16-03-2011 అవ్యక్త మురళి

    16-03-2011        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“మనసు ద్వారా ప్రకృతిని సతోగుణిగా చేసే సేవ చేయండి. శుభ భావన, శుభ కామనలను ఉంచి సంస్కార మిలనము అనే రాస్ ను చేయండి మరియు తమలోని పాత సంస్కారాలను కాల్చివేసి, ప్రభువు యొక్క సాంగత్యపు రంగును అంటించుకుంటూ నిజమైన హోలీని జరుపుకోండి”

           ఈ రోజు హోలియెస్ట్ బాబా తమ పిల్లలతో హోలీ జరుపుకోవడానికి వచ్చారు. మీరందరూ కూడా హోలీ జరుపుకోవడానికి వచ్చారు. నలువైపుల దూరంగా కూర్చుని ఉన్న పిల్లలు కూడా హోలీ జరుపుకోవడానికి కూర్చున్నారు. మీరందరూ ఏ రంగు యొక్క హోలీని జరుపుకోవడానికి వచ్చారు! అన్నిటికన్నా శ్రేష్ఠమైన రంగు పరమాత్ముని సాంగత్యపు రంగు అని మీకు తెలుసు. ఈ రంగు సదా శ్రేష్టాతి శ్రేష్ఠంగా చేస్తుంది. ఎలా అయితే బాబా ఉన్నతోన్నతమైనవారో అలాగే ఈ పరమాత్ముని సాంగత్యము ఉన్నతోన్నతంగా తయారుచేస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్య సితార కనిపిస్తుంది. ఈ భాగ్య సితార పూర్తి కల్పంలో భాగ్యశాలి ఆత్మలైన మీరు తప్ప మరెవ్వరూ పొందలేరు. ఆ శ్రేష్ఠ భాగ్యమేమిటంటే పిల్లలైన మీరే డబుల్ పవిత్రులుగా అనగా హోలీగా అవుతారు. ధర్మాత్మలు కూడా ఉన్నారు, కానీ వారు శరీరం ద్వారా పవిత్రంగా అవ్వరు. భవిష్యత్తులో బ్రాహ్మణ ఆత్మలైన మీ ఆత్మ కూడా పవిత్రమవుతుంది మరియు శరీరం కూడా పవిత్రమవుతుంది. ఇటువంటి డబుల్ పవిత్రతకు గుర్తుగా డబుల్ కిరీటం ప్రాప్తిస్తుంది. సంగమయుగంలో బాబా సాంగత్యపు రంగుతో డబుల్ పవిత్రులుగా అయిన మీరే పూర్తి కల్పంలో డబుల్ కిరీటధారులుగా అవుతారు. సంగమయుగపు పరమాత్మ సాంగత్యము డబుల్ పవిత్రులుగా తయారుచేస్తుంది. కావున మీ హోలీ బాబాతోడుగా ఉన్న కారణముగా, బాబాను కంబైండ్ గా చేసుకున్న కారణముగా డబుల్ పవిత్రముగా అయిపోతారు. సదా హృదయంలో బాబా సాంగత్యము ఉంటుంది. ఈ రంగు ఎంతో శ్రేష్ఠమైనది కనుకనే ఇంత శ్రేష్ఠంగా తయారుచేస్తుంది. మనుష్యులు స్థూల రంగులతో హోలీని జరుపుకుంటారు, కానీ మీరు బాబా సాంగత్యపు రంగుతో హోలీగా అయిపోతారు. అది కూడా డబుల్ హోలీగా. కావున మీ హోలీ ప్రపంచానికి భిన్నంగా ఉంది, పరమాత్మునికి ప్రియంగా ఉంది. మరి నషా ఉంటుంది కదా, ఈ హోలీ ప్రభువు యొక్క సాంగత్యపు రంగు కారణంగా అర్థకల్పము ఎంతటి పవిత్రులుగా చేస్తుందంటే, ఇప్పటివరకు మీ చిత్రాలు పద్ధతిపూర్వకంగా పూజింపబడుతున్నాయి. మరెవ్వరి చిత్రాలు ఇలా ప్రేమపూర్వకంగా పూజింపబడవు. మీరే స్వయంగా మీ చిత్రాలను చూస్తున్నారు. ఇతరమైనవి కూడా పూజింపబడతాయి, కానీ ఇంత సమయము, ఇంత విధిపూర్వకంగా పూజ జరగదు. మీరు సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉంటారు. ఉంటారు కదా! ఉల్లాస ఉత్సాహాలలో ఉంటారా? చేతులెత్తండి. ఉంటారా, అప్పుడప్పుడూ ఉంటారా లేక సదా ఉంటారా? సదా అన్న పదాన్ని అండర్ లైన్ చేస్తున్నారు కదా! మేము సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉంటున్నాము మరియు ఇతరులకు కూడా ఉల్లాస ఉత్సాహాలను ఇప్పిస్తున్నాము అనేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడూ కాదు, సదా. కానీ మీ స్మృతి చిహ్నము, మీ స్థితి ఎలా ఉన్నదో దానికి సృతిచిహ్నముగా మీ భక్తులు ఉత్సవం రూపంలో జరుపుకుంటున్నారు. మీరు ప్రభువు యొక్క సాంగత్యపు రంగును వేసుకున్నారు కనుక వారు కూడా రంగును వేసుకుంటున్నారు కానీ దేహాభిమానము ఉంది కదా కావున స్థూల రంగును వేసుకుంటున్నారు. ఆ రంగులో ఖర్చు కూడా ఉంది మరియు రిజల్టు కూడా కొంత మంచి కొంత మంచి కాదు, ఇలా జరుపుకుంటున్నారు. కానీ మీ ఉత్సాహానికి స్మృతి చిహ్నంగా ఉత్సవాన్ని తప్పకుండా జరుపుకుంటున్నారు. మీరు పరమాత్మునికి చెందినవారిగా అవ్వడానికి ముందుగా తమలోని పాత సంస్కారాలను కాల్చివేస్తున్నారు, ఆ తర్వాత ప్రభువు యొక్క సాంగత్యపు రంగు అంటుకోవడం వలన సదా జరుపుకుంటూనే ఉన్నారు. వారు కూడా ముందు కాలుస్తారు తర్వాత జరుపుకుంటారు. మీరు జరుపుకోవడంలో, వారు జరుపుకోవడంలో రాత్రి పగలుకున్న తేడా ఉంది. వారు బాడీ కాన్సస్ (దేహాభిమానము), మీరు ఆత్మ అభిమాని. వారు దేహ భానములో, మీరు ఆత్మిక భానములో ఉన్నారు.

           మీకు బాప్ దాదా డైరెక్షన్ ఏమిటంటే హోలీ అనగా గతం గతః. హో లీ అని కూడా అంటారు కానీ అర్థాన్ని ప్రాక్టికలోకి తీసుకురాలేరు. మీరందరూ హో లీ అనగా గతం గతః చేస్తున్నారు కదా. చేస్తున్నారు కదా! లేక అప్పుడప్పుడూ చేస్తున్నారా! ఎందుకంటే గతాన్ని గుర్తు చేసుకుంటే వ్యర్థ సంకల్పాలు చాలా వస్తాయి. సమయం కూడా వ్యర్థంగా పోతుంది. చాలా సమయం నుండి ఉన్న సంస్కారాలు వద్దన్నా కూడా వస్తూ ఉంటాయి, మరి ఈ సంగమయుగములోని ఒక్కొక్క నిమిషము 21 జన్మల ప్రాలబ్ధాన్ని కలిగింపజేసేది, అటువంటి ఒక్కొక్క సంకల్పము, ఒక్కొక్క నిమిషము ఎంతటి విలువైనది! వ్యర్థంగా పోయింది ఒక్క సెకండు కాదు అనేక జన్మల ప్రాలబ్ధములో తేడా వచ్చేస్తుంది. బాప్ దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు, సంగమ సమయాన్ని మరియు సంకల్పాన్ని ఎప్పుడూ వ్యర్థంగా పోనివ్వద్దు. ఒకవేళ సదా ప్రభువు యొక్క సాంగత్యపు రంగులో రంగరింపబడి ఉన్నట్లయితే అనగా సదా బాబాను తోడుగా పెట్టుకున్నట్లయితే సంగమయుగపు ఒక్కొక్క సంకల్పము మరియు సమయము అనగా ఒక్కొక్క నిమిషాన్ని సఫలం చేసుకోవచ్చు. మరి స్వయాన్ని పరిశీలించుకోండి, ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క సంకల్పము సఫలమవుతున్నాయా? లేక వ్యర్థంగా పోతున్నాయా? ఎందుకంటే ఒక్క నిమిషం కాదు 21 జన్మల కనెక్షన్ ప్రతి నిమిషము మరియు ప్రతి సంకల్పంతో ఉంది. ఇంత విలువైనది. మరి మీ మనసులో ఆలోచించండి, ఇంత విలువ సదా ఉంటుందా! ఈ సంగమ సమయంలో అంటారు - “ఇప్పుడు కాకున్న మరెప్పుడూ లేదు". ఇంతటి విలువ సదా స్మృతిలో ఉండాలి. మరి ఈ రోజు మీరందరూ హోలీ జరుపుకున్నారు అనగా సదా బాబా యొక్క సాంగత్యపు రంగును వేసుకున్నారు. మరి ఈ బాబా రంగు రోజంతా అంటుకుని ఉందా అని చూసుకోండి. పరమాత్ముని సాంగత్యములో ఉన్నారా లేక ఇంకెక్కడైనా సమయము, సంకల్పము వెళ్ళాయా? పరిశీలించుకున్నారా? తల ఊపండి, చేతులు కాదు, ఇలా అనండి.

           బాప్ దాదా సదా సూచన ఇస్తారు, తమ మనసు యొక్క సతోగుణి సంకల్పాల ద్వారా ప్రకృతిని కూడా సతోగుణిగా చేస్తూ ఉండండి. మరి ఆ మనసా సేవ గుర్తుంటుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి పెద్ద రూపంలో తన కార్యం చెయ్యనున్నది. ఇదైతే చిన్నదే కానీ ప్రకృతిని మనుష్యాత్మలు విసిగించారు. అందుకే అది కూడా విసిగించడము మొదలుపెట్టింది కావున బాబా అంటారు ఎలా అయితే మాయాజీతులుగా అవ్వడానికి అటెన్షన్ ఉంచుతారో, ఉంచుతారు కదా! మాయాతో మీ ప్రతిజ్ఞ ఏమిటంటే నీ పని రావడము, మా పని విజయాన్ని పొందడము అని. అందరూ ఈ విధంగా ప్రతిజ్ఞ చేసారు కదా? చేసారా? మాయాజీతులుగా అవ్వాలి కదా! అలాగే ప్రకృతిజీతులుగా కూడా అవ్వాలి ఎందుకంటే మీరు రాజ్యం చేయాలి కదా. మీ రాజ్యం రానున్నది. నషా ఉంది కదా. మనుష్యులైతే పాపం ఏమవుతుందా అని ఆలోచిస్తారు, భయపడతారు. కానీ మీకైతే తెలుసు, ఇప్పుడు సంగమయుగము అనే అమృతవేళ జరుగుతుంది. మరి అమృతవేళ తర్వాత ఏమి రానున్నది? ఉదయము. ఈ ఉదయములోనే మన రాజ్యము రానున్నది. నషా ఉంది కదా! మన రాజ్యమా లేక కేవలం మహారథుల రాజ్యమా? మీ అందరి రాజ్యము. ఏమి జరుగుతుందో అని మీకు చింత లేదు. ఎంతో మంచిగా జరుగనుంది. మీ రాజ్యంలో ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉండనుంది. మరి ప్రకృతిని తమోగుణి నుండి సతోగుణిగా ఎవరు చేయాలి? లేక ప్రకృతి ఎలా ఉంటే అలా నడిపించడమేనా? మీరే కదా చేసేది! కావున ఇప్పుడు అకస్మాత్తు యొక్క మొదటి దృశ్యము, ఇది చిన్నది, ప్రారంభమయింది. ఇప్పుడింకా పెద్దపెద్దవి రానున్నాయి, అకస్మాత్తుగా రానున్నాయి. ఊహకందనివి జరుగుతాయి.

            బాప్ దాదా అయితే ఎంతో సమయము నుండి అకస్మాత్తు యొక్క పాఠాన్ని చదివిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసిన తర్వాత అయినా మీ పనిని ప్రారంభించండి. గాబరా పడకండి. నలువైపుల నిప్పంటుకుంది కానీ పరమాత్ముని పిల్లలు సురక్షితంగా ఉన్నారు అని కథ ఉంది కదా. ఇప్పుడు కూడా పిల్లలు సేఫ్ గా ఉన్నారు కదా! పరీక్ష అయితే రానుంది మీది డబుల్ పని. ఒకటి, నిర్భయంగా అయ్యి ఎదుర్కోవాలి. రెండు, తమ భక్తులు మరియు దు:ఖంతో ఉన్న తమ సోదరసోదరీల సేవను ఎవరు చేస్తారు? ప్రభువు యొక్క సాంగత్యపు రంగును అంటించుకున్న మీరే. మరి ఎవరైతే పరమాత్ముని రంగులో ప్రాప్తిని పొంది ఉన్నారో వారు తమ సోదరసోదరీలకు, భక్తులకు ఎంతో ప్రేమతో, మనస్ఫూర్తిగా పంచండి. బాధగా ఉన్న సమయంలో ఎవరు గుర్తుకు వస్తారు? పరమాత్ముని గురించి తెలిసినా, తెలియకపోయినా నిస్సహాయతతో హే తండ్రీ, హే పరమాత్మా అని తప్పకుండా అనైతే అంటారు కదా. మరి పరమాత్ముని పిల్లలైన మీరు ఇప్పుడు దుఃఖితులకు ఆధారంగా నిలవాలి. వారికి శుభ భావన, శుభ కామనల ద్వారా, బాబా ద్వారా ప్రాప్తించిన కిరణాల ద్వారా ఆధారాన్ని ఇవ్వండి. ఎంతైనా మీ పరివారమే కదా! మరి పరివారంలో ఒకరకొకరు సహకారాన్ని అందించుకుంటారు కదా! పేరే ఉంది సహ యోగము, శ్రేష్ఠ యోగము. ఆధారాన్ని ఇవ్వడానికి అదే సాధనము. సందేశములో కూడా సమయాన్ని ఫిక్స్ చేయమని చెప్పాము. అయిపోతుందిలే అని అనకండి. ఎలా అయితే ట్రాఫిక్ కంట్రోల్, అమృతవేళ సమయము నిశ్చితమైనవి కనుక చేస్తున్నారు కదా అలాగే తమ కార్యానుసారంగా ఈ మనసా సేవ కూడా ఇప్పటి సమయం అనుసారంగా అత్యావశ్యకము. కావున సమయాన్ని కేటాయించండి, దయాహృదయులుగా అవ్వండి. కళ్యాణకారులుగా అవ్వండి. మీ స్వమానము ఏమిటి? విశ్వ కళ్యాణకారి. మరి దయ కలుగుతుందా? లేక అయిపోతుందా? ఇందులో నిర్లక్ష్యులుగా అవ్వద్దు ఎందుకంటే ఎవరికైతే మీరు సకాశ్ ను ఇస్తారో వారే మీ భక్తులుగా అవుతారు అందుకని ఏమి చేస్తారు? అటెన్షన్ ఉందా? మాకు అటెన్షన్ ఉంది, మరింత పెంచుకుంటాము అనేవారు చేతులెత్తండి. కిందకు మీదకు చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది. (టి.వి.లో) ఒకవేళ ఇంతమంది తమ స్వమానాన్ని ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చినట్లయితే ఆత్మలన్నీ ఇప్పుడు సంగమంలోనే తమ హృదయంతో వాహ్ పరమాత్ముని పిల్లలు వాహ్! మాకు ఆధారాన్ని ఇచ్చారు అని పాట పాడుతాయి. మీరు ఇప్పుడు ఇచ్చిన ఆధారము కారణంగా మీకు అర్థకల్పము మహిమ జరుగుతుంది. మీరు వారి పూర్వజులు కదా! పూర్వజులు మీరు. వృక్షంలో బ్రాహ్మణులు ఎక్కడ కూర్చున్నారు! క్రింద కూర్చున్నారు కదా. అంటే పూర్వజులే కదా. మరి భక్తుల మొర వినిపిస్తుందా? కొద్దిగా స్వయాన్ని సావధానపర్చుకోండి, దుఃఖితులకు ఆధారంగా నిలువవలసిందే అని అనుకుంటే వారి మొర వినిపిస్తుంది.

            మరి అందరూ హోలీ అయితే జరుపుకున్నారు, మీకైతే పూర్తి సంగమమే హోలీ. పరమాత్ముని సాంగత్యపు రంగులోనే ఉంటారు. ఇందుకు స్మృతిచిహ్నంగా ఒకట్రెండు రోజులు జరుపుకుంటారు కానీ మీరైతే పూర్తి సంగమము ప్రభువు యొక్క సాంగత్యములో ఉండేవారు. నషా ఉంది కదా. మనుష్యులు పాపం అడుగుతూ ఉంటారు, హే ప్రభూ, ఇది చెయ్యండి, అది చెయ్యండి అని, కానీ మీకైతే 21 జన్మల గ్యారంటీ లభించింది. ఎప్పుడూ దుఃఖపు దృశ్యాలు స్వప్నంలో కూడా రావు. సంకల్పంలో కూడా దుఃఖపు అలలు రాజాలవు. మరి సదా ప్రతి ఒక్కరూ ఒకవేళ రాజ్యం తీసుకోవాలనుకుంటే మీ సత్యయుగీ పరివారాన్ని, సహచరులను, రాయల్ ప్రజలను, సాధారణ ప్రజలను అందరినీ ఇప్పుడే తయారు చేసుకోవచ్చు. 21 జన్మల గ్యారంటీ ఉంది. కొద్దిగా సేవను చేయండి, సమయాన్ని కేటాయించండి ఎందుకంటే మీ వద్ద సంకల్ప శక్తి అయితే ఉంది కదా! బాబా నుండి లభించిన దానిని మీ సోదరసోదరీలకు ఇవ్వండి, అంతే.

            బాప్ దాదా ముందుగానే చెప్పి ఉన్నారు, నేను సదా బ్రాహ్మణ పరివారంలో సంస్కార మిలనము అనే రాస్ ను చేయాలి అని సదా స్వయాన్ని పరిశీలించుకోండి. ఆ రాస్ ఎప్పుడు చేస్తారో దాని డేట్ ను ఫిక్స్ చేయండి అని కూడా బాప్ దాదా చెప్పి ఉన్నారు. ఫిక్స్ అవ్వగలదా? అవ్వగలదా? మొదటి లైన్ లోనివారు చెప్పండి. చేతులెత్తండి. వీలవుతుందా? పాండవులు కూడా ఎత్తండి. పాండవులు లేనిదే గతి లేదు. అచ్ఛా, ఇది లాస్ట్ టర్న్, ఒక్క టర్ను మిగిలి ఉంది. ఈలోపు అందరికీ స్వయం గురించి ఎటువంటి దృఢ సంకల్పం ఉంది అన్నది ఫిక్స్ చేసి వ్రాయండి. బ్రాహ్మణ పరివారంలో ఎక్కడ కూడా ఎప్పుడూ సంస్కారాలు తమ పని చెయ్యకూడదు, ఇందుకు ఎంత సమయం పడుతుంది? అది నా సంస్కారాలు కావచ్చు, ఇతరుల సంస్కారాలు కావచ్చు, నాపై ప్రభావం చూపకూడదు. ఈ డేట్ ఫిక్స్ అవ్వగలదా? వీలవుతుందా? చేతులెత్తండి. అచ్ఛా, అందరి ఫోటో తీయండి! ఎందుకంటే ఎలా అయితే ఈ అకస్మాత్తు యొక్క ఆటను చూసారో అలాగే అన్నీ అకస్మాత్తుగానే జరగనున్నాయి. కావున బాప్ దాదా తయారీలైతే చూస్తారు కదా! ఇతరులకు శుభ భావన, శుభ కామనలను ఇచ్చినప్పుడు, ఇతరులకు ఇచ్చే ఇటువంటి ప్రోగ్రాము కూడా గతంలో చేసారు. ఒకవేళ ప్రతి ఆత్మ పట్ల సదా శుభ భావన, శుభ కామన ఉంచినట్లయితే నంబర్ వారీగా అయితే అవ్వనున్నది. మీకు స్మృతి చిహ్నమైన మాలలో అందరూ మొదటి నంబరులో ఉన్నారా? నంబరువారీగా ఉన్నారు కానీ మాలలోకైతే వచ్చారు. కదా! నంబరు ఎందుకు లభించింది? భిన్న భిన్న సంస్కారాలు ఉన్నాయి కానీ మనం సంస్కారాలను చూడటానికి బదులుగా శుభ భావన, శుభ కామనలను ఉంచాలి. ఎంతైనా బ్రాహ్మణ పరివారము కదా! ఎలా ఉన్నాకానీ, పరివారమైతే నాది కదా. ఎలా అయితే నా బాబా అని అంటారో అలాగే నా పరివారము కూడా కదా. మంచిది, మెజారిటీ చేతులెత్తారు. అందరికీ ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి, అందుకే చేతులెత్తారు కదా! మరి ఒకరికొకరు సహయోగులుగా అయ్యి శుభ భావన, శుభ కామనల దృష్టి - వృత్తి గుర్తున్నట్లయితే ఈ రాస్ జరగడం పెద్ద విషయమేమీ కాదు. ఇందులో ఎవరైతే మంచి నంబర్ తీసుకుంటారో, ఇచ్చిన డేట్ కి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారో వారికి అతీతమైన, ప్రియమైన బహుమతి లభిస్తుంది. బహుమతి ఏమిటో ఇప్పుడే చెప్పము. కానీ బాప్ దాదా బహుమితిని ఇస్తారు. ఎందుకు? సేవ చేసేందుకు సమయాన్ని కేటాయించాలి కదా. ఈ సంస్కారాల ఘర్షణ సమయాన్ని లాగేస్తాయి కావున ఇప్పుడు సమయము చాలా అవసరము. సరేనా! వీరందరూ మధువనం వారు కదా! ఇష్టమేనా? ఎందుకంటే మధువన నివాసులు విశేషమైనవారు. ఇది కూడా బాబా చెప్తున్నారు, బాబాపై ప్రేమ ఉంది, ఉంటుంది. అది తొలగదు. ఇందులో అమరులుగా ఉన్నారు. అందుకే మధువనవాసులుగా అయ్యారు కదా. మధువన నివాసులు ఎక్కడికి వెళ్లినా ఏ గౌరవంతో చూస్తారు? మధువనం వారు, మధువనం వారు. కావున ఈ అటెన్షన్ ఉంచండి, లాస్ట్ టర్న్ కు ముందుగానే, మధువనంలో మీ చిట్టీని వేయడానికి ఒక స్థానాన్ని నిర్ణయించండి. కానీ లాస్ట్ టర్న్ కు ముందే జరగాలి.

           అందరూ హోలీ జరుపుకున్నారా? మీకైతే రోజూ హోలీయే. ఇప్పుడు కూడా ఇది బాహ్యంగా కొద్దిగా జరుపుకోవలసి వస్తుంది. జరుపుకోవడానికి ఇంకెక్కడికి వెళ్తారు! ఇక్కడే జరుపుకోవాలి కదా. కానీ అదైతే- ఆచార వ్యవహారము. నలువైపుల ఉన్న బాప్ దాదాకు అతి స్నేహి, అతి ప్రియమైన గారాల, ముద్దుల పిల్లలకు, స్వమానధారి పిల్లలకు, పిల్లలందరికీ బాప్ దాదా పదమారెట్లు ప్రియస్మృతులను కూడా ఇస్తున్నారు మరియు హృదయపు ప్రేమను కూడా ఇస్తున్నారు.

           నలువైపుల ఉన్నవారు ఇది చూసి హర్షిస్తూ ఉండటాన్ని బాప్ దాదా చూస్తున్నారు. అచ్ఛా. ఈరోజు మొదటిసారిగా ఎవరు వచ్చారు? లేవండి. వీరందరూ మొదటిసారి వచ్చారు. అచ్ఛా. మొదటిసారి మధువన నివాసులుగా అయ్యే భాగ్యం లభించింది. మీ సోదరసోదరీలందరూ మరియు బాప్ దాదా  కూడా మీ అందరికీ మొదటిసారిగా వచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు బాప్ దాదా చూస్తారు, ఎందుకంటే అవకాశమైతే ఉంది, కొద్దిగా ఆలస్యంగా వచ్చినా కానీ ఏది కావాలనుకుంటే అది ఇప్పుడు కూడా లాస్ట్ సో ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ నంబరు తీసుకుని ఫస్ట్ డివిజన్లోకి రావచ్చు. ఈ రోజు ఎవరైతే వచ్చారో ఆ పిల్లలందరికీ బాప్ దాదా ఇస్తున్న వరదానము ఇది. కేవలం బాబా చెప్పిన మహావాక్యాలు, ఆ శ్రీమతంపై నడుస్తూ ఉన్నట్లయితే శ్రీమతము మిమ్మల్ని శ్రేష్ఠ డివిజన్లోకి తీసుకురాగలదు, తీసుకువస్తుంది. బాబానుండి వరదానమైతే ఉంది. పరివారము యొక్క శుభ భావన, శుభ కామన మీకు ఉన్నాయి కనుక మీరు ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. అందరూ మీకు ఆశీర్వాదాలను ఇస్తారు. మీరు ఎక్కడకు వస్తే అక్కడ ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని తీవ్ర పురుషార్థిగా చేసి ముందుకు తీసుకువెళ్తాయి, ఈ నిశ్చయము ఉంచండి. అచ్ఛా.

సేవ టర్న్ పంజాబ్ జోన్ వారిది :-(పంజాబ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాంచల్) : పంజాబ్ ఉన్నదే షేర్ పంజాబ్. మరి పంజాబ్ అంటే షేర్ అనగా వారసులను తయారు చేసేది. ప్రతి సెంటరువారు తమ వారస క్వాలిటీ లిస్టును పంపండి. ఆరంభం నుండి ఇప్పటివరకు ప్రతి సెంటరు నుండి ఎంతమంది వారస క్వాలిటీ వారు తయారయ్యారు? వారస క్వాలిటీ వారు ఎక్కడున్నా దాగలేరు. ప్రసిద్ధమైన మైక్ లుగా ఎంతమంది అయ్యారన్నది కూడా బాప్ దాదా ఈ రోజు చూడాలనుకుంటున్నారు. వారి హృదయపు పిలుపు విని ఇతరుల హృదయము కూడా దిలారామ్ వైపుకు ఆకర్షితమవుతుంది. కానీ బాప్ దాదా ఏమి విన్నారంటే వర్గాలు చాలా ఉన్నాయి, ఈ విషయాన్ని వర్గాలవారిని అడుగుతాము. కానీ పంజాబ్ వారు అన్ని సెంటర్లు, చిన్నవైనా, పెద్దవైనా, వారస క్వాలిటీ వారు ఎంతమంది తయారయ్యారు? ఎప్పటినుండి తయారయ్యారు? ఎందుకంటే పంజాబ్ కూడా ఆరంభంలోనే మొదలైంది. పంజాబ్ లో కూడా ఎంతోమంది మహావీర్ మహారధులు సేవకు అధికారులుగా తయారయ్యారు, పాలన లభించింది. కొంతమంది పూర్వజులు కూడా సేవ చేసి వెళ్ళారు. బాప్ దాదాకు కూడా పంజాబ్ పట్ల ప్రేమ ఉంది, ఎందుకని? ఎందుకని ప్రేమ? ఎందుకంటే పంజాబ్ లో నదులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎలా అయితే పంజాబ్ నదులకు ప్రసిద్ధమో అలాగే బాప్ దాదా తరఫున పంజాబ్ సేవాధారులు కూడా ప్రసిద్ధమే. త్యాగము చెయ్యడంలో మరియు చేయించడంలో ప్రసిద్ధులు. కావున వారస క్వాలిటీని తయారు చెయ్యడం కూడా సహజమే. బాప్ దాదా ప్రతిజోనుకు నంబరువన్ ఇవ్వాలని ఆశిస్తారు. ఇప్పటివరకు ఏ జోన్ తక్కువగా లేదు. ఒకరిని మించి మరొకరు ముందుగా ఉన్నారు. అందుకే ఎవరైతే సేవ కారణంగా తయారయ్యారో వారి సేవను మరింతగా చేసి వారస క్వాలిటీలోకి తీసుకురావాలి. తీసుకురాగలరు. శ్రద్ధ పెడితే తయారు చెయ్యగలరు. కేవలం క్వాలిటీని అర్థం చేసుకుని కొద్దిగా శుభ భావన, శుభ కామనలతో విశేష కృషి చేయండి. కొద్దిగా విశేషమైన కృషి చేయవలసి ఉంటుంది కానీ క్వాలిటీ. ఇప్పుడు సమయం కూడా కొద్దిగా వైరాగ్యంగా ఉంది, నలువైపుల అల్పకాలికమైన వైరాగ్యము వచ్చి ఉంది. ఇటువంటి సమయంలో ప్రతి జోన్ వారు క్వాలిటీవారిని తెలుసుకుని మరింత ముందుకు తీసుకువెళ్ళగలరు. యజ్ఞ స్నేహిగా, యజ్ఞ రక్షకులుగా చెయ్యగలరు. ఇప్పుడు వైరాగ్యము తాజాగా ఉంది. ఇప్పుడు పంజాబ్ టర్న్ కావున పంజాబ్ మొదటి నంబరులో ప్రారంభించండి. మంచిది. బాప్ దాదా అందరి ముఖాలను చూస్తున్నారు. దూరంగా ఉన్నా కానీ టి.వి.లో దగ్గరగా ఉన్నారు. చూస్తున్నారు. అచ్ఛా.

8 వింగ్స్ వారు వచ్చారు :- సమాజ సేవ వింగ్, రెండు ట్రాన్స్ పోర్టు వింగ్లు, మీడియా, అడ్మినిస్ట్రేషన్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెడికల్, సెక్యూరిటీ, ఐ.టీ (అన్ని వింగ్స్ లో వచ్చిన సోదరసోదరీలను నిల్చోమన్నారు) మెజారిటీ వింగ్ వారే కనిపిస్తున్నారు. ఏ వింగ్స్ వారైతే వచ్చారో మరియు సేవ చేస్తున్నారో, వింగ్స్ యొక్క సేవా రిజల్టు ఎంతో మంచిగా ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ఎందుకంటే అన్ని వైపుల నుండి సేవ చేయడం వలన వేరువేరుగా అయిపోయారు కదా, మరి ప్రతి ఒక్కరూ తమ తమ వింగ్ లో రోజురోజుకూ ఉన్నతిని పొంది ఆత్మలను సమీపంగా తీసుకువస్తున్నారు కావున బాప్ దాదా ప్రతి ఒక్క వింగ్ పై, సేవపై సంతోషంగా ఉన్నారు. చప్పట్లు కొట్టండి.

           ఇప్పుడు ముందుకెళ్ళి ఏమి చెయ్యాలి? సేవ అయితే విస్తారమవుతుంది కానీ ఇప్పుడు ఎవరైతే సేవతో సమీపమయ్యారో వారిని ప్రతి ఒక్క వింగ్ వారు ప్రోగు చేసి వారిని యజ్ఞ స్నేహీలుగా చేయండి. యజ్ఞ స్నేహితులుగా అవ్వడం వలన, ఒక్కసారి యజ్ఞంలోకి రావడం వేరు, కానీ యజ్ఞమంటే ఏమిటి? యజ్ఞంపై ప్రేమ ఉండటం వలన ఏమవుతుంది అని వివరించి మరింత సమీపంగా తీసుకురండి. కొద్దిగా ఇంటివారిగా చేయండి. భాషణ వింటారు, భాషణ చేస్తారు. ఇందులో పాస్ అయ్యారు కానీ పరివారానికి తోడుగా అవ్వడము, ఈ లిస్టును కూడా తయారు చెయ్యండి. ప్రతి ఒక్క వింగ్ నుండి ఎంతమంది యజ్ఞ సంపర్కంలోకి వచ్చారు? కొన్ని ఆత్మలు మురళి వరకు రావడాన్ని బాప్ దాదా విన్నారు. ఇది కూడా మంచిది. మురళి వరకు చేరుకున్నట్లుగా యజ్ఞ స్నేహిగా అవ్వడమంటే ఏమిటి, యజ్ఞ స్నేహి నిమిత్త ఆత్మ ఏమేమి చేసి స్వయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలదు, ఇప్పుడు ఇటువంటి నిమిత్త ఆత్మలను తయారు చెయ్యండి. భాషణలో అయితే సహయోగులుగా అయ్యారు , ఇతరులకు కూడా పరిచయాన్ని ఇవ్వడంలో నిమిత్తంగా అయ్యారు, ఇందుకు బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు, మురళి వరకు కూడా చేరుకున్నారు, ఇప్పుడు వారిని మరింత ముందుకు తీసుకురండి. వారు స్వయాన్ని కేవలం సహయోగిగా కాక స్నేహిగా కూడా అనుభవం చేయాలి. యజ్ఞ స్నేహి, యజ్ఞ సహయోగి, పరివారానికి చెందినవాడను. వి.ఐ.పి. అయినా కానీ పరివారానికి చెందినవాడను. పరివారానికి సమీపంగా ఉన్నాను. ఇలా నెమ్మది నెమ్మదిగా, మీరెలా అయితే నిమిత్తమయ్యారో సేవకు అలా వారు కూడా స్వయాన్ని బాధ్యునిగా భావించాలి. వర్గాలు తయారయ్యాక సేవలో వృద్ధి వచ్చింది, కొంతమంది ఆత్మలకు తెలీనే తెలీదు, వారికి తెలిసింది. బ్రహ్మాకుమారీలు ఏమి చేస్తారు అన్న కర్తవ్య పరిచయం కూడా జరిగింది. ఇప్పుడు మరింతగా ముందుకు తీసుకువెళ్లండి. ఒకటి, రెగ్యులర్ ప్రెజంట్ మార్కు, ఎదురుగా వచ్చి వినలేకపోయినాకానీ ఫోన్ ద్వారా లేక మరే విధి ద్వారా అయినా కానీ తమ ప్రెజంట్ మార్కు వేసుకోవాలి. ఎందుకంటే ఇంటికి చెందినవారు, కనుక ప్రెజంట్ మార్కు వేసుకుంటారు కదా. ఇటువంటి లిస్టును తయారు చెయ్యండని బాప్ దాదా ముందుగానే ప్రతి జోను వారికి చెప్పడం జరిగింది. వారి సంగఠనను ఏర్పాటు చేసి వారిని ఉమంగ ఉత్సాహాలలోకి తీసుకురండి. ప్రతి జోన్ వారు కేవలం తాముంటున్న సెంటరే కాక వర్గానికి హెడ్ ఎవరైతే ఉన్నారో వారు అన్ని జోన్లలో ఇలాగే ఏర్పాటు చేసి వారి సంగఠనను తయారుచెయ్యాలి. ఒకరినొకరు చూసుకుని కూడా ఉమంగం వస్తుంది. మేము మా వర్గంవారిని అందరినీ కలిపాము మరియు ఇంతమంది క్వాలిటీవారు వచ్చారు అన్న సమాచారము ఇంకా రాలేదు. కామన్‌గా అటెన్షన్ పెరిగింది, అటెన్షన్ చేస్తున్నారు కూడా, ఇప్పుడు సంగఠనను తయారు చెయ్యండి. కనెక్షన్లోకి వచ్చిన వారందరూ వి.ఐ.పి, లేక ఐ.పీ అయినా కానీ వారు ఎంత సేవ చేసారు, ఎంతమందికి సందేశాన్ని ఇచ్చారు. ఈ సమాచారాన్ని తీసుకోవలసి ఉంటుంది. మా రిజల్టు మధువనానికి వెళ్తుంది అని వారికి కూడా శ్రద్ధ పెరుగుతుంది. ఇకపోతే బాప్ దాదా ముందుకూడా చెప్పి ఉన్నారు, మీ అందరికీ సేవా ఉమంగము ఉంది, సేవ కూడా చేస్తున్నారు. ఇందుకు అభినందనలను బాప్ దాదా ముందుగానే ఇచ్చి ఉన్నారు. అచ్ఛా.

            ప్రతి వర్గంవారు లేచారు కదా, బాప్ దాదా ఎదుట ప్రతి వర్గంవారు ఉన్నట్లుగా భావించండి, వెనుక ఉన్నా కానీ ఎదురుగా ఉన్నట్లే. బాప్ దాదా మీ ఒక్కొక్క వర్గం వారిని తమ సమీపంగానే చూస్తున్నారు కావున పదమా పదమరెట్ల అభినందనలు, అభినందనలు.

డబుల్ విదేశీ సోదర సోదరీలు (50 దేశాల నుండి 600 మంది వచ్చారు) :- బాప్ దాదాకు విదేశీయులు విశేషంగా గుర్తుకు వస్తారు. పిల్లలందరూ గుర్తుకు వస్తారు కానీ విదేశీయుల పేరు విని భారతవాసులకు ఉమంగం వస్తుంది. విదేశీయులు పరమాత్మని తెలుసుకుని వారసత్వానికి అధికారులుగా అవుతున్నప్పుడు మనం వంచితులమవ్వకూడదు అన్న ఉమంగం వస్తుంది. అందుకే ఇప్పుడు సేవలు విదేశీయులు మరియు భారతవాసులు కలిసి చెయ్యడం ప్రారంభించారు. విదేశీయులు తెలుసుకున్నప్పుడు మనం ఉండిపోకూడదు అన్న ఉమంగం వస్తుంది. మరి భారతవాసులను ముందుకు నడిపించి ఉమంగాన్ని ఇచ్చేందుకు నిమిత్తమైన ఆత్మలు మీరు. అందుకే ప్రతి వర్గంవారు ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అయితే ఇప్పుడు ఢిల్లీలో కూడా కలిసి ప్రోగ్రాము తయారుచేసారు కదా, చిన్న రూపంలో అయినాకానీ, పెద్ద రూపంలో అయినా కానీ ఒకరిద్దరు విదేశీయులైనా మనస్ఫూర్తిగా, ఉమంగంతో తమ అనుభవాన్ని వినిపించినప్పుడు లేక టాపిక్ పై మాట్లాడినప్పుడు అది విని సంతోషిస్తారు. ఎందుకంటే విదేశీయులు భారతవాసులను మెల్కొల్పేందుకు నిమిత్తమవుతారు అని బాప్ దాదా ముందుగానే చెప్పి ఉన్నారు. చూస్తూ ఉంటే ఈ సేవను రోజు రోజుకూ విదేశీయులు కూడా చేస్తున్నారు మరియు భారతవాసులు కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఏ పెద్ద ప్రోగ్రాము అయినాకానీ ఎలా అయితే ఆరంభంలో విదేశాల తరఫు నుండి ఎవరో ఒకరు విశేష వి.ఐ.పి. వచ్చేవారో అలాగే ఇప్పుడు కూడా ఆ ప్రయత్నమే చేయండి. ఎక్కడ అటువంటి ప్రోగ్రాము జరిగినా కానీ ఎవరో ఒక వి.ఐ.పి. మీ ఆహ్వానంపై రావాలి. ఆరంభంలో ఇటువంటి పాత్ర చాలా బాగా నడిచింది. ఇప్పుడు కూడా ఒకటి, బ్రాహ్మణ ఆత్మల అనుభవము, రెండు, వి.ఐ.పి. ఏదో ఒక పాత్రధారిగా అవ్వాలి అప్పుడు భారతదేశము మరియు విదేశము, భారతదేశము విదేశాన్ని మేల్కొల్పుతుంది. ఈ సేవ జరుగుతూ-జరుగుతూ ఆఖరకు విదేశంలో మన రాజ్యానికి ఎవరెవరు వచ్చేదుంది అని ప్రసిద్ధమవుతూ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఎవరైతే విశేష ఆత్మలు వస్తాయో వారి సమాచారము ప్రభుత్వము వరకు చేరుకుంటుంది. వారు వారిని చూసుకోవలసి ఉంటుంది. వార్తాపత్రికలో పేరు వస్తుంది. కావున ఇది సేవ పెరిగేందుకు సహజ సాధనము. మరి విదేశము సేవ చేస్తుంది, దీని గురించి బాప్ దాదా వద్ద రికార్డు ఉంది. ప్రతి వర్గంవారు కూడా ఏమని ఆశిస్తున్నారంటే ఏ ప్రోగ్రాము జరిగినా కానీ ప్రోగ్రాము అనుసారంగా ప్రోగ్రాము ఎటువంటిదో ఆ అనుసారంగా విదేశము భారతదేశాన్ని మేల్కొల్పాలి మరియు భారతవాసుల ఇంత పెద్ద రూపాన్ని చూసి విదేశీయులు కూడా మేల్కొంటారు. విదేశీయులు ప్రతి విషయంలోనూ ఎవరెడీగా ఉండటాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఎవరెడీ పాత్రను మంచిగా నిర్వహిస్తున్నారు, వీలుకాదు అని అనరు, భారత వర్గంవారు కూడా ఎటువంటి ప్రోగ్రాము చేయలంటే, జోన్ వారు కూడా ఎటువంటి ప్రోగ్రాము చేయలంటే అందులో ఇద్దరి మేళవింపు జరగాలి. విదేశీయులు కూడా ఎవరెడీగా ఉన్నారు, భారతవాసులు కూడా ఎవరెడీగా ఉండటాన్ని బాప్ దాదా చూసారు. కానీ ప్రోగ్రామును ఇలా తయారు చెయ్యండి. విదేశీ పిల్లలను చూసి బాప్ దాదా సంతోషిస్తారు, నా పిల్లలు తప్పిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. బాప్ దాదా మిమ్మల్ని వెతికారు. ఎన్ని దేశాలనుండి వస్తారు! మరి ప్రతి దేశం నుండి బాబా తన పిల్లలను వెతికి పట్టుకున్నారు. సంతోషంగా ఉంటుంది కదా. మీరైతే బాబాను వెతకలేకపోయారు కానీ బాబా అయితే మిమ్మల్ని మూల మూలల నుండి వెతికి పట్టుకున్నారు. ఎందుకంటే కల్ప కల్పపు అధికారులు కదా. ప్రతి కల్పము బాప్ దాదా మిమ్మల్ని ఇలా వెతికి పట్టుకుంటూనే ఉంటారు. మిస్ అవ్వలేరు. తండ్రి పిల్లలు తండ్రి వద్దకు రావలసిందే. తప్పిపోయి తిరిగి వచ్చిన పిల్లలను చూసి తండ్రి సంతోషిస్తాడు కదా. వాహ్ నా పిల్లలు, వాహ్ నా పిల్లలు! మధువనాన్ని కూడా అలంకరిస్తూ ఉంటారు. విదేశాల వైపు నుండి బాప్ దాదాకు చాలా సహయోగము ఉంది, తనువు ద్వారా, మనసు ద్వారా లేక ధనము ద్వారా అయినా అన్ని విధాలుగా యజ్ఞ స్నేహిగా, బాప్ దాదాకు స్నేహిగా ఇంకా మున్ముందుకు వెళ్తూ ఉన్నారు, ముందుకు వెళ్తారు. అచ్ఛా, ఒక్కొక్కరికి బాప్ దాదా హృదయపూర్వక ప్రేమ మరియు స్నేహాన్ని అందిస్తున్నారు. అచ్ఛా.

దాదీ జానకితో :- అచ్ఛా, అందరూ సంతోషిస్తున్నారు. సంతోషపరిచేందుకు మీ వద్ద రెండు పద్ధతులు ఉన్నాయి, ఒకటి క్లాసు, రెండు టోలీ. అచ్ఛా, మంచి పాత్రను నిర్వహిస్తున్నారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు.

మోహిని అక్కయ్యతో :- యజ్ఞంలో ప్రతి ఒక్కరి పాత్ర వారి వారిది తప్పకుండా ఉంటుంది. ఏ యాక్టర్ అయినా నిమిత్త సేవాధారి ఒకవేళ మిస్ అయితే తెలియదని కాదు, ప్రతి ఒక్క పాత్రకు తమ తమ మహత్వము ఉంది. ఎవరి పాత్ర అయినా మిస్ అయితే తేడా తప్పకుండా కనిపిస్తుంది. బాబా యొక్క వరదానము ప్రతి ఒక్క కామన్ పాత్రధారులకు కూడా వర్తిస్తుంది. ఎలా అయితే భండారా వాళ్ళు ఉన్నారు, సాధారణమైనవారే కానీ భండారావారు లేకపోతే పని జరుగదు. శుభ్రం చేసేవారు లేకపోతే పని జరుగదు, క్లాసు చేయించేవారు లేకపోతే కూడా పని జరుగదు. ప్రతి యాక్టర్ కు డ్రామానుసారంగా ఏ పాత్ర అయితే లభించిందో వారు నేను విశేష నిమిత్తుడను అని భావించాలి. డ్రామా అయితే ప్రతి ఒక్కరికీ చిన్న కార్యమే అయ్యుండచ్చు కానీ అది కూడా తప్పనిసరి. ఐదు వేళ్లు ఉన్నాయి, ఒక్క వేలు మిస్ అయినాకానీ తేడా ఉంటుంది కదా. యజ్ఞంలోని విశేషత ఇదే. ఎవరికి ఏ పాత్ర లభించిందో అది చాలా చాలా చాలా అవసరము. అచ్ఛా.

            అచ్ఛా, డాక్టరు లేకపోతే మీరు నడవగలరా, ఇది కూడా అవసరమే కదా, ప్రతి ఒక్క పాత్రధారి యజ్ఞానికి నిమిత్తులు. యజ్ఞానికి అవసరమైన ఆత్మలు. ఈరోజు శుభ్రం చేసేవారు రాకపోతే మీకు కూర్చోవడానికి మంచిగా అనిపిస్తుందా! అవసరం కదా.

పర్ దాదీతో :- మీ పాత్ర కూడా అవసరమే. మీ ముఖం చూస్తే మీరు ఏమి చేసినా చేయకపోయినా కానీ అందరూ సంతోషిస్తారు. (హోలీ పర్ దాదీ జన్మదినము) వాహ్! పర్ దాదీ యొక్క జన్మదినము. అభినందనలు, అభినందనలు, అభినందనలు.

(ముగ్గురు అన్నయ్యలు బాప్ దాదాకు పుష్పగుచ్చాన్ని ఇస్తూ హోలీ అభినందనలు తెలిపారు) హోలీ ఆత్మలందరికీ హోలీ అభినందనలు, అభినందనలు.

ముఖ్యమైన నలుగురు విదేశీ అక్కయ్యలతో :- (మోహినీ అక్కయ్య, జయంతి అక్కయ్య, సుదేశ్ అక్కయ్య, నిర్మల అక్కయ్య) బాబాను ప్రత్యక్షం చేసినందుకు బాబా పిల్లలకు చాలా చాలా థేంక్స్ చెబుతున్నారు. (చేసేవారు చేయించేవారు చేయించారు) కానీ పిల్లలు చేసారు కదా. కావున పిల్లలకు థేంక్స్, పిల్లలు లేనిదే బాబా ఏమి చెయ్యగలరు! (బాబా చేయించారు) ఇద్దరూ ఒకరకొకరు తోడుగా ఉన్నారు. మంచిది. (బాపవాదా సోదరీలకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు) నలుగురూ తీసుకోండి, చేయి పెట్టండి. (దాదీ జానకి గారికి కూడా పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు) వీరి పాత్ర కూడా జరుగుతుంది కదా, విశేష పాత్ర జరుగుతుంది. ఇప్పుడు మీ అందరి అటెన్షన్ భారతదేశము వైపు ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ఎవరో ఒకరు సహయోగాన్ని ఇవ్వడానికి ఎవరెడీగా ఉన్నారు. భారతదేశము విదేశానికి, విదేశము భారతదేశానికి సహయోగమును ఇచ్చుకుంటూ, ఇద్దరూ కలిసి నడవండి మరియు చేయండి, ఈ లక్ష్యము మంచిది.

(జయంతి అక్కయ్య కరాచీ వెళ్తున్నారు) ఇప్పుడు రిజల్టు మంచిగా ఉంది, పెరుగుతూ ఉంది. క్వాలిటీవారు తయారుకావాలి.

(జపాన్లో వెలువడుతున్న గ్యాస్ ఇప్పుడు ఫిలిప్పిన్స్, అమెరికా వైపుకు కూడా వ్యాపిస్తోంది) వెలువడిన గ్యాస్ ఎక్కడికన్నా వెళ్ళాలి కదా. స్వయాన్ని సంభాళించుకోండి. ప్రభుత్వమిచ్చే డైరెక్షన్లను పాటిస్తూ ఉండండి. ఏమీ లేదులే, ఏమీ లేదులే అని అనుకోకండి. లభించిన డైరెక్షన్లపై కొద్దిగా శ్రద్ధ వహించండి.

బాప్ దాదా పిల్లలతో హోలీ ఆడారు మరియు అందరికీ హోలీ అభినందనలు తెలిపారు

           అందరూ హోలీ జరుపుకున్నారు. మీకైతే సదా హోలీయే అనగా తండ్రి తోడు, తండ్రి పాలనలో ఉంటారు. బాబాతో కలిసి లేస్తారు, బాబాతో మాట్లాడుతారు, బాబా నుండి వరదానాలను తీసుకుంటారు మరియు వరదానాలను ఇస్తారు. మరి ఈ రోజు హోలీ సందర్భంగా ఏ వరదానాలనైతే పొందారో, వారు ఎప్పుడూ బాబా నుండి వేరుగా, ఒంటరిగా అవ్వద్దు. కలిసి ఉన్నారు, కలిసి వెళ్తారు, మరియు బ్రహ్మా బాబాతో కలిసి రాజ్యం చేస్తారు. కలిసి అన్న పదాన్ని గుర్తుంచుకోండి. అచ్ఛా - ఇప్పుడు బాప్ దాదా అందరికీ ఎంతో మంచి సుందరమైన గుడ్ నైట్ చెప్తున్నారు. అచ్ఛా!

Comments