18-01-2009 అవ్యక్త మురళి

                       18-01-2009         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

  “40 సంవత్సరముల అవ్యక్త పాలనకు రిటర్ను- నాలుగు విషయాలు- శుభ      చింతకులుగా అవ్వండి, శుభ చింతన చెయ్యండి, శుభ వృత్తి ద్వారా శుభ           వాయుమండలమును తయారుచెయ్యండి మరియు జీరో(0)-హీరోల స్మృతిలో ఉండండి.”

        ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ సేవా సహచరులైన పిల్లలను కలిసేందుకు వచ్చారు. ఆది సమయములోని సేవా సహచరులు మరియు ఇంకా ఇతర సేవా సహచరులు తయారై సేవా వృద్ధిని చాలా మంచిగా చేస్తున్నారు, కావున బాప్ దాదా తమ సహచరులను చూసి సంతోషిస్తున్నారు మరియు హృదయములో ఓహో! నా విశ్వ పరివర్తక సేవా సహచరులారా ఓహో! అని గానము చేస్తున్నారు. ఈ రోజు అమృతవేళనుండి నలువైపులా స్నేహ మాలలను బాప్ దాదాకు వేస్తున్నారు. మూడు రకాల మాలలు ఉన్నాయి. ఒకటి- తండ్రి సమానంగా అయ్యేందుకు ఉల్లాస-ఉత్సాహాల మాల, రెండు- ఎంతో తప్పిపోయిన, బంధనములుగల బంధేలీ గోపికల మాల, వారి మాల అయితే ఉంది కానీ, మెరుస్తూ ఉన్న అతి అమూల్యమైన అశ్రువుల మాలకూడా ఉంది. ఒక్కొక్క అశ్రు బిందువు ముత్యమువలె ప్రకాశిస్తూ ఉంది మరియు మూడవ మాల- కొంతమంది పిల్లల ఫిర్యాదుల మాల.

           ఈ రోజు అమృతవేళనుండీ అందరిలో విశేష స్నేహము నిండి ఉండటము కనిపిస్తూ ఉంది. బాప్ దాదా విరాటరూపమువలె బాహువులను విస్తరింపచేసి పిల్లలందరినీ తమ బాహువులలో ఇముడ్చుకున్నారు. ఈరోజు స్నేహముతోపాటుగా అన్ని శక్తుల విల్లును ఇచ్చే రోజుకూడా, ఒక బిడ్డకు చేతిలో చెయ్యివేసి, విల్ పవర్స్ యొక్క విల్ ను పిల్లలందరికీ శక్తిసేన మరియు పాండవులకు ఇచ్చారు, కొంతమంది పాండవులు కూడా మరియు శక్తులు కూడా గుప్త రూపములో అంతర్ముఖులుగా అయ్యి పురుషార్ధములో తీవ్రగతిలో వెళ్తూ ఉండటమును బాప్ దాదా చూసారు. పైకి కనిపించకపోయినా కానీ మంచి పురుషార్థులుగా ఉన్నారు. ఈనాటి విశేష రూపమైన స్నేహమనే సబ్జెక్టు అందరి ముఖాలను ప్రకాశింపజేస్తోంది. పిల్లలు జ్ఞానీ ఆత్మలుగా అయితే ఉన్నారు కానీ స్నేహమనే సబ్జెక్టు ఎంతో అవసరము. ఎందుకంటే స్నేహులు శ్రమలో తక్కువగా మరియు ప్రేమ అనుభవములో సహజముగా ఉంటారు.స్నేహ శక్తి పర్వతములాంటి ఎటువంటి సమస్యనయినా, పర్వతమునుకూడా దూదిలా చేసేస్తుంది. పర్వతమునుకూడా నీరులా తేలికగా చేసేస్తుంది. స్నేహము ఛత్రఛాయ వంటిది. ఛత్రఛాయ కారణంగా వారు సదా సురక్షితముగా ఉంటారు. సహజమౌతుంది. స్నేహముద్వారా పరమాత్మ లేక భగవంతుడినికూడా తన స్నేహితునిగా చేసేసుకుంటారు. ఖుదా దోస్త్ అన్న స్మతి చిహ్నము ఉంది. ఖుదాను(భగవంతుడిని) దోస్త్ గా (స్నేహితునిగా) చేసుకొని ఎటువంటి సమస్యనయినా స్నేహ సంబంధము ద్వారా సహజము చేసేసుకుంటారు. తండ్రిని తమ సహచరునిగా తయారుచేసుకుంటారు. జ్ఞానము బీజము, కానీ ప్రేమ అనే నీరు బీజముద్వారా ఫలాలను ఇస్తుంది, ప్రాప్తి ఫలాలు. కావున తండ్రికి స్నేహులైన అటువంటి పిల్లలు తండ్రిని స్మృతి చెయ్యటమును కష్టముగా భావించరు కానీ మర్చిపోవటమును కష్టముగా భావిస్తారు. స్నేహులు ఎప్పుడూ స్నేహమును మర్చిపోజాలరు. నా బాబా అని అనగానే, హృదయపూర్వక స్నేహముద్వారా మిగిలిన అన్ని ఖజానాల తాళపు చెవి లభించేస్తుంది. కావున బాప్ దాదా లిరువురూ అటువంటి స్నేహుల ముందు హజూర్ హాజిర్ అయిపోతారు. స్మృతినైతే అందరూ చేస్తారు కానీ, కొందరు కొద్ది కష్టముతో సృతి చేస్తారు మరియు కొందరు సదా స్నేహ సాగరములో లవలీనులై పోతారు. ప్రపంచములోని వారు ఆత్మపరమాత్మలో లీనమయిపోతుంది అని అంటారు, కానీ ఆత్మ పరమాత్మ ప్రేమలో లవలీనమయిపోతుంది. లీనమవ్వరు కానీ లవలీనులౌతారు.

           మరి ఈ రోజు ప్రేమలో లవలీనమయ్యే రోజు. కష్టము సమాప్తమై ప్రేమ రూపములోకి మారిపోతుంది. బాప్ దాదా పిల్లలందరి రిజల్టును కూడా చూసారు, మెజారిటీ వారు హోమ్ వర్కును చేసారు. తండ్రి సమానంగా అయ్యే లక్ష్యమును పదే పదే రివైజ్ కూడా చేసారు, రియలైజ్ కూడా చేసారు. 75 శాతం పిల్లల రిజల్టు మంచిగా ఉంది. మరియు తండ్రి సమానంగా అయితే అవ్వవలసిందే, ఎటువంటి తుఫానులు వచ్చినాగానీ, ఉన్నదే కలియుగ సమాప్తి సమయము, కావున తుఫానులైతే తప్పక వస్తాయి. పరివర్తన సమయము కదా, కానీ పిల్లలైన మీకొరకు తుఫానెంత! తుఫాను తుఫాను కాదు కానీ తోఫా(కానుక) ఎందుకంటే బాప్ దాదాల వరదానీ హస్తము పురుషార్ధీ పిల్లలందరి మస్తకముపై ఉంది. ఎవరైతే దృఢ సంకల్పమును చేసారో అనగా దృఢత్వమనే తాళపుచెవిని కార్యములో వినియోగించారో వారికి ఇప్పటి రిజల్టు ప్రమాణంగా సఫలతకూడా ప్రాప్తించింది, కానీ సదాకాలమునకు తుఫానునుకూడా కానుకగా చేసుకొని, సమస్యకు సమాధాన రూపమునిచ్చి ముందుకు వెళ్తూ ఉండండి. కావున బాప్ దాదా ఇప్పటి రిజల్టుకు సంతోషించారు. ఎవరైతే యోగ తపస్సును చేశారో వారిలో తయారవ్వాల్సిందే అన్న లక్ష్యమును దృఢంగా ఉంచారు.

           40 సంవత్సరముల అవ్యక్త పాలన పూర్తయ్యింది. మరి 40 సంవత్సరములలో మొదట ఏమొస్తుంది - బిందువు, జీరో. నేను హీరోను, సత్యమైన హీరోను, గొప్ప హీరోను మరియు హీరో పాత్రధారిగా అయ్మి ప్రతి కార్యమును హీరో సమానంగా చెయ్యాలి అని జీరో స్మృతినిప్పిస్తుంది. కావున జీరో, హీరో- ఇవి సదా గుర్తుండాలి. మిగిలిన నాలుగు ఏవైతే ఉన్నాయో, వాటిలో నాలుగు విషయాలు నేచురల్ గా జీవితములో చెయ్యాలి, దృఢతాపూర్వకముగా చెయ్యాలి, చేస్తారా? సిద్ధముగా ఉన్నారా? ఎటువంటి పేపరు వచ్చినాగానీ నాలుగు విషయాలను మీ జీవితములో చెయ్యాల్సిందే. పక్కా? పక్కా? వెనుక ఉన్నవారు, పక్కాయే కదా? కచ్చాగా (అపరిపక్వంగా) ఉన్నవారిని మాయ తినేస్తుంది, కావున పక్కాగా ఉండండి. మొదటి విషయము - సదా శుభచింతకులు, ఎవరి బలహీనతను చూసినా లేక విన్నా దయాహృదయులై, శుభచింతకులై వారికి సహయోగమును ఇవ్వవలసిందే. బలహీనతను చూడకూడదు కానీ సహయోగమునైతే ఇవ్వవలసిందే. ఇటువంటివారినే శుభచింతకులు అని అంటారు. దృఢంగా ఉంటారు కదా! ఆధారమునిచ్చే దాతలుగా, దయాహృదయులై సహయోగమునివ్వండి. వారినుండి దూరంగా తొలగటము లేక అసహ్యించుకోవటము చెయ్యకూడదు. క్షమించాలి, పరవశులపై ఎప్పుడూ అసహ్యించుకోకూడదు, వారిని క్షమించాలి. ఆధారమునివ్వాలి. కావున శుభచింతకులుగా అవ్వాలి మరియు రెండవది శుభచింతన. మెజారిటీ పిల్లలలో ఈమధ్య అప్పుడప్పుడు చాలా వ్యర్ధ సంకల్పాలు కలుగుతూ ఉండటమును బాప్ దాదా గమనించారు. జమ చేసుకొన్న తమ శక్తులన్నీ ఈ వ్యర్ధ సంకల్పాలలో వ్యర్థముగా పోతాయి. కావున శుభచింతనతో కూడిన, స్వమానముతోకూడిన ఏదో ఒక టైటిల్ ను మనస్సుకు హోమ్ వర్కుగా ఇవ్వండి, మనస్సుకు టైమ్ టేబుల్ ను తయారు చెయ్యండి, కర్మకు చెందిన టైమ్ టేబుల్ ను చేస్తారు. కానీ మనస్సుకు టైమ్ టేబుల్ ను తయారుచెయ్యండి. అమృతవేళ మిలనము చేసిన తరువాత మనస్సుకు స్వమానమును ఇవ్వండి. ముందు వినిపించినట్లుగా 12-13 సార్లు అయితే అందరికీ సమయము లభిస్తుంది, అందులో రియలైజ్ కూడా, రివైజ్ కూడా చేసినట్లయితే మనస్సు బిజీగా ఉండటం వలన వ్యర్ధ సంకల్పాలలో సమయము పోదు, శ్రమ పడవలసిన అవసరము ఉండదు, ప్రతి సమయము, సంగమయుగపు ఆనందాల యుగము ఏదైతే ఉందో ఆ ఆనందములో ఉంటారు. కావున శుభచింతన రెండవదిగా వినిపించాము. చెక్ (పరిశీలన) చేసుకోండి మరియు ఛేంజ్ (పరివర్తన) అవ్వండి. మూడవది- శుభ వృత్తి. అశుభ వృత్తి వాయుమండలములోకూడా అశుద్ధను వ్యాపింపచేస్తుంది కావున శుభ వృత్తి, నాలుగవది- నేను ఇతరులను చూడకూడదు, ముఖ్యంగా నా పని- శుభ వాయుమండలమును తయారుచెయ్యటము అన్న ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఎప్పుడైనా వాయుమండలములో దుర్గంధము ఉన్నట్లయితే ఏం చేస్తారు? సుగంధాన్ని వ్యాపింపచేస్తారు కదా! దుర్గంధమును సహించలేరు, సుగంధాన్నిచ్చే ఏదో ఒక సాధనాన్ని వాడుతారు. అలా సాధారణ వాయుమండలము లేక అశుభ వాయుమండలము మారవలసిందే. చిన్నవారైనా కానీ, క్రొత్తవారైనా గానీ ఇది అందరి బాధ్యత. నేను శుభ వాయుమండలమును తయారు చెయ్యవలసిందే అన్న దృఢ సంకల్పమును చెయ్యాలి. ఈ ప్రతిజ్ఞ ప్రత్యక్షతను చేస్తుంది. ప్రతిజ్ఞ చేస్తారు, బాప్ దాదా సంతోషిస్తారు. కానీ ప్రతిజ్ఞలో అప్పుడప్పుడు దృఢత ఉండదు, అందువలన సఫలతనేదైతే కోరుకుంటారో, ఎంతయితే కోరుకుంటారో అంత లభించదు. మొత్తము విశ్వముయొక్క, ప్రకృతియొక్క, ఆత్మల యొక్క..... ఆత్మలలో బ్రాహ్మణ ఆత్మలు కూడా వచ్చేస్తారు, ప్రతి ఒక్కరూ తమ సేవాస్థానాల వాయుమండలమును అలా దృఢత్వముతో తయారు చెయ్యండి. కొంత త్యాగము చెయ్యవలసి వస్తే చెయ్యండి, వారు త్యాగము చేసినట్లయితే నేను చేస్తాను, అలా కాదు. సిస్టమ్ (పద్ధతి) సరిగ్గా ఉన్నట్లయితే.....తే, తే అని అనకండి. నేనైతే చెయ్యవలసిందే. విశ్వ పరివర్తక స్వమానము ఉంది కదా! అందరూ విశ్వ పరివర్తకులే కదా! చేతులెత్తండి. అచ్చా! విశ్వ పరివర్తకులు. చాలా మంచిది. మరి బాప్ దాదా దీనిని మొదట చూడాలనుకుంటున్నారు, ఉండి ఉండవచ్చుకూడా కానీ ఈ సంవత్సరములో చిన్న లేక పెద్ద సేవాకేంద్రాల పరిక్రమణ చేసినప్పుడు వాయుమండలము ఎలా ఉండాలి? ఈరోజు ఎలాగైతే స్నేహము మరియు శక్తిగల రోజుగా ఉందో అలా ప్రతి గ్రామములోని సెంటర్లు, పెద్ద సెంటర్ల వాయుమండలము చైతన్య మందిరమువలే ఉండాలి. నెగటివ్ ను పాజిటివ్ గా చెయ్యటము- ఇందులో మొదట నేను. మొదట మీరు అని అనకండి, మొదట నేను, ఎందుకంటే బాప్ దాదా, అడ్వాన్స్ పార్టీ మరియు ఇప్పటి ప్రకృతి కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. ఏర్పాట్లను చేసేవారు మీరు, మీరు ఎదురుచూడకూడదు, ఏర్పాట్లను చెయ్యాలి.

            నేడు నలువైపులా భయము వ్యాపించి ఉంది, ప్రపంచములోని మెజారిటీ వారిలో, ప్రతి ఒక్కరి మనసులో ఒక్కటే ఆలోచన - రేపు ఏమౌతుందో! రేపు ఏం జరుగుతుందో మీకు తెలుసా? కావున పరివర్తన చెయ్యటములో మొదటగా నేను నిమిత్తముగా అవుతాను, ఇటువంటి సంకల్పమును ఎవరు చేస్తారు? ఇందులో చెయ్యెత్తండి. చెయ్యవలసి ఉంటుంది. చెయ్యవలసి ఉంటుంది. మారవలసి ఉంటుంది. రక్షకులుగా అవ్వవలసి ఉంటుంది. కొంత వదలవలసి ఉంటుంది, ప్రేమను తీసుకోవలసి ఉంటుంది. మనస్సనే చేతిని ఎత్తారా లేక ఈ చేతిని ఎత్తారా! మనస్సనే చేతిని ఎవరు ఎత్తారు? ఎందుకంటే మనస్సు మారితే విశ్వము మారుతుంది. మరి ఈ సంవత్సరములో ఏ స్లోగను ఉంటుంది? ఏ స్లోగను ఉంటుంది? “నో ప్రాబ్లమ్" విజయ పతాకము మనస్సులో ఎగురుతుంది మరియు అందరూ సంతోషపు డ్యాన్సును సదా మనస్సు ద్వారా చేస్తారు, సంతోషమే మనస్సుతో చేసే డ్యాన్స్. కావున అన్నివేళలా సంతోషపు డ్యాన్సును చేస్తారు. మీరు దాత పిల్లలు, కావున ఎవరు వచ్చినాకానీ ప్రతి ఒక్కరికీ ఏదో ఒక గుణపు బహుమతిని ఇవ్వండి. కావున ఒక్క క్షణములో ఆ దృఢ సంకల్పము, దాత సంకల్పము లిఫ్టుగా అవుతుంది మరియు క్షణకాలములో పరంధామము, సూక్ష్మవతనము, స్థూల మధువనపు సాకార వతనము, ఎక్కడకు కావాలంటే అక్కడకు కష్టము లేకుండానే క్షణములో చేరుకుంటారు. ఎవరు ఎదురుగా వచ్చినాగానీ వారిని ఖాళీ చేతులతో పంపించకూడదు, ఏదో ఒక గుణపు, ముఖముద్వారా, నడవడిక ద్వారా, నోటిద్వారా గుణపు బహుమతి లేకుండా కలవకూడదు.

           మరి ఈ సంవత్సరపు ప్రతి మాసపు రిజల్టును మీవద్ద కూడా ఉంచుకోవాలి మరియు యజ్ఞములోని టీచరు ద్వారా ఓ.కె అన్న కార్డును పంపించాలి, పెద్ద లేఖను పంపవద్దు, ఓ.కె అన్న కార్డును పంపించాలి, కార్డుకూడా పెద్దది పంపవద్దు, ప్రపంచములో చలామణిలో ఉన్న కార్డు కాకుండా, టీచరుద్వారా వరదానపు కార్డు ఏదైతే లభిస్తుందో దానిని పంపాలి. గుణాల కానుకలు, శక్తుల కానుకలు ఎన్ని ఉన్నాయి! లిస్టును లెక్కించినట్లయితే ఎంత పెద్ద లిస్టు ఉంటుంది! మరియు ఎంతగా ఇస్తూ ఉంటారో అంత తక్కువగా అవ్వవు కానీ పెరుగుతూ ఉంటాయి. ఛూ మంత్రమని అంటుంటారు కదా, అలాగే ఈ శివ మంత్రముద్వారా ఎప్పుడూ ఏ గుణమూ మీనుండి తక్కువ అవ్వదు, ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే దానము ఇచ్చినట్లయితే గ్రహణము వదులుతుంది అన్న నానుడి ఉంది. అచ్ఛా!

           ఈసారి మొదటిసారిగా ఎవరైతే వచ్చారో వారు లేచి నిల్చోండి. మంచిది. (మధ్యప్రదేశ్ కు చెందిన గవర్నర్ ఎదురుగా కూర్చుని ఉన్నారు) ఈ సంగఠనలోకి విచ్చేసారు, మంచిది. బాప్ దాదా మీ అందరికీ, వచ్చేవారికి ఈ వరదానమును ఇస్తున్నారు - సదా తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు గుడ్ నైటును తప్పకుండా చెయ్యండి, ఎందుకంటే కళ్ళు తెరవటంతోనే మొట్టమొదటగా తండ్రిని చూసినట్లయితే మొత్తము రోజంతా మంచిగా ఉంటుంది. మొదటిసారి వచ్చే పిల్లలకు బాప్ దాదాల పదమాగుణ ప్రియస్మృతులు మరియు అభినందనలు. అచ్ఛా. ఇప్పటి టర్ను ఎవరిది?

*సేవా టర్ను ఇండోర్ జోన్ వారిది -* అచ్ఛా, గుర్తును మంచిగా ఉంచారు. ( అందరి చేతిలో కమల పుష్పము ఉంది) అచ్ఛా! వీరిని ఇండోర్ అని అన్నారు కదా, ఇండోర్ అంటే అర్థం ఏమిటి? ఇన్ డోర్ అనగా అంతర్ముఖి. ఈ గుర్తును ఏదైతే ఉంచారో, ఆ గుర్తు అనుసారంగా సదా కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉండండి. అంతర్ముఖీ సదా సుఖీ. అంతర్ముఖులు సదా తండ్రి హృదయ సింహాసనాధికారులు. అంతర్ముఖులు సదా సర్వులకు ప్రియముగా ఉంటారు. అచ్ఛా. ఎక్కువ మంది వచ్చారు, అభినందనలు. యజ్ఞ సేవపు సువర్ణ అవకాశము లభించటమన్నది చాలా గొప్ప పుణ్యమును జమ చేసుకోవటము. ప్రతి అడుగు యజ్ఞ సేవ చెయ్యటము అనగా తమ పుణ్య ఖాతాను జమ చేసుకోవటము. మరి ఈ 10-15 రోజులలో ప్రతి అడుగు సేవ చేసినట్లయితే ఎన్ని పదమాలు తయారయ్యాయి! యజ్ఞ సేవ చాలా గొప్ప సేవ. మరియు ఈ స్వర్ణిమ అవకాశమును తీసుకున్న ఏ జోన్ వారైనా చాలా చాలా ప్రేమతో సేవ చెయ్యటమును, రిజల్టు వెరీగుడిగా ఉండటము బాప్ దాదా చూసారు. మరి మీ అందరి రిజల్టుకూడా మంచిగా ఉంది మరియు ఇంకా చాలా మంచిగా ఉంటుంది. నేను ఎవరిని అన్న విషయమును ఇప్పుడు గుర్తు ఉంచుకోవాలి. కమలమును. కమలము నీటిలో ఉంటూ కూడా అతీతముగా ఉంటుంది. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా లేక ఎటువంటి వాయుమండలములో ఉన్నా, అతీతముగా మరియు ప్రియముగా ఉండాలి ఎందుకంటే సమయమైతే దుఃఖపు సమయముగా, భయము కలిగించేదిగా ఉంది కానీ మీ కొరకు సదా మనస్సులో సంతోషపు నగారా మ్రోగుతూ ఉంటుంది. సదా సంతోషంగా ఉంటారు కదా! చేతులెత్తండి. సంతోషమును వదలవద్దు, సంతోషము పోయినట్లయితే జీవితము ఎందుకూ పనికిరానిదవుతుంది, నీరసమైనా జీవితం మంచిగా ఉండదు. అందుకని సదా సంతోషంగా ఉండాలి, ఉండాలి కదా! అలాగే సంతోషాన్ని పంచాలి. పంచేంతగా మరియు సంతోషంగా ఉండేంతగా సంతోషము ఉందా? ఎందుకంటే తండ్రికి చెందిన బ్రాహ్మణ పిల్లలుగా అవ్వటము అనగా అదృష్టవంతులుగా అవ్వటము, భాగ్యశాలురుగా అవ్వటము. అదృష్టవంతులు అన్న మీ టైటిల్ ను సదా గుర్తు ఉంచుకోండి. ఎందుకంటే తండ్రి లభించారు అంటే సర్వ ప్రాప్తుల భండారము లభించినట్లు, భండారము నిండుగా ఉంది. అన్ని దు:ఖాలు దూరము అన్న నానుడి ఉంది, మరి ఏం చేస్తారు? సంతోషమే ఉంటుంది కదా! మంచి సేవను కూడా చేస్తున్నారు. సేవ చెయ్యటము అనగా వరదానములను ప్రాప్తి చేసుకోవటము. మరి సేవలో సఫలతామూర్తులు కదా! చేతులూపండి. టీచర్స్, సఫలతామూర్తులే కదా! సఫలత మా జన్మసిద్ధ అధికారము అని అనండి. అనండి- సఫలత మా మెడలోని హారము. అచ్ఛా!

*మెడికల్ వింగ్ -* మెడికల్ మరియు మెడిటేషన్ ఇద్దరి గ్రూపు ఉంది, ఎందుకంటే డబుల్ డాక్టర్లు కదా! మెడిటేషన్ ద్వారా తండ్రితో కలిపించటము మరియు మెడికల్ ద్వారా దుఃఖమును దూరము చెయ్యటము. టెంపరరీగా అయినాగానీ చెయ్యటమునైతే చేస్తున్నారు కదా! తండ్రి దుఃఖహర్త కదా, మరి డాక్టర్స్ లేక మెడికల్ డిపార్ట్ మెంట్ వారుకూడా కొద్ది సమయము కొరకు పేషెంటు దుఃఖమును దూరము చేసేస్తారు. కానీ ఇప్పుడైతే మీరందరూ వారికి మెడిటేషను నేర్పించండి, ఇదికూడా పుణ్యమును జమ చేసుకొనే మెడికల్ డిపార్ట్ మెంటు. అందరూ డబుల్ సేవను చేస్తారు. ఎవరైతే డబుల్ సేవ చేస్తారో, ఎవరైతే డబల్ డాక్టర్లో వారు చేతులెత్తండి. సింగల్ డాక్టర్‌లైతే చాలామంది ఉన్నారు, కానీ మీరు డబల్ సేవాధారులు, డబుల్ పని చేసే వారు. బాప్ దాదాకు మంచిగా అనిపించింది. ఈ సేవద్వారా కూడా చాలామంది సంతోషిస్తారు, అదృష్టవంతులుగా అవుతారు. బాంబేలోని హాస్పిటల్‌ కూడా చాలా సేవకు నిమిత్తమవ్వటమును బాప్ దాదా చూసారు. ఆబూలో అయితే మొదటినుండే ఉంది, కానీ అది మధ్యలో, పట్టణం మధ్యలో ఉన్న కారణంగా ఎక్కువ సేవ చేసే అవకాశము ఉంది. బాగా చేస్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉంటారు. ముందుకు వెళ్ళేందుకు అవకాశము మరియు వరదానము రెండూ ఉన్నాయి. మంచిది. ఇప్పుడు క్రొత్త ప్లానును ఏదో తయారుచేసారు కదా, తయారుచేసారా? మంచిది. తయారుచేస్తూ వెళ్ళండి, విశ్వ పరివర్తన చేస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా!

*యూత్ గ్రూపు-* ఇప్పటి గవర్నమెంటుకుకూడా యువతకొరకు చాలా ఉల్లాసము ఉంది, సంకల్పము ఉంది, ఎందుకంటే ఏది అనుకుంటే, ఏది ఆలోచిస్తే దానిని చేసే చూపించటమన్నది యువత విశేషత. శారీరకంగా మరియు మాససికంగా కూడా యువతకు డబుల్ - శక్తి ఉంది, యువత సంగఠితమై ఏది కావాలనుకుంటే దానిని చెయ్యగలరు. యువత నలువైపులా ముఖ్యంగా తమ స్కూలు సహచరుల సేవ చాలా బాగా చేస్తున్నారన్నదానిని పాండవ గవర్నమెంటుకూడా చూస్తోంది. బాప్ దాదా వద్దకు యువ వర్గపు రిపోర్టు వస్తూ ఉంటుంది. ఇప్పుడు దానికి అదనంగా దీనిని చేర్చండి - ఈ సంవత్సరములో బ్రాహ్మణ మర్యాదలేవైతే ఉన్నాయో, ప్రతిఒక్క మర్యాదను సంపూర్ణ రీతిలో మనస్సుద్వారా, వాచా ద్వారా, కర్మణద్వారా మరియు సంబంధ-సంపర్కములద్వారా నాలుగు రూపాలలో పాలన చేసే. ఇటువంటి గ్రూపును తయారుచెయ్యండి, ఈ సంవత్సరములో ఏ మర్యాదకూడా భంగమవ్వకూడదు. అటువంటి గ్రూపును తయారుచెయ్యండి, పరస్పరములో చెయ్యండి. ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు. ఇష్టమేనా? ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? చేతులెత్తండి? చేస్తారా? యువత అందరూ చేస్తారా? ఎంతమంది ఉన్నారు? (400మంది) పరస్పరములో ప్రతి గ్రూపులో దృఢంగా చెయ్యండి, అప్పుడు వీరు మర్యాదా పురుషోత్తములు అని గవర్నమెంటుకు చూపిస్తారు. గవర్నమెంటుకూడా కోరుకుంటుంది కానీ చెయ్యలేకపోతోంది, మీరు చేసి చూపించండి. ఉదాహరణగా అయ్యి చూపించండి. హోమ్ వర్కు లభించింది కదా! నలువైపులా గల బ్రాహ్మణ ఆత్మలు ఈ సంవత్సరములో అద్భుతమును చేసి చూపించాలన్నదానినే బాప్ దాదా కోరుకుంటున్నారు. వ్యర్థ సంకల్పాలతో కిందకు పడిపోవటముకూడా ఉండకూడదు. వ్యర్ధము వచ్చేందుకు సమయము కూడా లేనంతగా శుద్ధ సంకల్పాలను జమ చేసుకోండి. ఖజానా అయితే ఉంది కదా! శుద్ధ సంకల్పాలతో కూడిన అంత పెద్ద ఖజానా ప్రోగై ఉందా? ఉందా, చేతులెత్తండి, శక్తులు కూడా ఉన్నారు, మంచిది, శక్తులు కూడా ఉదాహరణ మూర్తులుగా అవ్వాలి మరియు పాండవులుకూడా ఉదాహరణ మూర్తులుగా అవ్వాలి. అచ్ఛా! బాప్ దాదా సంతోషించారు.

*సెక్యూరిటీ వింగు -* సెక్యూరిటీ వారు, మీరుకూడా డబుల్ సెక్యూరిటీ వారు కదా! ఒకటేమో ఎవరైతే అల్లర్లు చేస్తుంటారో వారినుండి సెక్యూరిటీ చేస్తారు, రెండవది- మేము సదా సుఖముగా ఉండాలి, శాంతిలో ఉండాలి అని పాపం ఎవరైతే కోరికను ఉంచుతారో వారి సెక్యూరిటీని కూడా చెయ్యండి. వారికి మన్మనాభవ మంత్రమును ఇచ్చి, శివ మంత్రమును ఇచ్చి కనీసం సుఖముగా ఉండే, సంతోషపు సెక్యూరిటీ, సంతోషము పోకుండా ఉండే ఈ సురక్షతామార్గమును చూపించండి. మరి డబుల్ సెక్యూరిటీ చేసినట్లయితే మీకు ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి! దుఃఖితులను సుఖవంతులుగా చేసినట్లయితే, బాధితులను సంతోషపరిచినట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు ఈవిధంగా ప్రతి ఒక్క ఇంటికి చిన్న మంత్రాన్ని ఇవ్వండి, దీనితో సంతోషమును పోగొట్టుకోరు, ప్రతి ఇంటిలో సంతోషము ఉండాలి. ఈ సేవను ఎంతగా చేస్తారో అంతగా డబుల్ సెక్యూరిటీ వారిగా అయిపోతారు. వ్వాపింపచేయండి. ప్రతి స్థానములో ఈ బాధ్యతను ఇవ్వండి. అన్ని స్థానాలవారైతే ఉన్నారు, మీ దేశములో మొదట ఈ సెక్యూరిటీ పనిని చెయ్యండి, గ్రామ గ్రామము, పెద్ద పెద్ద స్థానాలు ఆనందంగా అయిపోతాయి. మరి చేస్తారా? చేస్తారా? అచ్ఛా!

            ఇప్పుడు నాలుగు విషయాలేవైతే విన్నారో మరియు ఐదవది జీరో మరియు హీరోను గుర్చి ఏదైతే వినిపించామో, మరి ఈ విషయాలను మననము చేస్తూ సదా మగ్న అవస్థలో ఉండే బ్రాహ్మణులనుండి ఫరిస్తాగా అయ్యే ఆత్మలందరికీ, దేవతగా అవ్వటము అన్నది మీ జన్మసిద్ధ అధికారము, ఫరిస్తాలనుండి దేవతలుగా అయితే ఉండనే ఉంది, కావున సదా స్నేహపు ప్రేమలో లీనమయ్యేవారికీ, లవలీనమై ఉండేవారికి, సదా దృఢతతోకూడిన సంకల్పమనే తాళపుచెవిని మనస్సులో-బుద్ధిలో స్మృతిలో ఉంచుకొనేవారికి......ఎందుకంటే ఈ తాళపుచెవి వెనుక మాయ చాలా తిరుగుతూ ఉంటుంది. కావున మనస్సు మరియు బుద్ధి ద్వారా సదా సమర్థముగా ఉండే నలువైపులా గల పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

*దాదీలతో- ( జానకి దాదీతో)* పర్యటన చేసి వచ్చారు, చాలా మంచిది. ఏదైతే చేస్తున్నారో అది చాలా మంచిది. జగదంబ మధ్యలో నిలబడి జెండా ఎగురవేస్తూ ఉంటే, వెనుక శక్తులందరూ తోడుగా నిలబడి ఉండే చిత్రము బాబాకు గుర్తు వచ్చింది. మరి ఇప్పుడు ఆ చిత్రాన్ని బాప్ దాదా విశ్వము ముందు చూపించాలని కోరుకుంటున్నారు. మొత్తము బ్రాహ్మణులతో శక్తి సేనను ఎలా తయారు చెయ్యాలంటే వారు నిమిత్తులుగా అవ్వాలి, పరిక్రమణ చేస్తూ వాయుమండలమును శక్తిశాలీగా తయారుచెయ్యాలి మరియు మేము వాయుమండలమును మార్చి చూపిస్తాము అన్న దృఢ సంకల్పమును ఉంచుతాము అన్న దృఢ సంకల్పమును చేయాలి. ఈ జెండాను ఎత్తాలి. పర్యటనలు చేస్తూ తమ స్థితి, వాణి మరియు సాంగత్యముద్వారా వాయుమండలమును మంచిగా చేసేటటువంటి గ్రూపును తయారుచెయ్యండి. అటువంటి గ్రూపును తయారుచేసి చూపించండి. బాప్ దాదాకు చిత్రము గుర్తు వచ్చిందంటే అది ప్రాక్టికల్ అవ్వాలి. సమయము లభించదని అనవద్దు. సమయము లభించదని ఎవరూ అనవద్దు. శుభ భావన ఉన్నట్లయితే సమయము లభిస్తుంది, అటువంటి గ్రూపును తయారుచేసి బాప్ దాదాకు ఇవ్వాలి.

*పరదాదీతో-* సేవను చేస్తున్నావు, మనసా సేవ ద్వారా ప్రకాశమును, శక్తిని చాలా ఇస్తున్నావు, సేవలో బిజీగా ఉంటున్నావు.

*కలకత్తావారు పూల అలంకారము చేసారు-* అచ్ఛా, ఎప్పుడూ చేస్తారు.

డాక్టర్ అశోక్ మెహతా మరియు యోగినీ అక్కయ్యతో- ఇద్దరూ చాలా ధైర్యమును ఉంచారు మరియు సరైన సమయానికి చేర్చారు ( గుల్జార్ దీని నిన్న బొంబాయినుండి మధువనమునకు తీసుకొని వచ్చారు) అందుకు అభినందనలు. ఏ డ్యూటీనైతే ఇచ్చారో దానిని చేసారు.

*అవ్యక్త బాప్ దాదాతో మధ్యప్రదేశ్ గవర్నరు మహా మహిమ్ బలరామ్ జాఖడ్ గారు కలుస్తున్నారు.*

            చాలా మంచిది, చూడండి, ఇటువంటి సంగఠనలోకి చేరుకోవటముకూడా మీ భాగ్యము, ఈ సంగఠనలో మెడిటేషన్‌ను నేర్పిస్తారు కదా! మూడు గంటల మెడిటేషన్ ఉంటుంది, దానిని తప్పకుండా చెయ్యాలి అని బాప్ దాదా ఇప్పుడు చెప్తారు. ఒకవేళ బిజీగా ఉన్నట్లయితే శెలవురోజును ఇవ్వండి. మంచిది. మూడుగంటలు వేరువేరుగా ఇవ్వాలి, ఒకవేళ బిజీగా ఉంటే సెలవు రోజులలో ఇవ్వండి. బాగుంది, ఎందుకంటే తండ్రి వద్దకు వచ్చారంటే తండ్రి కానుకనైతే ఇస్తారు కదా! మెడిటేషన్ ద్వారా సదా సంతోషంగా ఉంటారు అన్నదే ఆశీర్వాదము. సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఎప్పుడు ఏ విషయము వచ్చినాగానీ, బాబా, శివబాబా అని అనండి, ఆ విషయాన్ని తండ్రికి ఇచ్చేసెయ్యండి, మీరు సంతోషంగా ఉండండి.

Comments