17-02-2011 అవ్యక్త మురళి

    17-02-2011        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“మనసా సేవ ద్వారా ఆత్మలకు అంచలిని ఇచ్చే సేవను చేస్తూ, బహుకాలము నుండి తీవ్ర పురుషార్థము చేసి ఎవరెడీగా ఉండండి, అప్పుడు మాలలో మణిపూసగా అయిపోతారు"

            ఈ రోజు స్నేహ సాగరుడు తమ స్నేహి పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. నా బాబా, రండి... అని పిల్లలు గుర్తు చేసుకున్నారు. బాబా కూడా నా స్నేహి పిల్లలు అని అంటారు. స్నేహములో ఎంతటి ఆకర్షణ ఉందంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాను తమవారిగా చేసుకున్నారు, అలాగే బాబా కూడా పిల్లలు ప్రతి ఒక్కరినీ, నా పిల్లలూ అంటూ తమలో ఇముడ్చుకున్నారు. అద్భుతం! పిల్లలు నా బాబా అన్నప్పుడు, ఈ 'నా' అన్న పదంలో ఎంత స్నేహము నిండి ఉందంటే, బాబా కూడా నా పిల్లలు అని అన్నారు, స్నేహము ఏమేమి చేస్తుంది! పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో ఈ రోజు స్నేహపు అలలు కనిపిస్తున్నాయి. ఇది చూసి బాప్ దాదా హర్షిస్తున్నారు. స్నేహమే హృదయమును సొంతం చేసుకునేందుకు సాధనము. పిల్లలందరిలో ఈ రోజు స్నేహపు అలలను చూసి బావాదా కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు.

           ఇప్పుడిప్పుడే 5 నిమిషాల కొరకు బాప్ దాదా అందరితో డ్రిల్ చేయిస్తున్నారు. మీ మనసా శక్తితో, సృష్టిలో ఉన్న మీ భక్తులు లేక అనేక దుఃఖిత, అశాంత ఆత్మలు ఎవరైతే, హే మా పూర్వజులారా! కొద్ది సమయం కోసమైనా మాకు శాంతిని ఇవ్వండి, కొద్దిగా సుఖము యొక్క అంచలిని ఇవ్వండి, కాపాడండి అని మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారో, ఇటువంటి ఆత్మలను ఇక్కడ కూర్చునే ఇమర్జ్ చేసుకోండి, కాపాడండి, కాపాడండి... అన్న వారి మొర వినిపిస్తోందా! మరి అటువంటి ఆత్మలకు మీ మనసా శక్తి ద్వారా సుఖశాంతుల కిరణాలను అందించండి. ఈ మనసా సేవ రోజంతటిలో పదే పదే చేస్తూ ఉండండి. ఎందుకంటే బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా విశ్వ సేవకులు. ఎలా అయితే వాణి ద్వారా రోజంతటి సేవలకు నిమిత్తమవుతారో అలాగే మధ్య మధ్యలో మనసా సేవను కూడా అభ్యాసం చేస్తూ ఉండండి. ఇందులో మీకు కూడా లాభము ఉంది. ఎందుకంటే ఒకవేళ మీ మనసు సదా సేవలో బిజీగా ఉన్నట్లయితే మధ్య మధ్యలో మీ వద్దకు మాయ అనవసరమైన లేక వ్యర్థ సంకల్పాలనేవైతే తీసుకువస్తుందో వాటి నుండి రక్షింపబడతారు. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఎలా ఉన్నారు అని ఇప్పుడు బాప్ దాదా అడిగితే మరి ఏమని జవాబు ఇస్తారు? పురుషార్థం జరుగుతోంది కానీ అప్పుడప్పుడు.... సదా పురుషార్థం జరగడం లేదు. అప్పుడప్పుడు అన్న పదము సమాప్తమైపోవాలి- బాప్ దాదా ఇప్పుడు పిల్లలందరి వద్ద ఈ రికార్డ్ ను చూడాలనుకుంటున్నారు. అప్పుడప్పుడు అన్న పదము సమాప్తమైపోవాలి, ఇది వీలవుతుందా? సమయానికి తయారైపోతారా? అవుతున్నాము, అయిపోతాము... వీటికి బదులుగా ఇప్పుడు ఎవరెడీగా అవ్వగలరా? ఎందుకని? ఎవరెడీగా ఉండే అభ్యాసము, మాయాజీత్, మన్ జీత్ జగత్ జీత్ - ఈ సంస్కారము కూడా చాలా సమయము నుండి ఉంచుకుంటేనే అంతిమ సమయంలో కూడా ఈ బహుకాలపు అభ్యాసము విజయులుగా తయారుచేసి మిమ్మల్ని విశేషంగా మాలలోని పూసగా చేస్తుంది, పాస్ విత్ ఆనర్ గా అవుతారు. పాస్ కాదు, పాస్ విత్ ఆనర్. మరి చెప్పండి, ఈ ధైర్యము ఉంది కదా! పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి కదా? ఎవరైతే ద్వాపరం నుండి ఇప్పటి వరకు పూజ్యులుగా అయ్యారో అనగా మాలలోని పూసగా అవుతారో, మరి మాలలో పూసగా అయ్యే శుద్ధ సంకల్పాన్ని తీసుకున్నారు కదా!

            బాప్ దాదా కూడా రోజూ అమృతవేళ తమ మాలలోని పూసలను చూసి వారితో విశేష మిలనము జరుపుతారు. మరి మీరందరూ స్వయాన్ని మాలలోని పూసలుగా భావిస్తున్నారు కదా! 16 వేల మాల కూడా ఉంది, కానీ అది రెండవ నంబరు మాల అవుతుంది కదా! విశేషంగా ఏ మాల అయితే గాయనయోగ్యంగా మరియు పూజ్యనీయయోగ్యంగా అవుతుందో అది మొదటి మాల. ఈ రోజు బాప్ దాదా ఆ పూసలను చూస్తున్నారు ఎందుకంటే బ్రహ్మా బాబాతో పాటు విశేషంగా రాజ్యాధికారికి తోడుగా వారే ఉంటారు. కావున ఈ రోజు బ్రహ్మా బాబా తమ ఇప్పటి తీవ్ర పురుషార్థి మరియు భవిష్య రాజ్యాధికారి పిల్లలను చూస్తున్నారు. సింహాసనంపై అయితే ఇద్దరే కూర్చుంటారు కానీ రాజుకు తోడుగా ఉండేవారిది మొదటి మాల అవుతుంది. మరి స్వయాన్ని పరిశీలించుకోండి. బాప్ దాదాతో పాటు అయి వెళ్తారు, ఎందుకంటే ఇప్పుడు మీ అందరిదీ తిరుగు ప్రయాణం. వెళ్ళవలసే ఉన్నప్పుడు, బాబాతో పాటు వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళేది లేదు. మరి తోడుగా వచ్చే సమీప పూసలుగా ఎవరవుతారు? ఎవరైతే బహుకాలము నుండి తీవ్ర పురుషార్థం చేస్తున్నారో వారే అవుతారు. పురుషార్థం కాదు, అప్పుడప్పుడూ కాదు. బహుకాలపు తండ్రి సమానులే రాజ్యాధికారులుగా అవుతారు. మరి మీరు ఏమని భావిస్తున్నారు? తీవ్ర పురుషార్థం ఉందా? నేను పురుషార్థి లైనులో ఉన్నాను అని స్వయం గురించి భావించేవారు చేతులెత్తండి. తీవ్ర పురుషార్థులు, పెద్దగా చేతులెత్తండి, చిన్నగా కాదు. అచ్ఛా! చాలామంది ఎత్తుతున్నారు. మళ్ళీ చేతులను పైకి ఎత్తండి. అచ్ఛా!

           బాప్ దాదా అయితే రోజూ పిల్లల చార్టును చూస్తారు. మెజారిటీ తీవ్ర పురుషార్థులుగా కూడా ఉన్నారు కానీ, అప్పుడప్పుడు అన్న పదాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అని బాబా ఎందుకు అంటున్నారు? అటెన్షన్ ప్లీజ్, సూక్ష్మ సంకల్పాలలో కూడా అలజడి రాకూడదు. అచలముగా, స్థిరముగా - శుద్ధ సంకల్పధారులుగా చాలాకాలము నుండి అవ్వవలసిందే. కొంతమంది పిల్లలు చాలా మధురంగా ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటారు. ఏమంటారంటే, బాబా, మేము తయారైపోతాము. సమయం ఎంతగా సమీపిస్తూ ఉంటుందో అంతగా పరిస్థితులు అలజడిలోకి వస్తూ ఉంటాయి అప్పుడు వైరాగ్యమైతే ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ అప్పుడు మీకు టీచర్ ఎవరు అయినట్లు? సమయమా లేక బాబానా? సమయమైతే మీ రచన. బహుళాలపు తీవ్ర పురుషార్థము అంతిమంలో పాస్ విత్ ఆనర్ గా చేస్తుంది అని ఇప్పుడు బాప్ దాదా సూచనను ఇస్తున్నారు. పాస్ అయితే అందరూ అవుతారు, కానీ పాస్ విత్ ఆనర్ గా అవ్వడానికి బహుకాలము నుండి నిరంతర తీవ్ర పురుషార్థము అవసరము. కావున ఈ రోజు తారీఖును నోట్ చేసుకోండి, ఒకవేళ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు, సమ్ థింగ్ అనగా ఏదో ఒకటి అవుతాము, చేద్దాములే అన్న పదాలు ఇంకా వస్తూ ఉంటే... బాబా ప్రేమ అయితే సదా ఉంటుంది. చివరి మణిపై కూడా బాబాకు ప్రేమ ఉంది. ఎందుకని? మనస్ఫూర్తిగా 'నా బాబా' అని అయితే అన్నారు కదా! ఈనాటి(ప్రపంచంలోని) పెద్ద పెద్ద ఆత్మలు కూడా 'నా బాబా' అని అనరు, కానీ చివరి పూసగా ఉన్నవారు కూడా 'నా బాబా' అని నమ్ముతున్నారు కావున బాబా ప్రేమ వారిపై కూడా ఉంటుంది. పిల్లలపై ప్రేమ అయితే సదా ఉంటుంది, చివరి వరకు ఉంటుంది, చివరి పూసపై కూడా ఉంటుంది. స్నేహమే మిమ్మల్ని బాబాకు చెందినవారిగా చేసింది. మెజారిటీ పిల్లలకు స్నేహము ఉంది, ఉంటుంది అని బాప్ దాదా చెప్తున్నారు కానీ కేవలం స్నేహము కాదు, శక్తి కూడా కావాలి. తీవ్ర పురుషార్థం కూడా కావాలి. ఇప్పుడు శివరాత్రి కూడా సమీపిస్తోంది. ఇది బాబా అవతరణతో పాటు పిల్లల అవతరణ కూడా. కావున బాప్ దాదా ఏమి ఆశిస్తున్నారంటే ఈ శివరాత్రి నాడు పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని సాధారణ పురుషార్థిగా కాక తీవ్ర పురుషార్థిగా తయారు చేసుకునేందుకు, అయ్యేందుకు సంకల్పం చేయాలి. వీలవుతుందా? శివరాత్రినాడు స్వయంతో స్వయమే దృఢ సంకల్పాన్ని చేయండి. వ్రాయాల్సిన అవసరం లేదు, క్లాసులో చెప్పనవసరం కూడా లేదు, కానీ బాబాతో, మీ హృదయంలో సంకల్పం చేయండి - శివరాత్రి నాడు మేము అప్పుడప్పుడూ అన్న పదాన్ని మా పురుషార్థమనే డిక్షనరీ నుండి తొలగిస్తాము అని దృఢ సంకల్పాన్ని చేయండి. వీలవుతుందా? ఇది ఏమంత పెద్ద విషయము కాదు, సంకల్పం చేయగానే అది జరిగిపోతుంది, ధైర్యము ఉంచగలము అని భావించేవారు చేతులెత్తండి. అచ్ఛా! సంతోషపెట్టారు.

           బాప్ దాదాకు పిల్లలపై నమ్మకం ఉంది. ఇప్పటి నుండే అటువంటి పిల్లలకు పదమా పదమరెట్లు అభినందనలను ఇస్తున్నాము. వాహ్ పిల్లలు వాహ్! ధైర్యశాలి పిల్లలు! మీ ధైర్యము మరియు తండ్రి సహాయము ఉండనే ఉన్నాయి. మీ మనసును బిజీగా పెట్టుకోవడానికి ఇప్పుడు ఒక్క విషయము చేయండి, బాబా ముందు కూడా చెప్పి ఉన్నారు కదా, క్షణములో స్టాప్! నేను బిందువును, బిందువును పెట్టాలి మరియు అందరినీ బిందువు రూపంలో చూడాలి. బిందువునే చూసినప్పుడు ఇతర ఏ సంకల్పాలు రావు. మనసా సేవపై అటెన్షన్ ను ఉంచండి. దు:ఖిత ఆత్మలు మొర పెట్టుకుంటున్నాయి. వారికి కిరణాలను ఇచ్చే సేవలో కూడా మనసును అదనంగా ఉపయోగించండి. మనసా సేవ చాలా శ్రేష్ఠమైనది. దీనివలన దుఃఖంలో ఉన్నవారికి కూడా లాభము, స్వయానికి కూడా లాభము జరుగుతుంది. డబుల్ లాభము. ఎలా అయితే వాచతో సేవ చేస్తారో, సేవ కూడా పెరుగుతూ ఉంది, మనసుతో చేస్తున్నారు, సంఖ్య కూడా పెరుగుతుంది, సెంటర్లు కూడా పెరుగుతూ ఉన్నాయి, మెజారిటీ పిల్లల వాచ సేవ మంచిగా ఉంది. అందరిదీ కాదు, మెజారిటీ వారిది. అలాగే ఇప్పుడు మనసుతో విశేషంగా ఆత్మలకు అంచలిని ఇచ్చే సేవను కూడా చేస్తూ ఉండండి. మనసును ఫ్రీగా వదలకండి. ఏదో ఒక సేవలో, మనసుతో శక్తులను ఇవ్వడము, నోటితో వాచ సేవ, కర్మలతో గుణాల సేవ, సంబంధ సంపర్కములో సంతోషాన్ని ఇచ్చే సేవ... ఇలా భిన్న భిన్న సేవలలో మనసును బిజీగా ఉంచండి ఎందుకంటే పూర్తి విశ్వంలో రిచెస్ట్(ధనవంతులైన) ఆత్మలు ఎవరు? మీరే కదా! ఎన్ని ఖజానాలు లభించాయి! మరి ప్రతి ఖజానాతో సేవను చేయండి. ఖజానాలను ఎంతగా సేవలో వినియోగిస్తారో అంతగా ఆ ఖజానాలు పెరుగుతూ ఉంటాయి కావున ఇప్పుడు ఎలా అయితే స్వ సేవపై అటెన్షన్ ఉంచుతున్నారో, అలాగే మీ దుఃఖిత ఆత్మలకు, భక్తులకు మనసు ద్వారా కిరణాలను ఇచ్చే సేవను కూడా అటెన్షన్‌తో రోజంతా చేయండి. చాలా మొర పెట్టుకుంటున్నారు, మీకు వినిపించడం లేదా! మెజారిటీ ప్రతి ఇంట్లో ఏదో ఒక దుఃఖ కారణము ఉంటుంది. ఇలా దు:ఖంతో ఉన్నవారికి సుఖాన్ని ఇచ్చేది ఎవరు? చెప్పండి, వారు ఎవరు? మీరే కదా! మరి ఈ మనసా సేవను రోజంతటిలో పరిశీలించుకోండి - స్వయం కోసం సమయాన్ని ఇచ్చినట్లుగా మనసా సేవ కోసం ఎంత సమయాన్ని ఇచ్చాను? అని పరిశీలించుకోండి. దయా హృదయులు కదా. కావున దుఃఖంతో ఉన్నవారిపై దయ చూపండి. మీ పాట కూడా ఉంది కదా, హే తల్లిదండ్రుల్లారా, దుఃఖంతో ఉన్నవారిపై దయ చూపండి. బాప్ దాదా ఎంతగానో వారి మొరను వింటూ ఉంటారు. మీకు తక్కువగా వినిపిస్తుంది, కానీ ఇప్పుడు వినండి. వారు ఎక్కడికి వెళ్తారు? మీ సోదరీ సోదరులే కదా. కావున స్వయానికి కూడా లాభాన్ని పొందండి, మనసును బిజీగా ఉంచండి మరియు దు:ఖంతో ఉన్నవారి దు:ఖాన్ని హరించండి. మొర పెట్టుకుంటున్నారు, మనసు విలవిలలాడుతుంది. బాప్ దాదా అయితే వింటున్నారు. అప్పుడు పిల్లలను గుర్తు చేసుకుంటారు, హే నా గారాల పిల్లలూ! ప్రియమైన పిల్లలూ! ఇప్పుడు దయా హృదయాన్ని ధారణ చేయండి. బ్రాహ్మణులలో కూడా పరస్పరం సహయోగులుగా అవ్వండి. ఎవరు ఎటువంటి సంస్కారంతో ఉన్నాకానీ, మీ పని ఏమిటి? సంస్కారాలతో ఘర్షణ జరపడమా లేక వారిని కూడా సంస్కారాల ఘర్షణ నుండి విముక్తులనుచేయడమా?   దు:ఖహర్త సుఖకర్త అన్నది మీ టైటిల్ కూడా కదా! బాబాతో పాటు ఉన్నారు కదా! బాబాతో పాటుగా ఉండేవారు ఏ సంకల్పాన్ని తీసుకున్నారు? ఈ విశ్వాన్ని దుఃఖము, అశాంతి నుండి మార్చి సుఖశాంతులను స్థాపన చేయవలసిందే. చేయవలసిందే కదా! చేతులెత్తండి. చేయాలా? లేక కేవలం చూడటమేనా? జరుగుతోంది, కానీ ఇప్పుడు మారాలి. వారు బ్రాహ్మణ ఆత్మ అయినాకానీ చూస్తూ ఉండకండి. ఇది చేస్తున్నారు కానీ, వారికి కూడా వాణి మరియు మనసా సంకల్పం ద్వారా పరివర్తన చేయండి, చేయాలి అని అనద్దు. బాప్ దాదా వింటూ ఉంటారు. బాప్ దాదాకు విషయాన్ని ఇచ్చేసారు, బాప్ దాదాకు ఇచ్చేసినప్పుడు స్వయం ఇక బాబా ఆజ్ఞలపై నడవండి. బాధ్యులు బాప్ దాదా, వారితో ఉన్న ప్రియమైన పిల్లలు, నిమిత్తమైన పిల్లలు. మరి సదా మీ మనసును వ్యర్థ సంకల్పాలకు బదులుగా ఇప్పుడు దుఃఖిత ఆత్మలకు, వారు బ్రాహ్మణులే కావచ్చు మరెవరైనా కావచ్చు, డిస్టర్బ్ అయి ఉన్న ఆత్మలకు సహయోగాన్ని ఇవ్వండి. సహయోగిగా అవ్వండి. అచ్ఛా!

           ఇప్పుడు ఈ రోజు మొదటిసారిగా వచ్చినవారు లేవండి. అందరూ చూసారా! బాప్ దాదా మొదటిసారి వచ్చినవారికి సభ మధ్యలో పుట్టినరోజు జరుపుతున్నారు. కనెక్షన్‌లో ఉన్నప్పటికీ బాబాను కలుసుకోవడానికి వచ్చారు. కావున ఇక్కడ బ్రాహ్మణ పరివారం మధ్య పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బాప్ దాదాకు సంతోషంగా ఉంది, ఎవరైతే ముందునుండి కనెక్షన్‌లో ఉన్నారో వారి గురించి చెప్పడం లేదు, మధువనానికి మొదటిసారిగా వచ్చినవారికి బ్రాహ్మణుల మధ్య సెరిమనీ జరుపుతున్నాము. ఇంతమంది బ్రాహ్మణుల అభినందనలు లభిస్తున్నాయి. కానీ భవిష్యత్తును గూర్చి ఇలా ఆలోచించండి, స్థాపన కార్యం తర్వాత ఆలస్యంగా ఇక్కడకు చేరుకున్నారు, కావున మిగిలిన సమయంలో తీవ్ర పురుషార్థం చేయండి. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఒక్క క్షణములో 10 నిమిషాల పనిని చేయండి, అటెన్షన్ ఉంచండి. మీ పురుషార్థాన్ని తీవ్రం చేసి ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. ఇది మీ అందరికీ బ్రాహ్మణులందరి తరఫున, బాబా తరఫున శుభ భావన, శుభ కామన. అచ్చా!

సేవ టర్నుయు.వి., బెనారస్, పశ్చిమ నేపాల్ వారిది:- అచ్ఛా, మొదటిసారి వచ్చినవారు కూర్చోండి. అచ్ఛా! యు.పి. టీచర్లు ముందు నిల్చుని ఉన్నారు. బాగుంది, యు.పి.లో నలువైపుల నుండి భక్తులు చాలామంది చేరుకుంటారు. యు.పి. వారు వీలైనంతగా భక్తులకు సందేశమును తప్పక ఇవ్వండి. సందేశమును ఇవ్వడము మీ పని. భాగ్యము తయారు చేసకోవడము, ఎంత భాగ్యము చేసుకుంటారు అన్నది వారి చేతుల్లో ఉంది. కానీ, మా తండ్రి వచ్చారు, మా తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు, వీరు సందేశాన్ని ఇవ్వలేదు, మేము కొంతైనా వారసత్వాన్ని తీసుకునే వారము కదా! అని మీకు ఫిర్యాదు ఇవ్వకూడదు. యు.పి. వారు అలా చేస్తూనే ఉన్నారు, బాబా వద్దకు సమాచారము వస్తూ ఉంటుంది, అయినప్పటికీ, , ఎంత వీలైతే అంత సందేశమునిచ్చే పాఠము మీకు సహజమే. యు.పి. పట్ల బ్రహ్మా బాబాకు, జగదాంబకు చాలా ప్రేమ ఉంది. ఎంతగా బ్రహ్మా బాబా యు.పి. కి వచ్చారో అంతగా ముంబయికి కూడా వచ్చారు, కానీ యు.పి.కి వచ్చారు. మరి ఎక్కడైతే బ్రహ్మా బాబా అడుగు పడిందో ఆ స్థానము ఎంత భాగ్యవంతమైనది. లక్నో మరియు కాన్పూర్ రెండూ ఈ భాగ్యానికి అధికారిగా ఉన్నాయి. ముంబయి కూడా అధికారిగా అయ్యింది, కానీ ఇప్పుడు యు.పి టర్ను కదా! నేరుగా మాతాపితల శిక్షణల బిందువులు అక్కడ పడ్డాయి. ఇప్పుడు యు.పి. ఇక ఏమి చేయాలి? వాణి ద్వారా మేళాలలో సేవ అయితే చేస్తున్నారు, కానీ ఇప్పుడు సమయానుసారంగా బాప్ దాదా ఏదైతే ముందు నుండి చెప్తూ వస్తున్నారో, పేరుగాంచిన మైక్ మరియు వారసులు, ప్రఖ్యాతి పొంది ఉండటము అంటే వారి మాటల ప్రభావం వినేవారిపై పడాలి, అటువంటి మైక్ లను తయారు చేయండి. ఇటువంటి వారసుల గ్రూపును ప్రతి సెంటరులో తయారు చేయండి. యు.పిలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. మరి అంతమంది వారసులను తయారు చేయాలి. ఎన్ని సెంటర్లున్నాయి, వారసులు ఎంతమంది తయారయ్యారు అని లెక్క వేయండి. ఎంతమంది అవ్వాలో అంతమంది అయ్యారా లేక అవ్వాలా? ఒకవేళ తయారు చేయాలి అంటే, మరి సమయంపై ఎటువంటి నమ్మకము లేదు, త్వరత్వరగా వారసులను, మైక్ లను తయారు చేయండి, వారి మాటలతో అనేక ఆత్మల భాగ్య రేఖ తెరుచుకోవాలి. ఎందుకంటే మీరైతే చాలా సేవను చేసారు, పాతవారు చాలా చేసారు. ఇప్పుడు సేవ చేయించండి. చేసేవారిని తయారు చేయండి. చేయగలరు కదా! టీచర్లు చేతులెత్తండి. అచ్ఛా! టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. మరి అంతమందిని తయారు చేయండి. చిన్న సెంటరైనా, పెద్ద సెంటరైనా కానీ ప్రతి సెంటరు, సెంటరు లిస్టులో ఉండేవారు ప్రమాణమును చూపించండి. ఎందుకంటే సమయంపై ఎటువంటి నమ్మకం లేదు. ఎప్పుడైనా, ఏమైనా జరుగవచ్చు. కావున బాప్ దాదా, ఏ జోన్ వారైతే వచ్చారో, ఇక్కడ రానివారైనాకానీ, అన్ని జోన్లవారికి ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు ముందుకు సాగండి. క్లాసులైతే జరుగుతూనే ఉంటాయి, సంఖ్య కూడా పెరుగుతూ ఉంది, కానీ ఇప్పుడు నిమిత్తంగా అయ్యే వారిని తయారు చేయండి. అలా తయారు చేయడానికి బాప్ దాదా ఏమి చూసారంటే, ప్రతి జోన్లో అలా నిమిత్తంగా అవ్వగలిగిన వారు ఉన్నారు. మరి యు.పి, ఒకటి భక్తుల సేవను చేయండి. భక్తులు అని అనిపించుకునే వారు తక్కువగా ఉండవచ్చు, కానీ భక్తులు కూడా ఉన్నారు. వారికి భక్తి యొక్క ఫలితాన్ని ఇప్పించండి. చాలా శ్రమ పడుతున్నారు. ఇకపోతే అంతా మంచిగా ఉంది. ప్రతి జోను తమ పురుషార్థంలో ముందుకు వెళ్ళడాన్ని బాప్ దాదా చూసారు. కానీ ఇప్పటికీ ముందుకు సాగేందుకు మార్జిన్ ఉంది. బాబాకు అతి ప్రియమైన మంచి మంచి పిల్లలు ఉన్నారు, డైరెక్టుగా బ్రహ్మా బాబా పాలన తీసుకోగలిగేవారున్నారు. చేస్తున్నారు, చేయడం లేదని కాదు. చేస్తున్నారు కానీ, ఇంకొంచం వేగాన్ని పెంచండి. సేవ టర్ను మంచిగా లభించింది. యజ్ఞ సేవ అంటే తమ భాగ్యాన్ని తయారు చేసుకునే సేవ. ఎందుకంటే మీ వద్దకు ఎంతమంది విద్యార్థులు వచ్చినా కానీ యజ్ఞంలోకి ఎంతమంది వస్తారు! ఇంతమంది బ్రాహ్మణులకు యజ్ఞ సేవ చేయడము ఎంత పుణ్యము! సేవ చేయడానికి వస్తారు కానీ, వాస్తవానికి పుణ్యము జమ చేసుకోవడానికి వచ్చారు అని చెప్పవచ్చు. పుణ్యము తయారు చేసుకునేందుకు ఇది మంచి సాధనము, కావున బాప్ దాదా సంతోషిస్తున్నారు. మరి సేవ మంచిగా చేస్తున్నారు కదా! అన్ని జోన్‌లు మంచిగా సేవను చేస్తాయి. బాప్ దాదా వద్దకు ఎటువంటి రిపోర్టు రాలేదు. మంచివారు, మంచిగా సేవను చేస్తున్నారు. సహజమైపోతుంది. సేవ మంచిగా చేస్తున్నారు కదా! దాదీలందరూ కూడా మీకు అభినందనలు తెలుపుతున్నారు.

            పాండవులు కూడా ఎంతమంది వస్తున్నారు! పాండవులు కూడా తక్కువేమీ కాదు. కొన్ని సేవలు పాండవులే చేయగలిగేవి ఉంటాయి. కావున పాండవులకు కూడా బాప్ దాదా మరియు సర్వ మధువన నివాసీలు అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా!

10 వింగ్స్ వారు వచ్చారు:- అచ్ఛా, లేచి నిల్చోండి. మీ జెండాలను మరియు బోర్డులను బాప్ దాదా చూసారు, కావున వాటిని క్రింద పెట్టండి. ఏ వర్గంవారైతే వచ్చారో, ఎప్పటి నుండైతే వర్గాలు తయారయ్యాయో, అప్పటినుండి సేవచేసే ఉత్సాహం ప్రతి వర్గంలోనూ మంచిగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించారు, మేము చేయాలి అని అనుకుంటున్నారు. అందుకే ప్రతి వర్గంవారు సేవ చేసి తమ సంఖ్యను సెంటర్లలో పెంచుతున్నారు. రిపోర్టు అయితే బాబా వద్దకు వస్తుంది. ఇప్పుడు ఒక్క విషయము ఏమిటంటే, ఏవర్గములైతే ఉన్నాయో అందుకు నిమిత్తమైన విశేష ఆత్మలు, ఎవరినైతే విశేషంగా నిమిత్త ఆత్మలు అని అంటారో వారి సేవను చేసి ప్రతి జోన్‌లో ఒక రోజు స్థానమును ఫిక్స్ చేసి, అన్ని వైపుల ఉన్న నిమిత్త ఆత్మల సంగఠన చేయండి. ముందుగా జోన్‌లో సంగఠన పెట్టండి, తర్వాత మధువనంలో చూద్దాము. కానీ ముందుగా ఏ జోన్‌లో అయితే ఎక్కువ సేవాధారులను తయారు చేస్తున్నారో, ఆ జోన్‌లో అన్ని జోన్‌లవారు ఒక రోజును ఖాయం చేసుకుని విశేష ఆత్మల మిలనము చేయండి. ఒకరినొకరు చూసి కూడా ఉత్సాహం వస్తుంది, వీరు కూడా చేస్తున్నారు, నేను కూడా చేస్తాను, సేవను ఇంకా పెంచాలి అని అనుకుంటారు. కావున ఉల్లాస-ఉత్సాహాలను ఇవ్వడానికి, ముందుగా ఏ జోన్‌లో అయితే విశేష వర్గపు సేవ జరుగుతుందో అక్కడ ప్రతి ఒక్కరి సలహా అనుసారంగా ఒక చోటును ఫిక్స్ చేసి అక్కడకు ముందుగా పిలవండి, తర్వాత మధువనంలోకి పిలుద్దాము. ఇది ఇంకా చేయలేదు! ఎంతమంది మైకులు తయారయ్యారు, ఎంతమంది సహయోగులుగా అయ్యారు అన్నది అప్పుడు తెలుస్తుంది. ఎంతమంది పరస్పరంలో సహాయం చెయ్యగలరు అన్నది కూడా అర్థమవుతుంది. ఒక జోను, వర్గము మరో వర్గానికి కూడా సహయోగాన్ని ఇవ్వవచ్చు. అప్పుడు ఒకరినొకరు చూసుకుని, సమాచారము వింటూ ఎంతో ఉత్సాహము కలుగుతుంది. మధువనంకన్నా ముందు అక్కడే కలవండి, తర్వాత చూద్దాము. సరేనా. ఇది నచ్చితే చేతులెత్తండి. మీ అందరినీ కలిపి లేవమని చెప్పడం జరిగింది. బాప్ దాదా ప్రతి వర్గంవారికి విడివిడిగా అభినందనలు తెలుపుతున్నారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు, మీ ఉల్లాస ఉత్సాహాలను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా!

(ప్రతి వర్గంవారితో బాప్ దాదా చేతులెత్తించారు)

బిజినెస్ వింగ్:- బాప్ దాదా మిమ్మల్ని చూసారు కూడా మరియు అభినందనలు కూడా తెలిపారు, సేవాప్లాన్‌ను కూడా ఇచ్చారు. మీ అందరికీ స్పెషల్ అభినందనలు.

ఎడ్యుకేషన్ వింగ్:- మీకు కూడా బాప్ దాదా విశేషంగా ఉల్లాస ఉత్సాహాల మిఠాయిని తినిపిస్తున్నారు.

యూథ్ వింగ్:- యూథ్ ఎటువంటి గ్రూప్ ను తయారు చేయాలంటే, ఈ అక్కయ్యలు కూడా ఉన్నారు కదా! ఎటువంటి గ్రూపును తయారు చేయాలంటే- కొంత సమయం నుండి లేక ఎప్పటి నుండి వచ్చారో అప్పటి నుండి ఎంతగా మర్యాదలలో నియమానుసారంగా నడుచుకున్నారు, ఎన్ని మర్యాదలపై నడుచుకున్నారు అన్నది ఒక్కొక్కటి రికార్డు చేయండి. ఇటువంటి ఒక చిన్న గ్రూపును తయారు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళండి. వీరు మర్యాదాపూర్వక యూథ్ అని చూపించండి. అప్పుడు సేవ జరుగుతుంది.
 
ధార్మిక వింగ్, పొలిటీషియన్ వింగ్:- అచ్ఛా, వీరు కూడా వచ్చారు.

స్పోర్ట్ వింగ్:-ఇప్పుడు ఏమి చేయాలో మీరు విన్నారా? ఇప్పుడది చేయండి. అప్పుడు బాప్ దాదా దాని రిజల్టును చూసి తర్వాత మధువనానికి పిలుస్తారు. అన్ని వర్గాల వారు సేవను మంచిగా చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు, మరియు మంచి మంచి ప్లాన్లను కూడా తయారు చేస్తున్నారు. ఇందుకు అభినందనలు.

మహిళా వర్గము:- మహిళ వింగ్ లో ఎన్ని కమల పుష్పాలు ఉన్నాయి, ఇంటిలో గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండేవారు ప్రారంభం నుండి ఎంతమంది వెలువడ్డారు? సెంటరులో ఎంతమంది మహిళలు సేవ కారణంగా వచ్చారన్నది లిస్టు తయారు చేయండి. దీనికి హెడ్ ఎవరు? (చక్రధారి అక్కయ్య) అచ్ఛా! ఎన్ని పరివారాలు వచ్చాయి అని ప్రతి జోన్ నుండి లిస్టు తీసుకొని తప్పకుండా చెప్పండి, ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ప్రపంచంవారు ఇంటిని వదిలిపెట్టాలేమో అని అనుకుంటున్నారు. మొదటికన్నా తగ్గింది, కానీ అక్కడక్కడా ఇప్పటికీ ఉంది. మరి సేవతో ఎంతమంది తయారయ్యారు అన్న రిజల్టును తయారు చెయ్యండి ఎందుకంటే ప్రభుత్వంలో ప్రతి వర్గానికి వేర్వేరు డిపార్ట్ మెంటులు ఉంటాయి. మీ వర్గం ఏ రిజల్టు తీసుకువచ్చింది అని వారడుగుతారు. కావున ఈ రిజల్టు ఉండాలి, తయారు చేయండి. ప్రతి జోనువారు తమ తమ సెంటర్లలో ఎవరైతే తయారయ్యారో వారి లిస్టును వీరికి ఇవ్వండి, అప్పుడు వీరికి సహాయంగా ఉంటుంది. సరేనా!

గ్రామ వికాస వింగ్:- గ్రామ వికాస సేవ అన్నింటికన్నా మంచి సేవ. ఎందుకంటే గ్రామంలోని వారు ఎక్కువ సుఖ జీవితంలో ఉండరు. తమ పనిలో ఎక్కువ బిజీగా ఉంటారు. మీరు వారికి విశేషంగా సంతోషాన్ని అనుభూతి చేయించండి. భాషణ అయితే చేస్తూనే ఉన్నారు, కానీ, గ్రామ సేవలో ఉన్నవారు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చారు అని గ్రామంవారు అనుభవం చేసుకోవాలి. మేము సుఖంగానూ ఉన్నాము, సంతోషంగా కూడా ఉన్నాము అన్న రికార్డు రావాలి. ఎన్ని గ్రామాలలో సేవను చేసారు, అందులో ఎంతమంది అనుభవం చేసుకున్నారు. ఎందుకంటే జరిగిన అనుభవాన్ని మర్చిపోలేరు. అనుభవం చేయండి, చేయించండి. ఎన్ని గ్రామాలలో ఎంతమంది సంతోషాన్ని పొందారు మరియు కనెక్షన్లోకి వచ్చారు అన్నది రిజల్టు తయారు చేయండి. బాగుంది.

కల్చరల్ వింగ్:- కల్చరల్ వారు తమ కల్చరల్ వారి సేవను మంచిగా చేస్తున్నారు. కొంతమంది కల్చరల్ కు సంబంధించిన వారు యజ్ఞంలో సహయోగిగా రావడాన్ని బాప్ దాదా చూసారు. వారు తమ సేవా పాత్రను నిర్వహిస్తున్నారు. ఇతరులను కూడా తమ అనుభవాలతో తీసుకు వస్తున్నారు. సేవలో ముందుకు వెళ్తున్నారు, చాలా మంచిది. కల్చరల్ వారు కూడా మీ వద్దకు వచ్చి అనుభవిగా అయ్యి తమ అనుభవాలను వినిపిస్తారు అని బాబా స్థాపన సమయంలో చెప్పిన విషయాన్ని చేస్తున్నారు, ఇక ముందు కూడా చేస్తూ ఉండండి. బ్రహ్మాకుమారీ కుమారులు సేవను చేసి కల్చరల్ వారిని కూడా క్యారెక్టర్ బిల్డింగ్ కొరకు అనుభవిగా చేస్తున్నారు అన్న మాట అంతటా వ్యాపించాలి. మంచి మంచివారు వస్తున్నారు, ముందుకు సాగుతున్నారు. ఇతరులకు కూడా అనుభవాన్ని వినిపించి ముందుకు తీసుకు వెళ్తున్నారు, కావున ముందుకు సాగుతూ ఉండండి, ముందుకు తీసుకు వెళ్తూ ఉండండి.

స్పార్క్ వింగ్:- స్పార్క్ వింగ్ వారు కూడా తమ కార్యాన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ వర్గపు సేవలో ఆత్మలను అనుభవిగా చేయడాన్ని బాప్ దాదా చూస్తున్నారు. మంచి మంచి ఆలోచనలతో వారి బుద్ధిని ఎంతో మంచిగా తయారు చేస్తున్నారు, ధారణ కూడా చేయిస్తున్నారు. కావున ప్రతి ఒక్క వింగ్ వారు బాప్ దాదా చెప్పారు కనుక సేవను చేస్తున్నారు, తోటివారిని తయారు చేసుకుంటున్నారు. ఇంకా ఇంకా తోటివారిని తయారు చేసి, ఎటువంటి గ్రూపును తయారుచేయాలంటే, సంగఠనను తయారు చేయాలంటే, ఆ గ్రూపు ప్రభుత్వం ముందుకు వెళ్ళి వారికి తమ కార్యాన్ని మరియు రిజల్టును వినిపించాలి. ప్రతి వర్గంవారికి ప్రభుత్వంలో తమ తమ శాఖ ఉంది, కావున వారి సేవను కూడా చేయండి మరియు జనుల సేవను కూడా చేయండి. అచ్ఛా! 

డబుల్ విదేశీ సోదరసోదరీలు (80 దేశాల నుండి 750 మంది వచ్చారు):- విదేశీయులు ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రాములను బాప్ దాదా చూసారు, ఒక్కొక్క గ్రూపుతో ఎంతో ప్రేమతో కృషి చేస్తున్నారు. మధువన వాయుమండలంలో కొందరి అనుభవం కూడా మంచిగా, తీవ్ర పురుషార్థపు ఉల్లాస ఉత్సాహాలతో కూడినదిగా ఉంది, కావున ఇప్పుడు ఈ సమయంలో ట్రైనింగ్ తీసుకునేవారు, ట్రైనింగ్ ఇచ్చేవారు ఇద్దరిలో ఉల్లాస ఉత్సాహాలు కనిపించాయి మరియు ఒకే సమయంలో ఎంత లాభాన్ని పొందారు! ఒకటి, పరివారాన్ని కలుసుకోవడము, మధువనంలో తప్ప మరెక్కడా ఇంత పరివారము కలవడము జరుగదు. వీరు మంచి చతురతను చూపించారు, మధువనంలోనే ప్రోగ్రామును పెట్టారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. కొందరి పరివర్తన అనుభవాన్ని కూడా బాప్ దాదా విన్నారు. ఇక్కడి ధరణిలో ఏ శిక్షణ లభించినా దాని అవగాహన త్వరగా జరుగుతుంది. వాయుమండలం ఉంది కదా. మరి వాయుమండలం కూడా లభించింది, సంఘటన కూడా లభించింది. ఎంత సమయం తర్వాత ఒక్కొక్క గ్రూపువారు కలుసుకుంటారు! ఉండటము, సాంగత్యము, బాప్ దాదా మరియు రిఫ్రెష్ మెంట్... బాప్ దాదాకు ఇది చాలా నచ్చింది. కానీ ఇక్కడ ఎంత లాభము పొందారో అంతగా ప్రాక్టికల్ లో చేసి ఇతరులకు ఉల్లాస ఉత్సాహాలను పెంచడానికి నిమిత్తులవ్వండి. అవ్వగలరు, ఎందుకంటే ఏదైతే ప్లాన్ తయారు చేసారో, దానిని బాప్ దాదా సారంలో విన్నారు, మంచిగా అనిపించింది. చేసే విధానము కూడా బాగుంది. డబుల్ విదేశీయులు చక్కగా స్వయంపై కూడా అటెన్షన్ ను ఉంచుతున్నారు, ఇందుకు బాప్ దాదాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడైతే ఇది ఒక చందన వృక్షంలా అయ్యింది. భిన్న భిన్న దేశపు కొమ్మలు మధువనానికి వచ్ఛాయి, కానీ ఇక్కడకు రాగానే ఒకే చందన వృక్షంలా అయ్యారు. ఎవరైతే వచ్చారో వారికి బ్రాహ్మణ కలర్ చాలా మంచిగా వచ్చింది. నడుస్తోంది, ఇంకా అవుతూ ఉంటుంది, ఇది కూడా నిశ్చయముంది, ఇది నిశ్చితము కూడా. డ్రామాలో కూడా నిశ్చితమై ఉంది. ఓం శాంతి. ముఖ్యమైన టీచర్లు ఎవరైతే ఉన్నారో వారికి బాప్ దాదా స్పెషల్ అబినందనలు తెలుపుతున్నారు. అభినందనలు, అభినందనలు, అభినందనలు.

           ఈరోజు మధువనం వారందరూ, పైన ఉండేవారు, క్రింద ఉండేవారు, బయట ఉంటున్నా కానీ మధువనంలో చదువుకుంటున్నవారు, అందరూ లేవండి, ఎంతమంది వచ్చారు:- (రాజు అన్నయ్య మురళి టైప్ చేసుకుంటూ ఉండటాన్ని చూసి) మీరు కూడా లేవండి. ఎంత పని చేస్తారో చూడండి, అన్నిటికన్నా పెద్ద సేవ వీరు చేస్తారు. బ్రాహ్మణులందరికీ వెంటనే చేరుకుంటుంది. మీకు అభినందనలు, విశేషమైన అభినందనలు.

           మధువనంవారు లేకపోతే మీకు ఆతిథ్యం ఎవరు చేస్తారు! విశ్రాంతిగా వస్తారు, తింటారు, రిఫ్రెష్ అవుతారు, మరి మధువనం వారి కోసం చప్పట్లు కొట్టండి. స్థలం తక్కువగా ఉన్న కారణంగా మధువనంవారు కొంచెం దూరంగా కూర్చుని వింటున్నారని బాప్ దాదాకు తెలుసు. ఇది కూడా సేవయే, మధువనంవారు చేసే సేవ. ఇతరులకు సుఖమును ఇవ్వడము, సుఖదాతలుగా అయ్యారు కదా. మరి మధువనంవారి పని సుఖమును ఇవ్వడము, సుఖమును తీసుకోవడము. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ వారు అనుభవాలతో మీరు అనుభవాలను వినిపిస్తారు. ఆ అనుభవాలతో ఇతరులకు లాభము చేకూరుతుంది. ఎన్నో లాభాలు ఉంటాయి, కానీ సమయము తక్కువగా ఉన్న కారణంగా తక్కువగా వినిపిస్తారు. కానీ మధువనం వారి టైటిల్ ఏమిటి? సుఖము ఇవ్వడము మరియు సుఖమును తీసుకోవడము. సుఖదాత పిల్లలు బాబాను అనుసరిస్తారు. అచ్ఛా!

           అందరితో మిలనమైతే జరిగింది. ఎన్నో ఏర్పాట్లు చేసుకుని వస్తారు. ప్రతి వర్గంవారు చాలా ఏర్పాట్లు చేసుకుని వస్తారు, బాప్ దాదాకు తెలుసు. కానీ సమయాన్ని కూడా చూడవలసి ఉంటుంది. మరి అందరూ ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా అవుతున్నందుకు అడ్వాన్స్ గా చాలా చాలా పదమారెట్లు అభినందనలు ముందుగానే తెలుపుతున్నాము. ఇప్పుడు శివరాత్రి నాడు, ఇక్కడకు వచ్చేవారు కావచ్చు. ఇంట్లో కూర్చుని సెంటరులో కూర్చుని వినేవారు లేక మురళి ద్వారా వినేవారికి, అందరూ మురళి అయితే వింటారు కదా. ఇప్పుడు వచ్చినవారిలో మురళిని రెగ్యులర్ గా వినేవారున్నారు. కొందరు మురళిని వినని వారున్నారు. వారు చేతులెత్తండి. ఎవ్వరూ లేరు. అచ్చా! మురళిని చదవనివారు లేక విననివారు లేవండి. కొద్దిమంది ఉన్నారు. ఫర్వాలేదు, కానీ ఇప్పుడు లభించిన సమయములో బాబా మహావాక్యాలను రోజూ వినండి. బాబా పరంధామం నుండి వస్తారు, సూక్ష్మ వతనం నుండి బ్రహ్మా బాబా వస్తారు. వచ్చి మహావాక్యాలను ఉచ్ఛరిస్తారు. కావున మురళి ఎప్పడూ, ఒక్క రోజు కూడా మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మీ బాప్ దాదాల హృదయ సింహాసనం దూరమవుతుంది. కావున ఎవరైతే మురళి మిస్ చేస్తారో వారు మేము మూడు సింహాసనాలకు అధికారులము కాదు అని భావించండి. రెండు సింహాసనాలకు అధికారిగా కూడా యథాశక్తిగా అవుతారు. కావున మురళి, మురళి, మురళి. ఎందుకంటే మురళిలో రోజంతటి కోసం డైరెక్షన్లు ఉంటాయి. నాలుగు సబ్జెక్టుల గురించి డైరెక్షన్లు ఉంటాయి. కావున రోజూ డైరెక్షన్లను పొందాలి కదా! ఒకవేళ కొన్ని కారణాల వల్ల మిస్ అయితే ఎలా ఆ మురళిని వినాలి అని ప్రోగ్రామ్ తయారు చేసుకోండి. ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచించండి. ఈ రోజుల్లో సైన్సు సాధనాలు మీకోసమే వెలువడ్డాయి. బ్రహ్మా బాబాలో ప్రవేశించక ముందు, 100 సంవత్సరాల ముందు ఈ సైన్సు వెలువడింది, మీకు కూడా ఉపయోగపడనున్నాయి కావున వాటిని ఉపయోగించండి. లాభాన్ని పొందండి.

            అచ్ఛా, ఎదురుగా కూర్చుని ఉన్న వారికి, దూరంగా ఉండి వింటున్న పిల్లలకు అందరికీ బాప్ దాదాల హృదయపూర్వకమైన, ప్రాణతుల్యమైన, ప్రేమతో కూడిన ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో:- (దాదీ జానకితో) సేవ మనస్ఫూర్తిగా చేస్తావు, విశేషమైన సేవలను చేస్తావు. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ అనుభవం ఉంటుంది. పై పైన వాణి ఉన్నట్లయితే అనుభవంతో మనసుకు హత్తుకోవడమన్నది తగ్గుతుంది. మీ సేవ ఫలితం కూడా వెలువడనుంది. ఇది వరదానము. (గుల్జార్ చాలా మంచివారు) అందరూ మంచివారు. మీరందరూ మంచివారు.

మోహిని అక్కయ్య మరియు వారి డాక్టరుతో:- బాప్ దాదా విన్నారు, తక్కువ ఆలోచించండి. నవ్వుతుంది, కానీ ఎక్కువ ఆలోచిస్తోంది. ముఖము ఎర్రగా ఉంది కానీ ఎక్కువ ఆలోచించడము ద్వారా అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. బాబా మంచిగా చేస్తారు అని మాత్రం ఆలోచించండి. ఇప్పుడు డబుల్ డాక్టర్ గా అవ్వండి. సింగల్ డాక్టర్ గా అయితే చాలామంది ఉన్నారు. డబుల్ డాక్టర్. డబుల్ డాక్టర్ అవ్వాలన్న ప్రేమ అయితే ఉంది. మీరు కార్డు ముద్రించినప్పుడు దాని వెనుక వైపు ఖాళీగా ఉంటుంది కదా! మీరు మనసు యొక్క అనారోగ్యాన్ని వ్రాసి దగ్గరిలోని సెంటరు అడ్రస్సు వ్రాసి అక్కడ మెడిటేషన్ చేసి మనసును ఆరోగ్యంగా చేసుకోమని వ్రాయండి. ఎందుకంటే డాక్టర్ అని వినగానే డాక్టర్ చెప్పింది చేస్తారు. మీరు ఇంట్లో కూర్చునే సేవ చేయవచ్చు, డబుల్ డాక్టర్ అయిపోతారు. మీరు చేయరు, ఇతరులతో చేయిస్తారు. మరి చాలా సహజమైనది కదా! ఎవరు వచ్చినా అడ్రసు అడిగితే ఇవ్వండి. వారు ముద్రించి ఉంచండి, ఇటువంటి డబుల్ డాక్టర్. దవా (మందు) మరియు దువా(ఆశీర్వాదము), రెండింటితోనూ ఇప్పుడు తేడా కనిపిస్తుంది. ఇప్పుడు రెండూ బాబా తరఫున లభిస్తాయి. డబుల్ డాక్టర్ గా అవుతున్నందుకు ఇది బహుమతి.

పర్ దాదీతో:- మీ ముఖము సదా హర్షితంగా ఉండటము మీ విశేషత.(బాబా కూతుర్ని కదా) డబుల్ కూతురు మీరు. లౌకికం కూడా, అలౌకికం కూడా, పారలౌకికం కూడా. ముగురూ ఉన్నారు.

ముగ్గురు అన్నయ్యలతో:- పరస్పరంలో ముగ్గురూ కలుస్తూ ఉంటారా? (కొంచెం కొంచెం) కొంచెం కొంచెం కాదు. ఫోన్ ద్వారా కూడా కలవచ్చు. ఫారెన్ లో ఇది మంచిగా ఉంది. ఏ కార్యమైనా ఫోన్ ద్వారానే చాలా మంచి మీటింగ్ అయిపోతుంది. మరి వారి విధిని చూడండి, పరస్పరంలో కలుస్తూ ఉండండి. ఫోన్ ద్వారా కూడా కలవవచ్చు.

భూపాల్ అన్నయ్య :- నలువైపులా యజ్ఞాన్ని బాగా చూసుకుంటున్నారా! చూసుకుంటూ ఉండండి, తిరుగుతూ ఉండండి.

ఇండోర్ వి.ఐ.పీ.లతో:- మీ ఇంటికి రావడంలో మజా వస్తుంది కదా. మీ ఇంటికి వచ్చారు, మరో చోటకి రాలేదు. ఇది పరమాత్ముని ఇల్లు, అలాగే పిల్లల ఇల్లు కూడా. మరి మీ ఇంటికి వచ్చారు. సదా స్వయాన్ని నిశ్చింత చక్రవర్తిగా తయారు చేసుకుని ఉండండి. చింతించకండి, నిశ్చింత చక్రవర్తి. పనులైతే ఉంటూనే ఉంటాయి, కానీ స్వయాన్ని నిశ్చింత చక్రవర్తిగా చేసుకోండి.

           ఉదయాన్నే లేచి బాబాను గుర్తు చేసినట్లయితే రోజంతా మంచిగా జరుగుతుంది. లేవగానే, కళ్ళు తెరవగానే నా బాబా అని గుర్తు చేసుకోండి.

ధార్మిక నేతలతో:- మిమ్మల్ని చూసి ఇతరులలో కూడా ఉత్సాహం వస్తుంది. ఎందుకు, వీరికేమి లభించింది! మీ అనుభవం అనేకులకు అనుభవం చేయిస్తుంది. నిమిత్తంగా అవుతారు. (ట్రినిడాడ్ కు చెందిన బ్రహ్మాదేవ్ స్వామీజీ గీతా భగవంతుడిని నిరూపిస్తారు) ఇప్పుడు మురళి చదవండి.

సోలార్ ప్రాజెక్టు యొక్క మ్యాపును బాప్ దాదాకు చూపించారు:- నిశ్చయబుద్ధిగా అయ్యి చేయండి. అందరూ కలిసి అవ్వవలసిందే అన్న ఒక్క సంకల్పాన్నే చేయండి. (రమేష్ అన్నయ్యతో) ఇది బ్రహ్మాణులందరికీ తెలియాలి అని చెప్పాము కదా. అందరూ ఆర్టికల్ చదవరు.

Comments