18-01-2011 అవ్యక్త మురళి

   18-01-2011        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“బ్రహ్మా బాబా సమానంగా జీవితములో ఉంటూ జీవన్ముక్త స్థితిలోని ఆనందాన్ని పొందండి, మనస్సును జయించి జగజీతులుగా అయి స్నేహానికి కానుకగా ఇవ్వండి."

 ఈ రోజు విశేషంగా బ్రహ్మా బాబా అవ్యక్తమైన స్మృతి దివసము. పిల్లలందరి నయనాలలో బ్రహ్మా బాబా స్నేహము ఇమిడి ఉంది. ఈ రోజు నాలుగు గంటలకన్నా ముందునుండే పిల్లల స్నేహము వతనానికి చేరుకుంది. బ్రహ్మా బాబాతో మిలనము చేసుకోవడము మరియు తమ హృదయపూర్వక స్నేహమునకు గుర్తుగా మాలలు బ్రహ్మాబాబా వద్దకు చేరుకున్నాయి. ప్రతి మాలలోని సుగంధములో పిల్లల స్నేహము దాగి ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు మరియు చిరునవ్వు హృదయములోని మాటలను చెబుతున్నాయి. బ్రహ్మా బాబా కూడా ప్రతి ఒక్కరికీ స్నేహానికి రిటర్నును ఇస్తున్నారు. బాబా ఏమి చూస్తున్నారంటే ఇప్పుడు కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ నయనాల భాషతో తమ హృదయంలోని స్నేహాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే ఈ పరమాత్మ స్నేహము పిల్లలు ప్రతి ఒక్కరినీ సహజంగా బాబాకు చెందిన వారిగా చేసేస్తుంది. ఈ అలౌకిక స్నేహము నా బాబా అన్న అనుభవంతో తమవారిగా చేసుకుంటుంది. ఈ స్నేహము బాబా ఖజానాలకు యజమానిగా చేస్తుంది, ఎందుకంటే పిల్లలు నా బాబా అన్న వెంటనే సర్వ ఖజానాలకు యజమానిగా అయిపోతారు. ఈ స్నేహము దేహ భానమును క్షణములో మరపింపజేసి దేహీ అభిమానిగా చేసేస్తుంది. ఒక్క బాబా తప్ప మరేవీ ఆత్మను ఆకర్షించలేవు. ఈ రోజుకు ఎంతో గొప్ప మహత్వము ఉంది. ఇది కేవలం స్మృతి దివసమే కాదు, సమర్థ దివసము కూడా ఎందుకంటే ఈ రోజున బాబా విశ్వ సేవ కొరకు స్వయం చేయించేవారిగా అయ్యి పిల్లలను చేయువారిగా తయారు చేసేందుకు తిలకమును దిద్దారు. సన్ షోస్ ఫాదర్ (పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు) చేయించేవారు నిమిత్తంగా చేసారు. స్వయం చేయించేవారిగా అయ్యి పిల్లలను చేయువారిగా తయారుచేసారు. అది సేవలో సఫలతకు సాధనమయ్యింది. ఎందుకంటే సేవలో సఫలతకు సాధనము - నేను కేవలం చేసేవాడిని, చేయించేవారు చేయిస్తున్నారు - ఈ స్మృతి లేక ఈ స్థితి ఎంతో అవసరము ఎందుకంటే 63 జన్మల నేను అన్న స్మృతి దేహ అభిమానంలోకి తీసుకువస్తుంది. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తుడిని, కేవలం చేసేవాడిని... ఈ స్మృతితోటే స్వయాన్ని నిమిత్తంగా భావించడం ద్వారా దేహ అభిమానం సమాప్తమైపోతుంది. అందుకే పిల్లలను చేసేవారిగా చేసారు, స్వయం చేయించేవారిగా అయ్యారు. చేసేవారిగా అవ్వడం ద్వారా స్వతహాగానే నిమిత్తంగా మరియు నిర్మాణంగా అవుతారు. ఇప్పుడు కూడా పిల్లలు సేవలో నిమిత్తంగా అయి సేవ చేయడం ద్వారా సేవాధారుల మస్తకంలో సేవా ఫలితంగా సితార మెరవడాన్ని బాప్ దాదా చూస్తున్నారు. మెజారిటీ పిల్లల సేవను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. కావున ఇటువంటి పిల్లలకు విశేషంగా బ్రహ్మా బాబా వాహ్ పిల్లలు వాహ్! అంటూ అభినందనలు తెలుపుతున్నారు.

           ఇక ముందు కూడా నిమిత్తంగా అయ్యి, సేవను ముందుకు తీసుకు వెళ్తున్నందుకు బ్రహ్మా బాబా విశేషంగా సంతోషిస్తున్నారు అలాగే అభినందనలు కూడా తెలుపుతున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మా బాబా పిల్లలకు తమ సమానంగా ఫరిశ్తా స్థితిలో ఉండేందుకు సూచనలను ఇస్తున్నారు. ఏవిధముగా బ్రహ్మా సదా బాబా జీవితంలో ఉంటూ జీవనముక్తిలో ఉండేవారో, అలా పిల్లలకు కూడా అటెన్షన్‌ ఉండడం బాప్ దాదా గమనించారు. ఎంతో బాధ్యత ఉన్నప్పటికీ, ఇంత పెద్ద పరివారమును సంభాళించడము, అందరినీ యోగి జీవితంవారిగా చేయడము, ఇంతటి సేవా బాధ్యతను సంభాళించడము, సేవలో సదా అందరినీ ముందుంచడము, అన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ జీవన్ముక్త స్థితిలోని ఆనందంలో ఉండేవారు, అందుకే భక్తి మార్గంలో బ్రహ్మకు ఆసనంగా కమల పుష్పాన్ని చూపిస్తారు. జీవన్ముక్తులుగా అయ్యి ఇప్పుడే జీవన్ముక్త స్థితిలోని ఆనందాన్ని పొందారు, అలాగే పిల్లలందరినీ తయారు చేసారు. ఇప్పుడు కూడా పిల్లలైన మీ అందరికీ ఫరిశ్తాగా అయ్యేందుకు భిన్న భిన్న యుక్తులను చెప్పి తమ సమానంగా తయారు చేయాలనుకుంటున్నారు.

           బాప్ దాదా ఏమి చూసారంటే పిల్లలందరి లక్ష్యము మంచిగా ఉంది. మీ లక్ష్యము ఏమిటని ఎవరిని అడిగినా ఏమని అంటారు? ఏమంటారో గుర్తుందా? బాబా సమానంగా అవ్వాల్సిందే. మరి బాబా సమానంగా ఎలా అవుతారు? ఈ జీవితంలోనే జీవన్ముక్త జీవితానికి సాంపుల్ గా  అవుతారు. బాప్ దాదా ఏమి చూసారంటే ఏ హోమ్ వర్కు నైతే ఇప్పుడం జరుగుతుందో అందులో అటెన్షన్ పెడ్తారు, అనుభవం కూడా చేసుకుంటారు, కానీ సదా చేయడం లేదు. ఏ పని అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగిందో దాని రిపోర్టులో కొంతమంది పిల్లలు పురుషార్ధం చేసి ఒక్కొక్క మాసం అటెన్షన్‌ను ఉంచారు. కొన్ని జోన్ల రిపోర్టు ఒక్క మాసం యొక్క రిజల్టులో మంచిగా వచ్చింది. ఎవరైతే రిపోర్టును పంపారో, ఏ జోను వారైతే పంపారో వారికి బాప్ దాదా వాహ్ పిల్లలు వాహ్! అంటూ అభినందనలు తెలుపుతున్నారు కానీ బాప్ దాదా ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారు? బాప్ దాదా పిల్లలందరి నుండి ఏమి కోరుకుంటున్నారంటే ఇప్పుడు అప్పడప్పుడూ మంచిగా ఉంటున్నారు, కానీ బాప్ దాదా సదా మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. యోగిగా కూడా చక్కగా అయ్యారు కానీ, బాబా సదా యోగిగా చేయాలనుకుంటున్నారు. ఈ మధ్య బాప్ దాదా పిల్లలకు హోమ్ వర్కును కూడా ఇచ్చారు. సదా ఉండటానికి, ప్రతి గంట మీపై మీరు ఏదో ఒక యుక్తిని ఉంచండి. అప్పుడప్పుడూ అన్న పదమునకు బదులుగా సదా అన్నది రావాలి. మన్ జీతే జగత్ జీత్ (మనస్సును జయిస్తే జగత్తును జయించినట్లే) అన్న నానుడి అనుసారంగా మనసుకు ఏ సంకల్పాన్ని ఇస్తే అది దాన్నే చేయాలి. ఎందుకని? ఎలా అయితే ఇతర కర్మేంద్రియాలు ఎలా చెబితే అలా నడుచుకుంటాయో అలాగే మనసుకు కూడా ఏది ఆర్డర్ చేస్తే అదే చేయాలి. అభ్యాసం చేస్తున్నారు కానీ అప్పుడప్పుడూ చేయడం లేదు కూడా. మనస్సును శక్తులు అనే కళ్ళెముతో ఎలా కావాలంటే అలా నడిపించాలి అని బాప్ దాదా ఆశిస్తున్నారు. మన్ జీతే  జగత్ జీత్ అన్న గాయనము ఎవరిది? అది పిల్లలైన మీ గాయనమే కదా! ప్రతి కల్పము చేసారు కావుననే ఈ గాయనము వచ్చింది. ఎందుకంటే ఎలా అయితే ఇతర కర్మేంద్రియాలను నావి అని అంటారో అలా మనసును కూడా నాది అని అంటారు కదా, నాది అనడము అంటే యజమానిగా అవ్వడము అని అర్థము. మనసులో ఏ సంకల్పము చేయాలనుకుంటే, ఎంత సమయం చేయాలనుకుంటే అది అలా చేసేందుకు బంధింపబడి ఉంది ఎందుకంటే అది నాది. మరి బాప్ దాదా ఈ స్నేహ దివసము నాడు ఇవ్వాలనుకుంటున్న హోమ్ వర్కు ఏమిటంటే- ఏ సంకల్పం చేయాలనుకుంటారో అదే నడవాలి. ఒకవేళ మీరు శుద్ధ సంకల్పం చేయాలనుకుంటే ఆ శుద్ధ సంకల్పము వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసేయాలి. ఒకవేళ యోగం చేయాలనుకుంటే, సంస్కారాల కారణంగా వ్యర్థ సంకల్పాలు రావడము లేక యోగ సిద్ధి లభించకపోవడము..... అన్నది కంట్రోల్ అవ్వాలి ఒకవేళ ఒక గంట యోగం చేయాలనుకుంటే మనసు డిస్టర్బ్ చేయకూడదు. ఆత్మ యజమాని, మనసు యజమాని కాదు. మనసు అయితే ఆత్మకు సహచరుని వంటిది. కావున సహచరుడికి ప్రేమతో ఆర్డర్ ఇవ్వండి, మనస్సును జయిచే వారిగా అవ్వండి. ఎందుకంటే, మధ్య మధ్యలో వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటాయి, వద్దనుకున్నా కూడా వస్తూ ఉంటాయి అని బాప్ దాదా వద్దకు చాలామంది పిల్లల సమాచారము వస్తూ ఉంటుంది. మరి వీరిని యజమానులు అని అనగలమా! మరి బ్రహ్మా బాబాపై స్నేహము ఉంది కదా, ఈ ప్రేమతో బాబా తమ హృదయంలోని ఆశను వినిపిస్తున్నారు - ఇప్పుడు మనస్సును జయించి జగత్ జీతులుగా అవ్వవలసిందే. మరి బ్రహ్మా బాబాకు ఈ స్నేహపూర్వక కానుకను ఇస్తారా? స్నేహానికి గుర్తుగా ఏమి ఇస్తారు? కానుకను ఇస్తారు కదా! ఈ రోజు బ్రహ్మా బాబా పిల్లల నుండి ఈ కానుకను కోరుకుంటున్నారు. సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నారా? చేతులెత్తండి. ఈ రోజు నుండి ఎప్పుడు ఆర్డర్ చేసినా కానీ, వ్యర్థ సంకల్పలను ఈ రోజు నుండి రానివ్వకండి. ఇలా చేయగలరా? ఈ రోజు రెండు గంటలు, నాలుగు గంటలు యోగ స్థితిలో కర్మలను కూడా చేయండి, యోగం కూడా చేయండి, చేయగలరా? చేయగలరా? చేస్తారా? ఇప్పడిక గడిచిందేదో గడిచిపోయింది, కానీ ఇప్పుడు ఈ రోజు వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ అని ఆర్డర్ చేయండి. మరి ఇది చేయాలి కదా!

            ఈ రోజు యోగంలో ఇదే లక్ష్యమును పెట్టుకోండి, దాని అనుసారంగానే రోజంతా పురుషార్ధం చేయవలసి ఉంటుంది కదా. బాబాపై ఉన్న స్నేహం కారణంగా బాబా ఏది చెబితే అది చేయాలి. వ్యర్థ సంకల్పాలు సమాప్తం, ఇందుకు యుక్తి ఏమిటంటే బ్రహ్మా బాబా స్నేహాన్ని హృదయపూర్వకంగా గుర్తు చేసుకోండి. సాకారంలో చూసినా చూడకపోయినా బుద్ధిబలం ద్వారా అయితే అందరూ చూసారు కదా! చూసారా, చూడలేదా? నేను బాబా ప్రేమను చూసాను, నేను బ్రహ్మా బాబా పాలనను చూడటమేకాదు, దానిపైననే నడుస్తున్నాను అని అనేవారు చేతులెత్తండి. అచ్ఛా! చేతులెత్తి సంతోషపరిచారు. బాప్ దాదాకు సంతోషంగా ఉంది, ధైర్యమునైతే ఉంచారు కదా. కానీ ఎప్పుడైనా, ఏదైనా శక్తి తగ్గినప్పుడు సదా బాబా సంబంధాలను గుర్తుంచుకోండి. ఎన్ని సంబంధాలున్నాయి! బాబా ఒకసారి తండ్రిగా అయితే, మరోసారి కొడుకుగా కూడా అయిపోతారు. ఒకసారి తండ్రిగా అయితే, మరోసారి ప్రియునిగా కూడా అయిపోతారు. కావున సంబంధాలనైనా గుర్తు చేసుకోండి లేక ప్రాప్తులనైనా గుర్తు చేసుకోండి. ప్రాప్తులు మరియు సంబంధాలు - ఏవిధముగా ఈ రోజు మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటున్నారో అలా స్మృతి చేస్తే ప్రేమ ఉత్పన్నమైపోతుంది. ఈ రోజు అందరి హృదయాలలో బ్రహ్మా బాబాలోని ప్రేమ గుర్తుకు వస్తోంది కదా! కావున ఏదైనా పైకీ క్రిందకు అయినప్పుడు సంబంధాలు మరియు ప్రాప్తులను గుర్తు చేసుకోండి. బాబా పిల్లలందరికీ సహయోగిగా ఉంటారు, కేవలం మీరు గుర్తు చేయండి. మరి ఈ రోజు ఏమి చేయాలో అర్థమయిందా? మన్ జీత్ జగత్ జీత్ (మనస్సును జయిస్తే జగత్తును జయించినట్లే) అన్న గాయనములోని స్వరూపాన్ని ధారణ చేయండి, ఆర్డర్ తో నడిపించండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా వదలడం వలన మనసు దాని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు అటెన్షన్ ఉంచండి. మనసు నా ఆర్డర్ అనుసారంగా నడుచుకోవాలి అంతేకానీ కానీ మనసు చెప్పినట్లు నేను నడుచుకోవడం కాదు. జ్ఞాన విషయాలను స్మరించాలని అనుకుంటారు, కానీ వ్యర్థ విషయాలు వచ్చేస్తాయి. అప్పుడు ఏమయినట్లు? మనసు యజమానిగా అయినట్లా లేక మీరు యజమానిగా అయినట్లా? మరి అందరూ ఈ హోమ్ వర్కును అర్థం చేసుకున్నారా? మనస్సును జయించేవారిగా అవ్వాలి. మనసు మీరు ఏది ఆర్డర్ చేస్తే దానిని ఒప్పుకుంటుంది, తప్పక ఒప్పుకుంటుంది. కేవలం అటెన్షన్ ఉంచవలసి ఉంటుంది. మాతలు మరియు టీచర్లు, వీలవుతుందా? వీలవుతుందా? టీచర్లు చేతులెత్తండి. టీచర్లు చేతులెత్తుతున్నారు. వీలవుతుంది అని భావిస్తే చేతులు ఊపండి. మొదటి లైను వారైతే ఊపండి. సోదరులు చేతులూపండి. వాహ్! అయితే బ్రహ్మా బాబాకు స్నేహపు కానుకను ఇచ్చారు, అందుకు అభినందనలు, అభినందనలు.

           మంచిది, బాప్ దాదాపై స్నేహము ఎంతో సహయోగాన్ని ఇస్తుంది. మనస్ఫూర్తిగా నా బాబా అని అంటారు, నా బాబా అంటున్నారంటే మరి నేను ఎవరిని? బాబాకు అతి ప్రియమైన సంతానమును. అందరూ నా బాబా, నా బాబా అని ఎన్ని సార్లు అంటారు? బాబా అంటారు కదా, అన్నీ నోట్ చేసుకుంటారు. డబుల్ విదేశీయులు కూడా వింటున్నారు కదా! బాప్ దాదా ఏమి చూసారంటే, పూర్తి సీజన్ అంతా డబుల్ విదేశీయులు హాజరయ్యారు. మధువనంలో అన్ని వేళలా వీరు హాజరై ఉంటారు. ఇప్పుడు కూడా 350మంది ఉన్నారు. తమ టర్నులో కూడా వస్తారు, అలాగే ప్రతి టర్నులో కూడా కొద్ది కొద్దిగా ఎక్కడో అక్కడి నుండి వస్తూ ఉంటారు. కావున ఈ రిజల్టును బాప్ దాదా కూడా చూస్తూ ఉంటారు, అంతే కాక మీరందరూ కూడా సాక్షిగా అయ్యి మీ రిజల్టును మీరు చూసుకుంటూ ఉండండి. (మనస్సుపై)యజమానిగా అవుతాము అని బాప్ దాదాకు ఇచ్చిన ప్రతిజ్ఞను మర్చిపోకండి. బాప్ దాదా ఇప్పుడు పిల్లలకు, కనీసం ఒక్కొక్క జోనుకు ఈ కార్యాన్ని ఇవ్వవచ్చు. ఈ జోన్ ఈ వారం లేక 15 రోజులు వ్యర్థ సంకల్పాలు రాలేదు అని, మనసుకు ఏ విషయమైతే ఇవ్వడం జరిగిందో అది చేసారా, చేయలేదా అని రిజల్టు ఇవ్వాలి. టీచర్లకు ఇది సమ్మతమేనా? సమ్మతమేనా? జోన్ కు కార్యమును ఇద్దామా? చేతులెత్తండి, టీచర్లు, మహారాష్ట్ర కదా! మరి మహారాష్ట్రకు మహా కార్యమును ఇవ్వాలి. బాప్ దాదాకు ప్రతి జోన్‌పై ప్రేమ ఉంది. బాబా చెప్పిన వెంటనే పిల్లలు చేస్తారు అని పిల్లలపై నమ్మకం పెట్టుకుంటారు. అలా ఉన్నారు కదా! మహారాష్ట్ర వారు బాబా చెప్పింది చేసేస్తారు, అంతేకదా? మహారాష్ట్ర వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. క్లాసులో మూడువంతులు ఉన్నారు. ప్రతి జోన్ వారు బాబాకు ఆజ్ఞాకారులే. అందరూ తల ఊపుతున్నారు. నా పిల్లలు నిశ్చయబుద్ధిగలవారు అని బాబాకు నిశ్చయముంది.

           బాప్ దాదా ఏమి ఆశిస్తున్నారంటే, ప్రతిరోజు వినే మహావాక్యాలే మీకు హోమ్ వర్కు. ఒకవేళ రోజూ మురళిలో బాబా చెప్పినదానిని పిల్లలు చేసినట్లయితే వారిని గారాల పిల్లలు, ఆజ్ఞాకారి పిల్లలు అని అనడం జరుగుతుంది. ఏమి చేయాలన్నది రోజు మురళి నుండి చదవండి. ఎందుకంటే బాప్ దాదా ఏమి చూసారంటే- మెజారిటీ పిల్లలు మురళిపట్ల ప్రేమను ఉంచుతారు. ఒకవేళ ఎవరైనా ప్రేమ ఉంచకపోతే, బాప్ దాదాతో ఎవరైనా పిల్లలు- బాబా, మీపై నాకు చాలా ప్రేమ ఉంది అని అంటే, బాబాకు దేనిపై ప్రేమ ఉంది? అని అడుగుతారు. మురళిపై, మురళి కోసం ఎంత దూరం నుండి వస్తారు! ఇంత దూరం నుండి వచ్చి చదివించే టీచరెవరైనా ఉంటారా? మరి బాబా ప్రేమ మురళిపై ఉన్నప్పుడు, నా బాబా అన్నవారి ప్రేమ మొదట బాబాతో పాటుగా మురళిపై కూడా ఉండాలి. చూడండి, బ్రహ్మా బాబా ఒక్క రోజు కూడా మురళి మిస్ చేయలేదు. కొన్ని కారణాల వల్ల బొంబాయి వెళ్ళవలసి వచ్చినా కానీ మురళిని వ్రాసేవారు, మాతేశ్వరి ఆ మురళిని వినిపించేవారు. చివరి రోజున ఆరోగ్యం కొద్దిగా బాగోలేదు, ఉదయం క్లాసును చేయించలేదు కానీ, సాయంత్రం క్లాస్ చేయించిన తర్వాతే అవ్యక్తమయ్యారు. మరి బ్రహ్మా బాబాకు దేనిపై ప్రేమ ఉంది? మురళిపై. ఎవరైతే తమకు బాబాపై ప్రేమ ఉంది అని భావిస్తున్నారో, బాబాకు దేనిపై ప్రేమ ఉందో దానిపై పిల్లలకు కూడా ప్రేమ ఉండాలి కదా! కావుననే మురళిని చదవాలి, క్లాసులో వినాలి అని మీరు భావిస్తారు. కానీ ఒకవేళ తప్పని పరిస్థితులలో, సాకు కాదు, సరైన కారణం ఉంటే ఎవరి ద్వారా అయినా మురళిని వినండి. మురళిపై ఇంతటి మహత్వమును ఉంచుతాను అని భావించేవారు చేతులెత్తండి. అచ్ఛా, ఇక్కడైతే అంతా కనిపిస్తోంది, బాబా వెనుక ఉన్నవారిని కూడా చూస్తున్నారు. అచ్ఛా, చాలా మంచిది. బాబా మధ్య మధ్యలో పరీక్ష తీసుకుంటారు. ఈ రోజు ఎవరు మురళి వినలేదో వారి గురించి టీచరు వ్రాసి పంపాలి. ఇష్టమే కదా! అచ్ఛా!

           ఈ రోజు బ్రహ్మాబాబా పిల్లలు ప్రతి ఒక్కరితో కలిసి నయనాల ద్వారా అందరికీ చాలా చాలా స్నేహమును ఇస్తున్నారు. అచ్ఛా-

           నలువైపుల నుండి పిల్లల ద్వారా సందేశాలు వచ్చాయి. నలువైపుల నుండి ప్రియమైన అతి మధుర భావాలు లేక భిన్న భిన్న భావాల స్మృతులు, నలువైపుల నుండి భిన్న భిన్న ఉత్తరాలు వచ్చాయి. - పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహంతో బాబా హృదయంలో ఇమిడి ఉన్నారు మరియు తండ్రి పిల్లల ఈ అవినాశి స్నేహము అనాది, అవినాశి మరియు పూర్తి సంగమయుగములో తండ్రి పిల్లల ఈ మిలనము నిశ్చితమయ్యంది అని అందరికీ బాప్ దాదా బదులు ఇస్తున్నారు అచ్ఛా!

మహారాష్ట్ర, ముంబయి, ఆంధ్ర ప్రదేశ్ :- (14 వేల మంది వచ్చారు) అందరికీ విశేషంగా ఈ బాప్ దాదాల స్నేహ దివసమంటే ఎంతో స్నేహము. సదా ఈ స్నేహము అమరంగా ఉంటుంది. వచ్చినవారందరూ లేచి నిల్చున్నారు. ఇలా టర్నులవారీగా వచ్చే అవకాశం ఏదైతే లభిస్తుందో అది ఇష్టమేనా? ఇష్టమేనా? ఇప్పుడు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేరు. ప్రతి జోన్‌కు టర్ను లభిస్తుంది. ఈ సిస్టమ్ ఇష్టమేనా? ఇష్టమేనా? ఈ సిస్టమ్ నచ్చింది కదా? బాగుంది. ప్రతి జోను వారు విశాల మనసుతో తమతోటి వారిని తీసుకురావడాన్ని చూడడం జరిగింది. యజ్ఞ సేవకు అవకాశం కూడా లభిస్తుంది మరియు కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఈ యజ్ఞ సేవ కొద్ది రోజులు లభించినా కానీ యజ్ఞ సేవ చేసి వెళ్ళిన తర్వాత మీ జీవితంలో యజ్ఞం పట్ల ఆకర్షణను అనుభవం చేసుకుంటారు. అందుకే ఈ పరివారమేమిటి! జోనులో కూడా ఇంత పరివారం కలవదు. కానీ మధువనానికి రావడము, బాప్ దాదాను కలవడము, దానితో పాటు పరివారాన్ని కూడా కలవడం జరుగుతుంది. ఒక్కసారి యజ్ఞ సేవను చేసినట్లయితే సదా యజ్ఞము నయనాలలోకి వస్తూ ఉంటుంది. విన్నదానిలోనూ, చూసినదానిలోనూ తేడా ఉంటుంది కదా! మధువనం పిల్లలు ప్రతి ఒక్కరి ఇల్లు. సేవార్థం మాత్రమే భిన్న భిన్న స్థానాలలోకి పంపించడం జరిగింది. ఎందుకంటే విశ్వ సేవకులుగా అవ్వాలి కదా! మాకు తెలియదు, మా తండ్రి వచ్చారు, వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళారు కానీ మాకు తెలియదు అన్న ఫిర్యాదు రాకూడదు. అందుకే బాప్ దాదా అన్ని వేళలా ఇదే చెప్తూ ఉంటారు- మీ చుట్టుపక్కలవారికి, గ్రామగ్రామానికి, ప్రతి ఏరియావారికి - మీ తండ్రి వచ్చేసారు అన్న ఈ సందేశాన్ని తప్పకుండా ఇవ్వండి. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా అది వారి భాగ్యము, కానీ ఫిర్యాదు రాకూడదు. సందేశమును ఇవ్వడము మీ పని, ఒప్పుకోవడము మరియు భాగ్యమును తయారు చేసుకోవడము వారి చేతుల్లో ఉంది. కానీ మీ మీద ఎటువంటి ఫిర్యాదు రాకూడదు. చాలా బాగుంది, మహారాష్ట్రలో సేవ విస్తారం చాలా బాగుంది. ఇందుకోసం బాప్ దాదా టీచర్లకు మరియు సేవ చేసేవారికి విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. ఎటువంటి పేరు ఉందో, అటువంటి పని చేస్తున్నారు. విస్తారం చేసారు, ఇంకా క్రొత్త క్రొత్త ప్లాన్లను తయారుచేయండి. ఢిల్లీ వారు ప్లాన్‌ను తయారుచేస్తున్నారు, బాబాయే చెప్పారు మరియు దానిని ప్రాక్టికల్ లోకి తీసుకు వస్తున్నారు. అలాగే మహారాష్ట్ర కూడా ఏదో ఒక క్రొత్త ప్లాన్‌ను, పాత విధంగా కాక క్రొత్త రూపంలో సేవ చేసే ఉపాయాన్ని ఆలోచించండి మరియు నలు వైపుల సందేశాన్ని వ్యాపింపజేయండి. మహారాష్ట్రలో అయితే వ్యాపింపజేస్తున్నారు కానీ నలువైపుల వ్యాప్తి చెయ్యడానికి ఏదైనా ప్లాన్‌ను తయారుచేయండి. దాని ద్వారా భిన్న భిన్న దేశాలలో మీ ద్వారా సేవ యొక్క సందేశం చేరాలి. మంచిగా అనిపిస్తోంది. బిజీగా ఉండటము అంటే మాయాజీతులుగా ఉండటము. బాప్ దాదా మహారాష్ట్రను చూసి సంతోషిస్తున్నారు. టీచర్లు కూడా సంతోషంగా ఉన్నారు కదా. అచ్ఛా!

డబుల్ విదేశీ సోదరిసోదరులతో :- డబుల్ విదేశీయులు అని వినగానే అందరి మనస్సులలో ఎంతో ప్రేమ కలుగుతుంది. బ్రాహ్మణ పరివారంలో కూడా ప్రేమ యొక్క అల ఎగురుతుంది. ఎంత దూరమున్నా కానీ దూరాన్ని హృదయపూర్వక స్నేహంతో సమీపంగా చేసుకోవడము, ఇది డబుల్ విదేశీయుల విశేషత. సేవను కూడా వ్యాప్తి చేస్తున్నారు. ఈ సమాచారాన్ని కూడా బాప్ దాదా వింటూ ఉంటారు. ఇప్పుడు ఇక ఎవ్వరూ మిగిలి ఉండకూడదు, మాకు సందేశమును ఎవ్వరూ ఇవ్వలేదన్న ఫిర్యాదు రాకూడదు. ఇప్పుడు ఫారెను వారు ఇండియా వారితో కలిసి నలువైపులా సందేశాన్ని ఇవ్వడాన్ని చక్కగా ప్రాక్టికల్ లోకి తెస్తున్నారు. ఏ ఒక్క ధర్మము కూడా మిగిలి ఉండకూడదు, సందేశమును ఇవ్వాలి. విదేశీ సేవ మొదటి నుండి వాతావరణంలో వ్యాప్తి చెందడానికి కారణం - ప్రారంభంలో కూడా అందరూ ఒకే స్టేజీపై ఒకే సమయంలో కలిసి కూర్చునేవారు, క్రిస్టియన్లు, ముస్లింలు కూడా అందరూ భిన్న భిన్నమైనవారంతా ఒకేసారి స్టేజీపై కలిసి కూర్చునేవారు. కావున వీరు సర్వులకు తండ్రి అని ప్రత్యక్షంగా కనిపించేది. కావున ఎవ్వరూ మిగలకూడదు. అలాగే భారత దేశంలో కూడా, విదేశాలలో కూడా. శాఖలు ఏవైనా కానీ, సందేశం తప్పక చేరుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సమయం కూడా ఎలా ఉందంటే, అందరి మనసు కొద్దిగా మారుతోంది. దుఃఖ అశాంతుల అలలు విదేశాలలో కూడా వ్యాపిస్తున్నాయి. భారతదేశంలో అయితే ఉండనే ఉంది. అందుకే ఇప్పుడు వినాలన్న కోరిక పెరుగుతోంది. చూడండి, మీరు ఆహ్వానమును ఇస్తే హాలు నిండిపోతుంది, ఇంకా మిగిలిపోతున్నారు. అలాగే జనుల కోరిక కూడా పెరుగుతోంది. అందుకే బాగా సేవ చేయండి, అవకాశాలు కూడా లభిస్తున్నాయి. కావున విదేశీయులకు సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి, ఇది రోజురోజుకు కనిపిస్తూ ఉంది. కానీ గ్రామం నుండి వచ్చినా, విదేశాల నుండైనా, ఎక్కడి నుండి వచ్చినా కానీ, అందరికీ బాప్ దాదా - సేవ బాగా చేయండి అనే చెప్తున్నారు. సమయం ఎప్పుడైనా మారవచ్చు. మీరు చేయాలనుకున్నా కానీ సేవను చేయలేని సమయం కూడా రానుంది. అందుకే ఏది చేయాలన్నా ఇప్పుడే చేయండి. ఎప్పుడు అని అనకండి, ఇప్పుడు. రేపటిపై ఎప్పుడూ వదలకండి అని బాప్ దాదా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఈ రోజుపై కూడా వదలిపెట్టవద్దు, ఇప్పుడే చేయండి. ఎందుకంటే సమయము, పంచ తత్వాలు బాబా వద్దకు వస్తాయి, ఎప్పటి వరకు ఈ దుఃఖం ఉంటుందో మాకు చెప్పండి అని అడుగుతాయి. స్వయం దుఃఖంలో ఉంటే ఏమి చేస్తాయి? మనుష్యాత్మలను కూడా దు:ఖితముగా చేస్తాయి కదా. అందుకే ఎవరైతే వచ్చారో వారు, ఏమని సంకల్పం చేయాలంటే ఎలా అయితే బ్రాహ్మణ జీవితము ఆవశ్యకమో అలాగే ఇప్పటి సమయానుసారంగా ప్రతి ఒక్కరికీ సేవ కూడా అవసరమే. చేయండి లేక చేయించండి. డబుల్ విదేశీయులను చూసి పూర్తి పరివారం సంతోషిస్తుంది, అలాగే స్వయమూ సంతోషిస్తున్నారు మరియు బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. మన్ జీత్ జగత్ జీతులుగా అవ్వవలసిందే అని బాప్ దాదా ఏ హోమ్ వర్కునైతే ఇచ్చారో, అది మీ గాయనమే, దానిని కేవలం రిపీట్ చేయాలి. అచ్ఛా!

కలకత్తా సోదరీసోదరులు పూలతో అలంకరించారు:- బాగుంది, ఎంతో కష్టపడవలసి ఉంటుంది. కానీ ఈ కష్టము, మీ హృదయపూర్వక ప్రేమ పూలలో కనిపిస్తుంది. చేతులతో శ్రమించినా లేక ఉత్సాహాన్ని కలిగించే పని చేసినా కానీ శ్రమకు ప్రతిఫలంగా బలము మరియు ఫలము తప్పక లభిస్తాయి. కావున చాలా చాలా స్నేహాన్ని బాప్ దాదా విశేషంగా కలకత్తా వారికి ఇస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మా బాబాలో ప్రవేశత కూడా కలకత్తాలోనే జరిగింది. అందుకే స్నేహానికి రెస్పాన్స్ ఇచ్చేందుకు కలకత్తా వారే నిమిత్తమయ్యారు. మంచిగా ప్రేమగా చేస్తారు. ఇందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. మీ అందరికీ కూడా నచ్చుతుంది కదా! పరివర్తన కావాలి కదా, వీరు తమ స్నేహాన్ని ప్రత్యక్ష రూపంలో చేసి చూపిస్తున్నారు. అచ్ఛా!

           ఇప్పుడు ఏ పిల్లలైతే సమ్ముఖంలో ఉన్నారో లేక దూరంగా ఉండి కూడా చూస్తున్నారో, బాప్ దాదా ఏమి విన్నారంటే ఇప్పుడు నలువైపుల ప్రతి దేశంలో సెంటరుకు కూడా వెళ్ళి చూస్తున్నారు, వింటున్నారు, రాత్రి ఎంత సమయం అయినా కానీ చూస్తున్నారు. ఈ సైన్సు సాధనాలు కూడా మీ కోసమే వెలువడ్డాయి. మరియు మీకే లాభం కలుగుతోంది. ఒకవేళ సైన్సు ద్వారా వినాశనమైనా కానీ మీ రాజ్యం కోసమే చేస్తున్నారు. కావున నలువైపుల ఉన్న స్నేహీ పిల్లలు విశేషంగా బ్రహ్మా బాబా యొక్క ప్రియస్మృతులను, హృదయపూర్వక ప్రేమను స్వీకరించగలరు.

దాదీలతో :- భాగ్యము సేవ లేకుండా ఉండనివ్వదు. ఎవరికి ఎంత భాగ్యము ఉంటుందో ఆ భాగ్యము వారిని తప్పక తీసుకువెళుతుంది. భాగ్యము కదా! బాగుంది. ఇప్పుడు ఎవరైతే అదృష్టవంతులుగా ఉన్నారో వారిని సమయం తీసుకు వస్తుంది. బాబా చెప్పారు కదా, సమయం ఇప్పుడు అకస్మాత్తుగా రానుంది, సమయం ఏదో ఒక ఆత్మను మేల్కొల్పుతూనే ఉంది. చాలా బాగుంది.

పర్ దాదీతో :- (కూతురు తండ్రితో కలుస్తోంది) ఇప్పుడైతే బాబా సమానంగా అవ్వనున్నావు, ఇప్పుడు సేవ ప్రారంభిస్తావు. తనతో సేవ చేయించండి, బిజీగా ఉంచండి. ఎంతోమంది వస్తూ ఉంటారు, వారిలో ఎవరికైనా అనుభవం వినిపిస్తూ ఉండనివ్వండి, సేవ చేస్తూ ఉండనివ్వండి. చాలా బాగుంది.

నిర్మల దీదీతో :- (ఆరోగ్యం మంచిగా ఉండటం లేదు) ఎందుకలా అవుతుందో మీకు అర్థమయ్యింది. ఎందుకు అన్న కారణాన్ని అర్థం చేసుకోండి, ఆ కారణాన్ని రానివ్వకండి. తెలుసు కదా, జ్ఞాని ఆత్మవు కదా. తెలుసుకో, దాని నుండి దూరంగా ఉండు, రానివ్వకు.

ముగ్గురు అన్నయ్యలతో :- పాండవులతో కలుస్తూ ఉంటారు, ఇది చాలా బాగుంది. మీరు ముగ్గురూ సేవపై ధ్యానమునుంచి, క్రొత్త క్రొత్త ప్లాన్లతో, ఇతర ఏ ఏ సాధనాలతో త్వరత్వరగా ఎవ్వరూ మిగిలపోకుండా సందేశాన్ని అందించవచ్చో ప్లాన్‌ను తయారుచేయండి. సెంటరు, జోనువారు కూడా ప్లాన్‌ను ఆలోచిస్తారు కానీ మీ బుద్ధి కూడా నడవాలి. సేవలో ఏ నవీనతను తీసుకురావాలి మరియు దానితోపాటు పూర్తి యజ్ఞంలో ఏమి జరుగుతుందో మధ్య మధ్యలో ఒకసారి తిరిగి చూడండి. అన్ని స్థానాలలో సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలను ఇవ్వండి. ఎన్నో జోన్లు సేవలను చేస్తూనే ఉన్నాయి కానీ కొన్ని స్థానాలలో పెద్ద ప్రోగ్రాములను ఇప్పటి వరకు చేయలేదు వారికి ఉత్సాహాన్ని ఇచ్చి నిమిత్తంగా చేయండి ఎందుకంటే పరస్పరంలో కలిసినప్పుడు ఇక్కడే ప్లాన్‌ను ముందుగా చేసుకోండి. తర్వాత ఎక్కడెక్కడ ఉన్నా, ప్రతి ఒక్కరూ తమ దగ్గర ఉన్న స్థానాలలో తిరిగి చేయండి. సేవా బాధ్యతను అర్థం చేసుకోండి - మీరు చేయించాలి. చేయించడంతోపాటు మీరూ చేయవలసి ఉంటుంది. సరేనా, మీ ప్లాన్ విన్నాము, మంచిగా ఉంది.

           మీరు నిమిత్తమయ్యారు, ఇంకెవ్వరూ రారు, మీరే వస్తారు కదా! నిమిత్తంగా ఉన్నారు అంటే నిమిత్తమైన వారిలో ధారణ కూడా నేర్పించండి మరియు ప్రేమను కూడా ఇవ్వండి. ప్రేమ అంటే అలాంటి ప్రేమ కాదు, ఎవరికి ఏది అవసరమో వారికి అది ఇప్పించడము లేక ఇవ్వడము ఇది కూడా ప్రేమయే. ఇలా నిమిత్తంగా అవ్వండి. సరేనా. (రమేష్ అన్నయ్యతో) ఆరోగ్యం మంచిగా అయిపోతుంది, ఎక్కువ ఆలోచించకండి. ఏదైతే జరుగుతుందో దానికి ఒక్క క్షణములో ప్లాన్‌ను ఆలోచించండి, చాలు. ఇలా కావాలి, ఇలా అవ్వాలి అని వద్దు. ఒక్క క్షణములో ప్లానును తయారు చెయ్యండి. ఇప్పుడు చెప్పాము కదా, ఇక సమయాన్ని ప్రతి విషయంలోనూ తక్కువ ఇవ్వండి, కొద్ది సమయంలోనే ఫైనల్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో సమయానికి ఎంతో విలువ ఉంది, బ్రాహ్మణులొక్కొక్కరికీ విలువ ఉంది.

ఆఫ్రికాలో రిట్రీట్ సెంటర్ తయారవుతోంది, ప్లాన్ ను బాప్ దాదాకు చూపించారు :- పిల్లలందరూ ఎవరైతే నిమిత్తమయ్యారో వారి ఉత్సాహము ఇక్కడి వరకు చేరుకుంటోంది. బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఎంతగా సెంటర్లు పెరుగుతాయో అంతగా తప్పిపోయిన పిల్లలు తమ భాగ్యాన్ని తయారు చేసుకోగలరు. మీరు ప్రారంభోత్సవము చేయడం లేదు, అనేకుల భాగ్యాన్ని తెరిచేందుకు నిమిత్తులవుతున్నారు.

హంసా అక్కయ్యతో :- మీరు వ్రాసిన సమాచారం అందింది, ఇప్పుడు ఈ రోజు- ఎంత ఆలోచించాలి, ఏమి ఆలోచించాలి అని ఏ పని అయితే చెప్పామో, ఆ పనిని చేయండి. ఇందులో నంబర్‌వన్‌గా వెళ్ళండి.

హైదరాబాదు నుండి వచ్చిన శాంతి సరోవర్ కోర్ కమిటీ మెంబర్లను గూర్చి అవ్యక్త బాప్ దాదా మహావాక్యాలు-

            మీరందరూ సేవకు నిమిత్తమయ్యారు. ఈ సేవ విశ్వ సేవ. కేవలం హైదరాబాదుకు మాత్రమే చెందినది కాదు, ఇది విశ్వ సేవ. విశ్వ సేవ చేయడం ద్వారా ఆత్మలో సంతోషం కలుగుతుంది ఎందుకంటే పుణ్య కర్మ చేస్తున్నారు కదా! ఎక్కడ పుణ్యము ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు జీవితాన్ని ఎంతో ఉన్నతంగా ఎగురవేస్తాయి. వీరందరూ సేవకు నిమిత్తులు అని బాప్ దాదాకు సమాచారం అందింది, చాలా మంచిది. చేస్తూ ఉండండి మరియు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆశీర్వాదాలు లభించటం ఈ కార్యం కోసం ఎంతో పెద్ద ప్రాప్తి, సూక్ష్మంగా ఉంటుంది. కావున ఎవరు ఎక్కడ సేవ చేస్తున్నా కానీ, దానిని సేవగా భావించవద్దు, మీ పుణ్యమును జమ చేసుకుంటున్నారు. పుణ్యం జమ అవ్వడం వలన ఆటోమేటిక్ గా మీ సేవాభావానికి ఫలితం లభిస్తుంది, బలము లభిస్తుంది. కావున సంతోషంగా ఆహ్వానిస్తూ ఉండండి మరియు ఆ ఆత్మల పట్ల కూడా శుభ భావనను ఉంచుతూ ముందుకు వెళ్ళండి. ఎవరు వచ్చినా, వారు సుసంపన్నముగా అయి వెళ్ళాలి. ఇటువంటి శుభ భావన, శుభ కామనతో సేవలో ముందుకు వెళ్తూ ఉండండి. ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు తీసుకువెళ్తూ ఉండండి అప్పుడు సఫలత మీ జన్మ సిద్ధ అధికారంగా లభిస్తుంది. కానీ సేవలో శుభ భావన, శుభ కామన ఉంచినట్లయితే సేవ ద్వారా బలము లభిస్తుంది, మీకు కూడా సంతోషం కలుగుతుంది. ఏ కార్యం కోసం చేస్తున్నారో ఆ కార్యంలో వచ్చే ఆత్మలకు కూడా సంతోషం ప్రాప్తిస్తుంది. చాలా బాగుంది. ఏ సేవ చేసినా బాప్ దాదా యజ్ఞ సేవను చేస్తున్నారు. యజ్ఞ సేవను చేయడంలో ఎంతో పుణ్యం ఉంది. చాలా బాగున్నారు, ముందుకు వెళ్తూ ఉండండి మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. అచ్ఛా, బాగుంది, అందరూ ఎక్కడ ఉన్నా మంచిగా ఉన్నారు, ముందుకు వెళ్తూ ఉండండి, తీసుకు వెళ్తూ ఉండండి.

వీడ్కోలు సమయంలో - పాటను పాడారు - ఇప్పుడు వదిలి వెళ్ళకు, మనసు ఇంకా నిండలేదు...* మనసు నిండేది కాదు. సదా తోడుగా ఉన్నారు, తోడుగా ఉంటారు, తోడుగా వెళతారు. (84 జన్మలు బాబాతో కలిసి ఉంటాము)ఉండండి. బ్రహ్మా బాబా తరఫున అందరికీ చాలా చాలా ప్రేమ.(బాబా, మీకు వెళ్ళాలని ఉందా) డ్రామాలో ఉంది. అచ్ఛా!

Comments