31-12-2009 అవ్యక్త మురళి

     31-12-2009        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “నూతన సంవత్సరంలో సర్వాత్మలకు సందేశాన్ని ఇచ్చి స్వర్ణిమ ప్రపంచాన్ని కానుకగా ఇవ్వండి, తండ్రి సమానంగా అవ్వడానికి దేహీ అభిమానిగా ఉండే నేచర్‌ను నేచురల్ గా చేసుకోండి.”

           ఈ రోజు బాప్ దాదా పిల్లలందరినీ స్నేహములో మరియు బాప్ దాదాల ప్రేమలో లవలీనమై ఉన్న స్వరూపంలో చూస్తున్నారు. పిల్లలు ఒక్కొక్కరూ పరమాత్మ ప్రేమలో ప్రకాశిస్తున్నారు. పిల్లలందరూ ప్రేమ అనే విమానంలో చేరుకున్నారు. నిజానికి క్రొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు. కానీ, అందరి నయనాలలో ఏమి కనిపిస్తోంది? న్యూ ఇయర్, క్రొత్త సంవత్సరము అన్నది నిమిత్త మాత్రమే, మీ అందరి నయనాలలో ఎటువంటి ఉత్సాహము ఉంది? మూడు అభినందనలు తెలుపుతున్నారు. ఒకటి-తమ క్రొత్త జీవితానికి అభినందనలు, రెండు-క్రొత్త యుగానికి అభినందనలు మరియు మూడు-పరివారముతో మరియు బాబాతో మిలనానికి అభినందనలు. మీ నయనాలలో ఏమి తిరుగుతోంది? మీ నవ యుగం మీ ముందుకు వస్తోంది కదా! క్రొత్త యుగం వచ్చేసినట్లే అని మీ మనసులలో ఉత్సాహంగా ఉంది కదా! క్రొత్త యుగపు మెరిసే డ్రస్సు ఎదురుగా ఎంత స్పష్టంగా ఉందంటే, ఈ రోజు సంగమయుగంలో ఉన్నాము, త్వరగా ఈ మెరిసే డ్రస్సును ధరించాలి అన్న ఉత్సాహంతో ఉన్నారు. దానిని మీ ఎదురుగా చూసి సంతోషిస్తున్నారు. వీడ్కోలు కూడా చెప్తున్నారు మరియు అభినందనలను కూడా తీసుకుంటున్నారు. ఎలా అయితే పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పినప్పుడు ఆ సంవత్సరాన్ని కూడా మర్చిపోతారో, క్రొత్త సంవత్సరమే గుర్తుంటుందో, అలాగే మీకు పాత సంవత్సరానికి కాదు, క్రొత్త సంవత్సరానికి అభినందనలు చెప్తున్నారు. పాత ప్రపంచానికి వీడ్కోలు చెప్తున్నారు, కావున ఈ రోజు అందరికీ క్రొత్త యుగం కోసం ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. ప్రపంచంలోకూడా క్రొత్త సంవత్సరానికి అభినందనలు తెలుపుతారు మరియు బహుమతులను కూడా ఇస్తారు. బాప్ దాదా పిల్లలైన మీకు పాత స్వభావ సంస్కారాలకు వీడ్కోలు పలికి క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళే కానుకను ఇస్తున్నారు. ఆ క్రొత్త ప్రపంచంలో అంతా ప్రాప్తియే ప్రాప్తి. సారంలో చెప్పాలంటే క్రొత్త ప్రపంచంలో అప్రాప్తి అంటూ ఏదీ ఉండదు. ఇటువంటి స్వర్ణిమ యుగాన్ని బాప్ దాదా పిల్లలైన మీ అందరికీ కానుకగా ఇచ్చేసారు. మేము స్వర్ణిమ ప్రపంచానికి అధికారులుగా అవుతున్నాము అని మీకు కూడా నషా ఉంది కదా! ఇటువంటి కానుకను మరెవ్వరూ ఇవ్వలేరు. సర్వాత్మలకు బాబా వారసత్వంగా ఇచ్చే ఈ స్వర్ణిమ ప్రపంచమును గురించిన సందేశాన్ని ఇచ్చి వారికి కూడా మీరు కానుకను ఇవ్వండి. మీవద్ద ఏ కానుకలు ఉన్నాయి? ఒకటి- క్రొత్త ప్రపంచాన్ని కానుకగా ఇవ్వండి మరియు రెండవది- మీ వద్ద అనేక ఖజానాలున్నాయి. గుణాల ఖజానా, శక్తుల ఖజానా, స్వమానాల ఖజానా, ఎన్ని ఖజానాలున్నాయి! అందరికీ ఏదో ఒక గుణాన్ని, ఏదో ఒక శక్తిని కానుకగా ఇవ్వండి. ఈ కానుకతో వారి జీవితాలు మారిపోవాలి, స్వర్ణిమ ప్రపంచానికి అధికారులైపోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో నలువైపుల దుఃఖము, అశాంతి పెరిగిపోవడాన్ని మీరు చూస్తున్నారు, నలువైపుల ప్రతి ఒక్కరిలో భయము, చింత ఉన్నాయి. ఇటువంటి దుఃఖిత, అశాంత ఆత్మలకు కనీసం బాబా వచ్చారు, ఇప్పటి నుండైనా అవినాశి వారసత్వానికి అధికారులుగా అవ్వండి అన్న సందేశాన్నైనా అందించండి. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూనే ఉన్నారు కానీ, ఇప్పటికీ బాబా పిల్లలు కొంతమంది సందేశం నుండి కూడా వంచితమై ఉన్నారు. ఏది ఏమైనా, అందరూ ఒక్క తండ్రి పిల్లలే కదా, మీ సోదరీసోదరులకు ఈ సందేశము అనే కానుకను తప్పక అందించండి, ఎవ్వరూ మిగిలిపోకూడదు. సేవ చేస్తున్నారు, బాప్ దాదా పిల్లల సేవను చూసి సంతోషిస్తున్నారు, కానీ బాప్ దాదా ఆశ ఏమిటంటే నా పిల్లలెవ్వరూ సందేశం నుండి వంచితులవ్వకూడదు అని. మీకైతే స్వర్ణిమ ప్రపంచం కానుకగా లభించింది, కానీ మాకు తెలీయనే తెలియదు అని ఫిర్యాదు చెయ్యకూడదు. మా తండ్రి వచ్చారు. కానీ, మాకు సందేశమే లభించలేదు అని అనకూడదు. అందుకే ఈ క్రొత్త సంవత్సరంలో ఈ ప్రయత్నమే చెయ్యండి, పరస్పరంలో ప్లాన్ తయారుచెయ్యండి. ఏ మూల కూడా మిగలకూడదు. ఫిర్యాదు రాకూడదు కానీ సంతోషంగా ఉండాలి. మా తండ్రి వచ్చారు అన్న విషయమైతే తెలియాలి, వంచితమవ్వకూడదు. మరి ఈ క్రొత్త సంవత్సరంలో ఏమి చేస్తారు? పరస్పరం కలిసి ప్లాన్ తయారు చెయ్యండి. బాప్ దాదాకు పిల్లలందరిపై దయ కలుగుతుంది. ఇప్పుడు మీరు కూడా మీ సోదరీ సోదరుల పట్ల విశేషమైన దయాహృదయము, కళ్యాణకారి స్వరూపాన్ని ధారణ చేసి అందరికీ సందేశాన్ని ఇవ్వండి. కనీసం ఈ ఫిర్యాదునైతే ఇవ్వకూడదు.

           మరి ఈ రోజు పిల్లలందరూ క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునే ఉల్లాస ఉత్సాహాలతో చేరుకున్నారు. బాప్ దాదా పిల్లలు ఒక్కొక్కరినీ చూసి ఏ గీతమును గానం చేస్తారు? తెలుసు కదా! వాహ్ పిల్లలూ వాహ్! అని అంటారు. ఇక్కడకు మొదటిసారిగా వచ్చినవారితో కూడా మీరు లక్కీ పిల్లలు అని బాబా అంటారు, ఎందుకంటే సమయసమాప్తి కంటే ముందుగానే వచ్చారు, క్రొత్త పిల్లలకు బాప్ దాదా పదమాపదమరెట్లు లక్కీగా అయినందుకు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరిలో ఒక్క విషయాన్ని చూడాలనుకుంటున్నారు, అదేమిటో తెలుసా? ఎలా అయితే ప్రతి ఒక్కరి మనసులలో ఉల్లాసముందో, మేము తండ్రి సమానంగా అయ్యేవారము అన్న లక్ష్యము ఉందో, అవుతాము కాదు, అయ్యేవారము. మరి ఎటువంటి లక్ష్యము ఉందో, అలా ఇప్పుడు బాప్ దాదా లక్ష్యంతోపాటు లక్షణాలను కూడా చూడాలనుకుంటున్నారు. సమానంగా అవ్వాలన్న లక్ష్యమున్నట్లుగా, సమానంగా అయ్యే లక్షణాలు కూడా ఉండాలి. లక్ష్యమైతే చాలా ఉన్నతంగా ఉంది కానీ, లక్షణాలపై విశేషమైన అటెన్షన్ ను ఇవ్వాలి. సమానము, ఎంత పెద్ద లక్ష్యమో అంత పెద్ద లక్షణాలు ఉండాలి. కొంతమంది పిల్లలు లక్షణాలను ధారణ చెయ్యాలనుకుంటారు కానీ మధ్య మధ్యలో 'అయినప్పటికీ' అని అంటూ ఉంటారు. చాలా కోరుకుంటాము కానీ... ఇప్పుడు ఈ కానీ అన్నది తొలగిపోవాలి. లక్ష్యమెంత పెద్దగా ఉందో అంతగా లక్షణాలు ముఖం ద్వారా, నడవడిక ద్వారా కనిపిచాలి. ఎలా అయితే మీరు మొదట్లో దేహాభిమానంలో ఉండేవారో, దేహాభిమానంలో ఉన్నప్పుడు దేహాభిమానపు నేచర్ నేచురల్ గా కనిపించేది, దేహాభిమానం రావాలి అని ఎప్పుడైనా పురుషార్థం చేసారా, నేచురల్ నేచర్ గా దేహాభిమానం ఉండేది. అర్థకల్పం పురుషార్థం చెయ్యలేదు. అలాగే ఇప్పుడు కూడా దేహీ అభిమానిగా అయ్యే నేచర్ నేచురల్ గా ఉందా! దేహ-అభిమానపు నేచర్ సహజంగా ఉంటుంది కదా! దేహాభిమానంలోకి రావాలి అని ఎప్పుడైనా పురుషార్థం చేసారా? దేహ అభిమానము మరియు దేహి అభిమానము, మరి దేహి అభిమానిగా అవ్వడంలో శ్రమ ఎందుకు! ఎందుకంటే దేహ అభిమానాన్ని తొలగించుకునేందుకు పిల్లలు శ్రమ పడవలసి వస్తోందని బాప్ దాదా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. దేహా అభిమానము సహజంగా ఉన్నప్పుడు దేహీ అభిమానులుగా అవ్వడంలో శ్రమ ఎందుకు? పిల్లల శ్రమ బాప్ దాదాకు మంచిగా అనిపించదు. శ్రమ ముక్తులవ్వండి మరియు నేచురల్ నేచర్ గా చేసుకోండి, దీనినే లక్ష్యము మరియు లక్షణాలు సమానము అని అంటారు. అప్పుడు చూడండి, తండ్రి సమానంగా అవ్వడం ఎంతో సహజంగా మరియు నేచరల్ గా అనిపిస్తుంది. బ్రహ్మాబాబాను చూసాము కదా, ఇంత పెద్ద పరివారపు బాధ్యత ఉన్నప్పటికీ నేచురల్ నేచర్ గా దేహీ అభిమానము ఉండేది. పిల్లలపై కూడా బాధ్యత ఉంది, కానీ బ్రహ్మాబాబా ముందు ఆ బాధ్యత ఎంతటిది! ఏ బాధ్యత అయినా కానీ, ఉదాహరణకు జోన్ బాధ్యతలు కావచ్చు, లేక అఫిషియల్ యజ్ఞ వ్యవహారాల బాధ్యత కావచ్చు, కానీ ఆ బాధ్యత బ్రహ్మాబాబా ముందు ఎంత! బ్రహ్మాబాబా శివబాబా సహాయంతో ప్రాక్టికల్ లో చేసి చూపించారు. చేయించేవారు చేయిస్తున్నారు, మనం చేసేవారిగా అయి తండ్రి సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. బాబా సమానంగా కావాలనుకుంటే దీనిని పరిశీలించుకోండి. ఏదైనా కావచ్చు, మనసా, వాచ లేక కర్మణ బాధ్యతలు ఉండవచ్చు, కానీ నేను చేసేవాడను, ట్రస్టీని, చేయించేవారు, యజమాని శివబాబా. చేయించేవారు అనే ఈ పాఠాన్ని నడుస్తూ, నడుస్తూ మర్చిపోతూ ఉంటారు. కావున లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు పాత ప్రపంచానికి వీడ్కోలు ఇవ్వడంతోపాటు ఈ లక్ష్యాన్ని లక్షణంలోకి తీసుకురావాలి. క్రొత్త సంవత్సరంలో కొత్త విషయాలు. ఏమి చెయ్యను, మాయ వచ్చేస్తుంది, కోరుకోవడం లేదు కానీ వచ్చేస్తోంది! ఇటువంటి మాటలు లేక సంకల్పాలకు పాత సంవత్సరంతో పాటుగా వీడ్కోలు చెప్పండి. కేవలం సంవత్సరానికి వీడ్కోలును ఇవ్వకండి. మాయ కూడా బాప్ దాదా వద్దకు వస్తుంది అని బాప్ దాదా ముందుగానే వినిపించి ఉన్నారు. వచ్చి ఏమని అంటుంది? నేను వెళ్ళే సమయము దగ్గర పడ్డది అని నేను అనుకుంటున్నాను, కానీ కొంతమంది పిల్లలు నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు, మరి నేనేమి చెయ్యను? మరి ఈ రోజు వీడ్కోలుతో పాటు మాయ యొక్క భిన్న భిన్న రూపాలకు కూడా వీడ్కోలు ఇవ్వండి. ధైర్యముందా? ధైర్యముందా? చేతులెత్తండి. వీడ్కోలు చెప్పే ధైర్యముందా? వెనక ఉన్నవారికి ధైర్యముందా? ధైర్యమున్నవారు చేతులెత్తండి. ఈ ధైర్యానికి బాబా పదమాపదమ రెట్లు అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకని? ఎందుకని బాప్ దాదా దీని గురించి ఇంతగా చెప్తున్నారు? ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు చాలా త్వరగా పాడవుతున్నాయి. అని మీరు చూస్తూనే ఉన్నారు. అకస్మాత్తుగా జరుగుతుంది అని కొద్ది సమయం నుండి బాప్ దాదా చెప్పడం విన్నారు. కావున అకస్మాత్తుగా అవుతాయి, అప్పుడు బహుళాలపు అభ్యాసం లేనట్లయితే మరి మీరే చెప్పండి. అకస్మాత్తుగా పరిస్థితులు వచ్చే సమయంలో బహుకాలపు అభ్యాసము అవసరము కదా! ఇప్పుడు చూడండి బాప్ దాదా హోమ్ వర్కును ఇచ్చారు. 10 నిమిషాలు, మొత్తం 24సార్లు 10-10 నిమిషాలు హోమవర్కును చెయ్యాలి. కొంతమందికి ఇది కష్టంగా ఉంది. మరి ఆలోచించండి, ఒకవేళ 10 నిమిషాల అభ్యాసము చేయడమే వీలుకాకపోతే మరి అకస్మాత్తుగా వచ్చే పరిస్థితుల సమయంలో ఏమి చేస్తారు? 24సార్లు చెయ్యడానికి కొంతమందికి సమయము తక్కువగా లభిస్తుందని బాప్ దాదాకు తెలుసు. కానీ 10 నిమిషాలు ఒకే స్మృతిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చెయ్యగలరా అని బాప్ దాదా ట్రయల్ వేశారు. ఇప్పుడు కూడా 10 నిమిషాలే చెయ్యండి అని బాప్ దాదా చెప్పడం లేదు. 10 నిమిషాలు వీలు కాకపోతే, ఎవరికి వీలవుతుందో వారు చెయ్యండి, ఒకవేళ వీలు కాకపోతే 5 నిమిషాలు చెయ్యండి, 7 నిమిషాలు, 6 నిమిషాలు.... ఎంతగా పెంచగలరో అంతగా ట్రయల్ వెయ్యండి. స్వయంగా బాప్ దాదాయే ఈ విషయాన్ని చెప్తున్నారు. ఇందులో అటువంటిదేమీ లేదు. ఒకవేళ 10నిమిషాలు ఎక్కువ సమయము అని అనుకుంటే 8 నిమిషాలు, 9 నిమిషాలు, ఎంత ఎక్కువ చెయ్యగలరో అంతగా అభ్యాసం చెయ్యండి. ఎందుకంటే బహుకాలపు వరదానాన్ని ఇప్పుడే ప్రాక్టికల్ లోకి తీసుకురావచ్చు. ఒకవేళ ఇప్పుడు తక్కువ సమయం ఇచ్చినట్లయితే, ఇప్పుడు కూడా బహుకాలవు అభ్యాసము లేకపోతే బహుకాలపు వర్తమాన పురుషార్థపు ప్రాప్తిలో, అర్థకల్పపు ఆ బహుకాలంలోను తేడా వస్తుంది. ఎంత వీలయితే అంతనే చెయ్యండి అని బాప్ దాదాయే చెప్తున్నారు. 5 నిమిషాలకన్నా ఎక్కువ చేయండి. 10 నిమిషాలు వీలు కావడం లేదంటే 7 నిమిషాలు చెయ్యండి, 8 నిమిషాలు చెయ్యండి, 5 నిమిషాలు కూడా చెయ్యవచ్చు. కానీ ఎప్పుడైనా 10 నిమిషాలు చెయ్యగలిగితే మంచిది. ఇక ఎటువంటి సమయం వస్తుందంటే మీరు స్వయానికి మరియు విశ్వానికి కూడా కిరణాలను ఇవ్వవలసి వస్తుంది, అందుకే బాప్ దాదా అనుమతిని ఇస్తున్నారు. ఎంత ఎక్కువ సమయం చెయ్యగలిగితే, అంత అభ్యాసము చెయ్యండి. ఎందుకంటే ఇప్పటి బహుకాలము భవిష్యత్తుకు ఆధారము. సరేనా? కష్టంగా ఉందా, ఏమీ ఫర్వాలేదు, ఇప్పడిక ఏమీ కాదు, బాబాకు వినిపించి మంచి పని చేసారు. ఎందుకంటే 10 నిమిషాలు కూర్చోలేకపోతే, ఆలోచనలోనే గడిచిపోతే, 5 నిమిషాలు పోయినట్లే కదా. అందుకే బాప్ దాదా కనీసం 5 నిమిషాలకన్నా తక్కువ చెయ్యకండి అని అంటారు. ఎంతగా పెంచగలుగుతారో అంతగా పెంచుతూ ఉండండి. సరేనా, స్పష్టమయిందా? ఎందుకంటే బాప్ దాదా ప్రతి ఒక్కరినీ ఎంతో శ్రేష్ఠ స్వరూపంలో చూస్తారు. ఇందుకు గుర్తుగా బాప్ దాదా పిల్లలు ప్రతిఒక్కరికీ ఎన్ని స్వమానాలను ఇచ్చారు! స్వమానాల లిస్టును తయారు చేసినట్లయితే ఎంత పెద్దది తయారవుతుంది?

           ఈరోజు బాప్ దాదా అమృతవేళ పరిక్రమణ చేసారు. ఏం చూడటానికి వెళ్ళారు? బాప్ దాదా అతిపెద్ద స్వమానాల మాలను ఇచ్చారు. ఒకవేళ ఒక్కొక్క స్వమానంలో స్థితులై ఆ స్థితిలో కూర్చుంటే, స్వమానాలను గుర్తు తెచ్చుకుంటూ, మాలను త్రిప్పుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. 'స్వమానాల లిస్టు ఉంది. కానీ ఒకొక్క స్వమానం ఎంత పెద్దది మరియు వాటిని ఎవరు ఇచ్చారు! వరల్డ్ ఆల్ మైటీ అథారిటీ పిల్లలు ఒక్కొక్కరికీ అనేక స్వమానాల లిస్టును ఇచ్చారు. వాటిని ఉపయోగించండి ఎందుకంటే మీ స్వమానాన్ని తగ్గించగల అథారిటీ మరేదీ లేదు. మరెవ్వరికీ ఇంత పెద్ద స్వమానాల మాల లభించలేదు. సత్యయుగంలో అయితే రాజ్య భాగ్యం లభిస్తుంది, కానీ ఈ స్వమానాల మాల సంగమయుగపు ప్రసాదము. బాప్ దాదా పిల్లలను చూసినప్పుడల్లా, పిల్లలను వారి స్వమానపు స్థితితో చూస్తారు - వాహ్ పిల్లలూ వాహ్! కావున స్వమానపు అథారిటీలో ఉండండి, నేను ఎవరిని! ఒకసారి ఒక స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి, మరోసారి మరో స్వమానాన్ని మీ ఎదుటకు తెచ్చుకోండి మరియు పరిశీలించుకోండి. ఈ రోజు అమృతవేళ ఏ విశేష స్వమానాన్ని బుద్ధిలో పెట్టుకున్నారో, ఆ స్వమానము ఖజానా వంటిది కదా, దీనిని ఉపయోగించండి. ఎందుకంటే ఖజానాలు పెరగడానికి సాధనము వాటిని కార్యంలో ఎంతగా ఉపయోగిస్తామో అంతగా పెరుగుతాయి. స్వమానాల స్మృతి అనే మాల పిల్లలెవరి వద్ద పెద్దగా ఉంది, ఎవరి వద్ద చిన్నదిగా ఉంది అని బాప్ దాదా చూసారు. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహభానం తొలగిపోతుంది. కావున ఈ రోజు బాప్ దాదా పరిక్రమణ చేసారు. ఎలా అయితే స్వమానాల ఖజానా ఉందో అలాగే ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క గుణాన్ని ఉపయోగించండి, కార్యంలో పెట్టండి. మాయ వచ్చింది అని ఏ ప్రాబ్లమ్ నైతే వినిపిస్తారో, నిజానికి మాయ రాదు, కానీ మాయ గురించి బాబా వినిపించి ఉన్నారు. నన్ను ఆహ్వానిస్తారు, అందుకే వెళ్తున్నాను, ఊరికే వెళ్ళడం లేదు అని మాయ అంటుంది. ఏ విధమైన తేలికపాటి సంకల్పాన్ని అయినా చెయ్యడమంటే మాయను ఆహ్వానించినట్లే. శక్తులను వదిలితే మాయను ఆహ్వానించినట్లే, కోరుకోవడం లేదు, కానీ వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఎవరు బలశాలి? అనుకోవడం లేదు కానీ వచ్చేస్తుంది, అప్పుడు మాయ బలశాలి అయినట్లా లేక మీరా? ఈ రోజు పాత సంవత్సరం సమాప్తం కావస్తుంది, క్రొత్త సంవత్సరంలో క్రొత్త ఉల్లాసము, క్రొత్త ఉత్సాహము, ఎందుకంటే సంగమయుగపు ఒక్కొక్క రోజు ఉత్సాహాలు నిండిన రోజు, అనగా ఉత్సవము అని తెలుసు. ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయంటే ప్రతి రోజూ ఉత్సవమే. అందుకే పక్కాగా ఉంచుకోండి. రోజూ నడుస్తూ తిరుగుతూ కూడా చార్డును పెట్టుకోండి, చెక్ చేసుకోండి, చెక్ చేసుకుంటే కదా ఛేంజ్ అవ్వగలిగేది. చెక్ చేసుకోకపోతే ఛేంజ్ ఎలా చేయగలరు!

          మరి ఈ రోజు క్రొత్త సంవత్సరమునుగూర్చి బాప్ దాదాకు ఉన్న విశేష సంకల్పమేమిటంటే పిల్లలు ప్రతి ఒక్కరూ ఎలా పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తారో అలాగే మాయకు వీడ్కోలు చెప్పాలి, వ్యర్థ సంకల్పాలకు వీడ్కోలు చెప్పాలి... ఎందుకంటే మెజారిటీలో వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా ఉండటాన్ని చూసాము. వికారి సంకల్పాలు తక్కువగానే ఉన్నాయి, ఉన్నాయి కానీ తక్కువగా ఉన్నాయి. వ్యర్థం యొక్క నామరూపాలు సమాప్తమైపోవాలి. ప్రతి సంకల్పము సమర్థవంతంగా ఉండాలి, వ్యర్థంగా పోకూడదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలలో కేవలం సంకల్పాలు మాత్రమే నడవడంలేదు అందులో సమయం కూడా వ్యర్థంగా పోతుంది మరియు తండ్రి సమానంగా అవ్వడములో దూరం ఏర్పడుతుంది. సమానంగా అవ్వాలన్న కోరిక అయితే ఉంది, ఇందులో చేతులైతే ఎత్తారు, కానీ బాప్ దాదా సదా మనసు యొక్క చేతిని ఎత్తమని అంటూ ఉంటారు. ఈ చేతిని ఎత్తడం చాలా ఈజీ. మరి వీడ్కోలు చెప్పే ధైర్యముందా? ఉందా ధైర్యం? చేతులెత్తండి. అచ్ఛా, ధైర్యవంతులు! ధైర్యాన్ని స్థిరంగా ఉంచుకోండి. ధైర్యముంటే పెట్టుకున్న లక్ష్యాన్ని తప్పక చేరుకుంటారు ఎందుకంటే బాప్ దాదా తోడు ఉంటుంది. నా పిల్లలెవ్వరూ వెనుక ఉండిపోకూడదు అని బాప్ దాదా అనుకుంటారు. చేతిలో చేయి వేసి నడవాలి, శివబాబా నిరాకారుడు, వారికి చేయి లేదు కానీ, శ్రీమతమే వారి చేయి. అడుగు-అడుగులో శ్రీమతంపై నడవడము అంటే చేతిలో చేయి వేసి నడిచినట్లే. అందరికీ క్రొత్త సంవత్సరానికి, క్రొత్త జీవితానికి మరియు క్రొత్త యుగానికి మూడింటికీ పదమ పదమా రెట్లు అభినందనలు.

           అచ్చా, ఈసారి క్రొత్తగా వచ్చినవారు లేచి నిల్చోండి. అచ్చా! చాలామంది వచ్చారు. సగం సభ క్రొత్త వారున్నారు. క్రొత్తగా వచ్చిన మీ అందరికీ పూర్తి బ్రాహ్మణ పరివారం తరఫున, బాప్ దాదా తరఫున మధువనానికి వచ్చినందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. అభినందనలతోపాటు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి - ఇప్పుడు సాధారణ పురుషార్థానికి సమయం అయిపోయింది. ఇప్పుడు ఇది తీవ్ర పురుషార్థం చేసే సమయము. మీరందరూ లేట్ గా వచ్చారు, కానీ బాప్ దాదాకు ప్రియులు. టూ లేటుకు బదులుగా లేటుగా వచ్చారు, బాప్ దాదా సంతోషిస్తున్నారు. అయినా లక్ సమయంలో చేరుకున్నారు అందుకే ఎవరైతే వచ్చారో, అందరూ బాప్ దాదాకు ప్రియులే అందుకే నడవకండి, ఎగరండి. ఇప్పుడు నడిస్తే ముందు నంబరును తీసుకోలేరు అందుకే ఎగిరే కళలో నడవండి. నడవడం కాదు ఎగరాలి. ఎగరడం ఫాస్టుగా అవుతుంది కదా. ఎగిరే కళతో ముందుకు వెళ్ళగలరు. ఇది మార్జిన్. దీనినే తీవ్ర పురుషార్థము అని అంటారు. మరి ఏమి చేస్తారు? ఎగురుతారా? ఎగురుతారా? అచ్ఛా, అనవసరమైన విషయాలు ఏవైతే వస్తాయో, నిజానికి రాకూడదు. కానీ వచ్చేస్తాయి! ఎందుకంటే పరీక్ష అయితే రావాలి కదా! మరి ఏమి చేస్తారు? ఇటువంటివేవైనా వస్తే బాప్ దాదాకు ఇచ్చేయండి. ఇవ్వడమైతే వచ్చు కదా! తీసుకోవడమైతే వచ్చు కానీ ఇవ్వడం కూడా వచ్చు కదా? చిన్నవారిగా అయిపోండి. చిన్న పిల్లలు ఏమి చేస్తారు? వారికి నచ్చని వస్తువును ఏమి చేస్తారు? మమ్మీ ఇది మీరు సంభాళించండి అని అనేస్తారు. అలాగే చిన్నవారిగా అయిపోయి బాబాకు ఇచ్చేయండి. అయినా మళ్ళీ వస్తే, వస్తుంది, చాలా సమయం పెట్టుకున్నారు కదా, వదిలి పెట్టినా కానీ మళ్ళీ వస్తుంది! ఒకవేళ వచ్చినా కానీ ఇచ్చేసిన వస్తువును మళ్ళీ ఉపయోగించవచ్చా! అని భావించండి. ఇవ్వడము అంటే, మీ వద్దకు వచ్చినా అది మీ సొత్తు కాదు, అది అమానతు. మీరైతే ఇచ్చేసారు కదా! అది ఇక మీది కాదు, తండ్రికి చెందినదానిని నాది అని భావించుకోవద్దు. మీకు సహకారం లభిస్తుంది. కానీ ఇది నాది కాదు, ఇది తండ్రి సొత్తు. నేనైతే ఇచ్చేసాను, ఇందులో లాభముంది. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది మరియు మీరు పురుషార్థం తీవ్రంగా చెయ్యాలి. ఎవరైతే క్రొత్తగా వచ్చారో వారిని బాప్ దాదా లక్కీ మరియు లవ్లీ అని అంటున్నారు, ఎందుకంటే వచ్చారు, నా బాబా అని అనైతే అన్నారు. నా బాబా అనేవారు చేతులెత్తండి. వచ్చిన వారంతా నా బాబా అని అనేవారే కదా, నా బాబా అన్నప్పుడు మరింకేదైనా నాది అనేది ఉందా? బాబాయే నా వారు కదా! బాబాపై అధికారాన్ని పెట్టి తండ్రికి చెందినదిగా భావించి తండ్రికి ఇచ్చేయండి, దానిని మళ్ళీ మీ వద్దకు రానివ్వకండి. బాగుంది. బాబాను గుర్తించినందుకు బాబాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎగరాలి, నడవడం కాదు, ఎగరాలి అని పక్కా, పక్కాగా గుర్తుంచుకోండి. చాలామంది ఉన్నారు! బ్రహ్మణిలైన క్లాస్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా తమ కొత్త సోదరీ సోదరులపై దయ చూపించాలి. ప్రతి వారం వారి క్షేమ సమాచారాలను కనుక్కోండి, ఏ ప్రాబ్లమ్ లేదు కదా! ఏదైనా సమస్య ఉంటే వినిపించండి, దాని నివారణను పొందండి, అలా వదిలెయ్యకండి. పరిస్థితి వస్తుంది, వెళుతుంది. మనసులో పెట్టుకోకండి. అచ్ఛా! పూర్తి పరివారం నుండి కూడా అభినందనలు.

సేవటర్ను గుజరాత్ జోన్ వారిది:- (8 వేలమంది గుజరాత్ వారున్నారు) బాప్ దాదా ఇంతకు ముందుకూడా వినిపించి ఉన్నారు. గుజరాత్ అనగా గతించిపోయిన రాత్రి. గుజరాత్ లో సదా ముందుకు వెళ్తూ అందరినీ ముందుకు తీసుకువెళ్ళే ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయి, ఉండాలి కూడా ఎందుకంటే గుజరాత్ లో కూడా, మహారాష్ట్రలో కూడా ఉంది, కానీ గుజరాత్ లో సంఖ్యగానీ, టీచర్లు కానీ తక్కువ సంఖ్యలో లేరు. గుజరాత్ లో నలువైపుల సేవ అయితే ఉంది, గీతా పాఠశాలలు కూడా చాలానే ఉన్నాయి కానీ, ఇప్పుడు మిగిలిపోయిన పని ఏమిటి? ఇప్పుడు గుజరాత్ లోని ప్రతి సెంటరు, గీతా పాఠశాలను విడిచిపెట్టండి, తమ తమ సెంటర్లలోని వారసులు లిస్టును తయారు చెయ్యండి. వారసులు, విద్యార్థులు కాదు వారసుల వారి లిస్టు గుజరాత్ లో పెద్దగా ఉండి ఉండాలి ఎందుకంటే బాప్ దాదా అయితే సమయ సూచనను ఇస్తున్నారు. ఇప్పుడు సమయానుసారంగా కొత్త సంవత్సరంలో ఈ విషయంపై కూడా అటెన్షన్ పెట్టాలి. ప్రతి జోన్ వారికి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి జోన్ వారు లిస్టును తయారు చెయ్యండి. అన్ని జోన్లలోని వారసుల లిస్టులో ముందు నంబరులో ఉన్నదెవరు? ఎందుకంటే ఇప్పుడు బంగారు ప్రపంచం కోసం రాజ్యాన్ని కూడా తయారు చేసుకోవాలి కదా! సింహాసనంపై అయితే లక్ష్మినారాయణులే కూర్చుంటారు, కానీ అక్కడి రాజ్య అధికారి సభను కూడా తయారు చేసుకోవాలి. రాయల్ ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. సాధారణ ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. ఎటువంటి వారసులను తయారు చేసుకోవలంటే, సంబంధ- సంపర్కాలలో ఇప్పటి నుండే సమీపంగా ఉండాలి మరియు అక్కడ కూడా సమీపంగా ఉండాలి. వారసుల గుర్తు ఏమిటి? ఒకటి, వారసులు అనగా ప్రతి శ్రీమతంపై నడిచేవారు. బాబా చెప్పారు. పిల్లలు చేసారు. ప్రతి కార్యంలో మనసా, వాచ, కర్మణ, సంబంధ-సంపర్మంలో పరివారపు జీవితంలో కావచ్చు, వచ్చేవారు విద్యార్థి కాక పరివారపు భావన కలిగినవారై ఉండాలి. ఫ్యామిలీ అంటే ఒకరినొకరు తెలుసుకోవడము, అర్థం చేసుకొని నడచుకోవడము, పరివారంలో కూడా చక్కగా ఉండాలి. 4 నిశ్చయాలేవైతే వినిపించామో, వారసులలో ఆ 4 నిశ్చయాలు ప్రాక్టికల్ లైఫ్ లో ఉండాలి. పూర్తి పరివారానికి ప్రేమ ఉంటుంది, కొందరికి ప్రియంగా మరికొందరికి అప్రియంగా ఉండరు. పూర్తి పరివారానికి ప్రియంగా ఉండే ఇటువంటి వారస క్వాలిటీ ఇప్పుడు కావాలి. ప్రజలైతే తయారవుతూ ఉంటారు, సాధారణ ప్రజలు. కానీ ఇప్పుడు సమీపంగా ఉండే వారసులను తయారు చెయ్యండి. రాజధాని అయితే ఇక్కడే తయారు చెయ్యాలి కదా. అందుకే ఈ విషయంలో ఏ జోన్ వారసులక్వాలిటీలో నంబరువన్ గా ఉంది అన్నది ఈ సంవత్సరం చూడాలి. వర్గాలవారికి మరొక సేవ ఇవ్వడం జరిగింది, ఒకటి-వారసులను తయారు చెయ్యడము, రెండు-సంబంధ సంపర్కంలో ఉండేవారిని మైక్ గా తయారు చెయ్యడము. మైక్ మరియు వారసులను తయారు చెయ్యండి. ఇంకా సమయము ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ వారిలో బహుకాలపు పురుషార్థము తగ్గిపోతూ ఉంటుంది, అందుకే గుజరాత్ అద్భుతం చేస్తుంది కదా. బాగుంది. గుజరాత్ లో టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. టీచర్లు చేతులెత్తండి. ఎంతమంది టీచర్లు ఉన్నారో చూడండి! ఒక్కొక్క సెంటరువారు ఒక్కొక్క వారసుడ్ని తయారు చేయండి. పాత సెంటర్లు కూడా ఉన్నాయి. నేరుగా బాప్ దాదాల సూచన అనుసారంగా గుజరాత్ సేవ ఆరంభమయింది అంటే బాప్ దాదా దృష్టి ద్వారా గుజరాత్ తయారైంది. అది కూడా పని చేస్తుంది కదా! మంచి హ్యాండ్స్ ఉన్నారు, చెయ్యగలరు. చేసేవారు ఉన్నారు మరియు చెయ్యగలరు కూడా. సెంటర్లలో ఎన్నో ప్రోగ్రాములను చేసారు, మంచిగా చేస్తారు కూడా. ప్రోగ్రాములు మంచిగా చేసారు, ఇప్పుడు వారసులలో నంబరువన్ గా అవ్వండి. సరేనా? చేస్తారా? టీచర్లు చేతులెత్తండి. మరి ఈ సంవత్సరంలో, సంవత్సరంలోపు ఎంతమంది టీచర్లు ఉన్నారో అంతమంది వారసులను మధువనానికి తీసుకురావాలి. తెస్తారా? ఇప్పుడైతే గుజరాత్ టర్ను, అందుకే వారికి చెప్తున్నాము, కానీ బాప్ దాదా అన్ని జోన్ల వారికి చెప్తున్నారు. ఎవరైతే నంబరువన్ లో వస్తారో వారికి మంచి బహుమతి ఇద్దాము. అన్ని జోన్ల ఇంచార్జులు చేతులెత్తండి. ఇంకెవరు ఉన్నారు? సోదరులు కూడా చేతులెత్తండి. సరేనా, బాగుంది. మొదటి నంబరులోకి ఎవరు వస్తారో చూద్దాము. క్వాలిటీ కూడా చూద్దాము. వారసులనైతే చేసారు, కానీ వారి క్వాలిటీ ఎలా ఉంది! ఎందుకంటే బాప్ దాదా ఇప్పుడు సమయం యొక్క సూచనను పదే పదే ఇస్తున్నారు. మేము ఇంకా సమయం ఉందనుకున్నాము అని మళ్ళీ అనకండి. ఎందుకంటే ఇప్పుడు స్వయాన్ని కూడా సంపన్నంగా చేసుకోవాలి, సేవలో కూడా ముందుకెళ్ళాలి, రెండు పన్లు ఉన్నాయి. ఒకటి పురుషార్థము. పురుషార్థంలో ఒకటి- స్మృతి మరియు రెండవది సేవ, రెండింటిలో నంబర్ వన్లో రావాలి. మూడవది, స్వభావ సంస్కారాలలో పరివర్తన. వీరైతే మంచివారే కానీ... అని ఇప్పుడు ఎవరూ అనకూడదు. వీరు మంచివారు అని అనాలి. దీనిని చాలా మంచిది అని అంటారు ఎందుకంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి. మీరు చెయ్యాలనుకున్నా సేవను చెయ్యలేరు. విషయాలు ఎలా ఉంటాయంటే వ్యర్థ సంకల్పాలు తీసుకువచ్చేస్తాయి. అందుకే తీవ్ర పురుషార్థము. భూమిపై పాదాలు ఉండకూడదు. ఎగురుతూ ఉండండి. ఫరిస్తాల పాదాలను భూమిపై ఉన్నట్లుగా చూపించరు. ఈ స్థూల పాదాలు కాదు, స్థితి అనే పాదాలు. గుజరాత్ వారు మధువనానికి ఎంతో సహయోగులుగా ఉన్నారు. దగ్గరలో ఉన్నారు కదా! ఎప్పుడు ఏ విషయమున్నా కానీ ఎవర్ని పిలుస్తారు? గుజరాత్ నుండి ఇంతమందిని పంపండి అని ఫోన్లు వస్తూ ఉంటాయి కదా! బాగుంది, దగ్గరగా ఉండటంలో లాభము ఉంది, ప్రాప్తి కూడా ఉంది. అందుకే గుజరాత్ లోని రెగ్యులర్ విద్యార్థులు అందరూ బాప్ దాదా చెప్పే ఒక్కొక్క శ్రీమతంపై నడిచే సాంపుల్ గా అవ్వాలి. ఎవ్వరు సెంటరుకు వెళ్ళినా ఎలా కనిపించాలంటే అందరూ బాప్ దాదాకు సమీప రత్నాలుగా ఉన్నారు అని అనిపించాలి. సరేనా! ఏ విద్యార్థులైతే ఇలా భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఏ శ్రీమతమూ తగ్గకూడదు. సరేనా, ధైర్యవంతులే కదా, మంచి ధైర్యముంది.

జ్యూరిస్ట్, కల్చరల్ మరియు సెక్యూరిటీ వింగ్:- బాగుంది, మూడు వింగ్ వారు తమ తమ సేవలను మంచిగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికీ- మేము చెయ్యాలి అన్న ఉత్సాహము ఉంది, కానీ ఇప్పుడు బాప్ దాదా ఏ పనినైతే ఇచ్చారో, ఎటువంటి మైక్ లను తయారు చెయ్యండంటే సభలో వారు ఒక ఉదాహరణగా కనిపించాలి. బ్రహ్మాకుమారులుగా అయ్యాక కార్య వ్యవహారాలు చూసుకోలేరు అన్న వాతావరణం ఏదైతే తయారై ఉన్నదో అది కాదు అని వీరి అనుభవం వినడం ద్వారా ఇక్కడ ఇటువంటివారు ఒక్కరు కాదు, ఒక్క వర్గానికి చెందిన అనేకులు ఉన్నారు అని ప్రాక్టికల్ గా చూడాలి, తెలుసుకోవాలి. ప్రాక్టికల్ అనుభవిగా చూడటం ద్వారా ఉత్సాహం కలుగుతుంది. సహజంగా కూడా అనిపిస్తుంది. మేము కూడా ఇలా చెయ్యగలము అని అనిపిస్తుంది. మరి వింగ్ ద్వారా రెగ్యులర్ విద్యార్థులుగా తయారుచేసే సేవ చాలా మంచిగా అవ్వగలదు. మీరు ఎంత సేవ అయితే చేసారో దాని ద్వారా రెగ్యులర్ విద్యార్థులు ఎంతమంది తయారయ్యారు? వర్గాల సేవ ఆరంభమైనప్పటినుండి ఇప్పటివరకు రిజల్టును తీసినట్లయితే ప్రతి వర్గం నుండి రెగ్యులర్ విద్యార్థులు ఎంతమంది తయారుయ్యారు? ఎటువంటి క్వాలిటీవారు తయారయ్యారు? ఎందుకంటే చాలా సమయంనుండి వర్గాల సేవ జరుగుతోంది, అందరూ ఎంతో ప్రేమతో చేస్తారు. వేర్వేరు సేవలను చేసే ఛాన్సు లభించింది కదా. కావున ఇప్పుడు ఈ రిజల్టును తయారు చెయ్యండి. కనెక్షన్ వారు ఎంతమంది ఉన్నారు? రెగ్యులర్ వారు ఎంతమంది ఉన్నారు? రెగ్యులర్ గా ఉండేవారి చార్టు మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ప్రతి వర్గంవారు ఈ లిస్టును తయారు చెయ్యండి. అప్పుడప్పుడూ వచ్చేవారు కూడా ఉంటారు కదా! ఏదైనా ఫంక్షన్లో వస్తారు. ఏదైనా ప్రోగ్రాములో వస్తారు, కానీ బాబా పిల్లలుగా ఎంతమంది అయ్యారు? ఎందుకంటే ఈ కార్యమైతే జరుగుతూనే ఉంటుంది, మరి రిజల్టు కూడా రావాలి కదా! బాప్ దాదా ఏమి చూసారంటే ఈ మూడు వర్గాలు ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో పరస్పరంలో మీటింగ్, చేసుకుంటున్నారు. మధ్యమధ్యలో ఉత్సాహాన్ని పెంచుకునేందుకు పత్ర వ్యవహారాలను కూడా చేస్తున్నారు. రిజల్టు అయితే తప్పక ఉండే ఉంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరము, ప్రతి సారి బాప్ దాదా డైరెక్సన్ కూడా ఇస్తూ ఉంటారు, సేవా అవకాశాన్ని తీసుకుంటున్నారు, మంచిది. అందరూ సంతుష్టంగా ఉన్నారా? మూడింటి హెడ్స్ చేతులెత్తండి. అచ్చా. మీ వింగ్లో ఎవరైతే వస్తారో, మీటింగ్ చేస్తారో, ప్రోగ్రాము చేస్తారో, వరస్పరంలో కలుసుకుంటూ ఉంటారు. మరి అందరూ ఉల్లాస ఉత్తాహాలలో ఉన్నారా? ఏ ప్లాన్ అయితే తయారవుతుందో, ఉదాహరణకు మీటింగ్ లో ప్రోగ్రాం తయారయింది, అన్ని జోన్లు ఉన్నాయి, అందులో మీ ప్లాన్ ఏదైతే ఉందో దానిని మీ వింగ్ మెంబర్లు ఆ ఏరియాలో మాత్రమే ప్రాక్టికల్‌గా చేస్తూ ఉంటారు, ఈ సమాచారాన్ని మీరు తీసుకుంటూ ఉంటారా? ఎందుకంటే వింగ్ యొక్క పెద్ద ఆఫీసైతే ఒక చోట ఉంటుంది, కానీ సేవ పూర్తి జోన్ లో జరగాలి, కేవలం ఒకరిద్దరితో కాదు. మెంబర్లు తమ తమ స్థానాలలో చేస్తూనే ఉండవచ్చు, కానీ ఏ సెంటర్లో అయితే మెంబర్లు లేరో అక్కడ కూడా మీ ప్లాను జరగాలి ఎందుకంటే ఇది ప్రపంచానికి సంబంధించిన విషయము. దీనిపై అటెన్షన్ పెట్టండి, రిజల్టును తీసుకోండి. ఒక్కొక్క సెంటరు ప్రాక్టికల్ లోకి తీసుకు వచ్చి, అందులో ఎక్కడ కష్టంగా అనిపించింది? ప్రాక్టికల్ లోకి తీసుకురాకపోవడానికి కష్టమేమిటి? వాటి కోసం వింగ్ వారు ఏదైనా పరిష్కారాన్ని ఇవ్వండి. ఎలా అయితే ప్రోగ్రామును తయారు చేసారు, ఒకేసారి చేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. కనుక వింగ్ యొక్క ఒకే ప్రోగ్రాము అన్ని చోట్ల జరగాలి, అప్పుడు పేరు ప్రసిద్ధమవుతుంది. ఇటువంటి రిపోర్టును తీసుకోండి, ప్రతి పట్టణంలో అన్ని వర్గాల సేవ జరగాలి. అప్పుడే పేరు ప్రసిద్ధమవుతుంది కదా! బాప్ దాదా సంతోషిస్తున్నారు, బాగా కృషి చేస్తున్నారు, మూడు వింగులవారు తమకే చెబుతున్నట్లుగా భావించండి. కార్యం చేస్తున్నారు కానీ విస్తరింపజేయండి. ప్రతి స్థానం నుండి ప్రసిద్ధమైనవారు తయారుకావాలి, వారికి ఉత్సాహాన్ని ఇవ్వవలసి ఉంటుంది, సరేనా. అచ్ఛా!

60 దేశాల నుండి 650మంది డబుల్ విదేశీ సోదరీసోదరీలు వచ్చారు:- ముందుగా ఫారెన్ యూత్ గ్రూప్ లేవండి, బాగుంది. ఫారెన్ లో యూత్ గ్రూపు సేవ చేస్తోంది. బాప్ దాదా సమాచారాన్ని కూడా విన్నారు మరియు బాప్ దాదాకు మంచిగా కూడా అనిపించింది. విశేషమైన ఫారెన్ యూత్ ఎలా తయారవ్వాలంటే, ఒకరోజు యూత్ అందరూ కాకపోయినా, కొందరు ఫారెన్ యూత్ మరికొందరు ఇక్కడి యూత్ కలిసి ఢిల్లీలో ప్రధాన మంత్రి లేక పెద్ద మంత్రులు ఎవరయితే ఉన్నారో వారిని కలవడానికి వెళ్ళాలి. ప్రతక్షంగా ఫారెన్ యూత్ కూడా మారుతున్నారని, ఇండియావారు కూడా మారుతున్నారని వారికి కనిపించాలి. ప్రభుత్వానికి ఇప్పుడు యూత్ ద్వారా ఎంతో సమస్యగా ఉంది, ఇటువంటి సమయంలో ప్రభుత్వం ప్రాక్టికల్ గా ఉదాహరణను చూసినట్లయితే, వారు అర్థం చేసుకుంటారు. అంతేకాక ప్రభుత్వంలోని ఆ విశేష వర్గానికి చెందిన మంత్రి వద్దకు విశేషంగా వెళ్ళి కలవాలి. ఇటువంటి దు:ఖము, అశాంతి వాతావరణంలో ఒకవైపు ఇవి, మరోవైపు తమోగుణి వైబ్రేషన్లు, రెండింటి మధ్య యూత్ పరివర్తన చెంది ముందుకు వెళ్తున్నారు అని అర్థంచేసుకుంటారు. అప్పుడు వారి అటెన్షన్ సంస్థవైపుకు వెళ్తుంది. ప్రతి వర్గంవారు ప్రధాన మంత్రిని కాక, ఆ వర్గానికి చెందిన మంత్రి దగ్గరకు చిన్న గ్రూపు అయినా తయారై వెళ్ళి సమాచారాన్ని వినిపించాలి. పూర్తి మినిస్ట్రీలో ఈ విషయం తెలిసిపోవాలి. అప్పుడు వీరు అన్ని వర్గాల సేవను చేస్తున్నారు, బాగుంది అని భావిస్తారు. బాప్ దాదా కూడా యూత్ గ్రూపులో వచ్చిన మార్పును చూసి సంతోషిస్తున్నారు. కానీ ఏ యూత్ అయితే స్వయంతో సంతుష్టంగా ఉన్నారో వారు వెళ్ళండి. ప్రాక్టికల్ లైఫ్ లో ఉండాలి. ఎవరు వినిపించినా వినిపించకపోయినా కానీ, ఎవరైతే ముందు తమ స్వయంతో సంతృప్తిగా ఉంటారో వారు ఉదాహరణగా కావాలన్నది బాబా నియమము. తమ యూత్ సమస్యలను పరిష్కరించడానికి ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వారి సహాయాన్ని తీసుకోండి. ఏది ఏమైనా తమలోని బలహీనతలను తొలగించుకోవలసిందే. ఇటువంటి యూత్ వైబ్రేషన్లను వ్యాపింపజెయ్యగలరు. సందేశాన్ని వ్యాపింపజేయగలరు. ఎలా ఎలా అయితే సందేశం విస్తరిస్తూ ఉంటుందో అంతంతగా ఈ కార్యపు ప్రభావము పడుతుంది. కావున ఏ గ్రూపువారైతే నిమిత్తమై ఉన్నారో వారు స్వయాన్ని ఎంతో సంభాళించుకోవలసి ఉంటుంది, పూర్తి ఉదాహరణగా కావాలి. సరేనా. యూత్ అందరూ మంచిగా ఉన్నారు కదా! బాప్ దాదా మీ అందరినీ చూసి సంతోషిస్తున్నారు. ఇటువంటి ఉదాహరణ మూర్తులు చాలా కార్యాన్ని చేస్తారు. ఇప్పుడైతే మీరు వెళ్తున్నారు, తర్వాత మీకే స్వయంగా ఆహ్వానం లభిస్తుంది. ముందుకు వెళ్తున్నారు, అందరినీ తీసుకువెళ్లండి. ఫారెన్ యూత్ కానీ ఇండియా యూత్ కానీ అందరిపై బాప్ దాదాల శుభ ఆశ ఇదే. అభినందనలు కూడా ఉన్నాయి, ఆశలు కూడా ఉన్నాయి. అచ్ఛా!

డబుల్ విదేశీ చిన్న పిల్లలతో:- ఇదొక్కటే పిల్లల గ్రూపు. (పిల్లలు పాట పాడారు - చోటే చోటే ఫూల్ హై హమ్. అవుర్ కిసీసే నహీహై కమ్-(మేము చిన్నచిన్న పుష్పాలము, మేమెవరికన్నా తక్కువకాదు.) పిల్లలందరూ పువ్వుల్లాగే ఉంటున్నారు కదా. బాబా శ్రీమతం అనుసారంగా నడుచుకుంటున్నారా? నడిచేవారు చేతులెత్తండి. అచ్ఛా! మీరు లక్కీ పిల్లలు, ఎందుకంటే చిన్నతనంలోనే బాప్ దాదాలతో మిలనం చేసుకుంటున్నారు. అందరూ మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు. పెద్ద పెద్దవారు, పెద్ద పెద్ద కంపెనీలవారు పిల్లలైన మిమ్మల్ని పిలిచే రోజు కూడా వస్తుంది. ఈ విధంగా ఇటువంటి అదృష్టవంతులైన పిల్లలుగా తయారైనవారు ఎవరు? అందుకే పిల్లలందరూ తమ ధారణలను పక్కాగా పెట్టుకోండి. ఎప్పుడూ ఏ ధారణనూ విడిచిపెట్టకండి. ఎందుకంటే బాప్ దాదా మరియు లౌకిక తండ్రికి ముగ్గురికీ పిల్లలు మీరు. మరి అందరూ మంచి అద్భుతాన్ని చేసి చూపించాలి కదా! అచ్ఛా.

డబుల్ విదేశీ సోదరసోదరీలు:- అచ్ఛా, సింధి గ్రూపు కూడా వచ్చింది, చాలా మంచిది. బాబాపై ప్రేమ ఉంది కదా. బాబాపై ఎంతో ప్రేమ ఉంది కదా. బాబా కూడా మిమ్మల్ని ఎందుకు గుర్తు చేస్తున్నారు. బాబా సింధ్ ప్రాంతంలోకే వచ్చారు కదా! ఏ దేశంనుండైతే వచ్చారో వారికి ఒక బహుమతిగా కూడా కావాలి కదా, సింధీవారు ఎటువంటి సేవను చెయ్యాలంటే అనేక సింధీ ఆత్మల సేవ చేసేందుకు నిమిత్త మవ్వాలి.

ప్రతి సీజన్ లో ఫారెనర్లు మధువనానికి అందం తెచ్చి పెడ్తారు. మంచి ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి, 60 దేశాలనుండి వచ్చారంటే అంత సేవ జరిగిందని అర్థం కదా. ఎవరు ఎక్కడ ఉన్నా కానీ సేవ లేనిదే బ్రతకలేరు. ఎవరు కలిసినా కానీ వారికి ఏమని చెప్పాలి? మిగతా విషయాలలోకి అయితే వెళ్ళము, అయినా ఇన్ని దేశాలలో ఇంత సేవ జరిగింది. ఇప్పుడైతే ఇతరులకు సందేశాన్ని ఇవ్వడానికి విదేశీయుల మంచి మంచి గ్రూపులు తయారయిపోయాయి. రకరకాల కోర్సులు కూడా చేయిస్తున్నారు. ఎలా అయితే భారత దేశంవారు సేవను విస్తరింపజేస్తున్నారో అలాగే విదేశీయులు కూడా వ్యాపింపజేస్తూ ఉంటే మరి పూర్తి విశ్వంలో బాబా సందేశమైతే చేరుకుంటుంది. ఫారెన్ వారు కూడా తమ తమ ఏరియాలలో ప్రయత్నం చేస్తున్నారు, చేసారు కూడా. చుట్టుపక్కల వారికి ఏదైనా కార్యక్రమమును తయారుచేసి కూడా సందేశమును ఇచ్చేయండి ఇది బాప్ దాదాకు నచ్చుతుంది. సేవలో భిన్న భిన్న కార్యక్రమాలు చేస్తూ, సందేశాన్ని ఇస్తూ ఉంటారు, వారు చేతులెత్తండి. సేవ చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు కదా! నా పిల్లలు ప్రతి ఒక్కరూ సందేశాన్ని అందించే సందేశకులు అని బాబా అంటారు. సందేశాన్ని ఇస్తూ ఉంటారు కదా! కావున పిల్లలు ప్రతి ఒక్కరూ సందేశకులు, సందేశాన్ని ఇచ్చేవారు! ఎవరిని కలిసినా ఏమి మాట్లాడుతారు? కనీసం అనుభవాలైతే తప్పక వినిపిస్తారు కదా! తద్వారా సందేశాన్నయితే ఇస్తారు కదా! కావున బాప్ దాదాకు కూడా నచ్చుతుంది. విశేషంగా విదేశీయులను బాప్ దాదా ఎందుకు గుర్తు చేస్తారు? పిల్లలందరినీ గుర్తు చేస్తారు, కానీ విదేశీయులను విశేషంగా కూడా గుర్తు చేస్తారు, కానీ ఎందుకు? ఎందుకంటే ఒక్క ఈ బ్రహ్మాకుమారీల స్టేజి మీదనే భిన్న భిన్న ధర్మాలవారు, భిన్న భిన్న డ్రస్సులవారు ఒకేరకమైన వస్త్రాలను ధరించి స్టేజి మీద కూర్చుంటారు. ఇప్పుడు మీరు ఏ డ్రస్సులో కూర్చుంటారు? తెల్లని వస్త్రాలతో కూర్చుంటారు, ముస్లింలు కూడా, క్రిస్టియన్లు కూడా, బౌద్ధులు కూడా అందరూ ఒకే స్టేజిపై కూర్చుని ఉంటారు. ఇలా అందరూ ఒకే పరివారమువారిగా అయిపోయారు. ఈ విశేషత చాలా బాగుంది, అందరూ సేవను చేస్తున్నారు! ఇప్పుడు క్రొత్త సంవత్సరం వస్తోంది. మరి దీని నుండి లాభాన్ని తీసుకోవాలి. తమ తమ కనెక్షన్లోని వారికి ఈ విషయాన్ని వినిపించండి, ఈ కానుకను ఇవ్వండి, మా ఈ కానుక అతీతమైనది అని చెప్పండి. ప్రతి సంబంధీకునికి, కనెక్షన్ వారికి, అభినందనలు తెలుపుతూ వెళ్ళండి. ఏదో ఒక గుణాన్ని, శక్తిని కానుకగా ఇవ్వండి. మేము మీ అందరికీ ఒక విశేషమైన ఈ కానుకను తీసుకువచ్చాము అని చెప్పండి. ఈ కానుకతో మీ వర్తమానము మరియు భవిష్యత్తు ఎంతో మంచిగా అయిపోతుంది, వారికి ఇటువంటి మంచి మంచి మాటలను వినిపించాలి. ఎందుకంటే సేవ చేసేందుకు క్రొత్త సంవత్సరం ఒక అవకాశము. అచ్చా! బాప్ దాదా సంతోషిస్తున్నారు, ఫారెన్ సేవలపై సంతోషంగా ఉన్నారు. సంగఠన కూడా మంచిగా చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తూ ఉండండి. అచ్ఛా, వెనుకవారు లేవండి!

           వెనక కూర్చున్నవారికి బాప్ దాదా వరదానం ఇస్తున్నారు, మధువనంలో మేళాలోకి వచ్చారు కదా! కావున మధువన మేళాలోకి వచ్చినవారికి వెనక కూర్చునే అవకాశం లభించింది, కాబట్టి మేము వెనుక ఉన్నవారము అని భావించకండి. వెనక కూర్చున్నవారు బాప్ దాదా మనస్సులో ఉన్నారు. వచ్చినవారు 22వేల మంది ఉన్నారు, మొత్తం 25వేల గ్రూపు, (బయట కూడా కూర్చుని ఉన్నారు). తప్పక రండి, వాతావరణాన్ని చూడలేదు, స్థానాన్ని చూడలేదు, చలినీ చూడలేదు, టెంట్లో కూడా పడుకున్నారు. బాప్ దాదా ముఖ్యంగా అన్ని టెంట్లలో పరిక్రమణ చెయ్యడానికి వచ్చారు. వెనక కూర్చున్నవారిని బాప్ దాదా తమ హృదయంలో ఇముడ్చుకుంటారు, అందుకే ఎవరు ఎక్కడ కూర్చున్నాకానీ అందరినీ బాప్ దాదా ఎదురుగా నయనాలలో ఇముడ్చుకుని ప్రియస్మృతులను కూడా తెలుపుతున్నారు. ఇప్పుడైతే ఇక బ్రాహ్మణ పరివారం రోజురోజుకీ పెరగవలసిందే. బాప్ దాదా కూడా పరివారాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఓహో ఈశ్వరీయ పరమాత్మ పరివారము ఓహో! అచ్ఛా!

ఈ రోజు 12 గంటల వరకు కూర్చోవాలి. కలిసి కూర్చునే అవకాశము లభించింది. నలువైపుల దేశ విదేశాలలో ఉన్న బాబాకు ప్రియమైన, గారాల పిల్లలకు, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు వీడ్కోలు మరియు అభినందనలు. పాత సంవత్సరంతో పాటు, పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు చెప్పే, పాత స్వభావానికి కూడా వీడ్కోలు చెప్పే మహావీరులైన పిల్లలకు, ప్రతి అడుగులో కోటానురెట్ల సంపాదనను జమ చేసుకునేవారికి, బాప్ దాదా ఇచ్చే స్వమానాల స్థితిలో ఉండి అనుభవం చేసుకునేవారికి, పిల్లలు ప్రతి ఒక్కరినీ బాప్ దాదా ఎలా చూస్తారంటే- పిల్లలు ఒక్కొక్కరూ 21 జన్మల వారసత్వానికి అధికారులు, పూర్తి కల్పంలో 21 జన్మలకు అధికారులుగా అయ్యే వారసత్వము పిల్లలయిన మీకు మాత్రమే లభిస్తుంది. ఇటువంటి శ్రేష్ఠ అధికారులైన నలువైపుల ఉన్న పిల్లలకు బాప్ దాదా- తండ్రి, శిక్షకుడు మరియు గురువు రూపంలో మూడు రూపాలలో ప్రియస్మృతులు మరియు నమస్తే చెబుతున్నారు.

దాదీ రుక్మిణితో:- బాగుంది, శరీరాన్ని నడిపించడం వచ్చింది. మనసు యవ్వనంలో ఉంది, బాగుంది. కానీ సేవలో ఎప్పుడూ తోడుగా నిలిచారు కదా.

పర్ దాదీతో:- బాగుంది, వీరికి కూడా నడిపించడం బాగా వచ్చు. నడిపించేవారు కూడా బాగున్నారు. నడవడం కూడా బాగా వచ్చు.

ముగ్గురు అన్నయ్యలతో:- క్రొత్త సంవత్సరంలో ఏదైనా క్రొత్తగా చేసి చూపిస్తారు కదా. (క్రొత్త సంవత్సరంలో ఏ నవీనతను చెయ్యాలి?) ఒకటి- పరివారాన్ని తమ స్థితిలో శక్తి శాలిగా తయారుచేసే ప్లాన్ మరియు సేవలో క్రొత్త క్రొత్త విధాలుగా, ఎలా అయితే ఫంక్షన్ చేసారో, అది కూడా ఒక పద్ధతి, కానీ ఇప్పుడు మరో విధంగా ఏదైనా గ్రూపు, గ్రూపులుగా వారి పెద్ద సమూహమును తయారుచేసి, ఉదాహరణకు వకీలులు, జడ్జిలు, ఇలా అన్ని జోన్లలోని ఈ గ్రూపువారిని ఒక చోటకు చేర్చి ఒక పెద్ద స్థానంలో జరపాలి, వేర్వేరు వర్గాలవారు ఉండాలి, కానీ జోనులవారీగా ప్రతి వర్గమువారు కలవాలి. ఇటువంటి పెద్ద సంగఠన జరపాలి, అవసరమైతే టెంట్ వెయ్యండి పెద్ద స్థానంలో ఈ విధంగా ఒక్కొక్క గ్రూపు యొక్క రిజల్టును తయారు చెయ్యండి మరియు దీని తర్వాత మీరు ఏమి చెయ్యాలి అని వారితో కనెక్షన్‌ను జోడించండి. భాషణ విని వెళ్ళిపోవడం కాదు, భాషణ తర్వాత మీరు ఎంతమంది కావాలనుకుంటే అంతమంది దీనిని ఇలా చెయ్యవచ్చు. వారు కనెక్షన్లో ఉండేందుకు ప్రణాలిక తయారుచేయండి, ఫోన్ల ద్వారా కనెక్షన్ ఉంచాలి, ఉత్తరాల ద్వారా ఉంచొచ్చు, కనెక్షన్ ను పెంచుతూ వెళ్ళాలి. ఒక్కొక్క ప్రోగ్రాము పెద్ద పెద్ద స్థానాలలో జరగాలి. ఒక చోట వకీళ్ళకు పెట్టండి, మరోచోట నేతలకు పెట్టండి. ఇలా పెద్ద పెద్ద స్థానాలలో గ్రూపును సమీపంలోకి తీసుకురండి, మిక్స్ గ్రూపు కూడా ఉండవచ్చు, రెండు విధాలుగా చెయ్యవచ్చు. ఒక్క వర్గంవారే ఉంటే అందరి అటెన్షన్ ఆ గ్రూప్ పై ఉంటుంది. మిక్స్ చేస్తే అటెన్షన్ తగ్గుతుంది. రెండింటినీ చేసి చూడండి. ఒక చోట అది చెయ్యండి, మరో చోట ఇలా చేసి చూడండి, రెండింటి రిజల్బును చూడండి, తర్వాత భవిష్య కార్యక్రమాన్ని తయారు చెయ్యండి.

ఓమెక్స్ కంపెనీ చైర్మన్ సోదరులు రోహతాస్ గోయల్ మరియు వారి పరివారముతో:- ఎలా అయితే బిల్డింగ్ పని సఫలమవుతుందో, అలాగే ఈ సేవా కార్యక్రమాన్ని కూడా సఫలం చెయ్యండి. ఎక్కడకు వెళ్ళినా కానీ అక్కడ సందేశాన్ని ఇవ్వండి. వెళ్ళాల్సిందే అన్నప్పుడు అక్కడ సందేశాన్ని ఇస్తూ ఉండండి. సెంటరు అక్కయ్యలు కోర్స్ చేయిస్తారు, కానీ మీరు సందేశాన్ని ఇవ్వండి. మీకు కలిగిన అనుభవాన్ని వినిపించండి. మీరు కనెక్షన్ లో ఉండండి, ఇతరుల కనెక్షన్‌నూ జోడించండి. అచ్ఛా. అందరూ కలిసి సందేశవాహకులుగా అవ్వండి, అందరూ సెంటరుకు వెళ్తారు. అడ్రసు ఇవ్వండి, ఫోన్ల ద్వారా కనెక్షన్‌ పెట్టుకోండి, చాలు. సందేశకులుగా అవ్వండి. సందేశాన్ని ఇవ్వండి. అందరూ మంచిగా ఉన్నారు. అందరూ సేవను చెయ్యగలరు.

           అందరూ మంచిగా ఉన్నారు, ఉల్లాస ఉత్సాహాలతో ఉన్నారు, వారికి సందేశాన్ని ఇచ్చి ఉత్సాహంలోకి తీసుకురండి. దుఃఖంతో ఉన్నవారికి సుఖపు సందేశాన్ని అందించండి. చూడండి, వీరు  వయస్సులో కూడా అనుభవజ్ఞులు, కనుక చాలా సేవను చెయ్యగలరు.

2009కి వీడ్కోలు 2010 అభినందనలు - రాత్రి 12 గంటల తర్వాత:-

          అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు, కానీ మీ అందరికీ సదా హ్యాపీ అని మనము అంటాము. ప్రపంచం అనుసారంగా ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నారు. కానీ సంగమయుగంలోని ప్రతిరోజూ మనకు ఉత్సవమే. సదా ఉత్సాహము ఉంటుంది కాబట్టి సదా ఉత్సవము. సంగమయుగములో హ్యాపీ సంగమయుగము. కావున మీ అందరికీ చాలా-చాలా-చాలా పరివర్తనకు అభినందనలు, అభినందనలు. అభినందనలు. ఏవిధముగా క్రొత్త సంవత్సరం ఉందో అలా క్రొత్త సంస్కారాలు, పాత సంస్కారాలకు వీడ్కోలు మరియు క్రొత్త సంస్కారాలకు స్వాగతము అందుకే సదా హర్షితంగా ఉన్నారు మరియు సదా హర్షితంగా ఉంటారు, మీకు, మాకు అందరికీ ప్రతి సంవత్సరము కళ్యాణకారియే, ముందుకు వెళ్తూ, ముందుకు తీసుకు వెళ్తూ ఉంటుంది... అందుకే సదా హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ.

Comments