19-03-1986 అవ్యక్త మురళి

 19-03-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

అమృతవేళ - శ్రేష్ఠ ప్రాప్తుల వేళ

ఆత్మిక తోట యజమాని ఈరోజు తమ ఆత్మిక గులాబీ పూలతోటను చూస్తున్నారు. ఇటువంటి ఆత్మిక గులాబీ పూలతోట ఇప్పుడు ఈ సంగమయుగములో బాప్ దాదా ద్వారానే తయారవుతుంది. బాప్ దాదా ప్రతి ఒక్క ఆత్మిక గులాబీ పుష్పం యొక్క ఆత్మిక సుగంధాన్ని మరియు విచ్చుకున్న పుష్పాల ఆత్మిక ప్రకాశాన్ని చూస్తున్నారు. అన్నీ సుగంధభరితమైనవే కానీ కొన్నింటి సుగంధము సదాకాలము ఉంటే మరికొన్నింటి సుగంధము కొద్ది సమయము ఉంటుంది. కొన్ని గులాబీలు ఎల్లప్పుడూ విచ్చుకుని ఉంటాయి, కొన్ని ఒక్కోసారి విచ్చుకుని ఉంటే ఒక్కోసారి కాస్త ఎండ లేక వాతావరణాన్ని బట్టి వాడిపోతాయి. అయినాగానీ ఆత్మిక తోట యజమాని యొక్క తోటలోని ఆత్మిక గులాబీలే. కొన్ని ఆత్మిక గులాబీలలో జ్ఞాన సుగంధం విశేషంగా ఉంది. కొన్నిటిలో స్మృతి సుగంధం విశేషంగా ఉంది. కొన్నిటిలో ధారణా సుగంధం ఉంది, కొన్నిటిలో సేవా సుగంధం విశేషంగా ఉంది. కొన్ని సర్వ సుగంధాలతో సంపన్నమైనవి కూడా ఉన్నాయి. మరి తోటలో అందరి దృష్టి ముందుగా దేనిపైకి వెళ్తుంది? దేని సుగంధమైతే దూరము నుండే ఆకర్షిస్తుందో దాని పైకి దృష్టి వెళ్తుంది. ముందుగా అటువైపే అందరి దృష్టి వెళ్తుంది. మరి ఆత్మిక తోట యజమాని ఎల్లప్పుడూ అన్ని ఆత్మిక గులాబీ పూలను చూస్తారు. కానీ నంబరువారుగా. ప్రేమ కూడా అందరిపై ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క గులాబీ పుష్పానికి తోట యజమాని పట్ల చాలా ప్రేమ ఉంది. యజమానిపై పుష్పాలకు ప్రేమ ఉంది మరియు యజమానికి పుష్పాలపై ప్రేమ ఉంది. అయినా కూడా సదా సర్వ సుగంధాలతో సంపన్నంగా ఉన్నవి మరియు సదా విచ్చుకున్నవే షోకేసులో సదాకాలము పెట్టుకునే ఆత్మిక గులాబీలుగా ఉంటాయి. ముడుచుకుపోయిన వాటిని ఎప్పుడూ పెట్టుకోరు. ప్రతిరోజు అమృతవేళ బాప్ దాదా స్నేహము మరియు శక్తులతో కూడుకున్న విశేష పాలన ద్వారా అన్ని ఆత్మిక గులాబీ పూలతో మిలనమును చేస్తారు.

అమృతవేళ విశేషంగా ప్రభు పాలన యొక్క వేళ. అమృతవేళ విశేషంగా పరమాత్మ మిలనము యొక్క వేళ. ఆత్మిక సంభాషణను చేసే వేళ. అమృతవేళ భోళా భండారీ యొక్క వరదానాల ఖజానా నుండి సహజంగా వరదానాలు ప్రాప్తించే వేళ. మనసులోని కోరికల ఫలాన్ని ప్రాప్తి చేసుకోవటము అన్న గాయనము ఏదైతే ఉందో, అది ఈ సమయములోని అమృతవేళ సమయపు గాయనము. కష్టపడకుండానే తెరిచియున్న ఖజానాలను ప్రాప్తి చేసుకునే వేళ. ఇటువంటి సుందర సమయమును అనుభవము ద్వారా తెలుసుకున్నారు కదా! ఈ శ్రేష్ఠ సుఖాన్ని, శ్రేష్ఠ ప్రాప్తులను అనుభవజ్ఞులే తెలుసుకుంటారు. బాప్ దాదా ఆత్మిక గులాబీలందరినీ చూసి-చూసి హర్షితులవుతారు. వాహ్, నా ఆత్మిక గులాబీలు అని బాప్ దాదా కూడా అంటారు. మీరు వాహ్, వాహ్ అన్నపాటను పాడుతారు, మరి బాప్ దాదా కూడా ఇదే పాటను పాడుతారు. అర్థమైందా!

మురళీలనైతే చాలానే విన్నారు. విని-విని సంపన్నులైపోయారు. ఇప్పుడు మహాదానులుగా అయ్యి పంచే ప్లాన్ ను తయారుచేస్తున్నారు. ఈ ఉల్లాసము చాలా బాగుంది. ఈ రోజు యు.కే. అనగా ఓ.కే. గా ఉండేవారి టర్న్. డబల్ విదేశీయుల ఒక మాటను విని బాప్ దాదా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటారు. అది ఏది? థాంక్యూ (ధన్యవాదాలు). థాంక్యూ అని అంటూనే బాప్ దాదాను కూడా గుర్తు చేస్తుంటారు ఎందుకంటే అన్నింటికన్నా ముందు హృదయపూర్వకమైన ధన్యవాదాలు బాబాకే అని భావిస్తారు. కనుక ఎవరితోనైనా థాంక్యూ అని అనేటప్పుడు ముందుగా బాబా గుర్తుకొస్తారు కదా! బ్రాహ్మణ జీవితములో మొదటి ధన్యవాదము స్వతహాగానే బాబా కొరకు వెలువడుతుంది. మీరు లేస్తూ-కూర్చుంటూ అనేకసార్లు థాంక్యూ చెప్తారు. బాబాను గుర్తు చేసుకునేందుకు ఇది కూడా ఒక విధి. యు.కే. వారు భిన్న-భిన్న హద్దు శక్తులు కలవారినందరినీ కలిపేందుకు నిమిత్తులుగా అయ్యారు కదా. అనేకరకాల నాలెడ్జ్ కల శక్తులు. భిన్న-భిన్న శక్తులు కలవారు, భిన్న-భిన్న వర్గాల వారు, భిన్న-భిన్న ధర్మాలవారు, భిన్న-భిన్న భాషల వారు, వీరందరినీ కలిపి ఒకే బ్రాహ్మణ వర్గములోకి తీసుకురావటము, బ్రాహ్మణ ధర్మములోకి, బ్రాహ్మణ భాషలోకి రావటము. బ్రాహ్మణుల భాష బ్రాహ్మణులదే. వీరేమి మాట్లాడుతున్నారు అన్నది క్రొత్తవారు అర్థం చేసుకోలేరు. కనుక బ్రాహ్మణుల భాష, బ్రాహ్మణుల డిక్షనరీయే వేరు. మరి యు.కే. వారు అందరినీ ఒక్కటిగా చెయ్యటంలో బిజీగా ఉంటారు కదా! సంఖ్య కూడా బాగుంది మరియు స్నేహము కూడా బాగుంది. ప్రతి ఒక్క స్థానానికి తమ తమ విశేషత అయితే ఉండనే ఉంది కానీ ఈ రోజు యు.కే. వారిది వినిపిస్తున్నాము. యజ్ఞ స్నేహీలు, యజ్ఞ సహయోగులు అన్న ఈ విశేషత మంచిగా కనిపిస్తుంది. ప్రతి అడుగులోనూ ముందు యజ్ఞానికి అనగా మధువనానికి వాటాను పెట్టడం వలన మంచి నంబర్లో వెళ్తున్నారు. డైరెక్ట్ మధువన స్మృతి ఒక స్పెషల్ లిఫ్ట్ గా అవుతుంది. ప్రతి కార్యములో, ప్రతి అడుగులో మధువనము అనగా తండ్రి స్మృతి ఉంటుంది లేక తండ్రి చదువు ఉంటుంది లేక తండ్రి అందించే బ్రహ్మా భోజనము ఉంటుంది లేక తండ్రి మిలనము ఉంటుంది. మధువనము స్వతహాగనే తండ్రి స్మృతిని కలిగించేది. ఎక్కడ ఉన్నాగానీ మధువనము గుర్తు రావటము అనగా విశేష స్నేహము, లిఫ్ట్ గా అవుతుంది. ఎక్కే శ్రమ నుండి ముక్తులవుతారు. సెకండులో స్విచ్ ఆన్ చేసారు మరియు చేరుకున్నారు.

బాప్ దాదాకు వేరే వజ్రాలు, ముత్యాలు ఏవీ అవసరమే లేదు. తండ్రికి స్నేహముతో కూడిన చిన్న వస్తువే వజ్రము, రత్నము, కనుకనే కుచేలుని అటుకులకు గాయనము ఉంది. స్నేహముతో కూడిన అతి చిన్న సూదిలో కూడా మధువనము గుర్తు వస్తుంది అని దీని అర్థము. కనుక అది కూడా చాలా పెద్ద అమూల్యమైన రత్నము ఎందుకంటే స్నేహానికి విలువ ఉంది. విలువ స్నేహానికే ఉంది గానీ వస్తువుకు కాదు. స్నేహము లేకపోతే ఎవరు ఎంత ఇచ్చినాగానీ అది జమ అవ్వదు మరియు స్నేహముతో కొంచెము జమ చేసినా కూడా దానికి పదమాలు జమ అవుతుంది. తండ్రికి స్నేహమంటే ఇష్టము. మరి యు.కే. వారులో యజ్ఞ స్నేహిగా, యజ్ఞ సహయోగిగా ఉండే విశేషత ఆది నుండే ఉంది. ఇదే సహజయోగము కూడా. సహయోగము, సహజయోగము. సహయోగపు సంకల్పము వచ్చినా కూడా స్మృతి అయితే తండ్రిదే ఉంటుంది కదా. కనుక సహయోగి స్వతహాగానే సహజయోగిగా అవుతారు. యోగము తండ్రితో ఉంటుంది మరియు మధువనముతో అనగా బాప్ దాదాతో ఉంటుంది. కనుక సహయోగిగా అయ్యేవారు కూడా సహజయోగమనే సబ్జెక్టులో మంచి నంబరును తీసుకుంటారు. మనస్ఫూర్తిగా చేసే సహయోగము తండ్రికి ప్రియము, కనుక ఇక్కడ స్మృతిచిహ్నమును కూడా దిల్ వాలా మందిరంగా తయారుచేసారు. కనుక దిల్ వాలా (మనసున్న) తండ్రికి హృదయపూర్వక స్నేహము, హృదయపూర్వక సహయోగమే ప్రియమైనవి. చిన్న మనసు కలవారు చిన్న వ్యాపారము చేసి సంతోషపడిపోతారు మరియు పెద్ద మనసు కలవారు అనంతమైన వ్యాపారము చేస్తారు. పునాది పెద్ద మనసు కనుక విస్తారము కూడా పెద్దదిగా అవుతూ ఉంది. ఏవిధంగానైతే చాలాచోట్ల ఉన్న వృక్షాలను చూస్తే, వృక్షపు శాఖలు కూడా కాండములా అయిపోతాయి. మరి యు.కే. పునాది ద్వారా కాండము వెలువడింది, శాఖలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ శాఖలు కూడా కాండముగా అయ్యాయి. ఆ కాండము నుండి కూడా శాఖలు వెలువడుతున్నాయి. ఆస్ట్రేలియా వెలువడింది, అమెరికా, యూరప్, ఆఫ్రికా వెలువడ్డాయి. అన్నీ కాండాలుగా అయ్యాయి మరియు ప్రతి ఒక్క కాండము యొక్క శాఖలు కూడా మంచిగా వృద్ధిని పొందుతున్నాయి, ఎందుకంటే పునాది స్నేహము మరియు సహయోగము అనే నీటితో దృఢంగా ఉంది, కనుక విస్తారము కూడా మంచిగా ఉంది మరియు ఫలాలు కూడా మంచిగా ఉన్నాయి. అచ్ఛా!

Comments