03-04-1996 అవ్యక్త మురళి

         03-04-1996         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సేవతో పాటూ బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా పాత లేదా వ్యర్ధ సంస్కారాల నుండి ముక్తులు అవ్వండి.

ఈరోజు బేహద్ బాబా తన బేహద్ సదా సహయోగి, తోడు అయిన పిల్లలను చూస్తున్నారు. నలువైపుల ఉన్న సదా సహయోగి పిల్లలు సదా బాబా యొక్క హృదయ సింహాసనాధికారులు, నిరాకారుడైన బాబాకి అయితే తన అకాల సింహాసనం కూడా లేదు. కానీ పిల్లలైన మీకు ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? బాప్ దాదా సింహాసనాధికారి పిల్లలను చూసి ఓహో నా సింహానాధికారి పిల్లలూ!అని సంతోషపడతారు. మీరందరూ కూడా బాప్ దాదాని చూసి సంతోషిస్తున్నారు కదా! కానీ బాప్ దాదా ఎంత మంది పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు విశేషాత్మ. చివరి నెంబర్ అయినా కానీ కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమందిలోని వారిగా అయ్యారు కదా! అందువలన ఒక్కొక్క బిడ్డని చూసి బాబాకి ఎక్కువ సంతోషం ఉంటుందా లేదా మీకు ఉంటుందా? (ఇద్దరికీ) బాబాకి ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలో ఎంత సంతోషం. మీకు కేవలం డబల్ సంతోషం అంతే. మీకు అయితే పరివారం యొక్క సంతోషం కూడా ఉంది. కానీ బాబా యొక్క సంతోషం సదాకాలికమా? లేక మీ సంతోషం సదాకాలికమా? లేక అప్పుడప్పుడు అలజడి అవుతుందా? 

బాప్ దాదా అనుకుంటున్నారు. బ్రాహ్మణజీవితం యొక్క శ్వాస - సంతోషం. సంతోషం లేకపోతే బ్రాహ్మణ జీవితం లేదు. అది కూడా అవినాశి సంతోషం ఉండాలి, అప్పుడప్పుడు ఉండటం కాదు. శాతం ఉండకూడదు. సంతోషమే సంతోషం. ఈ రోజు 50 శాతం సంతోషం. రేపు 100 శాతం ఉంటే జీవితం యొక్క శ్వాస పైకి, క్రిందకి అయినట్లు కదా! బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు. ప్రాణం పోయినా కానీ సంతోషం వదలకూడదు. ఈ పాఠం సదా పక్కాగా ఉందా లేదా కొంచెం కొంచెం పచ్చిగా ఉందా? సదా అండర్‌లైన్ చేసుకుంటున్నారా? అప్పుడప్పుడు ఉండేవారు ఏవిధంగా అవుతారు? సదా సంతోషంలో ఉండేవారు పాస్ విత్ ఆనర్ అవుతారు మరియు అప్పుడప్పుడు సంతోషంలో ఉండేవారు ధర్మరాజుపురిని దాటవలసి ఉంటుంది. పాస్ విత్ ఆనర్ అయ్యేవారు ఒక్క సెకనులో బాబా వెంట వెళ్ళిపోతారు. ఆగరు. అయితే మీరందరూ ఎవరు? వెంట వెళ్ళేవారా లేక ఆగిపోయేవారా? (వెంట వెళ్ళేవాళ్ళం ) అయితే చార్ట్ ఆవిధంగా ఉందా? ఎందుకంటే విశేషంగా వజ్రోత్సవ సంవత్సరంలో బాప్ దాదాకి ప్రతి ఒక్క బిడ్డపై ఏ శుభ ఆశ ఉందో తెలుసు కదా? 

బాప్ దాదా పిల్లలందరి చార్ట్ పరిశీలించారు. దానిలో ఏమి చూశారంటే వర్తమాన సమయం అనుసారంగా ఒక విషయంపై విశేష ధ్యాస కావాలి. సేవలో అయితే చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో ముందుకి వెళ్తున్నారు. వజ్రోత్సవ సంవత్సరంలో విశేషంగా సేవలో చాలా ఉత్సాహ ఉల్లాసాలతో ఉన్నారు. దీనిలో అయితే పాస్ అయిపోయారు. ప్రతి ఒక్కరు శక్తిననుసరించి సేవ చేస్తున్నారు మరియు చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు విశేషంగా ఏమి కావాలి? సమయం సమీపంగా ఉంది, సమయం యొక్క సమీపత అనుసారంగా ఇప్పుడు ఏ అల కావాలి? (వైరాగ్యం) ఎటువంటి వైరాగ్యం? హద్దులో వైరాగ్యమా లేదా బేహద్ వైరాగ్యమా? ఎంతగా సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయో అంతగానే సమయానుసారంగా స్వస్థితిలో బేహద్ వైరాగ్యం ఎంత వరకు ఉంది? ఎందుకంటే మీ సేవ యొక్క సఫలత ఏమిటంటే త్వరత్వరగా ప్రజలు తయారైపోవాలి అని. అందువలనే సేవ చేస్తున్నారు కదా? ఎంతవరకు నిమిత్త ఆత్మలైన మీలో బేహద్ వైరాగ్యవృత్తి రాదో అంతవరకు ఇతరాత్మలకు కూడా వైరాగ్య వృత్తి రాదు. వైరాగ్యవృత్తి లేనంత వరకు మీరు కోరుకున్నట్లుగా బాబా పరిచయం అందరికి లభించదు. బేహద్ వైరాగ్యం సదాకాలికంగా ఉండాలి. ఒకవేళ సమయానుసారంగా లేదా పరిస్థితులనుసారంగా వైరాగ్యం వస్తే సమయం మొదటి నెంబర్ అయిపోతుంది, మీరు రెండవనెంబర్ అయిపోతారు. అంటే పరిస్థితి లేదా సమయం వైరాగ్యం ఇప్పించింది. పరిస్థితి సమాప్తి అయిపోతే లేదా సమయం వెళ్ళిపోతే వైరాగ్యం కూడా వెళ్ళిపోతుంది. దీనిని ఏమి అంటారు? బేహద్ వైరాగ్యం అంటారా లేక హద్దు వైరాగ్యం అంటారా? కానీ ఇప్పుడు బేహద్ వైరాగ్యం కావాలి. వైరాగ్యం ఖండితం అయిపోతుందంటే దానికి ముఖ్య కారణం - దేహాభిమానం. దేహాభిమానంపై వైరాగ్యం రానంతవరకు ఏ విషయం యొక్క వైరాగ్యం సదాకాలికంగా ఉండదు. అల్పకాలికంగానే ఉంటుంది. సంబంధాలతో వైరాగ్యం అనేది గొప్ప విషయమేమి కాదు. అది అయితే ప్రపంచంలోని వారికి కూడా కొందరికి మనస్సుతో వైరాగ్యం వచ్చేస్తుంది. కానీ దేహాభిమానానికి రకరకాల రూపాలు ఉన్నాయి. అవి మీకు తెలుసు కదా? దేహాభిమానం యొక్క రూపాలు ఎన్ని వాటి విస్తారం మీకు తెలుసు కానీ ఈ అనేక దేహాభిమానం యొక్క రూపాలను తెలుసుకుని బేహద్ వైరాగ్యంలో ఉండాలి. దేహాభిమానం అనేది దేహీ అభిమానంలోకి మారిపోవాలి. దేహాభిమానం ఏవిధంగా అయితే సహజం అయిపోయిందో అలాగే దేహీ అభిమానం (ఆత్మాభిమానం) కూడా సహజం అయిపోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో మొదట “దేహం” అనే మాటే వస్తుంది. సంబంధాలు అంటే దేహసంబంధాలు, పదార్థాలు అంటే దైహిక పదార్థాలు అంటే ముఖ్య ఆధారం దేహాభిమానం. ఏ రకంగా అయినా దేహాభిమానం ఉంది అంటే వైరాగ్యవృత్తి రాదు. బాప్ దాదా చూసారు - వర్తమాన సమయంలో దేహాభిమానం యొక్క విఘ్నానికి కారణం దేహం యొక్క పాత సంస్కారాలతో వైరాగ్యం రాలేదు. మొదట దేహం యొక్క పాత సంస్కారాలతో వైరాగ్యం రావాలి. సంస్కారాలు స్థితి నుండి క్రిందకి తీసుకువచ్చేస్తాయి. సంస్కారాల కారణంగా సేవలో లేదా సంబంధ సంపర్కాలలో విఘ్నం వచ్చేస్తుంది. చివరికి ఫలితంలో ఏమి చూసారంటే - ఎంత వరకు దేహం యొక్క పాత సంస్కారాలతో వైరాగ్యం రాదో అంతవరకు బేహద్ వైరాగ్యం సదా ఉండదు. సంస్కారాలు రకరకాల రూపాలతో ఆకర్షితం చేసేస్తాయి. ఎక్కడైనా, ఏదైనా ఆకర్షణ ఉంటే అక్కడ వైరాగ్యం ఉండదు. అయితే పరిశీలించుకోండి. నేను నా పాత లేదా వ్యర్ధ సంస్కారాలతో ముక్తి పొందానా? అని. ఎంత ప్రయత్నం చేసినా కానీ లేదా చేస్తున్నా కానీ వైరాగ్యవృత్తిలో ఉండాలి అనుకుంటున్నారు కానీ సంస్కారాలు కొందరి దగ్గరికి లేదా ఎక్కువ మందికి ఏదోక రూపంలో ప్రబలంగా తమ వైపు ఆకర్షితం చేసుకుంటున్నాయి. కనుక మొదట పాతసంస్కారాలతో వైరాగ్యం రావాలి. సంస్కారాలు వద్దనుకున్నా కానీ ఎందుకు బయటికి వస్తున్నాయి? కావాలనుకోవటం లేదు కానీ సూక్ష్మంగా సంస్కారాలని భస్మం చేయలేదు. ఎక్కడో అక్కడ అంశమాత్రంగా ఉండిపోయినవి, దాగి ఉన్నాయి. అవి సమయానికి వద్దనుకున్నా కానీ వచ్చేస్తున్నాయి. అప్పుడు అంటున్నారు - కావాలనుకోలేదు. కానీ ఏమి చేయము? అయిపోయింది. అయిపోతుంది.... ఇలా ఎవరు మాట్లాడతారు? దేహాభిమానం ఉన్నవారా లేక ఆత్మాభిమానం ఉన్నవారా? 

బాప్ దాదా చూసారు సంస్కారాలపై వైరాగ్యవృత్తిలో బలహీనంగా ఉన్నారు. సమాప్తి చేసారు కానీ అంశమాత్రం కూడా ఉండకుండా సమాప్తి చేయలేదు. ఎక్కడ అంశం ఉంటుందో అక్కడ వంశం ఉండనే ఉంటుంది. ఈరోజు అంశం కానీ సమయానికి అది వంశ రూపం అయిపోతుంది, పరవశం చేసేస్తుంది. చెప్పడానికి అయితే అందరూ ఏమి చెప్తారు? బాబా ఏవిధంగా అయితే జ్ఞానసాగరులో అలాగే మేము కూడా మాస్టర్ జ్ఞానసాగరులం అని. కానీ సంస్కారాలు యుద్ధం చేసినపుడు జ్ఞానసాగరులా లేక జ్ఞానం ఇంకిపోయిందా? ఏమిటి? జ్ఞానసాగరులకి బదులు జ్ఞానం ఇంకిపోతుంది. ఆ సమయంలో ఎవరైనా అడిగితే అవును నేను కూడా అనుకుంటున్నాను, అవ్వకూడదు, చేయకూడదు అని కానీ అయిపోతుంది అంటారు. అంటే జ్ఞానసాగరులు అయ్యారా లేక జ్ఞానం ఇంకిపోయిందా. జ్ఞానసాగరులు అయినవారిపై ఏ సంస్కారం, సంబంధం లేదా పదార్ధం యుద్ధం చేయలేవు. 

వజ్రోత్సవం జరుపుకుంటున్నారు. వజ్రోత్సవం అంటే వజ్రంగా తయారవ్వటం అంటే బేహద్ వైరాగిగా అవ్వాలి. ఎంతగా సేవ యొక్క ఉల్లాసం ఉందో అంత వైరాగ్యవృత్తిపై ధ్యాస లేదు.దీనిలో సోమరితనంగా ఉన్నారు, నడుస్తున్నాం...అవుతాము.....అయిపోతుంది ..... సమయం వస్తే సరి అయిపోతాం..... అంటున్నారు అంటే మీకు సమయం శిక్షకుడా లేదా బాబా శిక్షకుడా?ఎవరు? సమయానుసారంగా పరివర్తన అయితే సమయమే మీ శిక్షకుడు అయ్యింది. మీ రచన మీకు శిక్షకుడు అయితే బావుంటుందా? పరిస్థితి వచ్చినప్పుడు ఏమంటున్నారు? సమయానికి సరి అయిపోతాం, అయిపోతుంది. బాబాకి కూడా ధైర్యం ఇప్పిస్తున్నారు - బాబా చింతించకండి. అయిపోతుంది, సమయానికి పూర్తిగా ముందుకు వెళ్ళిపోతాం అని. సమయాన్ని మీ శిక్షకునిగా చేసుకోవటం అనేది మాస్టర్ రచయితలు అయిన మీకు శోభిస్తుందా? బాగుంటుందా? లేదు. సమయం మీ రచన మీరు మాస్టర్ రచయిత. రచన మాస్టర్ రచయితకి శిక్షకునిగా అయితే అది మాస్టర్ రచయితలకు శోభించదు. బాప్ దాదా ఇప్పుడు సమయం ఇచ్చారు. దానిలో వైరాగ్య వృత్తిని ప్రత్యక్షం చేయండి, ఎందుకంటే సేవ యొక్క తగుల్పాటులో వైరాగ్యవృత్తి సమాప్తి అయిపోతుంది. సేవలో సంతోషం కూడా వస్తుంది, శక్తి కూడా లభిస్తుంది మరియు ప్రత్యక్షఫలం కూడా లభిస్తుంది. కానీ సేవలోనే బేహద్ వైరాగ్య వృత్తి కూడా సమాప్తి అయిపోతుంది. అందువలన ఇప్పుడు మీలో వైరాగ్య వృత్తిని మేల్కొల్పండి. కల్పపూర్వం కూడా అయ్యారు. మీరే కదా లేక ఇంకెవరైనా ఉన్నారా? మీరే కదా! గుప్తంగా ఉన్న దానిని ప్రత్యక్షం చేయండి. సేవా పద్దతులను ప్రత్యక్షంలోకి తీసుకువస్తున్నారు కదా! అప్పుడే సఫలత లభిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు బేహద్ వైరాగ్య వృత్తిని ప్రత్యక్షం చేయండి. ఎన్ని సాధనాలు లభించినా కానీ, రోజు రోజుకి ఎక్కువ సాధనాలు లభిస్తాయి. కానీ బేహద్ వైరాగ్య వృత్తి యొక్క సాధన గుప్తం అవ్వకూడదు. ప్రత్యక్షంగా ఉండాలి. సాధనాలు మరియు సాధన రెండూ సమానంగా ఉండాలి. ఎందుకంటే మున్ముందు ప్రకృతి మీకు దాసీ అయిపోతుంది, గౌరవం లభిస్తుంది, స్వమానం లభిస్తుంది. అన్నీ ఉన్నా కానీ బేహద్ వైరాగ్యవృత్తి తక్కువ కాకూడదు. అయితే స్వయంలో బేహద్ వైరాగ్యవృత్తి యొక్క వాయుమండలాన్ని అనుభవం చేసుకుంటున్నారా లేక సేవలోనే నిమగ్నం అయిపోయారా? ప్రపంచం వారికి సేవ యొక్క ప్రభావం చూపిస్తున్నారు కదా! అలాగే బేహద్ వైరాగ్యవృత్తి యొక్క ప్రభావం చూపించాలి. ఆదిలో మీ అందరి స్థితి ఏమిటి? పాకిస్థాన్లో ఉన్నప్పుడు సేవ లేదు. సాధనాలు ఉండేవి కానీ బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలమే సేవని పెంచింది. డైమండ్ జూబ్లీ వారికి ఈ సంస్కారం ఆదిలో ఉంది, ఇప్పుడు గుప్తం అయిపోయింది. మరలా దానిని ఇప్పుడు ప్రత్యక్షంలోకి తీసుకురండి. ఆదిరత్నాల యొక్క బేహద్ వైరాగ్య వృత్తి స్థాపన చేసింది, ఇప్పుడు మరలా క్రొత్త ప్రపంచం యొక్క స్థాపన కొరకు అదే వృత్తిని మరియు వాయుమండలాన్ని ప్రత్యక్షం చేయండి. ఏమి అవసరం ఉందో విన్నారా? 

మీకు సాధనాలే లేకుండా మాకు వైరాగ్యం ఉంది. మీరు అంటే ఎవరు అంగీకరిస్తారు? సాధనాలు ఉండాలి మరియు వైరాగ్యం కూడా ఉండాలి. ఆదిలో సాధనాలలో మరియు ఇప్పటి సాధనాలలో ఎంత తేడా ఉంది? సాధన గుప్తం అయిపోయింది, సాధనాలు ప్రత్యక్షం అయిపోయాయి. సాధనాలను విశాలహృదయంతో ఉపయోగించుకోండి. ఎందుకంటే సాధనాలు ఉన్నవి మీ కోసమే కానీ సాధనని గుప్తం చేయకండి. పూర్తి సమానత ఉండాలి. ప్రపంచం వారికి చెప్తారు కదా కమలపుష్ప సమానంగా ఉండండి అని. అలాగే మీరు కూడా సాధనాలు ఉన్నా కానీ కమలపుష్ప సమానంగా అవ్వండి. సాధనాలు ఉండటం చెడు కాడు. ఈ సాధనాలు కూడా మీ కర్మకి లేదా యోగానికి ఫలం కానీ వృత్తి ఎలా ఉండాలి? సాధనాల యొక్క ప్రవృత్తిలో, సాధనాలకు వశం అయిపోయి చిక్కుకునిపోలేదు కదా? కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు బాబాకి ప్రియంగా ఉండాలి. వాటిని ఉపయోగించుకుంటూ వాటి ప్రభావంలోకి రాకండి. అతీతంగా ఉండండి. సాధనాలు బేహద్ వైరాగ్యవృత్తిని గుప్తం చేయకూడదు. ఇప్పుడు విశ్వం అతివైపు వెళ్తుంది. అందువలన ఇప్పుడు సత్యమైన వైరాగ్యవృత్తి అవసరం మరియు ఆ వాయుమండలాన్ని తయారుచేసేవారు మీరే. మొదట స్వయంలో తరువాత విశ్వంలో. డైమండ్ జూబ్లీ వారు ఏమి చేస్తారు? ఈ అల వ్యాపింపచేస్తారు కదా? మీరు అయితే అనుభవీలు. ఆదిలో అనుభవం ఉంది కదా! అన్నీ ఉండేవి, తినగలిగినంత స్వదేశి నెయ్యి తినేవారు కానీ బేహద్ వైరాగ్యవృత్తి ఉండేది. ప్రపంచంలోని వారు అయితే నెయ్యి తింటారు కానీ మీరు త్రాగేవారు. నేతి నదులు చూశారు. డైమండ్ జూబ్లీ వారు విశేషంగా ఒక పని చేయాలి. పరస్పరం కలిసి ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. ఎలాగైతే సేవ కోసం సమావేశం అవుతారో అలాగే దీనికి కూడా సమావేశం పెట్టుకోండి. ఒక్క సెకనులో అశరీరిగా అయిపోవాలి అని బాప్ దాదా అనుకుంటున్నారు కానీ దానికి పునాది బేహద్ వైరాగ్య వృత్తి. ఇది లేకుండా ఎంత ప్రయత్నించినా కానీ ఒక్క సెకనులో అవ్వలేరు. యుద్ధంలోనే గడిచిపోతుంది. వైరాగ్యం అనేది భూమి, దానిలో ఏ బీజం చేసినా వెంటనే ఫలం వచ్చేస్తుంది. అయితే ఏమి చేయాలి? అందరికీ అనిపిస్తుంది. మేము కూడా వైరాగ్య వృత్తిలోకి వెళ్ళిపోవాలి అని. మంచిది. అర్ధమైందా ఏమి చేయాలి? సహజమా లేక కష్టమా? కొంచెం కొంచెం ఆకర్షణ ఉంటుందా, ఉండదా? సాధనాలు ఆకర్షితం చేయవా? 

ఇప్పుడు ఈ అభ్యాసం కావాలి - ఎప్పుడు కావాలంటే, ఎక్కడ కావాలంటే, ఎలా కావాలంటే అలా స్థితిని సెకనులో స్థిరం చేసుకోవాలి. సేవ చేయాలంటే చేయాలి. సేవకి అతీతం అయిపోవాలంటే అతీతం అయిపోవాలి. సేవ మమ్మల్ని ఆకర్షిస్తుంది అని అనకూడదు. సేవ లేకుండా ఉండలేము అనకూడదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా అయ్యే విల్ పవర్ ఉండాలి.విల్ పవర్ ఉందా? స్టాప్ అనగానే స్టాప్ అయిపోవాలి. మీరు స్టాప్ అంటే ప్రశ్నార్ధకం పెట్టటం కాదు. స్టాప్ అంటే స్టాప్ కూడా కాదు, ఫుల్ స్టాప్ పెట్టాలి. అప్పుడు ఏది కావాలంటే అది ప్రత్యక్షంలో చేయగలరు. చేయాలనుకుంటున్నాము కానీ కష్టం అని అంటే దానిని ఏమంటారు? విల్ పవర్ అంటారా? లేక పవర్ అంటారా? వ్యర్ధం సమాప్తి అయిపోవాలి అని సంకల్పం చేయగానే వెంటనే సమాప్తి అయిపోవాలి.  

బాప్ దాదా చెప్పారు కదా - కొంతమంది పిల్లలు అంటున్నారు. మేము యోగంలో కూర్చుంటున్నాం కానీ యోగానికి బదులు యుద్ధం జరుగుతుంది. యోగి అవ్వటం లేదు. యుద్ధవీరులుగా అవుతున్నారు. యుద్ధం చేసే సంస్కారం ఎక్కువ కాలం ఉంటే ఏమి అవుతారు? సూర్యవంశీయులా లేక చంద్రవంశీయులా? ఆలోచించగానే అయిపోవాలి. ఆలోచించడం మరియు అవ్వటం ఒక్క సెకను పని. దానినే విల్ పవర్ (ఆత్మ యొక్క శక్తి) అంటారు. విల్ పవర్ ఉందా? లేదా చాలా మంచిగా సేవా పద్దతులు తయారుచేస్తున్నారు. 10 పద్దతులు తయారుచేస్తే 5 ప్రత్యక్షంలోకి వచ్చే విధంగా లేరు కదా? చాలా మంచిగా ఆలోచిస్తారు. ఇది చేస్తాం, ఇది అవుతుంది, అది అవుతుంది అంటారు. కానీ ప్రత్యక్షంలోకి తీసుకురావటంలో తేడా వచ్చేస్తుంది. సంకల్పం చేయగానే కర్మలోకి వచ్చేయవలసిందే అటువంటి విల్ పవర్ ఇప్పుడు ఉండాలి. ఇటువంటి అనుభవం ఉండాలి. అమృతవేళ బాబాతో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. ఇది చేస్తాం, అది చేస్తాం ..... అని కానీ రాత్రికి ఏమి ఫలితం ఉంటుంది? బాబాని సంతోష పెడుతున్నారు, మధురాతి మధురంగా, మంచి మంచి విషయాలు చెప్తున్నారు. "ఓహో నా పిల్లలు” అని బాబా కూడా సంతోషిస్తున్నారు. బాబా మీరు ఏది చెప్పారో అది జరగవలసిందే అంటున్నారు. అలా అవ్వవలసే ఉంది అంటారు. చాలా మంచిమంచి విషయాలు మాట్లాడతారు. కొందరు అయితే బాబాకి ధైర్యం ఇస్తున్నారు. బాబా మేము తయారవ్వకపోతే ఇంకెవరు తయారవుతారు? కల్పకల్పం మేము అయ్యాం ఇలా సంతోషపడిపోతున్నారు. మంచిది. 

నలువైపులా ఉన్న సింహాసనాధికారి శ్రేష్ట భాగ్యవాన్ ఆత్మలకు, సదా బేహద్ వైరాగ్య వృత్తితో వాయుమండలాన్ని తయారు చేసే విశేషాత్మలకు, సదా తమ శ్రేష్ట విశేషతలను కార్యంలో ఉపయోగించే విశేషాత్మలకు, సదా ఒకే బాబా యొక్క తోడు మరియు శ్రీమతం అనే చేతిని పట్టుకున్నట్లు అనుభవం చేసుకునే సమీపాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments