16-03-1986 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“ఆత్మిక డ్రిల్”
బాప్ దాదా పిల్లలందరి స్వీట్ సైలెన్స్ స్థితిని చూస్తున్నారు. ఒక్క క్షణములో సైలెన్స్ స్థితిలో స్థితులవ్వడము అన్న ఈ అభ్యాసమును ఎంతవరకు చేసారు? ఈ స్థితిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు స్థితులవ్వగలరా లేక సమయం పడుతుందా? ఎందుకంటే అనాది స్వరూపము స్వీట్ సైలెన్స్. శబ్దములోకి వచ్చేది ఆది స్వరూపము. కానీ అనాది అవినాశి సంస్కారము సైలెన్స్. కనుక మీ అనాది సంస్కారమును, అనాది స్వరూపమును, అనాది స్వభావమును తెలుసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్వరూపములో స్థితులవ్వగలరా? 84 జన్మలు శబ్దములోకి వచ్చేవి కనుక ఎల్లప్పుడూ శబ్దములోకి వచ్చే అభ్యాసము ఉంటుంది. కానీ అనాది స్వరూపము కారణంగా మరియు ఈ సమయములో చక్రము పూర్తవుతున్న కారణంగా తిరిగి సైలెన్స్ హోమ్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయము సమీపంగా ఉంది. ఇప్పుడు ఆది-మధ్య-అంతిమముల, మూడు కాలాల పాత్రనూ సమాప్తము చేసుకుని తమ అనాది స్వరూపము, అనాది స్థితిలో స్థితులయ్యే సమయము కనుక ఈ సమయములో ఈ అభ్యాసమే ఎక్కువ అవసరము. కర్మేంద్రియజీతునిగా అయ్యానా? శబ్దములోకి రావాలని అనుకోనప్పుడు ఈ నోటి నుండి వచ్చే మాటలు తమవైపుకు లాగటం లేదు కదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. దీనినే ఆత్మిక డ్రిల్ అని అంటారు.
వర్తమాన సమయ ప్రమాణంగా శరీరానికి వచ్చే అన్ని రోగాలకు చికిత్సగా ఎక్సర్సైజ్ ను నేర్పిస్తారు, మరి ఈ సమయములో ఆత్మను శక్తివంతంగా తయారుచేసుకునేందుకు ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ యొక్క అభ్యాసము కావాలి. నలువైపులా ఎటువంటి వాతావరణము ఉన్నాగానీ, అలజడి ఉన్నాగానీ, శబ్దములో ఉంటూ శబ్దము నుండి దూరంగా ఉండే స్థితి యొక్క అభ్యాసము ఇప్పుడు బహుకాలముదిగా ఉండాలి. శాంతి వాతావరణములో శాంతి స్థితిని తయారుచేసుకోవటం అనేది పెద్ద విషయమేమీ కాదు. అశాంతి మధ్యలో మీరు శాంతిగా ఉండండి, ఈ అభ్యాసము కావాలి. ఇటువంటి అభ్యాసము తెలుసా? తమ బలహీనతల అలజడి కావచ్చు, సంస్కారాల, వ్యర్థ సంకల్పాల అలజడి కావచ్చు, ఇటువంటి అలజడి సమయంలో స్వయమును అచలంగా తయారుచేసుకోగలరా లేక టైమ్ పడుతుందా? ఎందుకంటే సమయము పట్టడము అనేది ఎప్పుడైనా మోసం చేయవచ్చు. సమాప్తి సమయములో ఎక్కువ సమయము లభించదు. ఫైనల్ రిజల్ట్ యొక్క పరీక్ష కొన్ని క్షణాలు మరియు కొన్ని నిమిషాలదే ఉంటుంది. కానీ నలువైపులా గల అలజడి వాతావరణములో అచలంగా ఉండడంపైనే నంబరు లభిస్తుంది. ఒకవేళ బహుకాలముగా అలజడి స్థితి నుండి అచలంగా అవ్వడానికి సమయము పట్టే అభ్యాసము ఉన్నట్లయితే సమాప్తి సమయములో ఎటువంటి రిజల్ట్ ఉంటుంది? కనుక ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ యొక్క అభ్యాసము చెయ్యండి. మనసును ఎక్కడ మరియు ఎంత సమయము స్థిరపరచుకోవాలనుకుంటే అంత సమయము అక్కడ స్థితి చేసుకోగలగాలి. ఫైనల్ పేపర్ చాలా సహజము మరియు ఈ పరీక్ష వస్తుంది అని ముందు నుండే తెలియజేస్తారు కానీ నంబరు చాలా కొద్ది సమయములో లభిస్తుంది. స్థితి కూడా చాలా పవర్ఫుల్ గా ఉండాలి.
దేహము, దేహ సంబంధాలు, దేహ సంస్కారాలు, వ్యక్తులు, వైభవాలు, వైబ్రేషన్లు, వాయుమండలము అన్నీ ఉన్నా కూడా ఆకర్షితము చెయ్యకూడదు. దీనినే నష్టోమోహ సమర్థ స్వరూపము అని అంటారు. మరి ఇటువంటి అభ్యాసము ఉందా? లోకులు బాధతో అరుస్తూ ఉంటారు మరియు మీరు అచలంగా ఉండండి. ప్రకృతి కూడా, మాయ కూడా అన్నీ చివరి పందెంగా తమవైపుకు ఎంత లాగినాగానీ మీరు అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా అయ్యే స్థితిలో లవలీనులై ఉండండి, దీనినే చూస్తూ కూడా చూడకుండా ఉండండి, వింటూ కూడా వినకుండా ఉండండి...... అని అంటారు. ఇటువంటి అభ్యాసము ఉండాలి. దీనినే స్వీట్ సైలెన్స్ స్వరూప స్థితి అని అంటారు. అయినా కూడా బాప్ దాదా సమయాన్ని ఇస్తున్నారు. ఒకవేళ ఏదైనా లోటు ఉన్నట్లయితే ఇప్పుడు కూడా నింపుకోవచ్చు ఎందుకంటే బహుకాలపు లెక్కను వినిపించాము. కావున ఇప్పుడు కొంచెం అవకాశం ఉంది కనుక ఈ అభ్యాసము వైపు పూర్తి అటెన్షన్ ను పెట్టండి. పాస్ విత్ ఆనర్లుగా అవ్వడం లేక పాస్ అవ్వడం అన్నదానికి ఆధారము ఈ అభ్యాసము పైనే ఉంది. ఇటువంటి అభ్యాసము ఉందా? సమయపు గంట మ్రోగితే తయారుగా ఉంటారా లేక తయారవ్వాలి అని ఇప్పుడు ఆలోచిస్తారా? ఈ అభ్యాసము కారణంగా అష్టరత్నాల మాల విశేషంగా చిన్నదిగా తయారైంది. చాలా కొద్ది సమయముంది. సెకండ్లో ముక్తి-జీవన్ముక్తుల వారసత్వమును తీసుకునేందుకు అందరికీ అధికారము ఉంది అని మీరు చెప్తారు కదా! మరి సమాప్తి సమయములో కూడా నంబరు లభించటము అనేది కొద్ది సమయపు విషయము. కానీ కొంచెము కూడా అలజడి ఉండకూడదు. బిందువు అనగానే బిందువులో స్థితులైపోవాలి, అంతే. బిందువు కదలకూడదు. నేను ఆత్మను...... నేను ఆత్మను...... అని ఆ సమయములో అభ్యాసమును చెయ్యటము ప్రారంభించటము - ఇలా ఉండకూడదు, ఇది నడవదు ఎందుకంటే యుద్ధము కూడా నలువైపులా ఉంటుందని వినిపించాము. చివరి ప్రయత్నం అందరూ చేస్తారు. ప్రకృతిలో కూడా ఎంత శక్తి ఉంటుందో, మాయలో కూడా ఎంత శక్తి ఉంటుందో అవి ట్రయల్ వేస్తాయి. వాటివి కూడా చివరి ప్రయత్నం మరియు మీది కూడా అంతిమ, కర్మాతీత, కర్మబంధన ముక్త స్థితి ఉంటుంది. రెండు వైపులా చాలా పవర్ఫుల్ దృశ్యం ఉంటుంది. వాళ్ళు కూడా ఫుల్ ఫోర్స్, ఇవి కూడా ఫుల్ ఫోర్స్. కానీ క్షణములో విజయము, విజయ ఢంకా మ్రోగిస్తారు. చివరి పరీక్ష ఏమిటో అర్థమైందా. నంబరువన్ రావాల్సిందే అని అందరూ శుభ సంకల్పమునైతే చేస్తారు కూడా మరియు చెయ్యాలి కూడా. కనుక నలువైపులా ఉన్న విషయాలలో విన్ అయినప్పుడే (గెలిచినప్పుడే) వన్ వస్తుంది. ఒకవేళ ఒక్క విషయములోనైనా, ఏ కాస్త వ్యర్థ సంకల్పము వచ్చినా, వ్యర్థంగా సమయము గడిచినా, నంబరు వెనుకపడిపోతుంది కనుక అన్నింటినీ చెక్ చేసుకోండి. నలువైపులా చెక్ చేసుకోండి. డబల్ విదేశీయులు అన్నింటిలో వేగంగా వెళ్ళాలనుకుంటారు కదా కనుక తీవ్ర పురుషార్థమును లేక ఫుల్ అటెన్షన్ ను ఈ అభ్యాసములో ఇప్పటి నుండే పెడుతూ ఉండండి. అర్థమైందా! ప్రశ్న కూడా తెలుసు మరియు టైమ్ గురించి కూడా తెలుసు. అటువంటప్పుడు అందరూ పాస్ అవ్వాలి. ఒకవేళ ముందు నుండే ప్రశ్న తెలిసినట్లయితే దానికి తగ్గట్లుగా తయారవుతారు. తర్వాత పాస్ అయిపోతారు. మీరందరూ అయితే పాస్ అయ్యేవారే కదా! అచ్ఛా!
ఈ సీజన్లో బాప్ దాదా ప్రతి ఒక్కరితో కలిసేందుకు విస్తారమైన భండారాను తెరిచారు. మున్ముందు ఏం జరిగేది ఉంది అన్నదానిని తర్వాత తెలుపుతాము. ఇప్పుడు తెరిచియున్న భండారా నుండి ఏదైతే తీసుకోవాలని వచ్చారో అదైతే తీసుకుంటారు. డ్రామా దృశ్యము ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది కానీ ఈ సీజన్లో భారతవాసులకైనా, డబల్ విదేశీయులకైనా, అందరికీ విశేష వరదానమైతే లభించనే లభించింది. బాప్ దాదా ఏదైతే ప్రతిజ్ఞ చేసారో, దానినైతే నిలబెట్టుకుంటారు. ఈ సీజన్ ఫలాన్ని తినండి. ఫలము మిలనము, వరదానము. అందరూ సీజన్ ఫలాన్ని తినేందుకు వచ్చారు కదా. పిల్లలను చూసి బాప్ దాదాకు కూడా సంతోషం కలుగుతుంది. అయినా కూడా సాకార సృష్టిలోనైతే అన్నింటినీ చూడాల్సి వస్తుంది. ఇప్పుడైతే చాలా ఆనందాన్ని అనుభవించండి. మళ్ళీ సీజన్ చివరిలో వినిపిస్తాము.
సేవాస్థానాలు వేరువేరుగా ఉన్నాగానీ సేవ లక్ష్యమైతే ఒక్కటే. ఉల్లాస-ఉత్సాహాలు ఒక్కటే కనుక బాప్ దాదా అన్ని స్థానాలకు విశేష మహత్వాన్నిస్తారు. ఒక స్థానము మహత్వము కలిగినది, ఇంకొకటి తక్కువది అని ఇలా కాదు. ఏ ధరణికైతే పిల్లలు చేరుకున్నారో, అక్కడి నుండి ఏదో ఒక విశేషమైన ఫలితము తప్పకుండా రావలసిందే. కొందరిది త్వరగా కనిపిస్తుంది. కొందరిది సమయము వచ్చినప్పుడు కనిపిస్తుంది కానీ విశేషత అయితే అన్నివైపులా ఉంది. ఎంత మంచి-మంచి రత్నాలు వెలువడ్డారు! మేమైతే సాధారణమైనవారము అని భావించకండి. అందరూ విశేషమైనవారు. ఒకవేళ ఏ విశేషతా లేనట్లయితే తండ్రి వద్దకు చేరుకోరు. విశేషత ఉంది కానీ కొందరు విశేషతను సేవలో పెడతారు, కొందరు సేవలో పెట్టేందుకు ఇప్పుడు తయారవుతున్నారు, అందరూ విశేష ఆత్మలే. మీరందరూ మహారథులు, మహావీరులు. ఒక్కొక్కరి మహిమను ప్రారంభించినట్లయితే పెద్ద మాల తయారైపోతుంది. శక్తులను చూసినట్లయితే ప్రతి శక్తి మహానాత్మ, విశ్వ కళ్యాణకారి ఆత్మగా కనిపిస్తుంది. అంతే కదా లేక కేవలము మీ-మీ స్థానాల కళ్యాణకారులా? అచ్ఛా!
Comments
Post a Comment