30-01-1988 అవ్యక్త మురళి

30-01-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

ధైర్యం యొక్క రెండవ అడుగు - ‘‘సహనశీలత’’ (బ్రహ్మా బాబా జీవిత కథ)

ఈ రోజు ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతుడు) అయిన తండ్రి తన మొదటి శ్రేష్ఠ రచనను చూస్తున్నారు. మొదటి రచన బ్రాహ్మణుల రచన. వారి మొదటి రచనలో కూడా మొదటి నంబరు బ్రహ్మా అనే అంటారు. మొదటి రచన యొక్క మొదటి నంబరు అయిన కారణంగా బ్రహ్మాను ఆది-దేవ్ అని అంటారు. ఈ పేరు వలన ఈ ఆబూ పర్వతంపై స్మృతిచిహ్నం కూడా ‘ఆది-దేవ్’ అనే పేరుతోనే ఉంది. ఆది-దేవ్ అనగా ఆది రచయిత అని కూడా అంటారు మరియు ఆది-దేవ్ అనగా కొత్త సృష్టి ఆదిలో మొదటి నంబరు దేవత. బ్రహ్మాయే శ్రీకృష్ణుని రూపంలో మొదటి దేవాత్మగా అవుతారు, అందుకే కొత్త సృష్టి ఆది యొక్క ఆది-దేవ్ అని అంటారు. వారు సంగమయుగంలో కూడా ఆది రచన యొక్క మొదటి నంబరు అనగా ఆది-దేవ్ అనండి లేక బ్రాహ్మణాత్మల రచయిత అయిన బ్రహ్మా అని అనండి. కనుక సంగమంలో మరియు సృష్టి ఆదిలో - రెండు సమయాలలోనూ వారు ఆది అయిన వారు, అందుకే ఆది-దేవ్ అని అంటారు.

బ్రహ్మాయే ఆది కర్మాతీత ఫరిశ్తాగా అవుతారు. బ్రహ్మా నుండి ఫరిశ్తాగా మరియు ఫరిశ్తా నుండి దేవతగా అవుతారు - అన్నింటిలోనూ నంబరువన్. ఇలా నంబరువన్ గా ఎందుకయ్యారు? ఏ విధి ద్వారా నంబరువన్ సిద్ధిని ప్రాప్తి చేసుకున్నారు? బ్రాహ్మణాత్మలైన మీరందరూ బ్రహ్మానే ఫాలో చేయాలి. ఏమి ఫాలో చేయాలి? వీరి మొదటి అడుగు - సమర్పణత, దీని గురించి ఇంతకుముందు వినిపించాము. మొదటి అడుగులో కూడా అన్ని రూపాలలోనూ సమర్పణ అయి చూపించారు. రెండవ అడుగు సహనశీలత. సమర్పణ అయినప్పుడు తండ్రి నుండి సర్వ శ్రేష్ఠ వారసత్వమైతే లభించింది కానీ ప్రపంచం వారి నుండి ఏమి లభించింది? అందరికన్నా ఎక్కువగా నిందల వర్షం ఎవరిపై కురిసింది? ఆత్మలైన మీపై కూడా నిందలు పడ్డాయి మరియు దురాచారం జరిగింది కానీ ఎక్కువ క్రోధం బ్రహ్మాకే లభిస్తూ వచ్చింది. ఎవరైతే లౌకిక జీవితంలో ఎప్పుడూ ఒక్క అపశబ్దం కూడా వినలేదో, కానీ బ్రహ్మాగా అయ్యాక అపశబ్దాలు వినడంలో కూడా నంబరువన్ గా అయ్యారు. అందరికన్నా ఎక్కువగా సర్వులతో స్నేహీ జీవితాన్ని గడిపారు, కానీ లౌకిక జీవితంలో ఎంతగా సర్వులకు స్నేహీగా ఉండేవారో, అంతగానే అలౌకిక జీవితంలో సర్వులకు శత్రువు రూపంగా అయ్యారు. పిల్లలపై దురాచారం జరిగిందంటే, స్వతహాగానే ఇన్ డైరెక్టుగా తండ్రిపై కూడా దురాచారం జరిగినట్లు. కానీ సహనశీలతా గుణంతో లేక సహనశీలత యొక్క ధారణతో చిరునవ్వుతో ఉండేవారు, ఎప్పుడూ వాడిపోలేదు.

ఎవరైనా ప్రశంసించినప్పుడు చిరునవ్వు చిందిస్తే, దానిని సహనశీలత అని అనరు. కానీ శత్రువులుగా అయి, క్రోధితులై అపశబ్దాల వర్షం కురిపించినా, అటువంటి సమయంలో కూడా సదా చిరునవ్వుతో ఉండడము, సంకల్పమాత్రంగా కూడా ముఖంపై వాడిపోవడం యొక్క గుర్తులు లేకపోవడము - వీరినే సహనశీలి అని అంటారు. శత్రువు ఆత్మను కూడా దయాహృదయ భావనతో చూడడము, మాట్లాడడము, వారి సంపర్కంలోకి రావడము - దీనినే సహనశీలత అని అంటారు. స్థాపనా కార్యంలో, సేవా కార్యంలో అప్పుడప్పుడు చిన్న తుఫాన్లు, అప్పుడప్పుడు పెద్ద తుఫాన్లు వచ్చాయి. శాస్త్రాలలో స్మృతిచిహ్నంగా మహావీరుడైన హనుమంతుని గురించి చూపిస్తారు - అంత పెద్ద పర్వతాన్ని కూడా అరచేతిలో ఒక బంతిలా తీసుకువచ్చినట్లుగా చూపిస్తారు. అలాగే ఎంత పెద్ద పర్వతం లాంటి సమస్య అయినా, తుఫాను అయినా, విఘ్నమైనా కానీ, ఆ పర్వతం అనగా పెద్ద విషయాన్ని చిన్న ఆటబొమ్మగా చేసుకొని ఆడుకుంటున్నట్లుగా సదా దాటేసారు మరియు చాలా భారీ విషయాన్ని సదా తేలికగా చేసి స్వయం కూడా తేలికగా ఉన్నారు మరియు ఇతరులను కూడా తేలికగా చేసారు - దీనినే సహనశీలత అని అంటారు. చిన్న రాయిని పర్వతంలా చేయలేదు, పర్వతాన్ని బంతి వలె చేసారు, విస్తారాన్ని సారంలోకి తీసుకువచ్చారు - ఇదే సహనశీలత. విఘ్నాలను, సమస్యలను తమ మనసులో అయినా, ఇతరుల ముందు అయినా విస్తారం చేయడం అనగా పర్వతంలా చేయడము. కానీ విస్తారంలోకి వెళ్ళకుండా ‘నథింగ్ న్యూ’ అనే ఫుల్ స్టాప్ ద్వారా బిందువు పెట్టి, బిందువుగా అయి ముందుకు వెళ్ళడాన్నే విస్తారాన్ని సారంలోకి తీసుకురావడమని అంటారు. సహనశీలత కలిగిన శ్రేష్ఠాత్మ, బ్రహ్మా తండ్రి చేసినట్లుగా, సదా జ్ఞాన-యోగాల సారంలో స్థితులై విస్తారాన్ని, సమస్యలను, విఘ్నాలను కూడా సారంలోకి తీసుకువస్తారు. ఎలాగైతే సుదీర్ఘమైన మార్గంలో వెళ్ళేటప్పుడు సమయం, శక్తులు సమాప్తమైపోతాయి అనగా ఎక్కువగా ఖర్చు అవుతాయి, అలా విస్తారం అనగా సుదీర్ఘమైన మార్గంలో వెళ్ళడము మరియు సారం అనగా షార్ట్ కట్ మార్గంలో వెళ్ళడము. రెండు రకాల వారు చేరుకుంటారు కానీ షార్ట్ కట్ లో వెళ్ళినవారు, సమయం మరియు శక్తులు పొదుపు అయిన కారణంగా నిరాశ చెందరు, నిరుత్సాహపడరు, సదా ఆనందంగా చిరునవ్వుతో చేరుకుంటారు - దీనినే సహనశీలత అని అంటారు.

సహనశీలత శక్తి కలిగినవారు ఏమిటి, ఇలా కూడా జరుగుతుందా! అని ఎప్పుడూ భయపడరు. సదా సంపన్నంగా ఉన్న కారణంగా జ్ఞానం మరియు స్మృతి యొక్క లోతుల్లోకి వెళ్తారు. భయపడేవారు ఎప్పుడూ లోతుల్లోకి వెళ్ళలేరు. సారంలో ఉండేవారు సదా నిండుగా ఉంటారు, అందుకే నిండుగా, సంపన్నంగా ఉండే వస్తువు లోతైనదిగా ఉంటుంది. విస్తారంలోకి వెళ్ళేవారు ఖాళీగా ఉంటారు, అందుకే ఖాళీగా ఉన్న వస్తువు సదా తొణుకుతూ ఉంటుంది. కనుక విస్తారంలోకి వెళ్ళేవారు ఇది ఎందుకు, ఇదేమిటి, ఇలా కాదు అలా, ఇలా జరగకూడదు..... ఇలా సంకల్పాలలో కూడా అలజడితో ఉంటారు మరియు వాణిలో కూడా అందరి ముందు అలజడితో ఉంటారు. ఎవరైనా హద్దు మీరి ఎగసిపడితే ఏమవుతుంది? ఆయాసపడుతూ ఉంటారు. స్వయమే ఎగసిపడతారు, స్వయమే ఆయాసపడతారు మరియు స్వయమే మళ్ళీ అలసిపోతారు. సహనశీలి ఈ విషయాలన్నింటి నుండి రక్షించబడతారు, అందుకే సదా ఆనందంగా ఉంటారు, తొణకరు, ఎగురుతూ ఉంటారు.

రెండవ అడుగు - సహనశీలత. బ్రహ్మా తండ్రి ఈ విధంగా నడుచుకుని చూపించారు. సదా స్థిరంగా, అచలంగా, సహజ స్వరూపంలో ఆనందంగా ఉండేవారు, శ్రమతో కాదు. ఇది 14 సంవత్సరాలు తపస్సు చేసిన పిల్లలు అనుభవం చేసారు. 14 సంవత్సరాలు అని అనిపించిందా లేక కొన్ని ఘడియలు అని అనిపించిందా? ఆనందంగా ఉండేవారా లేక శ్రమ అనిపించిందా? అలాగే బాబా స్థూల శ్రమ యొక్క పరీక్షలను కూడా బాగా తీసుకున్నారు. హుందాగా పాలన పొందినవారు ఎక్కడ మరియు పేడతో పిడకలను కూడా తయారుచేయించడం ఎక్కడ! మెకానిక్ గా కూడా చేసారు, చెప్పులు కూడా కుట్టించారు! చెప్పులు కుట్టేవారిగా కూడా చేసారు కదా. తోటమాలిగా కూడా చేసారు. కానీ శ్రమ అనిపించిందా లేక ఆనందంగా అనిపించిందా? అన్నింటినీ దాటారు కానీ సదా ఆనందమయ జీవితాన్ని అనుభవం చేసారు. ఎవరైతే తికమకపడ్డారో వారు పారిపోయారు మరియు ఎవరైతే ఆనందంగా ఉన్నారో, వారు అనేకులకు ఆనందమయ జీవితాన్ని అనుభవం చేయిస్తున్నారు. ఇప్పుడు కూడా ఒకవేళ అవే 14 సంవత్సరాలను రిపీట్ చేస్తే ఇష్టమే కదా. ఇప్పుడు సెంటరులో ఒకవేళ కొద్దిగా స్థూల కార్యం చేయాల్సి వస్తే, ‘దీని కోసమే సన్యసించామా, మేము ఈ పని కోసమే ఉన్నామా?’ అని ఆలోచిస్తారు. ఆనందంగా జీవించడాన్నే బ్రాహ్మణ జీవితమని అంటారు. సాధారణమైన స్థూల కార్యమైనా సరే, వేలాది మంది సభలో స్టేజ్ పైన స్పీచ్ ఇవ్వాల్సి వచ్చినా సరే - రెండూ ఆనందంగా చేయాలి. దీనినే ఆనందమయ జీవితాన్ని జీవించడమని అంటారు. సరెండర్ అవ్వడమంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుందని మేమైతే అనుకోలేదు, నేను టీచరుగా అయి వచ్చాను, స్థూల కార్యాలు చేసేందుకు సన్యసించలేదు, బ్రహ్మాకుమారి జీవితమంటే ఇలానే ఉంటుందా? అని తికమకపడకూడదు. అలా ఉంటే తికమకతో కూడిన జీవితమని అంటారు.

బ్రహ్మాకుమారి అవ్వడం అనగా హృదయపూర్వకమైన ఆనందంలో ఉండడం, అంతేకానీ స్థూలమైన ఆనందంలో ఉండడం కాదు. హృదయపూర్వకమైన ఆనందంతో ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎలాంటి కార్యంలోనైనా తికమకను ఆనందంలోకి మార్చేస్తారు మరియు మనసులో తికమక పడేవారు శ్రేష్ఠ సాధనాలు ఉన్నా కానీ, విషయం స్పష్టంగా ఉన్నా కానీ, స్వయం సదా తికమకలో ఉన్న కారణంగా స్పష్టమైన విషయాన్ని కూడా తికమక చేస్తారు, మంచి సాధనాలు ఉన్నా కానీ, సాధనాల నుండి ఆనందాన్ని తీసుకోలేరు. ఇది ఎలా అవుతుంది, అలా కాదు ఇలా అవుతుంది - ఇందులో స్వయం కూడా తికమకపడతారు, ఇతరులను కూడా తికమకపడేలా చేస్తారు. ‘దారం చిక్కులు పడితే కష్టం మీద బాగవుతుంది’ అని అంటారు కదా. మంచి విషయంలో కూడా తికమకపడతారు, భయపడే విషయంలో కూడా తికమకపడతారు ఎందుకంటే వృత్తియే తికమకగా ఉంది, మనసు కూడా తికమకగా ఉంది, కావున స్వతహాగానే వృత్తి ప్రభావం దృష్టిపై పడుతుంది మరియు దృష్టి కారణంగా సృష్టి కూడా తికమకగా కనిపిస్తుంది. బ్రహ్మాకుమారి జీవితమనగా బ్రహ్మా తండ్రి సమానంగా ఆనందమయ జీవితము. కానీ దీనికి ఆధారము - సహనశీలత. కావున సహనశీలతకు ఇంతటి విశేషత ఉంది! ఈ విశేషత కారణంగానే బ్రహ్మా బాబా సదా స్థిరంగా, అచలంగా ఉన్నారు.

రెండు రకాల సహనశీలత పేపర్ల గురించి వినిపించాను. మొదటి పేపర్ - మనుష్యుల ద్వారా అపశబ్దాలు లేక దురాచారము. రెండవ పేపర్ - యజ్ఞ స్థాపనలో వచ్చిన రకరకాల విఘ్నాలు. మూడవది - చాలామంది బ్రాహ్మణ పిల్లలు ద్రోహులుగా అవ్వడము లేక చిన్న-చిన్న విషయాలలో అసంతుష్టతను ఎదుర్కోవడము. కానీ ఇందులో కూడా సదా అసంతుష్టంగా ఉన్నవారిని సంతుష్టంగా చేయాలనే భావనతో, వారిని పరవశులుగా భావిస్తూ, సదా కళ్యాణ భావనతో, సహనశీలత యొక్క సైలెన్స్ పవర్ తో ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకువెళ్ళారు. ఎదిరించేవారికి కూడా మధురత మరియు శుభ భావన, శుభ కామనలతో సహనశీలత పాఠాన్ని చదివించారు. ఎవరైతే ఈ రోజు ఎదిరించి రేపు క్షమాపణ అడుగుతారో, వారి నోటి నుండి కూడా ‘బాబా అంటే బాబాయే’ అనే మాట వచ్చేది. దీనినే సహనశీలతతో ఫెయిల్ అయిన వారిని కూడా పాస్ చేయించి విఘ్నాన్ని దాటడమని అంటారు. కనుక రెండవ అడుగు గురించి విన్నారు. ఎందుకు విన్నారు? అడుగుపై అడుగు వేయండి. దీనినే ఫాలో ఫాదర్ చేయడము అనగా తండ్రి సమానంగా అవ్వడమని అంటారు. అలా అవ్వాలా లేక కేవలం దూరం నుండి చూడాలా? ధైర్యవంతులే కదా? పంజాబ్, మహారాష్ట్ర ఇరువురూ ధైర్యవంతులే. అందరూ ధైర్యవంతులే. దేశ విదేశాల వారందరూ తమను తాము మహావీరులని చెప్పుకుంటారు. ఎవరినైనా మీరు పాదచారులు అని అంటే అంగీకరిస్తారా? దీని ద్వారా అందరూ స్వయాన్ని మహావీరులుగా భావిస్తున్నారని ఋజువవుతుంది. మహావీరులు అనగా తండ్రి సమానంగా అవ్వడము. అర్థమయిందా? అచ్ఛా.

దేశ-విదేశాలలో తండ్రి సమానంగా ఉన్నవారందరికీ, సదా బుద్ధి ద్వారా సమర్పితులైన ఆత్మలకు, సదా ప్రతి పరిస్థితిలో, ప్రతి వ్యక్తితో సహనశీలిగా ఉంటూ ప్రతి పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసి సహజంగా దాటేవారికి, సదా విస్తారాన్ని సార రూపంలోకి తీసుకువచ్చేవారికి, సదా బ్రాహ్మణ జీవితాన్ని ఆనందమయ జీవితంగా జీవించేవారికి, ఇటువంటి తండ్రి సమానంగా తయారయ్యే మహావీరులైన శ్రేష్ఠాత్మలకు బాప్ దాదాల ‘సమాన భవ’ యొక్క స్నేహ సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో కలయిక -

కుమారులతో - కుమారుల విశేషత ఏమిటి? కుమార్ జీవితం శ్రేష్ఠమైన జీవితం ఎందుకంటే ఇది పవిత్రమైన జీవితం మరియు ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ మహానత ఉంటుంది. కుమార్ అనగా శక్తిశాలి, ఏ సంకల్పం చేసినా దానిని కార్యంలోకి తీసుకురాగలరు. కుమార్ అనగా సదా బంధనముక్తులుగా అయ్యేవారు మరియు తయారుచేసేవారు. ఇలాంటి విశేషతలు ఉన్నాయి కదా? ఏ సంకల్పం చేసినా దానిని కర్మలోకి తీసుకురాగలరు. స్వయం కూడా పవిత్రంగా ఉంటూ, ఇతరులకు కూడా పవిత్రంగా ఉండడంలో గల మహత్వాన్ని తెలియజేయగలరు. ఇలాంటి సేవకు నిమిత్తంగా అవ్వగలరు. దేనినైతే ప్రపంచంలోని వారు అసంభవం అని భావిస్తారో, దాని గురించి బ్రహ్మాకుమార్ ఛాలెంజ్ చేస్తారు - మా వంటి పావనమైనవారు ఎవరూ ఉండరు అని. ఎందుకు? ఎందుకంటే అలా తయారుచేసేవారు సర్వశక్తివంతుడు. ప్రపంచం వారు ఎంత ప్రయత్నించినా కానీ మీలా పావనంగా అవ్వలేరు. మీరు సహజంగానే పావనంగా అయిపోయారు. సహజమనిపిస్తుంది కదా? లేక ప్రపంచం వారు చెప్పినట్లుగా ఇది అసహజమని అనిపిస్తుందా? కుమార్ యొక్క నిర్వచనమే - ఛాలెంజ్ చేసేవారు, పరివర్తన చేసి చూపించేవారు, అసంభవాన్ని సంభవం చేసేవారు. ప్రపంచంలోని వారు తమ సహచరులను సాంగత్య దోషంలోకి తీసుకువెళ్తారు మరియు మీరు తండ్రి సాంగత్యంలోకి తీసుకువస్తారు. మీ సాంగత్యాన్ని వారికి అంటించరు, తండ్రి సాంగత్యమనే రంగును అంటిస్తారు, తండ్రి సమానంగా చేస్తారు. అటువంటివారే కదా? అచ్ఛా.

2. కుమార్ అనగా సదా అచలంగా, స్థిరంగా ఉండేవారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కాని సందిగ్ధతలోకి వచ్చేవారు కాదు ఎందుకంటే స్వయంగా తండ్రియే మీ సహచరుడు. ఎక్కడైతే తండ్రి ఉంటారో, అక్కడ సదా అచలంగా, స్థిరంగా ఉంటారు. ఎక్కడైతే సర్వశక్తివంతుడు ఉంటారో, అక్కడ సర్వశక్తులు ఉంటాయి. సర్వశక్తుల ముందు మాయ ఏమీ చేయలేదు, అందుకే కుమార్ జీవితం అనగా సదా ఏకరస స్థితి కలిగిన వారు, అలజడిలోకి వచ్చేవారు కాదు. ఎవరైతే అలజడిలోకి వస్తారో, వారు అవినాశి రాజ్య భాగ్యాన్ని కూడా పొందలేరు, కొద్దిగా సుఖం లభిస్తుంది కానీ అది సదాకాలానికి లభించదు. అందుకే కుమార్ జీవితం అనగా సదా అచలంగా, ఏకరస స్థితిలో స్థితులయ్యేవారు. మరి ఏకరస స్థితి ఉంటుందా లేక ఇతర రసాలలోకి బుద్ధి వెళ్తుందా? అన్ని రసాలను ఒక్క తండ్రి ద్వారా అనుభవం చేసేవారు - దీనినే ఏకరస స్థితి అనగా అచలమైన, స్థిరమైన స్థితి అని అంటారు. ఇటువంటి ఏకరస స్థితి కలిగిన పిల్లలే తండ్రికి ప్రియమనిపిస్తారు. కనుక మేము అచలమైన, స్థిరమైన ఆత్మలము, ఏకరస స్థితిలో ఉండేవారము అని సదా ఇదే గుర్తుంచుకోండి.

మాతలతో - 1. మాతల కోసం బాప్ దాదా ఏ సహజమైన మార్గాన్ని తెలియజేసారు? దీనితో సహజంగానే తండ్రి స్మృతిని అనుభవం చేయగలరు, శ్రమించాల్సిన అవసరం ఉండదు. స్మృతిని కూడా సహజం చేసుకునే సాధనమేమిటి? హృదయపూర్వకంగా ‘మేరా బాబా (నా బాబా)’ అని అనండి. ఎక్కడైతే ‘నాది’ అని అంటారో, అక్కడ సహజంగానే గుర్తుకొస్తుంది. రోజంతటిలో ‘నాది’ అనేదే గుర్తుకొస్తుంది కదా. ‘నాది’ అనేది ఏదైనా సరే - వ్యక్తులు అయినా, వస్తువులు అయినా..... ఎక్కడైతే ‘నాది’ అనేది ఉంటుందో అదే గుర్తుకొస్తుంది. అలాగే ఒకవేళ తండ్రిని ‘నా వారు’ అని అంటే, వారు ‘నా వారు’ అని భావిస్తే తండ్రియే గుర్తుకొస్తారు. కనుక తండ్రిని స్మృతి చేసే సహజమైన పద్ధతి - హృదయపూర్వకంగా ‘నా బాబా’ అని అనండి. కేవలం నోటితో ‘నా వారు, నా వారు’ అని అనడం కాదు, అధికారంతో అనాలి. ఈ సహజ పురుషార్థాన్ని చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. సదా ఈ విధి ద్వారానే సహజయోగులుగా అవ్వండి. ‘నా వారు’ అని అనండి మరియు తండ్రి ఖజానాలకు యజమానులుగా అవ్వండి.

2. మాతలు సదా తమను తాము పదమాపదమ భాగ్యశాలిగా భావిస్తున్నారా? ఇంట్లో కూర్చుని ఉండగానే తండ్రి లభించారంటే ఇది ఎంత గొప్ప భాగ్యము! ప్రపంచం వారు తండ్రిని వెతికేందుకు వెళ్తారు మరియు మీకు ఇంట్లో కూర్చుని ఉండగానే లభించేసారు. మరి ఇంత గొప్ప భాగ్యం ప్రాప్తిస్తుందని ఎప్పుడైనా సంకల్పంలోనైనా అనుకున్నారా? ‘ఇంట్లో కూర్చుని ఉండగానే భగవంతుడు లభించారు....’ అనే గాయనం ఏదైతే ఉందో, అది ఎవరి కోసము. మీ కోసమే కదా. కనుక ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని ముందుకు వెళ్తూ ఉండండి. ‘వాహ్! నా శ్రేష్ఠ భాగ్యము’ అనే సంతోషపు పాటలను పాడుతూ ఉండండి. సంతోషమనే ఊయలలో ఊగుతూ ఉండండి. సంతోషంగా నాట్యం చేయండి, పాడండి.

3. శక్తులకు సదా ఏ సంతోషముంటుంది? సదా తండ్రితో పాటు కంబైండ్ గా ఉన్నాను. శివశక్తి అంటేనే కంబైండ్ అని అర్థము. తండ్రి మరియు మీరు - ఇరువురిని కలిపి శివశక్తి అని అంటారు. కంబైండ్ గా ఉన్నవారిని ఎవరూ వేరు చేయలేరు. ఇటువంటి సంతోషముంటుందా? తండ్రి నిర్బల ఆత్మలను శక్తులుగా తయారుచేసారు. కనుక ‘మేము కంబైండ్ గా ఉండేందుకు అధికారులుగా అయ్యాము’ అని సదా గుర్తుంచుకోండి. ఒకప్పుడు వెతికేవారిగా ఉండేవారము మరియు ఇప్పుడు తోడుగా ఉండేవారము - ఈ నషా సదా ఉండాలి. మాయ ఎంతగా ప్రయత్నించినా కానీ, శివశక్తుల ముందు మాయ ఏమీ చేయలేదు. వేరుగా ఉంటేనే మాయ వస్తుంది, కంబైండ్ గా ఉంటే మాయ రాలేదు. కనుక మేము కంబైండ్ గా ఉండేటువంటి శివశక్తులము, విజయులము అనే వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. అచ్ఛా!

Comments