24-03-2009 అవ్యక్త మురళి

   24-03-2009         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

    "బాప్ దాదా ద్వారా లభించిన ఖజానాలను స్వయంలో నింపుకుని కార్యంలో వినియోగించండి, అనుభవంలో అథారిటీలుగా అవ్వండి.”

           ఈ రోజు నలువైపుల సర్వ ఖజానాలను జమ చేసుకునే సంపన్నమైన పిల్లలను చూస్తున్నారు. దీనితో పాటు పిల్లలు ప్రతి ఒక్కరు ఎంతవరకు సర్వ ఖజానాలను జమ చేసుకున్నారు అన్న రిజల్టును కూడా చూసారు. ఖజానాలైతే బాప్ దాదా ద్వారా అనేకమైనవి, అవినాశిగా ప్రాప్తించాయి. అన్నిటికన్నా ముందు మొట్టమొదటి అతి పెద్ద ఖజానా - జ్ఞాన ధనము. దీనిద్వారా ముక్తి మరియు జీవన్ముక్తి ప్రాప్తించాయి. పాత దేహము మరియు పాత ప్రపంచము నుండి ముక్తి, జీవన్ముక్త స్థితి మరియు ముక్తిధామంలోకి వెళ్ళడము పిల్లలందరికీ ప్రాప్తించాయి. ఒక్క జ్ఞాన ఖజానాయే కాదు, యోగము కూడా ఖజానాయే. దీనిద్వారా సర్వ శక్తుల ప్రాప్తి జరుగుతుంది. దీనితో పాటు ధారణ చేసుకునే ఖజానా ద్వారా సర్వగుణాల ప్రాప్తి జరుగుతుంది. దీనితోపాటు సేవా ఖజానా ద్వారా ఆశీర్వాదాల ఖజానా, సంతోషపు ఖజానా ప్రాప్తిస్తాయి. అంతేకాక అన్నింటికన్నా అతి పెద్ద ఖజానా - వర్తమాన సంగమయుగపు సమయము. ఎందుకంటే పూర్తి కల్పంలో ఈ సంగమ సమయము అమూల్యమైన ఖజానా. ఈ సంగమ సమయములోని ఒక్కొక్క సంకల్పము, ఒక్కొక్క క్షణము అతి అమూల్యమైనవి, ఎందుకంటే సంగమ సమయములోనే బాప్ దాదా మరియు పిల్లల మధుర మిలనము జరుగుతుంది. మరే యుగములోనూ పరమాత్మ తండ్రి మరియు పరమాత్మ పిల్లల మిలనము జరుగదు. దీనితోపాటు సంగమ సమయములోనే బాప్ దాదా ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయి. ఖజానాలు జమ అయ్యేందుకు సమయము సంగమయుగమే. ఇతర ఏ యుగములోనూ జమ ఖాతా, జమ చేసుకునే బ్యాంకే లేదు. కేవలం ఒక్క సంగమయుగములోనే ఎన్ని ఖజానాలు జమ చేసుకోవాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. సంగమ సమయానికి ఉన్న మహత్వము ఏమిటంటే, ఒక్క జన్మలో అనేక జన్మల కోసం ఖజానాలను జమ చేసుకోవచ్చు. కావున ఈ చిన్నని యుగానికి చాలా మహత్వము ఉంది మరియు ఖజానాలు కూడా బాప్ దాదా ద్వారా పిల్లలందరికీ లభిస్తాయి. బాబా అందరికీ ఇస్తారు కానీ, ఖజానాలను జమ చేసుకోవడమును పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం అనుసారంగా చేస్తున్నారు. ఇచ్చే బాబా ఒక్కరే మరియు ఒకే విధంగా అందరికీ ఇస్తారు, ఒకే సమయంలో ఇస్తారు. కానీ ధారణ చేయడంలో ఏమి చూసారు? బాబా అయితే ఒకే విధంగా ఇచ్చారు కానీ ధారణ చెయ్యడంలో ప్రతి ఒక్కరిదీ వారి వారి పురుషార్థంగా ఉంది. ఎందుకంటే ఖజానాలను ధారణ చేసుకోవడానికి మొదటిది- తమ పురుషార్థంతో ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవచ్చు, రెండవది- సదా స్వయం సంతుష్టంగా ఉండడం మరియు సర్వులను సంతుష్టపరచడం. సంతుష్టత అన్న విశేషతతో ఖజానాలను జమ చేసుకోవచ్చు. మూడవది- సేవ ద్వారా, ఎందుకంటే సేవ ద్వారా సర్వాత్మలకు సంతోషము ప్రాప్తిస్తుంది, కావున సంతోషపు ఖజానాను ప్రాప్తి చేసుకుంటారు. తమ పురుషార్థము, సర్వులను సంతుష్టపరిచే పురుషార్థము మరియు మూడవది, సేవా పురుషార్థము. ఈ మూడు విధాలుగా ఖజానాలను జమ చేసుకోవచ్చు. ఖజానాలను జమ చేసుకోవడంలో విశేషంగా సంబంధ సంపర్కాలలోకి వచ్చేటప్పుడు నిమిత్త భావము, నిర్మాణ భావము, నిస్వార్థ భావము, ప్రతి ఆత్మ పట్ల శుభ భావన మరియు శుభ కామనను ఉంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకవేళ సేవలో మరియు సంబంధ సంపర్కాలలో ఇవన్నీ ఉన్నట్లయితే పుణ్య ఖాతా మరియు ఆశీర్వాదాల ఖాతా చాలా సహజంగా జమ కాగలవు.

           మరి బాప్ దాదా అందరి లెక్కలను చూస్తున్నారు. ఏమి చూసారు? నలువైపుల ఉన్న పిల్లలను నంబరువారీగా చూసారు. బాబా ఒక్కరే, ఒకే సమయములో ఇస్తారు, కానీ జమ చేసుకోవడంలో మూడు రకాల పిల్లలను చూసారు. ఒక రకం పిల్లలైతే జమ అయిన ఖజానాను తిన్నారు, జమ కూడా చేసుకుంటారు మరియు తినేసి సమాప్తం చేసేస్తారు. రెండవ రకం వారు తింటారు, జమ చేసుకుంటారు, ఇంకా జమ చేసుకోవడానికి అటెన్షన్ ను పెట్టి పెంచుకుంటారు కూడా, ఖజానాలను పెంచుకునేందుకు సాధనము ఏమిటి? పెంచుకునేందుకు  సాధనము - ఏ ఖజానా అయితే లభిస్తుందో దానిని సమయానికి వచ్చిన పరిస్థితి  అనుసారంగా కార్యంలో వినియోగించడము. ఎవరైతే కార్యంలో వినియోగిస్తారో, స్థితి ద్వారా పరిస్థితిని మార్చగలరో వారికి జమ అవుతుంది. ఎవరైతే కార్యంలో వినియోగించరో వారికి జమ కాదు. కావున సమయానికి స్వయం కోసం మరియు ఇతరుల కోసం కార్యంలో వినియోగిస్తున్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి! ఎంతగా కార్యంలో వినియోగిస్తారో అంతగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే కార్యంలో వినియోగించడం ద్వారా అనుభవం అవుతూ ఉంటుంది. అంటే అనుభవం అనే అథారిటీ కలుస్తూ ఉంటుంది. కావున ఈ ఖజానాలన్నీ జమ అయి ఉన్నాయా అని పరిశీలించుకోండి, స్వయాన్ని ప్రశ్నించుకోండి. పెంచుకునే సాధనాన్ని సమయానికి కార్యంలో వినియోగిస్తున్నానా? అనుభవం యొక్క అథారిటీ పెరుగుతూ ఉందా? ఎందుకంటే అన్ని అథారిటీలలోకి అనుభవం యొక్క అథారిటీ గొప్పది అన్న గాయనము ఉంది. మరి ప్రతి ఒక్కరూ తమ ఖాతాను పెంచుకోవాలి, పరిశీలించుకోవాలి ఎందుకంటే పరిశీలించుకునేందుకు ఇదే సమయము. ఇప్పుడు కూడా ఖజానాలను పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అవకాశము ఉంది, తర్వాత అవకాశము కూడా సమాప్తమైపోతుంది. ఖజానాలను పెంచుకోవాలనుకుంటారు కానీ పెంచుకోలేరు.

           బాప్ దాదా ఏమి చూసారంటే- ఖజానాలు లభిస్తాయి, ఎంతో సంతోషంగా వాటిని స్వయంలో నింపుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తారు కానీ, ఖజానాలు లభించేటప్పుడు, మురళి ద్వారానే ఖజానాలు లభిస్తాయి. రెండు విధాల పిల్లలున్నారు. ఒకరు- వినేవారు, రెండవవారు - నింపుకునేవారు. కొంతమంది పిల్లలు విని చాలా సంతోషపడిపోతారు కానీ వినడం మరియు నింపుకోవడం రెండింటిలో చాలా తేడా ఉంది. నింపుకునేవారు అనుభవజ్ఞులుగా అవుతూ ఉంటారు, ఎందుకంటే విన్నదానిని సమయానికి కార్యంలో వినియోగిస్తూ, ఖజానాలను పెంచుకుంటూ ఉంటారు. వినేవారు వర్ణన చేస్తూ ఉంటారు, చాలా బాగా వినిపించారు. బాబా చాలా మంచి విషయాలను చెప్పారు అంటారు, కానీ నింపుకోకుండా సమయానికి కార్యంలో వినియోగించలేరు. కావున మీ అందరూ పరిశీలించుకోండి - నింపుకునేవారా? కొంచెం కూడా ఒకవేళ తక్కువగా ఉంటే, నిండుగా లేకపోతే అలజడి జరుగుతుంది. కానీ నింపుకున్నవారు ఫుల్‌గా(నిండుగా) ఉంటారు కాబట్టి అలజడి జరుగదు. అందుకే ఈ రోజు బాప్ దాదా అందరి ఖజానాలను పరిశీలించారు. మూడు రకాల పిల్లలు అని వినిపించాము కదా, ఇప్పుడు నేను ఎవరిని అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఖజానాలను పెంచుకోవడము అంటే సమయానికి కార్యంలో వినియోగించడము. ఎంతగా కార్యంలో వినియోగిస్తూ ఉంటారో అంతగా ఖజానాలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ ఖజానా ఉన్నా, యజమాని ఖజానాను కార్యంలోకి తీసుకువస్తాడు. ఖజానా మిమ్మల్ని కార్యంలో వినియోగించదు. మరి మీ అందరికీ సర్వ ఖజానాలను బాబా వారసత్వంగా ఇచ్చారు. బాబా ఖజానాలను తమ ఖజానాలుగా చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ అటెన్షన్ ను ఇవ్వండి. ఎందుకంటే ఎంతైతే ఖజానాలు పరిపూర్ణంగా ఉంటాయో అంతగా పరిపూర్ణ స్థితిలో అచలంగా, నిశ్చలంగా ఉంటారు.

           పిల్లలు ప్రతి ఒక్కరు సంపన్నంగా కావాలి, తక్కువగా కాదు అని బాప్ దాదా కోరుకుంటున్నారు. ఎందుకంటే బాబా ద్వారా అవినాశి ఖాతాను జమ చేసుకునే ఈ అవకాశము ఇప్పుడే వీలవుతుంది. అందుకే ఇప్పుడు లేకున్న మరెప్పుడూ లేదు అంటారు. ఇది సంగమ యుగము గురించిన గాయనమే. భవిష్యత్తులో అయితే ఏదైతే జమ చేసుకున్నారో దాని ఫలితాన్ని పొందుతారు. కానీ ప్రాప్తి చేసుకోవడానికి మాత్రం ఇదే సమయము. మరి ప్రతి ఒక్కరూ తమ ఖాతాను చూసుకోవాలి. ఎవరి భండారా ఎంత నిండుగా ఉంటుందో వారి నయనాల ద్వారా, నడవడిక ద్వారా, ముఖము ద్వారా తెలుస్తుంది. వారి ముఖము మరియు నడవడిక వికసించిన గులాబీ పుష్పంలా ఉంటాయి. బాప్ దాదా ప్రతి ఒక్కరి నడవడిక మరియు ముఖము ద్వారా వీరు ఎంత హర్షితంగా, సంతోషంగా ఉన్నారు అని చూస్తూ ఉంటారు. నయనాల ద్వారా ఆత్మికత, ముఖము ద్వారా చిరునవ్వు మరియు కర్మ ద్వారా ప్రతి ఒక్క గుణము అందరికీ అనుభవం అవుతాయి. కావున ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోండి.

           బాప్ దాదాకు పిల్లలందరిపట్ల ఉన్న శుభ భావన ఏమిటంటే పిల్లలు ప్రతి ఒక్కరు అనేక ఆత్మలను ఈ విధంగా ఖజానాలతో సంపన్నంగా చేయాలి. ఈ రోజు విశ్వంలోని ఆత్మలందరూ ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి లభించాలి అని కోరుకుంటున్నారు. ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చే దాతలు బ్రాహ్మణ ఆత్మలైన మీరే. ఎందుకంటే హోలియస్ట్ (అతి పవిత్రమైనవారు), హైయెస్ట్ (అతి ఉన్నతమైనవారు) మరియు రిచెస్ట్ అనగా అతి సంపన్నులైన ఆత్మలు మీరే. అందరి ఆత్మలకన్నా మీరే హోలియస్ట్. మీకు జరిగే విధిపూర్వకమైన పూజ మరెవ్వరికీ జరుగదు. ఇప్పుడు అంతిమ జన్మలో కూడా మీ ఆత్మలకు విధిపూర్వకంగా జరిగే పూజ నిమిత్తమైన ధర్మపితలు మరియు మహాత్మలకు కూడా జరుగదు, వారి స్మృతి చిహ్నాలు తయారుకావచ్చు కానీ విధిపూర్వకమైన పూజ జరుగదు. మీకున్న ఖజానాలు, రిచెస్ట్ ఇన్ ది వరల్ట్ (ప్రపంచంలోనే అతి ధనవంతులు), బ్రాహ్మణ ఆత్మలైన మీ ఒక్క జన్మ ఖజానాలు 21 జన్మల వరకు గ్యారంటీగా కొనసాగుతాయి. ఎందుకంటే బాబా ద్వారా బాబా వారసత్వము లభించింది. ఎలా అయితే బాబా అవినాశిగా ఉన్నారో అలాగే బాబా ద్వారా లభించిన ఖజానాలు కూడా అవినాశిగా ఉంటాయి. అందుకే రిచెస్ట్ ఇన్ ది వరల్డ్, హోలియస్ట్ ఇన్ ది వరల్డ్ (ప్రపంచంలోనే అతి సంపన్నులు, అతి పవిత్రమైనవారు).

           మరి అందరూ స్వయాన్ని ఇటువంటి విశేషమైన సేవాధారిగా భావిస్తున్నారు కదా! ఈనాటి సమయానుసారంగా విశ్వాత్మలకు ఆవశ్యకమైనదేమిటో తెలుసు కదా! ఈరోజు విశ్వానికి సంతోషము, శక్తి మరియు స్నేహము యొక్క ఆవశ్యకత ఉంది. ఆత్మిక స్నేహమును కోరుకుంటున్నారు కానీ బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఇప్పుడు సమయానుసారంగా దాతలుగా అవ్వండి. మనసు ద్వారా శక్తులను ఇవ్వండి, వాచ ద్వారా జ్ఞానమును ఇవ్వండి మరియు కర్మణ ద్వారా గుణదానాన్ని ఇవ్వండి. బ్రహ్మాబాబా అంతిమంలో మూడు మాటలను అందరికీ కానుకగా ఇచ్చారు. గుర్తుంది కదా! ఈ మూడు పదాలను ఒకవేళ సేవలో వినియోగించినట్లయితే అనేక ఆత్మలను సంతుష్టపరచగలరు. ఆ మూడు పదాలు - నిరాకారి, నిరహంకారి మరియు నిర్వికారి. మనసు ద్వారా నిరాకారి, వాచ ద్వారా నిరహంకారి మరియు కర్మణ ద్వారా నిర్వికారి. ఈ మూడు పదాలను సేవలో వినియోగించండి. ఇప్పుడు విశ్వానికి మీ శక్తి ద్వారా కొంచెం హృదయపూర్వక ఆనందము, సుఖము యొక్క ప్రాప్తి జరగాలి, అందరూ నిరాశతో ఉన్నారు మరియు మీరు విశ్వానికి ఆశా సితారలు. బాప్ దాదా పిల్లలందరినీ బాబా యొక్క ఆశా సితారలుగా చూస్తారు. కేవలం నమ్మకమైన సితారలుగా కాదు, ఆశలను పూర్తి చేసే ఆశా సితారలుగా చూస్తారు. 

           బాప్ దాదా వద్దకు పిల్లల స్నేహము సదా చేరుకుంటుంది. అన్నింటికన్నా సహజమైన పురుషార్థము ఏమిటి? భిన్న భిన్న పురుషార్థాలు ఉన్నాయి, కానీ అన్నిటికన్నా సహజమైన పురుషార్థము - స్నేహము. స్నేహములో కష్టము కూడా ప్రేమగా మారిపోతుంది. బాబాకు స్నేహితునిగా కావడము అంటే సహజ పురుషార్థము చేయడము. మీరందరూ స్వయాన్ని స్నేహితునిగా భావిస్తున్నారా, అప్పడప్పుడూ కాదు, సదా స్నేహి, ఎవరైతే స్వయాన్ని సదా స్నేహ సాగరంలో ఇమిడి ఉన్నట్లుగా భావిస్తున్నారో, సదా మరియు స్నేహ సాగరంలో ఇమిడి ఉండాలి, మునిగి లేచేవారు కాదు, మునిగి ఉండేవారిగా ఉండాలి. స్నేహ సాగరంలో ఇమిడి ఉన్నాము అని భావిస్తున్నారా, అలా స్వయాన్ని భావించుకునేవారు చేతులెత్తండి. సదా? సదా అన్న పదమును అండర్‌లైన్ చెయ్యండి. చేతులెత్తండి, సదా, సదా? చేతులైతే బాగా ఎత్తుతారు. చేతులను చూసి బాప్ దాదా సంతోషిస్తారు, ఎందుకంటే ధైర్యమును ఉంచుతారు. ఒకవేళ తక్కువైనా చేతులెత్తాము అని గుర్తుకు వస్తుంది. ఎందుకంటే బాప్ దాదాకు పిల్లలు ఒక్కొక్కరిపై అతి స్నేహము ఉంది. ఎందుకని? ఎందుకంటే ఈ ఒక్కొక్క ఆత్మ అనేక సార్లు స్నేహిగా అయింది, ఇప్పుడు కూడా అవుతుంది మరియు ప్రతి కల్పము ఈ ఆత్మలే స్నేహిగా అవుతాయి అని బాప్ దాదాకు  తెలుసు. మేమే ప్రతి కల్పమునకు అధికారి ఆత్మలము అన్న నషా ఉందా, సంతోషము ఉందా?

           బాప్ దాదా ఇటువంటి అధికారి ఆత్మలను చూసి హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు. సదా అలసటనెరుగక ఎగురుతూ ఉండండి. ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే స్వస్థితిని అలజడి చేసుకోవద్దు. స్వ స్థితి ముందు పరిస్థితి ఏమీ చెయ్యలేదు. అచ్ఛా! మొదటిసారి ఎవరు వచ్చారు? వారు చేతులెత్తండి. చాలామంది వస్తున్నారు. బాప్ దాదాకు పిల్లలు ఒక్కొక్కరిని చూసి చాలా గర్వంగా ఉంటుంది, ఓహో నా పిల్లలు ఓహో! ఎలా అయితే మీరు స్వతహాగా హృదయంలో ఓహో బాబా ఓహో! నా బాబా ఓహో! అని గీతమును పాడుతారో అలాగే బాబా కూడా పిల్లల కోసం ఓహో ప్రతి ఒక్క పిల్లలు ఓహో! అని గానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే బాబాకు కూడా కల్పం తర్వాత పిల్లలైన మీరు లభిస్తారు, ఒక్కొక్కరు విశ్వం ఎదుట మహాన్ గా ఉన్నారు. కావున బాబా కూడా ఓహో పిల్లలు ఓహో! అని గానం చేస్తూ ఉంటారు. వాహ్ (ఓహో) వాహ్ కదా! వాహ్! వాహ్! పిల్లలు కదా! వాహ్! వాహ్! పిల్లలు, చేతులెత్తండి.

           మేము వాహ్ వాహ్ పిల్లలము అని సదా గుర్తుంచుకోండి. పురుషార్థులే కావచ్చు, కానీ వాహ్ వాహ్ పిల్లలు బాబాకు చెందిన వాహ్ వాహ్ పిల్లలు బాబాతోటే వెళ్తారు, ఉండిపోరు కదా! పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహపు ఒడిలో తోడుగా తీసుకువెళ్తాము అని బాబా అంటారు. మరి సిద్ధంగా ఉన్నారా! సిద్ధంగా ఉన్నారా? దారిలో ఆగిపోరు కదా? తోడుగా వెళతారు, ఎందుకంటే ప్రతిజ్ఞ ఉంది, మీరు ప్రతిజ్ఞను పాటించేవారు కదా!

           ఇప్పుడు మీ ఫరిస్తా రూపాన్ని మీరు ఇమర్జ్ చేసుకోవాలని బాప్ దాదా కోరుకుంటున్నారు. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా డ్రస్సు కలవారిగా అనుభవం చేయించండి. బాప్ దాదా డ్రిల్ ను గూర్చి వినిపించారు కదా. వస్త్రాన్ని మార్చుకునే అలవాటైతే ఉంది కదా! ఎలా అయితే శరీరపు డ్రస్సును మారుస్తారో అలాగే ఆత్మ స్వరూపమైన ఫరిస్తాను పదే పదే అనుభవం చేసుకోండి. ఫరిస్తా డ్రస్సు ఇష్టమే కదా! ఎలా అయితే బ్రహ్మాబాబా అవ్యక్త ఫరిస్తా రూపంలో వతనంలో కూర్చుని ఉన్నారో అలాగే తండ్రి సమానంగా మీరందరూ కూడా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా రూపంలో అనుభవం చేసుకోండి. ఎందుకంటే ఫరిస్తా రూపము ఉంటేనే దేవతగా అవుతారు. ఎలా అయితే బాబా యొక్క మూడు రూపాలైన - తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు గుర్తుంటాయో- అలాగే మీ మూడు రూపాలను కూడా గుర్తుంచుకోండి - బ్రాహ్మణుల నుండి ఫరిస్తా మరియు ఫరిస్తా నుండి దేవత. ఈ మూడు రూపాలు పక్కాగా ఉన్నాయి కదా! ఒకసారి బ్రాహ్మణ డ్రస్సును ధరించండి, ఒకసారి ఫరిస్తా, మరోసారి దేవత డ్రస్సును ధరించండి. ఈ మూడు రూపాలతో ఉంటే త్రికాలదర్శి సీట్లో కూర్చుని, సాక్షిగా అయి ప్రతి కార్యాన్ని స్వతహాగా చేస్తూ ఉంటారు. కావున సదా బాబాతో ఉండండి, ఒంటరిగా ఉండద్దు అని బాప్ దాదా అందరినుండి ఆశిస్తున్నారు. తోడుగా ఉన్నప్పుడే తోడుగా వెళ్తారు. ఒకవేళ ఇప్పుడు అప్పుడప్పుడు ఉన్నట్లయితే తోడుగా ఎలా వెళ్ళగలరు! స్నేహితుడు, స్నేహితుడిని ఎప్పుడూ మర్చిపోలేడు. రోజంతటిలో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. ఇప్పుడే బ్రాహ్మణులుగా, ఇప్పుడే ఫరిస్తాలుగా, ఇప్పుడే దేవతలుగా. అచ్ఛా!

           నలువైపుల ఉన్న పిల్లలందరికీ ఎవరైతే సదా ఖజానాలతో సంపన్నంగా ఉన్నారో, సదా తమ నడవడిక మరియు ముఖముతో సేవాధారిగా ఉన్నారో, వారికి ఎందుకంటే మేము విశ్వ పరివర్తకులుగా అయి విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని మీ అందరూ ప్రతిజ్ఞ చేసారు, కావున నడుస్తూ తిరుగుతూ కూడా సేవలో తత్పరులై ఉంటారు. ఇటువంటి విశ్వ సేవాధారి, విశ్వ పరివర్తకులైన పిల్లలు ప్రతి ఒక్కరినీ, తండ్రి ఖజానాలతో నిండుగా చేసే నలువైపుల ఉన్న బాప్ దాదాల పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు, హృదయపూర్వక దీవెనలు మరియు నమస్తే. అచ్ఛా!

*సేవా టర్ను మహారాష్ట్ర జోనువారిది:-* (అందరూ నో ప్రాబ్లమ్ అన్న కిరీటాన్ని ధరించి ఉన్నారు) అందరూ తమపై కిరీటాన్ని పెట్టుకుని మంచి పని చేసారు. ఎలా అయితే నో ప్రాబ్లమ్ అన్న కిరీటాన్ని ధరించారో అందరి తరఫున సదా నో ప్రాబ్లమ్ భవ అన్న ఆశీర్వాదాన్ని బాప్ దాదా ఇస్తున్నారు. ఇలాగే మనసు-వాణి-కర్మలలో సంగఠనలో సదా నో ప్రాబ్లమ్ వారిగా ఉండండి. ప్రాబ్లమ్ క్షణంలో పరివర్తన అయిపోవాలి. ప్రాబ్లమ్ రూపంలో వచ్చి సంపన్న స్వరూపంలోకి మారిపోవాలి. బాగుంది, దృశ్యం ఎంత బాగుందో చూసారా! సంకల్పము మరియు శ్వాసలో నో ప్రాబ్లమ్. ఎవరైతే కిరీటధారిగా అయ్యారో వారికి అందరి తరఫున అభినందనలు, చప్పట్లు కొట్టండి. అందరూ పెద్ద స్క్రీన్‌పై చూడండి, ఎంత చక్కగా ఉందో చూడండి. బాప్ దాదా నో ప్రాబ్లమ్ అని సంకల్పం చేసినవారికి అనగా బాబా సమానంగా సదా ఉంటాము అన్నారు కాబట్టి బాప్ దాదా పదమారెట్లు అభినందనలు ఇస్తున్నారు. అచ్ఛా! పేరే మహారాష్ట్ర, మహారాష్ట్ర అనగా మహాన్ స్వరూపం ద్వారా మహాన్ సేవను చేసేవారు. ఇప్పుడు మహారాష్ట్ర పెద్ద ప్రోగ్రాము ఏమీ చెయ్యలేదు, ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్ చేసి మహాన్ సేవను చేసే పాత్ర పోషించి చాలా సమయము అయింది, బాప్ దాదాకు గుర్తుంది, మహారాష్ట్ర ప్రదర్శని మొదలుపెట్టే మంచి పాత్రను పోషించారు. ఇప్పటిదాకా ప్రదర్శని ద్వారా సేవ జరుగుతూ ఉంది. ఎలా అయితే ఈ విశేషమైన బిడ్డ రమేష్ భాయి నిమిత్తమయ్యారో, నిమిత్తమయ్యారు ఇప్పటివరకూ అది స్మృతిచిహ్నముగా ఉంది. ఇటువంటి ఏదైనా ఇన్వెన్షన్ ను ఇప్పుడు మహారాష్ట్ర చెయ్యాలి. చెయ్యాలా? ఏదైనా క్రొత్త విషయము చెయ్యండి. ఎలా అయితే ఢిల్లీవారు ధైర్యమునుంచారో, అలా అందరికీ సందేశమును ఇవ్వాలి. పెద్ద మైదానంలో సందేశాన్ని ఇవ్వండి. వార్తాపత్రికల ద్వారా కావచ్చు, టి.వి ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు సందేశాన్ని ఇవ్వవలసిందే. ఫిర్యాదు రాకూడదు. ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉండండి ఎందుకంటే ఆధ్యాత్మికత అవసరము అని విశ్వాత్మలు భావిస్తున్నాయి. కానీ పాపం వారికి సాధనము తెలియదు. ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేవారెవ్వరూ లభించలేదు. అందుకే ప్రతి జోను వారు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మధువనంలో ఎలా అయితే ఏదో ఒక ప్రోగ్రాము జరుగుతూ ఉంటుందో, అలా ఏదో ఒక ప్రోగ్రాము జరుగుతూ ఉండాలి. బ్రాహ్మణుల ప్రోగ్రాము కావచ్చు, సందేశమును ఇచ్చే ప్రోగ్రాము కావచ్చు, తమ ఉన్నతికి క్రొత్త క్రొత్త ప్రోగ్రాములు కావచ్చు ఎందుకంటే ఏదైనా క్రొత్త ప్రోగ్రాము వస్తే దేశ విదేశాల వారు ఎంతో అభిరుచితో చేయడం బాప్ దాదా చూసారు.

           బాగుంది. చేస్తూ ఉంటారు మరియు చేస్తూ ఉండండి. అచ్ఛా! ఇప్పుడు ఏదైనా కొత్త ప్లానును తయారు చేస్తారు కదా? ఎంత సమయంలో చేస్తారు? తయారు చెయ్యడానికి ఎన్ని మాసాలు కావాలి? పరస్పరంలో మీటింగ్ చేసుకోండి, తారీఖును ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఢిల్లీ మరియు బాంబే రెండు స్థానాలలో మంచి మంచి మహారధులు సర్వీసబుల్ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ప్రతి జోనులోనూ సర్వీసబుల్ పిల్లలు పెరుగుతూ ఉండటం చూస్తున్నాము. సేవా ప్లాన్లను చేసే అథారిటీలు చాలామంది ఉన్నారు. చిన్న జోను కావచ్చు, పెద్దది కావచ్చు కానీ సర్వీసబుల్ గా అయ్యారు అందుకే ఇప్పుడు సందడి చేయండి. ఒక ప్రోగ్రాము ఎలా చెయ్యండంటే అన్ని జోన్లలో ఒకేసారి అది జరగాలి, దీనితోపాటు మీడియా ద్వారా అనౌన్సు కావాలి, ఫలానా ఫలానా స్థానంలో ఒకే ప్రోగ్రాము జరుగుతోంది, ప్రతి ఒక్క జోనులో మరియు వార్తాపత్రికల్లో ఈ ఈ స్థానాలలో ప్రోగ్రాము జరుగుతుంది అని వేయాలి. అన్ని స్థానాల అడ్రస్సులు మరియు టాపిక్, టాపిక్ ఒకటే ఉండాలి. ఒకే సమయము ఉండాలి, ఒకే టాపిక్ ఉండాలి, ఎక్కడకు వెళ్ళినా ఒకే టాపిక్ కనిపించాలి. ఇది వీలవుతుంది కదా! వీలవుతుందా? విదేశాలలో కూడా ఇదే తారీఖున ఇదే ప్రోగ్రాము. అంటే నలువైపుల ఒక్కటే ఉండాలి. (ఈ సంవత్సరం కూడా పరమాత్మ వరదానాలను ప్రాప్తి చేసుకోవడము అన్న థీమ్ ను పెట్టుకోవడము జరిగింది) ఈ టాపిక్ బాగుంది, ఏదైనా పరస్పరంలో ఫైనల్ చేసుకోండి. పరస్పరం కలిసి తారీఖు, టాపిక్ మరియు ఎడ్వర్ టైజ్ ఎలా చెయ్యాలి, ఇది తయారుచేసి ఇవ్వండి. ఏ టాపిక్ ను పెట్టుకున్నా, అది ముందునుండే బాప్ దాదాకు ఇష్టము. బాగుంది, ఎందుకంటే ఇప్పుడు ఇష్టముతో ఉన్నారు. ఒకప్పుడు వింటే దూరంగా పారిపోయేవారు, ఇప్పుడు ఏదైనా వినాలని ఆశిస్తున్నారు. వి.ఐ.పిలు కూడా శ్రద్ధ చూపిస్తారు. ఇప్పుడు ఒకే మాట వ్యాపించాలి. నలువైపుల ఎక్కడకు వెళ్ళినా ఇదే వినిపించాలి. అచ్ఛా! బావుంది, నలువైపులా వృద్ధి కూడా బాగా జరుగుతూ ఉండటం కనిపిస్తుంది, బ్రాహ్మణులు పెరుగుతున్నారు. ఇప్పుడు నంబరువారీగా ఉన్నారు, కానీ నంబరువన్ గా కావాలని బాప్ దాదా కోరుకుంటున్నారు. నంబరు వారీగా కాదు, నంబరువన్. బాగుంది. మహారాష్ట్ర ఏదైనా కొత్త ఇన్వెన్షన్ చేసి సేవలో నవీనత వ్యాప్తి చేస్తుంది. బాగుంది. బాప్ దాదాకు చాలా చాలా మహారథి సర్వీసబుల్ పిల్లలు కనిపిస్తున్నారు. టీచర్లు కూడా మంచి అంచనాతో తమ తమ సేవా కేంద్రాలను సంభాళిస్తున్నారు, ఇందుకు అభినందనలు మరియు పదమారెట్లు బాప్ దాదా ఆశీర్వాదాలను ఇస్తున్నారు. అచ్ఛా!

*ధార్మిక వింగ్, స్పోర్ట్స్ వింగ్:-* అచ్ఛా! వీరు జెండా ఊపుతున్నారు. బాగుంది. ఇప్పుడు ఆటలవారు ఆటలోనే సందేశమును ఇవ్వగలిగే ఆటను తయారుచెయ్యండి. ఎలా అయితే ఈ మధ్యలో ఇండియా ఆటలలో నంబరు తీసుకుంటోందో, అలాగే ఆధ్యాత్మిక ఆటలను ఎలా కనుగొనాలంటే- ఉదాహరణకు అమెరికాలో గాలిపటాలు ఎగురవేసే రూపంలో మంచి సేవ జరిగింది అని సమాచారము వచ్చింది, ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఈ విధితో అందరికీ సందేశము అందాలని ఆశిస్తుంది. ఇలాగే ఇటువంటి ఆటనేదైనా తయారు చెయ్యండి, దీని ద్వారా నలువైపుల ఆట ద్వారా సందేశం లభించాలి. అర్థమయిందా! ఇటువంటి ఆటను తయారు చెయ్యండి.

           ఈ రోజుల్లో ఇండియాలో ట్రాన్స్ పోర్టు స్థితి చాలా చెడుగా ఉంది, రోజూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలనుండి ఎలా జాగ్రత్తపడాలి, నడిపించేవారు జాగ్రత్తగా ఉండే విధంగా ఏదైనా తయారు చెయ్యండి. ఏదైనా ఒక విధిని తయారుచెయ్యండి, ఆ విధిని నేర్పించడం ద్వారా, వినిపించడం ద్వారా వారి మనసు శీతలమై, ఏకాగ్రం కావాలి. దీనిని కొంచెం విస్తారం చేసి నలువైపుల సేవను చెయ్యాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో దీని ఆవశ్యకత ఉంది. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇలా పెరిగే కార్యాన్ని పరివర్తన చేసి ప్రాక్టికల్ స్వరూపాన్ని ప్రభుత్వానికి చూపించండి. ఈ కార్యం చేయడం ద్వారా ఎటువంటి తేడా కనిపించింది అని చూపించండి. ఈ రోజుల్లో ప్రాక్టికల్ గా చూడాలని ఆశిస్తున్నారు. మరి ఇప్పుడు ఎటువంటి గ్రూపును తయారు చెయ్యలంటే నడిపించే డ్రైవర్లు అటువంటి కర్తవ్యమునేదైనా చేసి చూపించాలి. ప్రభుత్వం ముందు ఇటువంటి ఉదాహరణను చేసి చూపించండి. అప్పుడే అందరి అటెన్షన్ వెళ్తుంది. కోర్సును చేయిస్తారు, ప్రోగ్రాము కూడా చేస్తారు కానీ ఎటువంటి గ్రూపును తయారు చెయ్యండంటే యాక్సిడెంట్ ను చేసేవారు పరివర్తన కావాలి. ఎలా అయితే మద్యం త్రాగేవారిని మార్చి చూపిస్తారు కదా, అలాగే యాక్సిడెంట్ చేసేవారు పరివర్తన అయి చూపించాలి, ఇటువంటి గ్రూపును ప్రభుత్వం ముందుకు తీసుకురండి. గ్రామీణ వింగ్ వారు కూరగాయలు మొదలైనవి పండించేటప్పుడు అందులో చెడు వస్తువులు(హానికారకమైన మందులు మరియు ఎరువులు మొదలైనవి) వెయ్యకుండా యోగబలం ద్వారా కూరగాయలను తయారుచేస్తూ ఉండటం బాప్ దాదా చూసారు, అలాగే ప్రభుత్వానికి కూడా ఉదాహరణను చూపిస్తున్నారు. ఇక్కడ ఆబూలో కూడా ఈ అభ్యాసము చేసారని బాప్ దాదా విన్నారు, ఇటువంటి ప్రమాణాలను ప్రభుత్వానికి చూపించాలి. ప్రభుత్వానికి ఉన్న సమస్యలో వారికి సహయోగము లభించాలి, లాభము కలగాలి. ఇలా ప్రతి ఒక్క వింగ్ ప్రాక్టికల్ ప్రమాణమును తయారు చెయ్యండి. ఇలా జరుగుతుంది అని వింటాము, కానీ ఇటువంటి ప్రాక్టికల్ ప్రమాణముగా ఉన్న గ్రూపును ప్రభుత్వం ముందుకు తీసుకురండి. ప్రతి వర్గంవారు మంచి సేవను చేసారు, సేవలో వృద్ధి జరిగింది, అందరూ బిజీ అయిపోయారు, కానీ ఇప్పుడు ప్రభుత్వంలోని ప్రతి డిపార్టుమెంటుకు ప్రమాణమును చూపించాలని బాప్ దాదా ఆశిస్తున్నారు. ఒక్కొక్క మినిస్ట్రీలో ఏదో ఒక ప్రమాణము ఉండాలి. ఎలా అయితే హార్ట్ కు సంబంధించి ప్రమాణము ఉంది కదా. కొందరి హార్ట్ లు ఆపరేషన్ లేకుండానే, మందులు లేకుండానే మంచిగా అయ్యాయి. ఇలా ప్రతి వర్గంవారు తమ ప్రమాణమును చూపించండి. అచ్ఛా. ఇటువంటి ఆటను తయారుచెయ్యండి. బాప్ దాదా కూడా చూస్తారు.

           ఇటువంటి గ్రూపును తయారుచేసి బాబా ఎదుట ఏ వర్గంవారు రిపోర్టు చేస్తారో చూద్దాము. ప్రతి ఒక్క మినిస్ట్రీలో ఇది ఉండాలి. ఒకవేళ ఒక్కొక్క మినిస్ట్రీలో ప్రమాణము ఉన్నట్లయితే స్వతహాగా ఈ వార్త ఒకరి ద్వారా మరొకరికి చేరుతుంది. ప్రభుత్వం దగ్గర ప్రతి ఒక్క డిపార్టుమెంట్ లో సేవకోసం డబ్బులు కూడా చాలా ఉన్నాయి, కానీ ప్రాక్టికల్ లో ఉపయోగపడవు. సహయోగమును ఇవ్వగలరు, కానీ ప్రమాణము కావాలి. ఎలా అయితే గ్రామీణ వింగ్ వారికి ప్రభుత్వం సహాయం చేసి సాల్వేషన్ ను ఇచ్చిందో అలాగే ప్రతి వర్గంవారు ఇలా చేసి చూపించాలి. రెండు, నాలుగు గ్రామాలనైతే తయారు చేసారు కదా, అచ్ఛా!

Comments