06-03-1997 అవ్యక్త మురళి

         06-03-1997         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

శివజయంతి యొక్క బహుమతి - శ్రమను వదలి ప్రేమ యొక్క ఊయలలో ఊగండి.

ఈరోజు స్వయం శివపిత నలువైపుల నుండి వచ్చిన తన పిల్లలతో తన జయంతిని జరుపుకోవడానికి వచ్చారు. పిల్లలకు ఎంత భాగ్యం అంటే, స్వయంగా బాబా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో జరుపుకోవడానికి వచ్చారు. ప్రపంచం వారు అయితే రండి! అని పిలుస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారు, ఏ రూపంలో వస్తారు అనుకుంటూ ఆహ్వానం చేస్తూ ఉంటారు. కానీ పిల్లలైన మీతో జరుపుకోవడానికి స్వయంగా బాబాయే వచ్చారు. ఇలాంటి విచిత్ర దృశ్యాన్ని ఎప్పుడూ కలలో కూడా ఆలోచించి ఉండరు. కానీ ఈ రోజు సాకార రూపంలో జరుపుకోవడానికి పరుగుపరుగున చేరుకున్నారు. బాబా కూడా నలువైపుల ఉన్న పిల్లలను చూసి సంతోషిస్తున్నారు - ఓహో సాలిగ్రామ పిల్లలు ఓహో! ఓహో సాకారస్వరూపధారి కానున్న ఫరిస్తా నుండి దేవతా పిల్లలు ఓహో! భక్తి పిల్లలు మరియు జ్ఞానీ ఆత్మలైన పిల్లలలో ఎంత తేడా ఉంది. భక్తులు భావనకి అల్పకాలిక ఫలం పొంది సంతోషం అయిపోతున్నారు. ఓహో ఓహో అనే పాట పాడుతున్నారు మరియు జ్ఞానీ ఆత్మలైన మీరు కొద్దిగా అల్పకాలిక ఫలం పొందటం లేదు కానీ బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుని వారసత్వానికి అధికారిగా అవుతున్నారు. కనుక భక్తి ఆత్మలలో మరియు జ్ఞానీ ఆత్మలలో ఎంత తేడా ఉంది! భక్తులు కూడా జరుపుకుంటున్నారు మరియు మీరు కూడా జరుపుకుంటున్నారు కానీ జరుపుకోవటంలో ఎంత తేడా ఉంది! - 

శివజయంతి జరుపుకోవడానికి వచ్చారు కదా! పరుగు పెట్టుకుంటూ వచ్చారు. కొంతమంది అమెరికా నుండి, కొంతమంది లండన్ నుండి, కొంతమంది ఆస్ట్రేలియా నుండి, కొంతమంది అసియా నుండి, ఎంత స్నేహంతో చేరుకున్నారు! తండ్రి యొక్క పుట్టినరోజుతో పాటూ పిల్లల యొక్క పుట్టినరోజు కూడా, బాబాతో పాటు పిల్లలకు కూడా పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఎందుకంటే సాకార ప్రపంచంలో పిల్లలు లేకుండా బాబా కూడా ఏ కార్యం చేయలేరు. పిల్లలపై అంత ప్రేమ, ఒంటరిగా చేయలేరు. మొదట పిల్లలను నిమిత్తం చేసి తర్వాత వెన్నెముక అయ్యి, కంబైండ్ గా ఉంటూ, చేయించేవారిగా అయ్యి నిమిత్తంగా పిల్లలతో కార్యం చేయిస్తున్నారు. బాబాకి సాకారప్రపంచంలో ఒంటరిగా పిల్లలు లేకుండా ఉండటం ఇష్టం ఉండదు. నిరాకారి ప్రపంచంలో బాబాని ఒంటరిగా వదిలేసి మీరు వెళ్ళిపోతారు. బాబా ఆజ్ఞతోనే వెళ్తున్నారు కానీ సాకార ప్రపంచంలో బాబా పిల్లలు లేకుండా ఉండలేరు. పిల్లలు తప్పక తోడు ఉండాలి. వెంట ఉంటాం, వెంట వెళ్తాం అని పిల్లలు ప్రతిజ్ఞ చేస్తున్నారు కానీ కేవలం నిరాకారి ప్రపంచం వరకే. బాప్ దాదా చూస్తున్నారు - పిల్లలందరు బాబా యొక్క పుట్టినరోజు జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహ, ఉల్లాసాలలో ఉన్నారు కనుక బాబా కూడా పిల్లల యొక్క స్నేహంలో మీతో పాటు సాకారశరీరాన్ని అద్దెకు తీసుకుని వచ్చారు. దీనినే అలౌకిక ప్రేమ అంటారు. పిల్లలు బాబా లేకుండా ఉండలేరు మరియు బాబా పిల్లలు లేకుండా ఉండలేరు. బాబాకి అతి ప్రేమ ఉంటుంది అతి అతీత స్థితి కూడా ఉంటుంది. అందువలనే అతీతం మరియు అతిప్రియం అనేది బాబా యొక్క మహిమ. పిల్లలు కూడా బాబా కోసం చాలా రకాలైన బహుమతులు, కార్డులు, ఏవోక వస్తువులు, మనస్సు యొక్క ఉత్సాహభరిత ఉత్తరాలు ఏవైతే తెచ్చారో అవన్నీ ఈ రోజు వతనంలో బాబా దగ్గర గిఫ్ట్ మ్యూజియంలో పెట్టి ఉన్నాయి. మీది సేవా మ్యూజియం మరియు బాబాది స్నేహమ్యూజియం. ఏవైతే అందరు తెచ్చారో లేదా పంపించారో అందరి స్నేహ సంపన్న బహుమతులు బాబా దగ్గర ఇప్పుడు కూడా మ్యూజియంలో పెట్టబడి ఉన్నాయి. వాటిని చూసి బాబా సంతోషిస్తున్నారు. వస్తువు పెద్దది కాదు కానీ వస్తువులో స్నేహం నిండి ఉంటే ఆ చిన్న వస్తువు కూడా గొప్పది అయిపోతుంది. కనుక బాప్ దాదా వస్తువుని చూడటం లేదు, కాగితపు కార్డులను లేక ఉత్తరాలను చూడటం లేదు. వాటిలో నిండి ఉన్న మనస్సు యొక్క స్నేహాన్ని చూస్తున్నారు. అందువలనే బాబా దగ్గర స్నేహ మ్యూజియం ఉంది అని చెప్పారు. ఇలాంటి మ్యూజియం మీ ప్రపంచంలో లేదు. ఇలాంటి మ్యూజియం ఉందా? లేదు. బాబా ఒక్కొక్కరి ప్రేమపూర్వక బహుమతిని చూస్తుంటే చూస్తూనే పిల్లల యొక్క ముఖం దానిలో కనిపిస్తుంది. మీ దగ్గర ఇలాంటి కెమెరా ఉందా? లేదు. బహుమతిని చూస్తూ బాబాకి ఒక శుభసంకల్పం వచ్చింది చెప్పమంటారా? చేయవలసి వస్తుంది. చేస్తారా, తయారుగా ఉన్నారా? ఆలోచించకూడదు. 

బాప్ దాదాకి సంకల్పం వచ్చింది - ఈ బహుమతి అయితే బాబా దగ్గరకి చేరుకుంది కానీ బాప్ దాదాకి వెనువెంట ఇంకొక బహుమతి కూడా కావాలి. మీ యొక్క బహుమతి చాలా బావుంది కానీ బాప్ దాదాకి ఇంకొకటి కూడా కావాలి. బహుమతి ఇస్తారా? ఏదైతే స్మృతిచిహ్నం జరుపుకుంటున్నారో, శివజయంతి అంటే ఏదోకటి అర్పణ చేస్తారు, బలిహారం అవుతారు. బాప్ దాదా ఆలోచిస్తున్నారు - పిల్లలందరు బలిహారం అయ్యారు. బలిహారం అయిపోయారా లేక ఇప్పుడు కొద్ది, కొద్దిగా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకుంటున్నారా? ఈరోజు వ్రతం కూడా తీసుకుంటారు. బాప్ దాదాకి సంకల్పం వచ్చింది - పిల్లలు అప్పుడప్పుడు నడుస్తూ, నడుస్తూ కొద్దిగా అలసిపోతున్నారు. చాలా శ్రమ అనుభవం చేసుకుంటున్నారు. లేదా నిరంతరం యోగం జోడించటం కష్టంగా అనుభవం చేసుకుంటున్నారు. అయిపోతుంది అని ఆలోచిస్తున్నారు..... బాబాకి కూడా నమ్మకం ఇప్పిస్తున్నారు, నువ్వు చింతించకు, అయిపోతుంది అని కానీ బాప్ దాదాకి పిల్లల యొక్క అలసట లేదా ఒంటరితనం లేదా అప్పుడప్పుడు, కొద్దిమంది బలహీనం కూడా అయిపోతున్నారు. మా భాగ్యంలో ఉందో, లేదో తెలియదు ...... అప్పుడప్పుడు ఇలా ఆలోచిస్తున్నారు, ఇది బాబాకి ఇష్టమనిపించటం లేదు. అన్నింటికంటే ఎక్కువగా బాబాకి పిల్లల యొక్క శ్రమ ఇష్టమనిపించటం లేదు. యజమానులు మీరు కానీ శ్రమ చేస్తున్నారు. బాబాకి పిల్లలు మరియు పిల్లల నుండి యజమానులు. భగవంతునికి కూడా యజమానులు కానీ మరలా శ్రమ చేస్తున్నారు! మంచిగా అనిపిస్తుందా? వినడానికి కూడా మంచిగా అనిపించటం లేదు. కనుక బాబాకి సంకల్పం వచ్చింది, పిల్లలు పుట్టినరోజు బహుమతి తప్పకుండా ఇస్తారు కదా! కనుక ఈ రోజు పిల్లలు ఇది ఎందుకు బహుమతిగా ఇవ్వలేదు అని. స్థూల బహుమతి ఏదైతే ఇచ్చారో అది వతనంలో ప్రత్యక్షంగా ఉంది కానీ నిరాకారి ప్రపంచంలో ఈ బహుమతి ప్రత్యక్షం అవ్వదు. అక్కడికి సంకల్పం యొక్క బహుమతియే చేరుతుంది. కనుక బాబాకి సంకల్పం వచ్చింది ఈ రోజు పిల్లల నుండి ఈ బహుమతి తీసుకోవాలి అని. కనుక బహుమతి ఇస్తారా లేదా ఇచ్చి మరలా అక్కడికి వెళ్ళి తిరిగి తీసేసుకుంటారా? మధువనంలో మధువనంవారిగా, మీ దేశంలో మీ దేశంవారిగా ఉండరు కదా! పిల్లలు చాలా చతురులు అయిపోయారు. మేము తిరిగివస్తుంది అని అనుకోలేదు కానీ వచ్చేస్తుంది అని బాబాకి చెప్తున్నారు. వచ్చేస్తుంటే మీరు ఎందుకు స్వీకరిస్తున్నారు? అదే వచ్చేస్తుంది అనేది నిజమే కానీ మీకు ఇష్టం లేని వస్తువు ఎవరైనా మీకు బలవంతంగా ఇస్తే దానిని మీరు తీసుకుంటారా లేక తిరిగి ఇచ్చేస్తారా? తిరిగి ఇచ్చేస్తారు కదా? ఎందుకు స్వీకరిస్తున్నారు? మాయ తిరిగి తీసుకువస్తుంది కానీ మీరు స్వీకరించకండి. ఇంత ధైర్యం ఉందా? ఆలోచించి చెప్పండి. మరలా అక్కడికి వెళ్ళి బాబా ఏమి చేయము, అనుకోవటం లేదు కానీ అయిపోతుంది అని అనకండి. ఇలాంటి ఉత్తరాలు వ్రాయరు కదా? మీకు ధైర్యం ఉంటే బాబా సహాయం చేస్తారు. ధైర్యం తక్కువ చేసుకోకండి, అప్పుడు చూడండి బాబా యొక్క సహాయం లభిస్తుందో, లేదో! అందరికీ అనుభవం కూడా ఉంది. ధైర్యం పెట్టుకోవటం ద్వారా సమయానికి బాబా యొక్క సహాయం లభిస్తుంది మరియు లభించవలసిందే, ఇది గ్యారంటీ. ధైర్యం మీది, సహాయం బాబాది. సంకల్పం ఏమి అయ్యింది? ధైర్యం ఉందా లేదా అని ముఖం చూస్తున్నారు. ధైర్యం ఉన్నవారే, ఎందుకంటే ధైర్యం లేకపోతే బాబా వారిగా కాలేరు. బాబా వారిగా అయ్యారు కనుక దీని ద్వారా ధైర్యం ఉంది అని రుజువు అవుతుంది. కేవలం ఒక చిన్న విషయం చేస్తున్నారు సమయానికి కొద్దిగా ధైర్యాన్ని మర్చిపోతున్నారు. ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు ధైర్యం, సహాయం తర్వాత జ్ఞాపకం వస్తున్నాయి. సమయానికి అన్ని శక్తులను ఉపయోగించే వారినే జ్ఞానీ ఆత్మ, యోగీ ఆత్మ అంటారు. 

బాప్ దాదాకి ఒక విషయంలో చాలా సంతోషం ఉంది, ఏ విషయంలో తెలుసా? చెప్పండి. (చాలా మంది చెప్పారు) అందరు బాగా చెప్తున్నారు, కానీ బాబా సంకల్పం ఇంకొకటి ఉంది. మీరు చాలా గుహ్యంగా చెప్తున్నారు, జ్ఞానసాగరులుగా అయిపోయారు కదా! బాప్ దాదా సంతోషిస్తున్నారు - చాలా మంది పిల్లలు ఉత్తరాలు మరియు చీటీ వ్రాసారు, మేము 108 లోకి వస్తాము అని, చాలా చీటీలు వచ్చాయి. ఇంతమంది 108 లోకి వచ్చేస్తే కనుక 108 మాల 5 పేటలు మాల తయారుచేయవలసి వస్తుంది అని బాబా ఆలోచిస్తున్నారు. 5-6 లేదా 7-8 పేటలు మాల తయారుచేయాలి కదా? ఎవరైతే సంకల్పం చేసారో, లక్ష్యం పెట్టుకున్నారో చాలా మంచిది కానీ మధ్యమధ్యలో ఈ సంకల్పాన్ని ధృడం చేసుకుంటూ ఉండాలి, బలహీనం చేసుకోకూడదు. మరలా మాయ వచ్చేసింది, వస్తామో, రామో తెలియదు అని అనకండి. తెలియదు, తెలియదు...అని అనకూడదు. రావలసిందే ఇలా ధృడత యొక్క ముద్ర వేసుకుంటూ ఉండాలి. అవును నేను రావలసిందే. ఏది ఏమైనా కానీ నా నిశ్చయం మాత్రం స్థిరంగా, తెగిపోనిది అని ఈవిధమైన స్థిరమైన, తెగిపోని నిశ్చయం ఉందా? కదిలించడానికి మాయని పంపించనా? వద్దా? భయపడుతున్నారా? మిమ్మల్ని చూసి మాయ భయపడుతుందా లేదా మాయను చూసి మీరు భయపడుతున్నారా? మాయ మీ తలుపు చూస్తుంది, ఇక్కడ తెరిచి ఉందా, అక్కడ తెరిచి ఉందా అని తిరుగుతూ ఉంటుంది. మీరు ఎందుకు భయపడుతున్నారు? మాయ అనేది ఏమీ లేదు. ఏమీ లేదు అనుకుంటే ఏమీ అవ్వదు. రాదు, రాదు అనుకుంటే రాదు. ఏమి చేయము ......? అని మాయకి తలుపు తెరిస్తే మాయని ఆహ్వానించినట్లు. చాలామంది పిల్లలు 108 లోకి వచ్చే ప్రతిజ్ఞ చేసారు చాలా మంచిది. చేసారు కదా? ఎవరైతే మేము 108లోకి వస్తాము అంటారో వారు పెద్దగా చేతులు ఎత్తండి... మంచిగా వ్యాయామం చేయండి. చాలా మంచిది, శుభాకాంక్షలు. 108 లోకి ఎంతమంది వస్తారు, నేను ఎక్కడ వస్తాను ఇలా ఆలోచించకండి. దాదీ వస్తారు, దీదీ వస్తారు, దాదా కూడా వస్తారు, ఎడ్వాన్స్ పార్టీ వారు కూడా వస్తారు. అలా మొదటి నుంచి లెక్కలు పెడుతున్నారు. మా నెంబర్ వస్తుందో, లేదో తెలియదు అని అనుకోకండి. బాప్ దాదా చెప్పారు కదా అవసరం అయితే బాప్ దాదా 8-10 పేటల మాలను కూడా తయారు చేస్తారు, మీరు చింతించవలసిన అవసరం లేదు. ఇతరులను చూడకండి, మీకు నెంబర్ లభించవలసిందే ఇది బాబా యొక్క గ్యారంటీ. మీరు తొలగిపోకూడదు. మాల మధ్యలో దారాన్ని ఖాళీగా ఉంచకూడదు. ఒక పూస మధ్యలో తెగిపోయినా లేదా తొలగిపోయినా బావుండదు. మీరు ఇలా చేయకండి. మీరు తప్పకుండా వస్తారు అని బాబా గ్యారంటీ ఇస్తున్నారు. 

ఈరోజు జరుపుకోవడానికి వచ్చారు. మురళి కొద్దిగానే చెప్పడానికి వచ్చాను. ఎవరు మాలలోకి రావాలంటే వారు రండి 108 మాలలో అందరికీ స్వాగతమే. భక్తిమార్గం వారే 108 మాలను తయారుచేసారు. బాప్ దాదా అయితే ఎంత అయినా పెంచగలరు. బాబా తప్పక బహుమతి తీసుకుంటారు, బహుమతి వదిలిపెట్టరు. చిన్న బహుమతే పెద్దది ఏమీ కాదు. ఎందుకంటే బాప్ దాదా పిల్లలందరి 6 నెలల చార్ట్ చూసారు. ఏమి చూసి ఉంటారు? కొంతమంది పిల్లలు కొద్దిగా పైకి, కిందకి అవుతున్నారు, అచంచలం నుండి చంచలం అవుతున్నారు. దానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి ఆ 3 విషయాలే రకరకాల సమస్యలు, లేక పరిస్థితులుగా అయ్యి వస్తున్నాయి. ఆ 3 విషయాలు ఏమిటి? 

అశుభం లేదా వ్యర్ధం ఆలోచించటం, అశుభం లేదా వ్యర్ధం మాట్లాడటం మరియు అశుభం లేదా వ్యర్ధకర్మ చేయటం. ఆలోచించటం, మాట్లాడటం, చేయటం - దీనిలో సమయం చాలా వ్యర్ధం అయిపోతుంది. ఇప్పుడు వికర్మలు తక్కువగా జరుగుతున్నాయి కానీ వ్యర్ధ కర్మ ఎక్కువగా జరుగుతుంది. వ్యర్థం యొక్క తుఫాను చలింపచేస్తుంది. వ్యర్ధం అనేది మొదట ఆలోచనలోకి వస్తుంది, తర్వాత మాటలోకి వస్తుంది, ఆ తర్వాత కర్మలోకి వస్తుంది. కానీ ఆలోచనలోకి చాలా వస్తాయి. తయారయ్యే సమయం అంతా ఆలోచించటంలోనే గడిచిపోతుంది. కనుక బాప్ దాదా ఈరోజు ఈ 3 విషయాలు అంటే ఆలోచించటం, మాట్లాడటం, చేయటం - వీటి యొక్క బహుమతి తీసుకోవాలనుకుంటున్నారు. అందరూ తయారేనా? ఎవరైతే బహుమతి ఇచ్చేశారో వారు చేతులు ఎత్తండి! ఒకొక్కవైపు నుండి ఈ చేతులన్నింటినీ వీడియో తీయండి. చేతులు పెద్దగా ఎత్తండి. డ్రిల్ (వ్యాయామం) చేయటం లేదు. అందువలనే లావుగా అయిపోతున్నారు. మంచిది - అందరూ ఇచ్చేశారు, తిరిగి తీసుకోకూడదు. నోటి నుంచి వచ్చేసింది ఏమి చేయము? అని అనకూడదు. నోటికి ధృఢసంకల్పం అనే బటన్ పెట్టేయండి. ధృఢసంకల్పం యొక్క బటన్ ఉంది కదా? ఎందుకంటే బాబాకి పిల్లలంటే ఇష్టం. ప్రేమకి గుర్తు - ప్రేమ ఉన్నవారి శ్రమ చూడలేరు. ఆ సమయంలో బాప్ దాదా అనుకుంటున్నారు. ఒకసారి సాకారంలో వెళ్ళి వారికి చెప్పాలి అని, కానీ ఇప్పుడు ఆకారి, నిరాకారి కదా! పూర్తిగా అందరు శ్రమ నుండి దూరం అయ్యి ప్రేమ యొక్క ఊయలలో ఊగుతూ ఉండండి. ఎప్పుడైతే ప్రేమ యొక్క ఊయలలో ఊగుతారో అప్పుడు శ్రమ సమాప్తి అయిపోతుంది. శ్రమ సమాప్తి అవ్వాలి, శ్రమ సమాప్తి అవ్వాలి అని ఆలోచించకండి. కేవలం ప్రేమ యొక్క ఊయలలో కూర్చోండి, శ్రమ దానంతట అదే సమాప్తి అయిపోతుంది. విడిపించుకునే ప్రయత్నం చేయకండి. ప్రేమ యొక్క ఊయలలో కూర్చునే, ఊగే ప్రయత్నం చేయండి. 

శివజయంతి అంటే పిల్లల శ్రమ యొక్క సమాప్తి జయంతి. బావున్నారు కదా? బాబాకి కూడా పిల్లల పైన నమ్మకం ఉంది. కొంతమంది ఏమి చేస్తున్నారంటే బాబాకి కూడా తెలియటం లేదు. ఛత్రఛాయలో కూర్చుని ఉండండి. బ్రాహ్మణ జీవితం యొక్క అర్థమే ఊగటం, మాయలో కాదు. మాయ కూడా ఊపుతుంది. అమృతవేళ చూడండి - మాయ ఎలా ఊపుతుంది అంటే సూక్ష్మవతనంలోకి వెళ్ళడానికి బదులు, నిరాకారి లోకంలోకి వెళ్ళడానికి బదులు నిద్రాలోకంలోకి వెళ్ళిపోతున్నారు. యోగం డబల్ లైట్ గా చేయిస్తుంది అంటున్నారు కానీ తల బరువు అయిపోతుంది. మాయ కూడా ఊయలలో ఊపుతుంది కానీ మాయ యొక్క ఊయలలో ఊగకండి. అర్ధకల్పం మాయ యొక్క ఊయలలో చాలా ఊగి చూసారు కదా! ఏమి లభించింది? ఏమైనా లభించిందా? అలసిపోయారు కదా! ఇప్పుడు అతీంద్రియసుఖం యొక్క ఊయలలో ఊగండి, సంతోషం యొక్క ఊయలలో ఊగండి, శక్తుల అనుభూతుల యొక్క ఊయలలో ఊగండి. ఇన్ని ఊయలలు మీకు లభించాయి. ఇవి ఇక్కడ రాజా, రాణీకి కూడా ఉండవు. ఏ ఊయలలో కావాలంటే ఆ ఊయలలో ఊగండి. అప్పుడప్పుడు ప్రేమ యొక్క ఊయలలో ఊగండి. అప్పుడప్పుడు ఆనందం యొక్క ఊయలలో ఊగండి. అప్పుడప్పుడు జ్ఞానం యొక్క ఊయలలో ఊగండి! లెక్కలేనన్ని ఉన్నాయి. ఊయల నుండి క్రిందికి దిగకండి. ఎవరైతే గారాభమైన పిల్లలు ఉంటారో వారి గురించి తల్లి, తండ్రి అనుకుంటారు - పిల్లల పాదం మట్టిలో ఉండకూడదు, ఒడిలో లేదా ఊయలలో లేదా తివాచీపై ఉండాలి అనుకుంటారు. అలా అనుకుంటారు కదా? మరి మీరు ఎంత గారాభమైన పిల్లలు! మీవంటి గారాభమైన పిల్లలు ఇంకెవరైనా ఉంటారా? పరమాత్మకి ప్రియమైన పిల్లలు దేహాభిమానంలోకి వస్తే దేహం ఏమిటి? మట్టి కదా! దేహం గురించి ఏమంటారు? మట్టి, మట్టి మట్టిలో కలిసిపోతుంది అంటారు కదా! మరి ఇది మట్టి కదా. మట్టిలో పాదం ఎందుకు పెడుతున్నారు? మట్టి బావుందనిపిస్తుందా? కొంతమంది పిల్లలకు మట్టి మంచిగా అనిపిస్తుంది, కొంతమంది మట్టిని తింటారు కూడా! కానీ మీరు తినకండి, పాదం కూడా పెట్టకండి. సంకల్పం రావటం అంటే పాదం పెట్టడం. సంకల్పంలో కూడా దేహాభిమానం రాకూడదు. మేము ఎంత ప్రియమైన వారము, ఎవరికి ప్రియమైన వారము అని ఆలోచించుకోండి. సత్యయుగంలో కూడా పరమాత్మకి ప్రియమైన వారిగా ఉండరు. దివ్య ఆత్మలకి ప్రియంగా ఉంటారు. కానీ ఈ సమయంలో పరమాత్మకి ప్రియమైనవారు. కనుక పిల్లలు ధైర్యం యొక్క బహుమతి ఇచ్చారు దానికి బాప్ దాదా ధన్యవాదాలు చెప్తున్నారు. ధన్యవాదాలు, ధన్యవాదాలు.  

మంచిది - ఈరోజు డబల్ విదేశీయులకి విశేషమైన రోజు. డబల్ విదేశీయులు ఎవరైతే కూర్చున్నారో వారు చేతులు ఎత్తండి! హాల్ లో ముప్పావు వంతు డబల్ విదేశీయులే ఉన్నారు. బాబా కూడా స్వాగతిస్తున్నారు, వచ్చారు సంతోషం, సదా రండి అని. చూడండి ఎంతగా పిల్లలు పెరుగుతూ ఉంటారో అంత భూమి ఇంకా చిన్నది అయిపోతుంది. ఈ హాల్ తయారు చేసేటప్పుడు ఈ హాల్ నిండుతుందా అని అనుకున్నారు కదా? ఇప్పుడు హాల్ ఏమిటి, కానీ క్రింద కూడా ఎన్ని గీతాపాఠశాలలు తయారయ్యాయి. చాలామంది పిల్లలు క్రింద కూర్చున్నారు. (మధువనంలో కూర్చుని మురళి వింటున్నారు) ఇప్పుడు క్రింద హాల్ (శాంతివనం) తయారుచేసినప్పుడు ఎక్కువ సంఖ్యకి అవకాశం ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఇంత పెద్ద హాల్ ఎందుకు తయారుచేసారు? సంఖ్యను పెంచడానికా లేక స్వేచ్ఛ ఇవ్వడానికా? దీని ద్వారా ఏమి రుజువు అవుతుంది? మీరందరు విశ్వానికి యజమానులుగా అవ్వాలి. విశ్వానికి యజమానులు అయ్యేవారికి ఇంత పెద్దవి కూడా చిన్నవి అయిపోతాయి. ఈ హాల్ ఏమిటి, మొత్తం విశ్వం మీకు లభిస్తుంది. 

(బాప్ దాదా డ్రిల్ చేయించారు) మనస్సుకు యజమానులు కదా! కనుక సెకనులో స్టాప్ అనగానే స్టాప్ అయిపోవాలి. మీరు స్టాప్ అంటే మనస్సు నడుస్తూ ఉంటే దీని ద్వారా యజమాని స్థితి యొక్క శక్తి తక్కువగా ఉన్నట్లు రుజువు అవుతుంది కనుక ఈవిధంగా ఉండకూడదు. యజమాని శక్తిశాలిగా ఉంటే యజమాని యొక్క డైరెక్షన్ లేకుండా మనస్సు ఒక సంకల్పం కూడా చేయదు. స్టాప్ అనగానే స్టాప్ అవ్వాలి, నడవమనగానే నడవాలి. ఎక్కడ నడిపించాలంటే అక్కడ నడిపించగలగాలి. మనస్సుకి చాలా సమయం నుండి వ్యర్ధం వైపు నడిచే అభ్యాసం ఉంటే మీరు శుద్ధసంకల్పాల వైపు నడిపించినా మనస్సు వ్యర్థం వైపు వెళ్ళిపోతుంది అంటే యజమానికి యజమాని స్థితిలో నడిపించటం రావటం లేదు, ఇలా ఉండకూడదు. కనుక ఈ అభ్యాసం చేయండి. స్టాప్ అనగా స్టాప్ అవుతుందా లేదా కొంచెం నడిచిన తర్వాత స్టాప్ అవుతుందా? ఇది పరిశీలించుకోండి. ఒకవేళ బండికి బ్రేక్ వేయవలసి వచ్చినప్పుడు కొంచెం సమయం తర్వాత బ్రేక్ పడితే ఆ బండి పనిచేస్తుందా? డ్రైవ్ చేసేవారు యోగ్యమైనవారేనా లేక యాక్సిడెంట్ చేసేవారా? బ్రేక్ వేయగానే వెంటనే బ్రేక్ పడాలి. ఈ అభ్యాసమే కర్మాతీత స్థితికి సమీపంగా తీసుకువెళ్తుంది. సంకల్పం చేయగానే కర్మలో కూడా ఫుల్ పాస్ అవ్వాలి. కర్మాతీతం అంటే ప్రతి సబ్జెక్టు లో పూర్తిగా పాస్ అవ్వటం అని అర్ధం. 75%, 90% కూడా కాదు. పూర్తిగా పాస్ అవ్వాలి. ఈ స్థితి ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు మీ జీవితంలో సర్వశక్తులు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చినట్లు. ఇంతకు ముందు కూడా చెప్పాను - సర్వశక్తులు బాబా ఇచ్చారు, మీరు తీసుకున్నారు కానీ సమయానికి ఉపయోగిస్తున్నారా, లేదా? కేవలం స్టాక్ ఉంది అంతేనా! స్టాక్ ఉన్నా కానీ సమయానికి ఉపయోగించకపోతే అది ఉన్నా, లేకపోయినా ఒకటే. పరిస్థితి ఎంత నాజూకుగా ఉన్నా మనస్సు, బుద్ధికి ఆజ్ఞ ఇవ్వగానే అతీతం అయ్యి ఆ పరిస్థితిని ఆట వలె చూస్తే కనుక ఆ పరిస్థితి మీ అచంచల స్థితి యొక్క ఆసనం క్రింద అణిగిపోతుంది. ఈ అనుభవం చేసుకోండి, ఆ పరిస్థితి మిమ్మల్ని ఎదుర్కోలేదు. ఆసనం వదలకండి. ఆసనంపై కూర్చునే అభ్యాసమే సింహాసనాన్ని ప్రాప్తింపచేస్తుంది. ఒకవేళ ఆసనంపై పూర్తిగా కూర్చోవటం రాకపోతే అప్పుడప్పుడు కూర్చుంటే అక్కడ సింహాసనంపై కూడా అప్పుడప్పుడు కూర్చుంటారు. ఆసనమే సింహాసనాన్ని ప్రాప్తింపచేస్తుంది. ఇప్పుడు ఆసనం, తర్వాత సింహాసనం. అలజడిలో అయ్యేవారు సింహాసనంపై ఏకాగ్రంగా కూర్చోలేరు. అందువలన ఎక్కడ వ్యర్ధం, అశుభం సమాప్తి అయిపోతాయో అక్కడ అచంచలంగా ఉండగలరు మరియు అచంచలస్థితి ద్వారా ఆసనంపై సహజంగా మరియు సదా స్థితులు కాగలరు. మీ అందరి స్మృతి చిహ్నమే అచల ఘర్, అచల్ ఘర్ చూసారు కదా? ఇది ఎవరి స్మృతిచిహ్నం? మీ అందరి స్థితికి స్మృతిచిహ్నమే ఈ అచల్ ఘర్, అనుభవం చేసుకోండి. ఉపయోగిస్తూ వెళ్ళండి, అన్ని శక్తులు ఉన్నాయి అని అనుకోవటం కాదు, సమయానికి ఉపయోగించాలి. ఉపయోగించకపోతే సమయానికి మోసపోతారు. అందువలన చిన్న, పెద్ద పరిస్థితులలో ఉపయోగించి చూడండి. పరిస్థితులు అయితే రావలసిందే, వస్తాయి కూడా! మొదటే బాప్ దాదా చెప్పారు - వర్తమాన సమయాన్ని అనుభవం చేసుకుంటూ నడవండి. ప్రతి శక్తిని అనుభవం చేసుకోండి. ప్రతి గుణాన్ని అనుభవం చేసుకోండి. ఏ ఆత్మ అయినా మీ దగ్గరకి రాగానే మీ అనుభవం యొక్క సహాయం ద్వారా ఆ ఆత్మకి ప్రాప్తి లభించాలి. ఈ విధమైన అనుభవీ మూర్తి అవ్వండి. రోజురోజుకి ఆత్మలు శక్తిహీనం అయిపోతున్నాయి, అవుతూ ఉంటాయి. అటువంటి ఆత్మలకు మీరు మీ శక్తుల యొక్క అనుభూతుల సహాయాన్నిచ్చి అనుభవం చేయించాలి. మంచిది! యజమానులు కదా! యజమానులకు నమస్కారం అని బాబా చెప్తున్నారు. మంచిది. 

నలువైపుల ఉన్న చాలా చాలా భాగ్యవాన్ పిల్లలు ఎవరైతే శివబాబాతో శివజయంతి జరుపుకుంటున్నారో, అటువంటి వారికి కోటానుకోట్ల రెట్లు ఏమిటి, ఇంకా ఎంత ఎక్కువ చెప్పినా అది కూడా తక్కువే ఈ విధమైన మహాన్ భాగ్యవాన్ ఆత్మలకు, సదా బాబా యొక్క ఆజ్ఞపై ప్రతి అడుగు వేసే బాబాకి స్నేహి మరియు సమీప ఆత్మలకు, సదా యజమాని స్థితి యొక్క అచంచల ఆసనం నుండి భవిష్య సింహాసనాధికారి అయ్యే శ్రేష్ట ఆత్మలకు, సదా బాబాతో పాటు ఆనందంతో ప్రేమ యొక్క ఊయలలో ఊగుతూ వెంట నడిచే పిల్లలకు, బాప్ దాదాకి సహయోగి పిల్లలకు బాప్ దాదా పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు మరియు ప్రియస్మృతులు స్వీకరించండి. యజమానులందరికీ బాబా యొక్క నమస్తే. 

Comments