04-03-1986 అవ్యక్త మురళి

 04-03-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సర్వ శ్రేష్ఠ రచనకు పునాది - స్నేహము”

ఈరోజు బాప్ దాదా తమ శ్రేష్ఠ ఆత్మల రచనను చూసి హర్షిస్తున్నారు. ఈ శ్రేష్ఠమైన లేక క్రొత్త రచన, పూర్తి విశ్వంలో సర్వ శ్రేష్ఠమైనది మరియు అతి ప్రియమైనది, ఎందుకంటే ఇది పవిత్ర ఆత్మల రచన. పవిత్ర ఆత్మ అయిన కారణంగా, ఇప్పుడు బాప్ దాదాకు ప్రియమైనవారిగా మరియు తమ రాజ్యంలో సర్వులకు ప్రియమైనవారిగా ఉంటారు. ద్వాపరయుగంలో భక్తులకు ప్రియమైన దేవాత్మలుగా అవుతారు. ఈ సమయంలో మీరు పరమాత్మకు ప్రియమైన బ్రాహ్మణాత్మలు మరియు సత్య-త్రేతా యుగాలలో రాజ్యాధికారులుగా, పరమ శ్రేష్ఠ దైవీ ఆత్మలుగా ఉంటారు. ద్వాపరం నుండి ఇప్పుడు కలియుగం వరకు పూజ్యాత్మలుగా అవుతారు. ఈ సమయంలో మూడింటిలోనూ శ్రేష్ఠమైనవారిగా ఉన్న మీరు పరమాత్మకు ప్రియమైన బ్రాహ్మణ సో ఫరిశ్తా ఆత్మలు. ఈ సమయం యొక్క శ్రేష్ఠత ఆధారంతో పూర్తి కల్పంలో శ్రేష్ఠంగా ఉంటారు. ఈ అంతిమ జన్మ వరకు కూడా శ్రేష్ఠ ఆత్మలైన మిమ్మల్ని మీ భక్తులు ఆహ్వానించడాన్ని చూస్తున్నారు కదా. ఎంతో ప్రేమతో పిలుస్తారు! జడమైన చిత్రమని తెలిసినప్పటికీ శ్రేష్ఠ ఆత్మలైన మీకు భావనతో పూజ చేస్తారు, నైవేద్యం పెడతారు, హారతి ఇస్తారు. మా చిత్రాలకు పూజ జరుగుతుందా అని డబల్ విదేశీయులు ఆలోచిస్తున్నారు. భారతదేశంలో తండ్రి కర్తవ్యం జరిగింది కనుక బాబాతో పాటు మీ అందరి చిత్రాలు కూడా భారతదేశంలోనే ఉన్నాయి. ఎక్కువ మందిరాలు భారతదేశంలో తయారుచేస్తారు. మేమే పూజ్యాత్మలము అన్న నషా అయితే ఉంది కదా? సేవ కోసం విశ్వంలోని నలువైపులకు వెళ్ళారు. కొందరు అమెరికాకు అయితే కొందరు ఆఫ్రికాకు చేరుకున్నారు. కానీ ఎందుకు వెళ్ళారు? ఈ సమయంలో సేవా సంస్కారాలు, స్నేహ సంస్కారాలు ఉన్నాయి. సేవ విశేషతయే స్నేహము. ఎప్పటి వరకైతే జ్ఞానంతో పాటు ఆత్మిక స్నేహం అనుభవం అవ్వదో, అప్పటి వరకు జ్ఞానాన్ని ఎవ్వరూ వినరు.

డబల్ విదేశీయులైన మీరందరూ తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున మీ అందరి పునాది ఏమిటి? తండ్రి స్నేహము, పరివారపు స్నేహము, హృదయపూర్వకమైన స్నేహము, నిస్వార్థ స్నేహము. ఇవే శ్రేష్ఠ ఆత్మగా చేసాయి. మరి స్నేహము సేవ యొక్క మొదటి సఫలతా స్వరూపము. ఎప్పుడైతే స్నేహం కారణంగా తండ్రికి చెందినవారిగా అయ్యారో, అప్పుడు జ్ఞానం యొక్క ఏ పాయింట్ అయినా సహజంగా స్పష్టమవుతూ ఉంటుంది. ఎవరైతే స్నేహంలోకి రారో, వారికి కేవలం జ్ఞానాన్ని ధారణ చేసి ముందుకు వెళ్ళడానికి సమయమూ పడుతుంది, శ్రమ కూడా ఉంటుంది, ఎందుకంటే వారి వృత్తి ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా అనేవాటిలో ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే స్నేహంలో లవలీనమవుతారో, అప్పుడు ఆ స్నేహం కారణంగా బాబా చెప్పే ప్రతి మాట స్నేహమయంగా అనిపిస్తుంది. ప్రశ్నలు సమాప్తమవుతాయి. తండ్రి స్నేహము ఆకర్షించిన కారణంగా, వారు ప్రశ్నలు అడిగినా కానీ అర్థం చేసుకోవాలన్న భావనతో అడుగుతారు. అనుభవజ్ఞులు కదా. ప్రేమలో లీనమైనవారికి, వారికి ఎవరిపై అయితే ప్రేమ ఉంటుందో, వారు ఏది చెప్పినా అందులో వారికి ప్రేమయే కనిపిస్తుంది. మరి సేవకు మూల ఆధారము - స్నేహము. తండ్రి కూడా పిల్లలను సదా స్నేహంతో గుర్తు చేస్తూ ఉంటారు. పిల్లలను స్నేహంతో పిలుస్తారు, స్నేహంతోనే సర్వ సమస్యల నుండి దాటింపజేస్తారు. మరి ఈశ్వరీయ జన్మకు, బ్రాహ్మణ జన్మకు పునాది స్నేహమే. స్నేహము పునాదిగా ఉన్నవారికి ఎప్పుడూ ఏ విషయమూ కష్టమనిపించదు. స్నేహం కారణంగా ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి. తండ్రి శ్రీమతం ఏదైతే ఉందో, అది మనం అనుసరించవలసిందే. చూస్తాము, చేద్దాములే అనేవి స్నేహీగా ఉన్నవారి లక్షణాలు కాదు. తండ్రి నా కోసం చెప్పారు మరియు నేను చేయవలసిందే. ఇది స్నేహీ, ప్రేయసి ఆత్మల స్థితి. స్నేహీగా ఉన్నవారు అలజడిలో ఉండరు. సదా తండ్రి మరియు నేను, ఇక మూడవ వారు ఎవరూ లేరు. ఎలా అయితే తండ్రి అతి పెద్దవారో, స్నేహీ ఆత్మలు కూడా నిరంతరం పెద్ద మనసున్నవారిగా ఉంటారు. చిన్న మనసున్నవారు చిన్న-చిన్న విషయాలలో తికమకపడతారు. వారికి చిన్న విషయం కూడా పెద్దదిగా అయిపోతుంది. పెద్ద మనసున్నవారికి పెద్ద విషయం కూడా చిన్నదిగా అయిపోతుంది. డబల్ విదేశీయులు అందరూ పెద్ద మనసున్నవారు కదా! బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలందరినీ చూసి హర్షిస్తున్నారు. ఎంతో దూరదూరాల నుండి దీపపు పురుగులు దీపంపై బలిహారము అవ్వడానికి చేరుకుంటారు. పక్కా దీపపు పురుగులు.

ఈ రోజు అమెరికా వారి టర్ను. అమెరికా వారిని బాబా “ఆ మేరే”(రండి, నా వారు) అని అంటారు - అమెరికా వారు కూడా “ఆ మేరే” అని అంటారు. ఇది విశేషత కదా! వృక్షం చిత్రంలో ఆది నుండి విశేష శక్తి రూపంలో అమెరికాను చూపించారు. స్థాపన అయినప్పటి నుండి అమెరికాను తండ్రి గుర్తు చేసారు. విశేష పాత్ర ఉంది కదా. ఒకటి - వినాశన శక్తి శ్రేష్ఠంగా ఉంది, మరో విశేషత ఏమిటి? విశేషతలు అయితే ప్రతి స్థానానికి ఉంటాయి. కానీ అమెరికా విశేషత కూడా ఏమిటంటే, ఒక వైపు వినాశనము కోసం తయారీలు కూడా ఎక్కువగా ఉంటాయి, మరో వైపు వినాశనాన్ని సమాప్తం చేసే యు.ఎన్ (ఐక్యరాజ్యసమితి) కూడా అక్కడే ఉంది. ఒక వైపు వినాశనపు శక్తి, మరో వైపు అందరినీ ఐక్యం చేసే శక్తి. మరి డబల్ శక్తి ఉంది కదా. అక్కడ అందరినీ కలిపే ప్రయత్నం చేస్తుంటారు కావున అక్కడి నుండే ఈ ఆత్మిక మిలనపు శబ్దం మారుమ్రోగుతుంది. వారు వారి పద్ధతిలో అందరినీ కలిపి, శాంతి కోసం ప్రయత్నిస్తుంటారు, కానీ యథార్థ రీతిలో అందరినీ కలపడమైతే మీ కర్తవ్యమే కదా. వారు అందిరినీ కలిపేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఆ పని చేయలేకపోతున్నారు. వాస్తవానికి సర్వ ధర్మ ఆత్మలను ఒకే పరివారంగా చేయడము బ్రాహ్మణులైన మీ వాస్తవిక కార్యము. విశేషంగా ఇది చేయాలి. ఎలా అయితే అక్కడ వినాశన శక్తి శ్రేష్ఠంగా ఉన్నదో, అలాగే స్థాపనా శక్తి యొక్క శబ్దము మారుమ్రోగాలి. వినాశనము మరియు స్థాపన రెండింటి జెండాలు కలిసి ఎగరాలి. ఒకటి సైన్సు జెండా, ఇంకొకటి సైలెన్సు జెండా. సైన్సు శక్తి యొక్క ప్రభావము మరియు సైలెన్సు శక్తి యొక్క ప్రభావము రెండూ ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాయో, అప్పుడే ప్రత్యక్షత జెండా ఎగిరింది అని అంటాము. ఎలా అయితే ఎవరైనా వి.ఐ.పి ఏదైనా దేశానికి వెళ్తే, వారిని స్వాగతించడానికి జెండాలు పెడతారు కదా. తమ దేశానిదీ పెడతారు మరియు వచ్చినవారి దేశ జెండాను కూడా పెడతారు. అలాగే పరమాత్మ అవతరణ జెండా కూడా ఎగరాలి. పరమాత్మ కార్యానికి కూడా స్వాగతం చేయాలి. తండ్రి జెండాను మూలమూలన ఎగరవేయాలి, అప్పుడే విశేషంగా శక్తుల ప్రత్యక్షత జరిగింది అని అంటారు. ఇది గోల్డెన్ జుబ్లీ సంవత్సరం కదా. కావున అందరికీ గోల్డెన్ సితార కనిపించాలి. ఏదైనా విశేష సితార ఆకాశంలో కనిపిస్తే అందరి అటెన్షన్ దానివైపు వెళ్తుంది. ఈ గోల్డెన్ మెరుస్తున్న సితార అందరి కళ్ళల్లో, బుద్ధిలో కనిపించాలి. ఇదే గోల్డెన్ జుబ్లీని జరుపుకోవడము. ఈ సితార ముందుగా ఎక్కడ మెరుస్తుంది?

ఇప్పుడు విదేశాలలో బాగా వృద్ధి జరుగుతుంది మరియు జరగవలసిందే. తండ్రి యొక్క తప్పిపోయిన పిల్లలు మూలమూలన దాగి ఉన్నారు, వారు సమయప్రమాణంగా సంపర్కంలోకి వస్తున్నారు. అందరూ ఒకరిని మించి మరొకరు సేవలో ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. ధైర్యముతో తండ్రి సహాయము కూడా లభిస్తుంది. నిరాశావాదులలో కూడా ఆశా దీపాలు వెలుగుతాయి. ఇది జరగడము అసంభవము అని ప్రపంచం వారు భావిస్తారు. చాలా కష్టమని అనుకుంటారు. మీలోని తపన మిమ్మల్ని నిర్విఘ్నంగా చేసి ఎగిరే పక్షి సమానంగా ఎగిరింపజేసి చేరుస్తుంది. డబల్ ఎగరడముతో చేరుకున్నారు కదా. ఒకటి విమానము, రెండు బుద్ధి అనే విమానము. ధైర్యము, ఉల్లాసము అనే రెక్కలు వచ్చినప్పుడు ఎక్కడికి ఎగరాలంటే అక్కడకు ఎగరగలుగుతారు. పిల్లల ధైర్యానికి బాప్ దాదా సదా పిల్లల యొక్క మహిమను చేస్తుంటారు. ధైర్యము ఉంచడం వలన ఒకరి నుండి మరొకరి దీపము వెలుగుతూ, మాల అయితే తయారయింది కదా. ప్రేమతో శ్రమ చేస్తే దాని ఫలితం చాలా బాగుంటుంది. ఇది అందరి సహయోగపు విశేషత. ఏ విషయమైనా కానీ ముందుగా దృఢత మరియు స్నేహం యొక్క సంగఠన కావాలి. దీనితో సఫలత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. దృఢత్వము బంజరు భూమిలో కూడా ఫలాలను తెప్పించగలదు. ఈ రోజుల్లో సైన్సువారు ఇసుకలో కూడా పండ్లను పండించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సైలెన్సు శక్తి ఏమి చేయలేదు! ఏ ధరణికి అయితే స్నేహమనే జలం లభిస్తుందో, అక్కడి ఫలాలు పెద్దవిగా కూడా ఉంటాయి మరియు రుచికరంగా కూడా ఉంటాయి. స్వర్గంలో కూడా పండ్లు చాలా పెద్దవిగా మరియు రుచికరంగా ఉంటాయి. విదేశాలలో కూడా పండ్లు పెద్దవిగా ఉంటాయి కానీ రుచికరంగా ఉండవు. పండు చూడటానికి చాలా బాగుంటుంది కానీ రుచి ఉండదు. భారతదేశపు పండ్లు చిన్నవిగా ఉంటాయి కానీ మంచి రుచికరంగా ఉంటాయి. అన్నిటికీ పునాది అక్కడే పడుతుంది కదా. ఏ సెంటరులో అయితే స్నేహమనే నీరు లభిస్తుందో, ఆ సెంటరు సదా ఫలప్రదంగా ఉంటుంది. సేవలో కూడా మరియు తోటివారిలో కూడా. స్వర్గంలో శుద్ధమైన నీరు, శుద్ధమైన భూమి ఉంటాయి, అందుకే అటువంటి ఫలాలు లభిస్తాయి, ఎక్కడైతే స్నేహము ఉంటుందో, అక్కడ వాయుమండలం అనగా ధరణి శ్రేష్ఠంగా ఉంటుంది. ఎవరైనా డిస్టర్బ్ అయితే ఏమని అంటారు! నాకింకేమీ వద్దు, కేవలం స్నేహం కావాలి అని. మరి డిస్టర్బ్ అవ్వకుండా, సురక్షితంగా ఉండేందుకు సాధనము కూడా స్నేహమే. తప్పిపోయిన పిల్లలు మళ్ళీ వచ్చారు అన్నది చూసి బాప్ దాదాకు అన్నిటికన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఒకవేళ మీరు అక్కడకు చేరుకోకపోతే సేవ ఎలా జరుగుతుంది, అందుకని తప్పిపోవడము కూడా కళ్యాణకారీ అయింది. మళ్ళీ కలవడమైతే కళ్యాణకారియే. తమ-తమ స్థానాలలో అందరూ మంచి ఉల్లాసంతో ముందుకు వెళ్తున్నారు మరియు అందరిలో ఒక లక్ష్యము ఉంది - సర్వ ఆత్మలను అనాథల నుండి సనాథలుగా చేయాలని బాప్ దాదాకు ఉన్న ఒకే ఆశను పూర్తి చేయాలి. అందరూ కలిసి శాంతి కోసం ఏదైతే విశేష ప్రోగ్రామ్ ను తయారుచేసారో, అది కూడా బాగుంది. అందరికీ కనీసం కొంచెం సైలెన్సులోనైనా ఉండే అభ్యాసం చేయించేందుకు నిమిత్తులుగా అవుతారు. ఒకవేళ ఎవరైనా, సరైన రీతిలో ఒక్క నిమిషమైనా సైలెన్సును అనుభవం చేస్తే, ఆ ఒక్క నిమిషపు సైలెన్సు యొక్క అనుభూతి వారిని పదే పదే స్వతహాగా లాగుతుంది ఎందుకంటే అందరికీ శాంతి కావాలి. కానీ విధి తెలియదు. సాంగత్యం లభించదు. ఆత్మలందరికీ శాంతి అనేది ప్రియమైనప్పుడు ఆ ఆత్మలకు శాంతి అనుభూతి కలగడం వలన స్వతహాగానే ఆకర్షితమవుతారు. ప్రతి స్థానంలోనూ తమ-తమ విశేష కార్యాన్ని చేసేందుకు చక్కగా నిమిత్తమైన శ్రేష్ఠ ఆత్మలు ఉన్నారు. కనుక అద్భుతం చేయడం పెద్ద విషయమేమీ కాదు. శబ్దాన్ని వ్యాపింపజేసేందుకు సాధనమే ఈనాటి విశేష ఆత్మలు. ఎంతగా విశేష ఆత్మలు సంపర్కంలోకి వస్తారో, వారి సంపర్కం ద్వారా అనేక ఆత్మల కళ్యాణం జరుగుతుంది. ఒక వి.ఐ.పి ద్వారా అనేక సాధారణ ఆత్మల కళ్యాణం జరుగుతుంది. కాకపోతే సమీప సంబంధంలోకి రారు. తమ ధర్మంలో, తమ పాత్రలో వారికి విశేషత యొక్క ఏదో ఒక ఫలం లభిస్తుంది. తండ్రికి సాధారణమైనవారే ఇష్టము. వారే సమయాన్ని కూడా ఇవ్వగలరు. వి.ఐ.పి ల వద్ద అయితే సమయమే ఉండదు. కానీ వారు నిమిత్తంగా అయినందుకు అనేకులకు లాభము చేకూరుతుంది. అచ్ఛా.

పార్టీలతో-

సదా అమర భవ యొక్క వరదానీ ఆత్మలము అని అనుభవం చేసుకుంటున్నారా? సదా వరదానాలతో పాలింపబడుతూ ముందుకు వెళ్తున్నారు కదా! ఎవరికైతే తండ్రిపై ఎడతెగని స్నేహము ఉంటుందో వారు అమర భవ యొక్క వరదానీలు, సదా నిశ్చింత చక్రవర్తులు. ఏ కార్యానికి నిమిత్తమైనా కానీ నిశ్చింతగా ఉండటమే విశేషత. ఎలా అయితే తండ్రి నిమిత్తంగా అవుతారు, నిమిత్తంగా అయినప్పటికీ అతీతంగా ఉంటారు, అందుకే నిశ్చింతగా ఉంటారు, అలా ఫాలో ఫాదర్. సదా స్నేహము అనే సేఫ్టీతో ముందుకు వెళ్తూ ఉండండి. స్నేహము ఆధారంతో తండ్రి సదా సురక్షితంగా చేసి ముందుకు ఎగిరింపజేసి తీసుకువెళ్తున్నారు. ఈ దృఢ నిశ్చయము కూడా ఉంది కదా. స్నేహమనే ఆత్మిక సంబంధము జోడింపబడింది. ఈ ఆత్మిక సంబంధంతో ఎంతగా ఒకరికొకరు ప్రియంగా అయిపోయారు! బాప్ దాదా మాతలకు ఒక మాటను, చాలా సహజమైన మాటను వినిపించారు, ఒక్క మాటను గుర్తుంచుకోండి, “నా బాబా”, అంతే. నా బాబా అనగానే సర్వ ఖజానాలు లభించేస్తాయి. ఈ బాబా అన్న పదమే సర్వ ఖజానాలకు తాళంచెవి. మాతలకు తాళంచెవులను సంభాళించడము బాగా వచ్చు కదా. మరి బాప్ దాదా కూడా తాళంచెవి ఇచ్చారు. ఏ ఖజానా కావాలంటే అది లభిస్తుంది. ఒక్క ఖజానా యొక్క తాళంచెవి కాదు, ఖజానాలన్నింటి తాళంచెవి. కేవలం బాబా-బాబా అంటూ ఉన్నట్లయితే ఇప్పుడు కూడా బాలకుల నుండి యజమానులుగా ఉంటారు మరియు భవిష్యత్తులో కూడా యజమానులు అవుతారు. సదా ఈ సంతోషంలోనే నాట్యం చేస్తూ ఉండండి. అచ్ఛా.

Comments