15-11-2010 అవ్యక్త మురళి

                                 15-11-2010        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

  “స్వపరివర్తన యొక్క గతిని తీవ్రతరంచేసి సంస్కారాల స్వభావాల సమాప్తి సమారోహమును జరపండి, ప్రతి సంకల్పము, వాక్కు మరియు కర్మలో బ్రహ్మాబాబాను కాపీ చేయండి."

          ఈరోజు బాప్ దాదా అందరి మస్తకంపై ప్రకాశిస్తున్న మూడు భాగ్యపు చిహ్నాలను చూస్తున్నారు ఒకటేమో- తండ్రి ద్వారా లభించిన పాలన అనే భాగ్యము, రెండవది- శిక్షకుని రూపంలో శిక్షణరూపీ భాగ్యము, మూడవది- సద్గురుని ద్వారా లభించిన వరదానాల భాగ్యము. ప్రకాశిస్తున్న ఈ మూడు భాగ్యాలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకము ఈ మూడు భాగ్యాలతో ప్రకాశిస్తోంది. ఇటువంటి భాగ్యము ఇంకెవరి మస్తకముపైన ప్రకాశిస్తూ కనిపించదు. కానీ మీ అందరి మస్తకము భాగ్యముతో ప్రకాశిస్తోంది. మీరందరూ కూడా మీ భాగ్యమును చూస్తున్నారు కదా! భాగ్యమైతే అందరికీ లభించింది, కానీ భాగ్యపు ప్రకాశము అందరిదీ ఒకే విధంగా లేదు అని బాప్ దాదా గమనించారు. కొందరి ప్రకాశము చాలా తీవ్రంగా ఉంది, కొందరి ప్రకాశము కాస్త తక్కువగా కనిపిస్తోంది. బాప్ దాదా అందరికీ ఒకేసారి ఒకేవిధమైన భాగ్యమును ఇచ్చారు, ఒకే చదువును చదివిస్తారు, పాలన కూడా ఒకే విధమైనది ఇచ్చారు, అలాగే వరదానమును కూడా ఒకేవిధమైనది ఇచ్చారు. ఆదిరత్నాలకైనా లేక వెనుక వచ్చినవారికైనా అందరికీ ఒకే మురళి ద్వారా పాలన లభిస్తుంది, చదువు లభిస్తుంది. వరదానాలు కూడా అందరికీ ఒకేవిధంగా లభిస్తాయి. ఆదిరత్నాలకు మురళి వేరుగా ఉండదు, ఒకటే ఉంటుంది. కానీ, భాగ్యము నెంబర్ వారీగా ప్రకాశిస్తూ కనిపిస్తోంది. బాబా ప్రేమతో కూడిన పాలన అందరికీ ఒకే విధముగా లభిస్తోంది. ప్రతిఒక్కరి నోటినుండి 'నా బాబా' అనే వెలువడుతుంది. ముందువచ్చేవారైనా, వెనుకవచ్చేవారైనా కాని ప్రతి ఒక్కరూ తమ అధికారంతో 'నా బాబా' అనే అంటారు. బాబా నుండి ప్రేమ లభించిందా అని ఎవరినైనా అడిగితే, నాకు బాబా ప్రేమ అందరికన్నా ఎక్కువగా లభిస్తుంది అని నషాతో అంటారు. ఈ నా బాబా అని హృదయం నుండి అనేవారు నషాతో ఏమంటారు? నా ప్రేమ అందరికన్నా ఎక్కువగా ఉంది అని అంటారు, బాబా ప్రేమ మొదట నాతో ఉంది అని అంటారు. ఎందుకంటే ప్రేమయే బాబా పాలన. ఈ విధంగా నాబాబా అని అనడం ద్వారా మీరు బాబాకు చెందినవారిగా అయిపోయారు మరియు బాబా మీవారిగా అయిపోయారు.

          ఈ రోజు మీరందరూ బాబా ప్రేమ అనే విమానములో వచ్చారు. ప్రేమ అందరినీ ఆకర్షించి ఇక్కడకు లాక్కువచ్చింది. అందరూ ప్రేమతో విశ్రాంతిగా వచ్చి చేరుకున్నారు. ఈ పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడు సంగమ యుగంలోనే ప్రాప్తమవుతుంది. దేవాత్మల ప్రేమ అయితే లభిస్తుంది కానీ పరమాత్మ ప్రేమ ఈ ఒక్క జన్మలోనే ప్రాప్తమవుతుంది. కావున బాప్ దాదా కూడా ఇటువంటి పాత్రులైన ఆత్మలను చూసి ఏమంటారు? ఓహో పిల్లలూ, ఓహో అని అంటారు. మీరే కోట్లాదిమందిలో ఏ ఒక్కరో పాత్రులుగా అయ్యారు మరియు ప్రతికల్పమూ మీరే పాత్రులుగా అవుతారు. నడుస్తూ, తిరుగుతూ ఇటువంటి నషా ఉంటుంది కదా! ఓహో నా భాగ్యము అన్న గీతమును మీ హృదయం కూడా గానంచేస్తూ ఉంటుంది. ఈ గీతమును గానం చేస్తూ ఉంటారు కదా! ఈ పిల్లలందరూ అధికారులు అని బాబాకు కూడా సంతోషంగా ఉంటుంది. పరమాత్మ ప్రేమలో ఎవ్వరూ స్వయమును తక్కువగా భావించరు. ప్రేమలో అందరూ పాసైపోయారు. అందరికన్నా ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంది అని బాప్ దాదా అడిగితే ఎవరంటారు? తమ ప్రేమ తక్కువ కాదు అని ప్రతిఒక్కరికీ తెలుసు. ప్రేమ అనే సబ్జెక్టులో అందరూ పాసయ్యారు అని బాబా కూడా అంటారు. కావుననే నా బాబా అని అంటారు. ఎంత ప్రేమ ఉందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రేమలో అయితే అందరూ పాసయ్యారు, కానీ ఇప్పుడు సమయానుసారంగా స్వపరివర్తన యొక్క అవసరం కూడా ఉంది. కేవలం స్వపరివర్తన. విశేషంగా ఈ సమయంలో స్వపరివర్తనలో విశేషంగా సంస్కార పరివర్తన, స్వభావ పరివర్తనల అవసరం ఉంది అని విశేషంగా వినిపించడం జరిగింది.

           ఇప్పుడు క్రొత్త సంవత్సరం ప్రారంభమైంది, కావున స్వపరివర్తన యొక్క గతి తీవ్రంగా ఉండాలి. చేస్తున్నారు కూడా, అటెన్షన్ కూడా ఉంది, కాని ఇప్పుడు గతి వేగంగా ఉండాలి. బాప్ దాదాకు గుర్తు ఉంది- క్రొత్త సంవత్సరంలో స్వపరివర్తన, సంస్కార పరివర్తన చేసి తీరాలి అని ఇంతకుముందు కూడా బాబాతో ప్రతిజ్ఞ చేశారు. కాని బాప్ దాదా గమనించిందేమిటంటే సంస్కార పరివర్తనలో పురుషార్థం ఎంత వేగంగా ఉండాలో ఆ వేగంలో ఇంకా తీవ్రత కావాలి. మీరందరూ ఏమనిభావిస్తున్నారు? సమయానుసారంగా ఈ గతి ఎంత వేగంగా ఉండాలో దాని అనుసారంగా ప్రతి ఒక్కరి పురుషార్థము తీవ్రంగా ఉందా లేక అది ఇంకా తీవ్రతరమవ్వాలా? ఎందుకంటే సమయాసుసారంగా సమయంలో పరివర్తన చాలా వేగంగా జరుగుతోంది. అలాగే ఎప్పుడైతే సంకల్పం చేయగానే జరిగిపోతుందో అప్పుడే మీ తీవ్ర పరివర్తన కూడా జరుగుతుంది. అయథార్థమైన సంకల్పాలు ఎలా సమాప్తమవ్వాలంటే కాగితంపై బిందువును దిద్దినట్లుగా సమాప్తమైపోవాలి. ఒక బిందువును దిద్దడానికి ఎంత సమయం పడుతుంది? అలాగే అయథార్థమైన అనగా వ్యర్థమైన సంకల్పాలు అంత వేగంగా పరివర్తన అయిపోవాలి. కావున బాప్ దాదా కోరుకుంటున్న ఇటువంటి వేగమును తీసుకురాగలరా? అంతటి ధైర్యము ఉందా? ఇప్పటినుండి ఇంతటి వేగంతో బిందువును దిద్దగలము అని భావించేవారు, పిల్లలు ధైర్యమును ఉంచితే బాబా సహాయం చేస్తారు అని భావించేవారు చేతులెత్తండి. బాప్ దాదా పిల్లల దృఢసంకల్పాన్ని చూసి అభినందనలు తెలుపుతారు. చేయవలసిందే... అని భావించడం దృఢసంకల్పపు సంకల్పం. కావున ఈనాటి సభలో అందరూ ఈ దృఢసంకల్పం చేశారు కదా! మీరు చూశారు, దాదీలు చూశారు, అందరూ మెజారిటీ చేతులెత్తారు. చూశారు కదా! కావున రేపటి నుండి స్వభావ సంస్కారాల సమాప్తి యొక్క సెర్మనీని(వేడుకను) జరపాలి. జరుపుతారా? ఎవరైతే చేతులెత్తారో వారు మళ్ళీ చేతులెత్తండి. సెర్మనీ జరుపుతారా? ఈ సెర్మనీనైతే చాలా వైభవంగా జరపండి. ఏ విధంగా ధైర్యముగా లక్ష్యమునుంచారో అలాగే లక్షణాలను కూడా ధైర్యముగా ఉంచినట్లయితే అదేమంత పెద్ద విషయం కాదు. బాబా సమానంగా అవ్వడమే లక్ష్యమైనప్పుడు ఇప్పుడు లక్ష్యాన్ని మరియు లక్షణాలను ఒకటిగా చేయాలి. బ్రహ్మాబాబాను అనుసరించండి ఏ సంకల్పాలు, మాటలు, కర్మలనైతే చేస్తారో వాటిని మొదట బ్రహ్మా బాబాతో కలపండి, కాపీ చేయండి. ప్రపంచంలో కాపీ చేయనివ్వరు. కాని, బాప్ దాదా బ్రహ్మాబాబాను కాపీ చేయండి అని అంటారు. నిరాకారుడైన బాబాకు దేహంలేదు కదా, కాబట్టి వారికి దేహభానం ఎక్కడ ఉంటుంది అని అంటారు. కాని బ్రహ్మాబాబా దేహధారిగా ఉన్నారు కదా! నిజానికి మీరందరూ ఎవరైతే సరెండరయ్యారో సరెండరైనవారు చేతులెత్తండి. సరెండర్ చేసినప్పుడు ఏంసంకల్పం చేశారు? తనువు, మనస్సు, ధనము అన్నీ, మీవే బాబా అని అన్నారు కదా! అలా సమర్పణ చేశారా? చేశారా? ఇందులో చేతులెత్తండి. కావున ఇప్పుడు సరెండర్ - చేశారు, నాది కాదు, తనువు కూడా నాది కాదు, ధనము కూడా నాది కాదు. ఏ విధంగా బ్రహ్మాబాబా బాబాకు సేవార్థము శరీరమునిచ్చేసారు, కావున ఈ శరీరము నాది కాదు, సేవార్థము ఉంది అని వారికి , తెలుసో, అలాగే ఎప్పుడైతే మీ తనువు, మనస్సు, ధనము మూడింటినీ అర్పణ చేసేశారో అప్పుడిక మీ శరీరము బాబా సేవార్థము నిమిత్తమై ఉంది. ఏవిధంగా బ్రహ్మాబాబా శరీరము సేవార్థము ఉందో అలా మీ శరీరము మీదికాదు, సేవార్థము ఉంది. కావున దేహఅభిమానము లేక దేహభానపు సంస్కారాలేవైతే ఉన్నాయో మరి అవి ఉండవచ్చా? వీటిని స్మృతిలో ఉంచుకోండి. ఈ తనువు విశ్వసేవార్థము ఉందే కాని నాది కాదు, బాబా దీనిని సేవార్థము మీకు ఇచ్చారు. కావున దేహభానము లేక దేహఅభిమానము... దేహఅభిమానము ఎక్కువ నష్టపరుస్తుంది, దేహభానము దానికన్నా కొద్దిగా తక్కువ. కాని, ఎప్పుడైతే ఇచ్చేశారో ఫారం నింపేటప్పుడు ఏం వ్రాస్తారు! టీచర్లు ఫారం నింపుతారు కదా, నింపేటప్పుడు ఏమని నింపుతారు? ఇప్పుడిక నా ఈ జీవితము సేవకొరకే ఉంది అని వ్రాస్తారు. అందరూ ఎవరెవరైతే - బ్రాహ్మణులుగా అయ్యారో వారందరూ తనువు, మనస్సు, ధనము అన్నీ బాబావే, నావి కావు అని ప్రతిజ్ఞ చేశారు. ఈ సంస్కారాలేవైతే ఉత్పన్నమవుతాయో అవన్నీ దేహభానము లేక దేహఅభిమానంలోనే జరుగుతాయి. కావున ఈ రోజు కూడా సంస్కార సమాప్తి యొక్క ప్రతిజ్ఞను చేశారు. ఎందుకంటే బాబాను ప్రత్యక్షం చేయడంలో విఘ్నాలేవైతే కలుగుతాయో అవి ఇవే. అందరికీ ఎంతో ఉత్సాహము ఉంటుంది. బాప్ దాదా కూడా వింటూ ఉంటారు, బాబాను ప్రత్యక్షం చేయాలని అంటూ ఉంటారు. ఇప్పటివరకు బ్రహ్మాకుమారీలు, బ్రహ్మాకుమారులు ప్రత్యక్షమయ్యారు. భగవంతుడైన తండ్రి వచ్చేసారు అన్న ఈ బాబా యొక్క ప్రత్యక్షత గుప్తముగా ఉంది. పురుషార్థం చేస్తున్నారు కాని ఈ ప్రత్యక్షమైన శబ్దం వ్యాపించాలి. మా తండ్రి వచ్చేశారు, ఇది భగవానువాచయే కాని బ్రహ్మాకుమారీల వాచా కాదు, ఇప్పుడు ఈ ప్రత్యక్షత జరగాలి. ఈ స్వభావ సంస్కారాలు పరివర్తన అవ్వడం మీ ఒక్కొక్కరి ముఖము మరియు నడవడిక ద్వారా ప్రత్యక్షమవుతుంది. బాబాను ప్రత్యక్షం చేయాలి. చేస్తున్నారు, కాని అందరి చెవులలో భగవంతుడు వచ్చేశారు, తండ్రి వచ్చేశారు అన్న శబ్దము మారుమ్రోగాలి. చేతులెత్తండి, ఇది జరగాలి కదా, జరగాలి కదా? చేతులైతే బాగా ఎత్తారు, అందరి మనసుల్లో ఈ లగనము ఉందని మరియు ఇది జరగవలసిందేనని బాప్ దాదా సంతోషిస్తున్నారు. దీనికొరకు ఏవిధంగా రేపటి నుండి సంస్కార స్వభావాలను పరివర్తన చేస్తారో, అలాగే దానికి సాధనము- ప్రతిఒక్క బ్రాహ్మణులు తమ చార్టులో శుభభావన, శుభకామనలపై విశేషమైన అటెన్షన్ ఉంచవలసి ఉంటుంది. ఎంత సమయము శుభభావనను, శుభకామనను ఉంచగలరు అని ప్రపంచంలోనివారికి పనిని ఇచ్చారు కదా! మీరు అలా శుభభావనను ఉంచగలరు అని వారితో అన్నారు మరియు మీరైతే తప్పక ఉంచగలరు. ఏ సమయంలోనైనా ఎవరి స్వభావ సంస్కారమైనా ఎప్పుడు ఎదుర్కుంటుంది? ఎప్పుడైతే శుభభావన, శుభకామన ఆ ఆత్మపట్ల ఆ సమయంలో ఉండదో అప్పుడే అది ఎదుర్కొంటుంది. కావున మీరు కూడా అమృతవేళ నుండి- నేను ప్రతి ఆత్మపట్లా శుభభావనను, శుభకామనను తప్పక ఉంచాలి అని సంకల్పం చేయండి, అప్పుడు పరివర్తన చేయవలసిందేనని ఏ సంకల్పమునైతే చేసారో దానిని పూర్తిచేయగలరు. విషయాలు వస్తాయి, విషయాల పని రావడము... ఇది మాయ కదా! మరియు మీ పని విజయమును పొందడం. కావున రేపు పరస్పరంలో గ్రూపులుగా అయి ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు పరస్పరంలో చర్చించుకొని ఏ సంకల్పమైతే చేశారో దానిని ముందు, ముందు ఎలా ప్రాక్టికల్ లోకి తీసుకురావాలి అన్నదానిపై ఆత్మిక సంభాషణను జరపండి. ఫినిష్, బిందువు పెట్టేయండి. చేతులైతే ఎత్తారు కదా! ముందు ఉన్నవారు చేతులెత్తారా? చేతులెత్తారు, కావున మీరు నిమిత్తులుగా అవ్వాలి. ఏ విధంగా బ్రహ్మాబాబా ముందు ఎన్ని సంస్కారాలవారు ప్రారంభంలో వచ్చారు! ఆదిలో బ్రహ్మాబాబా ఎన్ని సంస్కారాల ఆటను చూశారు! కాని బాబా సహయోగం ద్వారా ముందుకు వెళుతూ ఇతరులను కూడా ముందుకు తీసుకువెళుతున్నారు. దానికి ప్రతిఫలంగానే ఈ రోజు సంఖ్య ఎంతగా పెరిగిపోయింది! కదిలించే విషయాలు వచ్చినా కూడా అచలముగా ఉన్నారు. దాని పరిణామంగా ఎన్ని సెంటర్లు తెరుచుకున్నాయి! ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి!

           ఈమధ్య ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి? జరుగుతున్నాయి కదా! ఈ రిజల్టంతా బ్రహ్మాబాబా యొక్క ధైర్యముతో లభిస్తోంది. ప్రారంభంలో బ్రహ్మాబాబా ఒక్కరే ఉండేవారు. మీరందరూ వెనుకవచ్చారు. కాని వారు ధైర్యమును ఉంచి ఒంటరిగా ముందుకు వెళ్ళారు. దానికి ప్రతిఫలంగా ప్రాక్టికల్ ప్రమాణంగా మీరందరూ సహచరులుగా ఉన్నారు. కావున ధైర్యం ఉంది కదా! బ్రహ్మాబాబా ఒంటరిగా ధైర్యమును ఉంచారు. మీకైతే సహచరులు ఎంతోమంది ఉన్నారు! కావున బాబాను అనుసరించండి. అందరూ స్వయమును బ్రహ్మాబాబా పిల్లలుగా, సహచరులైన పిల్లలుగా భావిస్తున్నారు కదా! కలిసి ఉన్నారు, కలిసి నడుస్తారు మరియు బ్రహ్మాబాబాతోపాటు రాజ్యంలోకి వస్తారు. కావున ఇప్పుడు ఇది సమయం. ఏ విధంగా బ్రహ్మాబాబా ధైర్యమును ఉంచారో, దాని రిజల్టును చూస్తున్నారో అంతగా ఇంత పెద్ద సంఘటనలో ధైర్యము అనే పాదమును ముందు ఉంచితే జరగనిది ఏమిటి? కల్పకల్పము జరిగింది, ఇంకా జరిగి తీరుతుంది.

           కావున ఇప్పుడు బాబా ఏమి కోరుకుంటున్నారో అది వినిపించారు. మీరందరూ కేవలం ఒక్క పని చేయండి, ఆ ఒక్క విషయము- సాధారణ పురుషార్థమును తీవ్రపురుషార్థంలోకి పరివర్తన చేయండి. అక్కడక్కడా నిర్లక్ష్యమును- ఇదైతే అవ్వవలసిందే, విజయమైతే మా జన్మసిద్ధ అధికారము... అంటూ ఇలా జ్ఞానము లెక్కలో ఇది నిశ్చితమే కాని నిర్లక్ష్యముతో కూడిన పదాలలో కూడా-మా విజయమైతే ఉండనే ఉంది, అది జరిగే తీరుతుంది, ఏ పనీ ఆగలేదు కదా, అంతా జరగవలసిందే... అని అంటూ ఉండడం బాప్ దాదా గమనించారు. ఒకటేమో- పురుషార్థంతో కూడుకున్న ఈ పదాలు, ఇంకొకటి- నిర్లక్ష్యంలో కూడా ఇవే పదాలు వాడతారు. ఏ పనీ ఆగదు, జరగవలసిందే... కావున ఇది నిర్లక్ష్యం. ఈ సంస్కారాలను కూడా పరిశీలించాలి. నిర్లక్ష్యానికి గుర్తు-వారి జీవితంలో చిన్న చిన్న విషయాలలో అలసట కనిపిస్తుంది. వారి ముఖముపై ఆ సంతోషపు ప్రకాశము కనిపించదు. సేవ ద్వారా పుణ్యము తయారవుతుంటే ముఖముపై సంతోషము ఉండాలి. ఏదో ఒక అలసటకు కారణం- ఏదో ఒక విషయంలో నిర్లక్ష్యం. ఎప్పుడైతే చేసి తీరవలసిందే అని భావిస్తారో అప్పుడు మరి సంతోషంగా చేయండి, మీ ముఖము సేవ చేయాలి, మీ నడవడిక సేవ చేయాలి. కావున ఈ రోజు మెజారిటీ సంస్కార సమాప్తి కోసం చేతులెత్తడం చూసి బాప్ దాదా పదే పదే అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా- ఈ గ్రూపులో ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారో చూశారా! చాలామంది ఉన్నారు, చేతులూపండి. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారికి తమ బాబాను కలుసుకున్నందుకు అభినందనలు. కావున విశేషంగా సమయానుసారంగా ఇప్పుడు మీరు తీవ్ర పురుషార్థమును చేయవలసి ఉంటుంది మరియు ఎవరైతే తీవ్రపురుషార్థము చేస్తారో, సాధారణముగా చేయరో వారు లాస్ట్ లో ఉంటూ కూడా ఫాస్ట్ గా, ఫాస్ట్ నుండి ఫస్ట్ గా అయిపోతారు, ఇటువంటి అద్భుతం చేయండి, అవకాశం ఉంది. మేమైతే చివరిలో వచ్చాము అని భావించకండి. మీరు కూడా ఫాస్ట్ గా వెళ్ళగలరు. కాని, అన్నివేళలా- తీవ్రపురుషార్థం చేయవలసిందే, మారవలసిందే. చూద్దాములే, ఆలోచిద్దాములే అంటూ ఇలా లే, లే అంటూ ఉండకండి. బాగుంది, ఇది మీ ఇల్లు, దాత ఇల్లు మంచిగా అనిపించింది కదా! కావున సోదరీ సోదరులందరూ మీకు స్వాగతం పలుకుతున్నారు. అచ్ఛా!

           ఇప్పుడు నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలకు బాప్ దాదాల స్నేహంతో నిండిన ప్రియస్మృతులు. దూరంగా కూర్చొని కూడా చాలామంది పిల్లలు చూస్తున్నారు, మిలనము కూడా జరుపుతున్నారు. ఆ నలువైపులా ఉన్న పిల్లలకు బాప్ దాదా- ఏవిధంగా ఇప్పుడు అందరూ మెజారిటీ సంస్కారాలను సమాప్తం చేసుకుంటామని చేతులెత్తారో అలా ఇప్పుడు మీరందరూ, మేమందరమూ కలిసి సమాప్తి సమయమును సమీపంగా తీసుకువచ్చేందుకు ఈ సంకల్పమును చేస్తున్నాము అని మీరందరూ కూడా కలిసి ఒకే సంకల్పరూపీ చేతిని ఎత్తుతున్నారు. నలువైపులా సంపూర్ణ సమయము రావడంతో బ్రహ్మాబాబాను, శివబాబాను- మా బాబా వచ్చేశారు అని ప్రత్యక్షం చేస్తాము. అందరి నోటినుండి బాబా ప్రత్యక్షత జరగాలి. ఇప్పుడు ఈ సంవత్సరం బాబాను ప్రత్యక్షం చేయవలసిందేనన్న దృఢసంకల్పమును ఉంచండి. సగం పని అయితే చేశారు. పిల్లలను బాబా విశ్వంముందు ప్రత్యక్షం చేశారు. ఇప్పుడు భగవంతుడు వచ్చేశారు అన్న శబ్దమును విశ్వంలోని పిల్లలు ఒక్కొక్కరివరకు చేర్చడం పిల్లల పని. కావున అందరినీ బాప్ దాదా చూస్తూ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకమైన స్నేహము, హృదయపూర్వకమైన ప్రేమ, హృదయపూర్వకమైన ఉల్లాస ఉత్సాహాల సహితంగా ప్రియస్మృతులు తెలుపుతున్నారు. అచ్ఛా!

సేవాటర్న్ కర్నాటక జోన్ వారిది:- సేవ చేసే అవకాశమును తీసుకోవడము అనగా బాబాకు సమీపంగా వచ్చే అవకాశము లభించడము. చూడండి, సేవ కారణంగా ఎంతమందికి సమీపంగా వచ్చే అవకాశం లభిస్తుందో! అందరి దీవెనలు నిమిత్తులైన టీచర్లగు మీకు లభిస్తాయి. ఎందుకంటే సేవ చేసే ధైర్యమును ఉంచారు మరియు ఆ అవకాశము ఎంతమందికి లభించింది! క్రొత్త క్రొత్త వారు కూడా మొదటిసారిగా ఎంతోమంది రావడం బాప్ దాదా చూశారు. కర్నాటకవారు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులు పైకెత్తండి, మొదటిసారి కూడా చాలామంది వచ్చారు, బాగుంది. కర్నాటకవారి వృద్ధి బాగుంది. ఇప్పుడు ఏ విధంగా వృద్ధి జరిగిందో అలా తీవ్ర పురుషార్థం యొక్క విధిని కూడా నలువైపులా అలగా వ్యాపింపజేయండి. నెంబరు తీసుకోండి. సంస్కార సమాప్తి యొక్క నెంబరును తీసుకోండి. తీసుకోగలరా? ఎవరైతే మేము మొదటి నెంబరును తీసుకోగలము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. బాగుంది, ఇలా పరస్పరంలో సంఘటితమై ప్రోగ్రాం తయారుచేయండి, అందరూ ఒక్కటే, భిన్న భిన్న స్థానాలు ఉన్నాయి కావున అందరూ ఒక్కటిగా ఉన్నారు. ఈ అద్భుతాన్ని చేసి చూపించండి. ధైర్యం ఉంది కదా! ధైర్యం ఉందా? కావున బాప్ దాదా వద్దకు సమాచారాలైతే వస్తూ ఉంటాయి. కావున మధువనంలో ప్రతినెలా మీ పరివర్తన యొక్క సమాచారమును వ్రాయండి. వ్రాస్తారు కదా! ప్రతినెలా వ్రాయండి. గతించిందేదో గతించిపోయింది, ఇప్పుడు నెంబర్ వన్ గా అయి చూపించండి, బాగుంది. సేవ బాగా ఉండడం బాప్ దాదా చూశారు, ఇప్పుడిక సంఘటితమవ్వడమును చూడాలనుకుంటున్నారు. ఉదాహరణ మూర్తులుగా అవ్వండి. రెడీయా, రెడీయా, చేతులెత్తండి. మీరు చూడండి, ఒక్క నెలరోజుల్లో రిజల్టు వస్తుంది. అచ్ఛా- చాలా, చాలా విశేష ప్రియస్మృతులు.

క్యాడ్ గ్రూప్ వారితో:- అచ్ఛా- మీ పేరే దిల్ వాలా. కావున దిల్ వాలాగా ఉన్నవారు సదా హృదయంలో ఇమిడిపోయి ఉన్నారు. బాగా చేశారు. మీరు హృదయమును గూర్చి ఇతరులకొరకు ఉదాహరణ మూర్తులుగా అయ్యారు. ఎంత ఉన్నతమైన భాగ్యమును తయారుచేసుకునేందుకు నిమిత్తులుగా అవుతారు! ఇలా ఈ దిల్ వాలాలు ఇతరుల సేవను మంచిగా చేయడం బాప్ దాదాకు నచ్చింది. ఎవరైతే నిమిత్తులుగా అయ్యారో వారు తమ సమాచారమును వినిపించి ఇతరులను కూడా బాబాకు చెందినవారిగా తయారు చేసేందుకు ఇలా నిమిత్తంగా అయ్యే అవకాశమును తీసుకునేవారికి బాప్ దాదా అభినందనలు తెలుపుతారు. ముందుకు వెళుతూ ఉండండి మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకువెళుతూ ఉండండి. అందరికీ ఇదే అభినందనలు. బాప్ దాదాకు ఈ సేవ నచ్చింది. కేవలం రోగాన్ని నయం చేయడంలోనే కాదు, పరమాత్మ హృదయంలో ఇమిడిపోయే అవకాశం కూడా లభిస్తుంది. కావున ముందుకు వెళుతూ ఉండండి మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకువెళుతూ ఉండండి.

డబుల్ విదేశీయులు:- బాప్ దాదాకు మంచిగా అనిపిస్తుంది. ప్రతి గ్రూపులోను విదేశీయులు కూడా వస్తూ ఉంటారు. విదేశీయులకు ఏవిధంగా డబుల్ విదేశీయులు అన్న టైటిల్‌ను ఇస్తారో అలా డబుల్ ప్రేమ ఉండడం బాప్ దాదా చూశారు. బాబా అని అనడంతో సంతోషంలో నాట్యం చేస్తారు. సేవ కూడా చేస్తారు, డబుల్ సేవ కూడా చేస్తారు. ఆ గవర్నమెంట్ వారిది కూడా చేస్తారు అలాగే ఆల్‌ మైటీ గవర్నమెంట్ ది కూడా చేస్తారు. బాబాపై ప్రేమ కూడా ఎంతో ఉంది. మార్పు కూడా ఎంతో మంచిగా వస్తోంది. ఇప్పుడు అందరూ పరమాత్మ కల్చర్‌కు చెందినవారిగా అయిపోయారు. విదేశీ కల్చర్ వారిగా కాదు, పరమాత్మ కల్చర్ వారిగా అయ్యారు. సహజముగా అయిపోయారు. ఈ కల్చర్‌ను ఎలా మార్చాలి అని ఇంతకుముందు ఆలోచించేవారు. కాని ఇప్పుడు మా వాస్తవికమైన కల్చర్(సంస్కృతి) ఇదే, మళ్ళీ అదే సంస్కృతివారిగా అయ్యాము అని భావించడం బాప్ దాదా చూశారు. సహజంగా అనిపిస్తుంది, కష్టమనిపించదు. ఎందుకు? ఎందుకంటే ప్రతికల్పము మీరు బాబాకు చెందినవారిగా అయ్యారు. కల్పపూర్వపు మీ హక్కును తీసుకుంటున్నారు. చాలా బాగుంది, పురుషార్థంలో కూడా ముందుకు వెళుతున్నారు. బాబాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు కూడా డబుల్ సంతోషంలో ఉంటున్నారా? డబుల్ సంతోషము ఉందా? చేతులెత్తండి. అనంతమైన తండ్రి, అనంతమైన సంఘటన మంచిగా అనిపిస్తున్నాయి కదా! కావున వివిధ స్థానాల నుండి అందరూ తమ బేహద్ ఇంటికి చేరుకుంటున్నారని బాప్ దాదాకు కూడా సంతోషంగా ఉంది. రిజల్టు బాగుంది మరియు ముందు ముందు కూడా రిజల్టు బాగుంటుంది. నిశ్చితమై ఉంది కావున ఇక్కడకు వచ్చినందుకు అభినందనలు, అభినందనలు. అచ్ఛా!

మోహినీ అక్కయ్యతో:- లెక్కాచారాలను తీర్చుకుంటున్నావు, అయిపోతుంది, అయిపోతుంది.
              
ఈషూ దాదీతో:- తాను బాగుంది, ఆనందంలో ఎగురుతూ ఉంది.

దాదీ జానకితో:- మీకు ఎంతో దయ ఉంది(త్వరత్వరగా అయిపోవాలి) అయిపోతుంది, మీ సంకల్పం వ్యాపిస్తోంది. ఇప్పుడిక మధువనం విదేశాలలో గుర్తుకువస్తుంది. ఇప్పుడు కాస్తసేవ ఎక్కువగా చేశారు, అయిపోతుంది. దాదీ కూడా చూస్తూ ఉంటుంది, అందరితో కలిసి ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటూ ఉంటుంది. అచ్ఛా!

జయంతి అక్కయ్యతో:- (జయంతి బెహెన్ విదేశ సమాచారాన్ని వినిపించారు) బాగుంది, ఈ భాగం కూడా మిగిలి ఉంది. మీ మాటలు విని వారికి ఏ సంతోషమైతే లభిస్తుందో ఆ సంతోషపు అల ఒకరినుండి అనేకులవరకు చేరుకుంటుంది. మంచి పాత్ర లభించింది, అన్ని చుట్టివస్తూ ఉండండి, సేవ చేస్తూ ఉండండి. ఈసారి విదేశంవారు భారతదేశంలో కూడా మంచి సేవను చేశారు, చాన్స్ తీసుకున్నారు, బాగా చేశారు.

రమేష్ భాయ్ తో:- ఆరోగ్యం బాగుందా, అందరికీ ప్రియస్మృతులకు రిటర్న్ ఇవ్వండి, మీకు లక్షల రెట్ల  ప్రియస్మృతులు అని ప్రతి ఒక్కరికీ చెప్పండి.

ముగ్గురు అన్నయ్యలతో:- అచ్ఛా- మీరందరూ కూడా పరస్పరం కూర్చొని యజ్ఞమును గూర్చి భవిష్యత్తులో ఏమేమి చేయాలి, ఏమేమి పెంచాలి అన్న ప్లానును తయారుచేయండి. కేవలం డిపార్టుమెంటుది కాదు, పూర్తి యజ్ఞము లేక నలువైపులా ఏమేమి వృద్ధి చేయాలి, అందరూ నిర్విఘ్నంగా మరియు నిర్వికల్పంగా ఎలా అవ్వాలి అన్న ప్లానును పరస్పరంలో ఆలోచించండి. ముందు ముందు ఏమి చేయాలి అన్నది చూడండి. ఏ రూట్లోనైతే నడుస్తున్నారో అలాగే నడుస్తూనే ఉన్నారు, కానీ ముందు ముందు ఏమి చేయాలి అన్న విషయంలో మీటింగ్ చేయండి. అచ్ఛా!

పరదాదీతో:- మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తున్నారు. ఎందుకు?(బాబా కూతుర్ని). బాగుంది. ఆరోగ్యం ఎలా ఉన్నాకాని సంతోషంగా ఉంటావు. ఈ సంతోషమును చూసి అందరూ సంతోషిస్తారు.

Comments