18-02-2008 అవ్యక్త మురళి

   18-02-2008         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విశ్వ పరివర్తన కొరకు శాంతిశక్తిని ప్రయోగించండి. 

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న విశ్వపరివర్తకులు, తన యొక్క ఆశాదీపాలైన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలకు బాప్  దాదాపై చాలా చాలా చాలా ప్రేమ ఉంది అని బాప్ దాదాకి తెలుసు మరియు బాప్ దాదాకి కూడా ప్రతి బిడ్డపై కోటిరెట్లు కంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఈ ప్రేమ సదా ఈ సంగమయుగంలో లభించవలసిందే. సమయం ఎలాగైతే సమీపంగా వస్తూ ఉందో దాని అనుసారంగా ఇక ఇప్పుడు ఏదోకటి చేయాల్సిందే అనే సంకల్పం, ఉత్సాహ, ఉల్లాసాలు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాయి. ఎందుకంటే 1. ఈనాడు మూడు శక్తులు అలజడిలో ఉన్నాయి. ధర్మశక్తి అయినా కానీ, రాజ్యశక్తి అయినా కానీ, విజ్ఞాన శక్తి అయినా కానీ ఆ విజ్ఞానం కూడా  ఇప్పుడు ప్రకృతిని యదార్ధ రూపంలో నడిపించలేకపోతుంది. ఇదంతా జరగవలసి ఉంది అని అంటున్నారు. ఎందుకంటే విజ్ఞానశక్తి ప్రకృతి ద్వారా పని చేస్తుంది. కనుక విజ్ఞాన సాధనాలు ఉన్నా కానీ, ప్రయత్నిస్తున్నా కానీ ఇప్పుడు ప్రకృతి అదుపులో ఉండటం లేదు. ప్రకృతి ఆడే ఈ ఆటలన్నీ ఇక ముందు ఇంకా పెరిగిపోతాయి. ఎందుకంటే ప్రకృతికి కూడా ఆదిలో ఉన్నంత శక్తి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆలోచించండి! తొలగించేవారు ఎవరు? తెలుసు కదా! పరమాత్మ పాలనకు అధికారి అయిన ఆత్మలు తప్ప మరెవ్వరు చేయలేరు. బ్రాహ్మణాత్మలైన మేమందరం బాబాతో పాటు పరివర్తనా కార్యంలో బాబాకి సహయోగులం అనే ఉత్సాహ, ఉల్లాసాలు మీ అందరికీ ఉన్నాయి కదా! 

బాప్ దాదా ఇద్దరూ అమృతవేళ కలిసి వెళ్తూ చూసినది ఏమిటంటే ప్రపంచంలో మూడు శక్తులు ఎంత అలజడిగా ఉన్నాయో అంతగా శాంతిదేవ, శాంతిదేవీలైన మీలో శాంతిశక్తి యొక్క ప్రయోగం శక్తిశాలిగా లేదు. బాప్ దాదా ఇప్పుడు పిల్లలందరికీ ఉల్లాసాన్ని ఇప్పిస్తున్నారు - సేవా క్షేత్రంలో ధ్వనిని బాగా వ్యాపిస్తున్నారు, అలజడి సృష్టిస్తున్నారు కానీ శాంతి శక్తి (మాటిమాటికి దగ్గు వస్తుంది) బాజా (రథం) సరిగ్గా పనిచేయటం లేదు. అయినా కానీ బాప్ దాదా పిల్లలను కలుసుకోకుండా ఉండలేరు మరియు పిల్లలు కూడా ఉండలేరు. అయితే బాప్ దాదా ఇచ్చే విశేష సైగ ఏమిటంటే ఇప్పుడు శాంతిశక్తి యొక్క తరంగాలను నలువైపుల వ్యాపింపజేయండి. విశేషంగా బ్రహ్మాబాబా మరియు జగదంబను చూశారు కదా - వారు స్వయం ఆదిదేవ్ గా శాంతిశక్తి యొక్క ఎంత గుప్త పురుషార్ధం చేశారో! మీ దాదీ (ప్రకాశమణి) కర్మాతీతంగా అయ్యేటందుకు ఈ విషయాన్ని ఎంత పక్కాగా చేసుకున్నారు! బాధ్యతను సంభాళిస్తూ, సేవకి ప్లాన్స్ తయారు చేస్తూ (బాగా దగ్గు వస్తుంది) బాజా అస్సలు బాగోకపోయినా కానీ బాప్ దాదాకి పిల్లలంటే ప్రేమ. సేవాభాద్యత ఎంత పెద్దది అయినా కానీ శాంతి శక్తి లేకుండా సేవా సఫలత యొక్క ప్రత్యక్ష ఫలం ఎంతగా కావాలనుకుంటే అంతగా రాదు. ఎందుకంటే మీ కొరకు కూడా కల్పమంతటి ప్రాలబ్దాన్ని ఇప్పుడే తయారుచేసుకోగలరు. ప్రతి ఒక్కరు స్వయానికి కల్పమంతటి ప్రాలబ్దాన్ని అనగా రాజ్యపదవి మరియు పూజ్య పదవి పొందేటందుకు సమయం ఇదే. ఎందుకంటే ప్రమాదకర సమయం రానున్నది. ఇటువంటి సమయంలో శాంతిశక్తి ద్వారా ప్రేరణా శక్తి (టచ్చింగ్ పవర్) మరియు గ్రహణ శక్తి (క్యాచింగ్ పవర్) చాలా అవసరం. ఈ సాధనాలు ఏమీ చేయలేవు అటువంటి సమయం రానున్నది, కేవలం ఆధ్యాత్మిక శక్తి, బాప్ దాదా ఆజ్ఞ యొక్క ప్రేరణ కార్యం చేయించగలదు అంతే. కనుక స్వయంలో పరిశీలించుకోండి - అటువంటి సమయంలో నా మనస్సు మరియు బుద్దిలో బాప్ దాదా యొక్క ప్రేరణ రాగలదా? దీని కొరకు చాలాకాలం యొక్క అభ్యాసం కావాలి. దీనికి సాధనం - మనస్సు మరియు బుద్ధి సదా స్వచ్చంగా మరియు స్పష్టంగా ఉండాలి, సదా ఉండాలి, అప్పుడప్పుడు కాదు. ఇప్పుడు అసలు ఆటకి ముందు జరిగే ఆటలు ఇవన్నీ (రిహార్సల్స్), కానీ సెకండులో ఇవే నిజం (రియల్) అయిపోతాయి. మనస్సులో కానీ, బుద్దిలో కానీ ఏ ఆత్మ గురించి అయినా, ఏ కార్యం గురించి అయినా, మీతో పాటు ఉన్నవారి గురించి లేదా సహయోగి గురించి అయినా కానీ కొంచెం అయినా అశుభం ఉంటే దానిని స్వచ్ఛత మరియు శుభ్రత అని అనరు. అందువలన బాప్ దాదా దీని గురించి ధ్యాస ఇప్పిస్తున్నారు. రోజంతటిలో పరిశీలించుకోండి - శాంతిశక్తిని ఎంత జమ చేసుకున్నాను? సేవ చేస్తూ కూడా మాటలో శాంతిశక్తి లేకపోతే ఎంతగా సఫలత యొక్క ప్రత్యక్షఫలాన్ని కోరుకున్నారో అంతగా రాదు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. సేవ చేయండి కానీ శాంతిశక్తి సంపన్న సేవ చేయండి. దీని ద్వారా మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. మాటిమాటికి పరిశీలించుకోండి. రోజురోజుకీ ఎవరు ఎక్కడ సేవ చేస్తున్నా కానీ మంచిగా చేస్తున్నారు కానీ స్వయంలో శాంతిశక్తిని జమ చేసుకునే మరియు పరివర్తన చేసుకునే విషయంపై మరింత ధ్యాస పెట్టండి. విశ్వపరివర్తకులుగా ఆఖరుకి ఎవరు నిమిత్తమవుతారు? అని ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఎందుకంటే రోజురోజుకీ దు:ఖం మరియు అశాంతి పెరిగిపోతున్నాయి మరియు పెరగవలసిందే. భక్తులు తమ ఇష్టదేవతను జ్ఞాపకం చేస్తున్నారు, కొందరు అతిలోకి వెళ్ళిపోయి అలజడితో బ్రతుకుతున్నారు. ధర్మ గురువుల వైపు దృష్టి వెళ్తుంది. మరియు వైజ్ఞానికులు కూడా ఎలా చేయాలి? ఇలా ఎంతవరకు జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు. వీరందరికీ జవాబుని ఇచ్చేవారు ఎవరు? అందరి హృదయాలలో పిలుపు ఏమిటంటే స్వర్ణిమ ఉదయం ఆఖరుకి ఎప్పుడు రానున్నది? మీరందరు తీసుకువచ్చేవారే కదా? అవునా! మేము నిమిత్తం అని భావించేవారు చేతులెత్తండి! మీరందరు నిమిత్తులా ! మంచిది! ఇంతమంది నిమిత్తులు అయితే ఎంత సమయంలో జరిగిపోవాలి? మీరందరు కూడా సంతోషిస్తున్నారు మరియు బాబా కూడా సంతోషిస్తున్నారు. 
అందరికీ ఈ స్వర్ణిమ అవకాశం స్వర్ణిమంగా ప్రాప్తిస్తుంది. 

సేవ కొరకు లేదా సమస్యలను పరిష్కరించుకునేటందుకు పరస్పరం మీటింగ్లు ఎలా అయితే పెట్టుకుంటున్నారో అదేవిధంగా దీని గురించి కూడా మీటింగ్ పెట్టుకోండి, ప్లాన్ తయారు చేయండి. స్మృతి మరియు సేవ. స్మృతి అంటే శాంతి శక్తి; అది ఎప్పుడు మీకు ప్రాప్తిస్తుంది అంటే మీరు ఉన్నత (టాప్) స్థితిలో ఉన్నప్పుడు. ఏదైనా ఉన్నత స్థానంలో నిల్చుంటే అన్నీ ఎంత స్పష్టంగా కనిపిస్తాయి! అదేవిధంగా మీ స్థితి కూడా ఉన్నతంగా ఉండాలి. అన్నింటికంటే ఉన్నతమైన స్థానం ఏది? పరంధామం, అందువలన బాప్ దాదా చెప్తున్నారు - సేవ చేశారు, తిరిగి మరలా ఉన్నత స్థితిలో బాబాతో పాటు కూర్చోండి. అలసిపోయినప్పుడు 5 నిమిషాలు ఎక్కడైనా శాంతిగా కూర్చుంటే తేడా కనిపిస్తుంది కదా! అదేవిధంగా మధ్యమధ్యలో వచ్చేసి బాబాతో పాటు కూర్చోండి. రెండవ ఉన్నత స్థానం ఏమిటంటే సృష్టిచక్రాన్ని చూడండి; సృష్టిచక్రంలో అన్నింటికంటే ఉన్నత స్థానం ఏది? సంగమయుగంలో ముల్లు పైకి ఉన్నట్లు చూపిస్తారు కదా! క్రిందకి వచ్చారు, సేవ చేశారు. తిరిగి ఉన్నత స్థానానికి వెళ్ళిపోండి. ఏమి చేయాలో, అర్థమైందా! సమయం మిమ్మల్ని పిలుస్తుందా లేదా మీరు సమయాన్ని సమీపంగా తీసుకువస్తున్నారా? రచయిత ఎవరు? కనుక పరస్పరం ఇటువంటి ప్లాన్ తయారు చేయండి. మంచిది. 

బాబా! నీవు రావలసిందే అని పిల్లలు అన్నారు, అలాగే! అని బాబా అన్నారు. అదేవిధంగా ఒకరికొకరు విషయాలను, స్వభావాన్ని, వృత్తిని అర్ధం చేసుకుంటూ, అలాగే, సరే అనటం ద్వారా సంఘటనా శక్తి మరియు శాంతి జ్వాల ప్రజ్వరిల్లుతుంది. జ్వాలాముఖిని చూశారు కదా! ఈ సంఘటనాశక్తి శాంతి జ్వాలను ప్రజ్వలింపచేస్తుంది. మంచిది. 

నలువైపుల ఉన్న బాప్ దాదా యొక్క హృదయసింహాసనాధికారి మరియు విశ్వ రాజ్య సింహాసనాధికారులకి, సదా స్వయం యొక్క శాంతిశక్తిని పెంపొందించుకుంటూ ఇతరులకు కూడా ముందుకి వెళ్ళే ఉత్సాహ, ఉల్లాసాలను ఇచ్చే వారికి, సదా సంతోషంగా ఉండేవారికి మరియు సంతోషాన్ని బహుమతిగా ఇచ్చేవారికి నలువైపుల ఉన్న అదృష్ట మరియు ప్రియమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు మరియు నమస్తే. 

Comments