10-12-1987 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘తనువు, మనసు, ధనము మరియు సంబంధాల శ్రేష్ఠమైన వ్యాపారము’’
ఈ రోజు సర్వ ఖజానాల సాగరుడు, రత్నాకరుడైన తండ్రి తమ పిల్లలను చూసి చిరునవ్వు నవ్వుతున్నారు. సర్వ ఖజానాల రత్నాకరుడైన బాబా యొక్క వ్యాపారి పిల్లలు అనగా వ్యాపారము చేసేవారు ఎవరు మరియు ఎవరితో వ్యాపారము చేస్తున్నారు అనేది చూస్తున్నారు. పరమాత్మ యొక్క వ్యాపారాన్ని ఇతరులకు ఇచ్చేవారు మరియు పరమాత్మతో వ్యాపారము చేసేవారి ముఖాలు ఎంత అమాయకంగా ఉన్నాయి కానీ ఎంత పెద్ద వ్యాపారమును చేసారు! వీరు ఇంత పెద్ద వ్యాపారమును చేసే వ్యాపారి ఆత్మలని ప్రపంచంలోని వారికి అర్థమవ్వదు. ప్రపంచంలోని వారు ఏ ఆత్మలనైతే నిరాశ చెందిన వారని, చాలా పేదవారని భావించి, వీరికి అసంభవమని భావించి, ఈ కన్యలు, మాతలు పరమాత్మ ప్రాప్తికి అధికారులుగా ఎలా అవుతారని పక్కకు పెట్టేసారు. కానీ తండ్రి మొదట మాతలను, కన్యలనే ఇంత పెద్ద వ్యాపారము చేసే శ్రేష్ఠమైన ఆసాములుగా చేసేసారు. జ్ఞాన కలశాన్ని మొదట మాతలు, కన్యలపైనే ఉంచారు. యజ్ఞమాత జగదంబగా పేద కన్యను నిమిత్తం చేసారు. ఎంతైనా మాతల వద్దనైతే ఎంతో కొంత దాచిపెట్టుకున్న ప్రాపర్టీ ఉంటుంది కానీ కన్యలు, మాతల కంటే పేదవారు. కనుక తండ్రి ముందు పేదవారి కంటే పేదవారిని వ్యాపారస్థులుగా చేసి వ్యాపారాన్ని ఎంత పెద్దదిగా చేసారు! పేద కన్య అయిన జగదంబ నుండి ధనదేవి అయిన లక్ష్మిగా చేసారు. ఈ రోజు వరకు కూడా ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే, లక్ష్మి నుండి తప్పకుండా ధనాన్ని వేడుకుంటారు, పూజిస్తారు. రత్నాకరుడైన తండ్రి తమ వ్యాపారి పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఒక్క జన్మ వ్యాపారం చేయడం ద్వారా అనేక జన్మలు సదా సుసంపన్నులుగా, నిండుగా అవుతారు. వ్యాపారానికి నిమిత్తులైన వారు ఎంత పెద్ద వ్యాపారస్థులైనా కానీ, వారు కేవలం ధనంతో, వస్తువులతో వ్యాపారం చేస్తారు. ఒక్క అనంతమైన తండ్రి మాత్రమే ధనము యొక్క, మనసు యొక్క, తనువు యొక్క మరియు సదా శ్రేష్ఠ సంబంధాల యొక్క వ్యాపారం చేస్తారు. ఇటువంటి దాతను ఎవరైనా చూశారా? నాలుగు రకాల వ్యాపారమును చేసారు కదా? తనువు సదా ఆరోగ్యంగా ఉంటుంది, మనసు సదా సంతోషంగా ఉంటుంది, ధన భాండాగారము నిండుగా ఉంటుంది మరియు సంబంధాలలో నిస్వార్థ స్నేహముంటుంది. మరియు వీటికి గ్యారంటీ ఉంటుంది. ఈ రోజుల్లో కూడా ఏదైనా విలువైన వస్తువు ఉంటే, దానికి గ్యారంటీ ఇస్తారు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారు, ఇంకేమి ఇస్తారు? కానీ రత్నాకరుడైన తండ్రి ఎంత సమయానికి గ్యారంటీ ఇస్తున్నారు? అనేక జన్మలకు గ్యారంటీ ఇస్తున్నారు. నాల్గింటిలో ఒక్కటి కూడా తక్కువ కాదు. ప్రజలకు ప్రజలుగా అయినా సరే, వారికి కూడా చివరి జన్మ వరకు అనగా త్రేతా అంతిమము వరకు కూడా ఈ నాలుగు విషయాలు ప్రాప్తిస్తాయి. ఇటువంటి వ్యాపారాన్ని ఎప్పుడైనా చేసారా? ఇప్పుడైతే చేసారు కదా? పక్కా వ్యాపారము చేసారా లేక కచ్చాగా చేసారా? పరమాత్మతో ఎంత సులువైన వ్యాపారము చేసారు! వారికి ఏమిచ్చారు? ఏదైనా పనికొచ్చే వస్తువును ఇచ్చారా?
విదేశీయులు బాప్ దాదా వద్దకు సదా హృదయం ఆకారాన్ని తయారు చేసి పంపిస్తారు. ఉత్తరాలు కూడా హృదయం చిత్రం లోపల వ్రాస్తారు, కానుకగా కూడా హృదయాలను పంపిస్తారు అంటే హృదయాన్ని ఇచ్చారని కదా. కానీ ఏ హృదయాన్ని ఇచ్చారు? ఒక్క హృదయం ఎన్ని ముక్కలుగా అయిపోయి ఉంది? తల్లి, తండ్రి, పినతండ్రి, మామయ్య, ఎంత పొడవాటి లిస్టు ఉంది? సంబంధాల లిస్టు కనుక తీస్తే కలియుగంలో ఎంత పొడవైన లిస్టు అవుతుంది! ఒకటేమో సంబంధాలలో హృదయాన్ని ఇచ్చేసారు, రెండవది - వస్తువులలో కూడా హృదయాన్ని ఇచ్చేసారు..... కనుక హృదయాన్ని లగ్నం చేసిన వస్తువులు ఎన్ని ఉన్నాయి, వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అన్నింటిలోనూ హృదయాన్ని లగ్నము చేసి, హృదయాన్ని ముక్కలు ముక్కలు చేసేసారు. తండ్రి అనేక ముక్కలుగా అయిపోయిన హృదయాన్ని ఒకవైపుకు జోడించారు. కనుక మీరు ఇచ్చినదేమిటి? తీసుకున్నదేమిటి? ఇకపోతే వ్యాపారము చేసే విధానము ఎంత సులువైనది! ఒక సెకండు యొక్క వ్యాపారము కదా. ‘‘బాబా’’ అనే పదమే ‘విధి’. ఒకే పదము యొక్క విధి, దీనికి ఎంత సమయం పడుతుంది? కేవలం హృదయపూర్వకంగా ‘‘బాబా’’ అని అన్నారు, అంతే, ఒక సెకండులో వ్యాపారం జరిగిపోయింది. ఇది ఎంత సహజమైన విధి! ఇంత సులువైన వ్యాపారమును ఈ సంగమయుగంలో తప్ప వేరే ఏ యుగంలోనూ చేయలేరు. కనుక వ్యాపారము చేసేవారి ముఖాలను, మూర్తులను చూస్తున్నారు. ప్రపంచంలోని వారితో పోలిస్తే ఎంత అమాయకంగా ఉన్నారు. కానీ ఈ అమాయకులే అద్భుతాన్ని చేసారు. వ్యాపారం చేయడంలోనైతే తెలివైనవారిగా అయ్యారు కదా. ఈ రోజుల్లో చాలా గొప్ప పేరు, ప్రఖ్యాతులు గల ధనవంతులు, ధనం సంపాదించేందుకు బదులు ధనాన్ని కాపాడుకునే సమస్యలో చిక్కుకున్నారు. ఆ సమస్యలో చిక్కుకుని తండ్రిని గుర్తించేందుకు కూడా వారికి తీరిక లేదు. స్వయాన్ని కాపాడుకోవడంలో, ధనాన్ని కాపాడుకోవడంలోనే సమయం గడిచిపోతుంది. చక్రవర్తులుగా ఉన్నా సరే చింతించే చక్రవర్తులుగా ఉన్నారు, ఎందుకంటే ఎంతైనా నల్ల ధనం కదా, అందుకే వారు చింతించే చక్రవర్తులుగా ఉన్నారు. మరియు మీరు బయటికి చిల్లిగవ్వ కూడా లేనివారు కానీ చింతలేని చక్రవర్తులు, బికారులుగా ఉన్నా సరే చక్రవర్తులు. ప్రారంభంలో మీరు ఏమని సంతకం చేసేవారు? బికారి నుండి రాకుమారుడు అని. ఇప్పుడూ చక్రవర్తులే, భవిష్యత్తులో కూడా చక్రవర్తులే. ఈ రోజుల్లోని నంబరువన్ ధనవంతులైన ఆసాముల కంటే కూడా త్రేతా అంతిమములోని మీ ప్రజలు ఎక్కువ ధనవంతులుగా ఉంటారు. ఈ నాటి జనసంఖ్య లెక్కలో ఆలోచించండి - ధనమైతే ఇదే ఉంటుంది, అంతేకాక భూగర్భంలో పూడ్చుకుపోయిన ధనం కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఎంత ఎక్కువ సంఖ్య ఉందో, దాని బట్టి ధనం పంచబడి ఉంది. అక్కడి జనసంఖ్య ఎంత ఉంటుంది? ఆ లెక్కన చూస్తే ఎంత ధనముంటుంది! ప్రజలకు కూడా అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. కావున చక్రవర్తులైనట్లు కదా. చక్రవర్తి అంటే సింహాసనంపై కూర్చున్నవారని కాదు. చక్రవర్తి అనగా నిండుగా ఉండేవారు, ఎటువంటి అప్రాప్తి ఉండదు, ఎటువంటి లోటు ఉండదు. మరి ఇటువంటి వ్యాపారమును చేసేసారా లేదా చేస్తూ ఉన్నారా? లేదా ఇంకా ఆలోచిస్తున్నారా? ఎప్పుడైనా ఏదైనా గొప్ప వస్తువు చవకగా మరియు సులువుగా లభిస్తే, ఇది సరియైనదా కాదా, మంచిదా కాదా అని తికమకపడతారు. ఇటువంటి తికమకలో అయితే లేరు కదా? ఎందుకంటే భక్తి మార్గం వారు సులువైనదాన్ని ఎంతో కష్టం చేసి, చక్రంలో వేసేసారు, అందుకే ఈ రోజుకు కూడా తండ్రిని ఆ రూపంలోనే వెతుకుతూ ఉన్నారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసేసారు. అందుకే తికమకపడతారు. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడిని కలుసుకునే విధులను కూడా చాలా క్లిష్టమైనవిగా, చాలా పెద్దవిగా చూపించారు. ఆ చక్రంలో చిక్కుకుని భక్త ఆత్మలు ఆలోచనలో పడ్డారు. భగవంతుడు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చేసారు కానీ భక్త ఆత్మలు తికమకలో ఉన్న కారణంగా ఆకు-ఆకుకు నీటిని అందించడంలో బిజీగా ఉన్నారు. మీరు ఎంతగా సందేశమిస్తున్నా వారు ఏమంటారు? ఇంత ఉన్నతమైన భగవంతుడు ఇంత సహజంగా వచ్చారా - ఇది జరగనే జరగదు అని అంటారు. అందుకే తండ్రి చిరునవ్వు నవ్వుతున్నారు, ఎందుకంటే ఈనాటి పేరు ప్రఖ్యాతులు గల భక్తులైనా, పేరు ప్రఖ్యాతులు గల ధనవంతులైనా, ఏదైనా వృత్తిలో పేరు ప్రఖ్యాతులు గలవారైనా, వారందరూ తమ కార్యములోనే బిజీగా ఉన్నారు. కానీ సాధారణ ఆత్మలైన మీరు తండ్రితో వ్యాపారము చేసారు. పాండవులు పక్కా వ్యాపారము చేసారు కదా? డబల్ విదేశీయులు వ్యాపారం చేయడంలో తెలివైనవారు. వ్యాపారమైతే అందరూ చేసారు కానీ అన్ని విషయాలలోనూ నంబరువారుగా ఉంటారు. తండ్రి అయితే సర్వ ఖజానాలను అందరికీ ఒకేలా ఇచ్చారు, ఎందుకంటే వారు తరగని ఖజానాల సాగరుడు. ఇచ్చే విషయంలో తండ్రికి, నంబరువారుగా ఇవ్వవలసిన అవసరమే లేదు.
వినాశన సామాగ్రి ఎంత తయారై ఉందంటే, దానితో ఇటువంటి అనేక ప్రపంచాలు వినాశనం అవ్వగలవని నేటి వినాశకారి ఆత్మలు చెప్తున్నారు. అలాగే, విశ్వంలోని ఆత్మలందరూ మీలా తెలివైనవారిగా అయి వ్యాపారం చేసినా సరే తరగనంతటి ఖజానా నా వద్ద ఉందని తండ్రి కూడా చెప్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ సంఖ్య ఎంతైతే ఉందో, అంతకు పదమాలరెట్ల మంది వచ్చినా సరే తీసుకోవచ్చు. నా వద్ద అంతటి తరగని ఖజానా ఉంది. కానీ తీసుకునేవారిలో నంబరు ఏర్పడుతుంది. విశాల హృదయంతో వ్యాపారం చేసే ధైర్యం కలవారు వెలువడటం లేదు, అందుకే రెండు రకాల మాలలు పూజించబడతాయి. అష్ట రత్నాలెక్కడ, 16 వేలలో చివరి రత్నమెక్కడ! ఎంత తేడా ఉంటుంది! వ్యాపారం చేయడంలోనైతే అందరూ ఒకేలా ఉన్నారు. చివరి నంబరు వారు కూడా ‘‘బాబా’’ అని అంటారు, మొదటి నంబరు వారు కూడా ‘‘బాబా’’ అని అంటారు. పదంలో తేడా లేదు. వ్యాపారం చేసే విధి ఒక్కటే మరియు ఇచ్చే దాత కూడా ఒకేలా ఇస్తారు. జ్ఞాన ఖజానా మరియు శక్తుల ఖజానా, ఇంకా సంగమయుగ ఖజానాలేవైతే మీకు తెలుసో, అవన్నీ అందరి వద్ద ఒకేలా ఉన్నాయి. కొంతమందికి సర్వశక్తులను ఇచ్చారు, కొంతమందికి ఒక్క శక్తిని ఇచ్చారు, కొంతమందికి ఒక్క గుణమును ఇచ్చారు, కొంతమందికి సర్వ గుణాలను ఇచ్చారు అన్నటువంటి తేడా ఏమీ లేదు. అందరి టైటిల్ ఒక్కటే, అదేమిటంటే, ఆది, మధ్య, అంత్యముల జ్ఞానము తెలిసిన త్రికాలదర్శులు, మాస్టర్ సర్వశక్తివంతులు. అంతేకానీ కొంతమంది సర్వశక్తివంతులు, కొంతమంది కేవలం శక్తివంతులు అన్నట్లు కాదు. అందరినీ సర్వ గుణ సంపన్నులుగా అయ్యే దేవాత్మలని, గుణమూర్తులని అంటారు. ఖజానాలు అందరి వద్ద ఉన్నాయి. ఒక మాసం నుండి చదువుకునేవారు కూడా జ్ఞాన ఖజానాను 50 సంవత్సరాల వారు వర్ణన చేసినట్లే చేస్తారు. ఒక్కొక్క గుణము గురించి, శక్తుల గురించి మాట్లాడమంటే చాలా బాగా భాషణ ఇస్తారు. బుద్ధిలో ఉన్నప్పుడే కదా మట్లాడగలరు. కనుక ఖజానా అందరి వద్ద ఉంది. మరి తేడా ఎందుకు వచ్చింది? నంబరువన్ వ్యాపారులు ఖజానాలను స్వయం పట్ల మననం చేసి కార్యంలో ఉపయోగిస్తారు. అదే అనుభవం యొక్క అథారిటీతో అనుభవీలుగా అయి ఇతరులకు పంచుతారు. కార్యంలో ఉపయోగించడం అనగా ఖజానాలను పెంచుకోవడం. ఒక రకం - కేవలం వర్ణన చేసేవారు, రెండవ రకం - మననం చేసేవారు. మననం చేసేవారు ఎవరికి ఇచ్చినా సరే, వారు స్వయం అనుభవీలు అయిన కారణంగా ఇతరులను కూడా అనుభవీలుగా చేయగలరు. వర్ణన చేసేవారు ఇతరులను కూడా వర్ణన చేసేవారిగా తయారుచేస్తారు. అటువంటి వారు మహిమ చేస్తూ ఉంటారు కానీ అనుభవీలుగా అవ్వరు. స్వయం మహాన్ గా అవ్వరు, కేవలం మహిమ చేసేవారిగా అవుతారు.
కనుక నంబరువన్ అనగా మనన శక్తి ద్వారా ఖజానాల అనుభవీలుగా అయి ఇతరులను అనుభవీలుగా చేసేవారు అనగా ఇతరులను కూడా ధనవంతులుగా చేసేవారు, అందుకే వారి ఖజానా సదా వృద్ధి చెందుతూ ఉంటుంది, అంతేకాక సమయమనుసారంగా స్వయం పట్ల, ఇతరుల పట్ల కార్యంలో ఉపయోగించడం ద్వారా సదా సఫలతా స్వరూపులుగా ఉంటారు. కేవలం వర్ణన చేసేవారు ఇతరులను కూడా ధనవంతులుగా చేయలేరు, అలానే స్వయం పట్ల కూడా సమయమనుసారంగా ఏ శక్తిని, ఏ గుణాన్ని, ఏ జ్ఞాన విషయాలను ఉపయోగించాలో, వాటిని ఉపయోగించలేరు. అందుకే ఖజానాలతో నిండుగా ఉన్న స్వరూపం యొక్క సుఖాన్ని అనుభవం చేయలేరు మరియు దాతలుగా అయి ఇచ్చే అనుభవాన్ని చేయలేరు. ధనమున్నా ఆ ధనంతో సుఖాన్ని తీసుకోలేరు. శక్తి ఉన్నా సమయానికి శక్తి ద్వారా సఫలతను పొందలేరు. గుణాలున్నా సమయమనుసారంగా ఆ గుణాలను ఉపయోగించలేరు, కేవలం వాటి వర్ణన చేయగలరు. ధనం అందరి వద్ద ఉంది కానీ ఆ ధనాన్ని సమయానికి ఉపయోగించినప్పుడే, దాని సుఖం అనుభవమవుతుంది. ఉదాహరణకు ఈ రోజుల్లో కూడా కొంతమంది ధనవంతుల వద్ద వినాశీ ధనము బ్యాంకులలో ఉంటుంది, బీరువాలలో ఉంటుంది లేదా తలగడ కింద ఉంటుంది. ఆ ధనాన్ని వాళ్ళు వాడరు, ఇతరులను కూడా వాడనివ్వరు. స్వయమూ లాభపడరు, ఇతరులనూ లాభపడనివ్వరు. కనుక ధనమున్నా సుఖం తీసుకోలేదు కదా. అది తలగడ కిందే ఉండిపోతుంది, వాళ్ళు మాత్రం వెళ్ళిపోతారు. కనుక వర్ణన చేయడం అనగా ఉపయోగించకుండా ఉండడం, అటువంటి వారు సదా పేదవారిగా కనిపిస్తారు. అలాగే ఈ ధనాన్ని కూడా ఒకవేళ స్వయం పట్ల గానీ, ఇతరుల పట్ల గానీ, సమయమనుసారంగా ఉపయోగించకపోతే, దానిని కేవలం బుద్ధిలో ఉంచుకుంటే, స్వయమూ అవినాశీ ధనం యొక్క నషాలో, సంతోషంలో ఉండరు, ఇతరులకు కూడా ఇవ్వలేరు. సదా ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి... అని అలాగే నడుస్తూ ఉంటారు. అందుకే రెండు మాలలు తయారవుతాయి. ఒకరు మననం చేసేవారు, మరొకరు కేవలం వర్ణన చేసేవారు. మరి మీరు ఎలాంటి వ్యాపారులు? మొదటి నంబరు వారా లేక రెండవ నంబరు వారా? ఈ ఖజానాకు షరతు ఏమిటంటే - ఇతరులకు ఎంతగా ఇస్తారో, కార్యంలో ఎంతగా ఉపయోగిస్తారో, అంతగా వృద్ధి చెందుతుంది. ఇది వృద్ధి చెందేటువంటి విధి. ఈ విధిని ఉపయోగించని కారణంగా స్వయం కూడా వృద్ధి చెందరు, ఇతరుల సేవ చేయడంలో కూడా వృద్ధి జరగదు. సంఖ్యలో వృద్ధి గురించి చెప్పడం లేదు, సంపన్నంగా తయారుచేయడంలో వృద్ధి. చాలామంది విద్యార్థులు సంఖ్య పరంగా లెక్కించబడతారు కానీ ఇప్పటికీ కూడా యోగమంటే ఏమిటో, తండ్రిని ఎలా స్మృతి చేయాలో అర్థమవ్వడం లేదు అని అంటారు. వారికి ఇప్పుడు ఆ శక్తి లేదు. కావున విద్యార్థుల లైనులోకి అయితే వచ్చేశారు, రిజిస్టరులో పేరుంది కానీ ధనవంతులుగా అయితే అవ్వలేదు కదా. యాచిస్తూనే ఉంటారు. ఒక్కోసారి టీచరు వద్దకు వెళ్ళి నాకు సహాయం చేయండి అని అడుగుతారు, ఒక్కోసారి తండ్రితో సహాయం చేయమని ఆత్మిక సంభాషణ చేస్తారు. అంటే నిండుగా అవ్వనట్లు కదా. ఎవరైతే మనన శక్తి ద్వారా స్వయం యొక్క ధనాన్ని పెంచుకుంటారో, వారు ఇతరులను కూడా ధనం విషయంలో ముందుకు తీసుకువెళ్ళగలరు. మనన శక్తి అనగా ధనాన్ని పెంచుకోవడం అనగా ధనవంతుల సంతోషాన్ని, ధనవంతుల సుఖాన్ని అనుభవం చేయడం. అర్థమయిందా? మనన శక్తికి చాలా మహత్వముంది. ఇంతకుముందు కూడా కొద్దిగా వినిపించాము. మనన శక్తి మహత్వము గురించి మరికొంత తర్వాత వినిపిస్తాము, చెక్ చేసుకునే పనిని ఇస్తూ ఉంటాను. రిజల్టు వెలువడినప్పుడు, ఇది మాకు తెలియదు, బాప్ దాదా ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదని మీరు అనకూడదు, అందుకే ప్రతిరోజు వినిపిస్తూ ఉంటారు. చెక్ చేసుకోవడం అంటే ఛేంజ్ (పరివర్తన) చేసుకోవడం. అచ్ఛా.
సర్వశ్రేష్ఠమైన వ్యాపారి ఆత్మలకు, సదా సర్వ ఖజానాలను సమయమనుసారంగా కార్యంలో ఉపయోగించే మహాన్ విశాల బుద్ధి గల పిల్లలకు, సదా స్వయాన్ని మరియు సర్వులను సంపన్నంగా అనుభవం చేస్తూ అనుభవీలుగా తయారుచేసే అనుభవం యొక్క అథారిటీ అయిన పిల్లలకు, ఆల్మైటీ అథారిటీ అయిన బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఈస్టర్న్ జోన్ నుండి వచ్చిన సోదరీ-సోదరులతో అవ్యక్త బాప్ దాదా మిలనం
సూర్యుడు ఈస్ట్ (తూర్పు) నుండి ఉదయిస్తాడు కదా. కనుక ఈస్టర్న్ జోన్ అనగా సదా జ్ఞాన సూర్యుడు ఉదయించే ఉన్నాడు. ఈస్టర్న్ వారు అనగా సదా జ్ఞాన సూర్యుని ప్రకాశం ద్వారా ప్రతి ఆత్మను ప్రకాశంలోకి తీసుకువచ్చేవారు, అంధకారాన్ని సమాప్తం చేసేవారు. సూర్యుని పని అంధకారాన్ని సమాప్తం చేయడము. కనుక మీరందరూ మాస్టర్ జ్ఞాన సూర్యులు అనగా నలువైపులా ఉన్న అజ్ఞానాన్ని సమాప్తం చేసేవారు కదా. అందరూ ఇదే సేవలో బిజీగా ఉంటున్నారా లేదా స్వయం మరియు ప్రవృత్తి యొక్క పరిస్థితుల జంజాటంలో చిక్కుకొని ఉంటారా? ప్రకాశం ఇచ్చే కార్యంలో బిజీగా ఉండడమే సూర్యుని పని. ప్రవృత్తిలోనైనా, వ్యవహారంలోనైనా, ఎలాంటి పరిస్థితి ఎదురొచ్చినా సరే, సూర్యుడు ప్రకాశాన్నిచ్చే కార్యం చేయకుండా ఉండలేడు. మరి ఇటువంటి మాస్టర్ జ్ఞాన సూర్యులా లేదా అప్పుడప్పుడు చిక్కుల్లో చిక్కుకుంటారా? మొదటి కర్తవ్యము - జ్ఞాన ప్రకాశాన్ని ఇవ్వడము. పరమార్థం ద్వారా వ్యవహారం మరియు పరివారం, ఈ రెండింటినీ శ్రేష్ఠంగా తయారుచేసుకోవాలి అన్నది స్మృతిలో ఉన్నప్పుడు ఈ సేవ స్వతహాగా జరుగుతుంది. ఎక్కడైతే పరమార్థం ఉంటుందో, అక్కడ వ్యవహారం సిద్ధిస్తుంది మరియు సహజమవుతుంది. అంతేకాక, పరమార్థ భావనతో పరివారంలో కూడా సత్యమైన ప్రేమ, ఐక్యత స్వతహాగా వస్తాయి, కనుక పరివారం కూడా శ్రేష్ఠంగా ఉంటుంది, వ్యవహారం కూడా శ్రేష్ఠంగా ఉంటుంది. పరమార్థము, వ్యవహారం నుండి పక్కకు తప్పించదు సరికదా ఇంకా పరమార్థ కార్యంలో బిజీగా ఉన్నందున పరివారము మరియు వ్యవహారంలో సహయోగం లభిస్తుంది. కనుక పరమార్థంలో సదా ముందుకు వెళ్తూ ఉండండి. నేపాల్ వారి గుర్తులో కూడా సూర్యుడిని చూపిస్తారు కదా. రాజులలో కూడా సూర్యవంశ రాజులు ప్రసిద్ధమైనవారిగా, శ్రేష్ఠమైనవారిగా భావించబడతారు. అలా మీరు కూడా అందరికీ ప్రకాశాన్ని ఇచ్చే జ్ఞాన సూర్యులు. అచ్ఛా.
Comments
Post a Comment