13-12-1995 అవ్యక్త మురళి

         13-12-1995         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

వ్యర్ధ మాటలు, అలజడి చేసే మాటల నుండి స్వయాన్ని ముక్తులు చేసుకుని మాటలను పొదుపు చేయండి.

ఈరోజు బాప్ దాదా మీ అందరితో పాటు నలువైపుల ఉన్న ఆత్మలని కూడా చూస్తున్నారు. ఆకార రూపంలో నలువైపుల ఉన్న పిల్లలందరు కూడా బాప్ దాదా ఎదురుగా ఉన్నారు. రెండు సభలు ఉన్నాయి. సాకారి మరియు ఆకారి రెండూ పెద్ద సభలే. ఈ రెండు సభల యొక్క పిల్లలని చూసి బాప్ దాదా హర్షిస్తున్నారు. ఎందుకంటే బాప్ దాదా ప్రతి ఒక్కరిని రెండు రూపాలలో చూస్తున్నారు. 1.ప్రతి ఒక్క బిడ్డ మనుష్యాత్మలందరికి పూర్వీకులు, మొత్తం వృక్షానికి పునాది అని. ఎందుకంటే వేర్ల నుండియే వృక్షమంతా వస్తుంది. 2. పెద్ద వారిని కూడా పూర్వీకులు అని అంటారు. సృష్టి ఆదిలో మీకే పాత్ర ఉంటుంది అంటే అందరికంటే పెద్దవారు అందువలనే సర్వాత్మలకి పూర్వీకులు. దానితో పాటు ఉన్నతోన్నతమైన బాబా యొక్క మొదటి రచన బ్రాహ్మణాత్మలైన మీరే. భగవంతుడు ఎలా అయితే ఉన్నతుడో అలాగే అందరికీ పెద్దవారు పూర్వీకులు మీరే. ఇంత మంది పూర్వీకులైన పిల్లలని చూసి బాబా హర్షిస్తున్నారు. మేము పూర్వీకులము అని మీరు కూడా సంతోషిస్తున్నారా? ఆ నిశ్చయం మరియు నషాలో ఉంటున్నారా? అయితే ఈ రోజు బాప్ దాదా పూర్వీకుల యొక్క సభ చూస్తున్నారు. 

బాబా పిల్లలైన మీరందరూ కూడా మాయ నుంచి రక్షించబడ్డారు. పిల్లలుగా అవ్వడం అంటేనే బాబా వారిగా అవ్వటం. మాయ నుండి రక్షించబడి బాబా పిల్లలుగా అయ్యారు. మీరందరు మాయ నుండి రక్షించబడ్డారు కదా! లేక ఒక్కొక్కసారి మాయా చక్రంలోకి వచ్చేస్తున్నారా? చక్రవ్యూహం అనేది ఉంటుంది కదా, దాని నుండి చాలా యుక్తిగా బయటపడాలి. అలాగే మిమ్మల్ని కూడా బంధించే మాయ యొక్క చక్రవ్యూహం ఏదీ లేదు కదా! లేదా ఏమైనా చక్రాలు ఉన్నాయా? వాటి నుండి రక్షింపబడ్డారా? (రక్షించబడ్డాం) ఇక్కడ అవును అంటున్నారు. మరలా అక్కడికి వెళ్ళి కాదు అని అనకూడదు. ఒకసారి చక్రం నుంచి బయట పడే మార్గం లేదా విధి వచ్చిదంటే ఇక మరలా దానిలో చిక్కుకునే విషయమే ఉండదు. మాయని మంచిగా తెలుసుకున్నారు కదా! లేదా ఒక్కొక్కసారి అజ్ఞానులుగా అయిపోతున్నారా? ఇది మాయ అని మాకు తెలియనే తెలియదు అంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ ఉంది, రకరకాల ముఖాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మారిపోతూ ఉంటారు. అలాగే మాయ దగ్గర కూడా మనల్ని చిక్కింపచేసుకోవటానికి చాలా ముఖాలు ఉన్నాయి. దాని దగ్గర మంచి దుకాణం ఉంది. ఏ సమయంలో ఏ రూపం ధారణ చేయాలంటే ఆ రూపం ధారణ చేస్తుంది. తెలిసో లేక తెలియకో చిక్కుకున్నారు అంటే బయటపడటానికి మరలా చాలా సమయం పడుతుంది. సంగమయుగంలో ఒక్క సెకను వ్యర్ధంగా వెళ్ళింది అంటే ఒక్క సెకను కాదు, ఒక సంవత్సరం పోగొట్టుకున్నట్లే. సంగమయుగం ఎంత చిన్నదో ఆలోచించండి. ఇప్పుడు డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నారు మరియు ఈ కొంచెం సమయంలో ఎలా తయారవ్వాలి అంటే అలా, ఏది జమ చేసుకోవాలంటే అది ఇప్పుడే జమ చేసుకోగలరు. బాప్ దాదా చూస్తున్నారు, తయారయ్యే సమయం ఎంత చిన్నది. మరియు మొత్తం కల్పానికి సరిపడనంతగా తయారవుతున్నారు. ఎక్కడ 5000 వేల సంవత్సరాలు ఎక్కడ 60 సంవత్సరాలు ఇక ముందు ఎంత సమయం ఉన్నా వేల సంఖ్యలో అయితే ఉండదు కదా! 

ఈ కొంచెం సమయంలో రాజ్యాధికారిగా అవ్వాలన్నా, ఉన్నత కుటుంబంలోకి రావాలన్నా ఏమి చేయాల్సి ఉంటుంది? సంఖ్య పరంగా చూస్తే సత్యయుగంలో సింహాసనం అనేది అందరికి లభించదు కదా! మొదటి లక్ష్మీ,నారాయణులు సింహాసనంపై కూర్చుంటారు కానీ లక్ష్మీనారాయణుల యొక్క ఉన్నత కుటుంబంలో జన్మ తీసుకున్న వారికి కూడా వారి సమానమైన గౌరవం, స్నేహం లభిస్తాయి. కనుక మొదటి రాజధాని యొక్క ఉన్నత కుటుంబంలోకి వచ్చేవారు కూడా మొదటి నెంబరే. పెద్ద సింహాసనంపై కూర్చోకపోయిన కానీ నెంబర్ వన్ ప్రాలబ్దమే లభిస్తుంది. లేకపోతే త్రేతాయుగం వరకు కూడా మీ అందరికి సింహాసనం లభించదు కానీ అందరికి విశ్వ రాజ్యాధికారి అవ్వాలనే లక్ష్యం ఉంది కదా! లేదా అక్కడ కూడా ఒక దేశానికి రాజుగా అవుతారా? అందువలన మొదటి నెంబర్ ఉన్నత కుటుంబంలోకి రావటం కూడా శ్రేష్ఠపురుషార్థమే. కొందరికి సింహాసనం లభిస్తుంది, మరికొందరికి ఉన్నత కుటుంబం లభిస్తుంది. దీనికి కూడా ఒక గుహ్య రహస్యం ఉంది. 

ఎవరైతే సంగమయుగంలో సదా మరియు స్వతహాగా బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉంటారో, అప్పుడప్పుడు కాదు, ఆది నుండి అంతిమం వరకు కలలో కానీ, సంకల్పంలో కానీ అపవిత్రతని తాకకుండా సదా పవిత్రత యొక్క వ్రతంలో ఉంటారో ఆ శ్రేష్టాత్మలే సింహాసనాధికారిగా అవుతారు. ఎవరైతే నాలుగు సబ్జక్టులలో మంచి మార్కులు తీసుకుంటారో, ఆది నుండి అంతిమం వరకు మంచి నెంబర్లో పాస్ అవుతారో అటువంటి వారినే పాస్ విత్ ఆనర్ అంటారు. మధ్యమధ్యలో మార్కులు తక్కువ అయిపోయి మరలా మేకప్ చేసుకునే వారు కాదు ఆది నుండి నాలుగు సబ్జక్టులలో బాబా మనస్సుకి ఇష్టమైన వారే సింహాసనం పొందగలరు. దానితో పాటు బ్రాహ్మణ పరివారంలో సర్వులకి ప్రియంగా, సర్వులకి సహయోగిగా ఉండాలి, బ్రాహ్మణ పరివారం ప్రతి ఒక్కరు మనస్సుతో గౌరవించాలి. అటువంటి గౌరవనీయులే సింహానాధికారిగా కాగలరు. ఒకవేళ ఈ అన్ని విషయాలలో ఏ ఒక విషయంలో లోటు ఉన్నా వారు నెంబర్ వారీగా ఉన్నత కుటుంబంలోకి వెళ్తారు. వారు ఆదిలో అయినా రావచ్చు, ఎనిమిదవ జన్మలోనైనా రావచ్చు లేదా త్రేతాయుగములోనైనా వస్తారు. సింహాసనాధికారిగా అవ్వాలంటే ఈ అన్ని విషయాలు పరిశీలించుకోండి. సేవలో 100 మార్కులు జమ అయ్యి ధారణాలో 25 శాతమే జమ అయితే ఏమౌతుంది? వారు అధికారి అవుతారా! కొంతమంది పిల్లలు అన్ని సబ్జక్టులలో ముందుకు వెళ్తున్నారు. కానీ ప్రత్యక్ష ధారణలో ఎటువంటి సమయమో ఆవిధంగా స్వయాన్ని మలుచుకోవాలి అటువంటి వారే సత్యమైన బంగారం. అక్కడక్కడ మాయ పిల్లల కంటే తెలివైనదిగా అయిపోతుంది. అది వెంటనే సమయానుసారంగా స్వరూపాన్ని ధారణ చేసేస్తుంది. కానీ పిల్లలు ఎలా ఉన్నారు? బాబా దగ్గరికి అందరి విషయాలు చేరుకుంటాయి కదా! ఒకరు సత్యం, ఇంకొకరు అసత్యం అనుకోండి లేదా రెండు వైపులా ఏదోక లోపం ఉంటుంది కానీ మిమ్మల్ని మీరు పూర్తిగా సత్యంగా భావిస్తున్నారు, ఇతరులను పూర్తిగా అసత్యమైన వారిగా భావిస్తున్నారు, అంటే మీరు సత్యం, వారు అసత్యం అయినా కానీ ఎటువంటి సమయమో, ఎటువంటి వాయుమండలమో చూసుకుని ఆవిధంగా స్వయాన్ని ఇముడ్చుకోవలసి ఉంటుంది, తొలగించుకోవలసి ఉంటుంది, కొన్ని ప్రక్కకు పెట్టవలసి ఉంటుంది కానీ పిల్లలు ఏమంటున్నారంటే ప్రతి విషయంలో ప్రతిసారి మేమే చనిపోయి ఉండాలా అంటున్నారు. చనిపోవటానికి మేము, మజా జరుపుకోవడానికి వచ్చామా అని అంటున్నారు. కానీ సదా చనిపోయే ఉండాలి, ఇలా చనిపోవడం చాలా కష్టం. మరజీవగా అయిపోయారు,ఇదైతే సహజమే. బ్రహ్మాకుమారీ, కుమారులుగా అయిపోయారంటే మరజీవగా అయ్యినట్లేగా! ఇలా చనిపోవటం అయితే చాలా సహజం అయిపోయింది. చనిపోయారు, బ్రహ్మాకుమారీగా అయితే అయిపోయారు. కానీ ఇలా మాటిమాటికి చనిపోవటం అనేది చాలా కష్టం. కష్టమే కదా! చిన్నవారు అంటున్నారు మేమే ఎక్కువగా చనిపోవలసి వస్తుంది అని మరియు పెద్దవారు అంటున్నారు. మేము కూడా చాలా వినవలసివస్తుంది అని. చిన్నవారు సహించవలసి వస్తుంది, పెద్దవారు వినవలసి వస్తుంది. అయితే ఎవరు చనిపోయినట్లు? ఎవరు చనిపోయారు? ఒకరు చనిపోయారా? ఇద్దరు చనిపోయారా? ఇద్దరూ చనిపోతే ఆ విషయం కూడా సమాప్తి అయిపోతుంది, ఆట కూడా సమాప్తి అయిపోతుంది. చనిపోవటం వస్తుందా లేదా కష్టం అనిపిస్తుందా? కొంచెం శ్వాస ఆడుతుందా! కష్టంగా శ్వాస పోతుందా! కష్టం అవుతుందా? మేమే చనిపోవాలా, మేమే మరాలా, మారవలసిన బాధ్యత మాదేనా? అని అంటున్నారు. బాధ్యత అయితే ఇతరులకు కూడా ఉంది కదా అంటున్నారు. నేను ఇంత చనిపోతాను, నువ్వు ఇంత చనిపో అని సగం సగం పంచుకోండి. బాప్ దాదాకి అయితే ఆ సమయంలో చాలా దయ వస్తుంది, కానీ ఇలా చనిపోవడం చనిపోవడమే కాదు. ఇలా చనిపోవడం అంటే సదాకాలికంగా జీవించడం. చనిపోకుండా స్వర్గం లభించదు అని బయటవారు అంటారు కదా! అక్కడ చనిపోతే స్వర్గం లభించదు. కానీ ఇలా చనిపోతే స్వర్గం యొక్క అధికారం తప్పకుండా లభిస్తుంది. అందువలన ఇలా చనిపోవటం అంటే స్వర్గం యొక్క అధికారిగా అవ్వటం. చనిపోవలసి వస్తుంది, చనిపోవలసి వస్తుంది, సహించవలసి వస్తుంది అని భయపడిపోతున్నారు. అందువలనే చిన్న విషయం కూడా పెద్దదిగా అయిపోతుంది. దొంగలు లేరు కానీ దొంగలు వస్తారేమో అనే భయం మీలో ఉందనుకోండి ఏమౌతుంది? ఆ భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది, లేకపోతే బి.పి. పెరిగిపోతుంది. భయంతో అలా జరుగుతుంది కదా! అలాగే ఇక్కడ కూడా భయపడిపోతున్నారు. చనిపోవటం అనేది పెద్ద విషయం ఏమీ కాదు కానీ భయం అనేది ఆ విషయాన్ని పెద్దదిగా చేసేస్తుంది, మరలా మాకు ఏమౌతుందో తెలియటం లేదు అని అంటారు. మరజీవగా అవ్వటంలో భయపడలేదు, ధైర్యంగా, చాలా సంతోషంగా అయ్యారు కదా! అలాగే సంతోషంగా పరివర్తన అవ్వాలి. చనిపోవటం అనే మాటే లేదు. మీరే చనిపోవాలి, చనిపోవాలి అనుకుంటున్నారు. అందువలనే భయపడిపోతున్నారు. వాస్తవానికి ఇది చనిపోవటం కాదు, ధారణా అనే సబ్జక్టులో నెంబర్ తీసుకోవటం. సహించటంలో భయపడకండి, ఎందుకు భయపడుతున్నారు? అసత్య విషయాలలో మేము ఎందుకు సహించాలి అని అనుకుంటున్నారు. కానీ సహించండి అనే ఆజ్ఞ ఎవరు ఇచ్చారు? అసత్యం మాట్లాడేవారు ఇచ్చారా? కొంతమంది పిల్లలు సహిస్తున్నారు. కానీ కష్టంగా సహించటంలో మరియు ప్రేమగా సహించటంలో తేడా ఉంటుంది. ఆ విషయం కారణంగా సహించటం లేదు కానీ బాబా సహనశీలంగా అవ్వండి అని అంటే బాబా ఆజ్ఞ పాటిస్తున్నారు, అయితే పరమాత్మ ఆజ్ఞని పాటించటం అనేది సంతోషకరమైన విషయం, కానీ కష్టమైన విషయం కాదు కదా? కొన్నిసార్లు సహిస్తున్నారు కూడా కానీ కొంచెం కల్తీ అయిపోతుంది. ప్రేమ ఉంటుంది మరియు శ్రమ కూడా ఉంటుంది. ఎలాగైనా సహిస్తున్నారు కదా, అటువంటప్పుడు సంతోషంగా ఎందుకు సహించకూడదు? శ్రమతో ఎందుకు సహిస్తున్నారు! ఆ వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు సహించటంలో శ్రమ అనిపిస్తుంది, బాబా ఎదురుగా వచ్చినప్పుడు బాబా ఆజ్ఞని పాటిస్తున్నాను అని అనుకుంటే ప్రేమగా అనిపిస్తుంది. శ్రమ అనిపించదు. కనుక చనిపోవల్సివస్తుంది అని ఆలోచించకండి. ఈ రోజుల్లో ఇది సర్వసాధారణం అయిపోయింది, చనిపోవలసి వస్తుంది, చనిపోవల్సి వస్తుంది,ఇలా ఎంతవరకు చనిపోయి ఉండాలి? అంతిమం వరకా లేక రెండు సంవత్సరాలా? ఒక సంవత్సరమా? ఆరు నెలలా? ఎంత వరకు చనిపోయి ఉండాలో అంత వరకు మంచిగా చనిపోయి ఉంటాము .... కానీ ఎంత వరకు చనిపోయి ఉండాలి? అంటున్నారు. కానీ ఇది చనిపోవటం కాదు, అధికారం పొందటం. అయితే ఏం చేస్తారు? చనిపోతారా? చనిపోవటం అనే మాటని సమాప్తి చేయండి. చనిపోతున్నాం అని అనుకుంటున్నారు. అందువలన భయం అనిపిస్తుంది. కొంతమంది వారి మృత్యువు విషయం వదిలేయండి కానీ ఇతరుల మృత్యువు చూసి భయపడిపోతారు. అందువలన ఈ మాటని పరివర్తన చేయండి. ఇటువంటి మాటలు మాట్లాడకండి. శుద్ధమైన భాష మాట్లాడండి. బ్రాహ్మణుల డిక్షనరీలో ఈ మాట లేనేలేదు. అసలు ఎవరు మొదలు పెట్టారో తెలియదు. ప్రారంభం అయితే మీలోనే ఎవరో ఒకరు చేస్తారు. మీరు అంటే ఎదురుగా కూర్చున్నవారనే కాదు. బ్రాహ్మణులే ప్రారంభించారు అని అర్ధం. బాప్ దాదా ఉదాహరణకి ఈ ఒక్క మాట చెప్పారు, కానీ రోజంతటిలో ఇటువంటి వ్యర్ధ మాటలు లేదా వేళాకోళం యొక్క మాటలు చాలా మాట్లాడుతున్నారు, మంచి మాటలు మాట్లాడరు, మరలా నా భావం అది కాదు, వేళాకోళంగా అన్నాను అంతే అంటారు. ఇటువంటి వేళాకోళం చేసుకోండి అని మీ బ్రాహ్మణ జీవితం యొక్క నియమాలలో ఉందా? ఎక్కడా వ్రాసిలేదు కదా? వేళాకోళం చేసుకోవచ్చు అని ఎక్కడైనా చదివారా? వేళాకోళం చేసుకోండి కానీ జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా ఉండాలి. కానీ వ్యర్ధంగా వేళాకోళం చేసుకోవటం మీరు వేళాకోళం అనుకుంటున్నారు, కానీ దాని వలన ఇతరుల స్థితి అలజడి అవుతుంది, అలాంటిది వేళాకోళం అవుతుందా లేదా దు:ఖం 
ఇవ్వటం అవుతుందా? 

ఈరోజు బాప్ దాదా చూస్తున్నారు 1. అందరికంటే పూర్వీకులు మరియు 2. అందరికంటే ఉన్నతోన్నతమైన పూజ్య ఆత్మలు మీరే. మొత్తం కల్పంలో మీకు జరిగినట్లు ఎవరికి పూజ జరుగదు అంటే పూర్వీకులు మరియు పూజ్యులు కూడా. పూజ్యులే కానీ నెంబర్ వారిగా ఉన్నారు. బ్రాహ్మణులుగా అయినవారందరికీ తప్పక పూజ జరుగుతుంది కానీ కొందరికి విధిపూర్వకంగా జరుగుతుంది, కొందరికి పని అయిపోవడానికి పూజ చేస్తారు. ఇక్కడ కూడా బ్రాహ్మణులు యోగంలో కూర్చుంటారు, పని అయిపోయింది అనుకుంటారు, కొంచెం నిద్రపోతారు, కొంచెం యోగం చేస్తారు. కొంచెం వ్యర్ధం ఆలోచిస్తారు, కొంచెం శుభం ఆలోచిస్తారు. అంటే ఇది పని అయ్యి పోవడానికి చేసేదే కదా! అలాగే అక్కడ కూడా హారతికర్పూరం వెలిగిస్తారు,పని అయిపోయిందనుకుంటారు. అలాగే ధారణలో కూడా చాలా మంది పని అయిపోవటమే చూసుకుంటారు. ఏదైనా పరిస్థితి వస్తే ఇప్పటికి ఇలా చేసేయండి, తర్వాత చూద్దాం అంటారు. అటువంటి వారి పూజ కూడా పనైపోవడానికే చేస్తారు. కొన్ని లక్షల సాలిగ్రామాలు తయారుచేస్తారు. కానీ ఏం చేస్తారు? విధిపూర్వక పూజ జరుగుతుందా? పనైపోవడానికే చేస్తారు కదా! పైపుతో స్నానం చేయించేస్తారు, తిలకం కూడా కటోరి నింపేసుకుని చిమ్మేస్తారు. అంటే అది ఏమయ్యింది? పనైపోవడానికి చేసినట్లే కదా! పూజ్యులుగా అయితే అందరు అవుతారు. కానీ ఎటువంటి పూజ్యులుగా అవుతారు అనే దానిలో నెంబర్ ఉంటుంది. కొందరికి ప్రతీ కర్మకి పూజ జరుగుతుంది. పళ్ళు శుభ్రం చేసేటప్పుడు కూడా దర్శనం ఉంటుంది. మధురలో అయితే పళ్ళు శుభ్రం చేయడం కూడా చూపిస్తారు. ఏదో పనైపోవడానికి చేసే వారిగా అవ్వకూడదు అలా అయితే పూజ కూడా అదేవిధంగా జరుగుతుంది. 

టీచర్స్ ఏమనుకుంటున్నారు? ముందు కూర్చుంటున్నారు కనుక ముందు నెంబర్ తీసుకోవాలి కదా! తక్కువగా ఉండిపోకూడదు. మేము పూర్వీకులం కూడా మరియు పూజ్యులం కూడా అనే నషా ఉంచుకోండి. ఎంత పెద్దవారిగా ఉంటే అంత పెద్ద బాధ్యత ఉంటుంది. పెద్దవారిగా అవ్వటం అంటే కేవలం సంతోషపడే విషయం కాదు. పేరు ఉన్నతమైనది కనుక పని కూడా ఉన్నతంగా ఉండాలి. టీచర్స్ అందరు సంతోషమేనా? లేక ఇప్పటికి మనస్సులో ఏమైనా కోరికలు ఉన్నాయా? ఏదైనా కోరిక ఉంటే అది మంచిగా అవ్వనివ్వదు కనుక కోరికైనా పూర్తి చేసుకోండి లేదా మంచిగా అయిన అవ్వండి. రెండూ మీ చేతులలోనే ఉన్నాయి. ఈ కోరిక అనేది నీడతో సమానం మీరు ఎండలో వెళ్తున్నప్పుడు మీ నీడ మీ ముందు ఉంటుంది, దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దొరుకుతుందా? మీరు మరలా వెనక్కి తిరిగి వచ్చినా ఆ నీడ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీ వెనుకే వస్తూ ఉంటుంది. అలాగే కోరిక అనేది కూడా తనవైపు ఆకర్పించుకుని ఏడిపిస్తూ ఉంటుంది, ఆ కోరికని మీరు వదిలేసినా అదే మీ వెంటే వస్తుంది. అడుగుతూ ఉండేవారు ఎప్పుడు సంపన్నంగా కాలేరు. ఏమీ అడగటం లేదు అనుకుంటున్నారు కానీ రాయల్ కోరికలు చాలా ఉన్నాయి. రాయల్ కోరిక అంటే ఏమిటో తెలుసు కదా? అల్పకాలికంగా కొంచెం పేరు కావాలి, గౌరవం కావాలి, నా పేరు కూడా విశేషాత్మలలో లెక్కించబడాలి, నా పేరు కూడా పెద్ద అన్నయ్యలలో, అక్కయ్యలలో లెక్కించబడాలి, చివరికి మాకు కూడా అవకాశం కావాలి, ఇవన్నీ రాయల్ కోరికలు. ఇలా ఎంత వరకు అడుగుతూ ఉంటారో అంతవరకు సంతోషం యొక్క ఖజానాతో సంపన్నంగా కాలేరు. ఇటువంటి కోరికల వెనుక లేదా హద్దులోని కోరికల వెనుక పరిగెత్తడం అంటే అది మృగతృష్ణతో సమానం, వీటి నుండి సదా రక్షణగా ఉండండి. చిన్నవారిగా ఉండటం ఏమీ చెడు విషయం కాదు. చిన్నవారు భగవంతునితో సమానం. ఎందుకంటే బాప్ దాదా హృదయంలో మీ నెంబర్ ముందు ఉంటుంది. అల్పకాలిక కోరికల్ని అనుభవం చేసుకుని చూసే ఉంటారు. అవి ఏడిపిస్తాయా? నవ్విస్తాయా? ఏడిపిస్తాయి కదా! రావణుని ఆజ్ఞ ఏడిపించండి అని కానీ మీరు బాబా వారు కదా! బాబా నవ్వించేవారా లేదా ఏడిపించేవారా? 

ఈరోజు బాప్ దాదా విశేషంగా దీనిపై ధ్యాస ఇప్పిస్తున్నారు, వ్యర్ధ మాటలను సమాప్తి చేయండి, అవి మీకు మంచిగా అనిపిస్తున్నాయి కానీ ఇతరులకు మంచిగా అనిపించటం లేదు. కనుక సదాకాలికంగా అటువంటి మాటలను సమాప్తి చేయండి. ఒకవేళ బాప్ దాదా రోజంతటిలో పిల్లల యొక్క మాటలను నోట్ చేస్తే చాలా ఫైల్ తయారవుతుంది. ఈ అపశబ్దాలు, వ్యర్ధశబ్దాలు గట్టిగా మాట్లాడం..... గట్టిగా మాట్లాడటం కూడా ఇతరులని అలజడి చేయడం. నా మాటే పెద్దది అని అనకండి. మాయాజీత్ గా అవ్వగల్గుతున్నప్పుడు మాటలపై విజయం పొందలేరా? ఇతరులని అలజడి చేసే మాటలు, వ్యర్ధ మాటలు మాట్లాడకండి. ఆ విషయం ఉండేది రెండు మాటలలో, కానీ ఆ విషయాన్ని అరగంట వరకు మాట్లాడుతూనే ఉంటారు. ఇలా పెద్దగా మాట్లాడతారు, నాలుగు మాటలలో పనైపోయే విషయాన్ని పన్నెండు, పదిహేను మాటలలో మాట్లాడకండి. మీ యొక్క సూక్తి ఏమిటంటే తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి అని. మేము మాట్లాడాలనుకోవడం లేదు కానీ మా గొంతే పెద్దది అని అనేవారు గొంతులో ఈ స్లోగన్ వేసేసుకోండి. దీని వలన ఏమౌతుంది? మీరు మీ గొడవలో గట్టిగా మాట్లాడుకుంటున్నారు కానీ వచ్చిపోయే వారందరూ వీరు గొంతు పెద్దది అని అనుకోరు, ఇక్కడ ఏమైనా పోట్లాట జరుగుతుందేమో అని అనుకుంటారు. ఇది కూడా డిస్ సర్వీస్ అయ్యింది కదా! అందువలన ఈ రోజు పాఠం చెప్తున్నారు, వ్యర్ధ మాటలు లేదా ఎవరినైనా అలజడి చేసే మాటల నుండి స్వయాన్ని ముక్తులుగా చేసుకోండి. వ్యర్ధమాటల నుండి ముక్తులు అవ్వాలి. అప్పుడు అవ్యక్త ఫరిస్తాగా అవ్వటంలో అది ఎంత సహాయం చేస్తుందో చూడండి. మాటలు, మాటలు,మాటలు మాట్లాడుతూనే ఉంటారు. వాటిని బాప్ దాదా క్యాసెట్ లో నింపి వినిపిస్తే మీకు కూడా నవ్వు వస్తుంది. అయితే ఏ పాఠం పక్కా చేసుకున్నారు? మాటల్ని పొదుపు చేయండి, మీ మాట యొక్క విలువ ఉంచుకోండి. సత్యవచన మహారాజు అని మహాత్ములని అంటారు కదా! అలాగే మీ యొక్క మాట కూడా సదా సత్యవచనంగా అంటే ఏదోక ప్రాప్తిని ఇచ్చే విధంగా ఉండాలి. నడుస్తూ, తిరుగుతూ ఎవరోకరిని వేళాకోళంగా అంటూ ఉంటారు - వీరు పిచ్చివారు, వీరు తెలివి తక్కువవారు... ఇలా ఇంకా చాలా ఉంటాయి. బాప్ దాదా ఇప్పుడు మర్చిపోయారు కానీ ఇంకా వింటూ ఉంటారు. బ్రాహ్మణులైన మీ నోటి నుండి అంటే సత్యవచన మహారాజులైన మీ నోటి నుండి అటువంటి మాటలు రావటం అంటే వారికి శాపం ఇచ్చినట్లు. ఎవరినీ శ్రాపితులుగా చేయవద్దు, సుఖం ఇవ్వండి. యుక్తియుక్త మాటలు మాట్లాడండి, ఉపయోగపడే మాటలు మాట్లాడండి, వ్యర్ధమాటలు మాట్లాడకండి. మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఒక గంటలో మాటల్ని పరిశీలించుకోండి, ఎన్ని మాటలు వ్యర్ధం అయ్యాయి, ఎన్ని సత్యవచనాలైనాయి? అని. మీకు మీ మాట యొక్క విలువ తెలియదు. అందువలన మాట 
యొక్క విలువని అర్ధం చేసుకోండి. 

అపశబ్దాలు మాట్లాడకండి, శుభమాటలు మాట్లాడండి. ఎందుకంటే ఇది చివరి నెల మరియు మొదటి నెలలో డైమండ్ జూబ్లీ ఉంటుంది. మొత్తం సంవత్సరమంతా డైమండ్ గా అవుతారా లేదా 6 నెలలే అవుతారా! మొత్తం సంవత్సరం అంతా అవుతారు కదా! అందువలన బాప్ దాదా డైమండ్ జూబ్లీకి ముందుగానే పిల్లలకు విశేష ధ్యాస ఇప్పిస్తున్నారు. బాప్ దాదా నలువైపుల యొక్క దృశ్యం చూస్తూనే ఉంటారు. రోజంతా చూస్తూ ఉండరు. సెకనులో అన్నీ చూడగలరు. అయితే పాఠం పక్కాయేనా! ముక్తులు అవ్వాలి కదా? లేదా కొంచెం కొంచెం యుక్తులుగా కొంచెం కొంచెం ముక్తులుగా అవుతారా? ప్రతీ ఒక్కరు స్వయాన్ని చూసుకోండి. బాబా వాణీలో చెప్పినా కానీ మాట్లాడేస్తున్నారు అని ఇతరులని చూడకండి. నేను బాబా శ్రీమతాన్ని ఎంత పాటించాను? అని స్వయాన్ని చూసుకోండి. వారు అది చేస్తున్నారు... అని ఇప్పుడు ఒకరికి ఒకరు చూసుకుంటున్నారు. మరి అధికారం లభించే సమయంలో వారు తక్కువ పదవి పొందితే ఆ సమయంలో మీరు కూడా వారి వెంట వెళ్తారా? ఆ సమయంలో వారిని చూస్తారా? అప్పుడు చూడరు కదా! మరి ఇప్పుడెందుకు చూస్తున్నారు? 

మంచిది, అందరు ముక్తులుగా అవుతారు కదా? ఎవరైతే ముక్తులుగా అవ్వటం కష్టం అంటారో వారు చేతులెత్తండి! ఇంతకుముందు చీటీ వ్రాసి ఇమ్మని చెప్పాను కదా! అయితే బాప్ దాదా దగ్గరకి ఫలితం అయితే వచ్చింది, ఇప్పుడు వారు వెళ్ళిపోయారు. కానీ బాప్ దాదా అయితే ఆ పిల్లలకు శుభాకాంక్షలతో పాటు ధైర్యం కూడా ఇస్తున్నారు. కొంతమంది నెలలు కావాలి, కొంతమంది 2 నెలలు కావాలి అని వ్రాసారు. ఎంత కావాలి అని వ్రాసారో అంత లభిస్తుంది. ఎందుకంటే సత్యం చెప్పారు కదా! 

మంచిది, ఇప్పుడు ఒక నెలలో కూడా సగం సమయం అయిపోయింది, ఇక కొద్ది రోజులు మిగిలి ఉన్నాయి. కనుక తప్పకుండా ముక్తులుగా అవ్వాలి. తక్కువలో తక్కువ మొదటి లేదా రెండవ నెంబర్ యొక్క ఉన్నత కుటుంబంలోకి అయితే రండి. మంచిది. ఈ కల్పంలో మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి! వచ్చినవారందరు మేము తీవ్రపురుషార్ధిగా అయ్యి మా జీవితంలో మరియు సేవలో డైమండ్ జూబ్లీ జరుపుకుంటాము అనే ధైర్యం ఉందా? మేము బాబాకి చేసి చూపిస్తాము అనేవారు చేతులెత్తండి! మొదటగా క్రొత్తగా వచ్చినవారు డైమండ్ జూబ్లీ చివరిలో చేస్తాము అనేవారు చేతులెత్తండి! సిగ్గుపడకండి. చేతులెత్తటంలో కొద్దిగా సంకోచిస్తున్నారు. కానీ బాప్ దాదా అటువంటి వారికి కూడా చెప్తున్నారు, ధైర్యంతో చేయలేరా? ధైర్యం పెట్టుకోండి. ధైర్యం ఉంటే కొద్ది సమయంలో కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు. కనుక అవుతామా, లేదా అని బలహీనంగా అవ్వకండి.  

నలువైపుల ఉన్న పూర్వీకులైన ఆత్మలకి, సదా ఈ నిశ్చయం మరియు నషాలో ఉండే శ్రేష్టాత్మలకు, సదా బాబా యొక్క శ్రీమతానుసారంగా ప్రతి కర్మ చేసే కర్మయోగి ఆత్మలకు, సదా ధృడసంకల్పం ద్వారా బాబా యొక్క అడుగులో అడుగు వేసి తండ్రిని అనుసరించే వారికి చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే, డబల్ విదేశీ పిల్లలకి డబల్ నమస్తే. 

Comments