28-02-1988 అవ్యక్త మురళి

28-02-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

డబల్ విదేశీ బ్రాహ్మణ పిల్లల విశేషతలు.

ఈ రోజు భాగ్యవిధాత అయిన బాప్ దాదా తమ శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలను చూసి హర్షిస్తున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యము శ్రేష్ఠమైనదే కానీ నంబరువారుగా ఉంది. ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి మనసులోని ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన దృఢ సంకల్పాలను వింటున్నారు. సంకల్పాల ద్వారా మీరందరూ ఏదైతే ఆత్మిక సంభాషణ చేశారో, అది మీరు సంకల్పం చేసిన వెంటనే బాప్ దాదా వద్దకు చేరిపోయింది. ‘సంకల్ప శక్తి’ వాణి శక్తి కంటే అత్యంత సూక్ష్మంగా ఉన్న కారణంగా చాలా తీవ్ర వేగంతో పని చేస్తుంది మరియు చేరుతుంది కూడా. ఆత్మిక సంభాషణ యొక్క భాష, సంకల్ప భాష. సైన్స్ వారు శబ్దాన్ని క్యాచ్ చేస్తారు కానీ సంకల్పాలను క్యాచ్ చేసేందుకు సూక్ష్మ సాధనం కావాలి. బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి సంకల్ప భాషను సదా వింటారు అనగా సంకల్పాలను క్యాచ్ చేస్తారు. దీని కొరకు అత్యంత సూక్ష్మమైన, స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి అవసరము. అప్పుడే, బాబాతో చేసిన ఆత్మిక సంభాషణకు బాబా ఇచ్చే రెస్పాన్సును (బదులును) అర్థం చేసుకోగలరు.

బాప్ దాదా వద్దకు అందరి సంతుష్టంగా ఉండే మరియు సదా సంతోషంగా ఉండే, నిర్విఘ్నంగా ఉండే, సదా బాబా సమానంగా అవ్వాలనే శ్రేష్ఠ సంకల్పాలు చేరుకున్నాయి. పిల్లలు దృఢ సంకల్పాల ద్వారా సదా సఫలత పొందుతున్నందుకు బాప్ దాదా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఎందుకంటే ఎక్కడైతే దృఢత ఉంటుందో, అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది. ఇది శ్రేష్ఠ భాగ్యవంతులుగా అయిన దానికి గుర్తు. సదా దృఢత, శ్రేష్ఠత ఉండాలి, సంకల్పంలో కూడా బలహీనత ఉండకూడదు - దీనినే శ్రేష్ఠత అని అంటారు. పిల్లల విశాల హృదయం చూసి పిల్లలకు సదా విశాల హృదయం, విశాల బుద్ధి, విశాల సేవ మరియు విశాలమైన సంస్కారాలు ఉండాలని - ఇలా ‘సదా విశాల భవ’ అనే వరదానాన్ని కూడా వరదాత అయిన తండ్రి ఇస్తున్నారు. విశాల హృదయం అంటే అనంతమైన స్మృతి స్వరూపం. ప్రతి విషయంలోనూ అనంతములో ఉండటం అనగా విశాలంగా ఉండటము. ఎక్కడైతే అనంతము అనేది ఉంటుందో, అక్కడ ఏ రకమైన హద్దు తన వైపు ఆకర్షించలేదు. దీనినే బాబా సమానమైన కర్మాతీత ఫరిశ్తా జీవితమని అంటారు. కర్మాతీతానికి అర్థమేమిటంటే అన్ని రకాల హద్దు స్వభావ సంస్కారాల నుండి అతీతంగా ఉండటము. హద్దు అనగా బంధనము, అనంతము అనగా నిర్బంధనము. కనుక సదా ఈ విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. అందరు స్వయం కోసం ఏ సంకల్పమైతే చేశారో, అది సదా అమరమైనది, స్థిరమైనది, అఖండమైనది అనగా ఖండితమయ్యేది కాదు. ఇలాంటి సంకల్పం చేశారు కదా? మధుబన్ పరిధి వరకు మాత్రమే ఉండే సంకల్పమైతే చేయలేదు కదా? సదా తోడుగా ఉంటుంది కదా?

మురళీలైతే చాలా విన్నారు. ఇప్పుడు ఏదైతే విన్నారో, అది చేయాలి ఎందుకంటే ఈ సాకార సృష్టిలో సంకల్పాలు, మాటలు మరియు కర్మలు - మూడింటికి మహత్వముంది. ఈ మూడింటిలోనూ మహానత ఉండడాన్నే సంపన్న స్థితి అని అంటారు. ఈ సాకార సృష్టిలోనే ఫుల్ మార్కులు తీసుకోవడం చాలా అవసరము. ఒకవేళ ఎవరైనా ‘నా సంకల్పాలైతే చాలా శ్రేష్ఠంగా ఉన్నాయి కానీ కర్మలు లేక మాటల్లో తేడా కనిపిస్తుంది’ అని అనుకుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకంటే సంకల్పాలకు స్థూలమైన దర్పణము - మాటలు మరియు కర్మలు. శ్రేష్ఠ సంకల్పాలు చేసేవారి మాటలు స్వతహాగానే శ్రేష్ఠంగా ఉంటాయి. అందుకే, మూడింటిలోనూ విశేషత కలిగి ఉండడమే ‘నంబరువన్’ గా అవ్వడము.

బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలను చూసి సదా వారి విశేషతలకు హర్షిస్తారు. ఆ విశేషతలు ఏమిటి? ఎలాగైతే బ్రహ్మాబాబా చేసిన శ్రేష్ఠ సంకల్పం ద్వారా లేక శ్రేష్ఠ సంకల్పాలతో ఆహ్వానించడం ద్వారా దివ్య జన్మను ప్రాప్తి చేసుకున్నారో, అలా శ్రేష్ఠ సంకల్పం ద్వారా జన్మించిన విశేష రచన అయిన కారణంగా వీరు తమ సంకల్పాలను శ్రేష్ఠంగా చేసుకునేందుకు విశేషమైన అటెన్షన్ లో ఉంటారు. సంకల్పాలపై అటెన్షన్ ఉన్న కారణంగా, మాయ ఎలాంటి సూక్ష్మరూపంతో దాడి చేసినా త్వరగా తెలుసుకుంటారు మరియు పరివర్తన చేసుకునేందుకు లేక విజయులుగా అయ్యేందుకు పురుషార్థం చేసి మాయను త్వరగా సమాప్తం చేసే ప్రయత్నం చేస్తారు. సంకల్ప శక్తిని సదా శుద్ధంగా చేసుకోవాలనే అటెన్షన్ బాగుంటుంది. స్వయాన్ని చెక్ చేసుకునే అభ్యాసం బాగుంటుంది. సూక్ష్మ చెకింగ్ కారణంగా చిన్న పొరపాటును కూడా రియలైజ్ అయ్యి, బాబా ముందు మరియు నిమిత్తంగా ఉన్న పిల్లల ముందు ఉంచడంలో స్వచ్ఛమైన హృదయం కలిగి ఉన్నారు కనుక ఈ విధి వలన బుద్ధిలో చెత్త పోగవ్వదు. మెజారిటీ స్వచ్ఛమైన హృదయంతో చెప్పడానికి సంకోచించరు కనుక ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ దైవీ గుణాలు సహజంగానే ధారణ అవుతాయి. దివ్య గుణాల ధారణ అనగా దివ్య గుణాలను ఆహ్వానించే విధియే - ‘స్వచ్ఛత’. భక్తిలో కూడా లక్ష్మీదేవిని లేక ఎవరైనా దేవిని ఆహ్వానించినప్పుడు, ‘స్వచ్ఛతనే’ ఆహ్వానించే విధిగా పాటిస్తారు. కనుక ఈ స్వచ్ఛత యొక్క శ్రేష్ఠ స్వభావం, దైవీ స్వభావాన్ని స్వతహాగానే ఆహ్వానిస్తుంది. ఈ విశేషత మెజారిటీ డబల్ విదేశీ పిల్లలలో ఉంది. అందుకే వారికి, తీవ్రగతితో ముందుకు వెళ్ళే గోల్డెన్ ఛాన్స్ (స్వర్ణిమ అవకాశం) డ్రామానుసారంగా లభించింది. దీనినే ‘లాస్ట్ సో ఫాస్ట్’ అని అంటారు. విశేషంగా ఫాస్ట్ గా వెళ్ళే ఈ విశేషత డ్రామానుసారంగా లభించింది. ఈ విశేషతను సదా స్మృతిలో ఉంచుకొని లాభం తీసుకుంటూ వెళ్ళండి. వస్తుంది, స్పష్టం చేసుకుంటారు, వెళ్ళిపోతుంది. దీనినే పర్వతాన్ని దూది సమానంగా చేసుకోవడమని అంటారు. దూది సెకండులో ఎగురుతుంది కదా. పర్వతానికి ఎంత సమయం పడుతుంది? స్పష్టం చేసుకున్నారు, బాబా ముందు ఉంచారు, స్వచ్ఛత యొక్క విధి ద్వారా ఫరిశ్తాగా అయ్యారు, ఎగిరిపోయారు - దీనినే లాస్ట్ సో ఫాస్ట్ గతితో ఎగరడం అని అంటారు. డ్రామానుసారంగా ఈ విశేషత లభించింది. బాప్ దాదా చూస్తున్నారు - చాలామంది పిల్లలు చెకింగ్ కూడా చేసుకుంటారు మరియు స్వయాన్ని ఛేంజ్ (పరివర్తన) కూడా చేసుకుంటారు ఎందుకంటే ‘మేము విజయులుగా అవ్వాల్సిందే’ అనే లక్ష్యం ఉంది. మెజారిటీకి ఈ నంబరువన్ లక్ష్యముంది.

రెండవ విశేషత - జన్మ తీసుకుంటూనే, వారసత్వాన్ని పొందుతూనే సేవ చేయాలనే ఉల్లాస-ఉత్సాహాలు స్వతహాగానే ఉంటాయి. సేవలో నిమగ్నమవ్వడం వలన సేవకు ప్రత్యక్ష ఫలమైన ‘సంతోషం’ లభిస్తుంది మరియు సేవ ద్వారా విశేషమైన బలం కూడా లభిస్తుంది, అంతేకాక సేవలో బిజీగా ఉన్న కారణంగా నిర్విఘ్నంగా అవ్వడంలో సహయోగం కూడా లభిస్తుంది. కనుక సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు స్వతహాగా ఉండటం, సమయాన్ని కేటాయించడం మరియు తమ తనువు-మనసు-ధనాన్ని సఫలం చేయడం - డ్రామానుసారంగా ఈ విశేషత యొక్క లిఫ్ట్ కూడా లభించింది. మీ విశేషతలేవో తెలుసు కదా. ఈ విశేషతల ద్వారా మీరు స్వయాన్ని ఎంత ముందుకు కావాలంటే అంత ముందుకు తీసుకువెళ్ళగలరు. మేము వెనుక వచ్చాము కనుక ముందుకు వెళ్ళలేము అనే ఫిర్యాదు డ్రామానుసారంగా ఏ ఆత్మకు ఉండజాలదు. డబల్ విదేశీ పిల్లలకు తమ విశేషతల వలన గోల్డెన్ ఛాన్స్ (స్వర్ణిమ అవకాశం) ఉంది. భారతవాసులకు కూడా తమ గోల్డెన్ ఛాన్స్ (స్వర్ణిమ అవకాశం) ఉంది. కానీ ఈ రోజు డబల్ విదేశీ పిల్లలను కలుసుకుంటున్నారు. డ్రామాలో విశేషంగా నిర్ణయించబడి ఉన్న కారణంగా చివర్లో వచ్చే ఏ ఆత్మ చేసే ఫిర్యాదు కూడా చెల్లదు ఎందుకంటే డ్రామా ఏక్యురేట్ గా (ఖచ్చితంగా) తయారుచేయబడి ఉంది. ఈ విశేషతలతో సదా తీవ్రగతితో ఎగురుతూ వెళ్ళండి. అర్థమయిందా? స్పష్టత వచ్చిందా లేక ఇంకా ఏదైనా ఫిర్యాదు ఉందా? దిల్ ఖుష్ మిఠాయినైతే బాబాకు తినిపించారు. ‘దృఢ సంకల్పం’ చేశారు అంటే బాబాకు దిల్ ఖుష్ మిఠాయి తినిపించారని అర్థం. ఇది అవినాశి మిఠాయి. సదా పిల్లల నోరు కూడా మధురంగా ఉండాలి. బాబా నోరు అయితే సదా మధురంగానే ఉంటుంది. కానీ మళ్ళీ వేరే భోగ్ పెట్టకండి, దిల్ ఖుష్ మిఠాయినే భోగ్ గా పెట్టండి. స్థూలమైన భోగ్ అయితే ఏది కావాలంటే అది పెట్టండి కానీ మనసా సంకల్పాల భోగ్ లో సదా దిల్ ఖుష్ మిఠాయినే పెడుతూ ఉండండి.

బాప్ దాదా సదా అంటారు - ఉత్తరాలు వ్రాసేటప్పుడు కూడా కేవలం రెండు అక్షరాల ఉత్తరాన్ని సదా బాబాకు వ్రాయండి. ఆ రెండు అక్షరాలు ఏవి? ‘ఓ.కె. (O.K.)’. దీనికి కాగితాలు ఎక్కువ పట్టవు, ఇంకు కూడా ఎక్కువ పట్టదు మరియు సమయం కూడా ఎక్కువ పట్టదు. అన్నీ పొదుపు అవుతాయి. ఓ.కె. అనగా బాబా కూడా గుర్తున్నారు మరియు రాజ్యం కూడా గుర్తుందని అర్థం. ‘ఓ (O)’ అని వ్రాసినప్పుడు బాబా చిత్రం తయారవుతుంది కదా. ‘కె (K)’ అనగా కింగ్డమ్ (రాజ్యం). కనుక ‘ఓ.కె.’ అని వ్రాసినప్పుడు బాబా మరియు వారసత్వం రెండు గుర్తుకొస్తాయి. కనుక ఉత్తరాలు తప్పకుండా వ్రాయండి కానీ రెండు పదాలలో వ్రాయండి, అప్పుడు మీ ఉత్తరం చేరుకుంటుంది. ఇకపోతే, మీ మనసులోని ఉల్లాసం గురించి అయితే బాప్ దాదాకు తెలుసు. మీ హృదయంలోని ప్రేమపూర్వకమైన విషయాలు హృదయాభిరాముని వద్దకు తప్పకుండా చేరుకుంటాయి. ఇలాంటి ఉత్తరం వ్రాయడమైతే అందరికి వచ్చు కదా? భాష తెలియనివారు కూడా వ్రాయగలరు. ఇందులో భాష కూడా అందరిదీ ఒక్కటే అయిపోతుంది. ఈ ఉత్తరం ఇష్టమే కదా. అచ్ఛా!

ఈ రోజు మొదటి గ్రూపు వారికి చివరి రోజు. సమస్యలన్నీ సమాప్తమైపోయాయి. ఇక టోలీ తినడం మరియు తినిపించడం మిగిలింది. ఇంకేమి మిగిలింది? ఇప్పుడు ఇతరులను కూడా ఇలా తయారుచేయాలి. సేవ అయితే చేయాలి కదా. నిర్విఘ్న సేవాధారులుగా అవ్వండి. అచ్ఛా.

సదా బాబా సమానంగా అవ్వాలనే ఉల్లాస-ఉత్సాహాలతో ఎగిరేవారు, సదా స్వయాన్ని చెక్ చేసుకొని, ఛేంజ్ చేసుకొని సంపూర్ణంగా అయ్యేవారు, సదా సంకల్పము, మాట మరియు కర్మ - మూడింటిలోనూ శ్రేష్ఠంగా అయ్యేవారు, సదా స్వచ్ఛత ద్వారా శ్రేష్ఠతను ధారణ చేసేవారు, ఇలా తీవ్ర వేగంతో ఎగిరే విశేషమైన ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఆస్ట్రేలియా గ్రూపులోని చిన్న పిల్లలతో బాప్ దాదా కలయిక - అందరూ ఈశ్వరీయ విద్యార్థులు కదా. రోజూ చదువుకుంటున్నారా? ఎలాగైతే ఆ చదువును రోజూ చదువుకుంటారో, అలా ఈ చదువును కూడా చదువుతున్నారా? మురళి వినడం బాగా అనిపిస్తుందా? మురళి అంటే ఏమిటో అర్థమవుతుందా? బాబాను రోజూ స్మృతి చేస్తారా? ఉదయం లేస్తూనే గుడ్ మార్నింగ్ చెప్తారా? ఎప్పుడూ గుడ్ మార్నింగ్ చెప్పడం మిస్ చేయకండి. గుడ్ మార్నింగ్ కూడా చెప్పండి, గుడ్ నైట్ కూడా చెప్పండి మరియు భోజనం చేసేటప్పుడు కూడా గుర్తు చేసుకోండి. ఆకలి వేస్తోందని బాబాను మర్చిపోవడం కాదు. తినే ముందు బాబాను తప్పకుండా స్మృతి చేయండి. స్మృతి చేస్తే చదువులో చాలా మంచి నంబరు తీసుకుంటారు ఎందుకంటే ఎవరైతే బాబాను స్మృతి చేస్తారో, వారు సదా పాస్ అవుతారు, ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేరు. మరి మీరు సదా పాస్ అవుతారా? ఒకవేళ పాస్ అవ్వలేదంటే అందరూ ‘శివబాబా పిల్లలు కూడా ఫెయిల్ అవుతారు’ అని అంటారు. రోజూ మురళిలోని ఒక పాయింటును మీ అమ్మగారి నుండి తప్పకుండా వినండి. అచ్ఛా! మీరు చాలా భాగ్యశాలి ఎందుకంటే భాగ్య విధాత వచ్చే భూమి పైకి చేరుకున్నారు. బాబాను కలుసుకునే భాగ్యం లభించింది. ఇది తక్కువ భాగ్యము కాదు.

అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత కలయిక -

1. మీరు బాబా ద్వారా లభించిన సర్వ ఖజానాలను సర్వాత్మల పట్ల ఉపయోగిస్తూ, స్వయం నిండుగా అయి ఇతరులను కూడా నిండుగా చేసే ఆత్మ కదా? ఎన్ని ఖజానాలు నిండుగా ఉన్నాయి? నిండుగా ఉన్నవారు సదా పంచుతారు. అవినాశి భాండాగారం తెరవబడి ఉంది. ఎవరు వచ్చినా సరే, నిండుగా అయి వెళ్ళాలి, ఎవరూ ఖాళీగా వెళ్ళకూడదు. దీనినే అఖండమైన భాండాగారం అని అంటారు. ఒక్కోసారి మహాదానిగా అయి దానం చేస్తారు, ఒక్కోసారి జ్ఞానిగా అయి జ్ఞానామృతాన్ని తాగిస్తారు, ఒక్కోసారి దాతగా అయి, ధన-దేవిగా అయి ధనం ఇస్తారు - ఇలా అందరి శుభ ఆశలను బాబా ద్వారా పూర్తి చేయించేవారు. ఖజానాలను ఎంతగా పంచుతారో, అంతగా పెరుగుతూ ఉంటాయి. దీనినే సదా సంపన్నంగా ఉండడమని అంటారు. ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. అందరి నోటి నుండి ‘వాహ్, మా భాగ్యము!’ అనే ఆశీర్వాదాలు వెలువడాలి. ఇలాంటి మహాదాని, వరదానిగా అయి సత్యమైన సేవాధారిగా అవ్వండి.

2. డ్రామానుసారంగా సేవ యొక్క వరదానం కూడా సదా ముందుకు తీసుకువెళ్తుంది. ఒకటేమో - యోగ్యత ద్వారా సేవ ప్రాప్తించడం, రెండవది - వరదానం ద్వారా సేవ ప్రాప్తించడం. స్నేహం కూడా సేవకు సాధనంగా అవుతుంది. భాష తెలియకపోయినా సరే, స్నేహ భాష అన్నింటికంటే శ్రేష్ఠమైన భాష. కనుక స్నేహీ ఆత్మకు సదా సఫలత లభిస్తుంది. స్నేహ భాష తెలిసినవారు ఎక్కడైనా సఫలతను పొందుతారు. సేవ సదా నిర్విఘ్నంగా నడవడాన్నే సేవలో సఫలత అని అంటారు. స్నేహమనే విశేషతతో ఆత్మలు తృప్తి చెందుతారు. స్నేహ భాండాగారం నిండుగా ఉంది, దీనిని పంచుతూ వెళ్ళండి. బాబా నుండి ఏదైతే నింపుకున్నారో, అది పంచండి. బాబా నుండి తీసుకున్న ఈ స్నేహమే ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది.

3. స్నేహం యొక్క వరదానం కూడా సేవకు నిమిత్తంగా చేస్తుంది. బాబా పట్ల స్నేహముంది కావున ఇతరులను కూడా బాబాకు స్నేహీలుగా చేసి సమీపంగా తీసుకువస్తారు. ఎలాగైతే బాబా స్నేహము మిమ్మల్ని బాబాకు చెందినవారిగా చేసినప్పుడు అంతా మర్చిపోయారో, అలా అనుభవజ్ఞులుగా అయి ఇతరులను కూడా అనుభవజ్ఞులుగా చేస్తూ ఉండండి. సదా బాబా స్నేహంలో బలిహారమయ్యే ఆత్మను అనే నషాలో ఉండండి. బాబా మరియు సేవ - ఈ తపనయే ముందుకు వెళ్ళేందుకు సాధనము. ఎన్ని విషయాలు వచ్చినా సరే, బాబా స్నేహము సహయోగాన్నిచ్చి ముందుకు తీసుకువెళ్తుంది ఎందుకంటే స్నేహీలకు స్నేహానికి పదమాల రెట్ల రిటర్న్ లభిస్తుంది. స్నేహమనేది ఎలాంటి శక్తి అంటే, దీని వలన ఏ విషయము కష్టమనిపించదు ఎందుకంటే స్నేహంలో మైమరిచిపోతారు. దీనినే దీపపు పురుగు దీపంపై బలిహారం అవ్వడమని అంటారు. దీపం చుట్టూ తిరిగేవారు కాదు, బలిహారం అయ్యేవారు, ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించేవారు. కావున స్నేహము మరియు శక్తి - ఈ రెండింటి బ్యాలెన్స్ ద్వారా సదా స్వయం ముందుకు వెళ్తూ, ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. బ్యాలెన్సే బాబా నుండి ఆశీర్వాదాలను ఇప్పిస్తుంది మరియు ఇప్పిస్తూ ఉంటుంది. పెద్దవారి ఛత్రఛాయ కూడా సదా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. బాబా ఛత్రఛాయ అయితే ఉండనే ఉంది కానీ పెద్దవారి ఛత్రఛాయ కూడా గోల్డెన్ ఆఫర్ (బంగారు అవకాశం) వంటిది. కనుక సదా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే భవిష్యత్తు స్పష్టమవుతూ ఉంటుంది.

4. ప్రతి అడుగులోనూ బాబా తోడును అనుభవం చేసేవారు కదా. ఏ పిల్లలనైతే బాబా విశేషంగా సేవార్థం నిమిత్తం చేశారో, వారిని నిమిత్తంగా చేయడంతో పాటు సేవలో ప్రతి అడుగులో వారికి సహయోగిగా కూడా అవుతారు. భాగ్యవిధాత ప్రతి బిడ్డకు భాగ్యమనే విశేషతను ఇచ్చారు. ఆ విశేషతను కార్యంలో ఉపయోగిస్తూ సదా ముందుకు వెళ్తూ, ఇతరులను కూడా తీసుకువెళ్తూ ఉండండి. సేవ అయితే శ్రేష్ఠమైన బ్రాహ్మణాత్మల వెనుక-వెనుకనే వస్తుంది. సేవ వెనుక మీరు వెళ్ళరు. ఎక్కడికి వెళ్ళినా, అక్కడ సేవ మీ వెనుక వస్తుంది. ఎలాగైతే లైట్ ఉన్న చోట నీడ తప్పకుండా వస్తుందో, అలా మీరు డబల్ లైట్ గా ఉంటే మీ వెనుక సేవ కూడా నీడ వలె వస్తుంది కనుక సదా నిశ్చింతులుగా అయి బాబా ఛత్రఛాయలో నడుస్తూ ఉండండి.

5. సదా మనసులో బాబా సమానంగా అవ్వాలనే ఉల్లాసము ఉంటుంది కదా? సమానంగా అయినప్పుడే సమీపంగా ఉంటారు. సమీపంగా అయితే ఉండాలి కదా. సమీపంగా ఉండేవారికి సమానంగా అవ్వాలనే ఉత్సాహం ఉండనే ఉంటుంది మరియు సమానంగా అవ్వడం కూడా కష్టమేమీ కాదు. కేవలం ఏ కర్మ చేస్తున్నా, కర్మ చేసే ముందు ఈ కర్మను బాబా ఎలా చేస్తారు అని గుర్తు తెచ్చుకోండి. ఈ స్మృతి స్వతహాగానే బాబా కర్మను ఫాలో చేయిస్తుంది. ఇందులో కూర్చుని ఆలోచించే విషయమేమీ లేదు, మెట్లు ఎక్కుతూ-దిగుతూ కూడా ఆలోచించవచ్చు. ఇది చాలా సహజమైన విధి. కేవలం బాబాతో మ్యాచ్ చేసుకుంటూ (సరిపోల్చుకుంటూ) ఉండండి మరియు బాబా సమానంగా తప్పకుండా అవ్వాల్సిందే అని గుర్తుంచుకోండి. అప్పుడు ప్రతి కర్మలో సహజంగానే సఫలతను అనుభవం చేస్తూ ఉంటారు. అచ్ఛా!

Comments