14-11-1987 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“పూజ్య దేవాత్మలుగా అయ్యేందుకు సాధనము - పవిత్రతా శక్తి”
ఈ రోజు ఆత్మిక దీపము తమ ఆత్మిక దీపపు పురుగులను చూస్తున్నారు. ప్రతి ఆత్మిక దీపపు పురుగు తన ఉల్లాస ఉత్సాహాలనే రెక్కల ద్వారా ఎగురుతూ ఎగురుతూ ఈ ఆత్మిక సభలోకి వచ్చి చేరుకుంది. ఈ ఆత్మిక సభ విచిత్రమైన, అలౌకిక సభ. ఈ సభ గురించి ఆత్మిక తండ్రికి మరియు ఆత్మిక పిల్లలకే తెలుసు. ఈ ఆత్మిక ఆకర్షణ ముందు మాయ యొక్క అనేక రకాల ఆకర్షణలు తుచ్ఛంగా అనిపిస్తాయి, సారహీనంగా అనుభవమవుతాయి. ఈ ఆత్మిక ఆకర్షణ సదాకాలానికి, వర్తమానము మరియు భవిష్యత్తులో అనేక జన్మలకు హర్షితంగా చేస్తుంది, అనేక రకాల దుఃఖము-అశాంతుల అలల నుండి దూరం చేస్తుంది. అందుకే, ఆత్మిక దీపపు పురుగులందరూ ఈ సభలోకి వచ్చి చేరుకున్నారు.
బాప్ దాదా దీపపు పురుగులందరినీ చూసి హర్షితులవుతారు. అందరి మస్తకంపై పవిత్రమైన స్నేహము, పవిత్రమైన స్నేహ సంబంధము, పవిత్రమైన జీవితం యొక్క పవిత్ర దృష్టి-వృత్తి యొక్క గుర్తులు మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఈ పవిత్రతా గుర్తులన్నింటి చిహ్నముగా లేక సూచకంగా అందరిపైన ‘ప్రకాశ కిరీటము’ మెరుస్తూ ఉంది. సంగమయుగ బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత - పవిత్రతకు చిహ్నమైన ఈ ప్రకాశ కిరీటము. ఈ కిరీటము తండ్రి ద్వారా ప్రతీ బ్రాహ్మణాత్మకు ప్రాప్తిస్తుంది. ఈ కిరీటము మహాన్ ఆత్మలు, పరమాత్మ భాగ్యశాలి ఆత్మలు, ఉన్నతోన్నతమైన ఆత్మల గుర్తు. కనుక మీరంతా ఇటువంటి కిరీటధారులుగా అయ్యారా? బాప్ దాదా లేక మాత-పితలు పిల్లలు ప్రతి ఒక్కరికీ జన్మతోనే ‘పవిత్ర భవ’ అనే వరదానమిస్తారు. పవిత్రత లేదంటే బ్రాహ్మణ జీవితం లేదు. స్థాపన ఆది నుండి ఇప్పటివరకు పవిత్రత విషయంలోనే విఘ్నాలు కలుగుతూ వచ్చాయి, ఎందుకంటే పవిత్రతా పునాది 21 జన్మల పునాది. పవిత్రత యొక్క ప్రాప్తి బ్రాహ్మణాత్మలైన మిమ్మల్ని ఎగిరేకళ వైపుకు సహజంగా తీసుకువెళ్ళేందుకు ఆధారము.
ఎలాగైతే కర్మల గతి లోతైనదన్న గాయనం ఉన్నదో, అలా పవిత్రత యొక్క పరిభాష కూడా చాలా లోతైనది. పవిత్రత మాయ యొక్క అనేక విఘ్నాల నుండి రక్షింపబడేందుకు ఛత్రఛాయ. పవిత్రతనే సుఖ-శాంతల జనని అని అంటారు. ఏ విధమైన అపవిత్రత ఉన్నా సరే, అది దుఃఖాన్ని మరియు అశాంతిని అనుభవం చేయిస్తుంది. కనుక పూర్తి రోజంతటిలో ఏ సమయంలోనైనా దుఃఖము లేక అశాంతుల అల అనుభవమవుతోందా అని చెక్ చేసుకోండి. దానికి బీజము అపవిత్రత. దానికి కారణము ముఖ్యమైన వికారాలు కావచ్చు లేక వికారాల సూక్ష్మ రూపాలు కావచ్చు. పవిత్రమైన జీవితము అనగా దుఃఖము-అశాంతుల నామరూపాలు కూడా ఉండవు. ఏ కారణంగానైనా, కొద్దిగానైనా దుఃఖము అనుభవమయితే సంపూర్ణ పవిత్రతలో లోపమున్నట్లు. పవిత్రమైన జీవితము అనగా బాప్ దాదా ద్వారా ప్రాప్తించిన వరదానీ జీవితము. బ్రాహ్మణుల సంకల్పంలో లేక నోటిలో ఎప్పుడూ ఈ మాట ఉండకూడదు - ఈ విషయం కారణంగా లేక ఈ వ్యక్తి వ్యవహారం కారణంగా నాకు దుఃఖము కలుగుతుంది అని. అప్పుడప్పుడు సాధారణ రీతిలో ఇలాంటి మాటలను మాట్లాడేస్తారు లేక అనుభవం కూడా చేస్తూ ఉంటారు. ఇవి పవిత్రమైన బ్రాహ్మణ జీవితపు మాటలు కాదు. బ్రాహ్మణ జీవితము అనగా ప్రతి సెకండు సుఖమయ జీవితము. దుఃఖాన్ని కలిగించే దృశ్యాలు ఉన్నా కానీ, ఎక్కడైతే పవిత్రతా శక్తి ఉంటుందో, అక్కడ వారు ఎప్పుడూ దుఃఖము కలిగించే దృశ్యాలలో దుఃఖాన్ని అనుభవం చెయ్యరు, కానీ దుఃఖహర-సుఖకర్త అయిన తండ్రి సమానంగా దుఃఖంతో కూడిన వాతావరణంలో, దుఃఖమయమైన వ్యక్తులకు సుఖ-శాంతుల వరదానీగా అయి, సుఖ-శాంతుల అంచలిని (దోసిలిని) ఇస్తారు, మాస్టర్ సుఖకర్తగా అయి దుఃఖాన్ని ఆత్మిక సుఖం యొక్క వాయుమండలంలోకి పరివర్తన చేస్తారు. ఇటువంటివారినే దుఃఖహర్త-సుఖకర్తలని అంటారు.
సైన్సు శక్తి అల్పకాలానికి ఎవరి దుఃఖాన్ని అయినా లేక బాధనైనా సమాప్తం చేస్తున్నప్పుడు, పవిత్రతా శక్తి అనగా సైలెన్స్ శక్తి, ఇది దుఃఖాన్ని, బాధను సమాప్తం చేయలేదా? సైన్సువారి మందులలో అల్పకాల శక్తి ఉన్నప్పుడు పవిత్రతా శక్తిలో, పవిత్రత యొక్క ఆశీర్వాదాలలో ఎంత గొప్ప శక్తి ఉన్నట్లు? సమయ ప్రమాణంగా ఎప్పుడైతే ఈనాటి వ్యక్తులు మందుల కారణంగా విసిగిపోతారో, వ్యాధులు అతిలోకి వెళ్తాయో, అప్పుడు సమయానికి పవిత్ర దేవీదేవతలైన మీ వద్దకు, మమ్మల్ని దుఃఖము-అశాంతి నుండి సదాకాలానికి దూరం చేయండి అని మీ ఆశీర్వాదాలు తీసుకునేందుకు వస్తారు. పవిత్రత యొక్క దృష్టి-వృత్తి సాధారణమైన శక్తి కాదు. కొద్ది సమయపు శక్తిశాలి దృష్టి మరియు వృత్తి సదాకాలానికి ప్రాప్తి చేయించేటువంటిది. ఉదాహరణకు, ఇప్పుడు శారీరక డాక్టర్లు, శారీరక ఆసుపత్రులు, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి, కానీ డాక్టర్లకు తీరిక లేదు, ఆసుపత్రుల్లో చోటు లేదు. రోగుల క్యూ సదా ఉంటూనే ఉంటుంది. ఇక మున్ముందు, ఈ విధంగా ఆసుపత్రులకు లేక డాక్టర్ల వద్దకు వెళ్ళాలని, మందులు తీసుకోవాలని అనుకున్నా కానీ వెళ్ళలేకపోతారు. మెజారిటీ నిరాశ చెందుతారు. అప్పుడు ఏమి చేస్తారు? ఎప్పుడైతే మందులతో నిరాశ చెందుతారో, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? పిల్లలైన మీ వద్ద కూడా క్యూ ఏర్పడుతుంది. ఎలాగైతే ఇప్పుడు తండ్రి మరియు మీ జడ చిత్రాల ఎదురుగా ‘ఓ దయాళువు! దయ చూపండి’ అని అంటూ దయ లేక ఆశీర్వాదాలను వేడుకుంటూ ఉంటారో, అలా చైతన్యమైన, పవిత్రమైన, పూజ్య ఆత్మలైన మీ వద్దకు ‘ఓ పవిత్రమైన దేవీ దేవతల్లారా! మాపై దయ చూపండి’ అని వేడుకునేందుకు వస్తారు. ఈ రోజుల్లో అల్పకాల సిద్ధి కలిగిన వారి వద్దకు ఆరోగ్యం కోసం లేక సుఖ-శాంతుల దయను తీసుకునేందుకు ఎంతగా భ్రమిస్తూ ఉంటారు! దూరం నుండి దృష్టి పడినా చాలని భావిస్తారు. మీరైతే పరమాత్మ విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అయ్యారు. ఎప్పుడైతే అల్పకాల ఆధారాలు సమాప్తమవుతాయో, అప్పుడు ఎక్కడికి వెళ్తారు?
ఎవరైతే అల్పకాల సిద్ధిని కలిగిన వారున్నారో, వారు ఏవో కొన్ని అల్పకాల పవిత్రత యొక్క విధుల ద్వారా అల్పకాల సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. ఇది సదాకాలానికి నడవదు. ఇది కూడా బంగారుయుగ ఆత్మలకు అనగా చివర్లో పై నుండి వచ్చిన ఆత్మలకు, పవిత్రమైన ముక్తిధామం నుండి వచ్చిన కారణంగా మరియు డ్రామా యొక్క నియమ ప్రమాణంగా, సతోప్రధాన స్థితి ప్రమాణంగా, ఆ పవిత్రతకు ఫలస్వరూపంగా అల్పకాల సిద్ధులు ప్రాప్తిస్తాయి, కానీ వారు కొంత సమయంలోనే సతో, రజో, తమో, ఈ మూడు స్టేజీలను దాటే ఆత్మలు కనుక వారికి సదాకాల సిద్ధి ఉండదు. పరమాత్మ విధి ద్వారా సిద్ధి కలగలేదు, అందుకే ఎక్కడో ఒకచోట స్వార్థము మరియు అభిమానము ఆ సిద్ధిని సమాప్తం చేస్తాయి. కానీ పవిత్ర ఆత్మలైన మీరు సదా సిద్ధి స్వరూపులు, సదాకాలానికి ప్రాప్తి చేయించేవారు. మీరు కేవలం చమత్కారాన్ని చూపించేవారే కాదు, కానీ ప్రకాశించే జ్యోతి స్వరూపులుగా తయారుచేసేవారు, అవినాశీ భాగ్యంతో మెరిసే నక్షత్రాలుగా చేసేవారు, కనుక ఈ ఆధారాలన్నీ ఇప్పుడిక కొంత సమయం కొరకే ఉంటాయి, చివరికి పవిత్ర ఆత్మలైన మీ వద్దకే సహాయము తీసుకునేందుకు వస్తారు. కనుక ఇంతగా సుఖ-శాంతుల జనని అయిన పవిత్ర ఆత్మలుగా అయ్యారా? ఇంతగా ఆశీర్వాదాల స్టాక్ ను జమ చేసుకున్నారా లేక ఇప్పటికీ మీ కోసము కూడా ఆశీర్వాదాలను వేడుకుంటూ ఉంటారా?
చాలామంది పిల్లలు ఇప్పటికీ కూడా ఎప్పటికప్పుడు తండ్రిని - ఈ విషయంలో కొద్దిగా దయ చూపించండి, ఆశీర్వాదమివ్వండి అని వేడుకుంటూ ఉంటారు. మరి వేడుకునే వారు దాతలుగా ఎలా అవ్వగలరు? అందుకే, పవిత్రతా శక్తి యొక్క మహానతను తెలుసుకుని పవిత్రంగా అనగా పూజ్య దేవాత్మలుగా ఇప్పటి నుండే అవ్వండి. చివర్లో అవుతాములే అని అనుకోకండి. చాలా సమయం నుండి జమ చేసుకున్న ఈ శక్తి చివర్లో పనికొస్తుంది. మరి పవిత్రత యొక్క గుహ్య గతి ఏమిటో అర్థమయిందా? సదా సుఖ-శాంతుల జనని అయిన ఆత్మగా ఉండడం - ఇదే పవిత్రత యొక్క గుహ్యత. ఇది సాధారణమైన విషయం కాదు. బ్రహ్మచారులుగా ఉంటారు, పవిత్రంగా అయ్యారు. కానీ పవిత్రత తల్లి వంటిది. సంకల్పాల ద్వారానైనా, వృత్తి ద్వారానైనా, వాయుమండలం ద్వారా, వాచా ద్వారా, సంపర్కం ద్వారా, సుఖ-శాంతుల జననిగా అవ్వడం - వీరినే పవిత్ర ఆత్మలని అంటారు. మరి ఎంత వరకు అలా అయ్యారని స్వయాన్ని చెక్ చేసుకోండి. అచ్ఛా.
ఈ రోజు చాలామంది వచ్చారు. ఎలా అయితే ఆనకట్ట తెగిపోతుందో, అలా ఇక్కడకు నియమం అనే కట్టడిని తెంచుకుని వచ్చేసారు. అయినా నియమంలో లాభం ఉంది. ఎవరైతే నియమానుసారంగా వస్తారో, వారికి ఎక్కువ లభిస్తుంది. ఎవరైతే అలల్లో కొట్టుకుని వచ్చేస్తారో, వారికి సమయ ప్రమాణంగా అంతే లభిస్తుంది కదా. అయినా చూడండి, బంధనముక్తుడైన బాప్ దాదా కూడా బంధనంలోకి వస్తారు! స్నేహ బంధనము. స్నేహంతో పాటు సమయం యొక్క బంధనం కూడా ఉంటుంది, శరీర బంధనం కూడా ఉంటుంది కదా. కానీ ఇది ప్రియమైన బంధనము, కనుక బంధనంలో ఉన్నప్పటికీ స్వేచ్ఛతో ఉన్నారు. బాప్ దాదా అయితే అంటారు, తప్పకుండా రండి, మీ ఇంటికి చేరుకున్నారు అని. అచ్ఛా.
నలువైపుల యొక్క పరమ పవిత్ర ఆత్మలందరికీ, సదా సుఖ-శాంతుల జననీ పావన ఆత్మలకు, సదా పవిత్రతా శక్తి ద్వారా అనేక ఆత్మలను దుఃఖము-బాధల నుండి దూరం చేసే దేవాత్మలకు, సదా పరమాత్మ విధి ద్వారా సిద్ధి స్వరూప ఆత్మలకు బాప్ దాదాల స్నేహ సంపన్నమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.
హాస్టల్ కుమారీలతో (ఇండోర్ గ్రూప్) - అందరూ పవిత్రమైన మాహాన్ ఆత్మలే కదా? ఈ రోజుల్లో మహాత్ములని పిలవబడే వారి కంటే మీరు అనేక రెట్లు శ్రేష్ఠమైనవారు. పవిత్ర కుమారీలకు సదా పూజ జరుగుతుంది. మరి మీరందరూ పావనమైన, పూజ్యులైన సదా శుద్ధ ఆత్మలే కదా? ఎటువంటి అశుద్ధి లేదు కదా? సదా పరస్పరంలో ఏకమతంగా, స్నేహీలుగా, సహయోగులుగా ఉండే ఆత్మలే కదా? సంస్కారాలను కలుపుకోవడం వచ్చు కదా, ఎందుకంటే సంస్కారాలను కలుపుకోవడమే మహానత. సంస్కారాల ఘర్షణ ఉండకూడదు కానీ సదా సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ ఉండండి. చాలా మంచి భాగ్యం లభించింది - చిన్నతనంలోనే మహాన్ గా అయ్యారు. సదా సంతోషంగా ఉంటారు కదా? ఎప్పుడూ మనసుతో అయితే ఏడవరు కదా? నిర్మోహులుగా ఉన్నారా? ఎప్పుడైనా లౌకిక పరివారం గుర్తుకొస్తుందా? రెండు రకాల చదువులలోనూ చురుకుగా ఉన్నారా? రెండు చదువులలోనూ సదా నంబరువన్ గా ఉండాలి. ఎలాగైతే తండ్రి వన్, అలా పిల్లలు కూడా నంబరువన్ లో ఉండాలి. అందరికంటే నంబరువన్ అయిన పిల్లలే సదా తండ్రికి ప్రియమైనవారు. అర్థమయిందా? అచ్ఛా.
పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక - సదా స్వయాన్ని శ్రేష్ఠ భాగ్యవంతులమని భావిస్తున్నారా? ఇంట్లో కూర్చుని ఉండగానే భాగ్య విధాత ద్వారా శ్రేష్ఠమైన భాగ్యం లభించింది. ఇంట్లో కూర్చుని ఉండగానే భాగ్యం లభించడం - ఇది ఎంతటి సంతోషకరమైన విషయము! అవినాశీ తండ్రి, అవినాశీ ప్రాప్తులను అందిస్తారు. కనుక అవినాశీ అనగా సదా, అప్పుడప్పుడు కాదు. కనుక భాగ్యాన్ని చూసుకొని సదా సంతోషంగా ఉంటారా? నిత్యం భాగ్యము మరియు భాగ్యవిధాత - ఈ రెండు స్మృతులు స్వతహాగా ఉండాలి. సదా ‘వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము!’ - ఇదే పాట పాడుతూ ఉండండి. ఇది మనసు యొక్క పాట. ఎంతగా ఈ పాటను పాడుతూ ఉంటారో, అంతగా సదా ఎగిరేకళను అనుభవం చేస్తూ ఉంటారు. మొత్తం కల్పంలో ఇలాంటి భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే సమయం ఇదొక్కటే, కనుక ‘ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు’ అనే స్లోగన్ కూడా ఉంది. ఏ శ్రేష్ఠ కార్యాన్ని చేయాలన్నా, ఇప్పుడే చేయాలి. ప్రతి కార్యములో, ప్రతి సమయము, ‘ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు’ అని గుర్తుంచుకోండి. ఎవరికైతే ఇది గుర్తుంటుందో, వారెప్పుడూ సమయము, సంకల్పాలు లేక కర్మలను వ్యర్థం కానివ్వరు. సదా జమ చేసుకుంటూ ఉంటారు. వికర్మల విషయమైతే లేనే లేదు కానీ వ్యర్థ కర్మలు కూడా మోసగిస్తాయి. కనుక ప్రతి సెకండు, ప్రతి సంకల్పము యొక్క మహత్వం తెలుసు కదా. జమ ఖాతా సదా నిండుతూ ఉండాలి. ఒకవేళ ప్రతి సెకండును మరియు ప్రతి సంకల్పాన్ని శ్రేష్ఠంగా జమ చేసుకుంటే, వ్యర్థంగా పోనివ్వకుంటే, 21 జన్మల కొరకు మీ ఖాతాను శ్రేష్ఠంగా చేసుకుంటారు. కనుక ఎంత జమ చేసుకోవాలో అంత చేసుకుంటున్నారా? ఈ విషయాన్ని మరింతగా అండర్ లైన్ చేసుకోండి - ఒక్క సెకండు కూడా, సంకల్పము కూడా వ్యర్థమవ్వకూడదు. వ్యర్థం సమాప్తమైపోతే సదా సమర్థులుగా అయిపోతారు. అచ్ఛా. ఆంధ్రప్రదేశ్ లో పేదరికం చాలా ఉంది కదా. కానీ మీరైతే అంతే షావుకార్లుగా ఉన్నారు. నలువైపులా పేదరికం పెరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ మీ షావుకారుతనం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే జ్ఞాన ధనం రావడంతో ఈ స్థూల ధనం కూడా రొట్టె-పప్పు లభించేంత వరకైతే స్వతహాగా రానే వస్తుంది. బ్రాహ్మణులెవరైనా ఆకలితో ఉంటారా? కనుక స్థూల ధనం యొక్క పేదరికం కూడా సమాప్తమైపోతుంది ఎందుకంటే తెలివైనవారిగా అయిపోతారు. పని చేసుకుని స్వయానికి మరియు పరివారానికి తినిపించేందుకు తెలివి వస్తుంది, అందుకే డబల్ షావుకారుతనం వస్తుంది. అది శరీరానికి మంచిది, మనసుకు కూడా మంచిది. రొట్టె-పప్పు ప్రశాంతంగా లభిస్తున్నాయి కదా. బ్రహ్మాకుమార-కుమారీలుగా అవ్వడంతో రాయల్ గా కూడా అయ్యారు, షావుకార్లుగా కూడా అయ్యారు, అంతేకాక అనేక జన్మలు సంపన్నులుగా ఉంటారు. ఇంతకుముందు ఎలా నడుచుకునేవారో, ఉండేవారో, ధరించేవారో..... దాని కంటే ఇప్పుడు ఎంత రాయల్ గా అయ్యారు! ఇప్పుడు సదా స్వచ్ఛంగా ఉంటారు. ఇంతకుముందు బట్టలు కూడా మురికివి ధరించేవారు, ఇప్పుడు లోపల బయట రెండు రకాలుగానూ స్వచ్ఛంగా అయ్యారు. కనుక బ్రహ్మాకుమారులుగా అవ్వడంతో లాభం జరిగింది కదా. అన్నీ మారిపోతాయి, పరివర్తన జరుగుతుంది. ముందు ఉన్న ముఖాన్ని, తెలివిని చూసుకోండి, ఇప్పటివీ చూసుకోండి, అప్పుడు తేడా తెలుస్తుంది. ఇప్పుడు ఆత్మికత యొక్క మెరుపు వచ్చింది, అందుకే ముఖమే మారిపోయింది. కనుక సదా ఇలా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి. అచ్ఛా.
డబల్ విదేశీ సోదరీ-సోదరులతో - మీరు డబల్ విదేశీయులా? వాస్తవానికి బ్రాహ్మణాత్మలందరూ ఈ భారతదేశానికి చెందినవారే. అనేక జన్మలు భారతవాసులుగా ఉన్నారు. అయితే సేవ కొరకు అనేక స్థానాలకు చేరుకున్నారు. దానికి గుర్తుగానే, ఎప్పుడైతే భారతదేశానికి వస్తారో అనగా మధుబన్ భూమిలోకి వస్తారో లేక బ్రాహ్మణ పరివారంలోకి వస్తారో, అప్పుడు ‘నా’ అన్న అనుభవాన్ని చేస్తారు. విదేశాల యొక్క విదేశీ ఆత్మలు, ఎంత సమీప సంపర్కంలోనివారైనా, సంబంధీకులైనా, ఎలాగైతే ఇక్కడ ఆత్మకు ‘నా’ అని అనిపిస్తుందో, అలా అక్కడ అనిపించదు. ఎంత సమీపంగా ఉన్న ఆత్మనో, అంత ఎక్కువగా ‘నా’ అనే అనుభూతి కలుగుతుంది. నేను ఇక్కడికి చెందినవాడినా లేక ఇక్కడికి చెందినవాడినై ఉండవచ్చా అని ఆలోచించాల్సిన పని ఉండదు. ప్రతి స్థూలమైన వస్తువు కూడా అతి ప్రియంగా అనిపిస్తుంది. ఉదాహరణకు మన వస్తువేదైనా ఉంటే, అది సదా ప్రియంగా అనిపిస్తుంది కదా. కనుక ఇవన్నీ గుర్తులు. బాప్ దాదా చూస్తున్నారు - దూరంగా ఉంటున్నా కూడా మనసుతో సదా సమీపంగా ఉండేవారు. పూర్తి పరివారమంతా మిమ్మల్ని ఇలాంటి శ్రేష్ఠ భాగ్యవంతులనే దృష్టితో చూస్తారు. అచ్ఛా.
Comments
Post a Comment