04-09-2005 అవ్యక్త మురళి

 04-09-2005         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

శిక్షణతో పాటు క్షమ మరియు దయను ధారణ చేయండి, ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీస్కోండి, అప్పుడు మీ ఇల్లు ఆశ్రమంగా అయిపోతుంది.

ఈరోజు బాప్ దాదా పిల్లలందరి మస్తకంలో పవిత్రత యొక్క రేఖలను చూస్తున్నారు, ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క పునాదియే పవిత్రత. పవిత్రత యొక్క రేఖలు ఏమిటో తెలుసా? పవిత్రత సర్వులకి ప్రియమనిపిస్తుంది. పవిత్రతయే సుఖం, శాంతి, ప్రేమ మరియు ఆనందాలకు జనని. పవిత్రత మానవ జీవితం యొక్క సత్యమైన అలంకరణ. పవిత్రత లేకపోతే మానవ జీవితానికి విలువ ఉండదు. దేవతలు పవిత్రులు కనుకనే గౌరవనీయులుగా, పూజ్యనీయులుగా ఉంటారు. ఈ రోజుల్లో పవిత్రత లేకపోతే మానవ జీవితం ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా! బాప్ దాదా బ్రాహ్మణ పిల్లలైన మీ అందరికీ బ్రాహ్మణ జన్మ యొక్క వరదానం ఏమి ఇచ్చారంటే పవిత్ర భవ! యోగి భవ! ఎవరిలో పవిత్రత ఉంటుందో వారి నడక, నడవడిక మరియు ముఖం మెరుస్తూ ఉంటుంది. అందువలన పవిత్రతయే జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది. వాస్తవానికి పిల్లలైన మీ అందరి ఆది స్వరూపం పవిత్రతయే. అనాది స్వరూపం కూడా పవిత్రతయే. అటువంటి పవిత్ర ఆత్మల జీవితంలో సదా పవిత్రత యొక్క వ్యక్తిత్వం కనిపిస్తుంది. పవిత్రత యొక్క సత్యత, పవిత్రత యొక్క ఠీవి ముఖం మరియు నడవడికలో కనిపిస్తుంది. పవిత్రత యొక్క ఈ రేఖలే జీవితానికి అలంకరణ. పవిత్రత యొక్క సత్యత అంటే నేను ఆది, అనాది స్వరూప పవిత్ర ఆత్మను అనే స్మృతి ద్వారా సమర్థులుగా అవుతారు. పవిత్రత యొక్క ఠీవి అంటే స్వయం స్వమానంలో ఉంటారు మరియు ప్రతి ఒక్కరికీ గౌరవం ఇస్తూ నడుస్తారు. పవిత్రత యొక్క వ్యక్తిత్వం అనగా సదా సంతుష్టత మరియు ప్రసన్నత. స్వయం సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టం చేస్తారు. పవిత్రత వలన లభించు ప్రాప్తులు అనేకం. బాప్ దాదా పిల్లలైన మీ అందరికీ ఏమేమి ప్రాప్తులను ఇచ్చారో తెలుసు కదా! ఎన్ని ఖజానాలతో నిండుగా చేశారు, ఈ ప్రాప్తులను స్మృతిలో ఉంచుకుంటే నిండుగా అయిపోతారు. బాబా ఇచ్చిన అన్నింటికంటే మొదటి ఖజానా - జ్ఞాన ఖజానా. దీని ద్వారా జీవితంలో ఉంటూ కూడా దు:ఖం అశాంతి నుండి ముక్తులుగా ఉంటున్నారు. వ్యర్థ సంకల్పాలు, వ్యతిరేక సంకల్పాలు, వికర్మల నుండి ముక్తులవుతారు. ఒకవేళ ఏ వ్యర్థ సంకల్పం లేదా వికల్పం వచ్చినా కానీ జ్ఞానం యొక్క బలంతో విజయీ అయిపోతారు. రెండవ ఖజానా - స్మృతి లేదా యోగం. యోగం ద్వారా శక్తులు ప్రాప్తిస్తాయి. ఆ శక్తుల ఆధారంగా సర్వ సమస్యలను, సర్వ విఘ్నాలను సహజంగా దాటుతున్నారు. మూడవ ఖజానా - ధారణ యొక్క ఖజానా. దీని ద్వారా సర్వ గుణాలు ప్రాప్తిస్తాయి. నాల్గవ ఖజానా - సేవ యొక్క ఖజానా. దీని ద్వారా ఎవరికి సేవ చేస్తున్నారో వారి ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి. సంతోషం ప్రాప్తిస్తుంది. 

ఇన్ని ఖజానాలు బాబా ద్వారా పిల్లలందరికీ ప్రాప్తిస్తున్నాయి. బాబా పిల్లలందరికీ ఒకే విధంగా ఖజానాలను ఇస్తున్నారు, కొందరికీ ఎక్కువ, కొందరికి తక్కువ ఇవ్వటం లేదు. కానీ తీసుకునే వారిలో తేడా ఉంది. కొంతమంది పిల్లలు ఖజానాలను పొంది తింటూ, త్రాగుతూ, మజాగా ఉంటూ ఆ మజాలో ఖజానాలను పోగొట్టుకుంటున్నారు. కొంతమంది పిల్లలు తింటూ, త్రాగుతూ, మజాగా ఉంటూ కూడా జమా చేసుకుంటున్నారు. మరి కొంతమంది పిల్లలు వాటిని కార్యంలో ఉపయోగిస్తూ కూడా పెంచుకుంటు న్నారు. కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి - ఈ విశేష ఖజానాలు జమ అయి ఉన్నాయా? ఉందా జమా? ఏమంటారు? ఉన్నాయా లేక కొంచెం కొంచెం ఉన్నాయా? ఎవరి వద్ద ఈ ఖజానాలు జమ అయి ఉంటాయో వారు నిండుగా ఉంటారు. ఏ వస్తువు అయినా నిండుగా ఉంటే అది తొణకదు కదా, నిండుగా లేనిది కదులుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సర్వ ఖజానాలతో నిండుగా లేకపోతే కదులుతారు. బాబా యొక్క ఖజానాలన్నీ నా యొక్క జన్మసిద్ధ అధికారం అనే నషా సదా ఉండాలి. బాబా ఇచ్చారు, మీరు తీసుకున్నారు అంటే ఎవరివి అయినట్లు? మీవే కదా! అయితే ఎవరి వద్ద ఖజానాలు ఉంటాయో వారు ఎంత నషాగా ఉంటారు? చిన్నరాజు యొక్క రాజకుమారునికి కూడా నషా ఉంటుంది, తన తండ్రి దగ్గర ఏమేమి ఉన్నాయో తెలియకపోయినా కానీ తండ్రి ఖజానా అంతా నా ఖజానాయే అనే నషా ఉంటుంది. ఆ సంతోషంలో ఉంటాడు. అదేవిధంగా మీకు కూడా సంతోషం తక్కువగా ఉంటుంది అంటే కారణం ఏమిటి? బాబా అయితే ఖజానాలు ఇచ్చారు, విన్నారా! కానీ ఒకరు - వినేవారు, రెండవ వారు - నింపుకునేవారు. నింపుకునేవారు నషాలో ఉంటారు. ఈరోజు క్రొత్త క్రొత్త పిల్లలు కూడా వచ్చారు. బాప్ దాదా అదృష్టవంతులైన మీ అందరికీ మీ భాగ్యానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీ భాగ్యాన్ని మీరు గుర్తించారా? పరమాత్మ ప్రేమ అవినాశి ప్రేమ, ఇది కేవలం ఒక్క జన్మ కొరకే కాదు అనేక జన్మలు ఈ ప్రేమ స్థిరంగా ఉంటుంది, ఇది సంగమయుగం అనగా భాగ్యవంతమైన యుగం. సత్యయుగాన్ని కూడా భాగ్యవంతయుగం అంటారు. కానీ దాని కంటే సంగమయుగం మరింత భాగ్యవంతయుగం. ఎందువలన? ఈ సంగమయుగంలోనే తండ్రి ద్వారా అఖండ భాగ్యం యొక్క వరదానం మరియు వారసత్వం ప్రాప్తిస్తాయి. ఇటువంటి సంగమయుగ భాగ్యవంత సమయంలో మీరందరు మీ భాగ్యాన్ని తీసుకునేటందుకు వచ్చారు. బాప్ దాదా పిల్లలందరికీ పురుషార్థం యొక్క చాలా సహజ విధిని చెప్తున్నారు. సహజమైనది కావాలి కదా! కష్టమైనది కావాలనుకోరు కదా! ఈ పిల్లలకు భాగ్యం యొక్క సహజ విధి లభించింది. లభించింది కదా? ఇంకేమీ చేయనవసరం లేదు.కేవలం ఒక్క విషయం చేయండి అది కూడా చాలా సహజమైనది. ఒక్క విషయం అయితే చేయగలరు కదా? చేయగలరో లేదో చెప్పండి! చేయగలం అని చెప్పండి. అన్నింటికంటే సహజ వీధి - అమృతవేళ నుండి ఎవరిని ఎవరు కలుసుకున్నా వారి నుండి ఆశీర్వాదాలను తీస్కోండి మరియు ఆశీర్వాదాలను ఇవ్వండి. క్రోధి ఆత్మ వచ్చినా కానీ మీరు ఆ ఆత్మకి కూడా ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు తీస్కోండి. ఎందుకంటే ఆశీర్వాదాలు తీవ్ర పురుషార్థానికి చాలా సహజ యంత్రం. విజ్ఞాన సాధనం అయిన రాకెట్ ఎంత వేగవంతంగా పనిచేస్తుందో అదేవిధంగా ఆశీర్వాదాలు ఇవ్వటం మరియు తీసుకోవటం కూడా ముందుకు వెళ్ళేటందుకు సహజ సాధనం. అమృతవేళ బాబా యొక్క సహజ స్మృతి ద్వారా ఆశీర్వాదాలను తీస్కోండి మరియు రోజంతటిలో ఆ ఆశీర్వాదాలను ఇవ్వండి, ఇది చేయగలరా? చేయగలరా? చేయగలిగితే చేతులెత్తండి. ఎవరైనా శాపం ఇస్తే ఏమి చేస్తారు? మిమ్మల్ని వారు మాటిమాటికి విసిగిస్తుంటే ఏమి చేస్తారు? చూడండి, మీరు పరమాత్మ యొక్క పిల్లలు, దాత యొక్క పిల్లలు, మాస్టర్ దాతలు మరి దాత యొక్క పని ఏమిటి? ఇవ్వటమే దాత యొక్క పని. కనుక అన్నింటికంటే మంచి పని ఆశీర్వాదాలను ఇవ్వటం. ఎటువంటి వ్యక్తి అయినా కానీ మీ సోదరీసోదరులే కదా! పరమాత్మ పిల్లలు పరస్పరం సోదరీసోదరులు కదా! కనుక పరమాత్మ సంతానం, నా యొక్క ఈశ్వరీయ సోదరుడు లేదా సోదరి అని భావించి ఏమి ఇవ్వాలి? వారికి శాపం ఇస్తారా? బాబా ఎప్పుడైనా శాపం ఇస్తారా? ఇస్తారా? ఇస్తారా? ఇస్తారా, ఇవ్వరా? ఇస్తారో ఇవ్వరో చెప్పండి. అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వటం ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. ఎందువలన? ఎందుకంటే శాపం ఇచ్చిన వారికి కూడా మీరు ఆశీర్వాదం ఇస్తే అనగా వారు ఆశీర్వాదం ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఇస్తూ ఉంటే దు:ఖం ఎలా వస్తుంది? బాప్ దాదా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకి ఒక వరదానం ఇస్తున్నారు, ఆ వరదానాన్ని స్మృతిలో ఉంచుకుంటే చాలా సంతోషంగా ఉంటారు. వరదానం చెప్పనా? వింటారా? వరదానం - ఒకవేళ ఎవరైనా మీకు దు:ఖం ఇచ్చినా కానీ మీరు దు:ఖం తీసుకోకండి. వారు ఇస్తారు కానీ మీరు తీసుకోకూడదు. ఎందుకంటే ఇచ్చేవారు ఇచ్చేశారు, కానీ తీసుకునేవారు మీరే కదా! వారు దు:ఖం అంటే చెడు వస్తువుని మీకు ఇస్తుంటే మీరు తీసుకుంటారా? తీసుకుంటారా? తీసుకోరా? ఎందుకు తీసుకుంటున్నారు? దు:ఖం తీసుకుంటే ఎవరు దు:ఖి అవుతారు? మీరు అవుతారా లేక వారు అవుతారా? తీసుకువారే ఎక్కువ దు:ఖి అవుతారు. కనుక ఇప్పటి నుండే మీరు దు:ఖం తీసుకోకపోతే సగం దు:ఖం దూరం అయిపోతుంది. ఎందుకంటే మీరు తీసుకోలేదు కదా! మరియు మీరు దు:ఖం తీసుకోకుండా వారికి సుఖం ఇస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి కదా! అప్పుడు సుఖిగా ఉండగలరు మరియు ఆశీర్వాదాల ఖజానా కూడా నిండుతూ ఉంటుంది. 

ఏ ఆత్మ ఎలా ఉన్నా కానీ మీరు ప్రతి ఆత్మ నుండి ఆశీర్వాదాలను తీస్కోండి. శుభభావన, శుభకామన ఉంచుకోండి. అప్పుడప్పుడు ఏమి జరుగుతుంది? ఎవరైనా పొరపాటు పని చేస్తే, వారికి శిక్షణ ఇచ్చేటందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని మంచిగా చేస్తాను అని శిక్షణ ఇస్తున్నారు. 
 
శిక్షణ ఇవ్వండి కానీ శిక్షణ ఇచ్చే సర్వోత్తమ విధి ఏమిటంటే క్షమారూపమై శిక్షణనివ్వండి. కేవలం శిక్షణ ఇవ్వకండి, దయ మరియు క్షమ చూపించండి మరియు శిక్షణ కూడా ఇవ్వండి. రెండు మాటలను గుర్తు పెట్టుకోండి - శిక్షణ మరియు క్షమ లేదా దయ. దయాహృదయులై శిక్షణ ఇవ్వటం ద్వారా మీ శిక్షణ పనిచేస్తుంది. దయాహృదయులై ఇవ్వకపోతే మీ శిక్షణను ఒక చెవితో వింటారు, మరో చెవితో వదిలేస్తారు. శిక్షణను ధారణ చేయరు. అలా జరుగుతుంది కదా! అనుభవం ఉందా? శిక్షకులుగా అవ్వటం త్వరగా వస్తుంది కానీ క్షమించటం కూడా వెనువెంట ఉండాలి. దయకు విధి శుభ భావన మరియు శుభ కామన. సత్యమైన ప్రేమ రాతిని కూడా నీరుగా చేస్తుంది అని అంటారు కదా! అదేవిధంగా క్షమా స్వరూపంతో శిక్షణ ఇవ్వటం ద్వారా మీరు దేని గురించి అయితే ఇలా చేయకూడదు, ఇలా కాదు అని అనుకుంటున్నారో అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మీరు దయాహృదయులై శిక్షణ ఇచ్చిన ప్రభావంతో వారి కఠినహృదయం కూడా పరివర్తన అయిపోతుంది. 

కనుక ఏమి వరదానం లభించింది? దు:ఖం ఇవ్వకూడదు, దు:ఖం తీసుకోకూడదు. ఇష్టమేనా? ఇష్టమేనా? ఇప్పుడిక తీసుకోకూడదు. పొరపాటు చేయకూడదు. బాబా దు:ఖం ఇవ్వరు కదా! మరి తండ్రిని అనుసరించాలి కదా! అనుసరిస్తున్నారు. అప్పుడప్పుడు కొంచెం కొంచెం మందలిస్తున్నారు, కానీ అలా చేయకూడదు. దయ చూపించండి. దయతో పాటు శిక్షణనివ్వండి. మాటిమాటికి ఎవరినైనా మందలిస్తూ ఉంటే ఆ ఆత్మ మరింత శత్రువు అయిపోతుంది. ఏవగింపు వస్తుంది. పరమాత్మ యొక్క పిల్లలు కదా! మరి ఎలా అయితే బాబా పతితులను కూడా పావనంగా చేస్తారో అదేవిధంగా మీరు దు:ఖి ఆత్మలకు సుఖం ఇవ్వలేరా? ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత నుండి ప్రయత్నించండి. ప్రయతిస్తారా? చేస్తారు కదా? అయితే మొదట ఇంటి నుండే ఉద్దరణ ప్రారంభించండి. పరివారంలో ఎవరైనా దు:ఖం ఇచ్చిన కానీ తీసుకోకూడదు. ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు దయాహృదయులు అవ్వాలి, ముందుగా మీ ఇంట్లో వారిపై ప్రయోగం చేయండి. అప్పుడు మీ ఇంటి యొక్క ప్రభావం మీ వీధిపై (పట్టణపు పేట) పడుతుంది, వీధి యొక్క ప్రభావం దేశంపై పడుతుంది. దేశం యొక్క ప్రభావం ప్రపంచంపై పడుతుంది. సహజం కదా! కనుక మీ కుటుంబం నుండి ప్రారంభించండి. ఎందుకంటే చూడండి ఇంట్లో ఒక్కరు అయినా క్రోధంగా మాట్లాడితే ఆ ఇంటి యొక్క వాతావరణం ఎలా ఉంటుంది? ఇల్లు అనిపిస్తుందా లేక యుద్ధమైదానం అనిపిస్తుందా? ఆ సమయంలో ఇల్లు మంచిగా అనిపిస్తుందా? మీ కోసం కూడా (మధువన నివాసీయులతో) మీ మీ సహయోగులతో, మీ మీ కార్యకర్తలతో దు:ఖం ఇవ్వకూడదు, దు:ఖం తీసుకోకూడదు. ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు తీసుకోవాలి. ఒకవేళ అటువంటి సమయంలో కూడా మీరు అధికారంతో మనస్సుతో నా బాబా, పరమాత్మ బాబా, నా బాబా ఎలా అన్నా బాబా హాజరైపోతారు. భగవంతుడు సదా హాజరై ఉంటాడు అనే మహిమ ఉంది కదా! కనుక మీరు మనస్సుతో అటువంటి సమయంలో కూడా అధికార రూపంలో నా బాబా అనగానే బాబా హాజరు అయిపోతారు. ఎందుకంటే తండ్రి ఉన్నదే ఎవరి కొరకు? పిల్లల కొరకే కదా! అధికారి పిల్లలకు బాబా సహయోగం లభించకపోవటం అనేది జరగనే జరగదు. అసంభవం. కనుక పరివర్తన చేసుకుని వెళ్ళాలి. ఎలా వచ్చారో అలా వెళ్ళిపోకూడదు. పరివర్తన చేసుకునే వెళ్ళాలి. ఇంత ఖర్చుపెట్టుకుని వచ్చారు కదా. టికెట్ కోసం ఖర్చు పెట్టారు కదా, అంటే ధనం ఖర్చు చేశారు, సమయం ఉపయోగించారు. దాని యొక్క విలువ పొందాలి కదా! కనుక స్వ పరివర్తన ద్వారా ఇంటి పరివర్తన, తర్వాత దేశం మరియు ప్రపంచం. అప్పుడు మీ ఇల్లు ఆశ్రమం అయిపోతుంది. ఇల్లు కాదు, ఆశ్రమం. ఇంటిని ఆశ్రమంగా చేసుకోవాలి. ఆశ్రమం యొక్క కార్యం - ఆశీర్వాదాలను ఇవ్వటం మరియు తీసుకోవటం. మీ ఇల్లు మందిరంగా అయిపోతుంది. మందిరంలో విగ్రహం యొక్క కర్తవ్యం ఏమిటి? ఆశీర్వాదాలను ఇస్తుంది కదా! విగ్రహం ఎదురుగా వెళ్ళి ఏమంటారు? ఆశీర్వాదం అడుగుతారు కదా! దయ అడుగుతారు కదా! అదేవిధంగా మీరు కూడా ఏమి ఇవ్వాలి? ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఈశ్వరీయ ప్రేమను ఇవ్వండి. ఆత్మిక ప్రేమను ఇవ్వండి. శారీరక ప్రేమ కాదు. ఆత్మిక ప్రేమను ఇవ్వండి. ఈరోజుల్లో ప్రేమ స్వార్థపూరిత ప్రేమ. సత్యమైన మనస్సు యొక్క ప్రేమ లేదు. స్వార్థంతో ప్రేమనిస్తారు. స్వార్థం లేకపోతే పట్టించుకోరు. కనుక మీరు ఏమి చేస్తారు? ఆత్మిక ప్రేమను ఇవ్వండి, ఆశీర్వాదాలు ఇవ్వండి, దు:ఖం ఇవ్వకూడదు, తీసుకోకూడదు. మీకు అవకాశం లభించింది కదా! బాప్ దాదాకి కూడా సంతోషంగా ఉంది. ఇక్కడికి ఎవరైతే వచ్చారో వారందరి ఇళ్ళు ఆశ్రమాలు అవుతాయి కదా! అలా తయారుచేస్తారు కదా? తయారుచేస్తారా? లేక కొంచెం అపరిపక్వంగా ఉన్నారా? ఏమైనా కానీ, కొంచెం సహించవలసి వచ్చినా, ఇముడ్చుకునే శక్తి కార్యంలో ఉపయోగించవలసి వచ్చినా కానీ ఆశ్రమంగా తయారుచేసి తీరుతాం అనే వారు చేతులెత్తండి. సహనశక్తి యొక్క ఫలం చాలా మధురంగా ఉంటుంది. సహించవలసి ఉంటుంది కానీ ఫలం చాలా మధురంగా ఉంటుంది. ఇంటింటిని స్వర్గంగా తయారు చేసుకుంటాం, మందిరంగా తయారు చేసుకుంటాం, ఆశ్రమంగా తయారు చేసుకుంటాం అనేవారు చేతులెత్తండి. ఒకరిని చూసి ఒకరు చేతులెత్తకండి. ఎందుకంటే బాబా తర్వాత మరలా లెక్కిస్తారు. సత్యమైన మనస్సుతో చేయి ఎత్తండి. మంచిది. దాదీలు, వీరికి ఏమి బహుమతి ఇస్తారు? (దాదీతో) చెప్పండి ఇంతమంది ఆశ్రమాలను తయారు చేస్తే మీరు ఏమి బహుమతి ఇస్తారు? (బాబా ఏ ఆజ్ఞ ఇస్తే అదే) మీకు బహుమతి అయితే లభిస్తుంది అదేమి గొప్ప విషయం కాదు కానీ ...... కానీ అనేది ఉందా? కానీ చెప్పనా? మీరు ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత నుండి మీ ధారణ ద్వారా పరివర్తన చేయాలి మరియు 15 రోజులు లేదా నెల రోజుల తర్వాత ఫలితాన్ని వ్రాసి పంపాలి. ఒక్క నెల అయినా కానీ దు:ఖం తీసుకోము మరియు ఇవ్వము అని అటువంటి వారికి చాలా మంచి బహుమతి ఉంటుంది. ఒకవేళ మీరు వస్తే మంచిదే శుభాకాంక్షలు. ఒకవేళ మీరు రాలేకపోతే సెంటర్ కి పంపుతారు. ఈ రోజు వీరి కొరకే రావలసి వచ్చింది కదా! కనుక అద్భుతం చేసి చూపించాలి. పరమాత్మ యొక్క పిల్లలు అద్భుతం చేయకపోతే ఏమి చేస్తారు? అలజడి కాదు, అద్భుతం చేయాలి. ఒకవేళ పొరపాటుగా చెడు సంకల్పం ఏదైనా వచ్చినా వస్తే ఏమి చేస్తారు? ఏమి చేస్తారు? అవి వస్తాయి ఎందువలనంటే మీరు చాలా సమయం ఆ చెడుని పాలన చేసారు, ఉదాహరణకి ఏదైనా పశువుని మీరు పాలన చేస్తే దానిని దూరంగా వదిలేసి వచ్చినా కానీ తిరిగి మీ దగ్గరికే వచ్చేస్తుంది కదా! మీరు చేతులెత్తారు, మంచిదే కానీ పొరపాటున ఏదైనా బలహీనత వచ్చేస్తే ఏమి చేస్తారు? బలహీనతను రానిస్తారా? దీనికి కూడా విధి చెప్తున్నాను. మీరు ప్రతిజ్ఞ చేసి చెడుని బాబాకి ఇచ్చేశారు. ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చేశారు తిరిగి మీ దగ్గరకి వస్తే ఏమి చేస్తారు? మీ దగ్గర ఉంచుకుంటారా? తిరిగి ఇచ్చేస్తారా? తిరిగి ఇచ్చేస్తారు కదా! అదేవిధంగా మీ వద్దకు కొంచెం క్రోధం, లోభం, మోహం, అభిమానం పొరపాటున వచ్చేసినా కానీ తిరిగి బాబాకి ఇచ్చేయాలి. బాబా ఇది మీకు ఇచ్చేసిన వస్తువు మీదే భారం నాది కాదు అని. బాబా సాగరం కదా ఆ సాగరంలో కలిపేయాలి. మీరు ఉపయోగించకూడదు. ఎందుకంటే బాబాకి ఇచ్చేశారు కదా! మరలా దానిని స్వంతం చేసుకోకూడదు. బాబాకి ఇచ్చేయండి, బాబా నీ వస్తువు నీకే తెలుసు, నేను ఉపయోగించను అని చెప్పాలి. చిన్న పిల్లలకు మీరు నేర్పిస్తారు కదా మట్టి తినకూడదు అని. కానీ పిల్లలు మరలా మట్టి తింటారు వారికి మట్టి ఇష్టమనిపిస్తుంది. అప్పుడు మీరు ఏమి చేస్తారు? మాటిమాటికి వారిని తొలగించి తీసుకువస్తారా లేక తిననిస్తారా? తొలగిస్తారు కదా! ఒక్క అడుగు మీ ధైర్యానిది, వేల అడుగులు బాబా యొక్క సహాయం తప్పక ఉంటుంది. అనుభవం చేసి చూడండి. ధైర్యాన్ని వదలకూడదు, మనస్సుని బలహీనం చేసుకోకూడదు. సర్వశక్తివంతుని పిల్లలు బలహీనం కాకూడదు. ధైర్యాన్ని కోల్పోకూడదు, ధృడ సంకల్పం చేయాలి, సఫలత మీ జన్మసిద్ధ అధికారం. 

నలువైపుల ఉన్న దేశ విదేశాలలోని పిల్లల యొక్క స్మృతి బాబా దగ్గరకి చేరుకుంది. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, మనస్సు ద్వారా అందరిదీ చేరుకుంది. బాప్ దాదా దేశ విదేశాలలోని పిల్లలందరికీ జవాబుగా ఆశీర్వాదాలు మరియు కోటాను కోట్ల ప్రియస్మృతులు ఇస్తున్నారు. . 

నలువైపుల ఉన్న పరమాత్మ ప్రేమ యొక్క అధికారి పిల్లలకు, సర్వ ఖజానాలతో నిండుగా ఉండే పిల్లలకు, నిర్వికల్ప, నిర్వ్యర్థ సంకల్పాలు గల శ్రేష్ట ఆత్మలకు, స్వ పరివర్తన చేసుకునే మరియు చేయించే ఉత్సాహ ఉల్లాసాలతో ఎగురుతూ ఉండే పిల్లలకు, వెనువెంట బాప్ దాదాకి సత్యమైన మనస్సుతో తమ మనస్సు యొక్క సమాచారం వినిపించే సత్యమైన మనస్సు గల పిల్లలకు విశేషంగా మనోభిరాముని రూపంలో, తండ్రి రూపంలో, శిక్షకుని రూపంలో, సద్గురువు రూపంలో కోటానుకోట్ల రెట్లు ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments