15-03-2010 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మల్లారా, దుఃఖంతో ఉన్నవారికి సుఖం యొక్క అంచలిని ఇవ్వండి, వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థవంతులుగా అవ్వండి మరియు సమయాన్ని సమీపంగా తీసుకురండి.”
ఈ రోజు బాప్ దాదా తమ నలువైపుల ఉన్న పరమాత్మ ప్రియులైన పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి పరమాత్మ ప్రియులు కోట్లలో కొద్ది మంది పిల్లలే ఉన్నారు, ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకోగలరు. కల్పం మొత్తంలో ఆత్మల ప్రేమ, మహాత్మల, ధర్మాత్మల ప్రేమను అనుభవం చేసుకున్నారు కానీ పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడు సంగమయుగంలో మాత్రమే ఉంటుంది. ఈ ప్రేమను పిల్లలైన మీరందరూ అనుభవం చేసుకుంటున్నారు. పరమాత్మ ఎక్కడ ఉంటారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏమని జవాబిస్తారు? నాతో ఉన్నారు, నాతోటే ఉంటారు, నా హృదయంలోనే ఉన్నారు.... ఇలా అనుభవం చేసుకుంటున్నారు కదా! మీకే తెలుసు మరియు మీకే ఈ ప్రేమ యొక్క అనుభవం ఉంది. మా హృదయంలో బాబా ఉంటారు మరియు బాబాహృదయంలో మేము ఉంటాము. ఈ పరమాత్మ ప్రేమ యొక్క నషాను అనుభవం చేసే భాగ్యం మాకే లభించింది అని మీకు తెలుసు. ఎవరితో అయినా ప్రేమ ఏర్పడితే అందుకు గుర్తు ఏమిటి? అందుకు గుర్తు- వారిపై బలిహారమవ్వడము. మరి పరమపిత పరమాత్మ పిల్లలైన మీ నుండి ఏమి ఆశిస్తున్నారు అన్నది మీ అందరికీ తెలుసు కదా? పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల బాబాకున్న ఆశ- పిల్లలందరూ తండ్రి సమానంగా కావాలి! తండ్రివలె పిల్లల స్థితి కూడా శ్రేష్ఠంగా అవ్వాలి. అది ఎటువంటి శ్రేష్ఠ స్థితి? సంపూర్ణ పవిత్రత స్థితి. ఎంతటి పవిత్రత అంటే స్వప్నంలో కూడా అపవిత్రత రాకూడదు. ఇటువంటి సంపూర్ణ పవిత్రత స్థితిని తయారు చేసుకుంటున్నారా? ఆ సంపూర్ణ పవిత్రతలో అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు.
వర్తమాన సమయము సమీపంగా వస్తున్న కారణంగా బాప్ దాదా ఇచ్చే సూచన ఏమిటంటే సమయ సమీప్యత అనుసారంగా వ్యర్థ సంకల్పం కూడా అపవిత్రతకు గుర్తే. రోజంతటిలో - ఏ విధమైన వ్యర్థ సంకల్పము, అభిమానము లేక అవమానము తమ వైపుకు ఆకర్షించడం లేదు కదా! అని పరిశీలించుకోండి. ఎందుకంటే నడుస్తూ నడుస్తూ ఒకవేళ బాబా ఇచ్చిన విశేషతలను తమ విశేషతలుగా భావించి అభిమానంలోకి వచ్చినట్లయితే ఇది కూడా వ్యర్థ సంకల్పమే అవుతుంది. నేను అన్న అశుభ సంకల్పము- నేనేమీ తక్కువ కాదు, నాకూ అన్నీ తెలుసు, నా ఈ సంకల్పమే యథార్థమైనది, ఉన్నతమైనది ఈ నాది అన్న అభిమానముతో కూడుకున్న సంకల్పము కూడా సూక్ష్మ అపవిత్రత యొక్క అంశమే. పవిత్రత యొక్క వర్థ సంకల్పాల ఏ అంశమేమైనా ఉండిపోయిందా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఏందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచ స్థాపనా సమయాన్ని సమీపంగా తీసుకురావడానికి పరమాత్మకు ప్రియమైన పిల్లలగు మీరు నిమిత్తులు. మరి నిమిత్త ఆత్మల వైబ్రేషన్లు నలువైపుల వ్యాపిస్తాయి. కావున, ఏవిధమైన వ్యర్థ సంకల్పము తన వైపుకు ఆకర్షించట్లేదు కదా అని పరిశీలించుకోండి. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచము, పవిత్ర రాజ్యము సమీపముగా వస్తోంది. దుఃఖము మరియు అశాంతి నలువైపులా భిన్నభిన్న స్వరూపాలలో పెరిగిపోతోంది, దానిని తొలగించేందుకు పవిత్రతతో కూడిన వైబ్రేషన్లు అవసరము. దుఃఖము మరియు అశాంతికి కారణము అపవిత్రత. మరి అపవిత్ర ఆత్మలకు మరియు భక్త ఆత్మలకు ఇప్పుడు డబుల్ సేవ చేయాలి. బాప్ దాదా ఏమి చూసారంటే వాచ సేవ నలువైపులా ఎంతో బాగా చేస్తున్నారు, మీపై ఉన్న ఫిర్యాదును కూడా తీసేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆత్మలకు ఎక్సట్రా శక్తి కావాలి. అది, మనసా సేవ ద్వారా శక్తిని ఇవ్వడము, ధైర్యమును ఇవ్వడము, ఉల్లాస - ఉత్సాహాలను ఇవ్వడము. కావున ఇప్పుడు డబుల్ సేవ యొక్క ఆవశ్యకత ఉంది. ఇందుకోసం బాప్ దాదా ఏమంటారంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పూర్వజులుగా భావించాలి. మీరు ఈ కల్ప వృక్షానికి వేర్లు- పూర్వజులు మరియు పూజ్య ఆత్మలు. బాప్ దాదా అయితే దుఃఖితులైన పిల్లల మొరను వింటూ ఉంటారు. పిల్లలైన మీకు వారి మొర వినిపించాలి. ఎంతగా సంపూర్ణ పవిత్ర ఆత్మగా అవుతారో, అవుతూ ఉన్నారు, అయ్యారు కూడా కానీ దానితోపాటు ఇప్పుడు మనసా సేవను పెంచాలి.
ఈ రోజు విశ్వంలో సుఖము, శాంతి, సంతోషము ఆత్మలలో తక్కువ అవుతున్నాయి. మరి పరమాత్మ ప్రేమకు పాత్రులైన మీరు ఇప్పుడు ప్రేమ, సంతుష్టత, సంతోషము యొక్క అంచలిని ఇవ్వాల్సిన అవసరము ఉంది. దుఃఖంతో ఉన్నవారికి సుఖం యొక్క అంచలిని ఇవ్వాలి. ఒకటి, మనసా సేవ ద్వారా శక్తిని ఇవ్వండి. రెండవది, మీ ముఖము మరియు నడవడిక ద్వారా బాబాను ప్రత్యక్షం చెయ్యండి. ఇప్పుడేదైతే సేవ చేస్తూ ఉన్నారో మరియు చేసారో అది చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. సేవలో నలువైపుల ఉల్లాస ఉత్సాహాలున్నాయి, కానీ ఇప్పుడు ఒక్క సేవ మిగిలిపోయింది. ఇప్పటివరకు బ్రహ్మాకుమారీలు మనుష్యాత్మలను మంచిగా తయారు చేస్తారు, అశుద్ధ వ్యవహారం నుండి ముక్తి చేస్తారు అని అందరూ అంటున్నారు. యువకుల కోసం ప్రభుత్వం కోరుకునేదాన్ని చాలా మంచిగా చేస్తారు అని అంటారు. కానీ ఇప్పుడు, బాబా వచ్చారు, పరమాత్మ వచ్చారు, పరమాత్ముని జ్ఞానాన్ని వీరు ఇస్తున్నారు, నా తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఈ విధంగా ఇప్పుడు బాబా వైపుకు వారి దృష్టి వెళ్ళడం ద్వారా వారిని కూడా పరమాత్మ ప్రేమ, పరమాత్మ ఆకర్షణ ఆకర్షిస్తాయి. బాగుంది-బాగుంది అనైతే అంటున్నారు, కానీ పరమాత్మ తండ్రి యొక్క ప్రత్యక్షత ఆకర్షించి మంచిగా చెయ్యాలి. ఇప్పుడు బాబాను గుర్తించడము, ఎవరినైతే గుర్తు చేస్తున్నామో వారి జ్ఞానము, వారి నుండి వారసత్వము లభిస్తున్నాయి అని వారికి అర్థం కావాలి. కావున ఇప్పుడు మీరు మనసా సేవ ద్వారా వారిని తండ్రికి సమీపంగా తీసుకురండి. మీ ముఖము మరియు నడవడిక ద్వారా మీ నయనాలలో తండ్రి ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు ఇందుకోసం పరస్పరంలో ప్లాన్ చేసుకోండి.
బాప్ దాదా ఏమి చూసారంటే బాప్ దాదా ఇచ్చిన ప్లాన్‌ను సమయానుసారంగా పిల్లలు ఎంతో విధిపూర్వకంగా, ఉల్లాస- ఉత్సాహాలతో చేసారు, చేస్తూ ఉన్నారు, ఇందుకు బాప్ దాదా పిల్లలందరికీ పదమా పదమారెట్లు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఎడిషన్ ఏమి చెయ్యాలంటే, భగవంతుడు వారసత్వాన్ని ఇస్తున్నారు, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు వారసత్వాన్ని తీసుకుంటారు! పిల్లల దుఃఖము అశాంతి యొక్క వాతావరణం చూసి బాబాకు చాలా దయ కలుగుతుంది. ఇది అతిలోకి వెళ్ళవలసిందేనని బాబాకు మరియు మీకు కూడా తెలుసు. అతి కానిదే అంతమవ్వదు. ఇటువంటి సమయంలో ఆత్మలకు ఇది అనుభవం చేయించండి, కేవలం వినిపించడం కాదు, అనుభవం చేయించండి, భగవంతుడు వారసత్వాన్ని ఇస్తున్నారు అని అనుభవం చేయించండి. బాబా ప్రత్యక్షత ఎప్పుడు, ఎలా అవుతుంది అని మీరు కూడా అడుగుతూ ఉంటారు కదా. మరి వారు బ్రహ్మాకుమారీల వరకు చేరుకున్నారు, కానీ బ్రహ్మాకుమారీలకు నేర్పించేది ఎవరు! బ్రహ్మాకుమారీలు, బ్రహ్మాకుమారులకు దాత ఎవరు! ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాలి, సమాప్తి చెయ్యాలి. సమాప్తిని సమీపంగా తీసుకువచ్చేది ఎవరు? నేను నిమిత్తుడను అని పిల్లలు ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు కదా. ఈ బాధ్యతను బాబా తమతోపాటు పిల్లలకు కూడా ఇచ్చారు. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. చూడండి, మీరందరూ బాబాను తెలుసుకున్నప్పుడు ఏమి చేసారు? గుర్తించారు, తెలుసుకున్నారు, అప్పుడు పిల్లలుగా అయి వారసత్వానికి అధికారులుగా అయ్యారు. ఇప్పుడు వారసత్వాన్ని తీసుకునే ఆత్మల క్యూ మొదలవ్వాలి. మరి ఈ క్యూ ఎందుకు ఆగి ఉంది? ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇప్పటికీ వ్యర్థ సంకల్పాల క్యూలోనే ఉన్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా... ఇప్పుడు ఇందులోనే సమయాన్ని ఇస్తున్నారు కానీ వ్యర్థం సమాప్తం అవ్వలేదు. సమర్థవంతంగా అవ్వడంలో వ్యర్థము ఆటంకాన్ని వేస్తుంది.
మరి ఈరోజు బాప్ దాదా వ్యర్థ సంకల్పాలను సమాప్తం చెయ్యడానికి నలువైపుల ఉన్న పిల్లలకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇప్పటినుండి వ్యర్థాన్ని సమాప్తం చేసి సదా సమర్థవంతులుగా అయ్యి సమర్థులుగా తయారు చెయ్యండి. కేవలం సందేశాన్ని ఇవ్వకండి, సమర్థులుగా చెయ్యండి, సమర్థులుగా అవ్వండి. వ్యర్థం యొక్క సమాప్తి దివసాన్ని జరుపుకోండి. వీలవుతుందా? వ్యర్థ సంకల్పాలు స్వయానికీ నష్టాన్ని తీసుకువస్తాయి, సమయము వ్యర్థంగా పోతుంది, ముఖముపై సదా సంతోషము, అదృష్టము యొక్క అనుభవం తగ్గుతుంది. అందుకే ఇప్పుడు సమాప్తి యొక్క సమయాన్ని సమీసంగా తీసుకురావాలి. ఎవరు తీసుకురావాలి? మీరే కదా! ఇప్పుడు సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. అందుకోసం వ్యర్థాన్ని నమాప్తం చెయ్యాల్సిందే, చెయ్యాలి కాదు, చెయ్యాల్సిందే, స్వప్నంలో కూడా రాకూడదు, సంకల్పం కాదు కదా స్వప్నంలో కూడా రాకూడదు, స్వయాన్ని ఇంతటి ధైర్యవంతులగా భావించేవారు చేతులెత్తండి. మనస్సు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా! స్థూలమైన చేతిని ఎత్తడం చాలా సులువు. కానీ మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా? మనస్సు రూపీ చేతిని ఎత్తేవారు చేతులెత్తండి. అచ్ఛా. ఈ నాటి వి.ఐ.పిలు లేవండి. ఈనాటి వి.ఐ.పిలుగా వచ్చినవారు లేవండి... ఇక్కడ కూర్చున్నారు కదా. అచ్ఛా, వి.ఐ.పిలు అనగా స్నేహిలు, సహయోగులు, జరుగుతున్న కర్తవ్యంపట్ల ప్రేమ కలిగినవారు, సోదరీలతో ప్రేమ, సోదరులతో ప్రేమ, వారిని వి.ఐ.పిలు అని అంటాము అనగా స్నేహులు సహయోగులు. ఇప్పుడు ఇంకెలా అవ్వాలి? వి.ఐ.పిలుగా ఉన్నారు, బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఇంకెలా అవుతారు? ఒక చిన్న విషయము ఉంది, చెప్పమంటారా? చెప్పమంటారా? బాప్ దాదా అంటున్నారు. స్నేహమైతే చాలా బాగుంది, స్మృతి కూడా చేస్తారు. బాబా అన్న మాట కూడా మనస్పూర్తిగా వస్తుంది. కేవలం ఒక్క విషయం ఎడిషన్ కావాలి. ఆ ఎడిషన్ ఏమిటి? సహజయోగి లిస్టులో కూడా రండి. ఒక అడుగైతే వేసారు, కానీ ముందుకు వెళ్ళడానికి ఏమి చెయ్యడం జరుగుతుంది? ఒక అడుగు వేసాక ఇంకా ముందుకు వెళ్ళాలంటే రెండో అడుగును వెయ్యవలసి ఉంటుంది. స్నేహి పిల్లలు మరియు సహయోగి పిల్లల పట్ల బాప్ దాదాకు ఉన్న ఆశ ఇదే. కావున సహజయోగులుగా కూడా అవ్వండి. సహజయోగులుగా అవ్వగలరా? అవ్వగలరు, ఏదీ కష్టం కాదు. దేనినీ వదలాల్సిన అవసరం లేదు. యోగ శక్తి మరింత సహాయాన్ని అందిస్తుంది. మీ కార్యంలో వృద్ధి అవుతుంది. బాప్ దాదాకు స్నేహి సహయోగి పిల్లలు గుర్తుకు వస్తూ ఉంటారు. ఎందుకని? ఎందుకంటే మీరు ఉదాహరణగా ఉన్నారు. ఒక విషయంలో అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇల్లు వాకిలి వదలాల్సి ఉంటుందేమో అని అనుకుంటారు. కానీ మీరందరూ ఇళ్ళల్లో ఉంటూ స్నేహంగా, సహయోగమునిస్తూ నడుచుకుంటున్నారు. మిమ్మల్ని చూసి వారిలో ఉల్లాన ఉత్సాహాలు వస్తాయి. మీ సేవ జరిగిపోతుంది. అనేకుల అదృష్టపు తాళాన్ని మీరు తెరువగలరు. ఇష్టమేనా? నచ్చితే చేతులెత్తండి. అచ్ఛా. ఇప్పుడు బాప్ దాదా ఒక వరదానమును ఇస్తారు. మీరు ధైర్యాన్ని ఉంచారు, ధైర్యానికి ఫలితం చాలా మధురంగా ఉంటుంది. బాప్ దాదా ఇచ్చే వరదానమేమిటంటే మీరందరూ రాబోయే క్రొత్త ప్రపంచంలో 21 జన్మలు సదా సంతోషంగా ఉంటారు, ప్రపంచం యొక్క అలజడులలోకి రారు. జీవితంలో కావలసినవి, తనువు-మనసు-ధనము అన్నీ లభిస్తాయి. తనువు ఆరోగ్యంగా, మనసు సంతోషంగా, ధనం అపారంగా లభిస్తాయి. ఇది మీకు 21 జన్మలవరకు గ్యారంటీ. బాప్ దాదాకు సమ్మతమే, మీరు కేవలం ఒక్కటి చెయ్యండి. రోజూ ఆశ్రమానికి వెళ్ళలేకపోతే ఫోన్ అయినా చెయ్యండి. ఈ చెవి యొక్క ఫోన్ ఉంది కదా, అది చెయ్యండి. మీ కనెక్షన్లో ఉన్న టీచర్ తో మీ సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. రోజూ ఆ సమయానికి ఫోన్ చెయ్యండి. రోజూ చదివే మహావాక్యాలను మురళి అంటారు, అందులోని వరదానము మరియు ఆరంభంలో ఉండేవాటిని వినండి. ఎందుకని? బాప్ దాదా ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ చెయ్యాలనుకుంటే చేతులెత్తండి. అచ్ఛా, ఈనాటి ప్రపంచం అనుసారంగా పరిస్థితులు చాలా మారుతూ ఉన్నాయి. ప్రభుత్వ నియమాలు కూడా మారుతూ ఉంటాయి. మనుష్యుల వృత్తి కూడా మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో పరిస్థితులైతే వస్తాయి, వ్యర్థమూ వస్తుంది. వ్యర్థాన్ని సమాప్తం చెయ్యడానికి సమర్థ సంకల్పాలు కావాలి. వేస్ట్ ను సమాప్తం చెయ్యడానికి బెస్ట్ సంకల్పాలు కావాలి. అందుకే రోజూ వరదానాన్ని వినండి. వరదానమనేది శ్రేష్ఠ సంకల్పము. వ్యర్థం వచ్చినప్పుడు మనసుకు శ్రేష్ఠ సంకల్పము కావాలి. మనసు ఖాళీగా ఉండలేదు. మనసుకు ఏదో ఒక సంకల్పం కావాలి. మరి వ్యర్థాన్ని, వేస్టును బెస్ట్ లోకి మార్చడానికి, ఈ వరదానము మరియు స్లోగన్ మొదలైన ప్రారంభములోని పదాలు మనసును మార్చడానికి కావాలి. ఇది చెయ్యగలరా? చెయ్యగలరా? కొందరు చేస్తుండవచ్చు. ఎందుకంటే అనుభవీలుగా అయ్యి ఇతరులనూ అనుభవీలుగా చెయ్యగలిగే సేవను మీరు ఎంతో చెయ్యగలరు. ఇప్పుడు సమయం చాలా వేగంగా వెళ్తోంది. మరి ఈ ఫాస్ట్ సమయంలో మీ సేవ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. మీ అందరూ వచ్చినందుకు బాప్ దాదాకు సంతోషంగా ఉంది, పిల్లలను చూసాము కదా, అప్పుడప్పుడూ వచ్చేవారే అయినా కానీ పిల్లలే కదా. మరి పిల్లలనైతే తండ్రి చూస్తారు. అందుకే మీరు అమృతవేళ లేచినప్పుడు మంచంపై పడుకుని కూడా కళ్ళు తెరవగానే ముందుగా శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇది చెయ్యగలరా? అందుకే అంటారు, మంచిని చూస్తే రోజంతా మంచే జరుగుతుంది అని. ఏదైనా చెడును చూస్తే ఏమంటారు? ఈ రోజు ఎవరి ముఖం చూసానో, రోజంతా పాడైపోయింది అని అంటారు. మరి అతి మంచివారు ఎవరు? శివబాబా. శివబాబాపై ప్రేమ ఉంది కదా. కనుక కళ్ళు తెరవగానే శివబాబా, గుడ్ మార్నింగ్ అని అనండి. అలాగే కళ్ళు మూసుకునేటప్పుడు, అంటే పడుకునేటప్పుడు శివబాబా గుడ్ నైట్ అని అనండి. ఇది సహజమే కదా. అప్పుడు మీకు రోజంతా మంచే జరుగుతుంది. ఎందుకంటే శుభ సంకల్పమైన వరదానాన్ని కూడా తీసేసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఇలా చెయ్యండి. మీరంటే బాబాకు ప్రేమ ఉంది కదా. ఇలా చెయ్యడం ద్వారా మీరింకా ముందుకు వెళ్ళగలరు. మీ జీవితంలో సంతోషాన్ని అనుభవం చేస్తారు. ఎప్పుడూ దుఃఖపు అల రాదు. మరి ఒప్పుకున్నట్లేనా, అలాగే సహజయోగులుగా అవ్వండి, చాలు. నేను ఆత్మను, శివబాబా సంతానమును, చాలు, ఇదే సహజయోగం. నడుస్తూ తిరుగుతూ నేను ఆత్మను, శివబాబా సంతానమును అని గుర్తుంచుకోండి. ఇదైతే గుర్తు పెట్టుకోగలరు కదా. చాలా మంచిది. ఇది వీరితో చేసిన ఆత్మిక సంభాషణ.
ఇప్పుడు మీరందరూ వారసులుగా ఉన్నారు, వారసులుగా అయ్యేవారూ ఉన్నారు. ఎవరైతే స్వయాన్ని బాప్ దాదాకు పక్కా వారసులుగా భావిస్తున్నారో వారు చేతులెత్తండి. వారసులేనా? వి.ఐ.పిలు కూడా అందరూ చేతులెత్తుతున్నారు. చప్పట్లయితే కొట్టండి. అచ్ఛా. ఇప్పుడు వారస క్వాలిటీవారు ఈ రోజు ఒక సంకల్పాన్ని దృఢంగా చేసుకోండి. బాప్ దాదాతో ఏమని సంకల్పం చేస్తారంటే, ఇప్పటి నుండి, ఎప్పటి నుండో కాదు, ఇప్పటి నుండి వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసే తీరుతాము. ఒప్పుకున్నట్లేనా? అయితే చేతులెత్తండి. అచ్ఛా, మేము మనసు ద్వారా పక్కా సంకల్పం చేస్తున్నాము అనేవారు చేతులెత్తండి. కేవలం చేతులెత్తకండి, మనసు యొక్క చేతులెత్తేవారు చేతులెత్తండి. అచ్ఛా, అందరూ ఉన్నారు. వెనుకవారు చేతులెత్తుతున్నారా? పక్కా అనేవారు రెండు చేతులెత్తండి. మరి ఈ రోజు ఏమిరోజు- వ్యర్థాన్ని సమాప్తం చెయ్యడము అంటే సమర్థవంతులుగా అవ్వడము. సదా సమర్థత, మరియు రెండవ కార్యము ఏమిటి? దుఃఖము మరియు అశాంతి యొక్క సమాప్తి రోజును సమీపంగా తీసుకురావడము. రెండు కార్యాలు ఉన్నాయి. ఒకటి, సదా సమర్థవంతులుగా అవ్వడము మరియు రెండు, సమయాన్ని సమీపంగా తీసుకురావడము. సరేనా. రెండు కార్యాలకూ సమ్మతమేనా? తల ఊపండి. ఎందుకంటే బాప్ దాదాకు మొరలు, దుఃఖపు ఆక్రందనలు చాలా వినిపిస్తూ ఉంటాయి. మీకెందుకు వినిపించవో అర్థం కాదు. బాప్ దాదా ఇలా విన్నప్పుడు, పిల్లలైన మీరు స్వయాన్ని వారసులుగా భావిస్తున్నారు, వారసత్వాన్ని తీసుకునేవారు. మరి వారసత్వాన్ని తీసుకునేవారికి ఇతరులకు వారసత్వాన్ని ఇప్పించే విషయంలో దయ కలగాలి కదా! దయ ఎందుకు కలగడం లేదు? వైరాగ్యము, అనంతమైన వైరాగ్యము మరియు దయ రావాలి. చిన్న చిన్న విషయాలలో ఎందుకు, ఏమిటి అన్న క్యూలో సమయాన్ని గడపద్దు. బాప్ దాదాకు గారాబాల, పదమా పదమ వరదానాలతో నిండిన వరదానీ పిల్లలారా! ఇప్పుడు సంకల్పాన్ని దృఢంగా చేసుకోండి. దృఢత్వము అనే తాళంచెవిని ఉపయోగించండి, కర్మయోగులుగా అవ్వండి. కర్మయోగి జీవితం కలిగినవారిగా అవ్వండి. జీవితము అన్నది సదాకాలం ఉండేది, అప్పుడప్పుడూ ఉండేది కాదు. కావున ఇప్పుడు మీ కృపామయ, దయామయ, దుఃఖహర్త సుఖదాత స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. అకస్మాత్తు యొక్క సమయం గురించి బాప్ దాదా ఎంతో కాలంగా చెప్తూ ఉన్నారు. కావున అకస్మాత్తుగా జరిగేకన్నా ముందే భక్తుల మొరలను పూర్తి చెయ్యండి. దుఃఖంతో ఉన్నవారి దుఃఖాలను వినండి. ఇప్పుడు చిన్నవారు, పెద్దవారు అందరూ స్వయాన్ని విశ్వ పరివర్తకులుగా, విశ్వంలోని దుఃఖాన్ని పరివర్తన చేసి సుఖ ప్రపంచాన్ని తీసుకువచ్చేందుకు బాధ్యులుగా భావించండి.
బాప్ దాదా ఇలా రావడము వెళ్ళడము కూడా ఎప్పటి వరకు? అందుకే అన్నీ అకస్మాత్తుగా జరుగనున్నాయి. ఇప్పుడు ఇక వారస క్వాలిటీని తయారుచేయండి, వారసత్వాన్ని ఇప్పించడము, దయా హృదయులుగా అయ్యే పాత్రను వహించండి. ఎప్పటివరకు జరుగుతుంది అని అనుకోకండి. అకస్మాత్తుగా జరుగుతాయి. అందుకే వ్యర్థాన్ని సమాప్తం చెయ్యాల్సిందే. అవ్వాల్సిందే, చెయ్యాల్సిందే. బాప్ దాదా రిజల్టును చూసారు, అందరి కర్మల గతిని పరిశీలించారు. పురుషార్థపు గతిని పరిశీలించారు. ఖజానాలను, జమ ఖాతాను పరిశీలించారు. మరి రిజల్టులో ఏమి చూసారు? జమ చేసుకోవడానికి చాలా మంచిగా పురుషార్థాన్ని చేస్తున్నారు, కానీ జమ చేసుకోవడంలో శాతం భిన్నంగా ఉంది. ఇంత మేము జమ చేసుకున్నాము అని మీరు అనుకుంటారు, జమ అయితే అవుతుంది కానీ శాతంలో తక్కువగా జమ అవుతోంది, సదా కోసం జమ అవ్వడం లేదు. ఎంతైతే చేస్తున్నారో అంతగా సదా కోసం జమ అవ్వడంలో తేడా ఉంది. అందుకే బాప్ దాదా ఇప్పుడు ఒక్కొక్క విషయంపై దృఢ సంకల్పాన్ని చేయిస్తున్నారు. క్రోధంపై చేయించారు, కానీ మనసులో ఎవ్వరిపట్ల అలజడి రాకూడదు. ఎందుకు, ఏమిటి అని రాకూడదు. నోటితో అయితే కంట్రోల్ చేసుకున్నారు, కొందరు మంచిగా కంట్రోల్ చేసుకున్నారు కానీ మనసుతో కొంత జరుగుతూ ఉంటుంది. తొలగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటెన్షన్ పెట్టినందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. దీనివల్ల నాకే నష్టముంది అని అర్థం చేసుకుంటున్నారు. అర్థమయిందా. అచ్ఛా!
సేవ టర్న్ ఈస్టర్న్ జోన్, (బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం) నేపాల్ మరియు తమిళనాడు వారిది:-
ముప్పావు హాలు వీరే ఉన్నారు. అచ్ఛా, సేవాధారులు, కేవలం సేవాధారులు లేవండి, తోడుగా వచ్చిన మిగతావారు కూర్చోండి. చాలామంది ఉన్నారు. బాగుంది. ఇప్పుడు విశేషమైనవారు ఈస్టర్న్ వారు. ఈస్టర్న్ లో కూడా చాలా భాగాలున్నాయి. ఈస్టర్న్ జోన్ విశేషత అయితే ఉంది, అందులో కూడా విశేషమైనది కలకత్తా, అక్కడ జ్ఞాన సూర్యుడు ఉదయించారు. ఎక్కడైతే జ్ఞాన సూర్యుడు ఉదయించారో ఆ ధరిత్రి ఎంత మహనీయమైనది! బెంగాల్, బీహార్.... బీహార్ కూడా తక్కువేమీ కాదు. ఎందుకంటే బాప్ దాదా ఏమి చూసారంటే బీహార్ లో సేవా సాధనాలు చాలా మంచిగా ఉన్నాయి. ఎందుకు మంచిగా ఉన్నాయి? ఎందుకంటే బీహార్ ప్రజలు మంచి ఆశలను పెట్టుకుంటారు. బీహార్‌లో ఈ మధ్య జరిగిన అలజడి సమయంలో అక్కడి సోదరసోదరీలు చేసిన కార్యము, వారి జీవితానికి ఏమి కావాలో ఆ ప్రాప్తిని ఇచ్చేందుకు మరియు జ్ఞానాన్ని వినిపించేందుకు, మనసు మరియు శరీరము రెండింటి పాలనను ఇచ్చారు. అందుకే బీహార్ లో మంచి పేరు వ్యాప్తి అయ్యి ఉంది. ప్రేమతో వింటారు, ఈ సేవను మనస్ఫూర్తిగా చేసారు. ఇటువంటి డబుల్ సేవను, కేవలం వస్తువులనిచ్చే సేవయే కాక సెంటర్లను కూడా తెరిచారు, ఇటువంటి డబుల్ సేవను చేసే బీహార్ పిల్లలకు బాప్ దాదా విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. నిజానికి మిగతా ప్రదేశాలలో కూడా చేస్తూ ఉంటారు, చేసారు కూడా. వారి పేరును తీసుకోవడములోదు, కానీ చేస్తూ ఉంటారు. విదేశాలలో కూడా చేసారు, ఇండియాలో కూడా చేసారు. కానీ బీహార్ విశేషత ఏమిటంటే అక్కడ అనేక ప్రదేశాలలో జ్ఞాన వర్షాన్ని చాలా బాగా కురిపించారు. ఎన్ని సెంటర్లు తెరిచారు? (ఒక సంవత్సరంలో 12 సెంటర్లను 12 జిల్లాలలో తెరవడం జరిగింది). గీతా పాఠశాలలు కూడా తెరిచి ఉంటారు కదా!(వాటిని కూడా తెరవడం జరిగింది). బాగుంది. బాప్ దాదాకు ఈ సేవ చాలా బాగా నచ్చుతుంది. ఇటువంటి పరిస్థితి ఉన్న ప్రతి చోట ఈ విధమైన డబుల్ సేవను చెయ్యాలి. సెంటర్ ను తెరవడంలో మీరు నిమిత్తులుగా అవ్వవలసి ఉంటుంది ఎందుకంటే అక్కడి పరిస్థితులు పాడై ఉంటాయి, కానీ కొద్ది సమయంలో మీకు మంచి సహయోగులుగా అవుతారు. బాప్ దాదా ఏమి చూసారంటే, ఇప్పుడు ఈ జోన్ లో కూడా సేవ వ్యాపిస్తోంది. అది బెంగాల్ అవ్వవచ్చు, బీహార్ అవ్వవచ్చు, వారి తోటివారు కావచ్చు. నేపాల్, ఒరిస్సా, అస్సాం, తమిళనాడు కావచ్చు. వీరి తోటివారు చాలామంది ఉన్నారు ఎందుకంటే జ్ఞాన సూర్యుడు ఉదయించారు కనుక సెంటర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి మరియు తోటివారు కూడా చాలామంది ఉన్నారు. ఈ రోజు వరకు ప్రతి ఏరియాకు, అది పెద్ద జోన్ కాకపోయినా, చిన్నదే అయినా కానీ చిన్నవారిలో సేవా ఉత్సాహము చాలా ఉంది. ఎంతో అభిరుచితో చేసారు, చేస్తూ ఉన్నారు కూడా. అందుకే ఏ జోన్ల పేరైతే ఇప్పుడు చెప్పడం జరిగిందో అక్కడంతా సేవ యొక్క ఊపు మంచిగా ఉంది. రిజల్టులో ఇంకేమి చూసామంటే, రెగ్యులర్ స్టూడెంట్లుగా కూడా అయ్యారు. ప్రోగ్రాము చిన్నదైనా, పెద్దదైనా, మీడియా కూడా తోడుగా ఉంటుంది, కానీ సమయాన్ని సమీపంగా తీసుకురావాలి అని ఇప్పుడు బాబా ఏదైతే చెప్పారో అందుకోసం త్వరత్వరగా ఏర్పాట్లు చెయ్యండి. అచ్ఛా! బెంగాల్, బీహార్ వైపు నుండి వచ్చిన వారందరికీ బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. యజ్ఞసేవ అను పుణ్య కార్యాన్ని మంచిగా సంభాళిస్తున్నారు, సంఖ్య ఎక్కువగా ఉంది కానీ బాపదాదా ఒక్క విషయాన్ని చూసారు. అందరికీ తక్కువ సంఖ్యలో రావడంకన్నా ఎక్కువ సంఖ్య ఉన్నప్పుడు రావడమే ఇష్టము. రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ కుంభ మేళాలో కన్నా కూడా శుద్ధమైన భోజనమే లభిస్తుంది కదా. ఉండటానికి టెంట్ అయితే లభించింది కదా, ఎవరైతే వస్తారో వారి ప్రేమను చూసి బాప్ దాదా, ఎందుకంటే ప్రేమలో ఏదైనా చూడాల్సి వచ్చినా, చేయాల్సి వచ్చినా కానీ అది అంతగా తెలియదు. సంతోషంగా చేస్తారు. మరి బెంగాల్, బీహార్ జోన్ వారు కుడా సేవా పాత్రను మంచిగా నిర్వహించారు. అచ్ఛా. ఇక్కడ కూర్చున్నవారిలో ఎవరికైనా పడుకునే వద్ద, తినేవద్ద ఏదైనా కష్టముంటే చేతులెత్తండి. తినడము, పడుకోవడం వద్ద కష్టంగా ఉన్నవారు చేతులెత్తండి. పెద్దగా చెయ్యి ఎత్తండి. అచ్ఛా!
తమిళనాడు:- ఈమధ్య తమిళనాడు వారు కూడా సేవలో ఉల్లాస ఉత్సాహాలతో ఉన్నారు. శివుని మేళా ఏదైతే చేసారో, ఆ సేవను వివిధ స్థానాలలో కూడా చేస్తున్నారు. దాని వలన లాభం ఇతర దేశాలకు కూడా చేరుకుంటుంది, ఇది చాలా మంచిది ఎందుకంటే విశేషమైనదైతే శివబాబా పరిచయం కదా. అందులో శివబాబా పరిచయమే లభిస్తుంది. కావున ఈ సేవను ఇతర దేశాలలోకి వెళ్ళి కూడా చేస్తున్నారు. ఈ సేవా సమాచారం బాప్ దాదాకు మంచిగా అనిపించింది. చేస్తూ ఉండండి. ఏ జోన్ లో అయితే పరస్పరం ఐకమత్యం ఉంటుందో, ఐకమత్యం స్వతహాగానే పుణ్య కర్మను చేయిస్తుంది, ఉల్లాస ఉత్సాహాలను పెంచుతుంది. బాప్ దాదా ఏమి చూసారంటే, అందరూ, పూర్తి జోన్ కలిసి ఏ హాల్ నైతే తయారు చేసారో, అందరి సహయోగంతో, జోన్ సహయోగంతో హాల్ తయారయింది. జోన్ లోని వారి మధ్య ఉన్న సహయోగము కూడా మంచిగా అనిపించింది. జోన్‌ను కలపడం ద్వారా ఒకరికొకరు సమీపంగా ఉండటంవలన ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకోవడం సహజమవుతుంది. కావున ఇది కూడా సహయోగిగా అవ్వడమే, నా ఏరియా అని కాదు, అన్నీ నావే. ఎక్కడ అవసరముందో అక్కడ నాది. జోన్ పేర్లు వేరువేరుగా ఉండవచ్చు కానీ ఎక్కడ అవసరముందో, అవసరమున్న సమయంలో సహయోగాన్ని అందించడం మహా పుణ్యము. ఒకవేళ మీ పుణ్య ఖాతాను జమ చేసుకోవాలంటే సహయోగులుగా అవ్వండి మరియు సేవకు మరింత వెలుగు అందించండి. ఇది బాప్ దాదాకు నచ్చింది. కావున ఈ సంగఠనను పెంచుతూ ఉండండి. పెంచుతూనే ఉంటారు కదా, చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. అచ్ఛా. మనమందరమూ ఒక్కటే, సేవ కారణంగా, కార్య వ్యవహారాల కారణంగా జోన్లు తయారు చెయ్యబడ్డాయి, నిజానికి అంతా ఒక్కటే. ఒక్కటిగా ఉంటాము. ఒక్కరికి చెందినవారము. ఒక్కరికే చెంది ఉంటాము. అచ్ఛా!
నేపాల్:- నేపాల్ సేవా సమాచారాన్ని వింటూ ఉంటాము. అక్కడి వాయుమండలం అనుసారంగా యుక్తితో సేవను మంచిగా చేస్తున్నారు. బాప్ దాదా నేపాల్ సేవను విని సంతోషిస్తున్నారు. ఏమి జరిగినా కానీ ఈ ఆధ్యాత్మిక సేవ తక్కువ అవ్వదు, పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సెంటర్లు పెరుగుతున్నాయి, అలజడిలో అచలంగా ఉన్నారు. అందుకే బాప్ దాదాకు నేపాల్ సేవపై గర్వంగా ఉంటుంది. చాలా బాగుంది. వీరంతా నేపాల్ వారు లేచారు. నేపాల్‌వారు పెద్దగా చేతులెత్తండి. ఇది మంచిగా చేసారు, ఇలా జోన్లవారీగా కలవడం ద్వారా వారూ తృప్తిగా వస్తున్నారు. మరియు సేవను కూడా చేస్తున్నారు. అందరికీ సాల్వేషన్ కూడా లభిస్తుంది. అచ్ఛా!
డబుల్ విదేశీయులు :- డబుల్ విదేశీయులకు బాప్ దాదా డబుల్ పురుషార్థులు అని టైటిల్ ను ఇచ్చారు. మరి చెప్పండి, డబుల్ పురుషార్థులే కదా, చేతులెత్తండి. డబుల్ విదేశీయులు కాదు డబుల్ పురుషార్థులు. చాలా బాగుంది. విదేశీ సేవ బాబాను విశ్వ సేవాధారిగా ఋజువు చేసింది అని బాప్ దాదా ఎప్పుడూ అంటుంటారు. మొదట్లో కేవలం భారత సేవాధారిగానే ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రతి టర్నులో 90 దేశాల నుండి, 80 దేశాల నుండి డబుల్ విదేశీయులు వస్తున్నారు. ప్రతి సీజన్‌కు విదేశాలలో కూడా సేవ పెరగడం, ఎంతో ఉల్లాసంతో మిలనానికి రావడం బాప్ దాదాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఎంత కష్టపడాల్సి వచ్చినాకానీ, బాప్ దాదాకు తెలుసు, ప్రారంభంలో ఒకసారి కలిసి వెళ్ళాక మరో సంవత్సరం కోసం డబ్బాలో టికెట్ల కోసం కూడబెట్టేవారు, కానీ తప్పకుండా వచ్చేవారు. ఇప్పుడు తనువు, మనసు, ధనం అన్నింటిలో ముందుకు వెళ్తున్నారు. బాప్ దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు, మధువనంకు వచ్చి రిఫ్రెష్ అవ్వడము, పర్సనల్ అటెన్షన్ పెట్టుకోవడము బాప్ దాదాకు చాలా నచ్చింది. ఈసారి రిజల్టును కూడా బాప్ దాదా విన్నారు. ఒకరికొకరు స్నేహి, సహయోగిగా అయి ఏదైనా సూచనను ఇవ్వాల్సి ఉన్నప్పుడు, పురుషార్థం తీవ్రతరం చేయడంలో లోపమున్నప్పుడు మనస్ఫూర్తిగా ఒకరికొకరు చెప్పుకోవడం బాప్ దాదాకు నచ్చింది. ఎందుకంటే ఎప్పటివరకైతే తమ లోపాన్ని తెలుసుకోరో, గుర్తించరో అప్పటివరకు పరివర్తన జరగదు. అందుకే బాప్ దాదాకు పురుషార్థపు విధి మంచిగా అనిపించింది. కొద్ది కొద్ది మంది పరస్పరంలో మీటింగ్ చేసుకోవడం వలన దానిద్వారా అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. మరి డబుల్ విదేశీయులు డబుల్ పురుషార్థులు- ఇది బాప్ దాదా మధువన సమాచారంలో ఎక్కువ చూసారు. మిగతా వారందరూ ఎవరైతే వచ్చారో ఇప్పుడు స్వయాన్ని నిర్విఘ్నంగా భావిస్తున్నారా? నిర్విఘ్నంగా భావిస్తున్నట్లయితే చేతులెత్తండి. నిర్విఘ్నము. అచ్ఛా. మెజారిటీ ఉన్నారు. కొందరు లేరు. మెజారిటీ ఉన్నారు. మరి బాప్ దాదా ఈ రోజు డబుల్ విదేశీయులకు డబుల్ వరదానాన్ని ఇస్తున్నారు - ఒకటి, సేవ చేసి సెంటరును వృద్ధి చేయండి. రెగ్యులర్ స్టూడెంట్లను పెంచుతూ ఉండండి. పెరుగుతారు. రెండవది, ఒకరికొకరు పురుషార్థం చేస్తూ చేయించే మీటింగ్ ఏదైతే పెట్టారో, ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు దానివలన లాభాన్ని కూడా ఎంతైతే తీసుకోవాలో అంతకంటే ఎక్కువగానే తీసుకుంటూ ఉండండి. పరస్పరంలో ఏదైతే తయారు చేసుకున్నారో ఆ విధి మంచిగా ఉంది. దీనిద్వారా మరింత వృద్ధి అవుతుంది, దీనిపై మరింత అటెన్షన్ పెట్టి మరింత పెంచితే పెరుగుతుంది. విన్నారా! బాప్ దాదా సంతోషిస్తున్నారు. మనసులో ఏమి గుర్తుకు వస్తుంది బాబాకు? ఓహో పిల్లలు ఓహో! అచ్ఛా!
మొదటిసారి వచ్చినవారితో :- ఈ సీజన్లో మెజారిటీ సగం క్లాసుకుపైగా మొదటిసారి వచ్చినవారే ఉన్నారు. ఎందుకంటే రెగ్యులర్ వారైతే బయట కూర్చుంటారు, వారు క్లాసులో అయితే కూర్చోలేరు. అచ్ఛా, అందరూ చూసారా, పరివారం ఎంతగా పెరిగిందో! బాప్ దాదా ఓహో పరివారం ఓహో! అని అంటున్నారు. ఇప్పుడు ఏ స్థానం తయారు చేసినాకానీ అది చిన్నగా అవ్వాల్సిందే. ప్లాన్ తయారు చెయ్యాలి కదా. ఇప్పుడు మీ అందరి అటెన్షన్ సందేశమునివ్వడంలో మంచిగా ఉంది. మరి ఇన్ని సేవలేవైతో జరుగుతున్నాయో వాటి ద్వారా వృద్ధి అయితే జరుగుతుంది కదా! మొదటిసారి వచ్చినవారికి బాప్ దాదా చాలా - చాలా పదమారెట్లు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు నిర్విఘ్నంగా అయ్యి రాబోయే సమస్యలను స్వయం మరియు సహయోగంతో త్వరగా సమాప్తం చేసి ఎగురుతూ వెళ్ళండి. ఇప్పుడు నడిచే సమయం పూర్తి అయిపోయింది, మీరు ఎగిరే సమయంలో వచ్చారు, మరి ఎగిరే సమయంలో నడవకూడదు, ఎగరాలి. కావున ఎగురుతూ ఉండండి, ముందుకు వెళ్తూ ఉండండి- ఇది బాప్ దాదా ఇచ్చే విశేష వరదానము మరియు ఎక్సాట్రా సహాయము మొదటిసారి వచ్చినవారికి లభిస్తుంది. అచ్ఛా!
ఇప్పుడు నలువైపుల ఉన్న పరమాత్మ ప్రియులైన పిల్లలను, ఎవరైతే సదా తండ్రి ప్రేమలో ఎగురుతూ ఉన్నారో, తీవ్ర పురుషార్థులుగా ఉన్నారో అటువంటి సేవలో నిర్విఘ్నమైన సత్యమైన సేవాధారులను, నలువైపుల ఉన్న ఇటువంటి పిల్లలను బాప్ దాదా చూస్తున్నారు, అంతేకాక దూరంగా ఉన్నవారిని కూడా చూస్తున్నారు. ఇక్కడ శాంతివనంలో కూడా అక్కడక్కడ స్క్రీన్ పై చూసేవారికి, వినేవారికి, అందరికీ బాప్ దాదా సదా కోసం సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచండి అన్న వరదానాన్ని ఇస్తున్నారు. సంతోషకర ముఖము ఉండాలి. ఎవరు మీ ముఖమును చూసినా ఆ ముఖము సంతోషించాలి. ఎలా ఉన్నా కానీ మీ సంతోషకర ముఖాన్ని చూసి వారు కూడా సంతోషంగా ఉండాలి. ఈ వరదానము నలువైపుల ఉన్న పిల్లలకు, సమ్ముఖంలో ఉన్న పిల్లలందరికీ ఇచ్చే ఒక వరదానము. ఎప్పుడూ ముఖము వాడిపోయి ఉండకూడదు. మీరే వాడిపోతే ఇక ప్రపంచ పరిస్థితి ఏమిటి! మీరు సదా సంతోషకర ముఖముతో, సంతోషం నిండిన నడవడికతో ఉండాలి మరియు ఉంచాలి. ఇటువంటి తీవ్ర పురుషార్థి పిల్లలందరికీ బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే.
నిర్మలశాంత దాదీతో :- వీరు బాగున్నారు. ఎటువంటి లెక్కా చారాన్ని అయినా సమాప్తం చేసుకోవడంలో సాక్షిగా, అతీతంగా మరియు ప్రియంగా అవ్వడంలో మంచి ఉదాహరణగా ఉన్నారు.
Comments
Post a Comment