27-11-1987 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘అనంతమైన వైరాగులే సత్యమైన రాజఋషులు’’
ఈ రోజు బాప్ దాదా సర్వ రాజఋషుల దర్బారును చూస్తున్నారు. పూర్తి కల్పములో రాజుల దర్బారు అనేకసార్లు నిర్వహించబడుతుంది కానీ ఈ రాజఋషుల దర్బారు ఈ సంగమయుగంలోనే ఉంటుంది. మీరు రాజులు కూడా, ఋషులు కూడా. ఈ విశేషత, ఈ సమయంలోని ఈ దర్బారుకే ఉన్నట్లుగా గాయనం చేయబడింది. ఒక వైపు రాజ్యము అనగా సర్వ ప్రాప్తులకు అధికారులు, రెండవ వైపు ఋషులు అనగా అనంతమైన వైరాగ్య వృత్తి కలవారు. ఒక వైపు సర్వ ప్రాప్తుల అధికారం యొక్క నషా మరియు రెండవ వైపు అనంతమైన వైరాగ్యం యొక్క అలౌకిక నషా. ఎంత శ్రేష్ఠమైన భాగ్యమో, అంత శ్రేష్ఠమైన త్యాగము. రెండింటి బ్యాలెన్స్ ఉన్నవారినే రాజఋషులని అంటారు. ఇలాంటి రాజఋషి పిల్లల బ్యాలెన్స్ ను చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే అధికారితనపు నషా, ఇప్పుడిప్పుడే వైరాగ్య వృత్తి యొక్క నషా - ఈ అభ్యాసంలో ఎంతవరకు స్థితులవ్వగలరు అనగా రెండు స్థితుల సమానమైన అభ్యాసాన్ని ఎంతవరకు చేస్తున్నారు అన్నది చెక్ చేస్తూ ఉన్నారు. పిల్లలందరూ నంబరువారు అభ్యాసం చేసేవారిగా ఉన్నారు కానీ సమయ ప్రమాణంగా ఈ రెండు అభ్యాసాలను ఇంకా ఎక్కువగా పెంచుతూ వెళ్ళండి. అనంతమైన వైరాగ్య వృత్తి అంటే అర్థము - వైరాగ్యము, అనగా పక్కకు తప్పుకోవడమని కాదు, కానీ సర్వ ప్రాప్తులు ఉన్నప్పటికీ, హద్దు ఆకర్షణలు మనసు మరియు బుద్ధిని ఆకర్షించకూడదు. అనంతమైన అనగా నేను సంపూర్ణ, సంపన్నమైన ఆత్మను, బాబా సమానంగా సదా సర్వ కర్మేంద్రియాలకు రాజ్య అధికారిని. ఈ సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారాలకు కూడా అధికారి. సంకల్పమాత్రం కూడా ఆధీనత ఉండకూడదు. ఇటువంటి వారిని రాజఋషులని అనగా అనంతమైన వైరాగ్య వృత్తి కలవారని అంటారు. ఈ పాత దేహము మరియు పాత దేహపు ప్రపంచము లేక వ్యక్త భావము, వైభవాల భావము - ఈ ఆకర్షణలన్నింటి నుండి సదా మరియు సహజంగా దూరంగా ఉండేవారు.
ఎలాగైతే సైన్స్ శక్తి భూమి ఆకర్షణ నుండి దూరంగా తీసుకువెళ్తుందో, అలా సైలెన్స్ శక్తి ఈ హద్దు ఆకర్షణలన్నింటి నుండి దూరంగా తీసుకువెళ్తుంది. దీనినే సంపూర్ణ, సంపన్నమైన బాబా సమాన స్థితి అని అంటారు. మరి ఇలాంటి స్థితిని అభ్యాసం చేసేవారిగా అయ్యారా? స్థూల కర్మేంద్రియాల విషయమైతే స్థూలమైనది. కర్మేంద్రియజీతులుగా అవ్వడం సహజమే కానీ సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారాలపై విజయులుగా అవ్వడం - ఇది సూక్ష్మమైన అభ్యాసము. ఏ సమయంలో ఏ సంకల్పాన్ని, ఏ సంస్కారాన్ని ఇమర్జ్ చేసుకోవాలనుకుంటే, అదే సంకల్పాన్ని, అదే సంస్కారాన్ని మీదిగా చేసుకోవాలి - దీనినే సూక్ష్మ శక్తులపై విజయము అనగా రాజఋషి స్థితి అని అంటారు. ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలకు ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యకు, చేతిని కిందికి దించు, పైకి ఎత్తు అని ఆజ్ఞాపిస్తే పైకి వెళ్తుంది కదా, అలా సంకల్పాలు, సంస్కారాలు మరియు నిర్ణయ శక్తి అయిన ‘బుద్ధి’ కూడా ఆజ్ఞపైన నడవాలి. ఆత్మ అనగా రాజు, మనసును అనగా సంకల్ప శక్తిని, ఇప్పుడిప్పుడే ఏకాగ్రమవ్వమని, ఒకే సంకల్పంలో స్థితి అవ్వమని ఆజ్ఞాపించండి, అప్పుడు రాజు ఆజ్ఞను ఆ క్షణంలోనే, ఆ విధంగానే పాటించడం - ఇదే రాజ్య అధికారుల గుర్తు. అలా కాకుండా, 3-4 నిముషాల అభ్యాసం తర్వాత మనసు పాటిస్తే లేదా ఏకాగ్రమయ్యేందుకు బదులుగా ముందు అలజడిలోకి వచ్చి ఆ తర్వాత ఏకాగ్రమైతే దానిని ఏమంటారు? అధికారి అని అంటారా? కావున ఇటువంటి చెకింగ్ చేసుకోండి. ఎందుకంటే అంతిమ సమయంలో, అంతిమ రిజల్టు వెలువడే సమయంలో, ఒక్క సెకండు యొక్క ప్రశ్న ఒకటే ఉంటుందని ముందే వినిపించాము కదా. ఒకవేళ ఈ సూక్ష్మ శక్తులపై అధికారిగా అయ్యే అభ్యాసం లేకపోతే అనగా మీ మనసు రాజు అయిన మీ ఆజ్ఞను ఒక్క క్షణంలో కాకుండా 3 క్షణాలలో పాటిస్తే, రాజ్య అధికారులుగా పిలవబడతారా? ఒక్క సెకండు యొక్క అంతిమ పరీక్షలో పాస్ అవ్వగలరా? ఎన్ని మార్కులు లభిస్తాయి?
ఇదే విధంగా బుద్ధి అనగా నిర్ణయ శక్తిపై కూడా అధికారముండాలి అనగా ఏ సమయంలో ఏ పరిస్థితి ఉంటుందో, దాని అనుసారంగా ఆ క్షణంలోనే నిర్ణయం తీసుకోవాలి - దీనినే బుద్ధిపై అధికారమని అంటారు. అలా కాకుండా ఆ పరిస్థితి లేక సమయం గడిచిపోయిన తర్వాత, ఇలా జరిగి ఉండకూడదు, ఒకవేళ ఫలానా నిర్ణయం తీసుకుని ఉంటే చాలా బాగుండేది అని తర్వాత నిర్ణయించడం కాదు. కనుక సమయానికి నిర్ణయం తీసుకోవడం మరియు యథార్థమైన నిర్ణయాన్ని తీసుకోవడం - ఇది రాజ్య అధికారి ఆత్మకు గుర్తు. కనుక పూర్తి రోజంతటిలో, రాజ్య అధికారిగా అనగా ఈ సూక్ష్మ శక్తులను కూడా ఆజ్ఞపై నడిపించేవారిగా ఎంతవరకు ఉన్నాము అని చెక్ చేసుకోండి. ప్రతిరోజూ మీ కర్మచారుల దర్బారును ఏర్పాటు చేయండి. మీ కర్మచారులైన స్థూల కర్మేంద్రియాలు మరియు సూక్ష్మ శక్తులు మీ కంట్రోల్ లో ఉన్నాయా, లేవా అని చెక్ చేసుకోండి. ఇప్పటి నుండి రాజ్య అధికారిగా అయ్యే సంస్కారము అనేక జన్మలకు రాజ్యాధికారిగా చేస్తుంది. అర్థమయిందా? ఇదే విధంగా, సంస్కారం ఎక్కడా మోసగించడం లేదు కదా? ఆది, అనాది సంస్కారము. అనాదిలో శుద్ధమైన, శ్రేష్ఠమైన పావన సంస్కారాలు ఉండేవి, సర్వగుణ స్వరూప సంస్కారాలు ఉంటాయి మరియు ఆదిలో దేవాత్మలకు రాజ్య అధికారితనపు సంస్కారాలు, సర్వ ప్రాప్తి స్వరూపుల సంస్కారాలు, సంపన్నత సంపూర్ణత యొక్క న్యాచురల్ సంస్కారాలు ఉంటాయి. కనుక సంస్కారాల శక్తి పై రాజ్య అధికారి అనగా సదా అనాది, ఆది సంస్కారాలు ఇమర్జ్ అయి ఉండాలి. ఇవి న్యాచురల్ సంస్కారాలుగా ఉండాలి. మధ్య సంస్కారాలు అనగా ద్వాపరయుగం నుండి ప్రవేశించిన సంస్కారాలు తమ వైపు ఆకర్షించకూడదు. సంస్కారాలకు వశమై బలహీనమవ్వకూడదు. ఇవి నా పాత సంస్కారాలు అని అంటూ ఉంటారు కదా. వాస్తవానికి అనాది, ఆది సంస్కారాలే పాత సంస్కారాలు. ఇవైతే మధ్యలో ద్వాపరం నుండి వచ్చిన సంస్కారాలు. కావున పాత సంస్కారాలు అంటే ఆదిలోనివా లేక మధ్యలోనివా? ఏదైనా హద్దు ఆకర్షణ యొక్క సంస్కారాలు ఆకర్షిస్తే, సంస్కారాలపై రాజ్య అధికారి అని అంటారా? ఒకవేళ రాజ్యంలో ఒక్క శక్తి అయినా లేక ఒక్క కర్మచారి ‘కర్మేంద్రియం’ అయినా, ఆజ్ఞానుసారంగా లేకపోతే వారిని సంపూర్ణ రాజ్యాధికారి అని అంటారా? పిల్లలైన మీరందరూ, మేము ఒకే రాజ్యాన్ని, ఒకే ధర్మాన్ని, ఒకే మతాన్ని స్థాపన చేసేవారిమని ఛాలెంజ్ చేస్తారు కదా. ఈ ఛాలెంజ్ ను బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు అయిన అందరూ చేస్తారు కదా. మరి అది ఎప్పుడు స్థాపనవుతుంది? భవిష్యత్తులో స్థాపనవుతుందా? స్థాపనకు నిమిత్తులు ఎవరు? బ్రహ్మానా లేక విష్ణువా? బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది కదా. ఎక్కడైతే బ్రహ్మా ఉంటారో, అక్కడ బ్రాహ్మణులు కూడా తోడుగానే ఉంటారు. బ్రహ్మా ద్వారా అనగా బ్రాహ్మణుల ద్వారా స్థాపన. అది ఎప్పుడు జరుగుతుంది? సంగమయుగంలోనా లేక సత్యయుగంలోనా? అక్కడైతే పాలన జరుగుతుంది కదా. బ్రహ్మా మరియు బ్రాహ్మణుల ద్వారా స్థాపన అనేది ఇప్పుడే జరగాలి. కనుక ముందు మీ స్వ రాజ్యంలో చూసుకోండి - ఒకే రాజ్యము, ఒకే ధర్మము (ధారణ), ఒకే మతము ఉన్నాయా. ఒకవేళ ఒక్క కర్మేంద్రియమైనా మాయ యొక్క మతంపై ఉన్నట్లయితే, ఒకే రాజ్యము, ఒకే మతము అని అనరు. కనుక ముందు ఇది చెక్ చేసుకోండి - ఒకే రాజ్యాన్ని, ఒకే ధర్మాన్ని స్వ రాజ్యంలో స్థాపన చేసానా లేదా ఒక్కోసారి మాయ సింహాసనంపై కూర్చుంటుంది, ఒక్కోసారి మీరు కూర్చుంటున్నారా. ఛాలెంజ్ ను ప్రాక్టికల్ లోకి తీసుకొచ్చారా లేదా అన్నది చెక్ చేసుకోండి. మీరు కోరుకున్నది అనాది సంస్కారాలను, ఇమర్జ్ అయినవి మధ్య సంస్కారాలు, ఇది అధికారితనము కాదు కదా.
కనుక రాజఋషి అనగా అన్నింటిపైన రాజ్యాధికారులు. ఎప్పుడైతే ఋషిలా అనగా అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క అభ్యాసం చేసేవారిగా ఉంటారో, అప్పుడే సదా మరియు సహజంగా రాజ్యాధికారులుగా అవుతారు. వైరాగ్యం అనగా ఆకర్షణ ఉండరాదు. సదా తండ్రికి ప్రియంగా ఉండాలి. ఈ ప్రియత్వమే అతీతంగా చేస్తుంది. బాబాకు ప్రియమైనవారిగా అయి, అతీతులుగా అయి కర్మలోకి వచ్చేవారినే అనంతమైన వైరాగులు అని అంటారు. బాబాకు ప్రియమైనవారిగా అవ్వకపోతే అతీతులుగా కూడా అవ్వలేరు, ఆకర్షణలోకి వచ్చేస్తారు. బాబాకు ప్రియమైనవారు వేరే ఏ వ్యక్తికి లేక వైభవాలకు ప్రియంగా అవ్వలేరు. వారు సదా ఆకర్షణకు దూరంగా ఉంటారు అనగా అతీతంగా ఉంటారు. దీనినే నిర్లేప స్థితి అని అంటారు. వారు ఏ హద్దు ఆకర్షణల ప్రభావంలోకి వచ్చేవారిగా ఉండరు. రచనను మరియు సాధనాలను నిర్లిప్తంగా ఉంటూ కార్యంలో ఉపయోగించాలి. ఇటువంటి అనంతమైన వైరాగులుగా, సత్యమైన రాజఋషులుగా అయ్యారా? కేవలం ఒకటో, రెండో బలహీనతలు మాత్రమే మిగిలాయి, కేవలం ఒక్క సూక్ష్మశక్తి లేక కర్మేంద్రియము కంట్రోల్ లో తక్కువగా ఉంది, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి అని అనుకోకండి. ఒక్క బలహీనత ఉన్నా కానీ అది మాయకు గేటు వంటిది. అది చిన్నదైనా, పెద్దదైనా, గేటు అయితే ఉంది కదా. ఒకవేళ గేటు తెరవబడి ఉంటే మాయాజీతులుగా, జగత్ జీతులుగా ఎలా అవ్వగలుగుతారు?
ఒక వైపు ఒకే రాజ్యం, ఒకే ధర్మం కలిగిన బంగారు ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నారు, మరో వైపు బలహీనతను అనగా మాయను కూడా ఆహ్వానిస్తున్నారు, అప్పుడు ఫలితం ఏమవుతుంది? సందిగ్ధతలో ఉండిపోతారు. అందుకే దీనిని చిన్న విషయంగా భావించకండి. ఇంకా సమయం ఉంది, చేసేస్తాము, వేరే వాళ్ళలో కూడా చాలానే ఉన్నాయి, నాలోనైతే కేవలం ఒక్క విషయమే కదా అని ఇతరులను చూస్తూ-చూస్తూ మీరు ఉండిపోకండి. ‘సీ బ్రహ్మా ఫాదర్’ (బ్రహ్మాబాబాను చూడండి) అని చెప్పడం జరిగింది, ఫాలో ఫాదర్ (తండ్రిని అనుసరించండి) అని చెప్పడం జరిగింది. అందరికీ సహయోగులుగా, స్నేహులుగా తప్పకుండా అవ్వండి, గుణాలను గ్రహించేవారిగా తప్పకుండా అవ్వండి, కానీ ఫాలో ఫాదర్. బ్రహ్మాబాబా అంతిమ స్థితిని రాజఋషిగా చూశారు - ఇంతగా పిల్లలకు ప్రియమైనవారిగా ఉంటూ కూడా, వారిని ఎదురుగా చూస్తూ కూడా, మీరు అతీతమైన స్థితినే చూశారు కదా. అనంతమైన వైరాగ్యము - ఈ స్థితినే ప్రత్యక్షంగా చూశారు. కర్మభోగము ఉన్నా కానీ కర్మేంద్రియాలపై అధికారిగా అయి అనగా రాజఋషిగా అయి సంపూర్ణ స్థితిని అనుభవం చేయించారు, అందుకే ఫాలో ఫాదర్ అని అంటారు. కనుక మీ రాజ్య అధికారాన్ని, రాజ్య కర్మచారులను సదా చూసుకుంటూ ఉండాలి. ఏ రాజ్య కర్మచారి ఎక్కడా మోసగించకూడదు. అర్థమయిందా? అచ్ఛా.
ఈ రోజు భిన్న-భిన్న స్థానాల నుండి ఒకే స్థానానికి చేరుకున్నారు. దీనినే సాగరము, నదుల మేళా అని అంటారు. మేళాలో కలయిక కూడా జరుగుతుంది, సంపద కూడా లభిస్తుంది, అందుకే అందరూ మేళాకు వచ్చి చేరుకున్నారు. కొత్త పిల్లల సీజన్లో ఇది చివరి గ్రూపు. కొత్త వారితో పాటు పాతవారికి కూడా ఛాన్స్ లభించింది. ప్రకృతి కూడా ఇప్పటి వరకు ప్రేమతో సహయోగమిస్తుంది. కాని దీనిని అడ్వాంటేజ్ గా తీసుకోకండి లేకుంటే ప్రకృతి కూడా తెలివైనది. అచ్ఛా.
నలువైపులా ఉన్న సదా రాజఋషి పిల్లలకు, సదా స్వయంపై రాజ్యం చేస్తూ సదా విజయులుగా అయి రాజ్య కార్య వ్యవహారాలను నిర్విఘ్నంగా నడిపించే రాజ్య అధికారి పిల్లలకు, సదా అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉండే ఋషి కుమారులు, ఋషి కుమారీలందరికీ, సదా తండ్రికి ప్రియమైనవారిగా అయి అతీతంగా ఉంటూ కార్యం చేసే అతీతమైన మరియు ప్రియమైన పిల్లలకు, సదా బ్రహ్మాబాబాను ఫాలో చేసే నమ్మకస్థులైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక
1. అనేక సార్లు యొక్క విజయీ ఆత్మలమని అనుభవం చేస్తున్నారా? విజయులుగా అవ్వడం కష్టమనిపిస్తుందా లేక సులువనిపిస్తుందా? ఎందుకంటే సులువైన విషయం సదా సాధ్యమవుతుంది, కష్టమైన విషయం సదా సాధ్యం కాదు. ఏ కార్యాన్ని అయితే అనేక సార్లు చేసి ఉంటారో, అది స్వతహాగానే సులువైపోతుంది. ఏదైనా కొత్త పని చేసేటప్పుడు, ముందు కష్టమనిపిస్తుంది కానీ ఎప్పుడైతే అది చేస్తారో, అప్పుడు ఆ కష్టమైన పనే సులువనిపిస్తుంది. కావున మీరందరూ ఈ ఒక్క సారి మాత్రమే విజయులు కాదు, అనేక సార్లు విజయులుగా అయ్యారు. అనేక సార్లు విజయులు అనగా సదా సులువుగా విజయాన్ని అనుభవం చేసేవారు. ఎవరైతే సహజమైన విజయులుగా ఉంటారో, వారికి ప్రతి అడుగులో ఏమని అనుభవమవుతుందంటే, ఈ కార్యాలన్నీ జరిగే ఉన్నాయి, ప్రతి అడుగులో విజయము లభించే ఉంది అని. అవుతుందా, అవ్వదా అన్న సంకల్పము కూడా రాజాలదు. అనేక సార్లు విజయులుగా అయ్యామనే నిశ్చయమున్నప్పుడు, అవుతుందా, అవ్వదా అనే ప్రశ్నే ఉండదు. నిశ్చయానికి గుర్తు నషా మరియు నషాకు గుర్తు సంతోషము. ఎవరికైతే నషా ఉంటుందో, వారు సదా సంతోషంగా ఉంటారు. హద్దు విజయంలో కూడా ఎంత సంతోషం ఉంటుంది! ఎప్పుడైనా ఎక్కడైనా విజయం పొందితే, భాజా భజంత్రీలను మోగిస్తారు కదా. కనుక ఎవరికైతే నిశ్చయము మరియు నషా ఉంటుందో, వారికి తప్పకుండా సంతోషముంటుంది. వారు సదా సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. శరీరంతో అయితే కొందరు నాట్యం చేయగలరు, కొందరు చేయలేరు కానీ మనసులో సంతోషంతో నాట్యం చేయడమనేది అయితే, మంచంపై జబ్బుతో ఉన్నవారు కూడా చేయగలుగుతారు. ఎలాంటివారికైనా సరే, ఈ విధంగా నాట్యం చేయడం అందరికీ సహజము, ఎందుకంటే విజయులుగా అవ్వడమనగా స్వతహాగానే సంతోష వాయిద్యాలు మోగడము. వాయిద్యాలు మ్రోగినప్పుడు కాళ్ళు వాటంతటవే కదులుతూ ఉంటాయి. నాట్యం చేయడం రానివారు కూడా కూర్చుని కూర్చునే నాట్యం చేస్తూ ఉంటారు. కాళ్ళు కదులుతాయి, భుజాలు కదులుతాయి. మీరందరూ అనేక సార్లు విజయులు - ఈ సంతోషంతో సదా ముందుకు వెళ్తూ ఉండండి. ప్రపంచంలో అందరికీ అవసరమైనది సంతోషమే. అన్ని ప్రాప్తులు ఉన్నా కానీ సంతోషం యొక్క ప్రాప్తి లేదు. కనుక ప్రపంచానికి ఏదైతే అవినాశీ సంతోషము అవసరమో, ఆ సంతోషాన్ని సదా పంచుతూ ఉండండి.
2. తమను తాము భాగ్యశాలిగా భావిస్తూ ప్రతి అడుగులో శ్రేష్ఠ భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే ఈ సమయంలో తండ్రి భాగ్య విధాతగా అయి భాగ్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు. భాగ్య విధాత భాగ్యాన్ని పంచుతున్నారు. పంచే సమయంలో ఎవరు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. అందరికీ అధికారముంది. ఏమైనా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. మరి ఇలాంటి సమయంలో ఎంత భాగ్యాన్ని తయారు చేసుకున్నాము అన్నది చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. అందుకే ప్రతి అడుగులోనూ భాగ్య రేఖను గీసుకునే కలమును బాబా పిల్లలందరికీ ఇచ్చారు. కలము చేతిలో ఉంది, అంతేకాక ఎంత పెద్ద గీతను గీసుకోవాలనుకుంటే అంత గీసుకోవచ్చని బాబా అనుమతినిచ్చారు. ఇది ఎంత గొప్ప ఛాన్స్! కనుక సదా ఈ భాగ్యశాలి సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని అంతగా జమ చేసుకుంటున్నారు కదా! అయితే, చేయాలనుకున్నదైతే చాలా ఉంది కానీ చేయలేకపోతాము, చేయాల్సింది చాలా ఉంది కానీ చేసింది ఇంతే అని అనేలా ఉండకూడదు. స్వయం పట్ల ఈ ఫిర్యాదు ఉండిపోకూడదు. అర్థమయిందా? కావున సదా భాగ్యరేఖను శ్రేష్ఠంగా చేసుకుంటూ వెళ్ళండి మరియు ఇతరులకు కూడా ఇంత శ్రేష్ఠ భాగ్యం యొక్క పరిచయాన్నిస్తూ వెళ్ళండి. ‘వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము!’ - ఈ సంతోష గీతాన్ని సదా పాడుతూ ఉండండి.
3. సదా తమను తాము స్వదర్శన చక్రధారి, శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? స్వదర్శన చక్రము అనగా సదా మాయ యొక్క అనేక చక్రాల నుండి విడిపించేటువంటిది. స్వదర్శన చక్రము సదాకాలానికి చక్రవర్తిగా, రాజ్య భాగ్యానికి అధికారిగా చేస్తుంది. ఈ సర్వదర్శన చక్రము యొక్క జ్ఞానము కేవలం ఈ సంగమయుగంలోనే ప్రాప్తిస్తుంది. మీరు బ్రాహ్మణాత్మలు కనుక స్వదర్శన చక్రధారులు. బ్రాహ్మణులను సదా పిలక స్థానంలో చూపిస్తారు. పిలక అనగా ఉన్నతమైనది. బ్రాహ్మణులు అనగా సదా శ్రేష్ఠ కర్మలు చేసేవారు, బ్రాహ్మణులు అనగా సదా శ్రేష్ఠ ధర్మంలో (ధారణలు) ఉండేవారు - ఇలాంటి బ్రాహ్మణులే కదా? మీరు పేరుకు మాత్రమే బ్రాహ్మణులు కాదు, పని చేసే బ్రాహ్మణులు ఎందుకంటే బ్రాహ్మణులకు ఇప్పుడు ఈ అంతిమ సమయంలో కూడా ఎంత పేరు ఉంది! సత్యమైన బ్రాహ్మణులైన మీ స్మృతిచిహ్నమే ఇప్పటివరకు నడుస్తుంది. ఏదైనా శ్రేష్ఠమైన కార్యముంటే బ్రాహ్మణులనే పిలుస్తారు, ఎందుకంటే బ్రాహ్మణులే ఇంతటి శ్రేష్ఠమైనవారు. మరి ఏ సమయంలో ఇంత శ్రేష్ఠంగా అయ్యారు? ఇప్పుడే అయ్యారు, అందుకే ఇప్పటివరకు కూడా శ్రేష్ఠ కార్యం యొక్క స్మృతిచిహ్నము నడుస్తూ వస్తోంది. ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ శ్రేష్ఠమైనది చేసేవారు, ఇటువంటి స్వదర్శన చక్రధారి శ్రేష్ఠ బ్రాహ్మణులు - సదా ఇదే స్మృతిలో ఉండండి. అచ్ఛా.
Comments
Post a Comment