31-03-1986 అవ్యక్త మురళి

 31-03-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సర్వ శక్తి సంపన్నులుగా అయ్యే మరియు వరదానాలను పొందే సంవత్సరము”

ఈ రోజు సర్వ ఖజానాల యజమాని, తమ మాస్టర్ పిల్లలను చూస్తున్నారు. బాలకుల నుండి యజమానులుగా ఎంతవరకు అయ్యారో చూస్తున్నారు. ఈ సమయంలోని శ్రేష్ఠమైన ఆత్మలు, ఎవరైతే సర్వ శక్తులకు, సర్వ ఖజానాలకు యజమానులుగా అవుతారో, వారి ఆ యజమానత్వము యొక్క సంస్కారము భవిష్యత్తులో కూడా విశ్వానికి యజమానులుగా తయారుచేస్తుంది. మరి ఏమి చూశారు? అందరూ బాలకులుగా అయితే ఉన్నారు, తండ్రి మరియు నేను అనే తపన పిల్లలందరిలో బాగా ఏర్పడింది. బాలకులము అనే నషా అయితే అందరిలోనూ ఉంది కానీ బాలకుల నుండి యజమానులు అంటే తండ్రి సమానంగా సంపన్నము. కనుక బాలకులుగా ఉండే స్థితి మరియు యజమానులుగా ఉండే స్థితి, వీటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని చూశారు. యజమానత్వము అనగా ప్రతి అడుగు స్వతహాగానే, స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల కూడా సంపన్న స్థితిలో ఉంటుంది. దీనినే మాస్టర్ గా అనగా బాలకుల నుండి యజమానులుగా అవ్వడమని అంటారు. యజమానత్వము యొక్క విశేషత - ఎంతగా యజమానత్వము యొక్క నషా ఉంటుందో, అంతగా విశ్వ సేవాధారి యొక్క సంస్కారం సదా ఇమర్జ్ (ప్రత్యక్ష) రూపంలో ఉంటుంది. ఎంతగా యజమానత్వము యొక్క నషా ఉంటుందో, అంతగా విశ్వ సేవాధారిని అనే నషా కూడా ఉంటుంది. రెండింటిలో సమానత ఉండాలి. ఇదే తండ్రి సమానంగా యజమానులుగా అవ్వడము. కనుక బాలకులు మరియు యజమానులు అనే ఈ రెండు స్వరూపాలు సదా ప్రత్యక్ష కర్మల్లోకి వస్తున్నాయా లేక కేవలం జ్ఞానము వరకేనా అన్న రిజల్టును చూస్తూ ఉన్నారు! అయితే జ్ఞానము మరియు ప్రత్యక్ష కర్మలో వ్యత్యాసముంది. చాలామంది పిల్లలు ఈ రెండింటి సమానతలో, తండ్రి సమానమైన ప్రత్యక్ష కర్మల రూపంలో బాగా కనిపించారు. చాలామంది పిల్లలు ఇప్పటికీ బాలకుల స్థితిలోనే ఉంటున్నారు కానీ యజమానత్వము యొక్క ఆ ఆత్మిక నషాలో, తండ్రి సమానంగా అయ్యే శక్తిశాలి స్థితిలో అప్పుడప్పుడు స్థితులవుతారు మరియు అప్పుడప్పుడు ఆ స్థితిలో స్థితి అయ్యే ప్రయత్నంలోనే సమయం గడిచిపోతుంది.

పిల్లలందరికీ తండ్రి సమానంగా అవ్వవలసిందే అన్న శ్రేష్ఠమైన లక్ష్యము ఉంది. లక్ష్యము శక్తిశాలిగా ఉంది. ఇప్పుడు లక్ష్యాన్ని సంకల్పము, మాట, కర్మ, సంబంధ-సంపర్కములోకి తీసుకురావాలి. ఇందులో వ్యత్యాసం వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు సంకల్పము వరకు సమాన స్థితిలో స్థితులవుతారు. కొందరు సంకల్పముతో పాటు మాటల వరకు కూడా వస్తారు, అప్పుడప్పుడు కర్మల వరకు కూడా వచ్చేస్తారు. కానీ ఎప్పుడైతే సంబంధ-సంపర్కంలోకి వస్తారో, సేవా సంబంధంలోకి వస్తారో, పరివార సంబంధంలోకి వస్తారో, ఈ సంబంధ-సంపర్కంలోకి వచ్చేటప్పుడు ఒక్కోసారి పర్సంటేజ్ తక్కువ అవుతుంది. తండ్రి సమానంగా అవ్వడమనగా ఒకే సమయంలో సంకల్పము, మాట, కర్మ, సంబంధము, అన్నింటిలోనూ తండ్రి సమానమైన స్థితిలో ఉండడం. కొందరు రెండింటిలో ఉంటారు, కొందరు మూడింటిలో ఉంటారు. కానీ ఏవైతే నాలుగు స్థితులు తెలిపామో, వాటిలో ఒకసారి ఒకలా, మరోసారి మరొకలా అవుతారు. బాప్ దాదా అయితే పిల్లల పట్ల సదా అతి స్నేహీలుగా కూడా ఉన్నారు. స్నేహ స్వరూపమనగా కేవలం అవ్యక్తంలో ఉన్నవారిని వ్యక్త రూపంలో కలవడం కాదు. కానీ స్నేహ స్వరూపమనగా సమానంగా అవ్వడం. చాలామంది పిల్లలు బాప్ దాదా నిర్మోహిగా అవుతున్నారని భావిస్తారు. కానీ ఇది నిర్మోహులుగా అవ్వడం కాదు. ఇది విశేషమైన స్నేహ స్వరూపము.

బహుకాలపు ప్రాప్తిని పొందే సమయము ఇప్పుడు లెక్కప్రకారం చాలా తక్కువగా ఉంది కనుక బాప్ దాదా పిల్లలకు సదా బహుకాలము కొరకు విశేషంగా, దృఢత యొక్క తపస్సు ద్వారా స్వయాన్ని తాపముతో దృఢంగా చేసుకునేందుకు, పరిపక్వంగా చేసుకునేందుకు ఈ విశేషమైన సమయాన్ని ఇస్తున్నారని బాప్ దాదా మొదటే వినిపించారు. గోల్డెన్ జూబ్లీలో కూడా అందరూ మేము సమానంగా అవుతాము, విఘ్నవినాశకులుగా అవుతాము, సమాధాన స్వరూపులుగా అవుతాము అనే సంకల్పము చేశారు. ఈ ప్రతిజ్ఞలన్నీ తండ్రి వద్ద చిత్రగుప్తుని రూపంలో లెక్కలను తెలిపే ఖాతాలో నోట్ అయ్యి ఉన్నాయి. ఈ రోజు కూడా ఎంతో మంది పిల్లలు దృఢ సంకల్పం చేశారు. సమర్పణ అవ్వడం అనగా స్వయాన్ని సర్వ ప్రాప్తులలో పరిపక్వంగా చేసుకోవడం. సమర్పణత అంటేనే అర్థం - సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు సంబంధము, ఈ నాల్గింటిలోనూ తండ్రి సమానంగా అవ్వడం. ఏవైతే ఉత్తరాలు వ్రాసి ఇచ్చారో, ఆ ఉత్తరాలు మరియు సంకల్పాలు సూక్ష్మవతనంలో బాప్ దాదా వద్ద సదా కొరకు రికార్డులో ఉండిపోయాయి. అందరి ఫైల్స్ అక్కడ వతనంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు చేసిన ఈ సంకల్పం అవినాశీగా అయ్యింది.

ఈ సంవత్సరము, పిల్లల యొక్క దృఢమైన తపస్సు ద్వారా ప్రతి సంకల్పాన్ని అమరంగా, అవినాశీగా చేసుకునేందుకు, దృఢమైన అభ్యాసము ద్వారా పదే-పదే స్వయంతో ఆత్మిక సంభాషణ చేసుకునేందుకు, రియలైజేషన్ చేసుకునేందుకు మరియు అవతార స్వరూపంగా అయ్యి కర్మల్లోకి వచ్చేందుకు, ఈ స్థితిని సదాకాలం కోసం ఇంకా దృఢంగా చేసుకునేందుకు, బాప్ దాదా ఈ సమయాన్ని ఇస్తున్నారు. అలాగే విశేషంగా శుద్ధ సంకల్పాల శక్తితో జమ ఖాతాను ఇంకా పెంచుకోవాలి. శుద్ధ సంకల్పాల శక్తి యొక్క విశేషమైన అనుభవాన్ని ఇప్పుడింకా అంతర్ముఖులుగా అయి చేయాల్సిన అవసరము ఉంది. శుద్ధ సంకల్పాల శక్తి సహజంగా వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసి, ఇతరుల పట్ల కూడా శుభ భావన, శుభ కామనల స్వరూపంతో వారిని పరివర్తన చెయ్యగలరు. ఇప్పుడు ఈ శుద్ధ సంకల్పాల శక్తి యొక్క విశేషమైన అనుభవం సహజంగానే వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేస్తుంది. కేవలం మీ వ్యర్థ సంకల్పాలనే కాదు, మీ శుద్ధ సంకల్పాలు, ఇతరుల పట్ల కూడా శుభ భావన, శుభ కామనల స్వరూపంతో వారిని పరివర్తన చెయ్యగలవు. ఇప్పుడు ఈ శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాకును స్వయం పట్ల కూడా జమ చేసుకునే అవసరము ఎంతో ఉంది. మురళీ వినాలి అన్న తపన అయితే చాలా బాగుంది. మురళీ అనగా ఖజానా. మురళీలోని ప్రతి పాయింటును శక్తి రూపంలో జమ చేసుకోవడం - ఇదే శుద్ధ సంకల్పాల శక్తిని పెంచుకోవడం. శక్తి రూపంలో ప్రతి సమయం కార్యంలో ఉపయోగించండి. ఇప్పుడు ఈ విశేషతపై విశేషమైన అటెన్షన్ పెట్టాలి. శుద్ధ సంకల్పాల శక్తి యొక్క మహత్వాన్ని ఇప్పుడు ఎంతగా అనుభవం చేస్తూ ఉంటారో, మనసా సేవ చేసేందుకు కూడా అంతే సహజ అనుభవీలుగా అవుతూ ఉంటారు. మొదట స్వయం పట్ల శుద్ధ సంకల్పాల శక్తి జమ అయ్యి ఉండాలి, దీనితోపాటు మీరందరూ తండ్రితో పాటు విశ్వ కళ్యాణకారి ఆత్మలు, విశ్వ పరివర్తక ఆత్మలుగా ఉన్నారు. కనుక విశ్వం పట్ల కూడా ఈ శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా పరివర్తన చేసే కార్యము ఇంకా చాలా మిగిలి ఉంది. ఉదాహరణకు వర్తమాన సమయంలో బ్రహ్మా తండ్రి అవ్యక్త రూపధారిగా అయి శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా మీ అందరి పాలన చేస్తున్నారు. సేవ వృద్ధి కోసం సహయోగిగా అయి ముందుకు తీసుకువెళ్తున్నారు. శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా ఈ విశేషమైన సేవ నడుస్తూ ఉంది. కనుక ఇప్పుడు బ్రహ్మా తండ్రి సమానంగా ఈ విశేషతను మీలో పెంచుకునేందుకు తపస్సు రూపంలో అభ్యాసం చెయ్యాలి. తపస్సు అనగా దృఢతా సంపన్నమైన అభ్యాసము. సాధారణతను తపస్సు అని అనరు కనుక ఇప్పుడు తపస్సు కోసం సమయాన్ని ఇస్తున్నాము. ఇప్పుడే ఎందుకు ఇస్తున్నాము? ఎందుకంటే ఈ సమయంలో మీకు బహుకాలం కోసం జమ అవుతుంది. బాప్ దాదా అందరికీ బహుకాలపు ప్రాప్తి చేయించేందుకు నిమిత్తంగా ఉన్నారు. బాప్ దాదా పిల్లలందరినీ బహుకాలపు రాజ్య భాగ్యానికి అధికారులుగా చేయాలని ఆశిస్తున్నారు. బహుకాలపు సమయం ఇక కొద్దిగానే ఉంది కనుక ప్రతి విషయాన్ని తపస్సు రూపంలో అభ్యాసం చేసేందుకు ఈ విశేషమైన సమయాన్ని ఇస్తున్నారు ఎందుకంటే ఇక సమయం ఎటువంటిది వస్తుందంటే - మీరందరూ దాతలుగా, వరదాతలుగా అయి కొద్ది సమయంలోనే అనేకమందికి ఇవ్వాల్సి వస్తుంది. కనుక సర్వ ఖజానాల జమ ఖాతాను సంపన్నంగా చేసుకునేందుకు సమయాన్ని ఇస్తున్నారు.

రెండవ విషయము - విఘ్నవినాశకులుగా మరియు సమాధాన స్వరూపులుగా అవుతాము అన్న ప్రతిజ్ఞ చేసారు కనుక స్వయం పట్ల మరియు సర్వుల పట్ల కూడా విఘ్నవినాశకులుగా అయ్యేందుకు విశేషంగా దృఢ సంకల్పము మరియు దృఢ స్వరూపము రెండూ ఉండాలి. కేవలం సంకల్పమే కాదు స్వరూపం కూడా ఉండాలి. కనుక ఈ సంవత్సరం బాప్ దాదా అదనపు ఛాన్స్ ఇస్తున్నారు. ఎవరైతే విఘ్నవినాశకులుగా అయ్యే విశేషమైన భాగ్యాన్ని తీసుకోవాలనుకుంటారో, వారు ఈ సంవత్సరంలో తీసుకోవచ్చు. ఈ సంవత్సరానికి విశేషమైన వరదానముంది. కానీ వరదానమును తీసుకునేందుకు విశేషంగా రెండు విషయాలపై అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. మొదటిది - సదా తండ్రి సమానంగా ఇచ్చేవారిగా అవ్వాలి, తీసుకునే భావన పెట్టుకోకూడదు. గౌరవము లభిస్తే, స్నేహము లభిస్తే, అప్పుడు స్నేహీలుగా అవ్వడము, గౌరవం లభించినప్పుడు గౌరవం ఇవ్వడము, ఇలా కాదు. దాత సంతానంగా అయి నేను ఇవ్వాలి, తీసుకునే భావన పెట్టుకోకూడదు. శ్రేష్ఠ కర్మలు చేస్తూ రెండవ వైపు నుండి నాకు లభించాలి అనే భావన పెట్టుకోకూడదు. శ్రేష్ఠ కర్మల ఫలితం శ్రేష్ఠంగా ఉండనే ఉంటుంది. ఈ జ్ఞానమైతే మీకు తెలుసు, కానీ చేసే సమయంలో ఈ సంకల్పాన్ని పెట్టుకోకూడదు. కనుక మొదటిది ఏమిటంటే, వరదానము తీసుకునేందుకు పాత్రులుగా అవ్వాలంటే సదా దాతలుగా ఉండాలి మరియు రెండవది - విఘ్నవినాశకులుగా అవ్వాలి, కనుక ఇముడ్చుకునే శక్తిపై సదా విశేషమైన రూపంలో అటెన్షన్ ఉంచాలి. స్వయం పట్ల కూడా ఇముడ్చుకునే శక్తి అవసరము. మీరు సాగరుని పిల్లలు, సాగరము యొక్క విశేషతయే ఇముడ్చుకోవడం. ఎవరిలోనైతే ఇముడ్చుకునే శక్తి ఉంటుందో, వారికే శుభ భావన, కళ్యాణ కామన ఉంటుంది కనుక దాతలుగా అవ్వండి, ఇముడ్చుకునే శక్తి స్వరూప సాగరులుగా అవ్వండి. ఈ రెండు విశేషతలను సదా కర్మల వరకు తీసుకురావాలి. చాలాసార్లు చాలామంది పిల్లలు - మేము ఇదే చేయాలని అనుకున్నాము కానీ చేసేంతలో మారిపోయింది అని అంటారు. కనుక ఈ సంవత్సరం నాలుగు విషయాలలోనూ ఒకే సమయంలో సమానత ఉండే విశేషమైన అభ్యాసము చేయాలి. అర్థమయిందా! కనుక ఒక విషయము - ఖజానాలను జమ చేసుకొని, దాతగా అయ్యి, ఇచ్చే సంస్కారాన్ని సహజ రూపంలో ధారణ చేసేందుకు సమయాన్ని ఇస్తున్నాము. కనుక విఘ్నవినాశకులుగా అయ్యి ఇతరులను కూడా అలా తయారుచేసేందుకు, సదాకాలానికి మీ నంబరును నిశ్చితం చేసుకునే అవకాశమిస్తున్నాము. ఏమి జరిగినా కానీ స్వయం తపస్సు చేయండి మరియు ఇతరుల విఘ్నాలను సమాప్తం చేసేందుకు సహయోగులుగా అవ్వండి. స్వయం ఎంతగా వంగాల్సి వచ్చినా కానీ ఇలా వంగడం అనగా సదా కొరకు ఊయలలో ఊగడం. ఎలాగైతే శ్రీకృష్ణుడిని ఎంతో ప్రేమగా ఊపుతూ ఉంటారో, అలా తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తమ ఒడి అనే ఊయలలో ఊపుతారు, తర్వాత భవిష్యత్తులో రత్నజడిత ఊయలలో ఊగుతారు, అంతేకాక భక్తిలో పూజ్యులుగా అయ్యి ఊయలలో ఊగుతారు. కనుక వంగడం, మరణించడము అన్నది మహానత. నేనెందుకు వంగాలి, వీళ్ళు వంగాలి, ఇందులో స్వయాన్ని తక్కువగా భావించకండి. ఇలా వంగడం అన్నది మహానత. ఇలా మరణించడం, మరణించడం కాదు, అవినాశీ ప్రాప్తులలో జీవించడం కనుక సదా విఘ్నవినాశకులుగా అవ్వాలి మరియు ఇతరులను కూడా తయారుచెయ్యాలి. ఇందులో ఫస్ట్ డివిజన్ లోకి వచ్చే అవకాశాన్ని ఎవరు కావాలంటే వారు తీసుకోవచ్చు. ఈ విశేషమైన అవకాశాన్ని తీసుకునే సమయం యొక్క మహత్వాన్ని బాప్ దాదా వినిపిస్తున్నారు. కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని తపస్సు చేయండి.

మూడవ విషయం - సమయానుసారంగా వాయుమండలంలో అశాంతి మరియు అలజడి ఎంతగా పెరుగుతూ వెళ్తున్నాయో దాని అనుసారంగా బుద్ధి రూపి లైను చాలా స్పష్టంగా ఉండాలి ఎందుకంటే సమయానుసారంగా టచింగ్ మరియు క్యాచింగ్ ఈ రెండు శక్తుల అవసరము ఉంది. ఒకటేమో బాప్ దాదా ఇచ్చే డైరెక్షన్లను (సూచనలు) బుద్ధి ద్వారా క్యాచ్ చెయ్యగలగాలి. ఒకవేళ లైను క్లియర్గా లేకపోతే తండ్రి ఇచ్చే డైరెక్షన్ లో మన్మతము కూడా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ అయిన కారణంగా సమయానికి మోసపోగలరు. ఎంతగా బుద్ధి స్పష్టంగా ఉంటుందో, తండ్రి ఇచ్చే డైరక్షన్ ను అంతే స్పష్టంగా క్యాచ్ చెయ్యగలరు. మరియు బుద్ధి లైను ఎంతగా క్లియర్గా ఉంటుందో, అంతగా స్వ ఉన్నతి పట్ల, సేవా వృద్ధి పట్ల మరియు సర్వ ఆత్మల పట్ల దాతగా అయ్యి, ఇచ్చే శక్తులు సహజంగా పెరుగుతూ ఉంటాయి మరియు ఈ సమయంలో ఈ ఆత్మ పట్ల సహజమైన సేవా సాధనము లేక స్వ ఉన్నతికి యథార్థమైన సాధనము ఇదే అని టచింగ్ అవుతుంది. కనుక వర్తమాన సమయ ప్రమాణంగా ఈ రెండు శక్తులు చాలా అవసరము. వీటిని పెంచుకునేందుకు ఏక్ నామీ (ఒక్కరి నామము) మరియు ఎకానమీ (పొదుపు) కలవారిగా అవ్వండి. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఇతరుల పట్ల ఆకర్షణ వేరే విషయము. ఆకర్షణ కలగడం అనేది ఎలాగో తప్పే కానీ ఇతరుల స్వభావాల ప్రభావము మీ స్థితిని అలజడిలోకి తీసుకొస్తుంది. ఇతరుల సంస్కారము బుద్ధిని ఘర్షణలోకి తీసుకొస్తుంది. ఆ సమయము బుద్ధిలో బాబా ఉన్నారా లేక సంస్కారముందా? ఆకర్షణ రూపంలో బుద్ధిని ప్రభావితం చేసినా కానీ, ఘర్షణ రూపంలో బుద్ధిని ప్రభావితం చేసినా కానీ బుద్ధి లైను సదా క్లియర్ గా ఉండాలి. దీనినే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు. ఏక్ నామీ, ఎకానమీ అంటే ఏమిటి? కేవలం స్థూల ధనాన్ని పొదుపు చేయడాన్ని ఎకానమీ అని అనరు. అది కూడా అవసరమే కానీ సమయం కూడా ధనమే, సంకల్పము కూడా ధనమే, శక్తులు కూడా ధనమే, వీటన్నిటినీ పొదుపు చేయాలి. వ్యర్థంగా పోగొట్టుకోకండి. ఎకానమీ చేయడమనగా జమ ఖాతాను పెంచుకోవడం. ఏక్ నామీ మరియు ఎకానమీ సంస్కారం కలవారు ఈ రెండు శక్తులను (టచింగ్ మరియు క్యాచింగ్ పవర్) అనుభవం చెయ్యగలరు. ఈ అనుభవాన్ని వినాశన సమయంలో చెయ్యలేరు, ఈ అభ్యాసము ఇప్పటి నుండే చెయ్యాలి. ఈ అభ్యాసము కారణంగా సమయానికి చివర్లో శ్రేష్ఠ మతమును మరియు గతిని పొందగలరు. ఉదాహరణకు ఇప్పుడు వినాశనానికి ఇంకా కొంత సమయం ఉందనుకోండి, సరే, ఒకవేళ 10 సంవత్సరాలని అనుకుంటే, ఆ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పురుషార్థము చెయ్యలేరు. ఎంత శ్రమ చేసినా సరే, చెయ్యలేరు. బలహీనంగా అయిపోతారు. తర్వాత అంతిమ సమయం యుద్ధంలో గడిచిపోతుంది. సఫలతలో కాదు. త్రేతాయుగం వారిగా అయితే అవ్వకూడదు కదా. శ్రమ అనగా విల్లు-బాణము. సదా ప్రేమలో ఉండడం, సంతోషంలో ఉండడం అనగా మురళీధరులుగా అవ్వడము, సూర్యవంశీయులుగా అవ్వడము. మురళీ నాట్యం చేయిస్తుంది మరియు విల్లు-బాణము గురి చూడడములో శ్రమ చేయిస్తాయి. కనుక విల్లు ధరించేవారిగా కాకుండా మురళీధరులుగా అవ్వాలి, ఇక చివర్లో మళ్ళీ కొంత అదనపు సమయం ఇవ్వండి, అవకాశమివ్వండి, కృప చూపించండి అని ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యకండి. అలా జరగదు కనుక ముందు నుండే వినిపిస్తున్నాము. వెనుక వచ్చినా లేక ముందు వచ్చినా సమయ ప్రమాణంగా అందరూ అంతిమ స్థితికి చేరుకునే సమయము. కనుక ఇలా తీవ్ర వేగంతో నడవాల్సి వస్తుంది. అర్థమయిందా. అచ్ఛా.

నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలందరికీ, సదా హృదయ సింహాసనాధికారి పిల్లలకు, సదా సంతుష్టత యొక్క మెరుపును చూపించే పిల్లలకు, సదా ప్రసన్నతా పర్సనాలిటీతో ఉండే పిల్లలకు, సదా అనంతమైన విశాల హృదయాన్ని, అనంతమైన విశాల బుద్ధిని ధారణ చేసే విశాలమైన ఆత్మలకు బాప్ దాదాల స్నేహ సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments