09-01-1995 అవ్యక్త మురళి

      09-01-1995         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

నిశ్చయబుద్ది యొక్క గుర్తులు - నిశ్చిత విజయీ మరియు సదా నిశ్చింతాస్థితి యొక్క అనుభవం.

ఈ రోజు పిల్లలందరి యొక్క రక్షకుడు మరియు శిక్షకుడు అయిన బాప్ దాదా తన బ్రాహ్మణ పిల్లలందరి పునాదిని చూస్తున్నారు. ఇది అందరికీ తెలుసు కదా - వర్తమాన శ్రేష్టజీవితానికి పునాది నిశ్చయం. ఎంతగా నిశ్చయం అనే పునాది గట్టిగా ఉంటుందో అంతగా ఆది నుండి అంతిమం వరకు సహజయోగి, నిర్మల స్వభావం, శుభభావన యొక్క వృత్తి మరియు ఆత్మిక దృష్టి సదా స్వతహాగా అనుభవం అవుతాయి. ప్రతి సమయం నడవడిక, ముఖం ద్వారా వాటి మెరుపు అనుభవం అవుతుంది. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో నేను ఇది, బాబా ఇది అని కేవలం తెలుసుకోవటం కాదు కానీ తెలుసుకోవటం అంటే ఏది తెలుసుకున్నారో దానిని అంగీకరించాలి మరియు నడవాలి. 

బాప్ దాదా చూస్తున్నారు - బ్రాహ్మణ పిల్లలుగా పిలవబడుతున్న వారు మేము నిశ్చయబుద్ది ఆత్మలం అని నషాగా చెప్తున్నారు. బాప్ దాదా నిశ్చయబుద్ది పిల్లలందరినీ అడుగుతున్నారు - మీరందరు అంటారు కదా నిశ్చయబుద్ది విజయంతి అని. అది కూడా మీలో పక్కాగా ఉందా? ఒకొక్కసారి విజయం, ఒకొక్కసారి ఓటమి అలా ఎందుకు జరుగుతుంది?ఎప్పుడైనా అప్పుడప్పుడు అలజడి జరిగిన సమయంలో నిశ్చయం ఉండటం లేదా? ఎందుకంటే నిశ్చయబుద్ధికి గుర్తు - విజయీ, అయితే సదా విజయీగా ఉంటున్నారా? లేక ఒకొక్కసారి విజయీగా, ఒకొక్కసారి కొంచెం అలజడి ఉంటుందా? కొంచెం కొంచెం ఉంటుందా? ఇప్పుడు అవును అనటం లేదు. కానీ ఆ సమయంలో ఏమి అవుతుంది? నిశ్చయం సమాప్తి అయిపోతుందా? సదా నిశ్చయబుద్దియేనా లేక సదా విజయీనా? లేక మధ్యమధ్యలో గుటకలు మ్రింగుతున్నారా, లొంగుపాటు అయిపోతున్నారా? నిశ్చయం యొక్క పునాది నాలుగు వైపులా గట్టిగా ఉందా లేదా అప్పుడప్పుడు ఒకవైపు, అప్పుడప్పుడు రెండు వైపులా ఢీలా అయిపోతుందా? ఏదైనా వస్తువుని గట్టిగా చేయాలంటే నాలుగు వైపులా బిగిస్తారు కదా! ఒకవేళ ఒక వైపు అయినా కానీ కొంచెంగా అలజడి ఉంటే అది పక్కాగా ఉంటుందా? కదులుతుంది కదా? అయితే నాలుగువైపుల నిశ్చయం గురించి తెలుసా? నాలుగు రకాలైన నిశ్చయం అంటే బాబాపై, స్వయంపై, డ్రామాపై మరియు బ్రాహ్మణ పరివారంపై - ఇలా నాలుగువైపుల నిశ్చయాన్ని తెలుసుకోవటం కాదు అంగీకరించి నడవాలి. ఒకవేళ తెలుసుకుంటున్నారు. కానీ నడవకపోతే విజయం అలజడి అవుతుంది. విజయం అలజడిగా ఉన్నప్పుడు నలువైపులలో ఏ వైపు అలజడి ఉంది? అని పరిశీలించుకోవాలి. బాప్ దాదా చూస్తున్నారు - కొంతమంది పిల్లలకు బాబాపై పూర్తి నిశ్చయం ఉంది, దీనిలో పాస్ అయ్యారు కానీ స్వయంపై నిశ్చయంలో తేడా వస్తుంది. తెలుసుకుంటున్నారు కూడా, అంటున్నారు కూడా నేను ఇది, నేను అది అని, కానీ ఏదైతే తెలుసుకున్నారో, అంగీకరించారో దానిని స్వరూపంలో, నడవడికలో, కర్మలోకి తీసుకురావాలి. దానిలో తేడా వచ్చేస్తుంది. ఒకవైపు ఆలోచిస్తున్నారు నేను మాస్టర్ సర్వశక్తివాన్ని, విశ్వ కళ్యాణకారిని అని, మరలా రెండవ వైపు చిన్న పరిస్థితులపై కూడా విజయం పొందలేకపోతున్నారు. మాస్టర్ సర్వశక్తివంతులే కానీ ఈ పరిస్థితి ఇంత పెద్దది, ఈ విషయం ఇలాంటిది అని అంటున్నారు. అయితే ఇది నిశ్చయుం అయ్యిందా లేక కేవలం తెలుసుకుని అంగీకరించి నడవటం లేదా? అంటారు లేదా ఆలోచిస్తారు. మేము విశ్వ కళ్యాణకారులం అని కానీ విశ్వాన్ని వదిలివేయండి స్వకళ్యాణంలోనే బలహీనంగా ఉంటున్నారు. ఆ సమయంలో మీరు స్వయాన్ని పరివర్తన చేసుకునే స్వకళ్యాణులు కాదా అని ప్రశ్నిస్తే ఏమి జవాబిస్తారు? విశ్వకళ్యాణకారులమే కానీ స్వకళ్యాణము చాలా కష్టం. ఈ విషయం మారటం చాలా కష్టం అంటారు. అటువంటి వారిని ఏమంటారు? విశ్వకళ్యాణకారి అంటారా లేక బలహీనులు అంటారా? అందువలన స్వయంలో కూడా పరిస్థితి ప్రమాణంగా, సమయ ప్రమాణంగా, సంబంధ సంపర్కాలు ప్రమాణంగా నిశ్చయం అనేది స్వరూపంలోకి రావాలి. అటువంటి నిశ్చయబుద్ధి పిల్లలకి విజయం లభించే ఉంది. నేను శ్రేష్ట ఆత్మను అని పక్కాగా ఉంది కదా? లేక ఈ పాఠం కూడా రాలేదా? పక్కా అయ్యిందా? మంచిది. ప్రపంచంలోని వైజ్ఞానికులు ఎవరైనా కానీ మిమ్మల్ని కదపడానికి ప్రయత్నించి మీరు ఆత్మ కాదు, శరీరం అంటే అంగీకరిస్తారా లేక వారిని అంగీకరింపచేస్తారా? ఎలాగైతే నేను శరీరం కాదు ఆత్మని అని పక్కా అయిపోయిందో అలాగే నేను ఎటువంటి ఆత్మని అని ఇది కూడా పక్కాగా ఉండాలి. అటువంటి నిశ్చయబుద్ధి ఆత్మలకు విజయం కూడా నిశ్చయం అయిపోయింది. ఓటమి అసంభవం, విజయం నిశ్చితం. ఎప్పుడైనా కానీ ఏ రకమైన విషయం ఎదురుగా వచ్చినా కానీ ఇవి అంతిమం వరకు వస్తాయి ఇది నిశ్చితం అయిపోయింది అనుకుంటారు కానీ వాటిలో విజయీగా అయ్యేటందుకు ఒకే సమయంలో నలువైపుల నిశ్చయం సమానంగా ఉండాలి. మూడువైపుల సమానంగా ఉండి ఒకవైపు సరిగా లేకపోతే విజయం నిశ్చితం కాదు. కానీ శ్రమతో విజయం పొందుతారు. విజయం నిశ్చితం అయిపోయిన వారు శ్రమ చేయనక్కరలేదు. 

కొంతమంది ఒకొక్కసారి అంటున్నారు బాప్ దాదా అయితే చాలా మంచివారు, ఇదైతే పక్కాగా ఉంది - బాబా మా తండ్రి, మేము పిల్లలం మాకు బాబాతోనే సంబంధం ఉంది కానీ దైవీ పరివారంతో గొడవలు వస్తున్నాయి. కనుక దానిలో నిశ్చయం అలజడి అవుతుంది అందువలన పరివారాన్ని వదిలేస్తున్నాం, తేలిక అయిపోతున్నాం అని అంటే ఒకవైపు బలహీనం అయిపోయినట్లే కదా! పరివారం లేకుండా మాలలోకి ఎలా వస్తారు? రావాలా? వద్దా? మాలలోకి రావాలా? అందరూ రావాలా? 108 లేదా 16108లోకి రావాలి. 108లోకి రావాలి కానీ ఇక్కడ కూర్చున్న వారు మూడు వేల మంది. అయితే మూడు వేలమందిలో ఎవరెవరు 108లోకి వస్తారు? అందరూ వస్తారా? అయితే మాల యొక్క నెంబర్ పెరిగిపోతుంది. మాల ఎప్పుడు తయారవుతుంది? పూస, పూసతో కలిసినప్పుడే ఒకే దారంలో గ్రుచ్చబడి ఉంటాయి. వేర్వేరు దారంలో వేర్వేరు పూసలుగా ఉంటే దానిని మాల అనరు. పరివారం అంతా కలిసి మాల అవుతుంది, పరివారాన్ని వదిలేసి మిగిలిన మూడు నిశ్చయాలు పక్కాగా ఉంటే విజయం నిశ్చితం కాదు. పరివారం యొక్క గొడవలు నుండి వేరుగా బాబా తోడుగా ఉంటే అవుతుందా? అవ్వదా? పని అయితే బాబాతో ఉందా లేదా అక్కయ్యలు, అన్నయ్యలతో ఉందా? బాబాతో పని ఉంది, వారసత్వం కూడా బాబా నుండే లభిస్తుంది. అన్నయ్యలు, అక్కయ్యల ద్వారా ఏమి లభిస్తుంది? అనుకుంటారు కానీ బ్రాహ్మణ జీవితంలో అతీత స్థితి ఏమిటంటే ధర్మం మరియు రాజ్యం రెండూ స్థాపన అవుతున్నాయి. కేవలం ధర్మమే కాదు. దర్మపితలు అయితే కేవలం ధర్మాన్ని స్థాపన చేస్తారు. కానీ బాబా యొక్క విశేషత - ధర్మం మరియు రాజ్యం యొక్క స్థాపన చేయటం. అందువలనే మీరు సహజ రాజయోగం అని అంటారు. అయితే రాజ్యంలో ఒకే రాజు ఏమి చేస్తాడు? చాలామంచి కిరీటం, సింహాసనం ఉన్నా కానీ ఏం చేస్తాడు? రాజధాని కావాలి కదా! అయితే రాజధాని అంటే బ్రాహ్మణ పరివారమే రాజపరివారం. బ్రాహ్మణ పరివారంలో ప్రతి పరిస్థితిలో నిశ్చయబుద్ధిగా ఉండటం అంటే రాజ్యభాగ్యంలో కూడా సదా రాజ్యాధికారిగా అవ్వటం. అందువలన పరివారంతో లేకపోయినా ఏమీ పర్వాలేదు. పరివారం నుండి ఏమీ రాదు, బాబా నుండి వస్తుంది అని భావించకూడదు. డ్రామా మర్చిపోతే బాబా జ్ఞాపకం ఉంటారు కదా! కానీ ఏ బలహీనత అయినా ఒకే సమయంలో ఉంటుంది, స్వస్థితి అంటే స్వ నిశ్చయం ఒకవేళ బలహీనంగా ఉంటే విజయం నిశ్చితం అవ్వటానికి బదులు అలజడి అవుతుంది. 

బాప్ దాదా నిశ్చయం యొక్క పునాదిని పరిశీలిస్తున్నారు. ఏమి చూశారు? సదా నాలుగు రకాలైన నిశ్చయం ఒకే సమయంలో వెనువెంట ఉండటం లేదు. ఒకొక్కసారి ఉంటుంది, ఒకొక్కసారి కదులుతుంది. అందువలన సదా విజయం యొక్క అనుభవాన్ని చేసుకోలేకపోతున్నారు. మరలా ఆలోచిస్తున్నారు ఇది అవ్వాలి కానీ ఎందుకు అవ్వలేదో తెలియదు అని. చాలా శ్రమ చేశాను, చాలా బాగా ఆలోచించాను .... కానీ ఆలోచించటం మరియు చేయటం ఈ రెండింటిలో తేడా వచ్చేస్తుంది. దీని అర్థం ఏమిటంటే నలువైపుల నిశ్చయం గట్టిగా లేదు. కానీ నవ్వు వచ్చే విషయం ఏమిటంటే డ్రామా, డ్రామా అని అంటున్నారు. డ్రామాయే, డ్రామాయే...... కానీ మరలా మంచిగా కదులుతున్నారు. ఒకొక్కసారి సంకల్పంలో కదులుతున్నారు, ఒకొక్కసారి మాట వరకు కదులుతున్నారు, ఒకొక్కసారి కర్మ వరకు కూడా వచ్చేస్తుంది. ఆ సమయంలో ఏమి అనిపిస్తుంది? ఆ దృశ్యం ఎదురుగా తెచ్చుకోండి. డ్రామా, డ్రామా అని అంటున్నారు కదులుతూ ఊగుతూ ఉంటున్నారు. నిశ్చయబుద్ది ఆత్మల గుర్తు ఏమి చెప్పాను? విజయం అనేది నిశ్చితం. ఒకవేళ విధి సరిగ్గా ఉంటే సిద్ది లభించకపోవటం అనేది ఉండదు. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా విజయం లభించడం లేదు అంటే నిశ్చయంలో లోపం ఉన్నట్లు భావించండి. నలువైపుల పరిశీలించుకోండి. ఒకవైపు కాదు. నిశ్చయబుద్ధికి గుర్తు విజయం ఎలా అయితే నిశ్చితం అయిపోయిందో అలాగే నిశ్చింతగా కూడా ఉంటారు. 

ఏ వ్యర్థచింతన రాదు. శుభచింతన తప్ప వ్యర్ధం యొక్క నామరూపాలు ఉండవు. వ్యర్ధం వచ్చింది, పోగొట్టుకున్నాను... ఇలా ఉండరు. నిశ్చయబుద్ది ఆత్మల ముందుకు వ్యర్ధం రాలేదు. ఎందుకంటే వ్యర్ధం అంటే ఏమిటి? ఎందుకు? ఎలాగ..... ఇదే వ్యర్ధం కదా! డ్రామా రహస్యం తెలిసినవారు, సృష్టి యొక్క ఆది, మధ్య, అంత్యాలు తెలిసినవారు చిన్న విషయం యొక్క ఆది, మధ్య, అంత్యాలను తెలుసుకోలేరా? తెలుసుకోని కారణంగానే ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా అనే వ్యర్ధ సంకల్పాలు వస్తున్నాయి. ఒకవేళ డ్రామాపై అంచంచల నిశ్చయం, నాలెడ్జ్ ఫుల్ గా (జ్ఞానస్వరూపంగా), పవర్ ఫుల్ గా (శక్తిశాలిగా) ఉంటే మిమ్మల్ని కదపడానికి వ్యర్థ సంకల్పాలకు ధైర్యం చాలదు. ఒకవేళ చలింపచేస్తే మాత్రం ఏమి అయిపోయిందో తెలియదు అని ఆలోచిస్తారు. బాప్ దాదా నవ్వుతున్నారు. డ్రామా యొక్క ఆది, మధ్య, అంత్యాలు తెలుసుకున్నారు, మీ యొక్క 84 జన్మల గురించి తెలుసుకున్నారు కానీ ఈ చిన్న విషయం గురించి తెలుసుకోలేకపోతున్నారు అని. చాలా తెలివైన వారు కూడా ప్రతి సమయం తెలివి చూపిస్తారు కదా! కల్పవృక్షం యొక్క ప్రతి ఆకు గురించి తెలుసా లేక తెలియదా? అందరు వృక్షం యొక్క పునాది దగ్గర కూర్చున్నారా? లేక 7,8 మందే కూర్చున్నారా? మూలం దగ్గర కూర్చుని వృక్షం గురించి తెలుసుకుంటున్నారా? ఆకు, ఆకు గురించి తెలుసా లేదా ఇది ఎలాగో తెలియదు అంటారా? నిశ్చయానికి గుర్తు నిశ్చింత స్థితిని అనుభవం చేసుకోండి. అవుతుందో, అవ్వదో, ఏమౌతుందో, చేయటం అయితే చేస్తున్నాము, ఏమౌతుందో చూడాలి అని అంటున్నారు. దీనిని నిశ్చింత అనరు. బాబా ముందు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. " బాబా నీవు సహాయకారివి కదా, నీవు రక్షకుడివి కదా, నీవు ఇది కదా? అది కదా.... అంటూ ఫిర్యాదులు చేయటం అంటే అధికారాన్ని పోగొట్టుకోవడం. అధికారి ఎప్పుడూ ఫిర్యాదు చేయరు. ఇది చేసి పెట్టు, ఇది అవుతుంది కదా! అని. నిశ్చయబుద్ది అంటే నిశ్చింత. ఈ ప్రత్యక్ష గుర్తులను మీలో పరిశీలించుకోండి. మేము నిశ్చయబుద్ది ఆత్మలమే అని సోమరిగా ఉండవద్దు. ఏ నిశ్చయం బలహీనంగా ఉందో పరిశీలించుకోండి మరియు పరివర్తన చేసుకోండి. కేవలం పరిశీలించుకోవడమే కాదు. బాప్ దాదా చెప్పారు కదా! చెకర్‌గా అవ్వటంతో (పరిశీలించు కునేవారు)పాటు మేకర్‌గా (తయారయ్యేవారు) అవ్వండి. కేవలం పరిశీలించుకునే వారిగా కాదు. పరిశీలించుకోవడం అంటే సెకనులో పరివర్తన అవ్వటం, పరిశీలించుకుని పరివర్తన కాకపోతే ఏమౌతుంది? చాలా సమయం నుండి స్వయంలో మనస్సుని బలహీనంగా చేసుకునే సంస్కారం పక్కా అయిపోతుంది. చాలా కాలం యొక్క సంస్కారమే అంతిమంలో కూడా తప్పకుండా ఎదుర్కుంటుంది. కొందరు ఆలోచిస్తారు అలా కాదు, అంతిమంలో నేను బాబాని తప్ప ఇంకేమీ జ్ఞాపకం చేయను అని. కానీ అలా జరుగదు. చాలా కాలం యొక్క అభ్యాసం కావాలి. లేకపోతే ఒక్క సెకను శివబాబా, శివబాబా అనుకుంటారు మరలా ఇంకొక సెకను మాయ అంటుంది, అది కాదు నీలో శక్తి లేదు, నువ్వు బలహీనుడివి అని ఇలా యుద్ధం నడుస్తూ ఉంటుంది. అంతిమంలో మనం ఎలా ఉండాలి అని బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం ఉంది కదా అది మీకు తెలుసు కదా? అంతిమకాలం గురించి వర్ణన చేస్తారు కదా! అది నిశ్చింతగా ఉన్నప్పుడే సహజం అవుతుంది. లేకపోతే ఈ వ్యర్దసంకల్పాలే భూతాల రూపంలో, యమదూతల రూపంలో వస్తాయి. ఇక ఏ యమదూతలు రారు. యమదూతలు ఏం చేస్తాయి? భయపెడతాయి. మిగిలిన వారు విమానాలలో వెళ్ళిపోతారు అంటే ఎగిరేకళతో దాటి వెళ్ళిపోతారు. అంతే కానీ విమానాలు ఏమీ ఉండవు. అది ఎగిరేకళ యొక్క అనుభవం. అందువలన ఏమి చేయాలి? మొదటి నుండే పరిశీలించుకుని పరివర్తన చేసుకుంటారా లేక కేవలం పరివర్తన చేసుకుంటారా? రెండూ చేస్తారా? ఎప్పటి వరకు చేస్తారు? చేస్తాం అని చెప్పి బాప్ దాదాని సంతోష పెడుతున్నారు. ఇప్పుడు కూడా చూడండి. మధువనం వారు ప్రతిజ్ఞ చేశారు కదా, అది కేవలం కాగితం వరకే ఉందా లేక జీవితం వరకు ఉందా? 

ఈరోజు మధువన నివాసీల యొక్క టర్న్. మధువనం వారితో బాప్ దాదాకి విశేష స్నేహం. అందరితోనూ ఉంటుంది కానీ మధువనం వారితో కొంచెం విశేషంగా ఉంటుంది. ఎందుకంటే నిమిత్తమైనవారు కదా! మీరు వచ్చారంటే మర్యాద చేస్తున్నారు కదా! మర్యాద చేయటంలో మధువనం వారు పాస్ అయ్యారు కదా! అతిథులను గౌరవించటమే మహోన్నతము. ఎవరికైతే అతిథులను గౌరవించటం వస్తుందో వారు మహాన్ గా అవుతారు. కేవలం తినటం, త్రాగటం విషయంలో కాదు మనస్సు యొక్క స్నేహంతో అతిథులను గౌరవించాలి అది అన్నిటికంటే శ్రేష్టమైనది. ఎన్ని విహారయాత్రలు చేసినా మనసు యొక్క స్నేహం లభించకపోతే ఏమీ లభించలేదు అంటారు. అయితే మధువనం వారు మనస్ఫూర్వక స్నేహంతో అతిథులను గౌరవిస్తారు. చేస్తారు కదా? లేక ఏమైనా అలజడి చేసి బాబా ఇలాగే చెప్పారు అని అంటారా? అలా చేయకూడదు. స్నేహ సాగరుని పిల్లలు కదా! అంతే కానీ చిన్న బిందె స్నేహం గలవారి పిల్లలు కాదు కదా! సాగరుని పిల్లలు ఎప్పటివరకు స్నేహం ఇస్తాం, ఎంతవరకూ ఇస్తాం ..... అని అనకూడదు. చిన్న బిందె కాదు, సాగరుని పిల్లలు కనుక బేహద్. 

అందరి దగ్గర స్నేహం యొక్క స్టాక్ ఉందా? మాతల దగ్గర, కుమారీల దగ్గర, పాండవుల దగ్గర కూడా ఉంది కదా! సాగరంగా ఉందా లేదా కొంచెమే ఉందా? సాగరమేనా? మంచిది. ఎప్పుడు కోపంలోకి రావటం లేదు కదా? స్నేహ సాగరులు అయితే క్రోధం ఎక్కడి నుండి వస్తుంది? ఇతరుల యొక్క సంస్కారాలను తెలుసుకుని సంతృప్తి చేస్తున్నారు కదా! వారు తప్పు అయినా కానీ మీరు జ్ఞానసాగరులు కదా వీరు ఏమిటి? అనేది మీకు తెలుసు కదా అయినా కానీ ఆ సమయంలో వీరు ఇలా చేసారు కదా అందువలనే నేను చేశాను అని అంటున్నారు. తప్పు చేసిన వారితో కలిసి మరలా తప్పు చేస్తే ఇక ఏమి అద్భుతం చేసినట్లు? వారు తప్పు చేసారు మరియు మీరు దానికి బదులు తప్పే ఇచ్చారు. కొంతమంది అంటారు కదా ఒకసారి కోప్పడితే ఏమీ అవ్వదు, మాటిమాటికి కోప్పడతామా ఏమిటి! అని. వారి స్వభావమే క్రోధం అయితే వారు కోపంలోకి రాకపోతే ఇంకేమి చేస్తారు? వారి పని కోప్పడటం మరియు మీ పని స్నేహం ఇవ్వటమా లేదా కోప్పడటమా? వారు 10 సార్లు కోపంలోకి వస్తే మీరు ఒకసారే జవాబు ఇస్తారు కదా? ఇవ్వకపోతే అప్పుడు వారు 20 సార్లు కోపంలోకి వస్తారు. అప్పుడేమి చేస్తారు? అంత సహనశక్తి ఉందా? లేదా వారు 10 సార్లు చేస్తే మీరు సగం చేసినా పర్వాలేదా? వారు అసత్యం మాట్లాడారు మీరు కోపంలోకి వచ్చారు. ఇది బావుంటుందా? రెండూ ఒకటి అయిపోయినట్లే కదా! మరలా చాలా గొప్పగా అంటారు, వారు అసత్యం మాట్లాడారు కదా! అందువలన కోపం వచ్చింది అని. వారు అసత్యం మాట్లాడటం మంచిది కాదు, మీరు కోపంలోకి రావటం మంచిదా? మీరు స్నేహసాగరుని మాస్టర్ స్నేహసాగరులు. స్నేహసాగరుల నయనాలు, వృత్తి, దృష్టిలో కొంచెం కూడా వేరే భావం రాదు. కొంచెం కొంచెం ఆవేశం వచ్చేసింది అంటే స్నేహ సాగరులు అంటారా? లేక చిన్న పాత్ర నిండుగా(లోటా) స్నేహం ఉన్నట్లా? ఏది ఏమైపోయినా మొత్తం ప్రపంచం క్రోధం చేసినా కానీ మాస్టర్ స్నేహసాగరులు ప్రపంచం గురించి చింతించరు. నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. ఏ చింత ఉండదు. దేని గురించి చింత ఉండేదో అది పొందేశారు. పొందారు కదా? ఇప్పుడు ఈ వ్యర్ధ విషయాలతో నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి. పరిశీలన యొక్క చింత చేయండి. పరివర్తన యొక్క చింత చేయండి. కానీ వ్యర్ధంలో నిశ్చింతగా ఉండండి. చేయగలరా లేక వెళ్ళిన తర్వాత కొంచెంగా పిల్లలపై, మనవలపై క్రోధం చేస్తారా, కొంచెం పైకి క్రిందకి అవుతారా? స్నేహానికి బదులు వేరే భావన కూడా వచ్చేస్తుందా? ఆఫీస్ కి వెళ్ళినప్పుడు, వ్యాపారంలోకి వెళ్ళినపుడు, నౌకర్లు ఎలా ఉన్నా, వాయుమండలం ఎలా ఉన్నా కానీ వ్యర్ధంతో నిశ్చింత చక్రవర్తిగా ఉండాలి. సమర్ధంలో నిశ్చింతగా కాకూడదు. వ్యర్ధంతో నిశ్చింత చక్రవర్తిగా కావాలి. కొందరు దీనిని వ్యతిరేకంగా తీసుకుని మర్యాదలలో కూడా - బాబా చెప్పారు కదా, నిశ్చింత చక్రవర్తిగా అవ్వమని అని అంటారు. కానీ మర్యాదలలో నిశ్చింత చక్రవర్తిగా కాకూడదు. మీ బిరుదు ఏమిటి? మర్యాదా పురుషోత్తములు. ఈ మర్యాదలే బ్రాహ్మణ జీవితం యొక్క అడుగులు. అడుగుపై అడుగు వేయకపోతే గమ్యం ఎలా లభిస్తుంది? బ్రహ్మాబాబా అడుగుపై ఆడుగు చేయండి. ఈ మర్యాదలే అడుగులు. ఈ అడుగు పైకి కిందకి అయితే గమ్యం నుండి దూరం అయిపోతారు. మరలా శ్రమ చేయాల్సి వస్తుంది. బాప్ దాదాకి పిల్లల శ్రమ మంచిగా అనిపించదు. సహజయోగి అని అంటూ శ్రమ చేస్తున్నారు. అలా అయితే బాగా అనిపిస్తుందా? అందరూ మంచిగా ఉన్నారా? మూలగా కూర్చున్న వారు బాప్ దాదా చూడనే చూడలేదు అని అనుకుంటున్నారా? మూలగా చలిలో వేడిగా కూర్చున్నారు కదా! (బాప్ దాదా డ్రిల్ చేయించారు). 

ఎవరెడియేనా? ఇప్పుడిప్పుడే బాప్ దాదా అందరు కలిసి వెళ్ళిపోదాము అని అంటే వచ్చేస్తారా? మేం వెళ్తున్నాం అని ఫోన్ లేదా టెలిగ్రామ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారా? టెలిఫోన్ లైన్ కలవదు. మీ ఇంట్లో వాళ్లు ఎక్కడికి వెళ్ళిపోయారో అనుకుంటే ఏం చేస్తారు? అసలు అయితే మంచిదే కదా? సెకనులో ఆత్మ వెళ్ళిపోతుంది లేదా ఈ సబ్జక్టులో బలహీనం అని జ్ఞాపకం వస్తుందా? వస్తువులు అన్నీ సర్దేసి వచ్చేస్తాం అని వస్తువులు జ్ఞాపకం వస్తాయా? లేక మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వస్తాం అనే ఆలోచన రాదు కదా? అందరు బంధనముక్తులుగా అవుతారా! అందువలనే ఇప్పటి నుండి పరిశీలించుకోండి. ఏదైనా బంగారపు, వెండి దారాలు మిగిలి ఉన్నాయా? అని. ఇనుపవి అయితే లావుగా ఉండి కనిపిస్తాయి కానీ బంగారంతో, వెండితో ఉన్నవి ఆకర్షితం చేస్తాయి. ఎవరెడీ అంటే ఆజ్ఞ ఇవ్వగానే వెళ్ళిపోవాలి. అంతగా నాది అనే భావన నుండి ముక్తులేనా? అన్నిటికంటే పెద్ద నాది అనే భావన విన్పించాను కదా - దేహబ్రాంతితో పాటూ దేహాభిమానం యొక్క బంగారపు, వెండి దారాలు చాలా ఉన్నాయి అందువలన సూక్ష్మ బుద్దితో, స్థూలబుద్దితో కాదు నాది అంటూ ఏమీ లేదు, ఏమీ లేదు అని కాదు. లోతైనబుద్దితో పరిశీలించుకోండి. ఏదైనా అల్పకాలిక నషా దారంగా అయ్యి ఆపటానికి నిమిత్తం కావటం లేదు కదా? అని. అనుసరించటంలో సదా బ్రహ్మాబాబాని అనుసరించండి. సర్వుల పట్ల గుణ గ్రాహకులుగా అవ్వటం వేరే విషయం కానీ అనుసరించటంలో తండ్రిని అనుసరించాలి. కొందరు అన్నయ్యలను, అక్కయ్యలను అనుసరించాలి అని అనుకుంటున్నారు. కానీ వారు కూడా ఎవరిని అనుసరిస్తున్నారు? వారు బ్రహ్మాబాబాని అనుసరిస్తారు. మరలా మీరు వారిని అనుసరిస్తున్నారు. డైరెక్ట్ గా ఎందుకు అనుసరించటం లేదు? అందరూ బ్రహ్మాకుమారులు కదా? లేక ఫలానా అక్కయ్య కుమారులు లేదా అన్నయ్య కుమారులా? కాదు కదా! తండ్రి ఎవరు? బ్రహ్మ కదా తండ్రిని అనుసరించండి అని అంటారా లేదా అన్నయ్యలను, అక్కయ్యలను అనుసరించమని చెప్పారా? అందరిలో విశేషతలను చూడండి కానీ అనుసరించటంలో తండ్రిని అనుసరించండి. గౌరవం ఉంచుకోండి. కానీ దారి చూపే వారు బాబా ఒక్కరే. అన్నయ్య, అక్కయ్య ఎవరూ దారి చూపేవారు అవ్వరు. దారి చూపేవారు ఒక్కరే. మరియు సాకార ఉదాహరణ బ్రహ్మాబాబా, అంతే. తండ్రిని అనుసరిస్తున్నారా లేక బ్రహ్మాబాబాని చూడలేదు కదా అని ఆలోచిస్తున్నారా, బ్రహ్మ బాబాని చూడలేదు. తెలియదు అయితే ఎలా అనుసరించాలి? అనుసరించటం అంటే అడుగుపై అడుగు వేయటం అది అయితే తెలుసు కదా లేక తెలియదా? బ్రహ్మాబాబా మాకు తెలియదు, చూడలేదు, టీచర్ ని అయితే చూశాం, అన్నయ్యలు, అక్కయ్యలని చూసాం, బాబాని అయితే చూడలేదు అని ఆలోచించటం లేదు కదా? ఎవరు నిమిత్తం అయినా కానీ నిమిత్తంగా చేసినది ఎవరు? మీకు మీరే నిమిత్తంగా కాలేదు కదా? బాబా చేశారు కదా? అంటే బాబా స్మృతి వస్తుంది కదా? మంచిది. అందరు బాగా సెట్ అయ్యారు కదా! నిద్రపోవటంలో, తినటం మంచిగా ఉందా? లేక బాగా మూలగా పంపించేసారు అనుకుంటున్నారా? భక్తిమార్గంలో యాత్రలలో ఎంత దూరం నడుస్తారు. కానీ మీకైతే దూరంగా ఉన్నా కూడా తీసుకువెళ్ళడానికి బస్సు వస్తుంది. విశ్రాంతిగా వస్తున్నారు కదా? మరియు బ్రహ్మాబాబా ఉన్నప్పుడు అయితే ఈ కోట్లు, కుర్చీలు లేవు కానీ ఇప్పుడు కోట్లు, కుర్చీలు ఉన్నాయి. ఎంత విశ్రాంతిగా కూర్చున్నారు! బాప్ దాదాకి కూడా తెలుసు పాత శరీరం కనుక పాత శరీరాలకు సాధనాలు కావాలి అని. కానీ ఈ అభ్యాసం తప్పకుండా చేయండి - ఏ సమయంలో అయినా సాధనాలు లేకపోయినా సాధనలో విఘ్నం రాకూడదు. ఏది లభిస్తే అది మంచిది. కుర్చీ దొరికినా మంచిదే, నేల లభించినా మంచిదే. అందరు విశ్రాంతిగా ఉన్నారా లేదా మంచాలు కావాలా? ఇంటి వద్ద అయితే మంచాలపై నిద్రపోతారు కదా! ఇక్కడ కూడా మంచాలు దొరికితే ఏముంటుంది! మార్పు కావాలి కదా! మార్పు కోసం ఎంతగా ఖర్చు చేసి వెళ్తారు! అక్కడ మంచాలపై పడుకుంటారు, ఇక్కడ పట్టాపై పడుకుంటున్నారు అంటే మార్పు వచ్చింది కదా! ఇదైతే చెప్పాను కదా - ఎంతగా సాధనాలు పెరుగుతూ ఉంటాయో అంతగా సంఖ్య డబల్, (రెండు రెట్లు) త్రిబుల్ (మూడు రెట్లు) అవుతుంది అని. ఇదైతే నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు జ్ఞానసరోవరం తయారుచేస్తున్నారు మరలా సంవత్సరం జ్ఞానసరోవరం చిన్నది అయిపోయింది అంటారు. ఇది జరగవలసిందే. ఎందుకంటే సేవ కూడా సమాప్తి చేయాలా లేదా అలా నడుస్తూనే ఉండాలా? సంపన్నం చేసి సమాప్తి చేయాలి. సంపన్నం కూడా ఎప్పుడవుతుందంటే తక్కువలో తక్కువ 9 లక్షల మాలను తయారుచేయండి. మంచిది. 

నలువైపుల ఉన్న సర్వ నిశ్చయబుద్ధి శ్రేష్టాత్మలకు, సదా నిశ్చిత విజయీ ఆత్మలకు, సదా నిశ్చింత ఆత్మలకు, సదా శ్రేష్టవిధి ద్వారా వృద్ధి చేయడానికి నిమిత్తమయ్యే విశేషాత్మలకు, సదా ఒకే బాబా, ఒకే బలం, ఒకే నమ్మకంలో అచంచలంగా, అడోల్ గా ఉండే సమీపాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments