరదాన రూపంలో. వారసత్వం, సంపాదన మరయు వరదానం కూడా. ప్రాప్తి చాలా పెద్దది మరియు గొప్పది, దానిని సంభాళించుకునేవారిగా అవ్వండి. వారసత్వం కూడా బేహద్, సంపాదన కూడా బేహద్ మరియు వరదానాలు కూడా బేహద్. రోజూ భగవంతుని వరదానం లభిస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ని వరదానాలు ఎవరికీ ఎప్పుడూ లభించవు. కానీ మీరు అయితే అవి మా అధికారం అని అంటున్నారు. వారసత్వంపై మరియు చదువుపై మరియు వరదానంపై ఎంత గొప్ప అధికారం. చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం. ఎందుకంటే మూడు సంబంధాల ద్వారా మూడింటిపై హక్కు పొందారు కదా? అందరూ గర్వంతో చెప్తారు కదా - బాబా నావాడు అని లేక నావాడు కాదు నీ వాడు అని అంటారా? అధికారం ఉంది కదా? మన కోసం బాబా చదివించడానికి వస్తున్నారు అని భావిస్తున్నారు కదా! అంటే చదువుపై అధికారం ఉన్నట్లే కదా! మరియు వరదాత వద్ద ఉన్న వరదానాలు ఉన్నవే ఎవరి కోసం? అంటే ఏమంటారు? నాకోసమే అంటారు కదా? ప్రతీ ఒక్కరూ అనుకుంటారు నా కోసమే వరదాత బాబా ఉన్నారు అని అంటే మూడింటిపై అధికారం ఉంది. చెప్పటంలో అయితే చాలా సాధారణం కదా? అందువలనే ప్రపంచంలోని వారు అనుకుంటారు - ఇది ఏమిటి మరియు వీరు చెప్పేది ఏమిటి? అని. అందువలన అధికారాన్ని సదా స్మృతిలో ఉంచుకుని అడుగు వేయండి. ప్రత్యక్ష రూపంలో ఉంచుకోండి, గుప్త రూపంలో కాదు. మేము అయితే బ్రహ్మకుమారులమే, బాబా వాళ్ళమే కదా అనుకోవటం కాదు. ప్రత్యక్ష రూపంలో మనసు, బుద్ధి, కర్మలో ఉంచుకోండి. మనసులో సంకల్పం రావాలి నేను ఇలాంటి వాడిని అని, బుద్ధిలో స్మృతి స్వరూపంగా ఉండాలి మరియు కర్మలో అధికారం యొక్క నిశ్చయం మరియు నషాతో ప్రతీ కర్మ చేయాలి. అమృతవేళ ప్రత్యక్ష రూపంలో ఉండి రోజంతటిలో గుప్తం అయిపోకూడదు. సదా ప్రత్యక్షంగా ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి. జమాను పెంచండి. తీవ్రవేగంతో పెంచాలి, డీలాగా, నెమ్మదిగా చేయకూడదు. ఎందుకంటే సమయం మాస్టర్ రచయితలు అయిన మీ కోసం ఆగి ఉంది. ఇప్పుడు అయినా కానీ ఆజ్ఞ చేయగానే ప్రకృతి చేయలేదా? ఒకవేళ పంచతత్వాలు అలజడి చేయడం ప్రారంభించాయి అంటే ఏది జరగకుండా ఉంటుంది? జరగడానికి ఎంత సమయం పడుతుంది? అందువలన సమయం, ప్రకృతి మరియు మాయ వీడ్కోలు తీసుకోవటానికి ఎదురు చూస్తున్నాయి. మీరు సంపూర్ణతను ఆహ్వానించండి, అప్పుడు అవి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతాయి. మాయ కూడా చూస్తుంది ఇప్పుడు వీరు ఇంకా తయారు కాలేదు అని అవకాశం తీసుకుంటుంది. ప్రకృతిని ఆజ్ఞాపిస్తారా? పురుషులు తయారు అయితే ప్రకృతి తయారు అయిపోతుంది. ఆజ్ఞాపిస్తారా? లేక జ్ఞాన సరోవరం తయారు అయిన తరువాత చేద్దామా? ఎవరెడీయేనా? లేక రెడీ కానీ ఎవరెడీ కాదా? శక్తులు ఎవరెడీయేనా? సంపూర్ణం అయిపోయారా? కొంచెమే తయారైతే ఎవరెడీ అనరు కదా? ఆలోచించండి లేదా పరిశీలించండి - ఈ ఘడియలో మహా వినాశనం అయిపోతే జ్ఞానమనే దర్పణంలో నేను ఏవిధంగా అవుతాను అని మీ చిత్రాన్ని చూసుకోండి. దర్పణం అయితే అందరి వద్ద ఉంది కదా? పగిలిపోలేదు కదా? స్పష్టంగా ఉంది కదా? అయితే మీ అదృష్ట చిత్రాన్ని చూసుకోండి. అదృష్ట చిత్రాన్ని చూడండి. బాబాకి అయితే ఎంత సమయం పడుతుంది! బ్రహ్మ గురించి మహిమ ఉన్నది కదా - బ్రహ్మ తన సంకల్పం ద్వారా సృష్టి రచించాడు అని, అలాగే సంకల్పం ద్వారా వినాశనం అవ్వదా? బాబాకి తెలుసు రాజధాని తయారవుతుంది, ఆ రాజధానిలో బ్రహ్మ ఒక్కరే ఏమి చేస్తారు? బాబాతో పాటు ఉండేవాళ్ళు కావాలి కదా? అందువలన బ్రహ్మాబాబా కూడా తన తోటి వాళ్ళ కోసం ఆగి ఉన్నారు. బాబా పిల్లలని అడుగుతున్నారు - పిల్లలు అయితే బాబాని చాలా ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు బాబా పిల్లల్ని ప్రశ్నిస్తున్నారు. తారీఖు నిర్ణయించండి అని. అన్ని పనులకు తారీఖు నిర్ణయించుకుంటారు కదా! అలాగే దీనికి కూడా తారీఖు నిర్ణయించండి. దీనికి కూడా ముహూర్తం పెట్టాలి కదా? జ్ఞాన సరోవరం యొక్క తారీఖు నిర్ణయించబడి ఉంది. హాస్పిటల్ యొక్క తారీఖు నిర్ణయించబడింది. అలాగే దీనికి తారీఖు ఏమిటి? ఇది ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? బాబా అయితే చేయరు కదా? బాబా కూడా పిల్లలైన మీ చేతికే ఇచ్చారు. ఏ పని అయినా మీరే చేస్తారా? లేక అన్నీ బాబాయే చేయాలా? కార్యక్రమం తయారు చేస్తారు కదా? తారీకు నిర్ణయించే ప్రోగ్రామ్ తయారు చేయాలి. మంచిది. 

(క్రొత్త పిల్లలను చూస్తూ) మీ అందరికీ ఎంత ప్రేమ ఉంది? ఎవరైతే క్రొత్త వాళ్ళు వచ్చారో మీరంటే అందరికీ ఎంత ప్రేమ ఉంటుందో చూడండి? మొదటి అవకాశం మీకే ఇస్తారు. అందరూ సంతోషమే కదా? మంచిది. ఎన్ని అడుగుల స్థలం లభించింది? రెండు అడుగులా లేక మూడు అడుగులా? రెండు అడుగులు. మూడు అడుగులు కూడా దొరకలేదు. రెండు అడుగులలోనే రాజీ అయిపోయారు కదా? కష్టం ఏమీలేదు కదా? తినటానికి, త్రాగటానికి, అన్నీ మంచిగా లభిస్తున్నాయి కదా? గొప్పగా లభిస్తున్నాయి కదా? మేళాలో ఇంత పాలన ఎవరికీ జరుగదు. చూసారు కదా మేళాలు? అక్కడ ఇలాంటి బ్రహ్మభోజనం, పరమాత్మ ప్రేమ లభిస్తాయా? ఇటువంటి పరమాత్మ, పరివారం లభిస్తారా? అక్కడ లభిస్తారా? చలి వేస్తుందా? వాతావరణం కూడా మిఠాయి తినిపిస్తుంది. అలాగే చలి కూడా వాతావరణం యొక్క మిఠాయి. మిఠాయిని తినాలి కదా! అందరికీ శాలువాలు కానుకగా లభిస్తాయి కదా? ఏ మేళాలో అయినా ఇలాంటి బహుమతి లభిస్తుందా? లభిస్తుందా? లేక ఖాళీగా వస్తారా? మంచిది క్రొత్త వాళ్ళ ఆశ తీరిపోయింది. మధువనం చూసేశారు కదా? మొదట స్వప్నంలో ఉండేది. ఇప్పుడు సాకారం అయిపోయింది. ఎంతగా స్థానాన్ని పెంచినా తక్కువ అవవలసిందే, ఎందుకు? ఆలోచించండి, ఇప్పుడు ఇంకా తొమ్మిది లక్షల మంది వచ్చారా? అంటే మొదటి జన్మ యొక్క సంఖ్యే ఇంకా తయారు కాలేదు, అది అయితే జరగాలి కదా? ఎన్ని ఇళ్ళు తయారు చేస్తారు? ఎన్ని జ్ఞాన సరోవరాలు తయారు చేస్తారు? అందరూ అంటారు, సంఖ్య పెంచండి, సంఖ్య పెంచండి అని, ఎంతగా సంఖ్య పెంచినా, తరువాత సంవత్సరం ఇంకా అంత సంఖ్య అయిపోతారు. అప్పుడు ఏమి చేస్తారు? ఎంత లభిస్తే అంతలో రాజీ అయిపోండి. మేళా కూడా చేయాలి కదా? ఇంత పెద్ద మేళా ఇష్టమేనా? పది వేల మంది నిద్రపోతారు. పెద్ద గుంపు అయిపోదా? మాకు అవకాశం దొరకటం లేదు అని అనుకుంటారు. దాని కోసం వేచి ఉండే ఘడియలు కూడా చాలా ప్రియంగా ఉంటాయి. ఒక సంవత్సరం తరువాత వెళ్ళాలి అని వేచి చూస్తారు కదా? అలా వేచి చూడటంలో పురుషార్ధం ఎంత బాగా నడుస్తుంది ఇక్కడ మిలనం అయిపోయి వెళ్ళిపోతే చూసేశాం కదా అని భావిస్తారు. అప్పుడు ఏమవుతుంది? సోమరితనం వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? రాదా? ఇంకా ముందుకి వెళతారా? డ్రామాలో ఏవి అయితే విధులు తయారైనవో అవి చాలా లాభాన్ని ఇచ్చేవి. ఒక సంవత్సరంలో పక్కా అయిపోతారు కదా? లేకపోతే పచ్చిపచ్చిగా వచ్చేస్తే తిరిగి యుద్ధం చేయాల్సి వస్తుంది. 

ప్రతీ సంవత్సరం మీ మధువనంలో అంతర్జాతీయ మేళాలు ఎన్ని జరుగుతున్నాయి? ఇప్పుడు జరిగే ఈ మేళా కూడా ఏమిటి? అంతర్జాతీయ మేళాయే కదా? దేశ విదేశాలనుండి అన్ని వైపుల వాళ్ళు ఉన్నారు కదా? బయటి ప్రపంచం వాళ్ళు అయితే అయిదు సంవత్సరాలకి ఒక అంతర్జాతీయ మేళా చేస్తే చాలా చేశాం అనుకుంటారు కానీ మదువనంలో ఎన్ని జరుగుతాయి? తెలుసా మీకు? అంతర్జాతీయ మేళా అయిపోయింది. అందరూ సంతోషం. మజా వస్తుంది కదా? కానీ మీ గ్రూప్ వచ్చినప్పుడు రావాలి. ఇప్పుడు వచ్చే పదివేల మందికి టెంట్ అయినా లభిస్తుంది కదా? చివరిలో అయితే ఈ సాధనాలు అన్నీ సమాప్తం అయిపోతాయి. ఆబూలో ఉన్న పర్వతాలన్నింటినీ నిద్రపోయే స్థానాలుగా తయారు చేసుకున్నట్లయితే ఎంతమంది ఉండవచ్చు! 

నలువైపుల ఉన్న ఉన్నత మరియు ధనవంత ఆత్మలకు, ప్రతి ఖజానాతో సంపన్న యజమాని ఆత్మలకు, సదా స్వయాన్ని ఎవరెడీగా తయారు చేసుకునే తీవ్ర పురుషార్ధి ఆత్మలకు, సదా సమయం, సంకల్పం, మాట ద్వారా శ్రేష్ట సంపాదన యొక్క ఖాతాను జమ చేసుకునే అతి సమీప ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments