27-11-1989 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“శుభభావన మరియు శుభకామనల సూక్ష్మ సేవ”
ఈ రోజు విశ్వకళ్యాణకారి అయిన బాప్ దాదా తమ విశ్వకళ్యాణకారి సహచరులను చూస్తున్నారు. పిల్లలందరూ తండ్రి యొక్క విశ్వకళ్యాణ కార్యంలో నిమిత్తులైన సహచరులు. అందరి మనసులలో విశ్వంలోని వ్యాకుల ఆత్మల కళ్యాణం జరగాలి అనే ఈ ఒక్క సంకల్పమే సదా ఉంటుంది. నడుస్తున్నా, తిరుగుతున్నా, ఏ కార్యం చేస్తున్నా మనసులో ఈ శుభభావనే ఉంది. భక్తి మార్గంలో కూడా భావన ఉంటుంది. కానీ భక్త ఆత్మలకు విశేషంగా అల్పకాలికమైన కళ్యాణం కొరకు భావన ఉంటుంది. జ్ఞానీ ఆత్మలైన మీ యొక్క జ్ఞానయుక్త కళ్యాణ భావన ఆత్మల కొరకు సదాకాలికమైన మరియు సర్వకళ్యాణకారి భావన. మీ భావన వర్తమానం మరియు భవిష్యత్తు కోసం ఉన్నటువంటిది, అదేమిటంటే ప్రతి ఆత్మ అనేక జన్మల కోసం సుఖమయంగా అవ్వాలని, ప్రాప్తులతో సంపన్నం అవ్వాలి అని, ఎందుకంటే అవినాశీ తండ్రి ద్వారా ఆత్మలైన మీకు కూడా అవినాశీ వారసత్వం లభించింది. మీ శుభభావనల ఫలము విశ్వంలోని ఆత్మలను పరివర్తన చేస్తుంది మరియు మున్ముందు ప్రకృతి సహితంగా పరివర్తన అవుతుంది. ఆత్మలైన మీ యొక్క శ్రేష్ఠ భావన ఇంతటి శ్రేష్ఠమైన ఫలాన్ని ప్రాప్తి చేయిస్తుంది! అందుకే మీరు విశ్వకళ్యాణకారి ఆత్మలుగా మహిమ చేయబడతారు. మీ శుభభావనకు కూడా ఇంతటి మహత్వముందని తెలుసా? మీ ఈ శుభభావనను సాధారణ రీతిలో కార్యంలో ఉపయోగిస్తూ నడుస్తున్నారా లేక దాని మహత్వాన్ని తెలుసుకొని నడుస్తున్నారా? ప్రపంచంలోని వారు కూడా శుభభావన అనే పదాన్ని ఉపయోగిస్తారు కానీ మీ యొక్క శుభభావన కేవలం శుభమైనదే కాదు, శక్తిశాలి అయినది కూడా. ఎందుకంటే మీరు సంగమయుగ శ్రేష్ఠ ఆత్మలు. సంగమయుగానికి డ్రామానుసారముగా ప్రత్యక్ష ఫలం ప్రాప్తించే వరదానముంది. అందుకే మీ భావన యొక్క ప్రత్యక్ష ఫలం ఆత్మలకు లభిస్తుంది. ఏ ఆత్మలైతే మీ సంబంధ-సంపర్కంలోకి వస్తారో, వారు అదే సమయంలో శాంతి మరియు స్నేహం అనే ఫలాన్ని అనుభూతి చేస్తారు.
శుభకామనలు లేకుండా శుభభావన వీలవ్వదు. ప్రతి ఆత్మ పట్ల - ఈ ఆత్మ కూడా వారసత్వానికి అధికారిగా అవ్వాలి అని దయతో కూడిన కామన సదా ఉంటుంది. వీరు కూడా మా ఈశ్వరీయ పరివారానికి చెందినవారే కనుక ఈ వారసత్వం నుండి ఎందుకు వంచితులవ్వాలి అని ప్రతి ఆత్మ పట్ల జాలి కలుగుతుంది. శుభకామన ఉంటుంది కదా! శుభకామన మరియు శుభభావన - ఇవి సేవకు పునాది. ఏ ఆత్మల సేవ చేస్తున్నా సరే, ఒకవేళ మీ లోపల శుభభావన, శుభకామన లేకపోతే ఆ ఆత్మలకు ప్రత్యక్ష ఫలం యొక్క ప్రాప్తి కలగదు. ఒక సేవ ఎలా ఉంటుందంటే - నీతి ప్రమాణంగా, రీతి ప్రమాణంగా ఏది విన్నారో అది వినిపించడము. రెండవది ఎలా ఉంటుందంటే - మీ శుభభావన, శుభకామనల ద్వారా జరిగే సేవ. మీ శుభభావన బాబా పట్ల కూడా భావనను కలిగిస్తుంది మరియు తండ్రి ద్వారా ఫలాన్ని ప్రాప్తి చేయించేందుకు నిమిత్తమవుతుంది. ‘‘శుభభావన’’ - ఎక్కడో దూరంగా కూర్చుని ఉన్న ఆత్మకు కూడా, ఫలాన్ని ప్రాప్తి చేయించేందుకు నిమిత్తం అవ్వగలదు. సైన్సు సాధనాలు దూరంగా కూర్చుని ఉన్న ఆత్మలతో సమీప సంబంధాన్ని ఏర్పరిచేందుకు నిమిత్తం అవుతాయి. మీ మాటలు వారికి చేరుకుంటాయి, మీ సందేశం చేరుకుంటుంది, దృశ్యం చేరుకుంటుంది. మరి సైన్సు శక్తి అల్పకాలానికి సమీపత యొక్క ఫలాన్ని ఇవ్వగలిగినప్పుడు, సైలెన్స్ తో కూడిన మీ శక్తిశాలి శుభభావన దూరంగా ఉన్న ఆత్మలకు ఫలాన్ని ఇవ్వలేదా? ఇందుకు ఆధారము, మీలో కూడా అంతటి శాంతి శక్తి జమ అయి ఉండాలి! సైలెన్స్ శక్తి ఈ అలౌకిక అనుభవాన్ని చేయించగలదు. మున్ముందు ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుభవం చేస్తూ ఉంటారు.
శుభభావన అనగా శక్తిశాలి సంకల్పాలు. అన్ని శక్తుల కంటే సంకల్పాల వేగం తీవ్రమైనది. సైన్సు వారు ఎన్ని తీవ్రగతి కల సాధనాలను తయారుచేసినా, వాటన్నిటికంటే తీవ్రగతి సంకల్పాలది. ఏ ఆత్మ పట్ల అయినా లేక అనంతమైన విశ్వంలోని ఆత్మల పట్ల అయినా, శుభభావనను పెట్టుకున్నారు, అనగా - ఈ ఆత్మ కళ్యాణము జరగాలి అని శక్తిశాలి, శుభమైన, శుద్ధమైన సంకల్పాలు చేస్తున్నారు. మీ సంకల్పము లేక భావన ఉత్పన్నమవ్వగానే ఆ ఆత్మకు అనుభూతి కలుగుతుంది - ఆత్మనైన నాకు ఏదో విశేషమైన సహయోగము ద్వారా శాంతి మరియు శక్తి లభిస్తుంది అని. ఎలాగైతే ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలు ఎలా అనుభవం చేస్తారంటే - చాలా కార్యాలలో నాకు అంత ధైర్యం గాని, యోగ్యత గాని లేదు కానీ బాప్ దాదా ఇచ్చిన ఎక్స్ ట్రా సహాయంతో ఈ కార్యం సహజంగానే సఫలమయింది లేక ఈ విఘ్నము సమాప్తమైపోయింది అని, అలా మాస్టర్ విశ్వకళ్యాణకారి ఆత్మలైన మీ సూక్ష్మ సేవను ప్రత్యక్ష రూపంలో అనుభవం చేస్తారు. సమయం కూడా తక్కువ పడుతుంది మరియు సాధనాలు కూడా తక్కువ అవసరమవుతాయి, ధనం కూడా తక్కువ ఖర్చవుతుంది. దీని కోసం మనసు మరియు బుద్ధి సదా ఫ్రీగా ఉండాలి. చిన్న-చిన్న విషయాలలో మనసు మరియు బుద్ధిని చాలా బిజీగా పెట్టుకుంటారు. అందుకే సేవకు చెందిన సూక్ష్మ గతి యొక్క లైన్ క్లియర్ గా ఉండదు. సాధారణ విషయాలలో కూడా మీ మనసు మరియు బుద్ధి యొక్క లైనును చాలా ఎంగేజ్ చేసి పెట్టుకుంటారు. అందుకే ఈ సూక్ష్మ సేవ తీవ్రగతితో జరగటం లేదు. దీని కోసం - ‘‘ఏకాంతము మరియు ఏకాగ్రత’’ పట్ల విశేషమైన అటెన్షన్ పెట్టాలి.
ఏకాంతప్రియ ఆత్మలు ఎంత బిజీగా ఉన్నా సరే, మధ్య మధ్యలో ఒక ఘడియ, రెండు ఘడియలైనా తీసి ఏకాంతాన్ని అనుభవం చేయగలరు. ఏకాంతప్రియ ఆత్మ ఎంతటి శక్తిశాలిగా అవుతారంటే, వారు తమ సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధిని ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఏకాగ్రం చేయగలుగుతారు. బయట పరిస్థితి అలజడిగా ఉన్నా సరే, ఏకాంతప్రియ ఆత్మ ఒక్కరి లోతులలో సెకండులో ఏకాగ్రమవుతారు. ఎలాగైతే సాగరం పైన అలల శబ్దము ఎంతగానో ఉంటుంది, అలజడి ఎంతగానో ఉంటుంది కానీ సాగరం లోతులలో అలజడి ఉండదు, అలా ఎప్పుడైతే ఒక్కరి లోతులలోకి, జ్ఞానసాగరుని లోతులలోకి వెళ్ళిపోతారో, అప్పుడు అలజడి సమాప్తమై ఏకాగ్రమవుతారు. విన్నారా! సూక్ష్మ సేవ అంటే ఏమిటో? ‘‘శుభభావన’’, ‘‘శుభకామన’’ అనే పదాలను అందరూ ఉపయోగిస్తూ ఉంటారు కానీ వీటి మహత్వాన్ని తెలుసుకొని ప్రత్యక్ష రూపంలోకి రావటం ద్వారా అనేక ఆత్మలకు ప్రత్యక్ష ఫలాన్ని అనుభూతి చేయించేందుకు నిమిత్తులు అవ్వండి. అచ్ఛా!
టీచర్ల యొక్క పనే సేవ. టీచర్ల యొక్క మహత్వమే సేవ. ఒకవేళ సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణం కనిపించకపోతే, వారిని యోగ్యమైన టీచర్ల లిస్టులో లెక్కించరు. టీచర్ల మహానత కూడా సేవే కదా. కనుక సేవ యొక్క సూక్ష్మ రూపాన్ని వినిపించాము. వాచా సేవ అయితే చేస్తూనే ఉంటారు. కానీ వాచా సేవ మరియు మనసు యొక్క శుభభావనల సేవ, రెండూ కలిపి జరగాలి. మాటలు మరియు భావనలు, డబల్ పని చేస్తాయి. ఈ సూక్ష్మ సేవ యొక్క అభ్యాసము బహుకాలానికి చెందినదిగా ఉండాలి అనగా ఇప్పటి నుండే కావాలి. ఎందుకంటే మున్ముందు సేవ యొక్క రూపురేఖలు మారిపోయేదే ఉంది. అప్పుడిక ఆ సమయంలో స్వయాన్ని సూక్ష్మ సేవలో బిజీ చేసుకోలేకపోతారు. బాహ్య పరిస్థితులు బుద్ధిని ఆకర్షిస్తాయి. అప్పుడు రిజల్టు ఏమవుతుంది? స్మృతి మరియు సేవల బ్యాలెన్సును పెట్టుకోలేరు. అందుకే ఇప్పటి నుండే మీ మనసు-బుద్ధికి చెందిన సేవా లైన్ ను చెక్ చేసుకోండి. టీచర్లకు చెక్ చేసుకోవడము వచ్చు కదా. టీచర్లు ఇతరులకు నేర్పిస్తారు, తప్పకుండా స్వయానికి తెలుసు కావుననే ఇతరులకు నేర్పిస్తారు. అందరూ యోగ్యమైన టీచర్లే కదా! యోగ్యమైన టీచర్ల విశేషత ఏమిటంటే, వారు నిరంతరం మనసా లేక వాచా లేక కర్మణా సేవలో సదా బిజీగా ఉంటారు. కనుక వారు ఇతర విషయాల నుండి స్వతహాగానే ఖాళీ అయిపోతారు. అచ్ఛా!
కుమారీలు కూడా వచ్చారు. కుమారీలు అనగా కాబోయే టీచర్లు. అందుకే కదా బ్రహ్మాకుమారీలు అని అంటారు. ఒకవేళ కాబోయే సేవాధారులు కానట్లయితే సాధారణ కుమారీలు. కుమారీలు ఏం చేస్తారు? కొన్ని పైసల కోసం ఉద్యోగం అనే గంపను తలపై పెట్టుకుంటారు. బాప్ దాదాకు కుమారీలను చూస్తే నవ్వు వస్తుంది ఎందుకంటే బరువైన గంపను తలపై పెట్టుకునేందుకు తయారైపోతారు కానీ భగవంతుని ఇంట్లో అనగా సేవా స్థానాలలో ఉండేందుకు ధైర్యము చేయరు. మీరు అటువంటి బలహీనమైన కుమారీలైతే కాదు కదా! మీరు చదువుకుంటూ ఉండవచ్చు కానీ, ఉద్యోగం చేయాలా లేక విశ్వ సేవ చేయాలా అనే లక్ష్యమైతే ముందు నుండే పెట్టుకోవడం జరుగుతుంది. ఉద్యోగం చేయడం అంటే స్వయాన్ని పోషించుకోవడము. పోషించాల్సిన పిల్లాపాపలైతే లేరు. స్వయాన్ని ప్రశాంతంగా పోషించుకుంటూ ఉండేందుకు, అలా సాగిపోతూ ఉండేందుకు ఉద్యోగం చేస్తారు. విశ్వంలోని ఆత్మలకు తండ్రి పాలనను ఇవ్వాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. అనేక మంది ఆత్మలకు నిమిత్తంగా అవ్వగలిగినప్పుడు కేవలం తమ ఆత్మ యొక్క పాలన చేసుకోవటం, దాని ముందు ఇది ఎంత? అనేకుల ఆశీర్వాదాలను తీసుకోవడమంటే, ఇది ఎంత గొప్ప సంపాదన! ఆ సంపాదనలో 5 వేలు లేక 5 లక్షలు సంపాదించినా కానీ ఇక్కడ అనేక మంది ఆత్మల ఆశీర్వాదాలను తీసుకోవడమంటే, ఇది ఎంత పెద్ద సంపాదన! అంతేకాక, ఈ సంపాదన అనేక జన్మలు మీతో పాటు వస్తుంది. ఆ 5 లక్షలు ఎక్కడ ఉంటాయి? ఉంటే ఇంట్లో ఉంటాయి లేదంటే బ్యాంకులో ఉండిపోతాయి. లక్ష్యాన్ని ఎల్లప్పుడూ ఉన్నతంగా పెట్టుకోవడం జరుగుతుంది, సాధారణంగా కాదు. సంగమయుగంలో ఈ ఒక్క ప్రస్తుత జన్మలో మాత్రమే అనంతమైన సేవలో నిమిత్తంగా అయ్యేందుకు గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది. సత్యయుగంలో కూడా ఈ ఆఫర్ లభించదు. ఉద్యోగాల కోసం కూడా ఏవైనా ఆఫర్ లు ఉన్నాయా అని వార్తాపత్రికలను చూస్తూ ఉంటారు కదా. తండ్రి స్వయంగా సేవ కోసం ఆఫర్ చేస్తున్నారు. కనుక యోగ్యమైన రైట్ హ్యాండ్ లుగా అవ్వండి. సాధారణ బ్రహ్మాకుమారీలుగా కూడా అవ్వకూడదు. యోగ్యమైన సేవాధారులుగా అవ్వకపోతే సేవ చేసేందుకు బదులుగా సేవ తీసుకుంటూ ఉంటారు. యోగ్యమైన సేవాధారులుగా అవ్వడమనేది కష్టమైన విషయమేమీ కాదు. యోగ్యమైన సేవాధారులుగా అవ్వకపోతే ఏమవుతుందో, నడవగలమా లేదా అని భయపడతారు. యోగ్యత లేకపోతే భయపడతారు. ఎవరైతే యోగ్యులుగా ఉంటారో, వారు నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. స్థూలమైన యోగ్యత అయినా లేక జ్ఞాన యోగ్యత అయినా, మనుష్యులను విలువైనవారిగా చేస్తుంది. యోగ్యత లేకపోతే విలువ ఉండదు. సేవా యోగ్యత అన్నిటికంటే పెద్దది. ఇటువంటి యోగ్యత గల ఆత్మను ఏ విషయము ఆపలేదు. యోగ్యులుగా అవ్వడం అనగా - ఒక్క బాబాయే నావారు, అంతే, ఇంకే విషయము లేదు. కుమారీలు విన్నారా? అచ్ఛా!
కుమారులు కూడా చాలా మంది వచ్చారు. కుమారులు చాలా పరుగులు పెడుతూ ఉంటారు. సేవలో కూడా చాలా ఉత్సాహంతో పరుగులు పెడుతూ ఉంటారు. కానీ కుమారుల విశేషత మరియు మహానత ఏమిటంటే, ఆది నుండి ఇప్పటివరకు నిర్విఘ్న కుమారులుగా ఉన్నారా? ఒకవేళ కుమారులు నిర్విఘ్న కుమారులైనట్లయితే, అటువంటి కుమారులు చాలా మహానులు అని గాయనం చేయబడతారు. ఎందుకంటే ప్రపంచం వారు కూడా కుమారీలకు బదులుగా కుమారుల కోసం, వీరు యోగ్యులుగా అవ్వడం కష్టము అని భావిస్తారు. కానీ కుమారులే విశ్వాన్ని ఛాలెంజ్ చేయాలి - మీరు అసంభవం అని అంటారు కానీ మేము నిర్విఘ్న కుమారులము అని. విశ్వానికి ఇలాంటి శ్యాంపుల్ ను చూపించే కుమారులే మహాన్ కుమారులు. బాప్ దాదా ఇటువంటి కుమారులకు సదా హృదయపూర్వకంగా శుభాకాంక్షలను తెలుపుతారు. అర్థమయిందా! ఇప్పుడిప్పుడే చాలా మంచిగా ఉండటము, ఇప్పుడిప్పుడే ఏదైనా విఘ్నము వస్తే పైకి-కిందికి అవ్వడము, ఇలా ఉండకూడదు. కుమారులు అనగా సమస్యగా తయారవ్వకూడదు మరియు సమస్య వచ్చినప్పుడు ఓడిపోకూడదు. కుమారులు కుమారీల కంటే కూడా ముందు నంబరులోకి వెళ్ళగలరు. కానీ నిర్విఘ్న కుమారులుగా ఉండాలి. ఎందుకంటే కుమారులకు చాలా వరకు ఏ విఘ్నము వస్తుందంటే - తోడు ఎవ్వరూ లేరు, ఎవరో ఒకరి తోడు కావాలి, కంపానియన్ (సహచరులు) కావాలి అని. కనుక ఏదో ఒక విధంగా తమ కంపెనీని (సాంగత్యాన్ని) తయారుచేసుకుంటారు. కొంతమంది కుమారులైతే కంపానియన్ (సహచరులు) గా కూడా చేసుకుంటారు మరియు కొంతమంది మాట్లాడటము, కూర్చోవటము చేస్తూ కంపెనీలోకి (సాంగత్యంలోకి) వస్తారు, తర్వాత కంపానియన్ (సహచరులు) గా చేసుకునే సంకల్పం కూడా వస్తుంది. కానీ ఒక్క బాబాను తప్ప ఇంకెవ్వరినీ కంపెనీగా (సాంగత్యం) లేక కంపానియన్ (సహచరులు) గా చేసుకోని కుమారులు కూడా ఉన్నారు. సదా తండ్రి కంపెనీలో (సాంగత్యంలో) ఉండే కుమారులు సదా సుఖంగా ఉంటారు. మరి మీరు ఎటువంటి కుమారులు? కొంచెం-కొంచెం కంపెనీ (సాంగత్యం) ఏమైనా కావాలా? మొత్తం పరివారం కంపెనీ (సాంగత్యం) ఉందా? అలా ఉంటే పర్వాలేదు, కానీ ఇద్దరో, ముగ్గురో లేక ఎవరైనా ఒక్కరి కంపెనీ (సాంగత్యం) కావాలని అనుకుంటే, అది తప్పు. మరి మీరంతా ఎవరు? నిర్విఘ్నంగా ఉండేవారు కదా. కొత్త కుమారులు కూడా అద్భుతం చేసి చూపిస్తారు. చివరికి విశ్వాన్ని మీ ముందు, తండ్రి ముందు వంగేలా చేయాలి కదా! కావున ఈ కుమారులు చేసే అద్భుతము విశ్వాన్ని వంచుతుంది. ఇది కుమారుల అద్భుతమని విశ్వమంతా గుణగానము చేస్తుంది. కుమారీలు ఎక్కువగా సేవా కంపెనీలో (సాంగత్యంలో) ఉంటారు. కానీ కుమారులకు కొంచెం కంపెనీ (సాంగత్యం) కావాలనే సంకల్పం వస్తే పాండవ భవనాన్ని తయారుచేసి సఫలురుగా ఉండాలి, ఇలా ఎవరైనా చేసి చూపించండి. కానీ ఈ రోజు పాండవ భవనాన్ని తయారుచేసి రేపు ఒకరు తూర్పుకు, ఒకరు పడమరకు వెళ్ళిపోకూడదు - ఇటువంటి పాండవ భవనాన్ని తయారుచేయకండి.
బాప్ దాదాకు కుమారుల విషయంలో, వారు ఒంటరిగా ఉంటున్నా పురుషార్థంలో నడుస్తున్నారని విశేషంగా గర్వంగా ఉంది. కుమారులు ఇద్దరు ముగ్గురిని సహచరులుగా చేసుకొని ఎందుకు నడవరు! సహచరులు అంటే కేవలం స్త్రీలే ఉండాలని కాదు, ఇద్దరు కుమారులు కూడా ఉండవచ్చు. కానీ పరస్పరంలో నిర్విఘ్న సహచరులుగా ఉండాలి. ఇప్పుడింకా ఆ అద్భుతాన్ని చూపించలేదు. సమయానికి ఒకరికొకరు సహయోగులుగా అయినట్లయితే ఏదైనా ఎందుకు జరగదు? వేరే విషయాలు వచ్చేస్తాయి, అందుకే బాప్ దాదా పాండవ భవనాన్ని తయారుచేయవద్దు అని అంటారు. కానీ ఎవరైనా శ్యాంపుల్ తయారుచేసి చూపించాలి. అలాగని పాండవ భవనాన్ని తయారుచేసి, నిమిత్తంగా ఉన్న దాదీ-దీదీల సమయం తీసుకుంటూ ఉండడం కాదు. నిర్విఘ్నంగా ఉండాలి. ఒకరికంటే ఒకరు యోగ్యమైన కుమారులుగా ఉండాలి. అప్పుడు ఎంత మంచి పేరు వస్తుందో చూడండి. కుమారులు విన్నారా? యోగ్యమైన కుమారులుగా అవ్వండి. నిర్విఘ్న కుమారులుగా అవ్వండి. సేవా క్షేత్రంలో స్వయం సమస్యగా అవ్వకండి, సమస్యను తొలగించేవారిగా అవ్వండి. అప్పుడు చూడండి, కుమారులకు చాలా విలువ ఉంటుంది. ఎందుకంటే కుమారులు లేకుండా కూడా సేవ జరగదు. మరి కుమారులు ఏం చేస్తారు? ‘‘నిర్విఘ్న కుమారులుగా అయి చూపిస్తాము’’ అని అందరూ చెప్పండి. (కుమారులు బాప్ దాదా ముందు లేచి నిలబడి ప్రతిజ్ఞ చేసారు). ఇప్పుడు అందరి ఫోటో తీయటం జరిగింది. మేము లేచినప్పుడు ఎవరూ చూడలేదు కదా అని అనుకోకండి. ఫోటో తీయటం జరిగింది. అచ్ఛా. ‘‘ధైర్యము పిల్లలది, సహాయము తండ్రిది’’. అంతేకాక, మొత్తం పరివారమంతా మీతో పాటు ఉంది. అచ్ఛా!
నలువైపులా ఉన్న పిల్లలందరికీ సదా బాప్ దాదా తమ స్నేహపు సహయోగము యొక్క ఛత్రఛాయ సహితంగా హృదయపూర్వకంగా సేవ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేశ-విదేశాల సేవా సమాచారం లభిస్తూ ఉంటుంది. పిల్లలు ప్రతి ఒక్కరు తమ మనసు యొక్క సత్యమైన సమాచారాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా విదేశాల నుండి ఎక్కువ ఉత్తరాలు వస్తూ ఉంటాయి. కనుక సేవా సమాచారము ఇచ్చే పిల్లలకు శుభాకాంక్షలు కూడా, వాటితో పాటు సదా స్వ సేవ మరియు విశ్వ సేవలో ‘‘సఫలతా భవ’’ అనే వరదానాన్ని ఇస్తున్నారు. స్వ-పురుషార్థం యొక్క సమాచారాన్ని ఇచ్చేవారికి బాప్ దాదా ఇదే వరదానాన్ని ఇస్తున్నారు - ఎలాగైతే సత్యమైన మనసుతో తండ్రిని రాజీ చేస్తూ ఉంటారో, అలా సదా స్వయం కూడా స్వయం యొక్క సంస్కారాలతో, సంగఠనతో రాజయుక్తంగా అనగా రాజీగా ఉండండి. ఇతరుల సంస్కారాల రహస్యాలను కూడా తెలుసుకోవడము మరియు పరిస్థితులను కూడా తెలుసుకోవడము - ఇదే రాజయుక్త స్థితి. ఇకపోతే, సత్యమైన మనసుతో తమ లెక్కాపత్రాన్ని ఇవ్వడము మరియు స్నేహంతో కూడిన ఆత్మిక సంభాషణ యొక్క ఉత్తరాలు రాయడం అనగా వెనుకటిది సమాప్తం చేయడము మరియు స్నేహంతో చేసే ఆత్మిక సంభాషణ సదా సమీపతను అనుభవం చేయిస్తూ ఉంటుంది. ఇది మీ ఉత్తరాలకు జవాబు.
ఉత్తరాలు రాయడంలో విదేశీయులు చాలా తెలివైనవారు. త్వరత్వరగా రాస్తారు. భారతవాసులు కూడా పెద్ద-పెద్ద ఉత్తరాలు రాయడం మొదలుపెట్టకండి. బాప్ దాదా కేవలం రెండు అక్షరాల ఉత్తరం రాయమని చెప్పారు - ‘‘ఓ.కె.’’ (అంతా బాగుంది). సేవా సమాచారం ఉంటే రాయండి, లేకపోతే ‘‘ఓ.కె.’’ ఇందులోనే అంతా వచ్చేస్తుంది. ఇలాంటి ఉత్తరాన్ని రాయటం కూడా సహజము మరియు చదవటం కూడా సహజము. కానీ ఒకవేళ ‘‘ఓ.కె.’’ గా లేకపోతే ‘‘ఓ.కె.’’ అని రాయకండి. ‘‘ఓ.కె.’’ గా అయిన తర్వాత రాయండి. ఉత్తరాలు చదవడానికి కూడా సమయం పడుతుంది కదా! ఏ కార్యము చేసినా, సదా షార్ట్ గా ఉండాలి మరియు స్వీట్ గా ఉండాలి. ఎవరైనా చదివితే, వారికి సంతోషం కలగాలి. అందుకే రామకథలు రాసి పంపకండి, అర్థమయిందా! సమాచారం ఇవ్వాలి కూడా కానీ సమాచారం ఇవ్వటాన్ని నేర్చుకోవాలి కూడా. అచ్ఛా!
శుభభావన మరియు శుభకామనల సూక్ష్మ సేవ యొక్క మహత్వాన్ని తెలుసుకునే మహాన్ ఆత్మలందరికీ బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment