10-11-1987 అవ్యక్త మురళి

                       10-11-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘శుభ చింతక మణులుగా అయి విశ్వాన్ని చింతల నుండి ముక్తి చెయ్యండి’’

ఈ రోజు రత్నాకరుడైన తండ్రి నలువైపులా ఉన్న తమ విశేషమైన శుభ చింతక మణులను చూస్తున్నారు. రత్నాకరుడైన తండ్రి యొక్క మణులు విశ్వాన్ని తమ శుభ చింతక కిరణాల ద్వారా ప్రకాశవంతంగా చేస్తున్నారు ఎందుకంటే నేటి ఈ కృత్రిమమైన మెరుపు కలిగిన విశ్వంలో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు. ఇటువంటి అల్పకాల మెరుపు కలిగిన చింతామణులను, శుభ చింతక మణులైన మీరు మీ శుభ చింతన శక్తి ద్వారా పరివర్తన చేస్తున్నారు. ఎలాగైతే సూర్య కిరణాలు దూర-దూరాల వరకు అంధకారాన్ని తొలగిస్తాయో, అలా శుభ చింతక మణులైన మీ శుభ సంకల్పాల రూపీ మెరుపు అనండి, కిరణాలు అనండి, అవి విశ్వంలో నలువైపులా వ్యాపిస్తున్నాయి. ఈ రోజుల్లో చాలామంది ఆత్మలు, ఏదో ఆధ్యాత్మిక ప్రకాశం గుప్త రూపంలో తన కార్యం చేస్తూ ఉందని భావిస్తున్నారు. కానీ ఈ ప్రకాశం ఎక్కడి నుండి ఈ కార్యం చేస్తోంది అనేది తెలుసుకోలేరు. ఎవరో ఉన్నారు - అని ఇంతవరకు టచింగ్ అవ్వడం ప్రారంభమయింది. ఆఖరికి వెతుకుతూ వెతుకుతూ స్థానానికి తప్పకుండా చేరుకుంటారు. ఈ టచింగ్ అనేది శుభ చింతక మణులైన మీ శ్రేష్ఠ సంకల్పాల మెరుపే. బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి మస్తకం ద్వారా మణి యొక్క మెరుపును చూస్తారు ఎందుకంటే నంబరువారుగా మెరిసేవారు ఉంటారు. అందరూ శుభ చింతక మణులే కానీ మెరుపు నంబరువారుగా ఉంది.

శుభ చింతకులుగా అవ్వడమే మనసా సేవ యొక్క సహజమైన రూపం. ఈ రూపం ద్వారా నడుస్తూ-తిరుగుతూ ప్రతి బ్రాహ్మణ ఆత్మ పట్ల మరియు అపరిచిత ఆత్మల పట్ల మనసా సేవ చెయ్యవచ్చు. శుభ చింతకులుగా అయ్యే మీ అందరి వైబ్రేషన్లు వాయుమండలాన్ని మరియు చింతామణి ఆత్మల వృత్తిని చాలా సహజంగా పరివర్తన చేస్తాయి. ఈనాటి మనుష్యాత్మల జీవితంలో నలువైపుల నుండి వ్యక్తుల ద్వారా గాని, వైభవాల ద్వారా గాని - వ్యక్తులలో స్వార్థ భావన ఉన్న కారణంగా, వైభవాలలో అల్పకాల ప్రాప్తి ఉన్న కారణంగా - కొంత సమయానికి శ్రేష్ఠ ప్రాప్తి యొక్క అనుభూతి కలుగుతుంది కానీ అల్పకాల సంతోషమనేది కొంత సమయం తర్వాత చింతలోకి మారిపోతుంది అనగా వైభవాలు లేక వ్యక్తులు చింతను తొలగించేందుకు కాక చింతను ఉత్పన్నం చేయించేందుకు నిమిత్తంగా అవుతారు. ఇలా ఏదో ఒక చింతతో వ్యాకులంగా ఉన్న ఆత్మలకు శుభ చింతక ఆత్మలు చాలా కొద్దిమందే కనిపిస్తారు. శుభ చింతక ఆత్మల సంపర్కంలోకి కొంత సమయం వచ్చినా కానీ, అది అనేక చింతలను తొలగించేందుకు ఆధారమవుతుంది. కనుక ఈ రోజు విశ్వానికి శుభ చింతక ఆత్మల అవసరముంది. అందుకే, శుభ చింతక మణులు లేక ఆత్మలైన మీరు విశ్వానికి అతి ప్రియమైనవారు. మీ సంపర్కంలోకి వచ్చినప్పుడు, ఇటువంటి శుభ చింతకులు ప్రపంచంలో ఇంకెవ్వరూ కనిపించరని అనుభవం చేస్తారు.

సదా శుభ చింతకులుగా ఉండేందుకు విశేషమైన ఆధారము - శుభ చింతన. ఎవరికైతే సదా శుభ చింతన ఉంటుందో, వారు తప్పకుండా శుభ చింతకులుగా ఉంటారు. ఒకవేళ అప్పుడప్పుడు వ్యర్థ చింతన లేక పరచింతన ఉంటే, సదా శుభ చింతకులుగా ఉండలేరు. శుభ చింతక ఆత్మలు ఇతరుల వ్యర్థ చింతనను, పరచింతనను కూడా సమాప్తం చేస్తారు. కనుక ప్రతి శ్రేష్ఠమైన సేవాధారి అనగా శుభ చింతక మణులలో శుభ చింతన యొక్క శక్తిశాలి ఖజానా సదా నిండుగా ఉంటుంది. నిండుగా ఉన్న కారణంగానే ఇతరుల పట్ల శుభ చింతకులుగా అవ్వగలరు. శుభ చింతకులనగా సర్వ జ్ఞాన రత్నాలతో నిండుగా ఉండేవారు. ఇలా జ్ఞాన సంపన్న దాతలుగా అయి ఇతరుల పట్ల సదా శుభ చింతకులుగా అవ్వగలుగుతారు. కనుక రోజంతటిలో ఎక్కువ సమయం శుభ చింతన ఉంటుందా లేక పరచింతన ఉంటుందా అని చెక్ చేసుకోండి. శుభ చింతన చేసేవారు సదా తమ సంపన్నత యొక్క నషాలో ఉంటారు కనుక తమ శుభ చింతక స్వరూపం ద్వారా ఇతరులకు ఇస్తూ ఉంటారు మరియు నింపుతూ ఉంటారు. పరచింతన మరియు వ్యర్థ చింతన చేసేవారు సదా ఖాళీగా ఉన్న కారణంగా తమను తాము బలహీనంగా ఉన్నట్లు అనుభవం చేస్తారు కనుక సదా శుభ చింతకులుగా అయి ఇతరులకు ఇచ్చే పాత్రులుగా అవ్వలేరు. వర్తమాన సమయంలో సర్వుల చింతలను తొలగించేందుకు నిమిత్తులుగా అయ్యే శుభ చింతక మణుల అవసరముంది. అందరినీ చింతకు బదులుగా శుభ చింతన విధి యొక్క అనుభవీలుగా చేయగలగాలి. ఎక్కడైతే శుభ చింతన ఉంటుందో, అక్కడ చింత స్వతహాగా సమాప్తమైపోతుంది. మరి సదా శుభ చింతకులై గుప్త సేవను చేస్తున్నారు కదా?

అనంతమైన విశ్వ సేవ కొరకు ఈ ప్లాన్ ఏదైతే తయారుచేశారో, ఈ ప్లాన్ ను సహజంగా సఫలం చేసేందుకు ఆధారము కూడా శుభ చింతక స్థితియే. రకరకాల ఆత్మలు సంబంధ-సంపర్కంలోకి వస్తారు. ఇలాంటి ఆత్మల పట్ల శుభ చింతకులుగా అవ్వడం అనగా ఆ ఆత్మలకు ధైర్యమనే రెక్కలను ఇవ్వడము. ఎందుకంటే ఆత్మలందరూ చింత అనే చితిపై ఉన్న కారణంగా వారు తమ ధైర్యము, ఉల్లాసము-ఉత్సాహము అనే రెక్కలను బలహీనంగా చేసేసుకున్నారు. శుభ చింతక ఆత్మలైన మీ శుభ భావన వారి రెక్కలలో శక్తిని నింపుతుంది. అంతేకాక, వారు మీ శుభ చింతక భావనల ఆధారం ద్వారా ఎగరుతారు అనగా సహయోగులుగా అవుతారు. లేకుంటే బెటర్ వరల్డ్ (సుఖమయ ప్రపంచాన్ని) తయారుచేసే శక్తి ఆత్మలైన మాలో ఎక్కడుంది అనే నిరాశలో ఉన్నారు. ఎవరైతే స్వయాన్నే తయారుచేసుకోలేరో, వారు విశ్వాన్ని ఎలా తయారుచెయ్యగలరు? విశ్వాన్ని పరివర్తన చెయ్యడం చాలా కష్టమని భావిస్తారు ఎందుకంటే వర్తమానంలో ఉన్న అన్ని సత్తాల రిజల్టును చూసారు. అందువలన కష్టమని భావిస్తారు. ఇలా నిరాశలో ఉన్న ఆత్మలను, చింత అనే చితిపై కూర్చుని ఉన్న ఆత్మలను, మీ శుభ చింతక శక్తి నిరాశ నుండి దిల్ ఖుష్ గా (సంతోషంగా) చేస్తుంది. ఉదాహరణకు మునిగిపోతున్న మనిషికి గడ్డిపరక ఆధారం కూడా మనసును సంతోషపరుస్తుంది, ధైర్యాన్ని అందిస్తుంది. కనుక మీ శుభ చింతక స్థితి వారికి ఆధారంగా అనుభవమవుతుంది, కాలిపోతున్న ఆత్మలకు శీతలమైన జలము యొక్క అనుభూతి అవుతుంది.

సర్వల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఆధారము కూడా శుభ చింతక స్థితియే. ఎవరైతే సర్వుల పట్ల శుభ చింతకులుగా ఉంటారో, వారికి సర్వుల నుండి స్వతహాగానే సహయోగము ప్రాప్తిస్తుంది. శుభ చింతక భావన ఇతరుల మనసులలో సహయోగ భావనను సహజంగా మరియు స్వతహాగా ఉత్పన్నం చేస్తుంది. శుభ చింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరి మనసులో స్నేహం ఉత్పన్నమవుతుంది, ఆ స్నేహమే సహయోగులుగా చేస్తుంది. ఎక్కడైతే స్నేహముంటుందో, అక్కడ సమయము, సంపద, సహయోగమును సదా బలిహారం చేసేందుకు తయారుగా ఉంటారు. కనుక శుభ చింతక స్థితి స్నేహీగా చేస్తుంది మరియు ఆ స్నేహము అన్ని రకాల సహయోగంలో బలిహారం చేయిస్తుంది. అందుకే, సదా శుభ చింతనతో సంపన్నంగా ఉండండి, శుభ చింతకులుగా అయి సర్వులను స్నేహీలుగా, సహయోగులుగా చేయండి. శుభ చింతక ఆత్మ సహజంగానే సర్వుల నుండి సంతుష్టతా సర్టిఫికెట్ ను తీసుకోగలదు. శుభ చింతకులే సదా ప్రసన్నతా పర్సనాలిటీలో ఉండగలరు, విశ్వం ముందు విశేషమైన పర్సనాలిటీ కలవారిగా అవ్వగలరు. ఈ రోజుల్లో పర్సనాలిటీ కలిగిన ఆత్మలు కేవలం ప్రసిద్ధమవుతారు అనగా వారి పేరు ప్రసిద్ధమవుతుంది కానీ ఆత్మిక పర్సనాలిటీ కలిగిన మీరు కేవలం ప్రసిద్ధమవ్వడం అనగా గాయన యోగ్యులుగా అవ్వడమే కాదు, గాయన యోగ్యులుగా అవ్వడంతోపాటు పూజ్యనీయ యోగ్యులుగా కూడా అవుతారు. ధర్మ క్షేత్రంలో, రాజ్య క్షేత్రంలో, సైన్సు క్షేత్రంలో ఎంత గొప్ప పర్సనాలిటీ కలిగినవారిగా ప్రసిద్ధమైనా సరే, ఆత్మిక పర్సనాలిటీ గల మీ సమానంగా 63 జన్మలు పూజ్యనీయులుగా అవ్వలేరు కనుక ఇది శుభ చింతకులుగా అయ్యే విశేషత. అందరికీ సంతోషము, ఆధారము, ధైర్యమనే రెక్కలు, ఉల్లాస-ఉత్సాహాల ప్రాప్తి ఏదైతే కలుగుతుందో, ఈ ప్రాప్తి యొక్క ఆశీర్వాదాలు కొందరిని అధికారీ పిల్లలుగా చేస్తాయి, మరికొందరు భక్త ఆత్మలుగా అవుతారు కనుక అనేక జన్మలకు పూజ్యులుగా అవుతారు. శుభ చింతకులనగా బహుకాలపు పూజ్య ఆత్మలు. కనుక ఈ విశాల కార్యాన్ని ప్రారంభించడంతో పాటు, ఎలాగైతే ఇతర ప్రోగ్రామ్ లు తయారుచేస్తారో, దానితో పాటు స్వయం పట్ల కూడా ఈ విధంగా ప్రోగ్రామ్ తయారుచేయండి -

1. సదా కొరకు ప్రతి ఆత్మ పట్ల అనేక రకాల వేరే భావనలను పరివర్తన చేసి ఒకే శుభ చింతక భావనను సదా పెట్టుకుంటాము.

2. సర్వులను స్వయం కంటే ముందుకు తీసుకువెళ్ళే, ముందు ఉంచే, శ్రేష్ఠ సహయోగాన్ని సదా ఇస్తూ ఉంటాము.

3. బెటర్ వరల్డ్ అనగా శ్రేష్ఠమైన విశ్వాన్ని తయారుచేసేందుకు సర్వుల పట్ల శ్రేష్ఠకామన ద్వారా సహయోగులుగా అవుతాము.

4. సదా వ్యర్థ చింతన, పరచింతనను సమాప్తం చేసి అనగా గడిచిపోయిన విషయాలకు బిందువు పెట్టి, బిందువు అనగా మణిగా అయి సదా విశ్వానికి, సర్వులకు తమ శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన, స్నేహ భావన, సమర్థంగా చేసే భావనా కిరణాల ద్వారా ప్రకాశాన్ని ఇస్తూ ఉంటాము.

స్వయం యొక్క ఈ ప్రోగ్రామ్, మొత్తం ప్రోగ్రామ్ యొక్క సఫలతకు పునాది. ఈ పునాదిని సదా దృఢంగా పెట్టుకున్నట్లయితే ప్రత్యక్షతా శబ్దము స్వతహాగా ప్రసిద్ధమవుతుంది. అర్థమయిందా? అందరూ కార్యానికి నిమిత్తులే కదా? విశ్వాన్ని సహయోగులుగా చేసుకుంటున్నారు కానీ మొదట మీరు నిమిత్తులు. చిన్నవారు, పెద్దవారు, అనారోగ్యంగా ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, మహారథులు, గుర్రపుస్వారి వారు - అందరూ సహయోగులే. పాదచారులు అయితే లేనే లేరు. కనుక అందరి వేలు (సహయోగం) కావాలి. ప్రతి ఇటుకకు మహత్వముంది. కొన్ని పునాదిలోని ఇటుకలు, కొన్ని పైనున్న గోడలలోని ఇటుకలు కానీ ఒక్కొక్క ఇటుక మహత్వము కలిగినది. మీరందరూ, మేము ప్రోగ్రామ్ చేస్తున్నామని భావిస్తున్నారా లేదా ప్రోగ్రామ్ తయారుచేసేవారు ప్రోగ్రామ్ ను చేస్తున్నారని భావిస్తున్నారా. ఇది తయారుచేసేవారి ప్రోగ్రామ్ అని భావిస్తున్నారా? మా ప్రోగ్రామ్ అని అంటారు కదా. కనుక బాప్ దాదా, పిల్లల యొక్క విశాలమైన కార్యాన్ని, ప్రోగ్రామ్ ను చూసి హర్షితులుగా ఉన్నారు. దేశ విదేశాలలో విశాలమైన కార్యం చేయాలనే ఉల్లాస ఉత్సాహాలు బాగున్నాయి. ప్రతి బ్రాహ్మణాత్మలో విశ్వాత్మల కొరకు, మా సోదరీ-సోదరులందరూ తండ్రి తమ కార్యాన్ని చేస్తున్నారనే ప్రత్యక్షతా శబ్దాన్ని వినాలనే దయ, జాలి ఉంది. సమీపంగా రావాలి, సంబంధంలోకి రావాలి, అధికారులుగా అవ్వాలి, పూజ్య దేవతలుగా అవ్వాలి లేదా 33 కోట్ల పేరును గాయనము చేసేవారుగానైనా అవ్వాలి కానీ శబ్దాన్ని తప్పకుండా వినాలనే ఉల్లాసము ఉంది కదా? ఇప్పుడైతే 9 లక్షల మందిని కూడా తయారుచెయ్యలేదు. కనుక అర్థమయిందా, ఇది మీ ప్రోగ్రామ్. మాది అనే భావనే మీ ప్రోగ్రామ్ లో మీ విశ్వాన్ని తయారుచేస్తుంది. అచ్ఛా.

ఈ రోజు 5 వైపుల నుండి పార్టీలు వచ్చాయి. త్రివేణి అని అంటారు కానీ ఇది పంచవేణిగా అయింది. 5 వైపుల నుండి నదులు సాగరంలోకి వచ్చి చేరుకున్నాయి. కనుక నదులు మరియు సాగరముల మేళా, శ్రేష్ఠమైన మేళా. కొత్తవారు, పాతవారు అందరూ సంతోషంలో నాట్యం చేస్తున్నారు. ఎప్పుడైతే నిరాశ ఆశలోకి మారుతుందో, అప్పుడు మరింత సంతోషం కలుగుతుంది. పాతవారికి కూడా అకస్మాత్తుగా అవకాశం లభించింది కనుక ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఎప్పుడు కలుస్తామో తెలియదు అని ఆలోచిస్తూ కూర్చున్నారు. ఇప్పుడు కలుస్తాము అనేది ఆలోచించను కూడా ఆలోచించలేదు. ‘ఎప్పుడు’ అనేది ‘ఇప్పుడు’ గా అయిపోతే ఆ సంతోషం యొక్క అనుభవము ఇంకా అతీతంగా ఉంటుంది. అచ్ఛా. ఈ రోజు విశేషంగా విదేశీయులకు కూడా ప్రియస్మృతులు ఇస్తున్నారు. విశేషమైన సేవాధారి (జయంతి అక్కయ్య) వచ్చారు కదా. విదేశ సేవార్థము మొదట నిమిత్తులుగా అయ్యారు కదా. వృక్షాన్ని చూసి బీజము గుర్తుకొస్తుంది. విదేశ సేవ కొరకు ఈ బీజరూప పరివారము నిమిత్తంగా అయింది. కనుక మొదట నిమిత్త పరివారానికి స్మృతి ఇస్తున్నాము.

విదేశంలోని సర్వ నిమిత్త సేవాధారి పిల్లలు సదా తండ్రిని ప్రత్యక్షం చేసే ప్రయత్నంలో ఉల్లాస-ఉత్సాహాలతో రాత్రింబవళ్ళు నిమిగ్నమై ఉన్నారు. వారి చెవులలో పదే-పదే ఇదే శబ్దము మోగుతూ ఉంటుంది - విదేశాల ప్రతిధ్వని ద్వారానే భారతదేశంలో తండ్రి ప్రత్యక్షత జరగుతుంది అని. ఈ శబ్దమే సదా సేవలో అడుగులు ముందుకు వేయిస్తూ ఉంటుంది. విశేషంగా సేవలో ఉల్లాస-ఉత్సాహాలకు కారణం - తండ్రి పట్ల హృదయపూర్వకమైన ప్రేమ మరియు స్నేహము. ప్రతి అడుగులో, ప్రతి క్షణము నోటిలో ‘బాబా-బాబా’ అనే పదము ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా కార్డును లేక కానుకను పంపిస్తే, అందులో హృదయం (హార్ట్) చిత్రాన్ని తప్పకుండా వేస్తారు. దీనికి కారణమేమిటంటే హృదయంలో సదా హృదయాభిరాముడు ఉన్నారు. హృదయాన్ని ఇచ్చారు మరియు హృదయాన్ని తీసుకున్నారు. ఇవ్వడం మరియు తీసుకోవడంలో సదా తెలివైనవారు కనుక హృదయంతో వ్యాపారం చేసేవారు, హృదయంతో స్మృతి చేసేవారు, తమ ‘హృదయం’ గుర్తునే పంపిస్తారు. ఈ హృదయపూర్వక స్మృతి మరియు హృదయపూర్వక స్నేహము దూరంగా ఉన్నా కానీ మెజారిటీవారికి సమీపము యొక్క అనుభవాన్ని చేయిస్తుంది. బాప్ దాదా అన్నింటికంటే విశేషమైన విశేషతగా ఏమి చూస్తున్నారంటే, బ్రాహ్మాబాబా పట్ల అతి స్నేహముంది. తండ్రి మరియు దాదాల లోతైన రహస్యాన్ని చాలా సహజంగా అనుభవంలోకి తీసుకొస్తారు. బ్రహ్మాబాబా యొక్క సాకార పాలన పాత్ర లేకపోయినా సరే అవ్యక్త పాలన యొక్క అనుభవాన్ని బాగా చేస్తున్నారు. తండ్రి మరియు దాదా, ఇరువురి సంబంధాన్ని అనుభవం చేయడము - ఈ విశేషత కారణంగా తమ సఫలతలో చాలా సహజంగా ముందుకు వెళ్తున్నారు. కనుక ప్రతి దేశం వారు, మా పేరు మొదట ఉందని భావించండి. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పేరుగా భావిస్తూ బాప్ దాదాల ప్రియస్మృతులను స్వీకరించండి. అర్థమయిందా?

ప్లాన్లు అయితే తయారుచేస్తూనే ఉన్నారు. దేశ విదేశాల పద్ధతులలో ఎంతో కొంత తేడా అయితే ఉంటుంది కానీ ప్రీతి కారణంగా పద్ధతిలో తేడా ఉన్నా ఒకటేలా అనిపిస్తుంది. విదేశాల ప్లాన్ అయినా లేక భారతదేశ ప్లాన్ అయినా కానీ, ప్లాన్ అయితే ఒక్కటే. కేవలం కొద్దిగా పద్ధతిని అక్కడక్కడ ఎంతో కొంత పరివర్తన చేయాల్సి వస్తుంది. దేశ విదేశాల సహయోగము ఈ విశాలమైన కార్యంలో సదా సఫలతను ప్రాప్తి చేయిస్తూనే ఉంటుంది. సఫలత అయితే సదా పిల్లలతో ఉండనే ఉంటుంది. దేశం వారి ఉల్లాస-ఉత్సాహాలు, విదేశాల వారి ఉల్లాస-ఉత్సాహాలు - ఇరువురివి కలిసి కార్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి మరియు సదా ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి. అచ్ఛా.

భారతదేశంలో నలువైపులా ఉన్న సదా స్నేహీ, సహయోగీ పిల్లల స్నేహ-సహయోగాల శుభ సంకల్పము, శుభ శబ్దము బాప్ దాదా వద్దకు సదా చేరుకుంటూ ఉంటాయి. దేశ విదేశాలు ఒకరి కంటే ఇంకొకరు ముందు ఉన్నారు. ప్రతి స్థానానికి తమ తమ విశేషత ఉంది. భారతదేశము తండ్రి అవతరణ భూమి, అంతేకాక ప్రత్యక్షతా శబ్దాన్ని ప్రసిద్ధం చేసేందుకు నిమిత్తమైన భూమి. ఆది మరియు అంతిమ పాత్ర భారతదేశంలోనే ఉంది. విదేశ సహయోగము భారతదేశంలో ప్రత్యక్షత చేయిస్తుంది మరియు భారతదేశంలోని ప్రత్యక్షతా శబ్దము విదేశము వరకు చేరుకుంటుంది కనుక భారతదేశంలోని పిల్లల విశేషత సదా శ్రేష్ఠంగా ఉంది. భారతదేశం వారు స్థాపనకు ఆధారంగా అయ్యారు. భారతదేశ పిల్లలు స్థాపనకు ఆధారమూర్తులుగా అయ్యారు కనుక భారతవాసి పిల్లల భాగ్యాన్ని అందరూ మహిమ చేస్తారు. స్మృతి మరియు సేవలలో సదా ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూనే ఉంటారు కనుక భారతదేశ పిల్లలు ప్రతి ఒక్కరు తమ-తమ పేరు సహితంగా బాప్ దాదాల ప్రియస్మృతులను స్వీకరించండి. కనుక దేశ విదేశాలలోని అనంతమైన తండ్రి యొక్క అనంతమైన సేవాధారి పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments