28-02-2010 అవ్యక్త మురళి

                        28-02-2010        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 "దేహభానపు నేను-నేను అన్నదాని హోలికను కాల్చివేసి పరమాత్ముని సాంగత్యపు రంగులో హోలీ జరుపుకోండి."

           ఈ రోజు హోలియస్ట్ బాబా తమ హోలీ పిల్లలతో హోలీ జరుపుకోవడానికి వచ్చారు. నలువైపుల ఉన్న పిల్లలు దూరదూరాల నుండి స్నేహంగా హృదయంలో ఇమిడిపోతున్నారు. బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల మస్తకంలో మెరుస్తున్న భాగ్య సితారను చూస్తున్నారు. ఇంత పెద్ద భాగ్యము పూర్తి కల్పంలో మరెవ్వరికీ ఉండదు. ఈ సంగమయుగపు ప్రాప్తుల ఆధారంతో పిల్లలైన మీరే ఇంతటి శ్రేష్ఠమైనవారిగా, పవిత్రులుగా అవుతారు. దీని ద్వారా మీరు భవిష్యత్తులో డబుల్ పవిత్రులుగా అవుతారు. ఆత్మ కూడా పవిత్రముగా మరియు శరీరము కూడా పవిత్రముగా ఉంటుంది. పూర్తి కల్పంలో తిరిగి చూడండి, ఏ ధర్మాత్మ కూడా డబుల్ పవిత్రంగా అవ్వలేదు. పిల్లలైన మీరు డబుల్ పవిత్రులుగా అవుతారు మరియు డబుల్ పవిత్రతకు గుర్తుగా- డబుల్ కిరీటధారులుగా కూడా అవుతారు.

           ఈ రోజు అందరూ హోలీ జరుపుకుంటారు, కానీ ఈ సమయంలో మీరు డబుల్ హోలీగా అయినందుకు స్మృతిచిహ్నంగానే ఉత్సవ రూపంలో హోలీ జరుపుకుంటున్నారు. మీ జీవితంలోని ప్రతి అడుగు అడుగులోని మహత్వం ఉత్సవం రూపంలో జరుగుతుంది. మీరు ఈ సంగమంలో ప్రతి రోజు, ప్రతి అడుగు ఉల్లాసము మరియు ఉత్సాహములలో ఉంటారు కనుక మీ ఉల్లాస ఉత్సాహాలకు గుర్తుగానే ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఉల్లాస ఉత్సాహాలు ఎందుకు ఉంటాయి? ఎందుకంటే మీరు పరమాత్ముని సాంగత్యపు రంగులో హోలీని జరుపుకుంటారు కాబట్టి. కావున మీ ప్రతి అడుగును ఉత్సవ రూపంలో జరుపుకుంటారు. ఇప్పుడు హోలీలో ముందుగా కాలుస్తారు, తర్వాత హోలీ జరుపుకుంటారు. మీరు కూడా సంగమంలో ఇప్పుడు మీ పాత సంస్కార స్వభావాలను యోగాగ్నిలో కాల్చివేస్తున్నారు, ఎందుకంటే మీలోని పాత సంస్కారాలను కాల్చనంత వరకు పరమాత్ముని సాంగత్యపు రంగు మీకు అంటుకోదు, పరమాత్మ మిలనము జరుగదు. అంటే మీరు యోగాగ్నిలో సంస్కారాలను కాల్చివేసారు, తర్వాత పరమాత్ముని సాంగత్యపు రంగులో మునిగారు. ఈ రోజుల్లో కాలుస్తున్నారు మరియు రంగులు కూడా వేసుకుంటున్నారు. మీ ఆధ్యాత్మిక రూపానికి వారు స్థూల రూపాన్ని ఇచ్చారు. వారు స్థూలమైన అగ్నిని వెలిగిస్తారు, స్థూలమైన రంగులు వేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడున్నది దేహాభిమానపు వృత్తి కనుక, మీరు హోలీగా అవుతారు, వారు హోలీని జరుపుకుంటారు. పూర్తి కల్పంలో మరెవ్వరూ ఆధ్యాత్మిక హోలీని జరుపుకుని డబుల్ హోలీగా అవ్వలేదు. కావున మీరందరూ, ఎక్కడినుండి వచ్చినా కానీ పరమాత్ముని సాంగత్యపు హోలీని జరుపుకునేందుకు వచ్చారు. పరమాత్ముని సాంగత్యపు హోలీని జరుపుకోవడానికి వచ్చారు. హోలీ అంటే ఏదైతే గడిచిపోయిందో అది హో లీ (గడిచిపోయింది) అని హోలీ గురించి మీరు అంటారు కదా! మరి డ్రామా అనుసారంగా ఏదైతే గడిచిపోయిందో దానిని హో లీ అని అంటాము, గడిచిపోయిందేదో గడిచిపోయింది. ఏ విధమైన వ్యర్థ విషయాన్ని చిత్తములోకి తీసుకోరు, గడిచిపోయింది, అంతే. ఇటువంటి హోలీని జరుపుకుంటూ ఉంటారు కదా. మీరందరూ హోలీ అనగా పవిత్రంగా అయ్యే పూర్తి పురుషార్థం చేసి పవిత్రతను ధారణ చేసారు, అందుకే భవిష్యత్తులో మీకు డబుల్ పవిత్రతకు గుర్తుగా డబుల్ కిరీటాన్ని చూపిస్తారు.

            మరి ఈ రోజు పిల్లలైన మీరందరూ దేనిని కాల్చి వెళ్తారు? జన్మదినం రోజున బాప్ దాదాకు క్రోధాన్ని జన్మదిన కానుకగా ఇచ్చేయండి అని ఏదైతే హోమ్ వర్కుగా ఇచ్చారో దాని రిజల్టు ఈ రోజు కొంతమంది పిల్లల నుండి బాప్ దాదాకు చేరుకుంది. అక్కడక్కడ పిల్లలు అటెన్షన్‌ను పెట్టడం బాప్ దాదా చూసారు. మీరందరూ కూడా మీ మీ రిజల్టును చూసుకుని ఉంటారు. ఎవరైతే ఈ రోజు ఇక్కడ కూర్చుని ఉన్నారో వారు తమ తమ రిజల్టును చూసుకున్నారా! ఎవరైతే తమ రిజల్టులో కంట్రోల్ చేసుకుని సఫలతను పొందారో వారు చేతులెత్తండి. సఫలతను పొందారా! చేతులు పెద్దగా ఎత్తండి. టీచర్లు చేతులు ఎత్తండి, విదేశీయులు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) అచ్ఛా! అభినందనలు. దీని వలన మీరందరూ స్వయంపై ధైర్యాన్ని ఉంచారు మరియు ధైర్యానికి ఫలితం ప్రాప్తించగలదు, అన్నది అనుభవం చేసుకున్నారు. మరి ఈ అనుభవాన్ని ఇక ముందు కూడా లక్ష్యంగా తీసుకుని పదే పదే చెకింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటే అది సంభవమేనని భావిస్తున్నారా? సంభవమా? భవిష్యత్తులో ఇలా వీలవుతుందా? వారు చేతులెత్తండి. అచ్ఛా! వీలవుతుందా? టీచర్లు, వీలవుతుందా? పాండవులకు వీలవుతుందా? అచ్ఛా, సంభవమవ్వగలదు అని అనకండి, అవ్వాల్సిందే, ఇందుకు చప్పట్లు కొట్టండి. అచ్ఛా. ఇప్పడైతే ఎక్కువ రోజులు అవ్వలేదు, కానీ ఇప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి, ఈ రోజు నుండి మూడు నెలలు అటెన్షన్‌ను పెట్టి క్రోధం యొక్క టెన్షనను సమాప్తం చెయ్యగలరా? చెయ్యగలరా? వారు చేతులెత్తండి. అచ్ఛా! ఇదైతే చాలా మంచి శుభవార్త, ఎందుకని? క్రోధానికి కారణం ఏమిటి? క్రోధానికి బీజము ఏమిటి? మీరు సదా మీ భవిష్య స్వరూపాన్ని మీ ముందు ఉంచుకోండి, మీ భవిష్య స్వరూపం ఎంతగా అలంకరింపబడిన హర్షిత ముఖము! బాప్ దాదాను చూడండి, అందులోనూ బ్రహ్మాబాబాను మీ ఎదుటకు తీసుకురండి, ఎందుకని? శివబాబా అయితే ఎలాగూ నిరాకారుడు, కానీ బ్రహ్మా బాబా మాత్రం మీలా సాకార రూపధారి, మీలా బాధ్యతా కిరీటాన్ని ధరించినవారు, అయినప్పటికీ సదా చిరునవ్వుతో కూడిన సంతోషకరమైన ముఖము ఉండేది. ఎందుకంటే ఈ వికారాలపై విజయాన్ని పొంది మీ ఎదురుగా శరీరంతో కార్యం చేస్తూ ఉదాహరణగా నిలిచారు. బ్రహ్మాబాబాకన్నా ఎక్కువగా మీకు బాధ్యతలు ఉన్నాయా? బ్రహ్మా బాబాకున్న బాధ్యతల ముందు మీకున్న బాధ్యతలు ఏమీ లేనట్లే. చివరి వరకు కర్మాతీత వైబ్రేషన్లలో ఉంటూ అవ్యక్త ఫరిశ్తాగా అయ్యారు. మరి ఇప్పుడు బాప్ దాదాకు ఇచ్చేసిన కానుకను తిరిగి తీసుకోరు కదా! సేవా కార్యక్రమాలలో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అని బాప్ దాదా అర్థం చేసుకోగలరు. అప్పుడప్పుడూ గొంతు పెద్దగా అవుతుంది అని, మూడ్ లో ఆవేశం వస్తూ ఉంటుంది అని కొందరు రిజల్టులో వ్రాసారు. కానీ ఇటువంటి విషయాలు ఎదురుగా వచ్చినప్పుడే విజయులుగా అయి చూపించడానికి అవకాశం వస్తుంది కదా! పరిస్థితుల పని రావడము కానీ మీకున్న జ్ఞానము పరిస్థితులను దాటుకుని విజయులుగా కావడము. మరి ఇష్టమేనా? క్రోధానికి సదాకాలికముగా వీడ్కోలు చేస్తారా లేక కేవలం మూడు నెలల కోసమేనా? ఎంత సమయం కోసం ధైర్యముంది? సదా కోసం క్రోధముక్తులుగా కావడం కష్టం కాదు, అవ్వాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. అవ్వాల్సిందే. అచ్ఛా! బాప్ దాదా సంతోషిస్తున్నారు, ఎందుకని? మీ చివరి జన్మలో కూడా మీ మహిమను ఏమని చేస్తారు? మీ దేవతా రూపం ఎదుట మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని మహిమ చేస్తారు. మీరు ఇలా అయ్యే పాత్ర సంగమయుగంలోనిదే. బాప్ దాదాల మనసులో ఒక విశేషమైన ఆశ ఉంది, చెప్పమంటారా? తల ఊపండి, చెప్పమంటారా? బాప్ దాదా ఇప్పటి నుండి, ఇప్పటి నుండి పిల్లలు ప్రతి ఒక్కరినీ వికసించిన గులాబి పుష్పాలుగా చూడాలని ఆశిస్తున్నారు. అదృష్టవంతులు, సంతోషకర ముఖము. పరిస్థితుల పని రావడము, ఇది కూడా అర్థం చేసుకోండి. పరిస్థితులు వస్తాయి, కానీ మీరు మీ లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకురావాలి, గాబరా పడకూడదు. బ్రహ్మాకుమారీలు పవిత్రతా పాఠాన్ని చాలా నేర్పిస్తారు అని ఎలా అయితే ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారో అలాగే బ్రహ్మాకుమారీలు క్రోధముక్తులుగా చేస్తారు అని కూడా ప్రసిద్ధికెక్కాలి. ఎందుకంటే క్రోధం నుండి ముక్తులవ్వాలని అందరూ కోరుకుంటారు. ఒత్తిడి ఉంటుంది కదా! ఒత్తిడి కలుగుతుంది కనుక అందరూ దాని నుండి ముక్తిని కోరుకుంటారు కానీ, వారికి విధి తెలియదు. పవిత్రంగా ఉండటం అసంభవం అని భావించేవారు ఇప్పుడు మిమ్మల్ని చూసి, మీ అనుభవం ఆధారంతో ఇది వీలవుతుంది అని ఎలా అయితే అనుకున్నారో అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం క్రోధజీతులుగా అవ్వడం సంభవమే, కష్టమేమీ కాదు అన్న అలను వ్యాప్తి చెయ్యండి. ఇటువంటి ఉదాహరణ యొక్క అనుభవాన్ని ప్రాక్టికల్ గా స్టేజిపైకి తీసుకురండి. చాలామంది పిల్లలు కార్యాలన్నీ చేస్తూ కూడా క్రోధజీతులుగా అవ్వడాన్ని బాప్ దాదా చూసారు. ఇటువంటి ఉదాహరణలు మీ పరివారంలో, బ్రాహ్మణ పరివారంలో తయారయ్యాయి. మరి ఈ సంవత్సరం ఏమి చేస్తారు? హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా! హోలీలో ఏమి చేస్తారు? కాలుస్తారు కదా! మరి ఈనాటి హోలీలో మీరు ఏమి కాలుస్తారు? క్రోధమునైతే చేసేసారు, దీనిని పక్కా చేయండి. కానీ బాప్ దాదా ఏమి చూసారంటే ఒత్తిడిలోకి రావడానికి కారణం దేహాభిమానముతోకూడిన 'నేను' అన్న పదము. దేహభానపు 'నేను' - ఒకటి- నేను ఆత్మను, మరొకటి- దేహభానపు నేను అన్న పదము అభిమానంతో కూడినది కూడా ఉంటుంది, అవమానంతో కూడినది కూడా ఉంటుంది మరియు నిరాశతో కూడిన నేను-నేను అన్నది కూడా క్రింద పడవేస్తుంది. మరి ఈ రోజు క్రోధజీతులుగా అయ్యే లక్ష్యములో ముందుకు వెళ్ళేందుకు దేహాభిమానపు నేను అన్న పదాన్ని యోగాగ్నిలో కాల్చివేయండి. అనేక రకాల నేను-నేను అన్నవాటిని కాల్చివేయండి మరియు నేను ఆత్మను, అన్న ఇటువంటి 'నేను' అన్న పదాన్ని పక్కా చేసుకోండి. మిగతా అన్ని 'నేను' అన్నవాటిని ఈ రోజు యోగాగ్నిలో కాల్చేసి వెళ్ళండి. అనేక రకాల 'నేను' అనేవి ఉన్నాయి కదా. కావున ఈ రోజు కాల్చివేసే హోలీని జరుపుకోండి. ఎందుకంటే క్రోధం కారణంగా ఒత్తిడి ఎక్కువయిపోతుంది. కావున ఇటువంటి 'నేను' అన్నదాన్ని సమాప్తం చెయ్యడానికి మీలోపల సంకల్పం తీసుకోండి. కాల్చివేయాలి, ఎందుకంటే ఇది కూడా భారమే కదా. ట్రైన్ లో వెళ్ళండి, విమానంలో వెళ్ళండి కానీ ఈ భారాన్ని ఇక్కడే కాల్చేసి వెళ్ళండి. కాల్చగలరా? పిల్లలు ధైర్యమును ఉంచితే తండ్రి సహాయము తోడుగా ఉంటుంది, విజయము కూడా తోడుగానే ఉంటుంది అని ఎవరైతే భావిస్తున్నారో, నేను విజయిగా అవ్వాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అవ్వాల్సిందే, అచ్ఛా. ఈ రోజు ఇక్కడకు వచ్చిన వి.ఐ.పిలు కూడా చేతులెత్తుతున్నారు. ఇక్కడకు వచ్చిన వి.ఐ.పిలు లేవండి, లేచి నిల్చోండి. చేతులెత్తుతున్నారు. చప్పట్లు కొట్టండి. విజయులుగా అవుతారా? చూడండి. ఎవరైతే విజయులుగా అవుతారో వారికి ఒక్కొక్కరికీ మాలను వేస్తున్నాము. అభినందనలు, అభినందనలు. అచ్ఛా! ఇప్పుడు వచ్చిన వి.ఐ.పీలందరూ ధైర్యమున్నవారు, అందుకే బాప్ దాదా వరదానమును ఇస్తున్నారు. ఈ సమయంలో మీరందరూ ఈ ఒక్క జన్మలో వి.ఐ.పిలుగా ఏ కారణం చేతనైనా అయి ఉండవచ్చు, కానీ బాప్ దాదా ధైర్యమును కలిగిన పిల్లలైన మిమ్మల్ని ఇప్పుడు వి.ఐ.పి అని అనరు, పిల్లలు అని అంటారు. బాప్ దాదా ఈ వరదానాన్ని, గ్యారంటీని ఇస్తున్నారు - మీరందరూ 21 జన్మలు వి.ఐ.పిలుగా అవుతారు. ఇక్కడలా ఎలక్షన్లు, సెలక్షన్లు జరగవు. అందరూ కేవలం ఒక్క విషయాన్ని మాత్రం వదలకండి. ఇప్పుడు ఏవిధముగా సంబంధంలోకీ, సంపర్కములోకి వచ్చారో, అలా ఈ బ్రాహ్మణ పరివారపు కనెక్షన్‌ను వదలకండి. ఎంతగా కనెక్షన్‌ను పెట్టుకుంటామో అంతగా రిలేషన్ పక్కాగా ఉంటుంది మరియు బాబా వరదానమును పొందేస్తారు. మరి సమ్మతమేనా? కనెక్షన్ పెట్టుకోవడం సమ్మతమేనా? చేతులెత్తండి. అచ్ఛా! ( బాప్ దాదా పూలమాలను తీసుకుని ముందుకు వేసారు) ఈ మాలను మీరందరూ వేసుకోండి.


           పిల్లలైన మీరందరూ క్రొత్తవారు, రియల్ గోల్డ్ పిల్లలు సదా బాబాకు ఆజ్ఞాకారులు కదా! కావున ఈరోజు ఇటువంటి నేను అన్న పదాన్ని కాల్చేసి వెళ్ళండి. మొదటిసారి వచ్చినవారు లేవండి. అచ్చా! మొదటిసారి వచ్చిన పిల్లలకు బాప్ దాదా మొదటి సారి వచ్చినందుకు కోటానురెట్ల అభినందనలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడెలా అయితే మొదటిసారి వచ్చారో అలాగే మొదటి నంబరులోకి, మొదటి డివిజన్లోకి రావాలి. మొదటి నంబరు అయితే ఫిక్స్ అయిపోయింది, కానీ మొదటి డివిజన్లోకి రావచ్చు, ఈ ధైర్యముందా? ధైర్యమున్నవారు చేతులెత్తండి. చూడండి, ఆలోచించి చేతులెత్తండి. అచ్ఛా! మేము లాస్ట్ లో వచ్చాము కానీ ఫాస్ట్ గా వెళ్తాము అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి ఎందుకంటే సమయంపై ఎటువంటి నమ్మకము లేదు. ఇప్పుడు ఏదైతే చెయ్యాలనుకుంటారో దానిని తీవ్ర పురుషార్థులుగా అయ్యి చెయ్యండి. ఎందుకంటే బహుకాలపు పురుషార్థాన్ని మీరందరూ కొద్ది సమయంలోనే పూర్తి చెయ్యవలసి ఉంటుంది. మరి ధైర్యముందా? ధైర్యముందా? చేతులెత్తండి. చూడండి, మీ ఫోటోను తియ్యడం జరుగుతోంది. ఇటువంటి ధైర్యవంతులకు బాప్ దాదా అభినందనలు ఇస్తున్నారు - ధైర్యము మీది సహాయం బాబాది. కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. మీ భాగ్యపు సితారను సదా మెరిసేలా ఉంచండి ఎందుకంటే ఈ జన్మలో చేసిన తీవ్ర పురుషార్థం, పురుషార్థం కాదు తీవ్ర పురుషార్థం అనేక జన్మల భాగ్యాన్ని తయారు చేయనుంది అందుకే ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. పరిస్థితులు వస్తాయి కానీ పరిస్థితి మహావీర్ కాదు, మీరు సర్వశక్తిమంతుని పిల్లలు, మీ ముందు పరిస్థితి ఎంత! పరిస్థితి వస్తుంది, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేదాని వెనుక మీరు మీ అదృష్టాన్ని పోగొట్టుకోవద్దు. అచ్ఛా, కూర్చోండి.

           బాప్ దాదా అందరికీ స్నేహము నిండిన అభినందనలు తెలుపుతున్నారు, ఏ విషయానికి? ధైర్యాన్ని ఉంచారు. పిల్లలందరూ ధైర్యముతో తీసుకున్న సంకల్పానికి బాప్ దాదా సంతోషిస్తున్నారు. మరి హోలీని జరుపుకున్నారా? కాల్చివేసే హోలీనైతే జరుపుకున్నారు కదా! అలాగే పరమాత్ముని సాంగత్యపు రంగులో హోలీని కూడా జరుపుకున్నారు. కాల్చేసారు కూడా, జరుపుకున్నారు కూడా.

           ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరిచేతా ఒక డ్రిల్ ను చేయించాలనుకుంటున్నారు. నలువైపుల పరిస్థితులు ఉన్నాయి, ఒక్కో చోట ఒక్కో పరిస్థితి! నలువైపుల ఉన్న ఇటువంటి పరిస్థితుల మధ్యలో మీరు ఒక్క క్షణములో ఏకాగ్రులు కాగలరా? ఇటువంటి అభ్యాసాన్ని స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా? లేక ఒకవేళ మీకు కొన్ని కారణాల వలన ఏ విషయం గురించైనా వ్యర్థ సంకల్పాల తుఫాను వచ్చినట్లయితే, అటువంటి సమయంలో మీరు మీ మనసు, బుద్ధిని ఏకాగ్రం చెయ్యగలరా? ఈ ఏకాగ్రతా శక్తి యొక్క డ్రిల్ ను అవసరమైనప్పుడు చేసి చూసారా? ఒకవేళ ఇటువంటి సమయంలో ఒక్క క్షణములో ఏకాగ్రతా శక్తిని కార్యంలోకి తీసుకురాలేకపోతే మున్ముందు అటువంటి పరిస్థితులు పదే, పదే వస్తాయి. మరి ఈ రోజు బాప్ దాదా క్షణములో ఫుల్ స్టాప్ అనగా ఏకాగ్ర స్థితి యొక్క అభ్యాసంపై అటెన్షన్‌ను ఇప్పించాలనుకుంటున్నారు ఎందుకంటే ప్రకృతి తన భిన్న భిన్న రంగులను చూపించడం ప్రారంభించింది. నలువైపుల ఏమేమి జరుగుతున్నాయి అన్నది మీకు బాగా తెలుసు. మనసును, బుద్ధిని భ్రమింపజేసే విషయాలు రావలసిందే, మరి ఇప్పుడు మీ మనసును, బుద్ధిని ఒక్క క్షణంలో పరంధామంలో స్థిరము చెయ్యగలరా? ఇప్పుడు స్వయమును ఫరిస్తా రూపంలో స్థితులను చేసుకోండి. నేను బ్రాహ్మణుడిని, మాస్టర్ సర్వశక్తిమంతుని స్థితిలో ఉన్నాను, ఈ విధంగా మాస్టర్ సర్వశక్తిమంతుని స్థితిలో స్థితులవ్వండి. (బాప్ దాదా డ్రిల్ చేయించారు) ఇటువంటి అభ్యాసాన్ని రోజంతా సమయం లభించినప్పుడు పదే పదే మనసును ఏకాగ్రం చేసి చూడండి. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, మనసును ఏకాగ్రం చేసుకోండి, పురుషార్థం ఒక్క నిమిషం పట్టినా, ఒక్క క్షణములో ఫుల్ స్టాప్! ఎందుకంటే అలజడుల సమయం ఇప్పుడు తయారవుతోంది. కావున మైండ్ కంట్రోల్ - మనసు నాది, నేను మనసును కాదు, నా మనసు - మరి నా అన్నవాటిపై నాకు కంట్రోల్ ఉందా? ఈ డ్రిల్ చాలా అవసరము.

           ఎవరెవరైతే వచ్చారో బాప్ దాదాకు అందరూ ప్రియమైనవారే. ఎందుకని? ఎలా ఉన్నా కానీ బాప్ దాదా పిల్లలందరినీ కోట్లలో కొద్దిమందిగా చూస్తారు. పురుషార్థంలో బలహీనంగా ఉన్నాకానీ బాబాకు ప్రియమైనవారు. మనస్పూర్తిగా నా బాబా అని అంటారు, అందుకే బాబాకు కూడా అతి ప్రియమైనవారు. బాప్ దాదా కేవలం ఒక్క విషయాన్ని గుర్తుకు తెప్పిస్తున్నారు - మీ ముఖము సదా సంతోషంగా, సంతోషంతో మెరుస్తూ ఉండాలి. పరిస్థితులను వెళ్ళనివ్వండి కానీ సంతోషాన్ని వెళ్ళనివ్వవద్దు. సంగమయుగపు సంతోషం పరమాత్ముని బహుమతి, కావున హోలీ అనగా ఇలాంటి విషయాలు ఏవైనా వచ్చినా కానీ హోలీ జరుపుకొని వచ్చాము, పరిస్థితి హో-లీ అయిపోయింది, కానీ సంతోషం పోకూడదు అని గుర్తుంచుకోండి. పరమాత్ముడు ఇచ్చే బహుమతి, ఖజానా సంతోషము.

           సంతోషంగా ఉండాలి మరియు సంతోషాన్ని పంచాలి అన్న స్లోగన్ ను సదా గుర్తుంచుకోండి అని బాప్ దాదా సదా అంటుంటారు. ఎంతగా పంచుతారో అది అంతగా పెరుగుతుంది, అంతేకాక సంతోషకరమైన ముఖము నడుస్తూ తిరుగుతూ కూడా ఆటోమేటిక్ గా సేవ చేస్తూ ఉంటుంది. వీరికి ఏమి లభించింది అని చూసిన వారందరూ ఆలోచిస్తారు. మరి ఈ రోజు హోలీ సందర్భంగా సంతోషమనే దిల్ ఖుష్ మిఠాయిని స్వీకరించండి. అందరూ తిన్నారా? సదా తింటూ ఉండండి. దీనితో ఎటువంటి అనారోగ్యము రాదు. అచ్ఛా.

సేవ టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రాజోన్ వారిది:- ఢిల్లీ వారు చాలా పెద్ద మనసున్న వారు ఎందుకంటే ఢిల్లీ రాజధాని, ఇప్పుడు కూడా రాజధానియే, భవిష్యత్తులో కూడా రాజధానియే. ఢిల్లీలో బాప్ దాదా హృదయపు ఆశలు కూడా ఉన్నాయి మరియు ఆశలను పూర్తి కూడా చేసారు. సేవ లెక్కలో ఢిల్లీలో కూడా సేవలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో పిల్లలు చిన్న పెద్ద పట్టణాలలో ఉల్లాసంతో సేవను చేసారు, దాని రిజల్టుతో బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఢిల్లీవారి పట్ల కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ వారు ఒక అద్భుతాన్ని చేసి చూపించండి, చెప్పమంటారా? మొదటి నుండి ఒక విషయం మిగిలి ఉంది. ఢిల్లీవారైనా మరెవరైనా- ఇప్పుడు ఢిల్లీ వారున్నారు- గీతా భగవంతుడు ఎవరు? అన్న ఈ విషయాన్ని గూర్చి ఏదైనా విధితో ఒక గ్రూపును తయారుచేయండి, వారే స్వయంగా గీతా భగవంతుడు పరమాత్మ అని అనాలి. ఇలా ముందుగా ఒక చిన్న గ్రూపును తయారు చేసి చూపించండి. అనౌన్సు చెయ్యనవసరం లేదు, కానీ చిన్న గ్రూపు, కనెక్షన్‌లో ఉన్నవారు చాలామంది ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, కొందరు పెద్ద పెద్ద కనెక్షన్‌లో వస్తారు, వారికి అర్థం చేయించి వారిని తయారు చేయండి. నిజంగా భగవంతుడు ఎవరు? అన్నది గ్రూపు అనాలి. ఇది వీలవుతుందా? వీలవుతుందా? క్రొత్త విషయాన్ని చేసి చూపించండి. ముందు గ్రూపును తయారు చెయ్యండి, అందులో అన్ని పొజిషన్లవారు ఉండాలి, భిన్న భిన్న పొజిషన్లవారు ఉండాలి, ధార్మికపరమైన వారు కూడా ఉండాలి, జడ్జిలు ఉండాలి, వకీళ్ళు ఉండాలి, సాధారణ పొజిషన్ వారు కూడా ఉండాలి, ఇటువంటి గ్రూపును తయారు చెయ్యండి. ఎందుకంటే ఈ విషయం ప్రసిద్ధి కావాలి కదా! గీతా భగవంతుడు ఎవరు అన్నది ప్రత్యక్షం కావలసిందే. ఢిల్లీలో అన్ని రకాల వారు ఉన్నారు. ధర్మ స్థానాలు ఉన్న చోట కూడా ఒకవేళ ఈ విధంగా ఎవరినైనా తయారు చెయ్యగలిగితే కూడా చెయ్యవచ్చు. ఒక గ్రూపును తయారు చెయ్యండి.

           బాప్ దాదా పిల్లల పురుషార్థాన్ని, ధైర్యాన్ని చూసారు. బాబా చెప్పిన వెంటనే పిల్లలు నలువైపుల సేవను ఎంతో ఉత్సాహంతో చేసారు, ఇందుకోసం బాప్ దాదా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలను ఇస్తున్నారు పిల్లల్లో ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి, ఇక ముందు కూడా పెరుగుతూ ఉంటాయి. బాప్ దాదా సేవా సమాచారాన్ని కూడా విన్నారు. ఇప్పుడు ఢిల్లీలో భిన్న భిన్న ప్రోగ్రాములు జరుగుతున్నాయి. బాబా ద్వారా పిల్లలకు లభించిన కానుక, స్థానం లభించింది, (ఓ.ఆర్.సి) దానిని కార్యంలోకి తెస్తున్నారు. ఇందుకు విశేషమైన అభినందనలు. పిల్లల్లో ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి, కేవలం కొద్ది సమయాన్ని వెచ్చిస్తారు.

           ఢిల్లీలో బాబా మరియు జగదాంబ, ఇద్దరూ సేవ చేసారు. బ్రహ్మాబాబా కూడా సేవ చేసారు, జగదాంబ కూడా సేవ చేసారు. జమునా నదీ తీరమైతే ఢిల్లీలోనే ఉంది. మీ రాజధాని కూడా జమునా నదీ తీరాన ఉంటుంది. మరి ఢిల్లీవారు అందరికీ స్థానమును ఇవ్వవలసి ఉంటుంది. పెద్ద మనసు కలిగి ఉన్నారు కదా! బాప్ దాదా ప్రతి స్థానంలో ఉన్న పిల్లల మహిమను చేస్తారు- ఓహో నా పిల్లలు ఓహో అని అంటారు! అలాగే ఢిల్లీ పిల్లల టర్న్ ఇది, మీ టర్న్ కనుక బాప్ దాదా విశేషంగా సేవా సహయోగానికి, స్నేహులుగా చేసినందుకు అభినందనలు, అభినందనలు. ఇప్పుడు ఇది చేసి చూపించండి. ఇటువంటి గ్రూపు, ఏ జోన్ ధైర్యమును ఉంచినా కానీ వారు ఆ గ్రూపును తీసుకురావచ్చు. సందేశాన్ని వ్యాపింపజేసేందుకు నిమిత్తమైనవారు, ఇప్పుడు మిగిలిపోయిన పాయింట్లను చేసి చూపించండి. బాగుంది. బాప్ దాదా పిల్లల సేవను కూడా చూస్తూ ఉంటారు. సేవ కూడా జరుగుతూ ఉంటుంది, సేవతో పాటు స్వస్థితిలో కూడా ముందుకు వెళ్ళాలన్న ఉల్లాసము మంచిగా ఉంది, బాగుంది.

డబుల్ విదేశీయులు:- 90 దేశాలనుండి వచ్చారని బాప్ దాదా విన్నారు. వాహ్ డబుల్ విదేశీయులు వాహ్! అని బాప్ దాదా అంటున్నారు. సంతోషంలో ఎగురుతూ ఉంటారు కదా! సేవా ఉల్లాసము మరియు తీవ్ర పురుషార్థపు ఉల్లాసము, ఈ రెండూ ఒకదానికొకటి సహయోగిగా అయ్యి ఇస్తూ ఉంటాయి. బాప్ దాదాకు మధువనంలో వచ్చే ప్రతి గ్రూపును రిఫ్రెష్ చెయ్యడం, ధైర్యాన్ని పెంచడం చాలా మంచిగా అనిపిస్తాయి. ఈ మధ్యలో స్పెషల్ భట్టీ చెయ్యాలి, ఏకాంతవాసులుగా అవ్వాలి అన్న అల చాలా బాగుంది. జనరల్ ప్రోగ్రాములైతే జరుగుతూనే ఉంటాయి, కానీ చిన్న చిన్న గ్రూపులను తయారుచేసి స్వ ఉన్నతి కోసం ప్రోగ్రాములు తయారు చేసుకోవడం- ఈ ఉన్నతి సాధనము చాలా బాగుంది. టీచర్లు కూడా చేసారు, బాగుంది. పాండవులు కూడా చేసారు ఎందుకంటే దీని ద్వారా స్వయంపై స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. రిఫ్రెష్ మెంట్ కోసం మధువనానికి ఉల్లాసంగా రావడం బాప్ దాదాకు చాలా బాగా నచ్చుతుంది. సమయాన్ని కేటాయించి, సమయం యొక్క లాభాన్ని తీసుకుని వెళ్తున్నారు. ఒకటి జనరల్ ప్రోగ్రాము ద్వారా లాభము, బాప్ దాదాను కలుసుకునే లాభము, మరియు విశేషంగా తమ స్వ ఉన్నతిలో లాభము. అలాగే బాప్ దాదా అన్ని వైపుల ఉన్న వారికి సలహా ఇస్తున్నారు - మీ మీ చోట్ల కూడా చిన్న చిన్న గ్రూపులకు స్వ ఉన్నతి యొక్క అవకాశాన్ని ఇచ్చి అనుభవాన్ని పెంచండి. చిన్న సెంటరైతే 5 మందిని గ్రూపు చెయ్యండి. ఈ రోజుల్లో విశేషమైన అటెన్షన్- ఫస్ట్ స్వ ఉన్నతి, కంట్రోలింగ్ పవర్. ఏకాగ్రత శక్తిపైన, డ్రిల్ పైన అటెన్షన్ పెట్టండి. దేశంవారు, విదేశంవారు ఇద్దరిలో సేవ మరియు స్వ ఉన్నతిలో అటెన్షన్ ఉంది, కానీ ఇంకా పెంచుతూ ఉండండి ఎందుకంటే బాప్ దాదా రెండు విషయాలను పదే పదే అటెన్షన్‌లోకి తీసుకువచ్చారు. ఒకటి అకస్మాత్తుగా, మరొకటి బహుకాలపు పురుషార్థం జమ అయి ఉండాలి. అవుతుంది అని కాదు, అవుతూ ఉంది అని కూడా కాదు. తీవ్రంగా ఉందా? ఇప్పుడు ఏదైనా ధారణ విషయంలో తీవ్రంగా ఉన్నారు, పరివర్తన అవుతున్నాము అని అనవద్దు, ఇప్పుడే చేయాలి. అయిపోతుందిలే అని అనవద్దు, ఎప్పుడో కాదు, ఇప్పుడు. డబుల్ విదేశీయుల వృద్ధిని చూసి కూడా బాప్ దాదా సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. విదేశాలలో మిగిలి ఉన్న ఏరియాలను కూడా పూర్తి చేయండి. విదేశాలలో కూడా ఫిర్యాదు రాకూడదు. జరుగుతున్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు, కానీ ఇంకా ఎక్కడైనా ఏదైనా మూల మిగిలి ఉంటే కూడా అటెన్షన్‌ను ఇచ్చి ఆ ఫిర్యాదును కూడా సమాప్తం చేసెయ్యండి. ఎప్పుడు అన్న మాట వద్దు, ఇప్పుడు. బాప్ దాదా పిల్లలందరిపై సంతోషంగా ఉన్నారు. అమృతవేళ విదేశాలను కూడా చుట్టి వస్తారు. కేవలం మధువనంలో లేక భారతదేశంలోనే తిరిగి వస్తారని కాదు. విదేశాలలో తిరిగి రావడానికి బాబాకు ఎంత సమయం పడుతుంది? పిల్లలందరి చార్టును బాప్ దాదా ఇలా తిరుగుతూ చూస్తారు. ప్రేమ కూడా ఉంది కదా! ప్రేమ పిల్లలది, బాబాకు కూడా ప్రేమ ఉంది. మరి ఏమి చేస్తున్నారు? అన్ని వైపులకు వెళ్తారు. కేవలం లండన్, అమెరికాయే కాదు, అన్ని చోట్లకు వస్తాము. బాప్ దాదా యొక్క ప్రతి సీజన్లో విదేశీయులు మిస్ అవ్వరు - ఈ రీతి ఏదైతే తయారు చేసారో బాగా చేసారు. శోభగా ఉంది. మధువనానికి అందం పిల్లలు. డబుల్ విదేశీయుల రాకతో మధువనము అలంకరింపబడుతుంది, చప్పట్లు కొట్టండి. మీ అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది కదా. డబుల్ విదేశీయులు ప్రతి టర్నులో వస్తారు, ధైర్యాన్ని ఉంచుతారు. ఈ రోజు 90 దేశాల నుండి వచ్చారు. బాప్ దాదా పిల్లల ప్రేమను చూసి, ఇప్పుడు ఇక ఏమి జరిగినా పరిస్థితులను చూడరు, స్నేహాన్ని చూస్తారు. మరి ఈ 90 దేశాల నుండి దేనితో వచ్చారు? స్నేహముతో. మరి ఈ రోజు బాప్ దాదా విశేషంగా డబుల్ విదేశీయులు చెప్పినట్లుగా వంద రెట్లు అభినందనలు మరియు దీవెనలు ఇస్తున్నారు. అచ్ఛా, కూర్చోండి.

ఐ.టి. గ్రూపు :- బాగుంది, ఐ.టి. గ్రూపు ద్వారా పిల్లలకు కూడా లాభం చేకూరింది, దూరంగా ఉన్నవారిని కూడా ఎదురుగా చూస్తున్నారు. టి.వి ద్వారా కూడా సేవ, సందేశం చేరుతున్నాయి. ఈ డిపార్టుమెంటు కేవలం, ప్రతి దేశంలోని టి.వి గ్రూపును ఎంతటి ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకురావాలంటే దేశదేశాలలో కూడా సేవ జరగాలి. ఎలా అయితే ఇప్పుడు ఒక్క స్టూడెంటు ద్వారా అక్కడక్కడ సేవలు జరుగుతున్నాయో, అలాగే ప్రతి జోన్లో ప్రతి పెద్ద స్థానంలో ఎక్కడ సందేశం చేరగలదో, అక్కడ కూడా ఈ లాభాన్ని తీసుకోవచ్చు. ఎక్కడెక్కడ ప్రోగ్రాములు జరుగుతున్నాయో అవి కూడా తమ ఏరియాలో చూపించవచ్చు. మంచి విషయాలను వ్యాప్తి చేయడానికి తమ ఏరియాలోని సాధనాలు, అది కూడా ప్రతి దేశం చేస్తుందా లేదా అని చెకింగ్ జరగాలి. సాధనాలు మంచిగా ఉన్నాయి. చేస్తున్నారు కూడా, కానీ పెంచుతూ వెళ్ళండి. ఆకర్షణీయమైన ప్రోగ్రాములు చేస్తూ ఉండండి మరియు నలువైపుల పంపుతూ ఉండండి. అప్పుడు నలువైపుల వ్యాప్తి అవుతుంది. రోజు రోజుకూ ఈ డిపార్టుమెంటును కూడా పద్ధతిలోకి తీసుకువస్తున్నందుకు బాప్ దాదాకు సంతోషంగా ఉంది, ఇక ముందు కూడా పెరుగుతూ ఉంటుంది. బాప్ దాదాకు ఇందుకు సంతోషంగా ఉంది. బాగుంది. పరస్పరం మీటింగ్ చేసుకున్నారు, ఉల్లాస ఉత్సాహాలు పెంచారు, ఇలాగే ఉల్లాస ఉత్సాహాలను, సమాచారాలను ఇచ్చి పుచ్చుకోవడాన్ని పెంచండి. బాగుంది, అభినందనలు. అచ్ఛా!

           బాప్ దాదా మళ్ళీ సూచనను ఇస్తున్నారు - స్వ పురుషార్థము. స్వ పురుషార్థంతో స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి రెండింటిపై అటెన్షన్‌ను ఇస్తూ ఉండండి, ముందుకు వెళ్తూ ఉండండి, సదా ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా!

            నలువైపుల బాప్ దాదా స్నేహంలో ఇమిడిపోయి, స్మృతి మరియు సేవలో మున్ముందుకు వెళ్ళేవారికి మరియు తీసుకు వెళ్ళేవారికి, అమృతవేళను ఎంతో మంచిగా శక్తిశాలిగా తయారు చేసుకునేవారికి, మనసా సేవ ద్వారా దయా హృదయులుగా, దయాళురుగా, కృపాలురుగా అయి ఆత్మలకు ఏదో ఒక అంచలిని ఇచ్చేవారు, ఈ విధిని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. పిల్లలు ప్రతి ఒక్కరూ ఉల్లాస ఉత్సాహాలలో ఉండటాన్ని బాప్ దాదా చూసారు, కానీ ఇప్పుడు దేనిని జోడించాలి? సదా అన్న పదాన్ని జోడించాలి. అప్పుడప్పుడూ అన్న పదాన్ని డిక్షనరీ నుండి తీసెయ్యండి. మరి నలువైపుల ఉన్న పిల్లలు హోలీ కూడా జరుపుకున్నారు, కాల్చేసారు కూడా మరియు సాంగత్యపు రంగు కూడా అంటించుకున్నారు. గడిచిందేదో గతించిపోయింది అన్న హోలీని కూడా జరుపుకున్నారు, అందుకే బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలను సమ్ముఖంలో హృదయంలో చూస్తున్నారు. బాప్ దాదాల కోటాను రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే.

           దాదీలతో :- బాబా మరియు డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ హాజీ, హాజీ అంటూ స్వయం కూడా ఎగురుతూ ఉండండి మరియు అందరినీ ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా!

మోహినీ అక్కయ్యతో :- ప్రేమతో ముందుకు వెళ్తూ ఉంటారు (మధ్య మధ్యలో ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది) అది పొరపాటులతో జరుగుతుంది. మీ సమయం కొంచం కింద మీద అవుతున్న కారణంగా ఇలా జరుగుతుంది. బాప్ దాదా అయితే సహయోగిగా ఉండనే ఉన్నారు. ఏదైతే జరిగిపోయిందో దానిని చక్కబెట్టడంలో కొంత సమయం పడుతుంది, పాత శరీరం కదా! అయిపోతుంది. కేవలం దినచర్యను మరియు మందులను ఖచ్చితంగా సమయానికి వేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు కొంత సమయం మీరు మందుల ఆధారాన్ని తీసుకోవలసి వస్తుంది, అయిపోతుంది.

           అందరి తలపై చేయి ఉంది, ఇదైతే ఒక్కరిపైనే ఉంచాము, కానీ మీ అందరి తలపై కూడా బాబా చేయి ఉంది.

పర్ దాదీతో :- సదా హర్షితంగా ఉండటము వీరికి బ్రాహ్మణ జీవితంలో లభించిన కానుక. ఏమి జరిగినా కానీ హర్షితంగా ఉంటారు. ఎగురుతూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు. పేషంటు కాదు, ఎగిరే కళలో ఉండేవారు.

నిర్వైర్ అన్నయ్యతో :- మీకు కూడా సదా కోసం, ప్రతి ఘడియ కోసం అభినందనలు.

బృజ్ మోహన్ అన్నయ్యతో :- సేవలో బిజీగా ఉంటున్నారు, బాగుంది.

రమేష్ అన్నయ్యతో :- బాగుంది, ప్రభుత్వ నియమాలైతే మారుతూ ఉంటాయి, కానీ మీరు బ్రాహ్మణ పరివారంలో ఎంత సహజంగా వీలైతే అంత, సహజంగా, సహజంగా చేస్తూ నడుస్తూ ఉండండి, నడిపిస్తూ ఉండండి. మీ డిపార్టుమెంటును సహజం చేస్తూ వెళ్ళండి, అప్పుడు అందరూ సంతోషంగా సహయోగిగా అవుతారు ఎందుకంటే యజ్ఞ కార్యము మీ డిపార్టుమెంటుపై ఆధారపడి ఉంది. కావున, సహజంగా చెయ్యండి. కష్టంగా ఉండవచ్చు, ప్రభుత్వమైతే కష్టంగా చేస్తుంది, కానీ కష్టానికి కూడా సహజమైన విధానాన్ని వెతికి సహజంగా నడిపిస్తూ ఉండండి. ప్రభుత్వమైతే తన పని చేసుకుపోతుంది, మీరు మీ పని చెయ్యండి. బాగుంది. (బడ్జెట్లో) అదైతే వస్తుంది, వారి పనిని వారు చేస్తారు కదా. మనం మన పని చెయ్యాలి. తమ కార్యంలో వారు రైట్, వారికి కూడా వారి ప్రాబ్లమ్ ఉంటుంది. పాండవ ప్రభుత్వం యొక్క సమస్య కాదు, సంతోషంగా చెయ్యండి.

భూపాల్ భాయితో:- కార్యవ్యవహారాలు బాగున్నాయా? (నీటి సమస్య ఉంది) ఈ నీటి ట్రక్కులను కాస్త పెంచండి. అదైతే ఇప్పటి సీజను. స్టాకు చేయండి, స్టాకును పెంచండి. స్థానాన్ని ట్రక్కులను పెంచడం ద్వారా సహజమైపోతుంది. కావున స్థానాన్ని పెంచండి, ట్రక్కులనూ పెంచండి, స్టాకునూ పెంచండి.

విదేశీ పెద్దక్కయ్యలతో:- చాలా బాగుంది. గ్రూపును తయారు చేసి పురుషార్థంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. బాప్ దాదాకైతే ఈ మధువనపు సీజన్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్క సంవత్సరం కోసం డోస్ లభించేస్తుంది. ఈ భట్టీ అనుభవం చాలా బాగుంది. పరస్పరంలో గ్రూపు చేసుకున్నారు కదా, ఇది బాగుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి క్రొత్తగా చేస్తూ ఉండండి. (బెహ్రెయిన్ లో సేవ బాగా జరుగుతోంది) సైలెన్సు వైపు ఎంతగా అటెన్షన్ తీసుకురాగలరో అంత మంచిది. బాగుంది (జయంతి అక్కయ్యతో) మంచిగా చేసి వచ్చారు, అభినందనలు.

హైదరాబాదు శాంతి సరోవరంలో క్రొత్త హాల్ తయారైంది, దాని ఉద్ఘాటనను బాప్ దాదా బటన్ ప్రెస్ చేసి చేసారు :-                       

           ఈ స్థానం ద్వారా సేవ పెరుగుతుంది, ఎంతోమందికి సందేశం లభిస్తుంది. కేవలం పరస్పరం త్వరత్వరగా మీటింగులు చేసుకుంటూ ఉండండి, ఇప్పుడు ఏమి చెయ్యాలి, ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ప్లాన్లు వేసుకుంటూ ఉండండి, వాటిని ప్రాక్టికల్ లోకి తీసుకురండి. పాండవులు మరియు శక్తులు ఇద్దరూ కలిసి ఇక ముందు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యాలి అని ప్లాను తయారుచేయండి. ఒకటి పూర్తవగానే మరొకటి చేయండి అప్పుడు ఈ స్థానం ఎంతో ఉపయోగపడుతుంది.

Comments