13-03-1986 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“సహజ పరివర్తనకు ఆధారము - అనుభవం యొక్క అథారిటీ”
బాప్ దాదా తమ సర్వ ఆధారమూర్తులైన మరియు ఉద్ధారమూర్తులైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈనాటి విశ్వాన్ని శ్రేష్ఠంగా, సంపన్నంగా చేయడంలో ఆధారమూర్తులుగా ఉన్నారు. ఈ రోజు విశ్వము తమ ఆధారమూర్తులైన శ్రేష్ఠ ఆత్మలను భిన్న-భిన్న రూపాలతో, భిన్న-భిన్న విధులతో పిలుస్తుంది, గుర్తు చేస్తుంది. మరి మీరు ఇటువంటి సర్వ దుఃఖిత, అశాంత ఆత్మలకు ఆధారాన్ని ఇచ్చేవారు, దానం ఇచ్చేవారు, సుఖశాంతులకు మార్గాన్ని చూపించేవారు, జ్ఞాన నేత్రహీనులకు దివ్య నేత్రాన్ని ఇచ్చేవారు, భ్రమిస్తున్న ఆత్మలకు ఒక గమ్య స్థానాన్ని ఇచ్చేవారు, అప్రాప్తి ఉన్న ఆత్మలకు ప్రాప్తి యొక్క అనుభూతిని కలిగించేవారు మరియు అందరినీ ఉద్ధరించే శ్రేష్ఠ ఆత్మలు. విశ్వంలో నలువైపులా ఏదో ఒక రకమైన అలజడి ఉంది. ఒకచోట ధనం కారణంగా అలజడి ఉంటే, మరో చోట మనసులోని అనేక టెన్షన్ల అలజడి, ఇంకో చోట తమ జీవితంతో అసంతుష్టంగా ఉన్న కారణంగా అలజడి, మరో చోట ప్రకృతి యొక్క తమోప్రధాన వాయుమండలం కారణంగా అలజడి, నలువైపులా అలజడితో కూడిన ప్రపంచం, ఇటువంటి సమయంలో విశ్వంలోని ఒక మూలలో ఆత్మలైన మీరు అచలంగా-నిశ్చలంగా ఉన్నారు. ప్రపంచం భయానికి వశమై ఉంది కానీ మీరు నిర్భయులుగా అయి సదా సంతోషంలో నాట్యం చేస్తూ, పాడుతూ ఉన్నారు. ప్రపంచము అల్పకాలికముగా సంతోషపెట్టే సాధనాలను, నాట్యము, పాడటము మరియు ఇతర అనేక సాధనాలను ఉపయోగించుకుంటున్నా కానీ ఆ అల్పకాలికమైన సాధనాలు మరింతగా చింత అనే చితి పైకి తీసుకువెళ్తున్నాయి. ఈ విధంగా ఉన్న విశ్వాత్మలకు ఇప్పుడు శ్రేష్ఠ అవినాశీ ప్రాప్తుల అనుభూతి యొక్క ఆధారము కావాలి. అన్ని ఆధారాలను చూసారు, అన్నిటినీ అనుభూతి చేసారు, అందరి మనసుల నుండి ఇంకా ఏదో కావాలి అన్న మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సాధనాలు, ఈ విధులు సిద్ధిని అనుభవం చేయించేవి కావు. ఏదైనా క్రొత్తది కావాలి, ఇంకేదో కావాలి అనేదే అందరి మనసులోని మాట. అల్పకాలం కోసం తయారైన ఆధారాలన్నీ గడ్డిపరక వంటి ఆధారాలు. వాస్తవిక ఆధారాన్ని వెతుకుతున్నారు, అల్పకాలికమైన ఆధారమును, అల్పకాలికమైన ప్రాప్తులను, విధులను చూసి-చూసి ఇప్పుడు అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు అటువంటి ఆత్మలకు యథార్థమైన ఆధారము, వాస్తవిక ఆధారము, అవినాశీ ఆధారము గురించి చెప్పేది ఎవరు? మీరందరూ కదా!
ప్రపంచం లెక్కలో చూస్తే మీరు చాలా కొద్దిమందే ఉన్నారు, చాలా కొద్దిమంది, కానీ కల్పక్రితపు స్మృతిచిహ్నంలో కూడా అక్షోహిణి ఎదుట 5 మంది పాండవులను చూపించారు. అందరికంటే అతి పెద్ద అథారిటీ మీతో ఉన్నారు. సైన్సు అథారిటీ, శాస్త్రాల అథారిటీ, రాజనీతి యొక్క అథారిటీ, ధర్మనీతి యొక్క అథారిటీ, అనేక అథారిటీలవారు తమ తమ అథారిటీ ప్రమాణంగా ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు ప్రయత్నాలు చేసారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీ వద్ద ఏ అథారిటీ ఉంది? అన్నిటికన్నా పెద్దదైన పరమాత్మ అనుభూతి యొక్క అథారిటీ ఉంది. అనుభవం యొక్క అథారిటీతో శ్రేష్ఠంగా మరియు సహజంగా ఎవరినైనా పరివర్తన చేయవచ్చు. మరి మీ అందరి వద్ద ఈ విశేష అనుభవం యొక్క అథారిటీ ఉంది కనుక మీరు గర్వంగా, నిశ్చయంతో, నషాతో, నిశ్చిత భావంతో - సహజమైన మార్గము మరియు యథార్థమైన మార్గము ఒక్కటే అని చెప్పారు మరియు చెప్తారు. ఇది ఒక్కరి ద్వారానే ప్రాప్తిస్తుంది మరియు సర్వులను ఒక్కటిగా చేస్తుంది. ఈ సందేశమునే అందరికీ ఇస్తారు కదా కనుక బాప్ దాదా ఈ రోజు ఆధారమూర్తులైన, విశ్వానికి ఉద్ధారమూర్తులైన పిల్లలను చూస్తున్నారు. చూడండి - బాప్ దాదాతో పాటు ఎవరు నిమిత్తంగా అయ్యారు. విశ్వానికి ఆధారంగా ఉన్నారు, కానీ అలా ఎవరు అయ్యారు? సాధారణమైనవారు. ఎవరైతే ప్రపంచంవారి దృష్టిలో ఉన్నారో, వారు తండ్రి దృష్టిలో లేరు మరియు తండ్రి దృష్టిలో ఉన్నవారు ప్రపంచం దృష్టిలో లేరు. మిమ్మల్ని చూసి వీళ్ళా అని ముందు నవ్వుకుంటారు. కానీ ప్రపంచం వారు చేసేది తండ్రి చేయరు. వారికి పేరున్న వారు కావాలి, కానీ తండ్రికి మాత్రం నామరూపాలు సమాప్తం అయిపోయినవారి యొక్క పేరును ప్రసిద్ధి చేయడం కావాలి. అసంభవాన్ని సంభవం చేయాలి, సాధారణాన్ని మహాన్ గా చేయడం, నిర్బలులను మహాన్ బలవంతులుగా చేయడం, ప్రపంచం లెక్కలో చదువురానివారిని నాలెడ్జ్ ఫుల్ గా చేయడం - ఇదే తండ్రి యొక్క పాత్ర, కావున బాప్ దాదా పిల్లల సభను చూసి సంతోషిస్తున్నారు, ఎందుకంటే అందరికంటే శ్రేష్ఠ భాగ్యాన్ని తయారుచేసుకునే ఈ అపురూపమైన పిల్లలే నిమిత్తంగా అయ్యారు. ఇప్పుడు ప్రపంచం వారి దృష్టి కూడా నెమ్మది-నెమ్మదిగా అన్ని వైపుల నుండి తొలగి ఒకే వైపుకు వస్తుంది. మేము చేయలేనిది తండ్రి గుప్త రూపంలో చేయిస్తున్నారు అని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు కుంభ మేళాలో ఏమి చూసారు? ఇదే చూసారు కదా! మిమ్మల్ని అందరూ ఎంత స్నేహ దృష్టితో చూసారు. ఇది నెమ్మది-నెమ్మదిగా ప్రత్యక్షం అవ్వనున్నది. ధర్మనేతలు, రాజనేతలు మరియు వైజ్ఞానికులు, వీరు ముగ్గురూ విశేషమైన అథారిటీలే. ఇప్పుడు ముగ్గురూ సాధారణ రూపంలో పరమాత్ముని ప్రకాశమును చూడాలి అన్న శ్రేష్ఠమైన ఆశతో సమీపంగా వస్తున్నారు. ఇప్పుడు కూడా తెర బయట నుండి చూస్తున్నారు, తెర తెరవలేదు. తెర బయట నుండి చూస్తున్న కారణంగా ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. సందిగ్ధత అనే తెర ఉంది. వీళ్ళేనా లేదా ఇంకెవరైనా ఉన్నారా అన్న సందిగ్ధత. అయినా కానీ దృష్టి వెళ్ళింది. ఇప్పుడు ఆ తెర కూడా తొలగిపోతుంది. అనేక రకాల తెరలు ఉన్నాయి. ఒక తెర, తమ నేతృత్వము యొక్క భావము, తమ కుర్చీ లేక సింహాసనముకు సంబంధించినది కూడా పెద్ద తెరయే. ఆ తెర నుండి బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది, కానీ కళ్ళు తెరుచుకున్నాయి కదా. కుంభకర్ణులు ఇప్పుడు కొంత మేల్కున్నారు.
బాప్ దాదా విశ్వంలోని సర్వాత్మలకు అనగా పిల్లలకు తండ్రి వారసత్వాన్ని ప్రాప్తి చేయించి అధికారులుగా తప్పకుండా చేస్తారు. ఎలా ఉన్నాకానీ వారూ పిల్లలే కదా. అయితే పిల్లలకు ముక్తి కావచ్చు జీవన్ముక్తి కావచ్చు, రెండు వారసత్వాలు ఉన్నాయి. వారసత్వం ఇవ్వడానికే తండ్రి వచ్చారు. తెలియదు కదా! వారి దోషం కూడా లేదు, అందుకని మీ అందరికీ కూడా దయ కలుగుతుంది కదా! దయ కూడా కలుగుతుంది మరియు ఎలా అయినా కానీ వారసత్వ అధికారాన్ని సర్వ ఆత్మలు తీసుకోవలసిందే అన్న ఉల్లాసం కూడా వస్తుంది. అచ్ఛా! ఈ రోజు కరీబియన్ వారి టర్ను. అందరూ బాప్ దాదాకు అతి గారాబాల పిల్లలు. ప్రతి స్థానానికీ ఉన్న విశేషత బాప్ దాదా ఎదురుగా సదా ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. బాప్ దాదా వద్ద అయితే పిల్లలందరి లెక్కాపత్రము ఉంటుంది కానీ బాప్ దాదా పిల్లలందరినీ చూసి సంతోషంగా ఉన్నారు, ఏ విషయంలో? పిల్లలందరూ తమ-తమ శక్తి అనుసారంగా సేవ యొక్క ఉల్లాసంలో సదా ఉంటారు. సేవ బ్రాహ్మణ జీవితానికి విశేషమైన వృత్తిగా అయింది. సేవ లేకుండా ఈ బ్రాహ్మణ జీవితం ఖాళీగా అనిపిస్తుంది. సేవ లేకపోతే ఫ్రీ-ఫ్రీగా ఉన్నట్లుగా అనగా చేయడానికి ఏమీ లేదు అన్నట్లుగా ఉంటుంది. సేవలో బిజీగా ఉండాలి అన్న పిల్లల ఉల్లాసాన్ని చూసి బాప్ దాదా విశేషంగా సంతోషిస్తున్నారు. కరీబియన్ విశేషత ఏమిటి? సదా కరీబ్ అనగా సమీపంగా ఉండేవారు. బాప్ దాదా స్థూలంగా ఉన్నది చూడరు, భౌతికంగా ఎంత దూరంగా ఉన్నా కానీ మనసుతో దగ్గరగా ఉన్నారు కదా! ఎంతగా శరీరంతో దూరంగా ఉంటారో, అంతగా తండ్రికి దగ్గరగా ఉన్నట్లు అనుభవం చేసుకునే లిఫ్ట్ లభిస్తుంది, ఎందుకంటే తండ్రి దృష్టి సదా నలువైపులా ఉన్న పిల్లలపై ఉంటుంది. దృష్టిలో ఇమిడి ఉంటారు. దృష్టిలో ఇమిడి ఉన్నవారు ఎలా ఉంటారు? దూరంగా ఉంటారా లేక దగ్గరగా ఉంటారా? మరి అందరూ సమీప రత్నాలే. ఎవ్వరూ దూరంగా లేరు. నియర్ మరియు డియర్ (సమీపంగా మరియు ప్రియంగా) ఉన్నారు. నియర్ గా (సమీపంగా) లేకపోతే ఉల్లాస-ఉత్సాహాలు రావు. సదా తండ్రి తోడు శక్తిశాలీగా చేసి ముందుకు నడిపిస్తుంది.
మీ అందరినీ చూసి అందరూ సంతోషిస్తున్నారు ఎందుకంటే ఎంతో ధైర్యంతో సేవలో వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు. అందరికంటే పెద్ద మాలను మేము తయారుచేయాలి అన్న ఒక్క సంకల్పమే అందరిలోనూ ఉందని బాప్ దాదాకు తెలుసు. ఎవరు ఎక్కడ ఉన్నా కానీ, మాలలోని పూసలు ఎక్కడ చెల్లాచెదురై ఉన్నాకానీ, ఆ మణులను ప్రోగు చేసి మాలగా చేసి తండ్రి ముందుకు తీసుకువస్తారు. ఇప్పుడు ఈ పుష్పగుచ్ఛాన్ని లేక మాలను తండ్రి ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఉల్లాసము పూర్తి సంవత్సరంతా ఉంటుంది కావున పూర్తి సంవత్సరమంతా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం బాప్ దాదా విదేశాలలోని అన్ని సేవాకేంద్రాల వృద్ధి యొక్క రిజల్ట్ బాగా ఉండటాన్ని చూసారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చిన్న పుష్పగుచ్ఛాన్ని లేక పెద్ద పుష్పగుచ్ఛాన్ని ప్రత్యక్ష ఫలం రూపంలో తీసుకువచ్చారు. మరి బాప్ దాదా కూడా తమ కల్ప క్రితపు స్నేహీ పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ప్రేమతో శ్రమ చేసారు. ప్రేమతో కూడిన శ్రమ, శ్రమగా అనిపించదు. కనుక అన్ని వైపుల నుండి మంచి గ్రూప్ వచ్చింది. పిల్లలు సదా సేవలో అలసట లేనివారిగా అయి ముందుకు వెళ్తూ ఉండే విషయం బాప్ దాదాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడూ నిరాశ చెందకుండా ఉండటమే సేవా సఫలత యొక్క విశేషత. ఈ రోజు కొద్దిమంది ఉన్నారు, రేపు ఎక్కువ మంది వస్తారు - ఇది నిశ్చితం, కావున తండ్రి పరిచయం ఎక్కడైతే లభించిందో, తండ్రి పిల్లలు ఎక్కడైతే నిమిత్తమై ఉన్నారో, అక్కడ తప్పకుండా తండ్రి పిల్లలు దాగి ఉన్నారు, వారు సమయానుసారంగా తమ హక్కును తీసుకోవడానికి చేరుకుంటున్నారు మరియు చేరుకుంటూ ఉంటారు. మరి అందరూ సంతోషంలో నాట్యం చేసేవారు, సదా సంతోషంగా ఉండేవారు. అవినాశీ తండ్రి, అవినాశీ పిల్లలు కనుక ప్రాప్తి కూడా అవినాశీగా ఉంటుంది, సంతోషం కూడా అవినాశీగా ఉంటుంది. కావున మీరు సదా సంతోషంగా ఉండేవారు, సదా బెస్ట్ కన్నా బెస్ట్. వేస్ట్ (వ్యర్థం) సమాప్తమైపోయిందంటే, ఇక మిగిలింది బెస్ట్ (మంచి) కదా. బాబాకు చెందినవారిగా అవ్వడము అంటే సదా కోసం అవినాశీ ఖజానాలకు అధికారులుగా అవ్వడము. మరి అధికారి జీవితం బెస్ట్ జీవితం కదా.
కరీబియన్ లో సేవకు పునాదిగా చాలామంది విశేషమైన ఆత్మలు నిలిచారు. ప్రభుత్వం వారి సేవ యొక్క పునాది అయితే గయానాలోనే వేయడం జరిగింది కదా, మరియు ప్రభుత్వం వరకు రాజయోగపు విశేషతను వ్యాపింపజేయడం, ఇది కూడా విశేషతయే. ప్రభుత్వం కూడా మూడు నిమిషాలు సైలెన్సులో ఉండే ప్రయత్నం చేస్తుంది కదా. ప్రభుత్వానికి సమీపంగా వచ్చే అవకాశం ఇక్కడే ప్రారంభమయింది మరియు రిజల్ట్ కూడా మంచిగా వచ్చింది, మరియు ఇప్పుడు కూడా రిజల్ట్ వెలువడుతూ ఉంది. కరీబియన్ వారు సేవలో విశేషంగా వి.ఐ.పి. లను కూడా తయారుచేసారు. ఆ ఒక్కరితో అనేకుల సేవ జరుగుతోంది, ఇది కూడా విశేషతయే కదా. విధిపూర్వకంగా వి.ఐ.పి. రూపంలో ఆహ్వానం లభించడానికి కూడా కరీబియన్ మొదట నిమిత్తంగా అయింది. ఈ రోజు నలువైపులా ఉదాహరణగా అయి అనేకులకు ఉల్లాసాన్ని, ప్రేరణను ఇచ్చే సేవలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఫలం కూడా అందరికీ లభిస్తుంది కదా. ఇప్పుడు కూడా ప్రభుత్వం కనెక్షన్ లో ఉన్నారు. ఇది కూడా ఒక సమీప కనెక్షన్ లోకి వచ్చేందుకు విధి. ఈ విధిని కాస్త జ్ఞానయుక్తమైన కనెక్షన్ లోకి తీసుకువస్తూ, అతీతంగా అయ్యే సేవను అనుభవం చేయించవచ్చు. ఏ మీటింగ్ లో అయినా కానీ, ఏ సమయంలో సేవ చేసేందుకు నిమిత్తంగా అయినా కానీ, లౌకిక విషయాలు అయినా కానీ, లౌకిక విషయాలలో కూడా ఎంతో అతీతత్వము అనుభవం అయ్యేలా మరియు ప్రేమ కూడా అనుభవం అయ్యేలా తమ మాటలను ఎంతో పద్ధతిగా మాట్లాడాలి. ఇది కూడా ఒక అవకాశము, అందరితో ఉంటూ కూడా తమ అతీతమైన మరియు ప్రియమైన స్థితిని చూపించవచ్చు, అందుకని ఈ విధిపై మరింత అటెన్షన్ ఇచ్చి సేవా సాధనాన్ని శ్రేష్ఠంగా తయారుచేయవచ్చు. గయానా వారికి ఈ అవకాశం కూడా లభించింది. ఆది నుండే సేవా అవకాశం రూపీ లాటరీ లభించి ఉంది. అన్ని స్థానాలలో వృద్ధి మంచిగా ఉంది. ఇప్పుడు ఇంకొక విశేషమైన కార్యము చేయండి - అక్కడ ఎవరైతే పేరు ప్రఖ్యాతలు ఉండే పండితులున్నారో, వారిలో నుండి తయారుచేయండి. ట్రినిడాడ్, గయానాలో పండితులు ఎంతోమంది ఉన్నారు. వారు సమీపమైన వారే. భారతదేశ ఫిలాసఫీ (సిద్ధాంతం)ని ఒప్పుకునేవారే కదా. మరి ఇప్పుడు పండితుల గ్రూపును తయారుచేయండి. ఎలా అయితే ఇప్పుడు హరిద్వార్లో సాధువుల సంగఠన తయారవుతుందో, అలా ఇక్కడ పండితుల గ్రూప్ ను తయారుచేయండి. స్నేహంతో వారిని తమవారిగా చేసుకోవచ్చు. ముందు స్నేహంతో వారిని సమీపంగా తీసుకురండి. హరిద్వార్లో కూడా స్నేహం యొక్క రిజల్టే ఉంది. స్నేహము మధువనం వరకు చేరుస్తుంది. మరి మధువనం వరకు వస్తే జ్ఞానం వరకు కూడా వచ్చేస్తారు. ఎక్కడకు వెళ్తారు. మరి ఇప్పుడు ఇది చేసి చూపించండి. అచ్ఛా.
యూరప్ ఏమి చేస్తుంది? సంఖ్యపరంగా చిన్న గ్రూప్ ఏమీ కాదు. సంఖ్య ఎంత ఉన్నా కానీ, క్వాలిటీ బాగుంటే నంబర్ వన్గా ఉన్నట్లు. ఎవ్వరూ తీసుకురానిది మీరు తీసుకురాగలరు. ఏమీ పెద్ద విషయం కాదు, "పిల్లల ధైర్యం - తండ్రి సహాయం". పిల్లల ధైర్యం మరియు పూర్తి పరివారము, బాప్ దాదాల సహాయం ఉంటుంది, అందుకని అదేమీ పెద్ద విషయం కాదు. ఏది కావాలంటే అది చేయవచ్చు. చివరకు అందరూ రావాల్సింది ఒకే స్థానానికి కదా. కొందరు ఇప్పుడు రావాల్సి ఉంటుంది, మరి కొందరు ఆలస్యంగా రావాల్సి ఉంటుంది. కానీ వారు రావాల్సిందే. ఎంత సంతోషంగా ఉన్నా కానీ ఏదో ఒక ప్రాప్తి యొక్క లోటు ఉంటుంది కదా. వాతావరణం బాగా ఉండవచ్చు, ఇందులో ఎటువంటి బాధ లేకపోయినా కానీ ఎప్పటివరకైతే జ్ఞానము ఉండదో అప్పటి వరకు వినాశీ కోరికలు ఎప్పటికీ పూర్తి అవ్వవు. ఒక కోరిక తర్వాత మరో కోరిక ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. కనుక కోరికలు కూడా సదా సంతుష్టతను అనుభవం చేయనివ్వవు. అంటే దుఃఖితులుగా లేకపోయినా కానీ, వారికి ఈశ్వరీయ నిస్వార్థ స్నేహం ఏమిటి, స్నేహీ జీవితం ఏమిటి అన్న ఆత్మిక స్నేహం, పరమాత్మ స్నేహం యొక్క అనుభవమే లేదు. ఎంత స్నేహం ఉన్నా కానీ నిస్వార్థ స్నేహం ఎక్కడా లేదు. సత్యమైన స్నేహమైతే లేనే లేదు. మరి సత్యమైన హృదయపు స్నేహం, పరివారపు స్నేహం అందరికీ కావాలి. ఇటువంటి పరివారం ఎక్కడైనా లభించగలదా? మరి ఏ విషయంలో అయితే అప్రాప్తి యొక్క అనుభూతి ఉందో, ఆ ప్రాప్తి యొక్క ఆకర్షణతో వారికి అర్థం చేయించండి. అచ్ఛా!
మీరందరూ విశేష ఆత్మలు. ఒకవేళ విశేషత లేకపోతే బ్రాహ్మణ ఆత్మగా అవ్వలేరు. విశేషతయే బ్రాహ్మణ జీవితాన్ని ప్రాప్తింపజేసింది. అన్నిటికంటే పెద్ద విశేషత ఏమిటంటే మీరు కోట్లలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కొందరు. మరి ప్రతి ఒక్కరికీ తమ-తమ విశేషత ఉంది. రోజంతా బాబా మరియు సేవ, ఇదే తపన ఉంటుంది కదా! లౌకిక కార్యమునైతే నిమిత్తంగా భావించి చేయవలసిందే కానీ మనసులో స్మృతి మరియు సేవ యొక్క తపన మాత్రమే ఉండాలి. అచ్ఛా!
Comments
Post a Comment