13-03-1998 అవ్యక్త మురళి

           13-03-1998         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

హోలీ అనే మాట యొక్క అర్ధస్వరూపంలో స్థితులవ్వటం అంటే బాబా సమానంగా అవ్వటం.

ఈరోజు బాప్ దాదా తన యొక్క హోలీయస్ట్ (పవిత్రమైన), హైయస్ట్ (ఉన్నతమైన) మరియు రిచెస్ట్ (ధనంతమైన) పిల్లలను నలువైపుల చూస్తున్నారు. సాకారంలో సన్ముఖంగా కూర్చున్నా, దూరంగా కూర్చున్నా మనస్సుతో సమీపంగా ఉన్న నలువైపుల పిల్లలను చూసి బాబా సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ ఎంత పవిత్రంగా అవుతున్నారంటే కల్పమంతటిలో మరెవ్వరూ కూడా ఇటువంటి మహాన్ పవిత్రాత్మగా కాలేదు మరియు కాలేరు కూడా. సమయం అనుసరించి ధర్మాత్మలు, మహానాత్మలు పవిత్రంగా ఉన్నారు కానీ వారి యొక్క పవిత్రత మరియు మీ యొక్క పవిత్రతలో తేడా ఉంది. ఈ సమయంలో మీరు పవిత్రంగా అవుతున్నారు, ఈ పవిత్రత యొక్క ప్రాప్తి లేక ప్రాలబ్దమే భవిష్యత్తులో అనేక జన్మల వరకు తనువు, మనస్సు, ధనం, సంబంధం, సంపర్కం మరియు వెనువెంట ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది. శరీరం కూడా పవిత్రం మరియు ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది - ఈవిధమైన పవిత్రత మీరే పొందుతున్నారు. మనసా, వాచా, కర్మణా మూడూ పవిత్రంగా అవ్వటం ద్వారా ఈవిధమైన ప్రాలబ్దం ప్రాప్తిస్తుంది. ఇటువంటి పవిత్రాత్మలు. స్వయాన్ని ఈవిధమైన పవిత్ర ఆత్మలుగా భావిస్తున్నారా? ఆవిధంగా ఇప్పుడు తయారయ్యారా లేక తయారవుతూ ఉన్నారా? తయారవ్వటం సహజమా లేక కొంచెం కొంచెం కష్టమా? కల్పపూర్వం కూడా తయారయ్యారు మరియు ఇప్పుడు కూడా తయారవ్వాల్సిందే. పక్కాయేనా లేక కొంచెం కొంచెం ఉందా? లేదు. స్వప్నమాత్రపు అపవిత్రత కూడా సమాప్తి అవ్వాల్సిందే. ఈ రోజు తయారవుతున్నాము మరియు రేపు తయారైపోతాం అని ఇంత నిశ్చయం ఉందా! పవిత్రాత్మలు మరియు ఉన్నత ఆత్మలు కూడా! 

ఉన్నతోన్నతమైన బాబా యొక్క పిల్లలు ఉన్నతోన్నతులు. ఉన్నతంగా అవుతున్నారు కనుకే పూజింపబడుతున్నారు. ఈనాటి ఉన్నత ఆత్మలైనా, రాజులు అయినా, ఇప్పుడైతే లేరనుకోండి, ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ అయినా, ముఖ్యమంత్రి అయినా కానీ పూజ్యులు అవ్వరు. పూజ్యులైన మీ ముందు పూజారి అయ్యి నమస్కరిస్తారు లేదా పూజిస్తారు. మీరు ఇప్పుడు కూడా స్వరాజ్యాధికారి అవుతున్నారు, భవిష్యత్తులో కూడా రాజులకు రాజుగా అవుతున్నారు. ఇంత ఉన్నత పదవి పొందుతున్నారు. అంతేకాకుండా విశ్వమంతటిలో ధనవంతులు కూడా. మీ టైటిల్ పదమాపదమ్ పతి (కోటాను కోట్లకు అధిపతి) మీది ఎటువంటి ఖజానా అంటే కోటీశ్వరులు, కోటాను కోటీశ్వరులు అయినా కానీ వారి కోట్లతో ఇటువంటి ఖజానా ప్రాప్తించదు. శ్రేష్ట ఆత్మలైన మీకు బాబా ద్వారా ఎంత భాగ్యం తయారవుతుంది అంటే అడుగులో కోటానుకోట్లు అని వర్ణిస్తారు మరియు అనుభవం కూడా చేసుకుంటున్నారు కదా! అడుగులో కోట్లా, వందలా, లేక వేలా? మిలియనర్స్ కూడా ఇంత సంపాదన చేసుకోలేరు. అడుగు వేయడానికి ఎంత సమయం పడుతుంది? అడుగు వేయండి, ఎంత సమయం పడుతుంది? సెకండు. రెండు సెకండులు అయినా అనండి, ఆ రెండు సెకండ్లలో కోటానుకోట్లు అంటే రోజంతటిలో ఎన్ని కోటానుకోట్లు అయినట్లు! లెక్కించండి. ఒక్క రోజులో ఇంత సంపాదించుకునే కోటానుకోటీశ్వరులు ఎవరైనా ఉన్నారా? ఇలా ఎవరైనా ఉంటారా? కనుక విశ్వమంతటిలో మీరు ధనవంతులు. మరియు మీ ఖజానా ఎటువంటిదంటే నిప్పు కూడా కాల్చలేదు, నీరు కూడా ముంచలేదు, దొంగలు దొంగిలించలేరు, రాజులు కూడా తినలేరు. ఇటువంటి ఖజానా ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే పొందుతున్నారు. మీ యొక్క ఈ స్వమానం స్మృతిలో ఉంటుందా? ఉంటుందా, లేదా? వెనుక ఉన్నవారు చేతులు ఊపుతున్నారు. వెనుక ఉన్నవారు విశ్రాంతిగా కూర్చున్నారు కదా? ప్రపంచంలోనే ధనవంతులు కనుక విశ్రాంతియే విశ్రాంతి. పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలలో కూడా చదువు చదువుకోవడానికి ఇటువంటి కుర్చీలలో కూర్చోరు కానీ మీరు బీదవారి నుండి రాజులు (బెగ్గర్ టు ప్రిన్స్) బీదవారు కూడా మరియు రాజులు కూడా. బీదవారు అంటే సర్వం త్యాగం. రాజు అంటే సర్వ ప్రాప్తులు. త్యాగం లేకుండా ఇంత పెద్ద భాగ్యం లభించదు. త్యాగానికే భాగ్యం లభిస్తుంది. తనువు, మనస్సు, ధనం, సంబంధం అన్నీ త్యాగం చేసారు అంటే పరివర్తన చేసారు. తనువు నాది అనే దానికి బదులు నీది అన్నారు. మనస్సు, ధనం, సంబంధం అన్నింటిలో ఒక మాటను పరివర్తన చేయటం ద్వారా నాది అనే దానికి బదులు నీది అన్నారు, అవ్వడానికి ఒక మాట యొక్క పరివర్తనే కానీ ఈ త్యాగం ద్వారానే భాగ్యానికి అధికారిగా అయిపోయారు. భాగ్యం ముందు ఈ త్యాగం ఎంత? చిన్న విషయమా లేక కొంచెం పెద్దది కూడానా? అప్పుడప్పుడు పెద్దది అయిపోతుంది. నీది అనటం అంటే పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసుకోవటం, నాది అనటం అంటే చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోవటం. ఏమైపోయినా కానీ, 100 హిమాలయ పర్వతాల కంటే పెద్ద సమస్య వచ్చినా కానీ నీది అని అనటం అంటే పర్వతాన్ని దూదిగా చేసుకోవటం. రాయిగా కాదు, దూదిగా చేసుకోవటం.  కానీ కేవలం నీది అని అనటమే కాదు, అంగీకరించాలి. కేవలం అంగీకరించటమే కాదు నడవాలి కూడా. ఒక్క మాట యొక్క పరివర్తన అంతే, సహజమే కదా? మరియు లాభమే కానీ నష్టమేమీ లేదు కూడా. నీది అని అనటం ద్వారా భారాన్నంతటినీ బాబాకి ఇచ్చేశారు. నీది కనుక నువ్వే చూస్కో. మీరు నిమిత్తమాత్రులు. దీనిలో లాభమే ఉంది కదా? దీని ద్వారా మీరు అతీతం అయిపోయారు మరియు బాబాకి ప్రియంగా అయిపోయారు. ఎవరైతే పరమాత్మకి ప్రియంగా అవుతారో వారు విశ్వానికి ప్రియంగా అవుతారు. కేవలం భవిష్య ప్రాప్తియే కాదు వర్తమానంలో కూడా ప్రాప్తి లభిస్తుంది. ఒక సెకనులో అనుభవం చేసుకున్నారు కూడా మరియు ఇంకా చేసుకుని చూడండి. ఏ విషయం వచ్చినా కానీ నీది అని అనండి, అంగీకరించండి మరియు నీది అని భావించి చేయండి. అప్పుడు చూడండి, బరువు తేలిక అవుతుందో, లేదో! అనుభవం ఉంది కదా? అందరూ అనుభవీలే కూర్చున్నారు కదా! కానీ ఏమౌతుందంటే నాది, నాది అనటం బాగా అలవాటు కదా, 63 జన్మల నుండి అలవాటు. అందువలన నీది, నీది అంటూనే మరలా నాది అనేస్తున్నారు, నాది అన్నారంటే పోయింది అంతే. ఆ విషయం అయితే ఒక గంటలో లేదా రెండు గంటలలో లేదా ఒక రోజులో సమాప్తి అయిపోతుంది కానీ నీది అనేదాని నుండి నాది అన్నారు కదా! దాని ఫలితం మాత్రం చాలాకాలం ఉంటుంది. విషయం అరగంటే ఉంటుంది కానీ పశ్చాత్తాపం రూపంలో లేదా పరివర్తన అవ్వాలి అనే లక్ష్యంతో ఆ విషయం మాటిమాటికీ స్మృతి వస్తూ ఉంటుంది. అందువలనే బాబా పిల్లలందరికీ చెప్తారు - ఒకవేళ "నాది” అనే మాటతో మీకు ప్రేమ ఉంటే, అలవాటు, సంస్కారం కనుక అనాల్సిందే అని అనుకుంటే నా బాబా అని అనండి. అలవాటు కారణంగా బలహీనం అవుతున్నారు కదా! కనుక ఎప్పుడైనా కానీ నాది, నాది అని వస్తే నా బాబా అని అనుకుని సమాప్తి చేసేయండి. నాది అనే అనేకమైన వాటిని నా బాబాలో కలిపేయండి. 

రష్యా వారు ఒక బొమ్మ తెస్తారు కదా, బొమ్మలో బొమ్మ ఉంటూ, అన్నీ కలిసి ఒక బొమ్మగా ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా నా బాబా అనే ఒకదానిలో అనేక రకాలైనా నాది అనేవి కలిపేయండి, సమాప్తి అయిపోతాయి. ఇలా చేయగలరా? చేస్తున్నారు కానీ ఒకొక్కసారి నాది అనే దాని యొక్క విస్తారంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒకొక్కసారి అంటున్నారు. కానీ సదా నాది అనేది నీది అయిపోవాలి, దీనిలో నెంబరువారీగా ఉన్నారు. నెంబర్ వన్, ఎ వన్ అయిన వారు కూడా ఉన్నారు మరియు వెనుక నెంబర్ వారు కూడా ఉన్నారు. హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా? సదా ఇదే మంత్రం గుర్తు పెట్టుకోండి - నేను బాబా వాడిగా అయిపోయాను (బాప్ కీ హో లీ), పరమాత్మ పరివారం అయిపోయాను. ఇటువంటి హోలీ జరుపుకున్నారా? ఇప్పుడు ఏమి చేయాలి? ఇప్పుడు కాల్చాలి, లేదా కాల్చేశారా? కాల్చేశాం అని అనటం లేదు, ఆలోచిస్తున్నారా? 

భక్తిమార్గంలో జరుపుకునే ఉత్సవాలన్నీ స్మృతిచిహ్నాలు కానీ అవి కూడా కొన్ని కొన్ని అర్థాలతో పెట్టారు. హోలీకి మొదట కాల్చాలి తర్వాత జరుపుకోవాలి, మొదట జరుపుకుని తర్వాత కాల్చటం కాదు. అంటే మొదట అశుద్దాన్ని, బలహీనతను, చెడుని కాల్చండి తర్వాత జరుపుకోండి అని అర్ధం. మీరయితే చాలా ముందుగానే కాల్చేశారు కదా లేక ఇప్పుడు కూడా కొద్దిగా దుప్పటి ముక్క ఏదైనా మిగిలి ఉందా? పాండవులు ధరించే వస్త్రం (షర్ట్) యొక్క ముక్క ఏదైనా మిగిలి ఉందా? చీర ముక్క ఏదీ మిగిలిపోలేదు కదా! వాస్తవంలో కూడా మొదట పూర్తిగా కాల్చిన తర్వాత ఆత్మికంగా జరుపుకోవటం ద్వారానే శక్తి లేదా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి అవుతుంది. మనోరంజన రూపంగా జరుపుకోవటం అనేది వేరే విషయం. సంగమయుగం అంటే మజాల  యుగం కనుక మనోరంజన రూపంగా కూడా జరుపుకుంటారు మరియు జరుపుకోండి, బాగా జరుపుకోండి. కానీ పరమాత్మ యొక్క రంగులో రంగరించబడటం అంటే బాబా సమానంగా అవ్వటం. రంగుతో రంగరించబడటం ఇదే. ఏవిధంగా అయితే బాబా అశరీరి మరియు అవ్యక్తుడో అదేవిధంగా అశరీరి స్థితిని అనుభవం చేసుకోవటం లేదా అవ్యక్త ఫరిస్తాస్థితిని అనుభవం చేసుకోవటమే రంగుతో రంగరించబడటం. కర్మ చేయండి కానీ అవ్యక్త ఫరిస్తా అయ్యి పని చేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరి స్థితిని అనుభవం చేసుకోండి. ఇలా మనస్సు, బుద్ది మీ అదుపులో ఉండాలి. ఆజ్ఞాపించండి మరియు అశరీరి అయిపోండి. ఆజ్ఞాపించగానే అయిపోవాలి, ఫరిస్తాగా అయిపోవాలి. మనస్సుని ఏవిధంగా, ఏ స్థితిలో స్థితులై చేయాలనుకుంటే అక్కడ మరియు ఆవిధంగా సెకండులో స్థితులైపోండి. ఎక్కువ సమయం పట్టలేదు 5 సెకండులు 
పట్టింది, రెండు సెకండులు పట్టింది అనకూడదు. ఇలా జరిగినా కానీ అదుపాజ్ఞల్లో లేనట్లే. ఎటువంటి పరిస్థితి అయినా కానీ, అలజడి అయినా కానీ అలజడిలో అచంచలం అవ్వండి. ఇలా కంట్రోలింగ్ పవర్ ఉందా? లేక అశరీరి అవ్వాలి, అశరీరి అవ్వాలి... ఇలా ఆలోచించడంలోనే సమయం అయిపోతుందా? కొంతమంది పిల్లలు రకరకాల ఫోజులు మారుస్తూ ఉంటారు, బాబా చూస్తూ ఉంటారు. అశరీరి అవ్వాలి అని అనుకుంటారు అనుకుని అశరీరి అంటే ఆత్మ రూపంలో స్థితులవ్వాలి కదా, అంటే నేను ఆత్మను, శరీరాన్ని కానే కాదు, ఆత్మను, నేను వచ్చిందే ఆత్మగా, అవ్వాల్సింది కూడా ఆత్మగా.... ఇలాంటి ఆలోచనల్లో ఉంటారు అంటే ఇది అశరీరి అయినట్ల లేక అశరీరిగా అయ్యేటందుకు యుద్ధం చేసినట్లా? సెకనులో అశరీరి అవ్వమని మీరు మనస్సుని ఆజ్ఞాపించారే కానీ అశరీరి అంటే ఏమిటి? ఎప్పుడు అశరీరి అవుతారు? ఏవిధంగా అవుతారు అని ఆలోచించమని ఆజ్ఞాపించలేదు కదా? ఇలా ఆలోచించటం అంటే ఆజ్ఞను అంగీకరించనట్లే కదా! ఇది నియంత్రణా శక్తి అవ్వలేదు కదా! ఇప్పుడు సమయాన్ని అనుసరించి ఈ అభ్యాసమే అవసరం. ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేకపోతే ఏ పరిస్థితులు అయినా అలజడిలోకి తీసుకురాగలవు. కనుక హోలీ అనే ఒక మాటను జ్ఞాపకం ఉంచుకున్నా చాలు, హోలీ అంటే - జరిగిపోయిందేదో జరిగిపోయింది మరియు హోలీ అంటే బాబా వారిగా అయిపోయాము. ఇంకా ఎలా అయ్యారు? హోలీ అంటే పవిత్ర ఆత్మగా అయ్యారు. హోలీ అనే ఒక మాటను స్మృతి ఉంచుకోండి, ఆ మాటను మూడు అర్ధాలతో ఉపయోగించండి. అవును హోలీ అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా! అందువలన జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇలా వర్ణించటం, ఆలోచిస్తూ ఉండటం కాదు, అర్ధ స్వరూపంలో స్థితులవ్వండి. ఆలోచించారు మరియు అయిపోయారు. అంతేకానీ ఆలోచిస్తూ ఆలోచనలోనే ఉండిపోవటం కాదు. ఆలోచించిన విధంగా అయిపోయారు, తయారైపోయారు, స్థితులైపోయారు. 

 (బాప్ దాదా వ్యాయామం చేయించారు) ఇప్పుడు సమయాన్ని అనుసరించి సదా స్మృతి మరియు సేవలో ఉండేవారు, నిమిత్త ఆత్మలైన మీరందరు స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన యొక్క తరంగాలను శక్తివంతంగా మరియు తీవ్ర వేగంతో పెంచాలి. నలువైపుల మానసిక దు:ఖ అశాంతులు, మానసిక అలజడులు తీవ్ర వేగంతో పెరిగిపోతున్నాయి. బాప్ దాదాకి విశ్వంలోని ఆత్మలపై దయ వస్తుంది. దు:ఖం యొక్క అల ఎంత తీవ్రవేగంతో పెరిగిపోతూ ఉందో అంతగానే సుఖదాత యొక్క పిల్లలైన మీరు మీ మనసా శక్తితో, మనసా సేవ లేదా శక్తినిచ్చే సేవ ద్వారా, వృత్తి ద్వారా నలువైపుల సుఖం యొక్క సహాయాన్ని అనుభవం చేయించండి. బాబాని అయితే పిలుస్తూనే ఉంటారు కానీ పూజ్య దేవాత్మలను కూడా ఏదొక రూపంలో పిలుస్తూనే ఉన్నారు. కనుక ఓ దేవాత్మలూ! పూజ్యాత్మలూ! మీ భక్తాత్మలకు శక్తినివ్వండి. దు:ఖం సమాప్తి అయిపోయే ఆవిష్కరణను ఆవిష్కరించాలి అని వైజ్ఞానికులు కూడా అనుకుంటున్నారు. విజ్ఞాన సాధనాలు సుఖంతో పాటు దు:ఖాన్ని కూడా ఇస్తున్నాయి కానీ దు:ఖం ఉండకూడదు, కేవలం సుఖమే ప్రాప్తించాలి అని ఆలోచిస్తున్నారు. కానీ స్వయంలోనే అనగా ఆత్మలో అవినాశి సుఖం యొక్క అనుభూతి లేకపోతే ఇతరులకు ఎలా ఇవ్వగలరు? మీ అందరి దగ్గర సుఖం, శాంతి, నిస్వార్థ ప్రేమ యొక్క స్టాక్ జమ అయ్యి ఉంది. జమ ఉందా లేక ఎంత సంపాదించుకుంటున్నారో అంత ఖర్చు పెట్టేస్తున్నారా? కనుక ఇది కూడా పరిశీలన చేసుకోండి - జమ అయితే అవుతుంది కానీ జమతో పాటు ఖర్చు కూడా అయిపోవటం లేదు కదా? జ్ఞాన ఖజానా అయితే ఖర్చు చేయటం ద్వారా పెరుగుతుందే కానీ తరగదు. మాటిమాటికి మీ యొక్క స్వభావ, సంస్కారాలకు లేక మాయ ద్వారా వచ్చే సమస్యలలో మీ శక్తులను ఉపయోగిస్తే జమ ఖాతా తక్కువ అయిపోతుంది. కనుక పరిశీలించుకోండి - జమ చేసుకున్నాను. కానీ ఖర్చు చేసేసాను, ఇక ఎంత మిగిలింది? అని. సంపాదించుకున్నారు మరియు తినేశారు ఇలా లేరు కదా? రెండు రోజులు సంపాదించారు, జమ చేసారు కానీ ఒక్క రోజులో జమ చేసుకున్నదంతా ఖర్చు చేయవలసి రావటం లేదు కదా? ఇలా సంపాదించుకుని తినేస్తే లేక స్వయం పట్ల ఉపయోగించి సమాప్తి చేసేసుకుంటే ఇక 21 జన్మలకు ఏమి జమ చేసుకున్నట్లు? జమ చేసుకున్నాము అనే ఆనందం అయితే ఉంటుంది కానీ ఖర్చు యొక్క ఖాతా చూసుకోకపోతే సమయానికి మోసపోతారు. జమఖాతాను చూసుకోండి దానితో పాటు ఖర్చు యొక్క ఖాతా కూడా చూసుకోండి. ఇతరులకి ఏదైనా శక్తి ఇచ్చారు, గుణం ఇచ్చారు, జ్ఞాన ఖజానా ఇచ్చారు అంటే ఇది ఖర్చు కాదు, జమ ఖాతాలోనే జమ అవుతుంది. కానీ మీ కోసం ఖర్చు చేస్తే ఖాతా ఖాళీ అయిపోతుంది. అందువలన మంచి విశాలబుద్దితో పరిశీలించుకోండి. జమఖాతా చాలా ఎక్కువ ఉండాలి. అవ్వడానికి ఇది సహజమే, ప్రతి అడుగులో కోటానుకోట్లు జమ చేసుకుంటే వెళ్ళండి అప్పుడు జమ ఖాతా చాలా పెరిగిపోతుంది. ప్రతి అడుగు లేదా కర్మ బ్రహ్మాబాబా సమానంగా ఉందా? అని పరిశీలించుకోండి. అనుభవీలు కదా! ఏదైనా మంచి కర్మ చేస్తే ఆ కర్మ ఫలంగా ఆ సమయంలోనే ప్రత్యక్ష రూపంలో సంతోషం, శక్తి, మరియు సఫలత కారణంగా డబల్ లైట్ గా ఉంటారు. ఎందుకంటే బాబాని తోడుగా పెట్టుకుని కర్మ చేశాం అనే స్మృతి ఉంటుంది. అలాగే ఒకవేళ వికర్మ చేస్తే దాని పశ్చాత్తాపం చాలా ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు వికర్మలు జరగకూడదు, ఆ సమయం గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఏ వ్యర్ధసంకల్పం, లేదా వ్యర్ధకర్మ, వ్యర్ధ మాటలు, వ్యర్ధ సంబంధ, సంపర్కాలు కూడా ఉండకూడదు. ఎందుకంటే వ్యర్ధ సంబంధ, సంపర్కాలు కూడా చాలా మోసం చేస్తాయి. ఎలాంటి సాంగత్యమో అలాంటి రంగు అంటుకుంటుంది. కొంతమంది పిల్లలు చాలా చతురంగా అంటున్నారు - మేము వారితో సాంగత్యం చేయటం లేదు కానీ వారు నన్ను వదలటం లేదు. నేను చేయటం లేదు కానీ వారు వదలటం లేదు అంటున్నారు. వారిని వదిలించుకోవటం రావటం లేదా? ఒకవేళ ఎవరైనా చెడ్డ వస్తువు ఇస్తుంటే మీరు ఎందుకు తీసుకుంటున్నారు! తీసుకునేవారు తీసుకోకపోతే ఇచ్చేవారు ఎలా ఇస్తారు? అందువలన వ్యర్ధ సంబంధ, సంపర్కాలు కూడా ఖాతాని ఖాళీ చేసేస్తాయి. ఆ సమయంలోనే మనస్సులో అనిపిస్తుంది లేదా మనస్సు తినేస్తూ ఉంటుంది - ఇది చేయకూడదు అని. చేయకూడదు కానీ మరలా చేసేస్తున్నారు. వినాలనుకోవటం లేదు కానీ వినిపిస్తుంటే ఏమి చేయము అంటున్నారు! కానీ అసలు పురుషార్థి అంటే వ్యర్ధకర్మ ఉండకూడదు. సోమరులు అయితే ఇక ఈ విషయమే వదిలేయండి, విశ్రాంతిగా నిద్రపోండి, త్రేతాయుగంలోకి రండి. కానీ పురుషార్థం ఉంటే ఆ సమయంలోనే మనస్సులో అనిపిస్తుంది లేదా మనస్సు తినేస్తుంది - ఇది చేయకూడదు అని అయినా కానీ చేస్తుంటారు, అప్పుడు ఈ పిల్లలది అద్భుతం అని బాప్ దాదా అంటారు. వద్దనుకుంటూనే చేస్తూ ఉంటారు, మనస్సు తినేస్తూ ఉంటుంది, వింటూ ఉంటారు మరియు చేస్తూ ఉంటారు కూడా అంటే చాలా శక్తిశాలి ఆత్మలు కదా! అందువలన వ్యర్థం విషయంలో కూడా ధ్యాసగా పరిశీలించుకోండి. ఆ పర్వలేదులే, ఇది అయితే ఇలా జరుగుతునే ఉంటుంది, ఇలా నడుస్తూనే ఉంటుంది, ఇప్పుడు సంపూర్ణంగా ఎక్కడ అయ్యాం, అయిపోతాం.... ఈ నిర్లక్ష్యం ఉండకూడదు. చేయాలి మరియు తీవ్ర వేగంతో చేయాలి అని అనుకోవటమే హోలీ జరుపుకోవటం. 

బాప్ దాదాకి పిల్లల యొక్క రకరకాల ఆటలను చూసి నవ్వు కూడా వస్తుంది, దయ కూడా వస్తుంది మరియు బాబా ఆ సమయంలో టచ్ చేస్తారు, అది కూడా అనుభవం అవుతుంది. ఇలా చేయకూడదు, ఇది శ్రీమతం కాదు. ఇది బాబా సమానంగా అవ్వటం కాదు అని టచ్ అవుతుంది కానీ సోమరితనం నిద్రింపచేస్తుంది. అందువలన ఇప్పుడు స్వయం కోసం ఖజానాలను ఎక్కువ ఖర్చు పెట్టకండి. జమ చేసుకోండి కానీ ఖర్చు పెట్టకండి. సేవ చేయండి కానీ వ్యర్ధంగా ఖర్చు చేయకండి. చాలా జమ చేసుకోవాలి కదా! డబల్ విదేశీయులకు ఇలా జమ చేసుకునే అలవాటు ఉండదు, సంస్కారం లేదు, లభించగానే ఖర్చు చేసేస్తారు. తినాలి, త్రాగాలి, మజాగా ఉండాలి అని అనుకుంటారు కానీ ఈ సంపాదనలో ఆవిధంగా చేయకండి, దీనిలో అన్నింటికంటే ఎక్కువ జమ చేసుకోండి. 

నలువైపుల ఉన్న పవిత్రాత్మలకు, సదా ఉన్నత స్థితిలో స్థితులయ్యే ఉన్నత ఆత్మలకు, సదా సర్వఖజానాలతో సంపన్నంగా ఉండే ధనవంత ఆత్మలకు, సదా ప్రతి అడుగులో కోటానుకోట్లు జమ చేసుకునేవారికి, బాబా సమానంగా అయ్యే శ్రేష్ట ఆత్మలకు, సదా దయాహృదయుడు, క్షమాసాగరుని పిల్లలు మాస్టర్ క్షమాసాగరులుగా క్షమించే ఆత్మలకు, విశ్వంలో దు:ఖీ ఆత్మలకు శక్తి ద్వారా సుఖం, శాంతి యొక్క సహాయం ఇచ్చే ఆత్మలకు, ప్రతి సమయం స్వయం యొక్క జమాఖాతాలో సంపన్నంగా ఉండే పురుషార్థి ఆత్మలకు ప్రియస్మృతులు, నమస్తే. 

Comments