09-01-1996 అవ్యక్త మురళి

         09-01-1996         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బాలకులు నుండి యజమానులం అనే నషాలో ఉండేటందుకు మనస్సుకి రాజుగా అవ్వండి.

ఈరోజు విశ్వానికి యజమాని అయిన బాప్ దాదా నలువైపుల ఉన్న తన యొక్క బాలకుల నుండి యజమానులైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు మరియు యజమానులు కూడా. విశ్వమహారాజుగా అయితే భవిష్యత్తులో అవుతారు కానీ స్వరాజ్యాధికారిగా ఇప్పుడే అవుతారు. అందువలన పిల్లలు మరియు యజమానులు కూడా రెండూ కదా! పిల్లలం అనే నషా అయితే సదా ఉంటుంది. గుప్త రూపంలోనో, ప్రత్యక్ష రూపంలోనో ఎక్కువ మందికి బాలకుల యొక్క నషా ఉండటం బాప్ దాదా చూసారు. ఎందుకంటే స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా ఏ స్మృతి ఉంటుంది? బాబా, బాబా అని అంటున్నారు అంటే పిల్లలు అయితేనే కదా! బాబా (తండ్రి) అని అంటారు. సత్యమైన సేవాధారి యొక్క నోటి నుండి మాటిమాటికి ఏ మాట వస్తుంది? బాబా ఇది చెప్పారు, బాబా ఇది చెప్తున్నారు అంటారు. బాబా, బాబా అనే మాట సేవలో ఎన్నిసార్లు అంటున్నారు అనేది రోజంతటిలో పరిశీలించుకోండి. కానీ బాబా అనే మాట రెండు రకాలుగా అనేవారు ఉంటారు. 1. మనస్సుతో బాబా అనేవారు 2. జ్ఞానం యొక్క బుద్ధితో బాబా అనేవారు. ఎవరైతే మనస్పూర్వకంగా బాబా అంటారో వారికి బాబా ద్వారా ప్రత్యక్షఫలంగా సదా మనస్సుకి సంతోషం మరియు శక్తి లభిస్తాయి. కేవలం బుద్ది మంచిగా ఉన్న కారణంగా జ్ఞానం అనుసారంగా బాబా, బాబా అనే వారికి అలా అనే సమయంలో సంతోషంగా ఉంటుంది మరియు వినేవారికి కూడా ఆ సమయంలోనే సంతోషం ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది కానీ సదాకాలికంగా మనస్సులో సంతోషం మరియు శక్తి అనేవి ఉండవు. ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు, కారణం ఏమిటి? ఎందుకంటే మనస్పూర్తిగా “బాబా” అనలేదు. బాప్ దాదా చూసారు - బాబా పిల్లలం అనే నిశ్చయం అందరికీ ఉంది అప్పుడప్పుడు నషా ఉంటుంది, అప్పుడప్పుడు ఉండటం లేదు. మేము బాబా వాళ్ళం అనే నిశ్చయంలో చాలామంది బాగున్నారు. పిల్లలే కానీ కేవలం పిల్లలుగానే కాదు, పిల్లల నుండి యజమానులుగా అవ్వాలి. డబల్ యాజమానులు. 

డబల్ యజమానిస్థితి అంటే 1. స్వరాజ్యాధికారి యజమానులు 2. బాబా యొక్క సర్వ ఖజానాలకి యజమానులు, ఎందుకంటే సర్వ ఖజానాలను మీ స్వంతం చేసుకుంటున్నారు, వారసత్వం మీది, దాత అయితే బాబా కానీ బాబా ఇచ్చిన వారసత్వానికి మీరే యజమానులు. ఈ వారసత్వం అందరికి లభించిందా? కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ లభించలేదు కదా? అందరికి ఒకేవిధంగా లభించింది కదా? లేదా ఒకరికి ఒక కోటి, ఇంకొకరికి పది కోట్లు ఇలా లభించలేదు కదా? ఎందుకంటే బాబా ఖజానా బేహద్. ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ బాబా ఖజానా అయితే తక్కువ అవ్వదు, తెరిచి ఉంటుంది మరియు సంపన్న భండారా. అందువలన బాబా కొందరికి తక్కువ ఎందుకు ఇస్తారు! ఖజానా ఉన్నదే పిల్లల కోసమైతే కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ ఎందుకు ఇస్తారు! అయితే 1. బాబా వారసత్వానికి అధికారులు, యజమానులు 2. స్వరాజ్యానికి యజమానులు. స్వరాజ్యం లభించిందా? రెండింటికి యజమానులేనా? పక్కాయే కదా? యజమానియై ఎంత సమయం నడుస్తున్నారు? స్వరాజ్యం మా జన్మసిద్ద అధికారం అంటున్నారు. అంటున్నారా? లేదా మహారథీల యొక్క జన్మ సిద్ద అధికారం మాకు కొంచమే అంటారా? స్వరాజ్యం యొక్క అధికారం అందరికి లభించిందా? లేదా కొంచెం కొంచెమే లభించిందా? దీనిలో పూర్తిగా పక్కాగా ఉండాలి. పరిశీలించుకోండి - స్వయం యొక్క సర్వ కర్మేంద్రియాలు ఆజ్ఞానుసారం నడుస్తున్నాయా? అని. స్వరాజ్యాధికారి పిల్లలైన మీకు కర్మేంద్రియాలు కర్మచారులు కదా! యజమానులు కాదు కదా? మీరు యజమానులే కదా లేదా కర్మచారులు యజమానులుగా, మీరు కర్మచారులుగా అయిపోతున్నారా? 

బాప్ దాదా చూసారు - పిల్లల యొక్క స్థితిలో అన్నింటికంటే ఎక్కువగా యజమాని స్థితిని మరిపించేది మరియు సమయానుసారం రాజును వశం చేసుకునేది - మనస్సు. అందువలనే బాబా ఇచ్చిన మంత్రం కూడా - మన్మనాభవ! తన్మనాభవ లేదా ధన్మానాభవ అని అనలేదు, మన్మనాభవ! అని అన్నారు. ఎందుకంటే మనస్సు అనేది తన ప్రభావం వేసేస్తుంది. మనస్సు యొక్క వశంలోకి వచ్చేస్తున్నారు. చూడండి - ఏదైనా చిన్న వ్యర్థవిషయమైనా లేదా వ్యర్ధ వాతావరణం అయినా లేదా వ్యర్ధ దృశ్యం అయినా అన్నింటి ప్రభావం మొదట దేనిపై పడుతుంది? మనస్సుపై పడుతుంది కదా! తర్వాత బుద్ది దానికి సహయోగం ఇస్తుంది. మనస్సు మరియు బుద్ది ఒకవేళ ఆ విధంగా నడుస్తూ ఉంటే అదే సంస్కారంగా తయారైపోతుంది. ఇప్పుడు కూడా మిమ్మల్ని పరిశీలించుకోండి - నాలో వ్యర్ధ సంస్కారం ఏదైతే తయారయ్యిందో అది ఏవిధంగా తయారయ్యింది? అని. ఏదైనా సంస్కారం చిన్న విషయంలో సెకనులో మనస్సులో ఫీలింగ్ (అభిమానం) తీసుకువచ్చేదిగా తయారైతే అది ఏవిధంగా తయారయ్యింది? తర్వాత అనుకోవటం లేదు, ఆలోచిస్తున్నాము కానీ అయిపోతుంది అని అంటున్నారు. దీనినే సంస్కారానికి వశం అవ్వటం అంటారు. కొంతమందికి కొద్ది సమయంలో మనస్సు నిరాశ అయిపోతుంది, కొద్దిగా ఏదైనా చూసినా, విన్నా మనస్సు నిరాశ అయిపోతుంది. ఒకవేళ ఎవరైనా అడిగితే ఏమంటారు? విషయం ఏమి లేదు, అది నా సంస్కారం అంటారు. తర్వాత మంచిగా అయిపోతుంది అంటారు. అది సంస్కారమే కానీ అది ఏవిధంగా తయారయ్యింది? మనస్సు మరియు బుద్ధి ఆధారంగా సంస్కారం తయారయ్యింది. రకరకాల సంస్కారాలు తయారవుతాయి, అవి బ్రాహ్మణ సంస్కారాలు కాదు. బాప్ దాదా ఆలోచిస్తున్నారు, చెప్పటంలో అయితే ఎవరినైనా మీరెవరు? అని అడిగితే ఏమంటారు? బ్రహ్మాకుమారీ లేక బ్రహ్మాకుమారులం అంటారు. బ్రహ్మ యొక్క పిల్లలు ఏమౌతారు? బ్రాహ్మణులు, కానీ ఎప్పుడైతే వ్యర్ధసంస్కారాలకి వశం అయిపోతున్నారో ఆ సమయంలో బ్రహ్మాకుమారీలు, బ్రాహ్మణులా లేక క్షత్రియులా? ఆ సమయంలో ఎవరు? మీతో మీరు ఈ విధంగా కాదు, ఈ విధంగా కాదు అని అని యుద్ధం చేస్తున్నారు ..... అంటే బ్రాహ్మణులా లేక క్షత్రియులా? కొంతమంది పిల్లలు అంటున్నారు, రెండు రోజుల నుంచి సంతోషం మాయం అయిపోతుంది. ఎందుకు అయిపోయిందో తెలియటం లేదు అంటారు. లోపల అర్థం చేసుకుంటారు, కానీ బయటికి ఎందుకో తెలియటం లేదు అంటారు. అంటే మీరు ఆ రోజు బ్రాహ్మణులా లేదా క్షత్రియులా? సంతోషం మాయం అయిపోతే బ్రాహ్మణులా? అప్పుడప్పుడు బ్రాహ్మణులుగా, అప్పుడప్పుడు క్షత్రియులుగా అవుతున్నారా? అందరు యజమానులం అని చెప్పారు కదా, కానీ ఆ సమయంలో ఏమిటి? యజమానులా లేదా పరవశమైపోయారా? 

బాప్ దాదా చూసారు, యజమాని స్థితిని చలింపచేయటంలో విశేషమైనది - మనస్సు. మీరు స్వరాజ్యాధికారి రాజులు, మనస్సు మీ యొక్క మంత్రి లేదా మనస్సు యజమాని, మీరు మంత్రా? మీరు రాజులు కదా, మనస్సు రాజు కాదు కదా? మనస్సు అనేది మీకు మంత్రి లేదా సహయోగి. మనస్సుపై యజమాని స్థితి సదా ఉండాలి, అప్పుడే స్వరాజ్యాధికారి అంటారు. లేకపోతే అప్పుడప్పుడు అధికారిగా, అప్పుడప్పుడు ఆధీనం అయిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి? ఎందుకు పరివర్తన కావటం లేదు? అర్థం చేసుకుంటునప్పటికీ కూడా సంస్కారానికి వశం అయిపోతున్నారు. అందువలన మొదట మనస్సుని అదుపు చేసుకోండి, అనడానికి అయితే రాజు అని అంటున్నారు కానీ కానీ రాజు అయిన వారిలో కంట్రోలింగ్ పవర్ (నియంత్రణా శక్తి) ఉండాలి. పేరు రాజు కానీ వారిలో నియంత్రణాశక్తి లేకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారి రాజ్యం నడుస్తుందా? నడవదు. కనుక నియంత్రణాశక్తి ఎంత శాతంలో వచ్చింది? అని పరిశీలించుకోండి. 

ఒక పొరపాటు ఎక్కువగా చేస్తున్నారు, దాని కారణంగా కూడా సంస్కారాలపై విజయం పొందటం లేదు, చాలా సమయం పడుతుంది. రేపటి నుండి చేయము అని అనుకుంటున్నారు, కానీ ఆరోజు వచ్చేసరికి ఈ రోజు విషయం రేపటికి పెద్దది అయిపోతుంది. మరలా నిన్న చిన్న విషయంగా ఉండేది, ఈ రోజు పెద్ద విషయం అయిపోతుంది అని అంటున్నారు. పెద్ద విషయం అయిపోయిన కారణంగా కొద్దిగా అయిపోయింది, తరువాత బాగా చేస్తాము అని ఈ విధంగా పెద్దవారికి లేదా తమ మనస్సుకి నమ్మకం ఇప్పించుకుంటున్నారు. ఈ నమ్మకంతో నడుస్తున్నారు, కానీ ఇది నమ్మకం కాదు, మోసపోవటం. ఆ కొద్ది సమయం కోసం తమకు తాము లేక ఇతరులకి నమ్మకం ఇప్పిస్తున్నారు, ఇప్పుడు మంచిగా అయిపోతుంది అని కానీ ఇది స్వయం మోసం చేసుకునే అలవాటు పక్కా చేసుకుంటున్నారు. ఆ సమయంలో తెలియటం లేదు కానీ ప్రత్యక్షంలో మోసపోయిప్పుడు, ఇది మోసమే అని అర్థం చేసుకుంటున్నారు. కనుక ఏమి పొరపాటు చేస్తున్నారు? పెద్దవారైనా లేదా చిన్నవారైనా ఒకరికొకరు శిక్షణ ఇచ్చుకుంటున్నప్పుడు ఏమంటున్నారు? ఇది నా స్వభావం, ఇది నా సంస్కారం, కొంతమందికి అభిమానం యొక్క సంస్కారం, కొంతమందికి వేరు చేసే సంస్కారం, కొంతమందికి మాటిమాటికి పరచింతన చేసే సంస్కారం, కొంతమందికి పరచింతన వినే సంస్కారం, రకరకాల సంస్కారాలు, వీటి గురించి అయితే బాబా కంటే ఎక్కువ మీకే తెలుసు. కానీ బాప్ దాదా అడుగుతున్నారు - వేటినైతే మీరు నా సంస్కారం అని అంటున్నారో, అవి మీవా? ఎవరివి? (రావణునివి). నావి అని ఎందుకు అంటున్నారు? రావణాసురునివి అని ఎప్పుడూ అనటం లేదు. నా సంస్కారం అంటున్నారు. ఈ “నాది” అనే మాటే పురుషార్ధంలో బలహీనం చేస్తుంది. రావణుని వస్తువులను లోపల ఎందుకు దాచి ఉంచారు? ప్రజలైతే రావణుని అంటించేస్తారు, అంటించేసిన తరువాత మిగిలిన బూడిదను కూడా నీటిలో కలిపేస్తారు. మీరు మీదిగా తయారుచేసుకుని పెట్టుకుంటున్నారా! ఎక్కడైతే రావణుని వస్తువులు ఉంటాయో అక్కడ అశుద్ధత ఉంటుంది. అశుద్ధతతో పాటు శుద్ద సంస్కారాలు ఏవిధంగా కలిసి ఉంటాయి? రాజ్యం ఎవరిది? అశుద్ధత యొక్క రాజ్యం , శుద్ధత యొక్క రాజ్యం కాదు కదా! అశుద్ధ రాజ్యం మరియు అశుద్ధ వస్తువులను మీ దగ్గర పెట్టుకుని సంభాళిస్తున్నారు. బంగారం, వజ్రాలను సంభాళించినట్లు సంభాళిస్తున్నారు. అందువలన శుద్ధత మరియు అశుద్ధత రెండింటి యుద్ధం నడుస్తుంది కనుక మాటిమాటికి బ్రాహ్మణుల నుండి క్షత్రియులుగా అయిపోతున్నారు. నా సంస్కారం ఏమిటి? ఏదైతే బాబా సంస్కారం ఉందో అదే మన సంస్కారం. బాబా యొక్క సంస్కారాలు విశేషంగా విశ్వకళ్యాణకారి, శుభచింతనదారి, అందరిపట్ల శుభభావన, శుభకామనదారి. అలాగే మన అసలైన సంస్కారాలు కూడా ఇవే, మిగిలినవి కావు. లోపల ఏదైతే అశుద్ధత దాగి ఉందో, అది సంపూర్ణ శుద్దంగా అవ్వటంలో విఘ్నం వేస్తుంది. అందువలన తయారవ్వాలనుకుంటున్నారు, లక్ష్యం పెట్టుకుంటున్నారు కానీ ప్రత్యక్షంలో తేడా వచ్చేస్తుంది. 

ఎక్కువమంది ఆలోచిస్తున్నారు, కొంతమంది సంకల్పం కూడా చేసారు, వ్రాసారు కూడా, ఈ డైమండ్ జూబ్లీలో బాబా సమానంగా డైమండ్ గా (వజ్రంగా) అవ్వాలి అని. ఈ సంకల్పం ఉందా, లేదా ఆలోచించాలా? ఆలోచించాలంటే ఆలోచించుకోండి. కానీ చివరి నెంబర్ లభిస్తుంది. ఏది చేస్తే అది పొందుతారు అంటారు. కానీ ఏది ఆలోచిస్తే అది పొందుతారు అని అనరు కదా! సంకల్పం చాలా బాగా చేస్తున్నారు. బాప్ దాదా కూడా చదివి లేదా విని సంతోషిస్తున్నారు. కానీ ఏవైతే రావణాసురుని వస్తువులు దాచి పెట్టి ఉంచారో అవి మనస్సుకి యజమానిగా కానివ్వటం లేదు. నా అలవాటు, నా స్వభావం, నా సంస్కారం, నా ప్రవర్తన - ఇవన్నీ రావణాసురుని ఆస్తి, ఇవన్నీ మనస్సులో పెట్టుకుంటే ఇక మనస్సులో మనోభిరాముడు ఎక్కడ కూర్చుంటారు! రావణాసురుని వారసత్వంపై కూర్చుంటారా ఏమిటి? కనుక ఇప్పుడు దానిని తొలగించండి. - 

ఎప్పుడైతే నాది అనే మాట అంటున్నారో అప్పుడు నా స్వభావం, నా సంస్కారం ఏమిటి అనేది స్మృతిలోకి తెచ్చుకోండి. మరియు మనస్సు అనేది గుఱ్ఱం లాంటిది, అది చాలా వేగంగా పరుగు పెడుతుంది అని ప్రపంచం వారు కూడా అంటారు కానీ మీ మనస్సు పరుగు పెట్టగలదా? మీకు శ్రీమతం యొక్క కళ్ళెం గట్టిగా ఉంది. కళ్ళెం గట్టిగా ఉంటే ఏ అలజడి రాదు. కానీ ఏమి చేస్తున్నారు? బాప్ దాదా చూస్తూ ఉంటారు కదా, నవ్వు కూడా వస్తుంది. స్వారీ చేస్తున్నప్పుడు కళ్ళెం చేతిలోనే ఉంది కానీ, ఒకవేళ నడుస్తూ, నడుస్తూ కళ్ళెం పట్టుకునేవారి బుద్ధి లేదా మనస్సు ఏదైనా ప్రక్క దృశ్యం వైపు వెళ్ళితే ఏమౌతుంది? కళ్ళెం వదులు అవుతుంది. అలాగే శ్రీమతం అనే కళ్ళెం వదులు అవ్వటం ద్వారా మనస్సు చంచలం అయిపోతుంది. కనుక శ్రీమతం అనే కళ్ళెం సదా స్మృతిలో ఉంచుకోండి. ఏ విషయం వచ్చినా లేదా మనస్సు చంచలమైనా శ్రీమతం అనే కళ్ళెం బిగించుకోండి. ఇక ఏమి అవ్వదు. గమ్యానికి చేరుకోగలరు. ప్రతీ అడుగు కొరకు శ్రీమతం లభించింది. కేవలం బ్రహ్మచారి అవ్వండి అనేదే శ్రీమతం కాదు. ప్రతీ కర్మకు శ్రీమతం ఉంది - నడవటం, తినటం, త్రాగటం, వినటం, వినిపించటం - వీటన్నింటికి శ్రీమతం ఉంది. ఉందా, లేదా? మీరు పరచింతన చేస్తున్నారు. ఇది శ్రీమతమా? శ్రీమతాన్ని వదులు (లూజ్) చేస్తే మనస్సుకి చంచలమయ్యే అవకాశం లభిస్తుంది, తర్వాత దానికి అలవాటు అయిపోతుంది. అలవాటు చేసిన వారు ఎవరు? మీరే కదా! మొదట మనస్సుకి రాజు అవ్వండి. పరిశీలించుకోండి - లోలోపలే ఈ మంత్రి తన రాజ్యాన్ని స్థాపన చేయటం లేదు కదా? అని. ఈ రోజులలో రాజ్యంలో వేరే గ్రూప్ తయారు చేసేసి అధికారంలోకి వచ్చేస్తున్నారు లేదా అధికారంలో ఉన్న వారిని కదిలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మనస్సు కూడా అలానే చేస్తుంది, బుద్ధిని కూడా తనదిగా చేసుకుంటుంది. నోటిని, చెవిని, అన్నింటినీ తనవిగా చేసుకుంటుంది. కనుక రోజు పరిశీలించుకోండి - సమాచారం అడగండి. ఓ మనస్సు అనే మంత్రీ! నీవు ఏమి చేసావు, ఎక్కడా మోసం చేయలేదు కదా అని. లోలోపల గ్రూప్ తయారుచేసి, మిమ్మల్ని రాజుకు బదులు సేవాధారిగా చేసే విధంగా ఉండకూడదు. బ్రహ్మాబాబా ఆదిలో రోజూ దర్బారు పెట్టేవారు, ఆ దర్బారులో సహయోగి, సాతీలను ఆనాటి సమాచారం అడిగేవారు. ఆదిలో రోజూ బ్రహ్మాబాబా యొక్క దినచర్య ఇది. విన్నారు కదా? బ్రహ్మాబాబా కూడా శ్రమ చేసారు కదా! ధ్యాస పెట్టుకున్నారు అప్పుడే స్వరాజ్యాధికారి నుండి విశ్వరాజ్యాధికారిగా అయ్యారు. శివబాబా అయితే నిరాకారుడు. కానీ బ్రహ్మాబాబా అయితే మీ సమానంగా మొత్తం జీవితం పురుషార్ధం ద్వారా ప్రాప్తి పొందారు. కనుక బ్రహ్మాబాబాని అనుసరించండి. ఈ మనస్సు చాలా చంచలమైనది మరియు చాలా వేగమైనది. ఒక్క సెకనులో విదేశం అంతా త్రిప్పి తీసుకువస్తుంది. కనుక ఏమి విన్నారు! పిల్లల నుండి యజమాని అవ్వాలి. పిల్లలుగా అయితే అయ్యాము. వారసత్వం లభించింది అని సంతోషపడిపోవటం కాదు. వారసత్వానికి యజమాని కాకపోతే బాలక్ స్థితి ఏమి అవుతుంది? బాలక్ అంటేనే యజమాని. కానీ స్వరాజ్యానికి కూడా యజమాని అవ్వండి. కేవలం వారసత్వాన్ని చూసి సంతోషపడకండి, స్వరాజ్యాధికారిగా అవ్వండి. యజమానిగా కాకపోతే మోసం చేస్తుంది. బాప్ దాదా పిల్లలందరినీ స్వరాజ్యాధికారి రాజాగా చూడాలనుకుంటున్నారు. అధికారిగా ఉండాలి, ఆధీనం కాకూడదు. అర్థమైందా? ఏవిధంగా అవుతారు? పిల్లవాని నుండి యజమానిగా అవ్వాలి. రావణుని వస్తువులు ఈ హాలులోనే విడిచి పెట్టి వెళ్ళాలి. ఇది తపస్య స్థానం కదా! తపస్సుని అగ్ని అంటారు. అగ్నిలో అవన్నీ సమాప్తి అయిపోతాయి. బాప్ దాదా చూశారు - పిల్లలకి రావణానిపై ఇప్పటికీ ప్రేమ ఉంది. మనస్సులో కోరుకోవటం లేదు, కానీ ఉండిపోయింది. ఇప్పుడు దీనిని తొలగించండి. టీచర్స్ ఏమి చేస్తారు? ఇక్కడే వదిలి వెళ్తారా లేదా ట్రైన్లోంచి విసిరి వేస్తారా? ఎందుకంటే 63 జన్మల నుండి పాత వస్తువులు కనుక కొద్దిగా ప్రేమ ఉంది. పాండవులు ఏమి చేస్తారు? ఇక్కడే వదిలి పెట్టి వెళ్తారా లేదా క్రింద ఆబూలో వదిలిపెడతారా? ఇక్కడే వదిలి వెళ్ళాలి. వదలటానికి తయారుగా ఉన్నారా? బలహీనంగా అవును అంటున్నారు. బాప్ దాదా రోజూ పిల్లల విషయాలు ఏవో ఒకటి పరిశీలిస్తారు. మీరు కూడా పరిశీలించుకుంటేనే పరివర్తన అవుతారు. ఈ అవకాశం అదనంగా లభించింది. ఇది కూడా క్రొత్తవారికి లేక పాతవారికి అకస్మాత్తుగా లాటరీ లభించింది. అకస్మాత్తుగా లభించిన లాటరీకి గొప్పతనం ఉంటుంది కదా! కనుక ఈ లాటరీని ప్రత్యక్ష కర్మలోకి తీసుకువస్తూ పెంచుకుంటూ ఉండాలి. ఎంత స్వయం పట్ల, సర్వుల పట్ల కార్యంలో ఉపయోగిస్తారో, అంత పెరుగుతూ ఉంటుంది. కనుక పెంచుకుంటూ ఉండాలి. ఈ లాటరీ రోజుని మరచిపోకూడదు. స్మృతిలో ఉంచుకోవాలి. 

నలువైపుల ఉన్న బాలక్ సో మాలిక్ డబల్ అధికారం తీసుకునే శ్రేష్టాత్మలకు, సదా స్వరాజ్యాధికారియై తమ రాజ్యాన్ని నడిపించుకునే భాగ్యవాన్ ఆత్మలకి, సదా బాబా యొక్క సంస్కారమే నా సంస్కారం. ఈ విధి ద్వారా సేవలో ముందుకు వెళ్ళే శ్రేష్ట సేవాధారి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

నవరత్నాలలోకి వచ్చేటందుకు 9 విషయాల నుండి ముక్తి అవ్వాలని బాప్ దాదా చెప్పారు, ఆ 9 విషయాలు - 1. క్రోధముక్తులు 2. వ్యర్ధసంకల్ప ముక్తులు 3. తగుల్పాటు ముక్తులు 4. పరమతం, పరచింతన మరియు పరదర్శన ముక్తులు 5. అభిమానం మరియు అవమాన ముక్తులు 6. గొడవల నుండి ముక్తులు 7. వ్యర్ధమాటలు, అలజడి చేసే మాటల నుండి ముక్తులు 8. అప్రసన్నత ముక్తులు 9. బలహీనం అవ్వటం నుండి ముక్తులు. 

Comments