06-04-1995 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
పవిత్రత యొక్క ఆత్మిక వ్యక్తిత్వం యొక్క స్మృతిస్వరూపం ద్వారా మాయాజీత్ అవ్వండి.
ఈరోజు స్నేహ సాగరుడు అయిన బాప్ దాదా నలువైపుల ఉన్న స్నేహి పిల్లలందరిని చూస్తున్నారు. ప్రతీ ఒక్క స్నేహి పిల్లల ముఖంలో ఆత్మిక వ్యక్తిత్వం యొక్క మెరుపు చూస్తున్నారు. బయట రూపంతో సాధారణ వ్యక్తిత్వం కలవారు కానీ ఆత్మిక వ్యక్తిత్వంలో అందరికంటే నెంబర్ వన్, ప్రపంచంలో అనేక రకాలైన వ్యక్తిత్వం, ఏదైనా విశేష పొజిషన్ యొక్క వ్యక్తిత్వం కానీ అందరి ముఖంలో, నడవడికలో ఏమి వ్యక్తిత్వం ఉంది? పవిత్రత యొక్క వ్యక్తిత్వం, పవిత్రతయే వ్యక్తిత్వం. ఎంతెంత ఎవరు పవిత్రంగా ఉంటారో అంతంతగా వారి వ్యక్తిత్వం కనిపించటమే కాదు అనుభవం కూడా అవుతుంది. అందరు మీ యొక్క ఆత్మిక వ్యక్తిత్వాన్ని అనుభవం చేసుకుంటున్నారా? మీ వంటి వ్యక్తిత్వం సత్యయుగం నుండి ఇప్పటివరకూ ఇంకెవరికి అయినా ఉందా? మొత్తం కల్పమంతా తిరిగి చూడండి మీ వంటి వ్యక్తిత్వం ఉందా? లేదు కదా? అయితే మీకు మీ ఆత్మిక వ్యక్తిత్వం యొక్క నషా ఉందా? అనాది కాలంలో, పరంధామంలో విశేష ఆత్మలైన మీ వ్యక్తిత్వం అందరికంటే ఉన్నతమైనది. ఆత్మలు అన్నీ మెరిసే జ్యోతులు అయినా కానీ ఆత్మిక వ్యక్తిత్వం గల మీ ఆత్మల యొక్క మెరుపు అతీతంగా మరియు అతి ప్రియంగా ఉంటుంది. మీ అనాది కాలం యొక్క వ్యక్తిత్వాన్ని స్మృతిలోకి తీసుకునిరండి. వచ్చిందా స్మృతిలోకి? చూస్తున్నారా? బాప్ దాదాతో పాటు ఎటువంటి ఆత్మిక వ్యక్తిత్వంలో కనిపిస్తున్నారు? మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతున్నారా? అనాది కాలంలోకి వెళ్ళండి. ఎంత సమయంలో వెళ్ళగలరు? వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? సెకను కంటే తక్కువ సమయంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలరా? అయితే మీ అనాది కాలం యొక్క మీ వ్యక్తితాన్ని చూశారా? ఇప్పుడు అనాది కాలం నుండి ఆది కాలంలోకి రండి, వచ్చేశారా లేక ఇప్పుడు వెళ్తున్నారా? చేరిపోయారా? అనాది కాలం నుండి ఆది కాలంలో మీ ఆత్మిక వ్యక్తిత్వాన్ని చూడండి - ఎంత శ్రేష్టమైన వ్యక్తిత్వం, తనువు, మనసు, ధనం మరియు సంబంధాలు అన్ని రకాలైన వ్యక్తిత్వం ఎంత శ్రేష్టమైనది. ఆదికాలం యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తున్నారా? ఎంత అందంగా అనిపిస్తుంది. ఎంతగా అలంకరించబడి ఉన్నారు, ఎంత సుఖం, శాంతి, ప్రేమ, ఆనంద స్వరూపమో ఇలా ఆది కాలంలో కూడా మీ వ్యక్తిత్వాన్ని చూడండి. స్పష్టంగా కనిపిస్తుందా లేక 5000 సం||లు అయిపోయినది కదా! అందువలన కొంచెం స్పష్టంగా లేదా? అందరికీ స్పష్టంగా ఉందా! అందరూ తెలివైనవారు. మీ అది కాలం కూడా చూశారు. ఇప్పుడు మధ్యకాలంలోకి రండి. మధ్యకాలంలో మీ వ్యక్తిత్వం ఏమిటి? మీ జడచిత్రాలు ఎంత విధి పూర్వకంగా పూజింపబడుతున్నాయి మరియు మహిమ చేయబడుతున్నాయి? ఎంత ధర్మాత్ములు అయినా, మహాత్ములు అయినా, నేతలు అయినా మంచి వ్యక్తిత్వం గల వారిగా కీర్తించబడతారు కానీ మీ జడచిత్రాల వ్యక్తిత్వం ముందు వారి వ్యక్తిత్వం గొప్ప కాదు. మీకు ఎలా పూజ జరుగుతుందో అలాగే మహాత్ములకు కానీ, నేతలకు కానీ, ధర్మాత్ములకు కానీ విధిపూర్వకంగా పూజ జరుగుతుందా? ఎప్పుడైనా చూశారా? మీ జడచిత్రాలకి ఉండే అలంకరణ ఇంకెవరికైనా ఉంటుందా? అందువలన మధ్యకాలంలో కూడా మీ ఆత్మల యొక్క పవిత్రత వ్యక్తిత్వం యొక్క విశేషత ఎంత శ్రేష్టమైనది! మీ చిత్రం చూసారా? మీకు పూజ జరుగుతుందా, లేదా? ఎవరో పెద్ద పెద్ద వారికి జరుగుంతుంది, మాకు కాదు అనుకుంటున్నారా? డబల్ విదేశీయులకు మందిరాలు ఉన్నాయా? దానిలో మీ చిత్రం చూసారా? కేవలం విని అవును ఉంటాయి అని అంటున్నారా? స్మృతిలో ఉందా? మధ్యకాలంలో కూడా మీ వ్యక్తిత్వం అతి శ్రేష్టమైనది ఇప్పుడు చివరి జన్మలో కూడా మరజీవ బ్రాహ్మణజన్మ యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో చూడండి! ఎంత మహిమ ఉంది, ఏ శ్రేష్టకార్యం అయినా ఇప్పటి వరకు నామధారి బ్రాహ్మణులే చేస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులు బ్రాహ్మణులుగా ఉండటం లేదు కానీ పేరుకి బ్రాహ్మణులు కదా! కనుక మీ యొక్క పేరుతో, మీ యొక్క వ్యక్తిత్వం కారణంగా వారు కూడా శ్రేష్టంగా కీర్తించబడుతున్నారు. బ్రాహ్మణ జన్మ యొక్క వ్యక్తిత్వం ఎంత శ్రేష్టమైనది! ఆది కాలం, అనాది కాలం, మధ్యకాలం మరియు ఇప్పుడు అంతిమకాలం మొత్తం కల్పంలో మీ యొక్క వ్యక్తిత్వం సదా మహాన్ గా ఉంటుంది.
లౌకిక వ్యక్తిత్వం గలవారికి పేరు వస్తుంది, వారి పేరు విశేషమైన పుస్తకంలో ఫలానా, ఫలానా వారు అని వ్రాస్తారు కానీ మీ పేరు దేనిలో ఉంటుంది? సాధారణ పుస్తకాలలో ఉండదు, శాస్త్రాలలో ఉంటుంది. ఆది కాలం నుండి ఏవైతే శాస్త్రాలు తయారయ్యాయో వాటిలో ఎవరి చరిత్ర ఉంది? ఎవరి మహిమ ఉంది? ఎవరి కథలు ఉన్నాయి? లౌకిక వ్యక్తిత్వం కలవారి మహిమ విశేషంగా ఒక పుస్తకంలో ఉంటుంది. కానీ మీ మహిమ విశేషంగా శాస్త్రాలలో ఉంటుంది, మరి శాస్త్రాలకి ఎంతగా గౌరవం ఇస్తారు! చాలా విధి పూర్వకంగా శాస్త్రాలను సంభాళన చేస్తారు, వాటిని కూడా గొప్పగా పూజ్యరూపంలో చూస్తారు. ఎవరైతే సత్యమైన భక్తులు ఉంటారో వారు శాస్త్రాలను విధి పూర్వకంగా ఉంచుతారు కూడా మరియు చదువుతారు. సాధారణ పుస్తకాల వలె ఉంచరు. కనుక మీ పవిత్రత యొక్క వ్యక్తిత్వాన్ని సదా ప్రత్యక్ష రూపంలో సదా స్మృతి ఉంచుకోండి. తెలుసు... లేదా మేమే.... ఇలా గుప్తంగా ఉంచకండి. స్మృతి స్వరూపంలో ఉంచుకోండి. ఎవరి బుద్దిలో అయితే ఇది ప్రత్యక్ష రూపంలో స్మృతి ఉంటుందో, ఆ స్మృతియే సమర్థతకి ఆధారం. ఎక్కడ సమర్ధత ఉంటుందో అక్కడ మాయ రాగలదా? సమర్ధఆత్మ వద్దకు మాయ రావడం అసంభవం. శ్రమ చేయవలసిన అవసరమే ఉండదు. మాయ పని రావటం, కానీ ఇప్పుడు సమయప్రమాణంగా మీ పని దానిని తొలగించుకోవటం కాదు, మాయ వచ్చింది. మరియు దానిని పాలద్రోలాను అనటం కాదు. మీ పని సదా మాయాజీత్ గా ఉండటం, మాయాజీత్ గా ఉన్నారా లేదా లేక మాయని మాటిమాటికి పాలద్రోలేవారా? ఇప్పుడింకా దానిని పాలద్రోలవలసి వస్తుందా? కొద్దికొద్దిగా దర్శనం ఇవ్వడానికి వస్తుందా? రావటం లేదు కదా? డబల్ విదేశీయులు మాయను సదాకాలికంగా పాలద్రోలారా? లేదా పాలద్రోలుతూనే ఉంటారా? పరిస్థితి ఏమిటి? మాయ సదాకాలికంగా పారిపోయిందా? ఇప్పుడిక రాదు కదా? లేదా కొంచెం కొంచెం వచ్చినా పర్వాలేదా? అర్ధకల్పం నుండి స్నేహితురాలు కదా? దానిని అలాగే వదిలేస్తారా? ఇక మరలా రాకూడదు. ఎందుకంటే చెప్పాను కదా - సమయం యొక్క సమాప్తికి ముందే చాలాకాలం నుండి మాయాజీత్ గా అయ్యే అభ్యాసం ఉండాలి. అంతిమంలో మాయాజీత్ గా కాలేరు. ఒకవేళ అంతిమంలో మాయాజీత్ గా అయ్యే పురుషార్ధం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? బాప్ దాదా చిలుక కథ చెప్తారు కదా, రామచిలుకకు కుళాయిపై కూర్చోవద్దు అని చెప్తే దాని మీదే కూర్చుని మరలా అదే మాట మాట్లాడుతూ ఉంటుంది. అలాగే అంతిమ సమయంలో ముందు నుండి చాలాకాలం యొక్క అభాస్యం లేకపోతే మనస్సులో నేను ఆత్మను, నేను ఆత్మను అనుకుంటారు, నేను ఆత్మను అని ప్రయత్నం చేస్తారు కానీ ఆ స్థితి రాదు, అందువలన ఏమి చేయాలి? ఇప్పటినుండి మాయాజీత్ గా అయ్యే అభ్యాసం చేయండి. మరియు దానికి సహజసాధనం-మీ ఆత్మిక వ్యక్తిత్వాన్ని స్మృతిస్వరూపంలో ఉంచుకోండి. వ్యక్తిత్వం గలవారి గుర్తు ఏమిటి? ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారికి ఎక్కడ కూడా, దేనిపైకి దృష్టి వెళ్ళదు. దేనిలోను ఉండదు. వీరు ఇలా ఉన్నారు, వీరు ఇలా చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదు, నేనెందుకు చేయలేను, చేయగలను... ఇలా ఇతరుల ప్రాప్తి వైపు వారి దృష్టి వెళ్ళదు. ఎందువలన? ఆత్మిక వ్యక్తిత్వం కలిగినవారు సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారు. స్వభావంలో కూడా సంపన్నంగా, సంస్కారాలలో కూడా సంపన్నంగా, సంబంధ సంపర్కాలలో కూడా సంపన్నంగా మరియు నిండుగా ఉంటారు. వారు ఎప్పుడు కూడా తమ ప్రాప్తుల యొక్క ఖజానాలో ఏ అప్రాప్తి అనుభవమే చేసుకోరు. ఎందుకు? ఆత్మిక వ్యక్తిత్వంలో ఉన్న కారణంగా వారు సదా మనస్సుతో నిండుగా ఉన్న కారణంగా సంతుష్టంగా ఉంటారు. స్వయంలో అప్రాప్తిని అనుభవం చేసుకున్నప్పుడే ఇతరుల ప్రాప్తి వైపు దృష్టి వెళ్తుంది. ఏదైనా అప్రాప్తి ఉందా? పాట ఏమి పాడతారు? బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువు ఏదీ లేదు అని. ఈ పాట నోటితో కాదు, మనస్సుతో పాడుతున్నారు కదా? ఎవరు పాడుతున్నారో వారు చేతులెత్తండి. డబల్ విదేశీయులు కూడా పాట పాడుతున్నారు కదా! అచ్చా..
బాప్ దాదా ఈరోజు నలువైపుల ఉన్న పిల్లలలో పవిత్రత యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తున్నారు. పవిత్రత యొక్క పరిభాషను బాగా తెలుసు కుంటున్నారా! పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతం కాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని అయితే ఈ రోజుల్లో అజ్ఞాని ఆత్మలు కూడా కొన్ని పరిస్థితుల అనుసారంగా పాటిస్తున్నారు. వారిలో జ్ఞానం ఉండి కాదు, పరిస్థితులను చూసి పాటిస్తున్నారు. కొంతమంది భక్తులు కూడా ఉంటున్నారు. అదేమీ గొప్ప విషయం కాదు. కానీ పవిత్రతను మొత్తం రోజంతటిలో పరిశీలించుకోండి, పవిత్రతకు గుర్తు స్వచ్ఛత మరియు సత్యత. మొత్తం రోజంతటిలో లేవటంలో, కూర్చోవటంలో, మాట్లాడటంలో, సేవలో అంటే అది స్థూల సేవ అయినా, సూక్ష్మ సేవ అయినా కానీ విధి పూర్వకంగా లేకపోతే అంటే విధిలో కొంచెం అయినా కానీ తేడా వస్తే అది కూడా స్వచ్ఛత అంటే పవిత్రత కాదు. వ్యర్ధ సంకల్పాలు కూడా అపవిత్రత. ఎందుకు? మీరు అనుకుంటారు, మేము ఏ పాపం చేయలేదు, ఎవరికి దు:ఖం ఇవ్వలేదు అని కానీ వ్యర్ధంగా నడిచారు, సమయాన్ని పోగొట్టుకున్నారు, సంకల్పాలు వ్యర్ధంగా వెళ్ళిపోయాయి, సంతుష్టత లేదు అంటే మీ పవిత్రత యొక్క అంతిమస్థితి యొక్క డిగ్రీలో తేడా వచ్చేస్తుంది. 16 కళల సంపూర్ణంగా కాలేరు. 15 కళల వారిగా, 14 కళలవారిగా, పదిహేనున్నర కళల వారిగా అంటే నెంబర్ వారీగా అయిపోతారు. అందువలన అపవిత్రత అంటే కేవలం ఎవరికైనా దు:ఖం ఇవ్వటం లేదా పాపకర్మ చేయటం కాదు, స్వయంలో స్వచ్ఛత, సత్యత విధిపూర్వకంగా అనుభవం చేసుకుంటే పవిత్రత ఉన్నట్లు. అలా వచ్చేసింది, మాట్లాడాలి అని అనుకోలేదు కానీ మాట్లాడేసాను అని అనేవారిని ఏమంటారు? యజమాని అయినట్లేనా? అందువలన అమృతవేళ నుండి రాత్రి వరకు మీ యొక్క సంకల్పాన్ని, కర్మని, సేవని అన్నింటిని పరిశీలించుకోండి. పైపైకి స్థూల రూపంలో పరిశీలించుకోవటం కాదు, చంద్రవంశీయులకి స్థూలరూపంలో అంబులపొదిని ఇచ్చారు, కానీ సూర్యవంశీయులకి ఎంత చిన్న మురళి చూపించారు. మురళి ఎంత తేలికగా ఉంటుంది! అంబులపొది ఎంత బరువుగా ఉంటుంది! ఆ బరువును ఎత్తి పట్టుకుని గురి చూడవలసి వస్తుంది, కానీ మురళీని చూడండి, దానితో నాట్యం చేయండి, పాడండి, నవ్వుకోండి, అడుకోండి. అందువలన ఇప్పుడు పైపై రూపంలో పురుషార్థం చేయకండి మరియు పైపై రూపంలో పరిశీలించుకోవటం కాదు, లోతైన బుద్ధి గలవారిగా అవ్వండి. ఎందుకంటే సమయం అకస్మాత్తుగా సమాప్తి అయిపోతుంది, ముందు చెప్పి జరుగదు. బాప్ దాదా అయితే ముందుగానే చెప్పేసారు కనుక ఇక బాబా నువ్వు ఎందుకు చెప్పలేదు అని బాబాని నిందించవద్దు. బాబా ఎప్పుడు కూడా సమయం యొక్క అభిమానిగా తయారు చేయరు. ఇప్పుడు పూర్తి వజ్రంగా తయారు కావాలి కదా! ఈ ప్రతిజ్ఞ చేసారు కదా! డైమండ్ జూబ్లీ జరుపుకోవాలా లేదా డైమండ్ గా తయారుకావాలా? ఏం చేయాలి? తయారవ్వాలి మరియు జరుపుకోవాలి కూడా! రెండూ వెనువెంట చేయాలి. బాప్ దాదా తరువాత సంవత్సరంలో పరిశీలిస్తారు, ప్రతిజ్ఞ నిలుపుకున్నారా? లేదా కేవలం నోటిని మధురంగా చేసారా? అని. ఎవరు మీరు? కేవలం చెప్పేవారా లేదా నిలుపుకునే వారా? చూడండి టి.వి.లో మీ అందరి ఫోటో వచ్చేస్తుంది, మరలా అందరు మారిపోకూడదు, నేను లేనే లేను, నేను అలా అనలేదు అని. తయారవ్వటం మంచిదే కదా! మంచి విషయాన్ని తొందరగా చేయాలా లేదా ఆలస్యంగా చేయాలా? తొందరగా చేయాలి కదా!
సెకనులో ఎవరెడి కాగలరా? సెకనులో అశరీరీగా కాగలుగుతున్నారా? లేదా నేను శరీరాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు అని యుద్ధం చేయవలసి వస్తుందా? అలా లేరు కదా? ఆలోచించగానే స్థితులైపోవాలి. (బాప్ దాదా కొన్ని నిమిషాల వరకు ఈ వ్యాయమం చేయించారు) బావుంది అనిపిస్తుంది కదా? రోజంతటిలో మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేయండి. ఎంత బిజీగా ఉన్నా కానీ మధ్యమధ్యలో ఒక్క సెకను అయినా కానీ అశరీరిగా అయ్యే అభ్యాసం తప్పకుండా చేయండి. ఈ అభ్యాసం చేయటానికి నేను బిజీగా ఉన్నాను అని ఎవరూ అనలేరు కదా! దీని కోసం ఒక్క సెకను తీయవలసిందే, అభ్యాసం చేయవలసిందే, ఒకవేళ ఎవరితో అయినా మాట్లాడుతున్నా, ఎవరితో పని చేస్తున్నా వారితో కూడా ఒక్క సెకను ఈ అభ్యాసం చేయించండి. ఎందుకంటే సమయప్రమాణంగా ఈ అశరీరి స్థితి యొక్క అనుభవం లేదా అభ్యాసం ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వారే ముందు నెంబర్ తీసుకుంటారు. ఎందుకంటే చెప్పాను కదా! సమయం అకస్మాత్తుగా సమాప్తి అయిపోతుంది. అశరీరీగా అయ్యే అభ్యాసం ఉంటే వెంటనే సమయం యొక్క సమాప్తి యొక్క తరంగాలు వస్తాయి. అందువలన ఇప్పటినుండి ఈ అభ్యాసాన్ని పెంచండి. తరువాత చేస్తాం అని అనకండి. ఎంతగా చాలా కాలాన్ని కలుపుకుంటారో అంత రాజ్య భాగ్యం యొక్క ప్రాప్తిని కూడా ముందు నెంబర్ తీసుకుంటారు. మధ్యమధ్యలో ఈ అభ్యాసం చేస్తూ ఉంటే స్వతహాగానే శక్తిశాలి స్థితిని సహజంగా అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు చిన్న చిన్న విషయాల కొరకు పురుషార్ధం చేయవలసి వస్తుంది, అప్పుడు అవన్నీ సమాప్తి అయిపోతాయి.
నలువైపుల ఉన్నటువంటి ఆత్మిక పవిత్రత యొక్క వ్యక్తిత్వం కలిగిన విశేషాత్మలకు, సదా ఆది నుండి అంతిమం వరకు వ్యక్తిత్వం యొక్క మెరుపు చూపించే శ్రేష్టాత్మలకు, సదా పవిత్రత, స్వచ్ఛత మరియు సత్యత శక్తి ద్వారా స్వయాన్ని మరియు విశ్వాన్ని పరివర్తన చేసే విశ్వపరివర్తకులైన ఆత్మలకు, సదా నిమిత్తభావంతో సేవాధారి అయ్యి ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసుకునే అనుభవీ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment