27-03-1986 అవ్యక్త మురళి

 27-03-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సదా కోసం స్నేహీలుగా అవ్వండి”

స్నేహ సాగరుడైన తండ్రి ఈ రోజు తమ స్నేహీ పిల్లలను కలిసేందుకు వచ్చారు. ఈ ఆత్మిక స్నేహము పిల్లలు ప్రతి ఒక్కరినీ సహజయోగులుగా తయారుచేస్తుంది. ఈ స్నేహము మొత్తము పాత ప్రపంచాన్ని సహజంగానే మరిపింపజేసే సాధనము. ఈ స్నేహము ప్రతి ఆత్మను తండ్రికి చెందినవారిగా తయారుచెయ్యటంలో ఏకైక శక్తిశాలీ సాధనము. స్నేహము బ్రాహ్మణ జీవితానికి పునాది. స్నేహము శక్తిశాలీ జీవితాన్ని తయారుచేసుకునేందుకు అవసరమైన పాలనకు ఆధారము. శ్రేష్ఠ ఆత్మలు, ఎవరైతే తండ్రి సమ్ముఖానికి చేరుకున్నారో, వారందరూ చేరుకోవటానికి ఆధారము కూడా స్నేహము. స్నేహమనే రెక్కలతో ఎగురుతూ వచ్చి మధువన నివాసులుగా అవుతారు. పిల్లలందరూ స్నేహీలే కానీ పరస్పరంలో ఉన్న తేడా ఏమిటి అని బాప్ దాదా సర్వ స్నేహీ పిల్లలను చూస్తున్నారు! నంబరువారుగా ఎందుకు అవుతారు, కారణమేంటి? అందరూ స్నేహీలే కానీ కొందరు సదా స్నేహీలు, కొందరు స్నేహీలు. ఇక మూడవవారు సమయానుసారంగా స్నేహాన్ని నిర్వర్తించేవారు. మూడురకాల స్నేహీలను బాప్ దాదా చూసారు.

ఎవరైతే సదా స్నేహీలో, వారు లవలీనమై ఉన్న కారణంగా శ్రమ మరియు కష్టము నుండి సదా అతీతంగా ఉంటారు. శ్రమించవలసిన అవసరమూ ఉండదు, కష్టము యొక్క అనుభవమూ ఉండదు ఎందుకంటే సదా స్నేహీలైన కారణంగా వారి ముందు ప్రకృతి మరియు మాయ, రెండూ ఇప్పటి నుండే దాసీలుగా అవుతాయి అనగా సదా స్నేహీ ఆత్మ యజమానిగా అవుతుంది కనుక ప్రకృతి, మాయ స్వతహాగానే దాసీ రూపంగా అయిపోతాయి. సదా స్నేహీల సమయాన్ని మరియు సంకల్పాలను తమ కొరకు ఉపయోగించుకునేందుకు ప్రకృతికి గానీ, మాయకు గానీ ధైర్యము ఉండదు. సదా స్నేహీ ఆత్మల ప్రతి సమయము, ప్రతి సంకల్పము ఉన్నవే తండ్రి స్మృతి మరియు సేవ కొరకు, కనుక ఈ సదా స్నేహీలైన పిల్లలు సంకల్పములో కూడా ఎప్పుడూ మనకు ఆధీనము కాలేరు, వీరు సర్వ శక్తులకు అధికారీ ఆత్మలు అని ప్రకృతి మరియు మాయకు కూడా తెలుసు. సదా స్నేహీ ఆత్మల స్థితి యొక్క గాయనమే ఉంది. ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు. బాబాయే ప్రపంచము.

రెండవ నంబరువారు - స్నేహీ ఆత్మలు, వీరు తప్పకుండా స్నేహములోనే ఉంటారు కానీ సదా లేని కారణంగా అప్పుడప్పుడు మనసులోని సంకల్పాల ద్వారా కూడా ఎక్కడో మరోవైపుకు స్నేహము వెళ్తుంది. మధ్య-మధ్యలో చాలా కొద్దిగా స్వయాన్ని పరివర్తన చేసుకున్న కారణంగా ఒక్కోసారి శ్రమను, ఒక్కోసారి కష్టమును అనుభవము చేస్తారు. కానీ చాలా కొద్దిగా. ఎప్పుడైతే ప్రకృతి లేక మాయ యొక్క సూక్ష్మమైన యుద్ధము జరుగుతుందో, ఆ సమయంలో స్నేహము కారణంగా స్మృతి త్వరగా వచ్చేస్తుంది మరియు స్మృతి శక్తితో స్వయాన్ని చాలా త్వరగా పరివర్తన కూడా చేసుకుంటారు. కానీ కొద్దిపాటి సమయము మరియు సంకల్పాలు కష్టము లేక శ్రమలో పోతాయి. అప్పుడప్పుడు స్నేహము సాధారణమైపోతుంది. అప్పుడప్పుడు స్నేహములో లవలీనమై ఉంటారు. స్థితిలో తేడా వస్తూ ఉంటుంది కానీ ఎక్కువ సమయము మరియు సంకల్పాలు వ్యర్థములోకి వెళ్ళవు. కనుక స్నేహీలుగా అయ్యారు కానీ సదా స్నేహీలుగా లేని కారణంగా రెండవ నంబరువారిగా అయిపోతారు.

మూడవవారు - సమయానుసారంగా స్నేహాన్ని నిర్వర్తించేవారు. సత్యమైన స్నేహము తండ్రి నుండి తప్ప ఇతరులెవ్వరి నుండి లభించదు మరియు ఈ ఆత్మిక స్నేహము సదాకాలమునకు శ్రేష్ఠంగా తయారుచేసేది అన్న విషయాన్ని ఈ ఆత్మలు అర్థం చేసుకుంటారు. వీరికి జ్ఞానము అనగా వివేకము పూర్తిగా ఉంది మరియు ఈ స్నేహీ జీవితం ప్రియమైనదిగా కూడా అనిపిస్తుంది. కానీ కొందరు తమ దేహం పట్ల ఆకర్షణ యొక్క సంస్కారానికి, లేక ఏదైనా విశేషమైన పాత సంస్కారానికి, లేక ఎవరైనా వ్యక్తులు లేక వస్తువుల సంస్కారానికి, లేక వ్యర్థ సంకల్పాల సంస్కారానికి వశమైపోయి, కంట్రోలింగ్ పవర్ లేని కారణంగా వ్యర్థ సంకల్పాల భారము కలిగి ఉంటారు. లేక సంగఠన శక్తి లోపించిన కారణంగా సంగఠనలో సఫలత పొందేవారిగా అవ్వలేరు. సంగఠనలోని పరిస్థితి స్నేహాన్ని సమాప్తము చేసి తనవైపుకు లాగుతుంది. కొందరు ఎప్పుడూ చాలా త్వరగా నిరాశపడిపోతారు. ఇప్పుడిప్పుడే చాలా బాగా ఎగురుతూ ఉంటారు మరియు ఇప్పుడిప్పుడే మళ్ళీ చూస్తే తమకు తామే నిరాశగా ఉంటారు. స్వయముతో నిరాశ చెందే ఈ సంస్కారము కూడా సదా స్నేహీలుగా అవ్వనివ్వదు. ఏదో ఒకరకమైన సంస్కారము పరిస్థితి వైపుకు, ప్రకృతి వైపుకు ఆకర్షితము చేసేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే అలజడిలోకి వస్తారో, అప్పుడు స్నేహం యొక్క అనుభవము కారణంగా, స్నేహీ జీవితము ప్రియంగా అనిపించిన కారణంగా తండ్రి స్మృతి కలుగుతుంది. అప్పుడు మళ్ళీ తండ్రి స్నేహములో ఇమిడిపోవాలి అని ప్రయత్నము చేస్తారు. కనుక సమయానుసారంగా, పరిస్థితుల అనుసారంగా అలజడిలోకి వచ్చిన కారణంగా ఒక్కోసారి స్మృతి చేస్తారు, ఒక్కోసారి యుద్ధము చేస్తారు. యుద్ధ జీవితము ఎక్కువగా ఉంటుంది మరియు దానితో పోలిస్తే స్నేహములో ఇమిడిపోయే జీవితము తక్కువగా ఉంటుంది కనుక మూడవ నంబరువారిగా అయిపోతారు. అయినా కూడా విశ్వములోని సర్వాత్మలకంటే ఈ మూడవ నంబరువారు అతి శ్రేష్ఠులు అని చెప్పాలి ఎందుకంటే వీరు తండ్రిని గుర్తించారు, తండ్రికి చెందినవారిగా అయ్యారు, బ్రాహ్మణ పరివారానికి చెందినవారిగా అయ్యారు. ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ ఆత్మలు బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలుగా పిలువబడతారు కనుక ప్రపంచములోని వారితో పోలిస్తే వీరు శ్రేష్ఠ ఆత్మలు. కానీ సంపూర్ణతతో పోలిస్తే మూడవ నంబరువారు. మరి అందరూ స్నేహీలే కానీ నంబరువారుగా ఉన్నారు. నంబరు వన్ సదా స్నేహీ ఆత్మలు సదా కమలపుష్ప సమానంగా అతీతులు మరియు తండ్రికి అతి ప్రియమైనవారు. స్నేహీ ఆత్మలు, అతీతమైనవారు మరియు ప్రియమైనవారు కూడా కానీ తండ్రి సమానంగా శక్తిశాలీ విజయులు కారు, లవలీనులు కారు, కానీ స్నేహీలు. వారి విశేషమైన స్లోగన్ ఏమిటంటే - మేము మీకు చెందినవారిమి, మీకు చెందినవారిగా ఉంటాము. ఎప్పుడూ ఈ పాటను పాడుతూ ఉంటారు. అయినా కూడా స్నేహము ఉంది కనుక 80 శాతము సురక్షితంగా ఉంటారు. కానీ అప్పుడప్పుడు అన్న పదం వచ్చేస్తుంది. సదా అన్న పదం రాదు. మూడవ నంబరుగల ఆత్మలు స్నేహము కారణంగా, ఇప్పటి నుండి ఇలా అవ్వాలి, ఇప్పటి నుండి ఇది చేస్తాము అని పదే-పదే ప్రతిజ్ఞలు కూడా స్నేహంతో చేస్తూ ఉంటారు, ఎందుకంటే తేడా అయితే తెలుసు కదా. ప్రతిజ్ఞ కూడా చేస్తారు, పురుషార్థము కూడా చేస్తారు కానీ ఏదో ఒక విశేషమైన పాత సంస్కారము తపనలో నిమగ్నమవ్వనివ్వదు. విఘ్నము నిమగ్నమైన స్థితి నుండి కిందకు తీసుకువచ్చేస్తుంది కనుక సదా అన్న మాట రాలేదు. కానీ ఒకసారి ఒకలా, ఇంకోసారి ఇంకోలా ఉన్న కారణంగా ఏదో ఒక విశేషమైన బలహీనత ఉండిపోతుంది. ఇటువంటి ఆత్మలు బాప్ దాదా ముందు ఆత్మిక సంభాషణను చాలా మధురంగా చేస్తారు. హక్కును కూడా చూపిస్తారు. వారంటారు - డైరెక్షన్ అయితే మీది, కానీ మా వైపు నుండి కూడా మీరే చెయ్యండి మరియు పొందడమనేది మేము పొందుతాము అని. మీరే మీవారిగా చేసుకున్నారు కనుక మీకే తెలుసు అని హక్కుతో, స్నేహంతో అంటారు. తండ్రికైతే తెలుసు కానీ పిల్లలు స్వీకరించాలి కదా అని తండ్రి అంటారు. మేము స్వీకరించినా, స్వీకరించకపోయినా మీరైతే మమ్మల్ని స్వీకరించవలసిందే అని ఈ పిల్లలు హక్కుతో ఇలా అంటారు. కావున బాబాకు పిల్లలపై దయ కలుగుతుంది ఎందుకంటే ఉన్నదైతే బ్రాహ్మణ పిల్లులుగానే కదా, అందుకని బాబానే నిమిత్తమైన ఆత్మల ద్వారా విశేష శక్తిని ఇస్తారు. కొందరు శక్తిని తీసుకుని మారుతారు కూడా, కానీ కొందరు శక్తి లభించినా కూడా తమ సంస్కారాలలో మునిగిపోయి ఉన్న కారణంగా శక్తిని ధారణ చెయ్యలేకపోతారు. ఏవిధంగానైతే ఎవరికైనా బలమైన ఆహారాన్ని తినిపించినాగానీ వారు తినకపోతే ఏం చేస్తారు!

తండ్రి విశేష శక్తిని ఇస్తారు కూడా మరియు కొందరు నెమ్మది-నెమ్మదిగా శక్తిశాలీగా అవుతూ-అవుతూ మూడవ నంబరు నుండి రెండవ నంబరు లోకి వచ్చేస్తారు కూడా. కానీ కొందరు చాలా నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా ఎంత తీసుకోవాలో అంత తీసుకోలేకపోతారు. మూడు రకాల స్నేహీ పిల్లలు ఉన్నారు. టైటిల్ అయితే అందరిదీ స్నేహీ పిల్లలు అనే ఉంది కానీ నంబరువారుగా ఉన్నారు.

ఈరోజు జర్మనీవారి టర్న్. మొత్తము గ్రూపంతా నంబరు వన్ కదా. మీరు నంబరు వన్ సమీప రత్నాలు ఎందుకంటే ఎవరైతే సమానంగా ఉంటారో వారే సమీపంగా ఉంటారు. శరీర పరంగా ఎంత దూరంగా ఉన్నాగానీ మనసు పరంగా ఎంత దగ్గరగా ఉన్నారంటే, వారు నివసించడమే మనసులో నివసిస్తున్నారు. స్వయంగా తండ్రి యొక్క హృదయ సింహాసనంపై ఉంటారు. వారి మనసులో స్వతహాగానే తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఉండరు ఎందుకంటే బ్రాహ్మణ జీవితములో తండ్రి మనసుతోనే వ్యాపారము చేసారు. మనసును తీసుకున్నారు మరియు మనసును ఇచ్చారు. మనసు యొక్క వ్యాపారం చేసారు కదా. మనసు పరంగా తండ్రితో పాటు ఉంటారు. శరీరంతో అయితే ఒకరు ఒకచోట ఉంటే, మరొకరు మరోచోట ఉంటారు. అందరినీ ఇక్కడ పెట్టినట్లయితే, ఇక్కడ కూర్చుని ఏమి చేస్తారు! సేవ కొరకైతే, మధువనములో తోడుగా ఉండేవారిని కూడా బయటకు పంపించాల్సి వచ్చింది. లేదంటే విశ్వ సేవ ఎలా జరుగుతుంది! తండ్రి పట్ల కూడా ప్రేమ ఉంది, సేవ పట్ల కూడా ప్రేమ ఉంది కనుక డ్రామా అనుసారంగా భిన్న-భిన్న స్థానాలకు చేరుకున్నారు మరియు అక్కడ సేవలకు నిమిత్తులుగా అయ్యారు. అలా ఈ పాత్ర కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. మీరు మీ తోటివారి సేవకు నిమిత్తులుగా అయ్యారు. జర్మనీవారు సదా సంతోషంగా ఉండేవారు కదా. తండ్రి నుండి సదా యొక్క వారసత్వము ఇంత సహజంగా లభిస్తున్నప్పుడు, మరి సదా ని వదిలి కొద్దిగా లేక అప్పుడప్పుడు యొక్క వారసత్వాన్ని ఎందుకు తీసుకోవాలి! ఇచ్చే దాత ఇస్తున్నప్పుడు, మరి తీసుకునేవారు తక్కువగా ఎందుకు తీసుకోవాలి! కనుక సదా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉండండి. సదా మాయాజీతులు, ప్రకృతిజీతులైన విజయులుగా అయ్యి విశ్వము ముందు విజయ ఢంకాను చాలా పెద్ద శబ్దంతో మ్రోగించండి.

ఈ రోజుల్లో ఆత్మలు వినాశీ సాధనాల నషాలో బాగా మునిగిపోయి ఉంటున్నారు లేదా దుఃఖము, అశాంతులతో అలసిపోయి ఎంత గాఢనిద్రలో నిద్రపోతున్నారంటే, ఇక వారు చిన్న శబ్దాన్ని కూడా వినేవారిగా లేరు. ఎవరైతే నషాలో మునిగి ఉంటారో, వారిని కదిలించాల్సి వస్తుంది. గాఢనిద్రలోని వారిని కూడా కదిపి లేపాల్సి వస్తుంది. మరి హేమ్బర్గ్ వారు ఏం చేస్తున్నారు? వీరు మంచి శక్తిశాలీ గ్రూప్. తండ్రి పట్ల మరియు చదువు పట్ల అందరికీ చాలా మంచి ప్రీతి ఉంది. ఎవరికైతే చదువు పట్ల ప్రీతి ఉంటుందో, వారు సదా శక్తిశాలీగా ఉంటారు. తండ్రి పట్ల అనగా మురళీధరుని పట్ల ప్రీతి అనగా మురళీ పట్ల ప్రీతి. మురళీ పట్ల ప్రీతి లేనట్లయితే మురళీధరుని పట్ల కూడ ప్రీతి ఉండదు. నాకు బాబా పట్ల ప్రేమ ఉంది కానీ చదువు కోసం టైమ్ లేదు అని ఎవరు ఎంత చెప్పినాగానీ బాబా దానిని ఒప్పుకోరు. ఎక్కడైతే తపన ఉంటుందో, అక్కడ ఎటువంటి విఘ్నమూ నిలవదు, స్వతహాగానే సమాప్తమైపోతుంది. చదువు పట్ల ప్రీతి కలవారు, మురళీ పట్ల ప్రీతి కలవారు విఘ్నాలను సహజంగా దాటేస్తారు. ఎగిరేకళ ద్వారా స్వయం పైకి వెళ్ళిపోతారు, విఘ్నాలు కింద ఉండిపోతాయి. ఎగిరేకళ కలవారికి పర్వతము కూడా ఒక రాయిలాంటిది. చదువు పట్ల ప్రీతి ఉన్నవారికి ఏ సాకులు ఉండవు. ప్రీతి కష్టాన్ని సహజం చేసేస్తుంది. మురళి పట్ల ప్రేమ, చదువు పట్ల ప్రేమ మరియు పరివారము పట్ల ప్రేమ, ఇవన్నీ కోటలా అవుతాయి. కోటలో ఉండేవారు సురక్షితంగా ఉంటారు. ఈ రెండు విశేషతలూ ఈ గ్రూపును ముందుకు తీసుకువెళ్తున్నాయి. చదువు మరియు పరివారపు ప్రేమ కారణంగా ఇతరులను ఆ ప్రేమ ప్రభావముతో సమీపంగా తీసుకువస్తారు. మరియు ప్రేమమయమైన నిమిత్త ఆత్మ (పుష్పాల్ దాది) కూడా లభించారు. స్నేహము భాషను కూడా చూడదు. స్నేహ భాష అన్ని భాషలకంటే శ్రేష్ఠమైనది. అందరూ వారిని గుర్తు చేసుకుంటున్నారు. బాప్ దాదాకు కూడా వారు గుర్తున్నారు. మంచి ప్రత్యక్ష ప్రమాణమును చూస్తున్నారు. సేవ వృద్ధి జరుగుతూ ఉంది. ఎంతగా వృద్ధి చేస్తూ ఉంటారో, అంతగా మహాన్ పుణ్యాత్ములుగా అయ్యే ఫలము, సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. పుణ్య ఆత్మయే పూజ్య ఆత్మగా అవుతుంది. ఇప్పుడు పుణ్య ఆత్మగా లేకపోతే భవిష్యత్తులో పూజ్య ఆత్మగా అవ్వలేరు. పుణ్య ఆత్మగా అవ్వటము తప్పనిసరి. అచ్ఛా!

అవ్యక్త మురళీల నుండి ఎన్నుకోబడిన ప్రశ్నోత్తరాలు

ప్రశ్న:- బ్రాహ్మణ జీవితము యొక్క విశేష గుణము, అలంకారము మరియు ఖజానా ఏది?

జవాబు:- "సంతుష్టత". ఏదైనా ప్రియమైన వస్తువు ఉంటే ఆ ప్రియమైన వస్తువును ఎప్పుడూ వదలరు. సంతుష్టత విశేషత, ఇది బ్రాహ్మణ జీవితము యొక్క పరివర్తనకు విశేష దర్పణము. ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో, అక్కడ సంతోషము తప్పకుండా ఉంటుంది. ఒకవేళ బ్రాహ్మణ జీవితములో సంతుష్టత లేనట్లయితే అది సాధారణ జీవితము అవుతుంది.

ప్రశ్న:- సంతుష్టమణుల విశేషతలు ఏమిటి?

జవాబు:-సంతుష్టమణులు ఎప్పుడూ కూడా ఏ కారణంచేతనైనా స్వయముతోగానీ, ఇతర ఆత్మలతోగానీ, తమ సంస్కారాలతోగానీ, వాయుమండల ప్రభావముతోగానీ అసంతుష్టులుగా అవ్వలేరు. మేమైతే సంతుష్టంగానే ఉన్నాము కానీ ఇతరులు అసంతుష్టపరుస్తున్నారు అని వారు ఎప్పుడూ అనరు. ఏమి జరిగినాగానీ సంతుష్టమణులు తమ సంతుష్టతను వదిలిపెట్టలేరు.

ప్రశ్న:- ఎవరైతే సదా సంతుష్టులుగా ఉంటారో వారి గుర్తులు ఏమిటి?

జవాబు:- 1. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారిపట్ల అందరికీ స్వతహాగానే స్నేహము ఉంటుంది ఎందుకంటే సంతుష్టత బ్రాహ్మణ పరివారమునకు స్నేహీలుగా తయారుచేస్తుంది.

2. సంతుష్ట ఆత్మను అందరూ స్వయమే సమీపంగా తీసుకువచ్చేందుకు మరియు ప్రతి శ్రేష్ఠ కార్యములో సహయోగిగా చేసేందుకు ప్రయత్నము చేస్తారు.

3. సంతుష్టత అనే ఆ విశేషతనే ప్రతి కార్యములో గోల్డెన్ ఛాన్సలర్ గా చేస్తుంది. వారికి చెప్పే మరియు ఆలోచించే అవసరము కూడా ఉండదు.

4. సంతుష్టత సదా సర్వుల స్వభావ సంస్కారాలను కలిపేదిగా ఉంటుంది. సంతుష్ట ఆత్మలు ఎప్పుడూ ఎవరి స్వభావ సంస్కారాలను చూసి గాభరాపడేవారిగా ఉండరు.

5. అటువంటివారిపట్ల అందరికీ స్వతహాగానే హృదయపూర్వకమైన ప్రేమ ఉంటుంది. వారు ప్రేమను తీసుకునేందుకు పాత్రులుగా ఉంటారు. సంతుష్టతయే ఆ ఆత్మకు గుర్తింపును తీసుకువస్తుంది. వీరితో మాట్లాడాలి, వీరి దగ్గర కూర్చోవాలి అని ప్రతి ఒక్కరి మనసు కోరుకుంటుంది.

6. సంతుష్ట ఆత్మలు సదా మాయాజీతులుగానే ఉంటారు ఎందుకంటే వారు ఆజ్ఞాకారులు మరియు సదా మర్యాదలరేఖ లోపల ఉండేవారు. వారు మాయను దూరం నుండే తెలుసుకుంటారు.

ప్రశ్న:- ఒకవేళ సరైన సమయానికి మాయను గుర్తించలేకపోయినట్లయితే, పదే పదే మోసపోతుంటే, దానికి కారణం ఏమిటి?

జవాబు:- గుర్తించటం తక్కువగా ఉండడానికి కారణం - సదా తండ్రి యొక్క శ్రేష్ఠ మతంపై నడవరు. కొంత సమయము నడుస్తారు, కొంత సమయము నడవరు. ఒక్కోసారి స్మృతి చేస్తారు, ఒక్కోసారి చెయ్యరు. ఒక్కోసారి ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటారు, ఒక్కోసారి ఉండరు. సదా ఆజ్ఞ యొక్క రేఖ లోపల ఉండరు కనుక మాయ సమయానికి మోసం చేస్తుంది. పరిశీలన చేసే శక్తి మాయలో చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ సమయములో వీరు బలహీనంగా ఉన్నారు అన్నది మాయ గమనిస్తుంది, కనుక ఆ బలహీనత ద్వారా తనవారిగా చేసుకుంటుంది. బలహీనతయే మాయ వచ్చేందుకు దారి.

ప్రశ్న:- మాయాజీతులుగా అయ్యేందుకు సహజ సాధనము ఏమిటి?

జవాబు:- సదా బాబాతోపాటు ఉండండి, తోడుగా ఉండటము అనగా స్వతహాగానే మర్యాదల రేఖ లోపల ఉండటము. ఇక ఒక్కొక్క వికారముపై విజయులుగా అయ్యే శ్రమ చెయ్యటం నుండి ముక్తులైపోతారు. తోడుగా ఉన్నట్లయితే తండ్రి ఎలానో, మీరూ అలానే. సాంగత్యపు రంగు తప్పకుండా పడుతుంది కనుక బీజాన్ని వదిలి కేవలము శాఖలను కత్తిరించే శ్రమ చెయ్యకండి. ఈ రోజు కామజీతులుగా అయ్యారు, రేపు క్రోధజీతులుగా అయ్యారు, అంటూ ఇలా కాదు. సదా విజయులు. కేవలము బీజరూపుడిని తోడుగా పెట్టుకున్నట్లయితే మాయా బీజము ఎలా భస్మమైపోతుందంటే ఇక మరెప్పుడూ ఆ బీజము నుండి అంశము కూడా వెలువడలేదు.

Comments